పునీత ఆవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు
పునీత ఆవిలాపురి తెరేసమ్మ నవదినం ప్రార్ధనలు
అక్టోబర్ 15న సార్వత్రిక శ్రీ సభ,
ముఖ్యంగా కార్మెల్ సభ ఆమె పండుగను జరుపుకుంటుంది. ఆ పండుగకు
హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికే ఈ నవదిన ప్రార్థన. ప్రతి రోజూ ఒక వాక్యభాగం,
తెరేసా మాటల్లో, భావనాలలో ధ్యానించుదాం.
పునీత తెరేసమ్మ ఎవరు?
తెరేసమ్మ 1515లో స్పెయిన్ దేశంలోని అవిలా పట్టణంలో
జన్మించింది. చిన్నతనం నుండే ఆమెకు పుణ్యాత్ముల కథలంటే ఇష్టం. ఇరవై ఏళ్ళ వయసులో
అవిలాలోని ఇన్కర్ణేషన్ మఠంలో చేరింది. ఆ తరువాత కొన్నేళ్ళు ఆమె తీవ్రమైన అనారోగ్యంతో
బాధపడింది. ప్రార్థన జీవితంలో ఉత్సాహం, నిస్సత్తువ రెండూ
ఆమెకు కలిగాయి. చివరికి యేసు ప్రభువు శ్రమలను ధ్యానించడం ద్వారా ఆమె హృదయం పూర్తిగా
మారింది.
నలభై ఏళ్ళు దాటిన తరువాత తెరేసమ్మ కార్మెల్
సభను సంస్కరించే పనిని చేపట్టింది. సరళమైన
జీవితం, నిశ్శబ్దం, ప్రార్థన
ప్రధానంగా ఉండే చిన్న మఠాలను ఆమె స్థాపించింది. ఎన్నో వ్యతిరేకతలు, అపార్థాలు, అనారోగ్యాలు ఉన్నా ఆమె ముందుకు సాగింది.
తన అనుభవాలను, ప్రార్థన పాఠాలను తన సోదరీల కోసం
రాసింది. ఆ రచనల్లో "స్వీయ చరిత్ర", "పరిపూర్ణతా
మార్గం", "అంతరంగిక కోట" ముఖ్యమైనవి. 1970లో
ఆరవ పౌలు పోపు గారు ఆమెను తిరుసభ పండితురాలిగా ప్రకటించారు. ఆ గౌరవం పొందిన మొదటి
స్త్రీ తెరేసమ్మ గారే.
మొదటి రోజు
దేవుడు మానవుని తన పోలికలో, తన రూపంలో సృష్టించాడని పవిత్ర గ్రంధం చెబుతుంది. మిగిలిన సృష్టిలో
దేనికీ ఈ గౌరవం ఇవ్వబడలేదు. పక్షులు, చేపలు, పర్వతాలు, నక్షత్రాలు అన్నీ దేవుని మహిమను
చాటుతాయి. కానీ మనిషి మాత్రమే దేవునితో మాట్లాడగలడు, ఆయన
ప్రేమకు ప్రేమతో జవాబివ్వగలడు. అంటే మనం కేవలం పనులు చేయడానికి పుట్టలేదు.
దేవునితో సహవాసం కోసమే పుట్టాం.
ఈ సత్యాన్ని మనం తరచు మరచిపోతాం. మనం
చదువుకుంటాం, సంపాదిస్తాం, కుటుంబాన్ని
పోషిస్తాం. అవన్నీ అవసరమే. కానీ వీటన్నిటి వెనుక ఒక లోతైన కోరిక ఉంది. మనలను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోవాలనీ,
ఆయన ప్రేమను అనుభవించాలనీ. పునీత అగస్టీను
చెప్పినట్లు, దేవునిలో విశ్రాంతి పొందే వరకు మన హృదయం విశ్రాంతి లేనిదే. తెరేసమ్మ ఆధ్యాత్మికత అంతా ఈ కోరికను అర్థం చేసుకోవడం
మీదే నిర్మించబడింది.
పునీతురాలి సూక్తి: ఆత్మ ఒక స్ఫటిక కోట
"ఆత్మ ఒక వజ్రంతో లేదా అతి
నిర్మలమైన స్ఫటికంతో చేసిన కోటలాంటిది." – అంతరంగిక కోట
తెరేసమ్మ తన చివరి గొప్ప రచన "అంతరంగిక కోట"ను ఈ దృశ్యంతోనే ప్రారంభిస్తుంది. మన ఆత్మను ఒక అందమైన కోటగా ఊహించుకోమని ఆమె చెబుతుంది. అది మామూలు రాళ్ళతో కట్టినది కాదు, మెరిసే స్ఫటికంతో చేసినది. ఆ కోటలో అనేక గదులున్నాయి. వాటిని ఆమె "నివాసాలు" అని పిలిచింది. మొత్తం ఏడు నివాసాలు ఉన్నాయి. అన్నిటికీ మధ్యలో ఉన్న గదిలో దేవుడు నివసిస్తున్నాడు.
ఈ పోలిక మనకు మూడు గొప్ప సత్యాలు
చెబుతుంది. మొదటిది, మన ఆత్మ చాలా విలువైనది. అది దేవుడు
నివసించడానికి ఎంచుకున్న చోటు. రెండవది, దేవుడు మనకు
ఎక్కడో దూరంగా లేడు. ఆయన మన లోపలే ఉన్నాడు. ఆయనను వెతకడానికి కొండలు ఎక్కాల్సిన
పనిలేదు, లోపలికి చూసుకుంటే చాలు. మూడవది, పాపం ఈ కోట అందాన్ని మసకబారుస్తుంది కానీ దాన్ని నాశనం చేయలేదు.
స్ఫటికం మీద మురికి పడినా అది స్ఫటికమే. దేవుని కృప దాన్ని మళ్ళీ మెరిసేలా
చేయగలదు.
కోట బయటే తిరిగే మనం
తెరేసమ్మ ఒక బాధాకరమైన విషయాన్ని కూడా చెబుతుంది. చాలా మంది కోట గోడల బయటే తిరుగుతూ ఉంటారు. లోపల ఎంత గొప్ప రాజభవనం ఉందో, అందులో ఎవరు ఉన్నారో వారికి తెలియదు. కొందరు కోటకు చేరి, ద్వారం దగ్గర నిలబడతారు కానీ లోపలికి అడుగు పెట్టరు. వారి మనసు బయటి విషయాల్లోనే చిక్కుకుపోతుంది.
మన జీవితాన్ని ఒకసారి చూసుకుందాం. ఉదయం
లేవగానే ఫోన్, వార్తలు, పనులు,
చింతలు. రోజంతా బయటి శబ్దాలు, బయటి
అవసరాలు. రాత్రి అలసిపోయి నిద్రపోతాం. ఈ మధ్యలో మన హృదయంలో ఉన్న దేవుని కోసం ఎంత
సమయం ఉంది? మన లోపల దేవుడు ఎదురుచూస్తున్నాడు,
కానీ మనం ఎక్కడో బయట తిరుగుతున్నాం. ప్రార్థన అంటే ఈ లోపలఉన్న
దేవుణ్ణి కలవడానికి ప్రయాణాన్ని
ప్రారంభించడమే అని తెరేసా నేర్పుతుంది.
ఈ ప్రయాణం ఒక్క రోజులో పూర్తికాదు. ఆమె ఏడు నివాసాల గురించి రాసింది, అంటే అడుగడుగునా ముందుకు సాగే ప్రయాణం. కానీ మొదటి అడుగు చాలా సులభం. నేను ఈ క్షణం దేవుని సన్నిధిలో ఉన్నాను అని గుర్తుచేసుకోవడం. పెద్ద అనుభూతులు రాకపోవచ్చు. కానీ ఆ చిన్న అడుగే తలుపు తెరుస్తుంది.
ఏడు నివాసాల ప్రయాణం
తెరేసమ్మ ఈ కోటను ఏడు నివాసాలుగా విభజించింది. మొదటి
నివాసంలో ఉన్నవారు ఇప్పుడే ప్రార్థన జీవితం ప్రారంభించినవారు. వారికి దేవుని పట్ల
ఆసక్తి ఉంటుంది కానీ లోకపు ఆకర్షణలు ఇంకా బలంగా లాగుతూ ఉంటాయి. తరువాతి నివాసాలలో
ప్రార్థన క్రమంగా బలపడుతుంది. దేవుని స్వరం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. శోధనలు
వచ్చినా నమ్మకం నిలుస్తుంది. చివరి ఏడవ నివాసంలో ఆత్మ దేవునితో గాఢమైన ఐక్యతలో
జీవిస్తుంది.
ఈ ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నామో
పోల్చుకోవడం కంటే, ఒక్క అడుగు ముందుకు వేయడం ముఖ్యమని తెరేసమ్మ
నేర్పుతుంది. దేవుడు మనలను తన దగ్గరకు
తీసుకెళ్ళాలని ఎంతగానో కోరుకుంటున్నాడు, మనం చేయవలసింది ఆయనకు అడ్డు తగలకుండా, ఆయన పిలుపుకు అవును అనడమే అని తెరేసమ్మ తన సోదరీలకు చెబుతుండేది.
రాబోయే ఎనిమిది రోజులలో ఈ లోపలి ప్రయాణంలోని వేర్వేరు అంశాలను ఆమె మాటలతో ధ్యానిచూదాం.
ప్రార్థన ప్రారంభించడానికి సరళమైన మార్గం
"నాకు ప్రార్థన ఎలా చేయాలో
తెలియదు" అనే భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటివారికి తెరేసమ్మ సలహా ఎంతో సరళమైనది. ముందుగా ఒక నిశ్శబ్దమైన
చోటు ఎంచుకోండి. కూర్చుని, సిలువ గుర్తు వేసుకోండి. తరువాత మీ హృదయంలో దేవుడు ఉన్నాడని
విశ్వసించండి. అక్కడ ఆయన మీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏదైనా చెప్పాలనిపిస్తే ఆయనకు
చెప్పండి. ఏమీ చెప్పాలనిపించకపోతే ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి.
ప్రార్థనలో ఆలోచనలు చెల్లాచెదురైతే
నిరుత్సాహపడకండి. తెరేసమ్మ కూడా తన
ప్రార్థనలో ఇదే ఇబ్బంది ఎదుర్కొంది. ఎన్నిసార్లు మనసు దారి తప్పినా, ప్రేమతో మళ్ళీ ఆయన వైపు తిరగడమే ప్రార్థన. ఈ నవదినాలలో ఈ అలవాటును
నెమ్మదిగా అభ్యసిద్దాం. ప్రతిరోజూ కొద్దిసేపైనా, ఒకే
సమయంలో ప్రార్థించడం వలన హృదయం క్రమంగా ఆయన సన్నిధికి అలవాటు పడుతుంది.
మొదటి రోజు ప్రార్దనలు - (అక్టోబర్ 6 )
దేవునితో
సహవాసం కోసం సృష్టి
గురువు: పిత, పుత్ర, పవిత్రాత్మ
నామమున. : ప్రజలు: ఆమెన్.
గురువు: ప్రభువు మీతో ఉందురు గాక. : ప్రజలు: మీ ఆత్మతోను ఉందురు గాక.
గురువు: ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుడు మనలను తనతో
సహవాసం చేయడం కోసం సృష్టించాడు. ఈ
మహాసత్యాన్ని ఈ రోజు భక్తితో ధ్యానిద్దాం.
గురువు: ప్రార్ధించుదము
ప్రేమస్వరూపుడవైన తండ్రీ, నీవు మమ్మల్ని
నీతో స్నేహం చేయడానికీ, నీతో సహవాసం చేయడానికీ సృష్టించావు. అవిలాపురి పునీత తెరేసమ్మను నీ
శ్రీసభకు ప్రార్థనా గురువుగా అనుగ్రహించావు. ఆమెతో కలిసి ఈ తొమ్మిది రోజులు నీ
సన్నిధిలో కూర్చోవడం, నీ స్వరాన్ని వినడం,
నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించడం, నేర్చుకునేలా మా మనసులను మార్చమని, మా ప్రభువైన యేసు
క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము.
ప్రజలు: ఆమెన్.
(ఆదికాండము 1:26-27):
పఠకుడు:
దేవుడు, "ఇప్పుడు మానవజాతిని కలిగిద్దాం. మానవుడు మమ్మల్ని పోలి, మా వలె ఉండును.
అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశంలోని పక్షులపై,
నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూరమృగాలపై, ప్రాకే జంతువులపై
అధికారం కలిగి ఉండును" అనుకొని, దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన
పోలికలోనే దేవుడు మానవుని సృజించెను. స్త్రీ పురుషులుగా వారిని సృజించెను.
పఠకుడు : ఇది ప్రభువు వాక్కు.
ప్రజలు: సర్వేశ్వరునికి వందనములు.
(కొద్దిసేపు మౌన ధ్యానం)
గురువు: పక్షులు, పర్వతాలు, నక్షత్రాలు దేవుని
మహిమను చాటుతున్నవి. కానీ ఆయనతో హృదయపూర్వకంగా మాట్లాడగలిగేది ఆయనను పోలి ఉన్న
మానవుడు మాత్రమే. మానవుడు కోల్పోయిన దేవునితో సాన్నిహిత్యమును మరల తన కుమారుని
ద్వార పునరుద్దరించెను.
ప్రజలు: ప్రభువా, మేము ఎల్లప్పుడూ
మీ సాన్నిహిత్యములో జీవించులాగా మమ్ము
మలచుము.
గురువు: మా సృష్టికర్తవైన ప్రభువా,
ప్రజలు: నీతో సహవాసం కోసమే మేము
పుట్టామని గ్రహించేలా చేయుము.
గురువు: ఆవిలాపురి తెరేసమ్మ బోధనల
ప్రకారం "ఆత్మ అనేది ఒక వజ్రంతో, లేదా అతి నిర్మలమైన స్ఫటికంతో చేసిన కోట
వంటిది. దాని అత్యంత మధ్య కేంద్రంలో దేవుడు ఆశీనుడైఉన్నాడు"
గురువు: మన ఆత్మ వజ్రంతో నిర్మించిన కోట వంటిది.
ప్రజలు: ప్రభువా, మా ఆత్మలు నీవు
నివసించే కోటలు.
గురువు: ఆ కోట నడిమధ్యలో రాజైన దేవుడు మన
కోసం ఎదురుచూస్తున్నాడు.
ప్రజలు: ప్రభువా, మా హృదయ అంతరంగానికి చేరే ప్రయాణాన్ని మాకు నేర్పు.
గురువు: ఆ కోట అందాన్ని మసకబారునట్లు
చేసిన పాపం, దానిని పూర్తిగా నాశనం
చేయలేదు.
ప్రజలు: ప్రభువా, నీ కృపతో మా తప్పులు మన్నించి మా హృదయాన్ని మళ్ళీ
ప్రకాశింపజేయుము
గురువు: పనులు, చింతల మధ్య రోజంతా
మేము కోట బయటే తిరుగుతున్నాము.
ప్రజలు: ప్రభువా, మమ్మల్ని మీ
సాన్నిధ్యం పొందుటకు లోపలికి పిలువుము.
ఆత్మపరిశీలన
(గురువు నెమ్మదిగా చదువుతారు; ప్రతి ప్రశ్న
తరువాత కొద్దిసేపు మౌనం పాటించాలి)
నా హృదయంలో దేవుడు నివసిస్తున్నాడనే
సత్యాన్ని చివరిసారి ఎప్పుడు గుర్తుచేసుకున్నాను? (మౌనం)
నా రోజులో ఎక్కువ సమయాన్ని కోట బయట ఏ
విషయాలతో గడుపుతున్నాను? (మౌనం)
ఈ నవదినంలో దేవునితో గడపడానికి ప్రతిరోజూ
ఏ సమయాన్ని కేటాయించగలను? (మౌనం)
నేటి ప్రార్థన
గురువు: అందరం కలిసి ప్రార్థిద్దాం.
అందరూ: ప్రభువా, నా హృదయంలో నీవు
నివసిస్తున్నావనే సత్యాన్ని నేను తరచుగా మరచిపోతున్నాను. పునీత తెరేసమ్మ నీ ప్రేమలో
జ్వలించబడినట్లు, నేనూ నీ ప్రేమలో మేల్కొనాలని కోరుతున్నాను. ఈ లోకమూ, నా స్వార్థమూ
నన్ను నీ నుండి దూరం చేయకుండా కాపాడు. పునీత తెరేసమ్మ , మమ్మల్ని మా హృదయ
ద్వారం వరకు నడిపించండి. ఆమెన్.
మధ్యవర్తిత్వ విన్నపాలు
గురువు: అవిలా పునీత తెరేసమ్మ , : ప్రజలు:
మా కోసం ప్రార్థించండి.
గురువు: తిరుసభ ప్రార్ధన గురువా , : ప్రజలు:
మా కోసం ప్రార్థించండి.
గురువు: తిరుసభ పండితురాలా, : ప్రజలు: మా కోసం
ప్రార్థించండి.
గురువు: కార్మెల్ సభ సంస్కర్త : ప్రజలు: మా కోసం
ప్రార్థించండి.
గురువు: దేవుని ప్రేమతో జ్వలించిన ఆత్మా, :
ప్రజలు: మా కోసం ప్రార్థించండి.
గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదినంలో మనం
ప్రత్యేకంగా అడుగుతున్న ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం.
(కొద్దిసేపు మౌనం; లేదా ప్రజలు తమ
ఉద్దేశ్యాలను చెప్పవచ్చు)
గురువు: ప్రభువా, మా ఈ మనవులను
ఆలకించండి : ప్రజలు: ఆమెన్
గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం కలిసి
ప్రార్థిద్దాం.
అందరూ: పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.
గురువు: ప్రార్థించుదము .
ప్రేమమయుడవైన దేవా, అవిలా పునీత
తెరేసమ్మ మాకు చూపిన స్నేహ మార్గంలో నడిచి, మా హృదయాల్లో నీ
సన్నిధిని కనుగొనే వరాన్ని ప్రసాదించు. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా
వేడుకుంటున్నాము.
ప్రజలు: ఆమెన్.
గురువు: ప్రభువు మీతో ఉండుగాక :
ప్రజలు: మీ ఆత్మతో ఉండును గాక .
గురువు: సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ
ఆశీర్వదించి, కాచి కాపాడుదురు గాక.
ప్రజలు: ఆమెన్.
గురువు: సర్వదా మీకు సమాధానం కలుగును గాక
ప్రజలు:సర్వేశ్వరునికి వందనములు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి