ప్రేమే ధర్మశాస్త్ర హృదయం | 30వ సామాన్య ఆదివారం ప్రసంగం

 


ప్రేమే ధర్మశాస్త్రానికి హృదయం

30వ సామాన్య ఆదివారం – సంవత్సరం A
నిర్గమకాండము 22:21-27 • 1 థెస్సలొనీకయులకు 1:5-10 • మత్తయి 22:34-40

 ఒక గ్రామంలో ఒక వృద్ధ భక్తురాలు ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి చర్చికి వెళ్లేది. జపమాల చేసేది, పూజలో పాల్గొనేది, గంటల తరబడి ప్రార్థించేది. ఊరంతా ఆమెను "భక్తురాలమ్మ" అని పిలిచేవారు. ఒకరోజు ఆమె చర్చి నుండి తిరిగి వస్తుండగా, దారి పక్కన ఒక ముసలావిడ జ్వరంతో వణుకుతూ పడి ఉంది. భక్తురాలమ్మ ఆమెను చూసింది. కానీ "నేను ఆలస్యం అవుతున్నాను, ఇంట్లో పని ఉంది" అనుకొని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి ప్రార్థనలో ఆమెకు ప్రభువు ఇలా చెప్పినట్లు అనిపించింది: "అమ్మా, నీవు నన్ను ఎంతగానో  వెతుకుతున్నావు. నేను ఈ ఉదయం నీ దారిలోనే ఉన్నాను. నీవు నన్ను చూశావు, కానీ ఆగలేదు."

ఈ కథ మన  జీవితంలోలో జరిగే  కథ కాదా? మనం దేవుణ్ణి వెతుకుతాం. కానీ ఆయన తరచుగా మన దారిలోనే, ఒక బాధపడుతున్న మనిషి రూపంలో మనకు ఎదురవుతాడు. ఈ ఆదివార దివ్యగ్రంథ పఠనాలు  మనకు ఇదే సత్యాన్ని మూడు కోణాల నుండి చూపిస్తున్నాయి. దేవుణ్ణి ప్రేమించడం, పొరుగువాణ్ణి ప్రేమించడం అనేవి రెండు వేరు వేరు పనులు కావు. అవి ఒకే ప్రేమకు రెండు ముఖాలు.

 "నేను దయామయుడను"

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలై సీనాయి పర్వతం దగ్గర దేవునితో నిబంధన చేసుకున్న సందర్భం ఇది. దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ వెంటనే ఆ ఆజ్ఞలు రోజువారీ జీవితంలో ఎలా జీవించాలో వివరిస్తున్నాడు. అంటే ఆరాధన ఒక్కటే కాదు, సమాజంలో మనం నడుచుకునే తీరు కూడా నిబంధనలో భాగమే.

దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో గమనించండి: పరదేశియులు, విధవరాళ్ళు, అనాథలు, పేదవారు. వీరందరూ సమాజంలో అతి బలహీనులు. వీరికి భూమి లేదు, న్యాయస్థానంలో గొంతు లేదు, రక్షించే వారు లేరు. అందుకే దేవుడే వీరి రక్షకుడిగా నిలబడుతున్నాడు.

"మీరు పరదేశికి చెడుచేయరాదు,  బాధింపరాదు" అని దేవుడు చెబుతున్నాడు. దానికి ఆయన ఇచ్చే కారణం ఎంత గొప్పదో చూడండి,  "మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు." దేవుడు చెప్పేది ఏమిటంటె "మీ గతాన్ని మరచిపోకండి. మీరు అనుభవించిన బాధ మరొకరికి కలిగించకండి." తాము పొందిన కృపను గుర్తుంచుకునేవారు ఇతరులను అణచివేయరు.

ఆ తర్వాత ఒక గొప్ప  వాగ్దానం ప్రభువు ఇస్తున్నాడు. విధవరాళ్ళు, అనాథలు  బాధపడి తనకు మొరపెడితే, "నేను వారి మొరను తప్పక ఆలకిస్తాను" అని చెబుతున్నాడు. దేవుడు  మన మొర వినే దేవుడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల మొరను విన్నవాడు, ఈ రోజు కూడా బలహీనుల కన్నీటిని చూస్తున్నాడు. పేదవాడి నిట్టూర్పు ఆయన సింహాసనం వరకు చేరుతుంది. ఈ విషయాల తరువాత ప్రభువు  ఆర్ధికంగా వెనుక బడిన వారి గురించి, దేవుని ప్రజలు ఎలా  వారి పట్ల ఉండాలో చెబుతున్నాడు.

ఆర్థిక విషయాలు

 పేదవాడికి అప్పు ఇస్తే వడ్డీ వ్యాపారిలా ప్రవర్తించకూడదు. ఆ అప్పు ఒక వ్యాపారం కాదు, ఒక సహోదరునికి అతని  కష్టంలో చేసే సహాయం. తరువాత దేవుడు, మనసును కదిలించే ఒక నియమం, చెబుతున్నాడు. అది పేదవాడి పైవస్త్రాన్ని తాకట్టు పెట్టుకుంటే, సూర్యాస్తమయం లోపు తిరిగి ఇవ్వాలి. ఎందుకు? ఎందుకంటే అదే అతడు  కప్పుకునేది, అదే అతని దుప్పటి. "అతడు దేనిపై పడుకుంటాడు?" అని దేవుడే అడుగుతున్నాడు.

ఈ ప్రశ్నలో దేవుని హృదయం కనిపిస్తోంది. ఆయన చట్టాన్ని మాత్రమే చూడడం లేదు. చలిలో వణుకుతున్న ఒక పేద మనిషిని చూస్తున్నాడు. చట్టబద్ధమైన హక్కు కూడా మానవ గౌరవం ముందు వెనక్కి తగ్గాలని ఆయన బోధిస్తున్నాడు.

ఈ ఆజ్ఞలన్నిటి చివర దేవుడు తన స్వభావాన్ని ప్రకటిస్తున్నాడు. అది ఏమిటంటె  "నేను దయా మయుడను.” దేవుడు దయామయుడు, కాబట్టి ఆయన  ఆజ్ఞలకు  మూలం భయం కాదు, దేవుని దయ మాత్రమే.

 ప్రతిధ్వనించిన జీవితం

రెండవ పఠనంలో పౌలు గ్రీసు దేశంలోని తెస్సలొనీక సంఘానికి రాస్తున్నాడు. అది క్రొత్తగా ఏర్పడినది. ఒక  నూతన సంఘం. విగ్రహారాధనతో నిండిన నగరంలో, హింసల మధ్య ఆ చిన్న విశ్వాసుల సమూహం నిలబడింది. పౌలు వారిని చూసి ఆనందంతో కృతజ్ఞత చెబుతున్నాడు.

“ఏలయన, కేవలము మాటలచే మాత్రమేకాక, శక్తితోను, పవిత్రాత్మతోను, దాని సత్యము నందలి సంపూర్ణమగు నమ్మకముతోను మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే గదా! మమ్మును, ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను, పవిత్రాత్మవలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి." సువార్త కేవలం ఒక ప్రసంగం కాదు. అది దేవుని పని.  పునీత పౌలు వారితో మేము “మీ మధ్య మేము ఎలా ఉన్నామో మీకు తెలుసు" అని, సువార్తను ప్రకటించే వారి జీవితం ప్రకటనకు సాక్ష్యం కావాలి. నేను చెప్పే మాటలకు, నేను జీవించే జీవితానికి పొంతన లేకపోతే సువార్త బలహీనపడుతుంది. వీరు జీవితాలు దేవునికి చెందినవి కావు అని ఇతరులు మన గురించి అంటారు. ఇది గురువులమైన మాకే కాదు, తల్లిదండ్రులైన మీకు, పెద్దలైన మీకు, ప్రతి క్రైస్తవునికీ వర్తిస్తుంది.

పునీత పౌలు మరియొక విషయం చెబుతున్నాడు. " మీరు అనేక బాధలు పడినను, పవిత్రాత్మవలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి."  కష్టములో కూడా దేవుని వాక్యాన్ని వారు స్వీకరించారు. శ్రమ, ఆనందం, ఈ రెండూ కలిసి ఉండగలవా? క్రైస్తవ జీవితంలో ఉండగలవు. క్రైస్తవ ఆనందం కష్టాలు లేకపోవడం వల్ల రాదు. కష్టాలలో కూడా ప్రభువు తోడుగా ఉన్నాడనే నిశ్చయం నుండి వస్తుంది. మన కుటుంబాలలో కష్టాలు ఉన్నాయి.  అనారోగ్యం, అప్పులు, ఒంటరితనం, భవిష్యత్తు గురించిన భయం వుంటాయి. అయినా ఆ చీకటిలో దేవుడు వెలిగించే ఆనందం ఒకటుంది. దాన్ని లోకం ఇవ్వలేదు, లోకం తీసివేయనూ లేదు. క్రైస్తవుని ఆనందం ఎవరు తీసివేయలేరు.

ఆ చిన్న సంఘం నుండి దేవుని వాక్యం, మాసిదోనియ, అకయ ప్రాంతాలన్నిటిలో ప్రతిధ్వనించింది. ప్రతిధ్వని అంటే ఒక గంట మోగితే ఆ శబ్దం దూరం వరకు వినిపించడం. వారికి పెద్ద వేదికలు లేవు, ప్రచార సాధనాలు లేవు, అధికారం లేదు. వారికి ఉన్నది ఒక్కటే,  మారిన జీవితం. వారు "సజీవుడైన, సత్యమైన దేవుణ్ణి సేవించడానికి" తిరిగారు. ఆ మార్పే ఒక ప్రకటనగా మారింది. మాటలు చెప్పకుండానే వారి జీవితం సువార్తను చాటింది. ఈ చిన్న సంఘం అనేక మందికి మాతృక అయ్యింది.

ఇది మనం ఆలోచించాలి. మన ఇళ్ల నుండి ఏ శబ్దం ప్రతిధ్వనిస్తోంది? కలహాల శబ్దమా? పుకార్ల  శబ్దమా? లేక ప్రేమ, క్షమ, సేవల శబ్దమా?

పునీత పౌలు గారు  ప్రస్తావించిన "విగ్రహాలు" గురించి కూడా ఆలోచిద్దాం. మనం రాతి విగ్రహాలను పూజించకపోవచ్చు. కానీ దేవునికంటే ఎక్కువగా మనం ప్రాధాన్యం ఇచ్చే ఏదైనా విగ్రహమే. డబ్బు, పదవి, పేరు ప్రతిష్ఠలు, ఇతరులపై అసూయ, పగ. వీటిని విడిచి సజీవ దేవుని వైపు తిరగడమే నిజమైన మారుమనస్సు.

పరలోకం నుండి రానున్న యేసు కోసం మీరు  ఎదురుచూస్తున్నారు అని వారు చెప్పుచున్నారు అని ఈ సంఘం గురించి ఇతరులు చెబుతున్న విషయాన్ని పౌలు వారికి చెబుతున్నాడు. . క్రైస్తవుడు గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటిలో జీవిస్తాడు. గతంలో క్రీస్తు మరణ పునరుత్థానాలకు కృతజ్ఞత, వర్తమానంలో దేవునికి సేవ, భవిష్యత్తులో ఆయన రాకడ కోసం నిరీక్షణ మన జీవితములోని సాధారణ విషయాలే. ఈ నిరీక్షణ మనల్ని నిష్క్రియులను చేయదు. ప్రభువు వచ్చినప్పుడు మనల్ని ఎలా చూడాలని కోరుకుంటామో, అలా ఈ రోజే జీవించేలా చేస్తుంది. ఈ తెస్సలోనిక సంఘం మనందరికి మాతృక. మన నుండి ఇతరులు దేవుని అనుసరించే విధానం నేర్చుకోవాలి, దైవ ఆజ్ఞల అనుసరణ మన ప్రధమ కర్తవ్యం కావాలి.

 రెండు ప్రేమల ఒకే హృదయం

యేసు ప్రభువు  యెరూషలేము దేవాలయంలో  బోధిస్తుండగా సద్దూకయ్యుల ఆలోచనలను వారి కుయూక్తులను  పారనీయకుండా చేసేడని తెలుసుకొని పరిసయ్యులు ప్రభువు దగ్గరకు వచ్చారు. వారిలో ఒక ధర్మశాస్త్ర పండితుడు ఆయనను పరీక్షించడానికి, "బోధకుడా, ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞ ఏది?" అని అడుగుతున్నాడు.

యూదులు ధర్మశాస్త్రంమును  613 ఆజ్ఞలగా విభజించారు.  కొన్ని కష్టమైనవి, కొన్ని తేలికైనవి అని చర్చించుకునేవారు. ఏ ఆజ్ఞను గురించి చర్చించిన వివాదం తప్పదు. కానీ యేసు ప్రభువు  ఆ ఉచ్చులో పడలేదు. ఆయన  వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ధర్మశాస్త్ర హృదయాన్ని బయటపెట్టాడు.

 "నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మ తోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను.” ఇది ప్రతి యూదుడు రోజూ ప్రార్థించే మాట. యేసు ప్రభువు వారికి  కొత్త సిద్ధాంతం చెప్పలేదు. తెలిసిన సత్యాన్ని దాని పూర్తి అర్ధాన్ని చెబుతున్నాడు.

ఇక్కడ "పూర్ణ" అనే మాట మూడుసార్లు వచ్చింది. హృదయం అంటే మన కోరికలు, భావాలు, సంకల్పం. ఆత్మ అంటే మన జీవితమంతా, మన ప్రాణం. మనస్సు అంటే మన ఆలోచన, తెలివి, వివేకం. కనుక దేవుణ్ణి ప్రేమించడం అంటే మనలోని ఏ ఒక్క భాగాన్నీ మినహాయించకుండా అంతటినీ ఆయనకు అర్పించడం.

అప్పుడు యేసు ప్రభువు  ఎవరూ అడగని దాన్ని కూడా చెబుతాడు, రెండవది కూడా దీనిలాంటిదే,  నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రశ్న ఒక ఆజ్ఞ గురించి, కానీ సమాధానం రెండు. ఎందుకు? ఎందుకంటే ఈ రెండు విడదీయలేనివి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పొరుగువాని ప్రేమ లేని భక్తి ఆత్మవంచన అవుతుంది. దేవుని ప్రేమ లేని సేవ అలసట అవుతుంది. అందుకే యోహాను ,  కనిపించే సోదరుణ్ణి ప్రేమించలేనివాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు అని కరఖండిగా చెబుతున్నాడు. "ఈ రెండు ఆజ్ఞలపై ధర్మశాస్త్రము , ప్రవక్తల ప్రబోధము  ఆధారపడి ఉంది." ఇక్కడ "ఆధారపడి ఉన్నాయి" అనే మాటకు మూలార్థం "వేలాడుతున్నాయి". తలుపు కీలుపై వేలాడినట్లు అని అర్ధం. ఆ కీలు లేకపోతే తలుపు కూలిపోతుంది. అంటే ప్రేమ లేకపోతే ఆజ్ఞలు కేవలం బరువైన నియమాలుగా మిగిలిపోతాయి. ప్రేమ ఉంటే అవే ఆజ్ఞలు జీవం గల మార్గంగా మారతాయి.

మూడు పఠనాలు, ఒకే సందేశం

మొదటి పఠనం ప్రేమ ఎలా కనిపించాలో  చెబుతుంది, అది పరదేశిని గౌరవించడంలో, విధవరాలిని కాపాడడంలో,  అనాధను ఆదుకొనుటలో, పేదవాడి దుప్పటిని తిరిగి ఇవ్వడంలో కనపడాలి.

రెండవ పఠనం ఆ ప్రేమ ఎలా పుడుతుందో చూపిస్తుంది,  విగ్రహాలను విడిచి, సజీవ దేవుని వైపు తిరగడంలో పుట్టి ఇతరుల జీవితాలను మార్చేలా చేస్తుంది.  దేవుని వైపు తిరిగిన హృదయం సహజంగానే మనుషుల వైపు తిరుగుతుంది. ఈనాటి సువిశేషం వీటిని ఒక మాటగా చెబుతుంది. అదే  దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించు, నిన్నువలె నీ  పొరుగువాణ్ణి ప్రేమించు.

ఈ మూడింటి వెనుక ఉన్న ఆధారం ఏమిటి?  అంటే దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించాడు. విగ్రహాల చీకటి నుండి థెస్సలొనీకయులను తన వెలుగులోకి తెచ్చాడు. మనల్ని రక్షించడానికి తన సొంత కుమారుణ్ణి శిలువపై అర్పించాడు. మనం దేవుణ్ణి ప్రేమించేది ఆయన మొదట ప్రేమించాడు కాబట్టే. మనం ఇతరులకు చూపే దయ, మనం పొందిన దయకు ప్రతిస్పందన మాత్రమే.

ఈ రోజు దీనిని  మన జీవితంలో ఎలా జీవించాలి

ఈ సత్యం మన నిజ జీవితంలోఎలా పాటించాలో ఆలోచిద్దాం.

మొదటిది, ఈనాటి "పరదేశులు, విధవరాండ్రు, అనాథలు" ఎవరు? మన చుట్టూ ఉన్న వలస కూలీలు, రోజు కూలీ మీద బతికే వారు, భర్తను కోల్పోయిన స్త్రీలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు పట్టించుకోని ఒంటరి వృద్ధులు, అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు. వీరు మన కళ్ల ముందే ఉన్నారు. "వారు నాకు మొరపెడితే నేను వింటాను" అని దేవుడు ఇచ్చిన మాట ఈ రోజుకూ నిలిచే ఉంది. మనం వారిని పట్టించుకోకపోతే, వారి మొర దేవుని సముఖానికి చేరుతుంది. మనం వారిని ఆదుకుంటే, దేవుని ప్రేమ మన చేతుల ద్వారా వారికి చేరుతుంది. క్రైస్తవుడు  దేవుని ప్రతినిధి. దేవుని ప్రతినిధిగా ఇది మన పని.

రెండవది, మన ఆర్థిక జీవితం. మనం ఇచ్చే వేతనాలు న్యాయమైనవేనా? అప్పు ఇచ్చేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, మనం ఎదుటివారి అవసరాన్ని ఉపయోగించుకుంటున్నామా? ఇంట్లో పని చేసేవారిని మనం గౌరవంగా చూస్తున్నామా? "పేదవాని పై వస్త్రం గురించి ఆలోచించిన దేవుడు అతడు దేనిపై పడుకుంటాడు?" అని అడిగిన దేవుడు, మనం ఇచ్చే వేతనం ఒక కుటుంబాన్ని పోషించగలదా అని అడుగుతున్నాడు.

మూడవది, మన కుటుంబాలు. ప్రేమ అనేది మొదట ఇంట్లోనే నేర్చుకోవాలి. భార్యాభర్తల మధ్య గౌరవం, పిల్లల పట్ల సహనం, వృద్ధ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఇంటిలోనే ఉండాలి.  బయట గొప్ప సేవలు చేసి, ఇంట్లో కోపం, నిర్లక్ష్యం చూపిస్తే, ఆ ప్రేమ అసంపూర్ణం. పొరుగువాడు అంటే మన ఇంటి గుమ్మం దాటి వెళ్ళినవాడు మాత్రమే కాదు. మన ఇంట్లోనే అవసరంలో ఉన్నవాడు కూడా.

నాల్గవది, మన సంఘం. తెస్సలొనీక సంఘంలా మనం కూడా ఇతరులకు ఆదర్శం కావాలి. కొత్తగా వచ్చిన వారిని ఆదరిస్తున్నామా? పేదవారికి, ఒంటరివారికి మన సంఘంలో చోటు ఉందా? మన భేదాలు, వర్గాలు, అసూయలు సువార్త సాక్ష్యాన్ని మసకబారుస్తున్నాయా? ఒక సంఘం  గొప్పతనం దాని భవనాల్లో కాదు, దాని సభ్యుల ప్రేమలో కనిపిస్తుంది.

ఐదవది, మన ప్రార్థన జీవితం. దేవుని ప్రేమను అనుభవించకుండా ఇతరులను ప్రేమించడం మనకు సాధ్యం కాదు. మన సొంత శక్తితో ప్రేమించాలంటే త్వరలోనే అలసిపోతాం. అందుకే దివ్యపూజా బలిలో, దివ్యసత్ప్రసాదంలో, వ్యక్తిగత ప్రార్థనలో మనం దేవుని ప్రేమను స్వీకరించాలి. అక్కడ నిండిన హృదయమే బయట ప్రవహించగలదు. ప్రార్థన మనల్ని మనుషుల నుండి దూరం చేయకూడదు. నిజమైన ప్రార్థన మన హృదయాన్ని మరింత కరుణతో నింపుతుంది.

ఒక సున్నితమైన హెచ్చరిక, ఒక గొప్ప ఆశ

ఈ మాటలు  విన్నప్పుడు మనలో కొందరు ఇలా అనుకోవచ్చు,  "నేను పాపిని. నేను ఇంత ప్రేమించలేను." నిజమే. పూర్ణ హృదయంతో ప్రేమించడం మన స్వశక్తికి మించినది. కానీ యేసు ప్రభువు  ఈ ఆజ్ఞను మనకు ఇచ్చి వదిలేయలేదు. ఆయనే ఈ ప్రేమను సంపూర్ణంగా జీవించి చూపాడు. తండ్రిని పూర్తిగా ప్రేమించి, తండ్రి చిత్తానికి శిలువ వరకు విధేయుడయ్యాడు. మనుషులను ప్రేమించి, తన ప్రాణాన్నే అర్పించాడు. ఆ శిలువ నుండి ప్రవహించే కృప మనకు ఈ ప్రేమను జీవించే శక్తి ఇస్తుంది.

అందుకే మన లోపాలను చూసి నిరాశ చెందనవసరం లేదు. "నేను దయగలవాడను" అని చెప్పిన దేవుడు, మన బలహీనతలను కూడా దయతో చూస్తాడు..

ముగింపు

మొదట చెప్పిన కథకు తిరిగి వద్దాం. ఆ భక్తురాలమ్మ ఆ రాత్రి కన్నీళ్లతో ప్రార్థించింది. మరుసటి ఉదయమే ఆ ముసలావిడ దగ్గరకు వెళ్లి, ఆమెకు ఆహారం, మందులు ఇచ్చి, ఆమె కోలుకునే వరకు సేవ చేసింది. ఆ రోజు నుండి ఆమె ప్రార్థన మారిపోయింది. ఇంతకు ముందు ఆమె ప్రార్థనలో దేవుణ్ణి వెతికేది. ఇప్పుడు దేవుణ్ణి మనుషుల్లో కూడా చూడగలిగింది.  ఈ వారం మన దారిలో ఎవరైనా బాధపడుతూ కనిపిస్తే, మనం ఆగుదాం. ఆ వ్యక్తిలో క్రీస్తును చూద్దాం.  దేవుణ్ణి  సంపూర్ణంగా ప్రేమిద్దాం. పొరుగువాణ్ణి మనలా ప్రేమిద్దాం. ఈ రెండు ప్రేమలే మన క్రైస్తవ జీవితానికి కీలు. ఈ కీలుపై మన కుటుంబాలు, మన సంఘం, మన సమాజం నిలబడాలి.


Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి