మార్త, మరియ కథ (లూకా 10:38-42): అవసరమైనది ఒక్కటే

 

లూకా 10:38-42 

వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదములచెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కుపనులతో సతమత మగుచు ఆయనయొద్దకు వచ్చి “ప్రభూ! నా సహోదరి పనులన్నియు నాపై వదలి మీచెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు” అనెను. అందుకు యేసు “మార్తమ్మా! మార్తమ్మా! నీవు ఎన్నో పనులనుగూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్ను కొనినది. అది ఆమెనుండి తీసివేయబడదు” అని సమాధానమిచ్చెను.

ఒక సాధారణ ఇల్లు  ఒక అసాధారణ అతిథి

ఒక గౌరవనీయమైన అతిథి మన ఇంటికి వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? ఇల్లు శుభ్రం చేస్తాం, అలంకరిస్తాం, రకరకాల పిండివంటలు సిద్ధం చేస్తాం. అతిథి వచ్చేవరకు విశ్రాంతి లేకుండా కష్టపడతాం. అయితే తీరా ఆ అతిథి వచ్చాక, అలసట వల్ల ఆయనతో గడపడానికి, ఆయన మాటలు వినడానికి మన వద్ద సమయం ఉండదు. లూకా సువార్త 10:38-42 లోని ఈ చిన్న కథ మన ఇళ్లలో రోజూ జరిగే దృశ్యాన్నే ప్రతిబింబిస్తుంది.

యేసు ప్రభువు యెరూషలేము వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్న సమయంలో, మార్త అనే స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సంఘటనలో మొదటి అడుగు ఆమెదే. దేవుని సేవకుడికి, దైవకుమారునికి  ఆతిథ్యం ఇవ్వాలనే మంచి మనస్సుతో, ప్రేమతో ఆమె ఈ కార్యాన్ని ఆరంభించింది.

యేసు పాదాల చెంత కూర్చున్న శిష్యురాలు

 యేసు ప్రభువును తమ ఇంటికి ఆహ్వానించిన తరువాత మార్త ఆయన కోసం కావలసినవి సిద్ధం చేస్తుంది, కాని మరియు ప్రభువు మాటలు వింటూ ఉంది. ఈ కథలో మరియ ప్రవేశం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమె ప్రభువు పాదములచెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెనని సువార్తికుడు రాశాడు. ఈ వాక్యం చదవడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ మొదటి శతాబ్దపు యూదా సమాజంలో ఇది ఒక విప్లవాత్మకమైన సంఘటన.

రబ్బీ పాదాల చెంత కూర్చోవడం

ఆ కాలంలో ఒక గురువు లేదా రబ్బీ పాదాల చెంత కూర్చోవడం అనేది ఒక శిష్యుని యోగ్యతకు, స్థానానికి చిహ్నం. అపోస్తలుడైన పౌలు తాను గమలీయేలు పాదాల చెంత విద్య నేర్చుకున్నానని చెప్పడం దీనికి నిదర్శనం.

స్త్రీల స్థానం మరియు సామాజిక పరిమితులు

ఆనాటి సంప్రదాయంలో ఆధ్యాత్మిక బోధలు వినడం, శిష్యరికం చేయడం కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన హక్కుగా భావించేవారు. స్త్రీల స్థానం వంటగదికే పరిమితమని సమాజం విశ్వసించేది. అటువంటి సమాజంలో యేసు ప్రభువు పాదాల చెంత కూర్చొనుట అంటే ఆమె ఒక శిష్యురాలిగా ఉన్నదని అర్ధం.

యేసు ప్రతిస్పందన

మరియ ఆ సమాజపు  సాంప్రదాయ పరిమితులను దాటి, తనను యేసు ప్రభువు  శిష్యురాలిగా భావించి ఆయన పాదాల చెంత కూర్చుంది. యేసు ప్రభువు ఆమెను పంపివేయలేదు; నీవు స్త్రీవి, వంటింటికి తిరిగిపో అని అనలేదు. స్త్రీ స్థానం కేవలం ఇంటి పనుల్లోనే ఉందనే సామాజిక భావనను ఆయన అక్కడ నిశ్శబ్దంగానే  అధిగమించాడు.

వినడం -శిష్యత్వానికి తొలిమెట్టు

పవిత్ర గ్రంధంలో  దేవుని వాక్యాన్ని వినడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. లూకా 8:21 లో దేవుని వాక్యమును విని ఆచరించువారే నా తల్లియు, నా సహోదరులును అని యేసు ప్రభువు చెబుతారు.  అలాగే లూకా 11:28 లో దేవుని వాక్యమును విని పాటించువారు ధన్యులు అన్నారు. వాక్యాన్ని వినడం అనేది ఆచరణకు ప్రత్యామ్నాయం కాదు, అది సమర్థవంతమైన ఆచరణకు నిజమైన పునాది. మరియ ఆ ఆత్మీయ పునాదిని వేస్తోంది.

పెక్కుపనులతో సతమతమగుచు: సేవ ఎలా భారంగా మారుతుంది?

మార్త పని చేయడంలో లేదా అతిథి సత్కారం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. యూదయ సంప్రదాయంలో ఆతిథ్యం ఇవ్వడం పవిత్రమైన ధర్మం. కానీ ఇక్కడ ఆమె పెక్కుపనులతో సతమతమగుచు ఉంది. ఇక్కడ సమస్య ఆమె చేసే పని కాదు; ఆ పనులు ఆమె మనస్సును, ఆత్మను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఆతిథ్య సేవ ఆమెను నడిపించడం మానేసి, ఆమే సేవకు బందీగా మారింది.

ఆరంభ ప్రేమ మరియు ఆత్మీయ మార్పు

మొదట మనం దేవుని పట్ల, ఇతరుల పట్ల ఉన్న ప్రేమతోనే సేవను లేదా పనిని ప్రారంభిస్తాం. తరువాత అది పెరిగేకొలది అలసట, ఒత్తిడి మరియు ఆందోళన వస్తుంటాయి.బాధ్యతలు పెరిగేకొద్దీ శరీరంలో అలసట, మనస్సులో ఒత్తిడి పెరుగుతాయి. బాహ్య పనుల ఒత్తిడిలో మన అంతరంగ శాంతి దెబ్బతింటుంది.

ఒంటరితనపు భావన

అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు, నేనొక్కడినే కష్టపడుతున్నాను అనే ప్రతికూల ఆలోచన మనసులో విత్తబడుతుంది. దాని పర్యావసానమే ఫిర్యాదు చేయడం  మరియు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఆనందంగా ప్రారంభించిన సేవ చివరికి అసహనానికి, కోపానికి దారితీస్తుంది. మార్త విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె చివరికి యేసు ప్రభువు వద్దకే వచ్చి, ప్రభూ! నా సహోదరి పనులన్నియు నాపై వదలి ఉండుట మీరు గమనించుటలేదా? నాతో కలసి పనిచేయుమని ఆమెతో చెప్పుము అని ఫిర్యాదు చేసింది. ఇక్కడ గమనిస్తే, సేవ చేస్తున్న మార్త చివరికి యేసు ప్రభువుకే ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆందోళన మనల్ని ఎలా దారి తప్పిస్తుందో అనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ.

రెండుసార్లు పిలిచిన పేరు: దైవ వాత్సల్యం మరియు దిద్దుబాటు

మార్త ఆందోళనతో చేసిన ఫిర్యాదుకు యేసు ప్రభువు  స్పందన కఠినంగా లేదు. ఆయన ఆమెను గద్దించలేదు, బదులుగా ఎంతో ఆప్యాయంగా మార్త! మార్త! అని రెండుసార్లు పేరు పెట్టి పిలిచారు.

బైబుల్‌లో ఒకరి పేరును రెండుసార్లు పిలవడం అనేది బలమైన ఆత్మీయత, వాత్సల్యం, మరియు పవిత్రమైన పిలుపుకు గుర్తు. అబ్రహామా! అబ్రహామా!, మోషే! మోషే!, మరియు సీమోనూ! సీమోనూ! అని పిలిచిన పిలుపులలో ఇదే ఆప్యాయత కనిపిస్తుంది.

ఇక్కడ మందలింపు కంటే ముందే దేవుని కరుణ వ్యక్తమవుతుంది. తనపై  ఆరోపించిన మార్తను ప్రభువు  మృదువుగా హెచ్చరిస్తూ, నీవు ఎన్నో పనులనుగూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు అన్నారు. యేసు ప్రభువు  ఆమె కష్టాన్ని తప్పుపట్టలేదు, కానీ ఆ పని వల్ల ఆమె పొందుతున్న ఆందోళనను, ఆతురతను ఎత్తి చూపారు. ఆందోళన అనేది అనేకసార్లు దేవుని సంరక్షణపై నమ్మకం తగ్గడానికి సంకేతంగా మారుతుంది. మనం చేసే పనుల కంటే, ఆ పనులను ఏ హృదయ స్థితితో చేస్తున్నామనేది ప్రాముఖ్యం.

అవసరమైనది  మరియు ఉత్తమమైన భాగం

అనేక పనుల ఒత్తిడిలో ఉన్న మార్తకు యేసు ప్రభువు ఒక ప్రాథమిక సత్యాన్ని గుర్తుచేశారు. అదేమిటంటే, అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటి ప్రభువు మాట వినడం, ఆయనతో నిరంతర సంబంధం కలిగి ఉండటం.  ఈ విషయాన్ని యేసు ప్రభువు  స్పష్టంగా చెప్పారు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమెయొద్దనుండి తీసివేయబడదు అని కూడా చెప్పారు.

పాత నిబంధన నేపథ్యం

పాత నిబంధనలో భాగం అంటే దేవుడే తనకు వారసత్వంగా ఉండటం. భూమిలో ఎలాంటి భౌతిక వాటా లేని లేవీయులు ప్రభువే నా భాగము అని పాడుకునేవారు. మరియ ఎంచుకున్నది సరిగ్గా ఆ దైవ భాగన్నే.

శిష్యత్వం ఒక వ్యక్తిగత ఎంపిక

ఎన్నుకొనినది అనే పదం శిష్యత్వం అనేది ఒక వ్యక్తిగత తీర్మానమని చూపిస్తుంది. మన తరఫున మరొకరు ఈ ఎంపికను చేయలేరు. ఇక్కడ మరియనే ఈ భాగాన్ని ఎన్నుకున్నది. యేసు ప్రభువు మార్త ఎంచుకున్న ఆతిథ్య భాగాన్ని చెడ్డది అని అనలేదు. ఉత్తమమైనది అనే పోలిక పదాన్ని వాడారు. రెండూ మంచివే కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది అన్నింటికంటే శ్రేష్ఠమైనది.

రక్షణ సమకూర్చే వాగ్దానం

అది ఆమె నుండి తీసివేయబడదు అనే మాట మరియ శిష్యత్వ స్థానానికి యేసు ప్రభువు  ఇచ్చిన భరోసా. మార్త ఒత్తిడి మరియను ప్రభువు  పాదాల చెంత నుండి లేపి వంటగదికి తీసుకురావాలని చూసినా, ప్రభువు ఆమె ఆత్మీయ ఎన్నికను  కాపాడాడు. ఈ వాగ్దానం మార్తకు కూడా ఒక ఆహ్వానమే; ఆమె కూడా ఆ శ్రేష్ఠమైన స్థానాన్ని ఎంచుకోవచ్చు.

పాత్రలు తిరగబడిన ఇల్లు: దైవిక ఆతిథ్యం

ఈ కథనంలో ఒక అద్భుతమైన విషయం  ఉంది. ప్రారంభంలో మార్త యేసు ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. కానీ నిజానికి అక్కడ ఇంటి వారికి ఆత్మీయ విందు ఇస్తున్నది యేసు ప్రభువే. ఆయన ఇస్తున్న భోజనం తన జీవమైన మాటలే.

ఇక్కడ అతిదే నిజమైన ఆతిథ్యదాతగా మారాడు. లూకా సువార్తలో నేను సేవచేయువానిగా  మీ మధ్య ఉన్నాను అని ప్రభువు చెప్పిన ఈ విధంగా కూడా అనేక సార్లు నెరవేరుతోంది. మనం దేవునికి ఇచ్చే దానికంటే, ఆయన మనకు ఇచ్చేది ఎప్పుడూ ముందే ఉంటుంది, ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి, క్రైస్తవ జీవితంలో సేవకు ఉన్న క్రమం ఇది.

ఈ భాగం  గురించి వ్యాప్తిలో ఉన్న మూల భావనలు

ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకునే క్రమంలో తరచూ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని సరిచూసుకోవడం అవసరం.

సేవ లేదా పని అవసరం లేదు అనుకోవడం పూర్తిగా తప్పు. యేసు ప్రభువు  ఈ సంఘటనకు ముందే మంచి సమరియుని ఉపమానం ద్వారా ఆచరణాత్మక సేవ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కథనం సోమరితనానికి ఎంతమాత్రం సమర్థన కాదు.

యేసు ప్రభువు ఇక్కడ పనిని లేదా బాధ్యతలను తప్పుపట్టలేదు. ఆయన సరిచేసింది పనిలో ప్రాధాన్యతలు తప్పడాన్ని మాత్రమే.

మనలో ప్రతి ఒక్కరిలో మార్త, మరియ ఇద్దరూ ఉంటారు. ఒక సమయములో సేవ చేసే మార్త వైఖరి, మరొక సమయములో ధ్యానించే మరియ వైఖరి అవసరమవుతాయి. బాహ్య సేవ, అంతరంగ ప్రార్థనల మధ్య సమతుల్యత సాధించడమే అసలైన ఆధ్యాత్మికత.

మన ఇళ్లలో మరియు సంఘాల్లో అన్వయింపు

కుటుంబ జీవితంలో అన్వయింపు

ఇళ్లలో తరచూ ఎవరో ఒకరు అందరి కోసం నేనొక్కడినే కష్టపడుతున్నాను అనే మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. పనిని ఇంట్లో అందరూ పంచుకోవడం ఎంత ముఖ్యమో, అంతకంటే ముఖ్యంగా కుటుంబమంతా కలిసి ప్రభువు పాదాల చెంత గడిపే సమయం, అంటే కుటుంబ ప్రార్థన మరియు దైవ వాక్య ధ్యానం ఉండటం అవసరం. ఇది రోజువారీ పనులకు అడ్డంకి కాదు, పనులు ఉత్సాహంగా చేయడానికి ప్రాణవాయువు అవుతుంది. సేవకులు, నాయకులు, ఆరాధన బృందాలు రకరకాల కార్యక్రమాల్లో, నిర్వహణలో మునిగిపోయి, ప్రభువుతో గడిపే సమయాన్ని మరచిపోయే ప్రమాదం ఉంది. సేవలో ఫిర్యాదులు, విసుగు పెరుగుతున్నాయంటే, అది మన అంతరంగంలో ప్రార్థనా జీవితం తగ్గిందనడానికి స్పష్టమైన సూచన. మన రోజువారీ చింతలు అనేక విషయాలను లౌకిక దృష్టిలో అత్యవసరం అనిపిస్తాయి. కానీ యేసు ప్రభువు మన ప్రాధాన్యతల జాబితాను ఒకే ఒక్క అంశానికి కుదిస్తారు. అది దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటం.

ఆత్మపరిశీలన

ఈ వాక్య భాగాన్ని ధ్యానించిన తర్వాత ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ఆత్మపరిశీలనా అంశాలు ఉన్నాయి. నేను చివరిసారిగా ప్రభువు పాదాల చెంత ఎలాంటి ఆందోళనలు లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్నది ఎప్పుడు? నా సేవలో లేదా బాధ్యతల్లో అసహనం, ఫిర్యాదు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? ఇతరులతో పోల్చుకోవడం వల్ల నేను నా అంతరంగ శాంతిని కోల్పోతున్నానా? నా జీవితంలో ఒక్కటే అవసరం అనే విషయాన్ని  నేను రోజూ ఎంచుకుంటున్నానా?

ప్రార్థన

ప్రభువా! మార్త ఇంటికి అతిథిగా వచ్చినట్లే, మా హృదయాలలోకి, మా కుటుంబాల్లోకి వేంచేయుము. మేము బాహ్యమైన పనుల్లో, ఆందోళనల్లో మునిగి నిన్ను మరచిపోయిన వేళల్లో, మా పేరును ప్రేమగా పిలిచి మమ్మల్ని సరైన దారిలో పెట్టుము. మా ఆందోళనలన్నిటినీ నీ పాదాల చెంత ఉంచే విశ్వాసాన్ని ఇవ్వుము. మరియవలె నీ మాట వినే నమ్రత కలిగిన హృదాయాన్ని, మార్తవలె నిష్కల్మషమైన ప్రేమతో సేవ చేసే చేతులను మాకు అనుగ్రహించు. అనేకమైన లౌకిక విషయాల్లో చీలిపోయిన మా హృదయాలను, ఒక్కటే అవసరమైన నీ వైపు తిప్పుము. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి