మంచి సమరీయుని ఉపమానం: "నా పొరుగువాడు ఎవడు?" – లూకా 10:25-37 వ్యాఖ్యానం
లూకా 10:25-37 మంచి సమరీయుని
ఉపమాన వ్యాఖ్యానం
అంతట ఒక
ధర్మశాస్త్ర బోధకుడు లేచి, “బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏమి
చేయవలయును?” అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను.
అందుకు యేసు “ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది? అది
నీకెట్లు అర్థమ గుచున్నది?” అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు,
" 'నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ
పూర్ణఆత్మతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ
పొరుగువానిని ప్రేమింపుము' అని వ్రాయబడియున్నది” అని పలికెను. “నీవు
సరిగా సమాధానమిచ్చితివి. అటులనే చేయుము. నీవు జీవింతువు” అని యేసు వానితో
చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై “నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగెను. యేసు ఇటుల సమాధానమిచ్చెను: “ఒకానొకడు యెరూషలేము
నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి,
దోచుకొని, గాయ పరచి, కొనఊపిరితో
విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు, వానిని
చూచియు, తప్పుకొనిపోయెను. అటులనే ఒక లేవీయుడు అటు
వచ్చి వానిని చూచి తొలగిపోయెను.పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవుచు అతనిని చూచెను.
వానిని చూడగనే అతడు జాలిపడి, వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము,
ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై
కూర్చుండబెట్టి, ఒక సత్రమునకు తీసికొనిపోయి
పరామర్శించెను. అతడు మరు నాడు రెండు దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి 'వీనిని పరామర్శింపుము. నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగివచ్చిన పిమ్మట
చెల్లింపగలను' అని చెప్పెను. దొంగల చేతిలో పడినవానికి
పై ముగ్గురిలో పొరుగువాడు ఎవ్వడు?” అని యేసు అడిగెను. “కనికరము చూపినవాడే”
అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో “నీవును వెళ్ళి అటులనే
చేయుము” అని పలికెను.
పరిచయం
లూకా సువార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఉన్న భాగం సువార్తలన్నింటిలో అత్యంత ప్రసిద్ధమైనది. ఈ ప్రపంచంలో బైబుల్ తెలియని వారు కూడా మంచి సమరీయుడు అనే మాటను వాడతారు. ఈ కథను కేవలం ఇతరులకు సాయం చేయండి అనే నీతికథగా మాత్రమే చదివితే దాని నిజమైన ఆధ్యాత్మిక అర్ధాన్ని కోల్పోతాం. ఇది ఒక ప్రశ్నతో మొదలై, మరొక ప్రశ్నతో ముగుస్తుంది. రెండు ప్రశ్నల మధ్య యేసు ప్రభువు ఈ అద్భుతమైన ఉపమానాన్ని చెబుతున్నాడు.
సందర్భం మరియు
సువార్తలో స్థానం
లూకా సువార్త
తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనం నుండి యేసు ప్రభువు యెరూషలేము వైపు తన
ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ఈ ప్రయాణ మార్గంలో యేసు ప్రభువు శిష్యత్వం గురించి,
పరలోక రాజ్య విలువలను గురించి ఎక్కువగా బోధిస్తుంటాడు. ఈ ఉపమానానికి
ముందు రెండు ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి.
మొదటిది, సమరియ గ్రామం యేసు ప్రభువును స్వీకరించకపోతే శిష్యులైన యాకోబు,
యోహానులు ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఆ గ్రామాన్ని దహించి వేయాలా అని
అడుగట, తరువాత, డెబ్బది
ఇద్దరు శిష్యులను సువార్త పరిచర్యకు పంపడం, వారి
సువార్త విజయం, దానిని చూసి యేసు ప్రభువు ఆనందించడం.
సమరియులపై శిష్యులు తీవ్రమైన కోపం వ్యక్తం చేసిన వెంటనే, ఒక
సమరీయుడినే కథానాయకునిగా చేసి యేసు ప్రభువు ఈ ఉపమానం చెప్పడం అనేది యాదృచ్ఛికం
కాదు. ఇది శిష్యుల హృదయాలలోని పక్షపాతాన్ని కడిగివేసే బోధ.
ఇరవై మూడవ మరియు ఇరవై నాలుగవ వచనాలలో యేసు ప్రభువు తన శిష్యులను ధన్యులని ప్రకటించాడు. ఎందుకంటే ప్రవక్తలు, రాజులు చూడాలనుకున్న రక్షణ దినాలను వారు కళ్లారా చూస్తున్నారు. అప్పుడు ఒక ధర్మశాస్త్ర పండితుడు లేచి అడిగిన ప్రశ్న ఆ ధన్యతను ఆచరణలోకి తెస్తుంది. దేవుని రాజ్యం పొందుటకు, దేవుని జీవంలో భాగస్వామి కావడానికి నేను ఎలా జీవించాలి అనే నిత్యజీవ ప్రశ్న ఇక్కడ ఉద్భవిస్తుంది.
ధర్మశాస్త్ర
బోధకుని ప్రశ్న మరియు యేసు ప్రభువు సమాధానం
మొదటి ప్రశ్న మరియు బోధకుని ఉద్దేశం
బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏమి చేయవలయును అని ధర్మశాస్త్ర బోధకుడు
అడిగాడు. గ్రీకు మూలభాషలో ఇతనిని నోమికోస్ అంటారు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని
క్షుణ్ణంగా వివరించే పండితుడు. అతడు లేచి నిలబడటం బాహ్యంగా గౌరవసూచకమే, కానీ లూకా మాత్రం యేసు ప్రభువును పరీక్షింపగోరి అని ఇక్కడ స్పష్టం
చేస్తున్నాడు. అతడు యేసు ప్రభువును మాటల్లో తప్పుపట్టే ప్రయత్నంలో ఉన్నాడు.
అయినప్పటికీ అతడు అడిగిన ప్రశ్న మానవాళికి అత్యంత ముఖ్యమైనది.
ఏమి చేయవలయును అనే భావన
నేను ఏమి
చేయవలయును అనే ఈ ప్రశ్నలో, నిత్యజీవం
అనేది స్వయంకృషితో సంపాదించుకునేది లేక ఏదో ఒక మంచి పని చేసి ప్రతిఫలంగా పొందేది
అనే మానవ ఆలోచన వారిలో కనపడుతుంది. యేసు ప్రభువు ఈ భావనను నేరుగా ఖండించడం లేదు
కానీ కథ చివరికి ఆయన చూపేది ఏమిటంటే, నిజమైన ప్రేమించడం
అనేది లెక్కలు వేసి చేసే పని కాదు, అది రూపాంతరం చెందిన హృదాయంతరంగం నుండి
పొంగిపొర్లేది. ఇక్కడ నిత్యజీవము అంటే కేవలం మరణానంతర జీవితం మాత్రమే కాదు,
దేవుని జీవంలో భాగస్వామ్యం పొందడం, అది ఇక్కడే
మొదలై శాశ్వతంగా కొనసాగుతుంది.
ధర్మశాస్త్రం
మరియు ప్రేమ ఆజ్ఞ
యేసు ప్రభువు వేసిన ప్రతిప్రశ్న
యేసు ప్రభువు
ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది, అది నీకెట్లు
అర్థమగుచున్నది అని అడిగాడు. యేసు ప్రభువు తరచుగా ప్రశ్నకు ప్రశ్నతో జవాబు
ఇస్తాడు. ఇది పరీక్షించేవాని చేతనే నిజమైన సత్యాన్ని చెప్పించే పద్ధతి. యేసు
ప్రభువు ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి.
మొదటిది, లేఖనం ఏమి చెబుతుంది, రెండవది, నీవు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు. ఒకే
లేఖనాన్ని వేర్వేరు విధాలుగా చదవవచ్చు. కొందరు దాన్ని బాధ్యతల నుండి తప్పించుకునే
మార్గంగా చదువుతారు, కొందరు నిజాయితీగా ఆచరించే మార్గంగా
చదువుతారు.
బోధకుని సమాధానం
అప్పుడు ఆ బోధకుడు
పాతనిబంధనలోని రెండు ముఖ్యమైన లేఖన భాగాలను కలిపి చెప్పాడు. మొదటిది
ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం దేవుణ్ణి పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ
మనస్సుతో ప్రేమించుట. ఇది యూదులు ప్రతిరోజూ ఉదయము, సాయంత్రం
పఠించే షెమా ప్రార్థనలో భాగం. రెండవది లేవీయకాండము పంతొమ్మిదవ అధ్యాయము
పద్దెనిమిదవ వచనం ప్రకారం నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని
ప్రేమించుట.
ఈ రెండు ఆజ్ఞలను కలిపి ధర్మశాస్త్ర సమస్త సారంగా చెప్పడం యేసు ప్రభువు స్వయంగా బోధించిన అంశమే. ఇక్కడ ఈ బోధకుడు కూడా అదే చెబుతున్నాడు. అంటే యేసు ప్రభువు బోధ ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది కాదు, అది ధర్మశాస్త్రం యొక్క నిజమైన అంతర్భావాన్ని నెరవేర్చేది.
సంపూర్ణంగా ప్రేమించడం
ఇక్కడ వాడబడిన
హృదయం, ఆత్మ, శక్తి, మనస్సు
అనే నాలుగు పదాలు మనిషిలోని సమస్త ఉనికిని, సమగ్రతను
సూచిస్తాయి. దేవుని పట్ల ప్రేమ అనేది మనలో ఒక రకమైన భావోద్వేగానికి మాత్రమే
పరిమితమైనది కాదు. అది కేవలం తెలివి మాత్రమే కాదు, బాహ్య
చర్య మాత్రమే కాదు. మన సమస్త ఆలోచనలు, బలం, ఆత్మ దేవుని వైపు మళ్లించాలి.
యేసు ప్రభువు
ఆజ్ఞ
అటులనే చేయుము,
నీవు జీవింతువు అని యేసు ప్రభువు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.
సిద్ధాంతాన్ని కేవలం తెలుసుకోవడం సరిపోదు, ప్రేమను అనునిత్యం
ఆచరించాలి. ఇక్కడ చేయుము అనే క్రియాపదం ఉపమానమంతటా ప్రతిధ్వనిస్తూ కథ చివర్లో మరల
ప్రత్యక్షమవుతుంది.
రెండవ ప్రశ్న
మరియు మంచి సమరీయుని ఉపమానం
తనను సమర్థించుకొనుటకు వేసిన ప్రశ్న
తనను
సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని ఆ బోధకుడు అడిగాడు. ఈ వాక్యం బోధకుని
హృదయ స్థితిని బయటపెడుతుంది. యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం అతని మనస్సాక్షిని
కదిలించింది. ఎందుకంటే తానిప్పటికే సిద్ధాంతపరంగా సరైన సమాధానం చెప్పాడు, కానీ ఆచరణ గురించిన సవాలు అతని ముందుకు వచ్చింది. అందుకే అతడు ఆచరణ
నుండి తప్పించుకోవడానికి ఒక సాంకేతిక ప్రశ్న వేశాడు.
సరిహద్దులు గీసే ప్రమాదం
నా పొరుగువాడు ఎవరు? ఈ ప్రశ్న చాలా ప్రమాదకరమైనది. ఇది పొరుగువారికి సరిహద్దులను గీయడానికి అడిగిన ప్రశ్న. నా పొరుగువాడు ఎవరో కచ్చితంగా నిర్వచిస్తే, ఎవరు కాదో కూడా సులభంగా తేలిపోతుంది. అప్పుడు ప్రేమించనవసరం లేనివారి జాబితా సిద్ధమవుతుంది. నాటి యూద పండితులు పొరుగువాడు అంటే కేవలం తోటి యూదుడు లేదా యూదుల మధ్య నివసించే పరదేశీయుడు అని మాత్రమే భావించేవారు. సమరియులు, శత్రువులు, అన్యులు ఈ జాబితాలో ఉండరు. మనం కూడా తరచుగా కుటుంబం, కులం, మతం, తరగతి, ప్రాంతం అనే గీతలు గీసుకొని దాని లోపల ఉన్నవారినే ప్రేమించుటకు ప్రయత్నిస్తాము. ఆ సమయాలలో మనం క్రైస్తవులమో కాదో ఆలోచించుకోవాలి.
బాటసారి మరియు
దొంగల దాడి
ఒకానొక మనిషి
యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచుండెను. కథలో బాధితుడికి పేరు, జాతి, మతం, కులం
ఏవీ చెప్పబడలేదు. ఒకానొకడు అని మాత్రమే రాయబడింది. సహాయం చేసేవాడు అవసరంలో
ఉన్నవాని గుర్తింపు చూసి కాదు, అతని దీనస్థితిని చూసి స్పందించాలి.
యెరూషలేము నుండి యెరికోకు ఉన్న దారి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల కొండ ప్రాంతం.
దొంగలకు అనుకూలమైన ఆ నిర్జన మార్గంలో దొంగలు అతన్ని చుట్టుముట్టి, బట్టలు దోచుకొని, తీవ్రంగా గాయపరిచి, కొనఊపిరితో వదిలిపోయారు. అతడు మాట్లాడలేడు, కదలలేడు.
అతని అవసరం మాటలు లేని మానవతా అవసరం.
యాజకుడు మరియు లేవీయుల ప్రవర్తన
ఆ మార్గంలో ఒక
యాజకుడు, తరువాత ఒక లేవీయుడు వెళ్లారు. వీరు ఆలయ
పవిత్రతకు, దైవసేవకు చిహ్నాలు. వారు సహాయం
చేయకపోవడానికి ఆచార అపవిత్రత భయం ఒక కారణం కావచ్చు. శవాన్ని తాకితే
అపవిత్రులవుతామని భావించి ఉండవచ్చు. లేదా దొంగలు ఇంకా అక్కడే ఉన్నారేమోనన్న భయం
కావచ్చు. వారు బాధితుడిని చూచియు, పక్కగా తప్పుకొనిపోయారు.
ధర్మశాస్త్రాన్ని కేవలం ఆచారబద్ధంగా పాటించడం కొన్నిసార్లు నిజమైన కరుణను
ఆచరించడానికి అడ్డంకిగా మారవచ్చని ఇది నిరూపిస్తోంది. పక్కకు తప్పుకొనిపోవడం కూడా
పాపమే.
సమరీయుని
ప్రవేశం మరియు కరుణ చర్య
యూదులు
అసహ్యించుకునే ఒక సమరీయుడు ఆ మార్గంలో వచ్చాడు. యూదులకు, సమరియులకు
శతాబ్దాల వైరం ఉంది. అటువంటి సమరీయుడు బాధితుడిని చూసి కరిగిపోయాడు. గ్రీకు మూలంలో
వాడబడిన స్ప్లాంక్నిజోమై అనే పదం ప్రేగులు కదిలిపోయేంత లోతైన జాలిని సూచిస్తుంది.
సమరీయుడు అతని దగ్గరకు వెళ్లి, గాయాలలో ద్రాక్షారసం, తైలం పోసి కట్లు కట్టాడు. తన సొంత వాహనంపై కూర్చోబెట్టి, సత్రానికి తీసుకెళ్లి పరిచర్య చేశాడు. మరుసటి రోజు రెండు దీనారాలు
సత్రపు యజమానికి ఇచ్చి, ఇంకా ఏమైనా ఎక్కువ ఖర్చయితే తిరిగి
వచ్చినప్పుడు చెల్లిస్తానని బాధ్యత తీసుకున్నాడు. అతడు బాధితుడి జాతిని చూడలేదు,
అతని గాయాన్ని మాత్రమే చూశాడు.
యేసు ప్రభువు
ప్రతిప్రశ్న మరియు ఆజ్ఞ
యేసు ప్రభువు, ఈ ముగ్గురిలో దొంగల చేతిలో పడినవానికి ఎవడు పొరుగువాడాయెను? అని అడిగాడు. బోధకుడు అడిగిన నేను ఎవరిని ప్రేమించాలి అనే ప్రశ్నకు భిన్నంగా, యేసు ప్రభువు నేను ఎవరికి పొరుగువాడిని కాగలను అనే సంబంధ ప్రశ్నకు మార్చాడు. బోధకుడు సమరీయుడు అనే మాట పలకలేక, కనికరము చూపినవాడే అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు, నీవును వెళ్ళి అటులనే చేయుము అని ఆజ్ఞాపించాడు. నైతిక కోణంలో ఇది అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సరిహద్దులు లేకుండా సహాయం చేయాలని బోధిస్తుంది.
ప్రేమ ఆజ్ఞ
మరియు కరుణ స్వభావం
దేవుని ప్రేమ,
పొరుగువాని ప్రేమ వేర్వేరు కావు. కంటికి కనిపించే సోదరుని
ప్రేమించనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు అని యాకోబు చెబుతున్నాడు.
సమరీయుడు చూపిన కరుణ కేవలం నైతికత కాదు, అది దేవుని స్వభావంలో
పాలుపంచుకోవడం. పొరుగువాడు అంటే నా పక్కన ఉన్నవాడు కాదు, నేను
ఎవరి దగ్గరకు వెళ్లాలో వారే నా పొరుగువారు.
భక్తి మరియు ఆచరణల ఐక్యత
బాహ్య ఆరాధనలు
ప్రేమ లేకుండా ఉంటే వ్యర్థం. సమరీయుని నుండి నేర్చుకోమని చెప్పడం ద్వారా దేవుని
కృప మన అంచనాలను దాటి పనిచేస్తుందని, విశ్వాసం అనేది
సిద్ధాంతాలలో కాదు, అనుదిన ఆచరణలో పరిపక్వమవుతుందని యేసు
ప్రభువు నేర్పుతున్నాడు.
మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లు
మన చుట్టూ
అనేకమంది గాయపడిన బాటసారులు ఉన్నారు. శారీరక, మానసిక,
ఆర్థిక గాయాలతో నలిగిపోతున్నవారిని చూసినప్పుడు మనం సమయం లేదు,
అది నా బాధ్యత కాదు అని పక్కకు తప్పుకోకూడదు. మన కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో కుల మత ప్రాంతీయ సరిహద్దులను
దాటి ప్రేమను ఆచరించాలి.
ప్రార్థన
ప్రభువా, నీవు మా గాయాలను చూసి తప్పుకొనిపోకుండా, మా
దగ్గరకు వచ్చి మమ్మల్ని స్వస్థపరిచావు. మా హృదయాలలో ఉన్న కాఠిన్యాన్ని తొలగించుము.
అవసరంలో ఉన్నవారిని చూసినప్పుడు మా కళ్లు తెరిపించి, నీ
ప్రేమను ఆచరించే మంచి సమరీయులుగా మార్చుము. ఆమెన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి