ప్రధాన దేవదూతలు: మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలు పండుగ

 


ప్రధాన దేవ  దూతలు

 కనిపించని లోకం, నిజమైన లోకం

మనం రోజూ చూసేదే నిజమైన లోకమని అనుకుంటాం. ఇల్లు, పొలం, ఉద్యోగం, బండి, ఫోను, బ్యాంకు ఖాతా అన్నీ కళ్లకు కనిపిస్తాయి, చేతికి తగులుతాయి. కానీ మన విశ్వాసం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. అది ఏమిటంటె  కనిపించే లోకం కంటే కనిపించని లోకం ఇంకా వాస్తవమైనది, ఇంకా శాశ్వతమైనది. మనం ప్రతి ఆదివారం దివ్యబలిపూజలో ఒప్పుకునే విశ్వాస ప్రమాణంలో  " కంటికి కనిపించే, కనిపించని అన్నిటినీ సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరున్నీ విశ్వసిస్తున్నాను." కనిపించని సృష్టిలో అత్యంత ఘనమైన భాగం దేవదూతలు.

ఈ రోజు, సెప్టెంబర్ 29న, తిరుసభ ముగ్గురు ప్రధాన దేవ  దూతల పండుగను జరుపుకుంటుంది.  మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలు. ఈ ముగ్గురి పేర్లు వినగానే కొందరికి పటాలు గుర్తొస్తాయి, కొందరికి ప్రార్థనలు గుర్తొస్తాయి. కానీ ఈ పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, మన జీవితంతో వారికి ఉన్న సంబంధాన్ని ఈ రోజు ధ్యానిద్దాం.

దేవదూతలు అంటే ఎవరు?

దేవదూతలు కల్పనలు కాదు, కథల పాత్రలు కాదు. వారు దేవుడు సృష్టించిన నిజమైన ఆధ్యాత్మిక జీవులు. కతోలిక తిరుసభ బోధ వారిని శరీరం లేని, వ్యక్తిత్వం ఉన్న, బుద్ధి, సంకల్పం గల జీవులుగా వర్ణిస్తుంది. వారు అమర్త్యులు, మనకంటే శక్తిమంతులు, దేవుని మహిమను నిరంతరం చూసేవారు.

"దూత" అనేది వారి స్వభావం పేరు కాదు, వారి పని పేరు. "దూత" అంటే సందేశం మోసుకెళ్ళేవాడు, పంపబడినవాడు. వారి స్వభావం ప్రకారం వారు ఆత్మలు, వారి పని ప్రకారం వారు దూతలు. అందుకే పునీత అగస్టీను, 'దేవదూత' పని పేరు, స్వభావం పేరు కాదు. వారి స్వభావం అడిగితే ఆత్మ అంటాం, వారి పని అడిగితే దూత అంటాం అని చెబుతారు.

హెబ్రీయులకు రాసిన లేఖ 1:14 వారి గురించి అందంగా చెబుతుంది: " అట్లయిన దేవదూతలు ఎవరు? వారందరు దేవుని సేవించుచు రక్షణము పొందనున్న వారి సహాయార్ధము దేవునిచే పంపబడు ఆత్మలు కారా?" ఈ వాక్యాన్ని మళ్ళీ చదవండి. దూతలు ఎవరికి సేవ చేస్తారు? రక్షణను పొందబోయే మనకు. దేవుని సన్నిధిలో ఉండే మహా శక్తిమంతమైన ఆత్మలు, మన కోసం, మన రక్షణ కోసం పంపబడుతున్నారు. ఇది మన విలువను చూపిస్తుంది. దేవుని దృష్టిలో మనం ఎంత విలువైనవారమో, ఆయన మన కోసం తన సేవకులను నియమించాడు.

కీర్తన 91:11-12, “ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్లిన వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్లు రాతికి తగిలి నొవ్వకుండునట్లువారు నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొందురు.”

యేసు ప్రభువు స్వయంగా మత్తయి 18:10లో " చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." ప్రతి విశ్వాసికి, ముఖ్యంగా చిన్నవారికి, దేవుడు సంరక్షక దూతను ఇచ్చాడని ఈ వాక్యం సూచిస్తుంది.

"ప్రధాన దూత" అంటే ఏమిటి?

దూతలలో వివిధ స్థాయిలు ఉన్నాయని బైబిలు సూచిస్తుంది. సెరాపులు, కెరూబులు, సింహాసనాలు, ఆధిపత్యాలు, శక్తులు, అధికారాలు, రాజ్యాలు, ప్రధాన దూతలు, దూతలు అని సంప్రదాయం వర్గీకరిస్తుంది. వీటిలో "ప్రధాన దూత" అంటే దూతలలో అధిపతి, దేవుని అత్యంత ముఖ్యమైన లక్ష్యాల కోసం పంపబడే గొప్ప దూత. మిఖాయేలు, గబ్రియేలు రఫాయేలును కలిపి ప్రధాన దూతలు అంటారు.

ఈ ముగ్గురి పేర్లలోనే ఒక అద్భుతమైన సత్యం దాగి ఉంది. హీబ్రూ భాషలో ప్రతి పేరు చివర "ఎల్" ఉంటుంది, "ఎల్" అంటే దేవుడు.

•       మిఖాయేలు అంటే "దేవునితో సమానుడు ఎవడు?"

•       గబ్రియేలు అంటే "దేవుడే నా బలం" లేదా "దేవుని శక్తిమంతుడు"

•       రఫాయేలు అంటే "దేవుడు స్వస్థపరుస్తాడు"

వారి పేర్లు తమ గురించి కాదు, దేవుని గురించి చెబుతాయి. నిజమైన సేవకుడి గుర్తు ఇదే.  తన గురించి కాక, యజమాని గురించి మాట్లాడతాడు. ఈ ముగ్గురు దూతలు ప్రతి ఒక్కరూ దేవుని ఒక్కో లక్షణాన్ని మనకు చూపిస్తారు.  మిఖాయేలు దేవుని విజయాన్ని, గబ్రియేలు దేవుని సందేశాన్ని, రఫాయేలు దేవుని స్వస్థతను తెలియజేస్తారు.

పునీత మిఖాయేలు - పోరాడే ప్రధాన దూత

"దేవునితో సమానుడు ఎవడు?"

ప్రకటన గ్రంథం 12:7-9 ఒక గొప్ప ఆధ్యాత్మిక యుద్ధాన్ని వర్ణిస్తుంది: " అంతట దేవ లోకమున యుద్దము ఆరంభమయ్యెను! మిఖాయేలు, అతని తోడి దేవదూతలు ఆ సర్పముతో యుద్ధము ఒనర్చిరి. ఆ సర్పము, దాని దూతలు వారిని ఎదిర్చి పోరాడిరి.కాని ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి.ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను! ఆ సర్పము మనకు సుపరిచిత మైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమంతటిని మోసగించినది. అతడు, అతని దూతలు భువికి నెట్టబడిరి.” ఈ యుద్ధంలో మిఖాయేలు ఆయుధం ఏమిటి? అది ఖడ్గం మాత్రమే కాదు, ఆయన పేరులోనే ఉంది, "దేవునితో సమానుడు ఎవడు?" సాతాను పతనానికి కారణం గర్వం. అతను దేవునితో సమానం కావాలని కోరుకున్నాడు. మిఖాయేలు తన పేరుతోనే ఆ గర్వానికి సమాధానం చెప్పాడు.  దేవునితో సమానుడు ఎవడూ లేడు! వినయం గర్వాన్ని ఓడించింది. ఇదే మనకు మొదటి పాఠం. ఆధ్యాత్మిక యుద్ధంలో మన గొప్ప ఆయుధం మన బలం కాదు, మన వినయం. మనం దేవునికి లోబడినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరిల్లినప్పుడు, సాతాను మనపై శక్తిని కోల్పోతాడు.

దానియేలు గ్రంథంలో మిఖాయేలు

దానియేలు 12:1, “ ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అపుడు విపత్కాల ము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటినుండి అంతటి విపత్కాల మెన్నడు సంభవించి యుండలేదు. ఆ కాలము సమీపించినపుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు.” పాత నిబంధనలో ఇశ్రాయేలును కాపాడినవాడు, ఇప్పుడు తిరుసభను కాపాడే ప్రధాన దూత.

యూదా లేఖలో మిఖాయేలు

యూదా లేఖ 9 వచనంలో  ఒక విశేషమైన సంఘటనను జరుగుతుంది,  " దేవదూతలలో ప్రధానుడు మిఖాయేలు సహితము ఇట్లు చేయ సాహసింప లేదు. మోషే శరీరమును ఎవరు పొందవలెననెడి వాగ్వాదము వచ్చినప్పుడు, అతనికి సైతానుతో కలిగిన తగాదాలో మిఖాయేలు, సైతానును అవమానకర మాటలతో నిందింపలేదు. కేవల ము "ప్రభువు నిన్ను గద్దించు గాక" అని మాత్రమే పలికెను." చూడండి, ఇంత గొప్ప ప్రధాన దూత కూడా తన సొంత శక్తిపై ఆధారపడలేదు. "ప్రభువే నిన్ను గద్దించును గాక" అన్నాడు. మన పోరాటం కూడా ఇలాగే ఉండాలి. సాతానుతో తలపడేటప్పుడు మనం ప్రభువు నామాన్ని ఆశ్రయిస్తాం, మన సొంత తెలివిని కాదు.

మన జీవితంలో మిఖాయేలు

మనలో ప్రతి ఒక్కరూ ఒక యుద్ధంలో ఉన్నాం. అది కత్తులతో చేసే యుద్ధం కాదు. అది మన ఆలోచనల్లో, మన కుటుంబాల్లో, మన కోరికల్లో జరిగే యుద్ధం. కోపం, అసూయ, అపవిత్రత, మద్యం వంటి వ్యసనాలు, నిరాశ, భయం, కుటుంబ కలహాలు ఇవన్నీ ఆ యుద్ధపు ముఖాలే. పౌలు గారు ఎఫెసీయులకు 6:12లో "ఏలన, మనము పోరాడునది రక్త మాంసములతో నుండు శరీరధారులతో కాదు! ప్రధానులతో, అధికారులతో, ఈ యుగపు అంధకార శక్తులతో, ఆకాశమందలి దురాత్మల తో మనము పోరాటము చేయుచున్నాము" అని పునీత పౌలు చెబుతున్నారు.

ఈ పోరాటంలో మనం ఒంటరివాళ్ళం కాదు. మిఖాయేలు మన పక్షాన ఉన్నాడు. అందుకే తిరుసభ ఈ ప్రార్థనను ఎంతో ప్రేమగా, అతిదూత యగు పునీత మిఖాయేలా,  సాతాను కుతంత్రాల నుండి, ఉచ్చుల నుండి మాకు రక్షణగా ఉండుము. పరలోక సైన్యాధిపతీ, లోకంలో ఆత్మలను నాశనం చేయడానికి తిరిగే దుష్టాత్మలను దేవుని శక్తితో నరకంలోకి నెట్టివేయుమని ప్రార్ధిస్తుంది.

మిఖాయేలు దేవదూత  మనల్ని కాపాడేది మనం దేవుని వైపు తిరిగినప్పుడే. పాపాన్ని పట్టుకుని రక్షణ కోరడం విరుద్ధం. కాబట్టి పశ్చాత్తాపం, పాపసంకీర్తనం, దివ్యసత్ప్రసాదం ఈ యుద్ధంలో మన గొప్ప కవచాలు.

పునీత గబ్రియేలు – సందేశం తెచ్చే ప్రధాన దూత

"దేవుడే నా బలం"

గబ్రియేలు దేవుని సందేశకుడు. బైబిలులో ఆయన ప్రతిసారీ ఒక గొప్ప ప్రకటనతో కనిపిస్తాడు.

దానియేలుకు: దానియేలు 9:21-23లో గబ్రియేలు దానియేలుకు మెస్సీయా రాక గురించి కాల ప్రణాళికను వివరిస్తాడు. దానియేలు ప్రార్థిస్తున్నప్పుడే గబ్రియేలు వేగంగా వచ్చి, "నీవు ఎంతో ప్రియమైనవాడవు" అని చెబుతాడు. ప్రార్థన మొదలుపెట్టగానే జవాబు బయలుదేరుతుంది అని ఇది మనకు నేర్పుతుంది.

జెకర్యాకు: లూకా 1:19లో జెకర్యా దేవాలయంలో ధూపం వేస్తున్నప్పుడు గబ్రియేలు ప్రత్యక్షమై, "నేను దేవుని సన్నిధిలో నిలిచే గబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి పంపబడ్డాను" అంటాడు. ముసలివాడైన జెకర్యా, గొడ్రాలైన ఎలిశబెత్తమ్మకు   యోహాను జన్మిస్తాడని ప్రకటిస్తాడు. మానవ దృష్టిలో అసాధ్యమైనది దేవునికి సాధ్యం.

మరియమ్మమాతకు:  అన్నిటికంటే గొప్పది లూకా 1:26-38లో జరిగిన ప్రకటన, ఆరవ నెలలో దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు అనే పట్టణానికి పంపాడు,  పంపబడినది ఒక రాజభవనానికి కాదు, ఆలయానికి కాదు, ఒక చిన్న గ్రామంలోని సామాన్య కన్య మరియమాత  దగ్గరకు.

ఆ క్షణాన్ని ఊహించండి. ప్రధాన దూత మరియమ్మ ముందు నిలిచి, "కృపాపూర్ణురాలా, నీకు శుభం! ప్రభువు నీతో ఉన్నాడు" అని పలుకుతాడు. ఆమె కలవరపడింది.  అప్పుడు గబ్రియేలు దూత, "మరియమ్మా, భయపడకు. దేవుని ...... నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుము."

మరియమాత  "ఇది ఎలా జరుగుతుంది?" అని అడిగింది. దేవుడు ప్రశ్నలకు భయపడడు. నిజాయితీగల ప్రశ్నను ఆయన స్వాగతిస్తాడు. గబ్రియేలు దేవదూత  మరియమాతకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని వివరిస్తాడు.

గబ్రియేలు దేవదూత  మనకు మూడు పాఠాలు నేర్పుతాడు

మొదటిది, దేవుని సందేశాన్ని వినడం. దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. కానీ మన జీవితంలో ఎన్నో  శబ్దాలు ఉంటున్నాయి. మరియమాత  నిశ్శబ్దంలో ఉంది కాబట్టి ఆ స్వరం విన్నది. రోజులో కొన్ని నిమిషాలైనా నిశ్శబ్దంగా ప్రభువు స్వరం వినడానికి కేటాయించాలి. ఉదయం ప్రతిరోజు త్రికాల జపం చెప్పండి, ఆ ప్రార్థన గబ్రియేలు సందేశంతోనే మొదలవుతుంది.

రెండవది, అసాధ్యాలను నమ్మడం. "దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు." మన కుటుంబాల్లో నయం కాదనుకున్న గాయాలు, తీరవనుకున్న అప్పులు, మారరనుకున్న మనుషులు, ఫలించవనుకున్న ప్రార్థనలు ఉన్నాయి. గబ్రియేలు దేవదూత  దేవునికి అసాధ్యం అనేది లేదు అని చెబుతుంది.

మూడవది, "అవును" అని చెప్పే ధైర్యం. గబ్రియేలు సందేశం మరియమాత  "అవును" కోసం వేచి చూసింది. దేవుడు తన ప్రణాళికలను బలవంతంగా అమలు చేయడు. మన స్వేచ్ఛా సమ్మతి కోసం ఎదురు చూస్తాడు. ఆయన మనల్ని సేవకు, క్షమకు, మార్పుకు పిలిచినప్పుడు మన జవాబు ఏమిటి? మరియమాతలా "ఇదిగో నేను, నీ మాట ప్రకారం జరగనీ" అని చెప్పగలమా?

పునీత రఫాయేలు - స్వస్థపరిచే ప్రధాన దూత

"దేవుడు స్వస్థపరుస్తాడు"

రఫాయేలు కథ తోబీతు గ్రంథంలో ఉంది. ఇది బైబిలులోని అత్యంత మనోహరమైన కథల్లో ఒకటి. 

తోబీతు దేవునియందు భక్తి గల ఒక నీతిమంతుడు. అతను బందీగా నీనెవెలో జీవిస్తున్నాడు. మరణించిన తన ప్రజలను గౌరవంగా సమాధి చేసేవాడు. ఒక రోజు అలసిపోయి నిద్రించగా, పిచ్చుకల రెట్ట కళ్ళలో పడి అతను గుడ్డివాడయ్యాడు. అదే సమయంలో దూరదేశంలో ఉన్న అతని బంధువు రగూయేలు కుమార్తె సారా కూడా తీవ్రమైన బాధలో ఉంది. ఆమెను పెళ్ళి చేసుకున్న ఏడుగురూ పెళ్ళిరాత్రే మరణించారు, ఎందుకంటే అసమోదేయు అనే దుష్టాత్మ వారిని చంపేది. ఇద్దరూ ఒకే సమయంలో కన్నీటితో ప్రార్థించారు, తమ బాధ కంటే చావే నయమని కూడా వేడుకున్నారు.

తోబీతు 3:17 ఒక అద్భుతమైన వాక్యం చెబుతుంది: "ఇద్దరి ప్రార్థనలు ఒకే సమయంలో దేవుని మహిమ ముందు వినబడ్డాయి. వారిద్దరినీ స్వస్థపరచడానికి రఫాయేలు పంపబడ్డాడు." ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండా, వేర్వేరు చోట్ల ప్రార్థించారు. దేవుడు ఇద్దరి ప్రార్థనలనూ విన్నాడు, ఒకే పరిష్కారంతో సమాధానమిచ్చాడు.

మార్గదర్శకుడైన రఫాయేలు

తోబీతు కుమారుడు తోబియా ఒక సుదూర ప్రయాణం చేయాల్సి వచ్చింది. తోడుగా వచ్చే వ్యక్తిని వెతుకుతుండగా, ఒక యువకుడు కనిపించాడు. అతని పేరు అజర్యా అని చెప్పాడు. అతనే మారువేషంలో ఉన్న రఫాయేలు. ఆ ప్రయాణమంతా రఫాయేలు తోబియాను కాపాడాడు, నడిపించాడు. ఒక చేప కాలేయం, పిత్తం, గుండె ఔషధంగా ఎలా ఉపయోగపడతాయో చెప్పాడు. సారాను పెళ్ళి చేసుకోవడానికి తోబియాకు ధైర్యం ఇచ్చాడు. పెళ్ళిరాత్రి ఆ దుష్టాత్మను తరిమివేశాడు. తిరిగి వచ్చాక తోబీతు కళ్ళకు ఆ ఔషధం రాసి అతనికి చూపు తెప్పించాడు.

రఫాయేలు తన రహస్యాన్ని బయటపెట్టడం

చివరికి రఫాయేలు తన నిజ స్వరూపాన్ని వెల్లడించాడు. తోబీతు 12:15లో రఫాయేలు, " నేను దేవుని దివ్యసన్నిధిలో నిల్చి, అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు, ఏడుగురు దేవదూతలలో ఒకడనైన రఫాయేలును" అని చెప్పాడు. వారు భయపడి సాగిలపడ్డారు. రఫాయేలు వారితో,  భయపడవద్దని, వారికి  శాంతి కలుగును గాక అని చెప్పి  దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించమని చెప్పి, నేను మీతో ఉన్నది దేవుని చిత్తం వలన అని చెప్తాడు. రఫాయేలు కీర్తి తను  తీసుకోలేదు. అన్నిటినీ దేవునికి అప్పగించాడు.

మన జీవితంలో రఫాయేలు

రఫాయేలు కథ మనకు మూడు విషయాలు చెబుతుంది.

స్వస్థత దేవుని నుండి వస్తుంది. శారీరక అనారోగ్యం, మానసిక గాయాలు, విరిగిన సంబంధాలు, కుటుంబ బాధలు, ఇవన్నీ మనం ఆసుపత్రులకు, వైద్యులకు తీసుకెళ్ళాలి, అదే సమయంలో ప్రార్థనలోనూ దేవునికి అప్పగించాలి. రఫాయేలు ఔషధం ఉపయోగించాడు, కానీ దాని వెనుక దేవుని ఆజ్ఞ ఉంది. వైద్యం, ప్రార్థన రెండూ దేవుని బహుమతులే.

ప్రయాణాల్లో రక్షణ. తోబియాకు తోడు వచ్చినవాడు నేడు మనకూ తోడు వస్తాడు. మీ ప్రయాణాలను ఆయనకు అప్పగించండి.

జీవిత భాగస్వామిని కనుగొనడం. వివాహం కోసం ప్రార్థించే యువతీ యువకులకు రఫాయేలు ప్రత్యేక మధ్యవర్తి. తోబియా, సారాల కలయికను దేవుడు రఫాయేలు ద్వారా ఏర్పాటు చేశాడు. మీ కుటుంబాల్లో వివాహాల కోసం ప్రార్థించే తల్లిదండ్రులు, దేవుని చిత్తానికి అనుగుణమైన జీవిత భాగస్వామి కోసం ప్రార్థించే యువతీ యువకులు, రఫాయేలును ఆశ్రయించండి.

ముగింపు

మనం ఒంటరివాళ్ళం కాదు. ఇదే ఈ రోజు సందేశం. మన కళ్ళకు కనిపించకపోయినా, ఈ క్షణంలో కూడా ఈ ప్రార్థనా మందిరంలో వేలాది దేవదూతలు మనతో కలిసి ప్రభువును ఆరాధిస్తున్నారు. దివ్యబలిపూజలో మనం పాడే "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అనే గీతం పరలోక దూతల గీతమే. బలిపూజ పీఠం చుట్టూ మనం పరలోక సభతో కలుస్తున్నాం.మిఖాయేలు మనకు "భయపడకు, పోరాటం ప్రభువుది, ఆయనకు సాటి ఎవరూ లేరు" అని చెబుతాడు. గబ్రియేలు "భయపడకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన వాగ్దానాలు నెరవేరతాయి" అని చెబుతాడు. రఫాయేలు "భయపడకు, దేవుడు నీ గాయాలను స్వస్థపరుస్తాడు, నీ ప్రయాణంలో నీతో నడుస్తాడు" అని చెబుతాడు. ఈ ముగ్గురూ ఒకే మాట చెబుతున్నారు: "భయపడకు." బైబిలులో దూతలు దాదాపు ప్రతిసారీ ఈ మాటతోనే మొదలుపెడతారు, ఎందుకంటే దేవుడు మన వైపు ఉన్నాడు.

 ప్రార్థన

ప్రధాన దూత పునీత మిఖాయేలూ, మా పోరాటాల్లో మమ్మల్ని కాపాడు. మా కుటుంబాలను చెడు శక్తుల నుండి రక్షించు. ప్రధాన దూత పునీత గబ్రియేలూ, దేవుని స్వరాన్ని వినే నిశ్శబ్ద హృదయాలను, "అవును" అని చెప్పే ధైర్యాన్ని మాకు ప్రసాదించు. ప్రధాన దూత పునీత రఫాయేలూ, మా రోగులను స్వస్థపరచు, మా ప్రయాణికులను కాపాడు, మా యువతీ యువకులకు సరైన మార్గం చూపించు. ఆమెన్

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి