అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు - తొమ్మిదవ రోజు

 


అక్టోబర్ 14-దేవుని సమాధానాలను గుర్తించడం, కృతజ్ఞత కలిగి ఉండటం

నవదినాలు ముగింపు రోజు

తొమ్మిది రోజుల ప్రయాణం ఈ రోజుతో ముగుస్తోంది. అక్టోబర్ 6న మనం ప్రారంభించినప్పుడు మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని ధ్యానించాం. ఈ తొమ్మిది రోజులూ తెరేసమ్మతో కలిసి నమ్మకం, యోసేపు విధేయత, యేసు ప్రభువుతో స్నేహం, దేవుని స్వరం వినడం, బాధలో ప్రార్థన స్థిరత్వం, అనుదిన జీవితంలో దేవుని సన్నిధి గురించి ఆలోచించాం. ఈ రోజు ఆ ప్రయాణానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పే రోజు. అలాగే దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే సమాధానాలను గుర్తించడం నేర్చుకునే రోజు.

వాక్యభాగాలు: కీర్తన 138:3, యోహాను 17:9

కీర్తన 138:3లో కీర్తనకారుడు దేవునికి, "నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి." అని చెబుతున్నాడు.  ఇది  కీర్తనకారుని అనుభవం, ఆ  అనుభవం మనకు  కూడా కావాలి. మనం దేవున్ని  పిలిచినప్పుడు ఆయన జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆ జవాబు మనకు కావలసిన రూపంలో రాదు, కానీ మనకు కొత్త బలం వస్తుంది. అదే నిజమైన జవాబు. పరిస్థితులు మారకపోయినా మన హృదయం మారితే, అది దేవుని సమాధానమే.

యోహాను 17వ అధ్యాయంలో యేసు ప్రభువు తన శిష్యుల కోసం తండ్రి అయిన దేవునికి  ప్రార్థిస్తున్నాడు. “నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకముకొరకుకాక నీవు నాకు అనుగ్రహించినవారి కొరకు ప్రార్ధించుచున్నాను. ఏలయన వారు నీ వారు.”  ఈ మాటలతో ప్రభువే ప్రార్ధిస్తున్నాడు.  (యోహాను 17:9.) "నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను" అంటే మన కోసం యేసు ప్రభువు  స్వయంగా  ప్రార్థిస్తున్నాడు. మన ప్రార్థన ఒంటరి ప్రార్థన కాదు, యేసు ప్రభువు  ప్రార్థనతో కలిసిన ప్రార్థన. ఈ సత్యం మనకు ఎంతో ధైర్యాన్నిస్తుంది.

ఈ తొమ్మిది రోజులలో మనం నేర్చుకున్నవి

మొదటి రోజు: మన ఆత్మ ఒక కోట, దాని మధ్యలో దేవుడు నివసిస్తున్నాడు.

రెండవ రోజు: భయం మధ్య కూడా "దేవుడొక్కడే చాలు".

మూడవ రోజు: పునీత యోసేపు వలె అర్థం కాని ప్రణాళికలో విధేయత కలిగి ఉండాలి.

నాల్గవ రోజు: ప్రార్థన అంటే మనలను ప్రేమించే స్నేహితునితో సంభాషణ.

ఐదవ రోజు: మాట్లాడటమే కాదు, నిశ్శబ్దంలో వినడం కూడా ఉండాలి.

ఆరవ రోజు: బాధను ఆర్పణగా మార్చి, గురువుల కోసం ప్రార్థించడం.

ఏడవ రోజు: పడిపోయినా మళ్ళీ లేచి స్థిరంగా ప్రార్థించడం.

ఎనిమిదవ రోజు: రోజువారీ పనులలో దేవుని సన్నిధిని చూడటం.

ఇవి ఒక్క రోజులో ఆచరించడం సాధ్యం కాదు. కానీ ఇవి ఒక ప్రయాణపు ఎనిమిది అడుగులు. మనం ఈ అడుగులను నెమ్మదిగా, జీవితాంతం వేస్తూ ఉండాలి.

దేవుని సమాధానం ఎలా వస్తుంది

మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడం లేదని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడూ సమాధానం ఇస్తూనే ఉంటాడు.

కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే మనం కోరినట్లే చేస్తాడు. అలాంటప్పుడు మనం కృతజ్ఞతలు చెప్పడం మరచిపోకూడదు. పది మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఒక్కడే తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. మనం ఆ ఒక్కరిలా ఉండాలి.

కొన్ని ప్రార్థనలకు దేవుడు మనం ఊహించిన రూపంలో కాకుండా వేరే రూపంలో సమాధానమిస్తాడు. మనం కోరుకున్నది కాకుండా మనకు నిజంగా అవసరమైనది ఇస్తాడు. అపొస్తలుడైన పౌలు తన బలహీనత తొలగిపోవాలని ప్రార్థించినప్పుడు, దేవుడు "నా కృప నీకు చాలు" అని జవాబిచ్చాడు. ఆ సమాధానం ఆయన ఊహించినది కాదు, కానీ అది ఆయనకు  బలమైంది.

కొన్ని ప్రార్థనలకు జవాబు రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఈ ఆలస్యంలో దేవుడు మనలను సిద్ధం చేస్తున్నాడు. అబ్రహాముకు కొడుకు పుట్టడానికి ఎన్నో ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. యోసేపు సోదరులచే అమ్మివేయబడిన తరువాత ఎన్నో ఏళ్ళకు ఈజిప్టులో అధికారిగా మారి కుటుంబాన్ని రక్షించాడు. దేవుని ఆలస్యం ఆయన నిర్లక్ష్యం కాదు, ఆయన జ్ఞానం మరియు ఆయన ప్రణాళికలో భాగం అది.

తెరేసమ్మ  జీవితంలో ఆలస్యంగా వచ్చిన సమాధానం

తెరేసమ్మ  సంస్కరణ కార్యక్రమం ఒక్క రాత్రిలో జరగలేదు. 1562లో ఆమె అవిలాలో మొదటి సంస్కరణ మఠాన్ని స్థాపించింది. ఆ తరువాత ఇరవై సంవత్సరాలు ఆమె స్పెయిన్ దేశమంతా తిరిగి కొత్త మఠాలను స్థాపించింది. ఆమె తన జీవితకాలంలో, స్త్రీల కోసం పదిహేడు మఠాలను స్థాపించింది. ఈ కాలంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అనుమతులు ఆలస్యమయ్యాయి, డబ్బు లేదు, వ్యతిరేకత తీవ్రంగా ఉండేది. అయినా ఆమె ఓర్పుతో ప్రార్థిస్తూ పని చేసింది. ఆమె ప్రార్థనలకు సమాధానం ఒక్కసారిగా రాలేదు. అడుగడుగునా, సంవత్సరాల తరబడి వచ్చింది. ఆ ఫలితం నేటికీ కార్మెల్  సభ రూపంలో కొనసాగుతోంది.

పునీత సూక్తి: ప్రయాణంలోని ప్రతి భాగం

"ప్రయాణంలోని ప్రతి భాగం ముఖ్యమే." – తెరేసాకు ఆపాదించబడిన మాట

ఈ మాట తెరేసమ్మ  మాటగా ప్రచారంలో ఉంది. మన జీవిత ప్రయాణంలో ఏ భాగమూ వ్యర్థం కాదు. సంతోషమైనా, బాధైనా, ఆలస్యమైనా, పడిపోవడమైనా, లేవడమైనా అన్నీ మనలను దేవుని వైపు నడిపించే భాగాలే. ఇప్పుడు అర్థం కాని అనేక విషయాలు భవిష్యత్తులో అర్థమవుతాయి. కొన్ని మనం పరలోకంలో మాత్రమే అర్థం చేసుకుంటాం.

కృతజ్ఞతా హృదయం

కృతజ్ఞత అనేది కేవలం మర్యాద కాదు, ఆధ్యాత్మిక దృష్టి. కృతజ్ఞతా హృదయం ఉన్నవారు తమ జీవితంలో దేవుని హస్తాన్ని ప్రతిచోటా చూస్తారు. ఫిర్యాదు చేసే హృదయం ఉన్నవారు ఆశీర్వాదాలను కూడా గమనించరు. తెరేసమ్మ  తన రచనల్లో దేవుని ఉపకారాలను ఎంతో కృతజ్ఞతతో గుర్తు చేసుకుంది. ఆమె తన పాపాల గురించి, బలహీనతల గురించి రాసినప్పుడు కూడా, దేవుని కరుణను స్తుతించడం మరచిపోలేదు.

కృతజ్ఞతను పెంచుకోవడానికి ఒక సులభమైన అలవాటు ఉంది. ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తుచేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. అవి చిన్న విషయాలు కావచ్చు. ఒక మంచి భోజనం, ఒక స్నేహితుని పలకరింపు, ఒక ప్రమాదం నుండి రక్షణ. వీటి  ద్వార  కొన్ని వారాల్లోనే మీ చూపు మారుతుంది. మీరు మరిన్ని మేలులను  గమనించడం మొదలుపెడతారు.

తెరేసమ్మ  మరణం, పండుగ రోజు

తెరేసమ్మ  1582లో అల్బా ది  తోర్మెస్ అనే ఊరిలో అక్టోబర్ 4వ తేదీ రాత్రి మరణించింది. ఆ సంవత్సరమే కొత్త క్యాలెండర్ అమలులోకి వచ్చింది, దాని ప్రకారం అక్టోబర్ 4 తరువాత రోజు అక్టోబర్ 15గా లెక్కించబడింది. అందుకే తిరుసభ  ఆమె పండుగను అక్టోబర్ 15న జరుపుకుంటుంది. 1622లో ఆమె పునీతురాలిగా ప్రకటించబడింది. 1970లో తిరుసభ  పండితురాలిగా ప్రకటింపబడింది. కొన్ని శతాబ్దాల తరువాత కూడా ఆమె బోధ లక్షలాది మందికి ప్రార్థన మార్గాన్ని చూపిస్తోంది.

ఆమె  పండుగకు సిద్ధపడటం

అక్టోబర్ 15న  ఆమె పండుగ రోజున కృతజ్ఞతతో దివ్యబలిపూజలో పాల్గొనండి. వీలైతే పాపసంకీర్తనం చేసుకుని హృదయాన్ని సిద్ధం చేసుకోండి. దివ్యబలిపూజలో ఈ నవదినాలలో మీరు అడిగిన ఉద్దేశ్యాలను ప్రత్యేకంగా ప్రభువుకు అర్పించండి. కుటుంబమంతా కలిసి వెళ్ళగలిగితే, అది ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభవంగా ఉంటుంది.

నవదినాల  తరువాత కూడా కొనసాగించడం

ఈ తొమ్మిది రోజుల్లో మీరు మొదలుపెట్టిన మంచి అలవాట్లను పండుగ తరువాత విడిచిపెట్టకండి. అన్నీ కొనసాగించలేకపోతే, ఒకటి లేదా రెండు ఎంచుకోండి. ప్రతిరోజూ ఐదు నిమిషాల నిశ్శబ్ద ప్రార్థన, పనిలో "ప్రభువా, ఇది నీ కోసం" అని చెప్పడం, రాత్రి కృతజ్ఞతా ప్రార్థన, ఒక గురువు కోసం వారానికి ఒకసారి ప్రార్థన. ఇవి చిన్నవే, కానీ నెలలు గడిచేకొద్దీ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలంగా తీర్చిదిద్దుతాయి. తెరేసమ్మ  చెప్పినట్లు దృఢ  నిర్ణయం ఉంటే చాలు, దేవుడే మిగిలినది చూసుకుంటాడు.

ఈ రోజు కృతజ్ఞతా ప్రార్థన ఎలా చేయాలి?

ఈ రోజు ప్రత్యేకంగా కొద్దిసేపు కృతజ్ఞతా ప్రార్థన చేయండి. ముందుగా ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి రోజును  గుర్తుచేసుకోండి. ఏ రోజు మాట మీ హృదయాన్ని ఎక్కువగా తాకిందో ఆలోచించండి. ఆ మాట ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. తరువాత మీ జీవితంలో గత సంవత్సరం జరిగిన మూడు మంచి విషయాలను గుర్తుచేసుకోండి. వాటికి కృతజ్ఞతలు చెప్పండి. చివరగా, మీరు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఒక ప్రార్థనను ఆయన చేతిలో పెట్టి, దేవుని చిత్తం జరగాలని చెప్పండి.

కొన్ని రోజులు తప్పిపోయిన వారికి

ఈ నవదినాలలో కొన్ని రోజులు ప్రార్థించలేకపోయినా నిరుత్సాహపడకండి. ఏడవ రోజు మనం ధ్యానించినట్లు, పడిపోయినా తిరిగి లేవడమే ముఖ్యం.

ఈ నవదినాలు ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. తెరేసమ్మ  తన సోదరీమణులకు ఎప్పుడూ  ప్రార్థన జీవితంలో మళ్ళీ మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేది. ఈ తొమ్మిది రోజులు మీ హృదయంలో నాటిన విత్తనాలను నీళ్ళు పోసి పెంచండి. రాబోయే నెలల్లో ఆ విత్తనాలు మొలకెత్తి, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించే ఫలాలను ఇస్తాయి.

అవిలాపురి  తెరేసమ్మ  నవదిన ప్రార్ధన : తొమ్మిదవ రోజు (అక్టోబర్ 14)

దేవుని సమాధానాలను గుర్తించడం, కృతజ్ఞత

 

గురువు: పిత, పుత్ర, పవిత్రాత్మ  నామమున.

ప్రజలు: ఆమెన్.

గురువు:ప్రభువు, మీతో ఉండును గాక

ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక .

గురువు: ప్రియ సహోదరులారా, ఇది నవదిన ప్రార్ధనలలో  ముగింపు రోజు. ఈ తొమ్మిది రోజుల ప్రార్థనకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఆయన సమాధానాలను గుర్తించే కళ్ళు ఇవ్వమని అడుగుదాం. ఆమె పండుగను గొప్పగా చేసుకొనుటకు ప్రయత్నిద్దాం.

ప్రార్థన

గురువు: ప్రార్ధించుదము. ప్రేమమాయుడైన తండ్రీ, ఈ తొమ్మిది రోజులు నీ సన్నిధిలో గడిపే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అవిలాపురి  తెరేసమ్మ  మాదిరిగా మా ప్రార్థనలకు నీవు ఇచ్చే సమాధానాన్ని, అది ఏ రూపంలో ఉన్నా, శాంతితో స్వీకరించే హృదయాన్ని మాకు ప్రసాదించమని  మా  ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము.

ప్రజలు: ఆమెన్.

వాక్య పఠనం

పఠకుడు (కీర్తన 138:3): “నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి”

పఠకుడు: ఇది ప్రభువు వాక్కు

ప్రజలు: సర్వేశ్వరునికి వందనములు

పఠనకుడు (యోహాను 17:9): నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకముకొరకుకాక నీవు నాకు అనుగ్రహించినవారి కొరకు ప్రార్ధించుచున్నాను. ఏలయన వారు నీ వారు.

పఠకుడు: ఇది క్రీస్తు సువిశేషం

ప్రజలు: క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక

(కొద్దిసేపు మౌనం)

కృతజ్ఞత గురించి విన్నపాలు

గురువు: ఈ తొమ్మిది రోజుల ప్రార్థనలో నీవు ఇచ్చిన అనుగ్రహాలకు  .

ప్రజలు: ప్రభువా, నీకు కృతజ్ఞతలు.

గురువు: మా కుటుంబాలకు, మా జీవితాలకు నీవు చేసిన మేలులకు గాను.

ప్రజలు: ప్రభువా, నీకు కృతజ్ఞతలు.

గురువు: మా ప్రార్థనకు నీ సమాధానాన్ని గుర్తించే కళ్ళ కోసం.

ప్రజలు: ప్రభువా, మా హృదయాలను తెరువుము.

పునీత సూక్తి

గురువు: అవిలా పునీత తెరేసా ఇలా అంది:

"ప్రయాణంలోని ప్రతి భాగం ముఖ్యమే."

గురువు: మేము చేసిన ప్రార్థనలకు వెంటనే ఇచ్చిన  సమాధానాలకు

ప్రజలు: ప్రభువా, నీ కృపకు కృతజ్ఞతలు.

గురువు: కొన్ని ప్రార్ధనలకు వేరు రూపంలో సమాధానం  ఇచ్చిన సందర్భాలలో .

ప్రజలు: ప్రభువా, నీ విధానాన్ని నమ్మే హృదయం ఇవ్వుము.

గురువు: కొన్ని ప్రార్ధనలకు  కొంత ఆలస్యంగా సమాధానమిచ్చిన సందర్భాలలో.

ప్రజలు: ప్రభువా, నీ సమయం కోసం ఓపికతో ఎదురుచూసే కృప ఇవ్వుము

గురువు: అవిలాపురి తెరేసమ్మ  పండుగ జరుపుకునే కార్మెల్ సభ కోసం.

ప్రజలు: ప్రభువా, వారిని ఆమె ప్రార్థనా మార్గంలో నడిపించు.

గురువు: తెరేసమ్మ పండుగ రోజున దివ్యబలిపూజలో కృతజ్ఞతతో పాల్గొనే వారి కోసం .

ప్రజలు: ప్రభువా, నీ సన్నిధితో  వారి హృదయాలను నింపుము

గురువు: ఈ నవదినాలలో మాతో కలిసి ప్రార్థించిన వారందరి కోసం.

ప్రజలు: ప్రభువా, వారిని ఆశీర్వదించుము

ఆత్మపరిశీలన

గురువు: ఈ తొమ్మిది రోజులలో నేను పొందిన ఒక మేలు ఏమిటి? (మౌనం)

నా ప్రార్థనకు దేవుడు ఎప్పుడైనా నేను ఊహించని విధంగా సమాధానమిచ్చాడా? (మౌనం)

ఈ నవదినాల  తరువాత నేను కొనసాగించాలనుకునే ఒక ప్రార్థనా అలవాటు ఏమిటి? (మౌనం)

ప్రార్థన

గురువు: ప్రార్ధించుదం

అందరూ: ప్రేమామయుడైన తండ్రి, ఈ తొమ్మిది రోజులు నీ సన్నిధిలో గడిపే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మేము అడిగినది నీ చిత్తానుసారం అయితే  ప్రసాదించు. మా ప్రార్థనకు నీవు ఇచ్చే సమాధానాన్ని, అది ఎలాంటి రూపంలో ఉన్నా, స్వీకరించే హృదయమును మాకు ప్రసాదించు,  అవిలాపురి  తెరేసమ్మ, మా ప్రార్థనలను దేవుని ముందుకు తీసుకువెళ్ళండి. ఆమెన్.

గురువు: అవిలాపురి తెరేసమ్మ ,                                     ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: తిరుసభ  ప్రార్థనా గురువా,                               ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: తిరుసభ  పండితురాలా,                                   ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: కార్మెల్  సభ సంస్కర్తా,                                      ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: యేసు ప్రభువు ప్రేమలో జ్వలించిన  ఆత్మా,   ప్రజలు : మా కోసం ప్రార్థించండి.

గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదిన ప్రార్ధనలలో  మనం అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం)

గురువు: ప్రభువా, మా ఈ మనవులను ఆలకించండి

ప్రజలు: ఆమెన్

గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం కలిసి ప్రార్థిద్దాం.

అందరూ: పరలోక జపం, మంగళవార్త  జపం, త్రిత్వ స్తోత్రం

గురువు: ప్రార్థిద్దాం. ప్రేమమయుడైన ప్రభువా, అవిలాపురి తెరేసమ్మ  ద్వారా ఈ తొమ్మిది రోజులు మాకు మీరిచ్చిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు. రేపటి పండుగను కృతజ్ఞతా హృదయంతో జరుపుకునే వరం ప్రసాదించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

గురువు: ఈ రోజు సంకల్పం: ఈ నవదినాలలో మీరు పొందిన ఒక మేలును గుర్తుచేసుకుని, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. రేపటి పండుగ దివ్యబలిపూజలో పాల్గొనడానికి సిద్ధపడండి.

గురువు: ప్రభువు మీతో ఉండును గాక.

ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక

గురువు: సర్వశక్తిమంతుడైన దేవుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ, మిమ్ములను ఆశీర్వదించి, కాపాడుదురుగాక.

ప్రజలు: ఆమెన్.

గురువు: సమాధానంతో వెళ్ళుము .

ప్రజలు: సర్వేశ్వరునికి వందనములు

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి