అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు- రెండవ రోజు
అవిలాపురి తెరేసమ్మ
నవదిన ప్రార్ధనలు- రెండవ రోజు
అక్టోబర్ 7 •
దేవునిపై నమ్మకం: "దేవుడొక్కడే చాలు"
నిన్న మన హృదయంలో దేవుడు
నివసిస్తున్నాడని ధ్యానించాం. ఈ రోజు ఆ దేవునిపై నమ్మకం గురించి ధ్యానించుదాం. దేవుడు
మనలో ఉన్నాడని తెలిసినా, భయం, చింత మన హృదయాన్ని కదిలిస్తూనే ఉంటాయి. రేపటి గురించి భయం, పిల్లల భవిష్యత్తు
గురించి చింత, ఆరోగ్యం గురించి ఆందోళన, డబ్బు గురించి ఒత్తిడి. ఇవి లేని ఇల్లు
ఉండదు.
పునీత తెరేసమ్మ జీవితం కూడా ప్రశాంతమైనది కాదు. ఆమె అనారోగ్య సమస్యలతో పోరాడింది. తన సంస్కరణకు సొంత సభలోని వారి నుండే వ్యతిరేకత ఎదుర్కొంది. ఆమె రచనలను కొందరు అనుమానంతో చూశారు. మఠాలు కట్టడానికి డబ్బు లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఆమె హృదయంలో ఒక లోతైన శాంతి ఉండేది. ఆ శాంతి రహస్యం ఏమిటో ఆమె రాసుకున్న ప్రార్థనలో కనిపిస్తుంది.
వాక్యభాగం: కీర్తన 62:8
" జనులారా! మీరెల్లవేళల ప్రభువును నమ్ముడు.
మీ గోడులు ఆయనకు విన్నవించుకొనుడు. మనకు ఆశ్రయనీయుడు ఆయనే." అని కీర్తనకారుడు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ
రెండు పనులున్నాయి. ఒకటి, నమ్మకం ఉంచడం. రెండవది, హృదయాములోని అన్ని ప్రభువుకు అప్పగించడం.
అంటే మన భయాలను, బాధలను, ప్రశ్నలను దాచుకోకుండా దేవునికి చెప్పుకోవడం. నీటిని కుండలోంచి
కుమ్మరించినట్లు, మన హృదయంలోని భారాన్ని ఆయన ముందు ఖాళీ చేయమని పవిత్ర గ్రంధం చెబుతుంది
దేవునికి మన భయాలు తెలియవా? తెలుసు. అయినా మనం
ఆయనకు చెప్పుకోవాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే చెప్పుకోవడం అంటే ఆయనపై ఆధారపడటం.
పునీత సూక్తి: తెరేసమ్మ ప్రార్థనా గుర్తు
"ఏదీ నిన్ను కలవరపెట్టక, భయపెట్టకుండనిమ్ము.
సమస్తము గతించిపోవును. దేవుడొక్కడే ఉండును.
సహనము సమస్తమును సాధించును. దేవుడున్నవానికి లేమేముండదు. దేవుడొక్కడే చాలును."
ఈ మాటలను తెరేసమ్మ తన ప్రార్థనా పుస్తకంలో గుర్తుగా పెట్టుకున్న
కాగితం మీద రాసుకుందని సంప్రదాయం చెబుతుంది. ఈ రోజు ప్రపంచమంతా ఈ ప్రార్థనను
చదువుతోంది. ఇది ఎంతో సరళంగా ఉన్నా,
లోతైన విశ్వాసంతో నిండి ఉంది. ఒక్కో వాక్యాన్ని కొద్దిగా
ధ్యానిద్దాం.
"ఏదీ నిన్ను కలవరపెట్టనియక , భయపెట్టనియక ఉండనిమ్ము"
ఇది ఒక ఆజ్ఞలా అనిపించవచ్చు. కానీ
నిజానికి ఇది ఒక ఆహ్వానం. భయపడకూడదని తెరేసమ్మ చెప్పడం లేదు, భయం మనలను పాలించకూడదని చెబుతోంది. భయం
వచ్చినప్పుడు దాన్ని దేవుని ముందుకు తీసుకురావాలి. మన హృదయంలో భయం ఉన్నప్పుడు కూడా
దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకోవాలి.
"సమస్తము గతించిపోవును"
ఈ రోజు మనలను కృంగదీసే సమస్య ఏదైనా సరే, ఒకనాడు అది
గతంలోకి పోతుంది. మీరు పదేళ్ళ క్రితం ఎంతో భయపడిన విషయాలను ఇప్పుడు
గుర్తుచేసుకోండి. వాటిలో చాలా వరకు ఇప్పుడు మీ మనసులో లేవు. కష్టం శాశ్వతం కాదు.
అలాగే సుఖాలు కూడా శాశ్వతం కావు. ఈ లోకంలో ఉన్నవన్నీ మారిపోతాయి. కాబట్టి వాటిపై
మన నమ్మకాన్ని పెట్టకూడదు.
"దేవుడు మారడు"
అన్నీ మారే ఈ లోకంలో ఒక్కటి మాత్రం
మారదు: దేవుని ప్రేమ. నీ ఆరోగ్యం మారవచ్చు, నీ ఉద్యోగం మారవచ్చు, మనుషుల ప్రవర్తన
మారవచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమించడం మానడు. ఈ సత్యమే మన శాంతికి పునాది.
తుఫాను వచ్చినప్పుడు లంగరు వేసిన నావ కొట్టుకుపోదు. దేవుని మారని ప్రేమే మన లంగరు.
"సహనము సమస్తము సాధిస్తుంది"
దేవుని సమయం మన సమయం కాదు. మనం
ప్రార్థిస్తాం, వెంటనే సమాధానం కావాలనుకుంటాం. కానీ దేవుడు తన సమయంలో, తన పద్ధతిలో పని
చేస్తాడు. తెరేసమ్మ తన సంస్కరణను పూర్తి
చేయడానికి ఇరవై ఏళ్ళు పట్టింది. ఆ సమయమంతా ఆమె సహనముతో, నమ్మకంతో
ఎదురుచూసింది. సహనము అంటే ఏమి చేయకపోవడం కాదు.
ప్రార్థిస్తూ, ప్రయత్నిస్తూ, ఫలితాన్ని దేవునికి వదిలేయడం.
"దేవుడొక్కడే చాలు"
ఇది వాక్యాలలో ముఖ్యమైనది ఇదే. మనకు
ఉన్నవన్నీ పోయినా, దేవుడు ఉంటే చాలు అని తెరేసమ్మ చెబుతుంది. ఇది సులభమైన మాట కాదు. మనకు డబ్బు
కావాలి, ఆరోగ్యం
కావాలి, మనుషుల
ప్రేమ కావాలి. అవి కావాలనుకోవడం తప్పు కాదు. కానీ వాటన్నిటికంటే దేవుడు గొప్పవాడని, ఆయన లేకుండా
అవన్నీ ఉన్నా మనం ఏమి లేనివారిగానే ఉంటామని ఈ మాట గుర్తుచేస్తుంది. దేవుడు
ఉన్నప్పుడు మిగిలినవన్నీ తమ స్థానంలో నిలుస్తాయి.
మన కుటుంబాల్లో ఈ నమ్మకం
ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఉద్యోగం
పోయినప్పుడు, పిల్లలు దారి తప్పినప్పుడు మనకు భయం కలుగుతుంది. అలాంటి సమయాల్లో
కుటుంబమంతా కలిసి ఈ ప్రార్థనను చదవవచ్చు. పెద్దవారు దీన్ని కంఠస్థం చేసి, పిల్లలకు కూడా
నేర్పవచ్చు. ఈ చిన్న ప్రార్థన మనకు తెలియకుండానే హృదయంలో ధైర్యం నింపుతుంది.
నమ్మకం అంటే సమస్యలు లేవని నటించడం కాదు.
సమస్యలు ఉన్నాయి, కానీ దేవుడు వాటికంటే గొప్పవాడు అని విశ్వసించడం. అబ్రహాము, మోషే, మరియమాత అందరూ తమకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా
దేవుణ్ణి నమ్మారు. మన విశ్వాసం కూడా అలా ఎదగాలి.
తెరేసమ్మ నమ్మకం పరీక్షకు వచ్చిన క్షణాలు
తెరేసమ్మ మొదటి సంస్కరణ మఠాన్ని అవిలాలో స్థాపించినప్పుడు
పట్టణమంతా ఆమెను వ్యతిరేకించింది. ఆమె ఏదో ప్రమాదకరమైన పని చేస్తోందని కొందరు అనుకున్నారు.
మఠం స్థాపనను ఆపమని ఒత్తిడి వచ్చింది. చివరికి ఆమెను కొంతకాలం మఠానికి దూరంగా
ఉంచారు కూడా. ఆ సమయంలో ఆమెకు డబ్బు లేదు, అనుమతులు లేవు, మద్దతు ఇచ్చేవారు
తక్కువ. అయినా ఆమె తన నమ్మకాన్ని విడవలేదు. దేవుడు తనను పిలిచాడని, ఆయన పని
పూర్తిచేస్తాడని ఆమె నమ్మింది.
తరువాతి సంవత్సరాల్లో ఆమె స్పెయిన్
దేశమంతా కాలినడకన, బండ్లలో ప్రయాణిస్తూ కొత్త మఠాలు స్థాపించింది. ఎండ, వానలో చేసిన ఆ
ప్రయాణాలు ఆమె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీశాయి. అయినా ప్రతి సంక్షోభంలోనూ ఆమె
హాస్యాన్ని, ప్రశాంతతను కోల్పోలేదు. ఎందుకంటే ఆమె భద్రత తన సామర్థ్యంలో లేదు, దేవునిలో ఉంది. ఈ
నమ్మకమే ఆమె ప్రార్థనా గుర్తులోని ప్రతి వాక్యాన్ని బలపరుస్తుంది.
తెరేసమ్మ చెప్పిన ఈ మాటలు సువార్త బోధనకు ప్రతిధ్వని
మాత్రమే. కొండమీద ప్రసంగంలో యేసు ప్రభువు
"రేపటి గురించి చింతించకండి" అని చెప్పాడు. ఆకాశపు పక్షులను, పొలంలోని పూలను
చూడమన్నాడు. అవి విత్తవు, కోయవు, అయినా పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంతకంటే ఎన్నో రెట్లు
విలువైన మనలను ఆయన ఎలా విడిచిపెడతాడు? ఇంకా, శిష్యులతో వీడ్కోలు తీసుకునే సమయంలో ఆయన
"మీ హృదయం కలవరపడకూడదు, భయపడకూడదు" అని చెప్పి తన శాంతిని వారికి ఇచ్చాడు. ఆ శాంతి లోకం
ఇచ్చే శాంతి వంటిది కాదు.
చింతను ప్రార్థనగా మార్చుకోవడం
చింత అంటే భవిష్యత్తును మన చేతిలో
పెట్టుకుని నియంత్రించాలని ప్రయత్నించడం. కానీ మన చేతిలో లేనిది ఎంత ప్రయత్నించినా
మన చేతికి రాదు. అందుకే చింత మనలను అలసటకు గురిచేస్తుంది. ప్రార్థన దీనికి
విరుగుడు. చింత వచ్చినప్పుడల్లా దాన్ని ఒక ప్రార్థనగా మార్చుకోండి. "ప్రభువా, ఈ విషయం నా చేతిలో
లేదు. నా వల్ల అయినంత నేను చేస్తాను, మిగిలినది నీకు అప్పగిస్తున్నాను"
అని చెప్పండి. తరువాత మీరు చేయగలిగిన పని చేయండి, మిగిలినదాన్ని ఆయనకు వదిలేయండి.
ఇది ఒక్కసారి చేసే పని కాదు. అదే చింత రేపు మళ్ళీ రావచ్చు. అప్పుడు మళ్ళీ అదే ప్రార్థన చేయండి. తెరేసమ్మ చెప్పినట్లు సహనంతో ఈ అలవాటును కొనసాగిస్తే, క్రమంగా మీ హృదయంలో శాంతి నిలుస్తుంది. నమ్మకం ఒక కండరం లాంటిది. ఎంత ఎక్కువగా వాడితే అంత బలపడుతుంది.
అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు రెండవ రోజు
గురువు: పిత, పుత్ర , పవిత్రాత్మ
నామమున. : ప్రజలు: ఆమెన్.
గురువు: ప్రభువు మీతో ఉందురు గాక ప్రజలు: మీ ఆత్మతోను ఉందురు గాక
గురువు: ప్రియ సహోదరి సహోదరులారా, నిన్న మన హృదయంలో
దేవుడు నివసిస్తున్నాడని ధ్యానించాం. ఈ రోజు భయం, చింతల మధ్య దేవునిపై నమ్మకం ఉంచడం, "దేవుడొక్కడే
చాలు" అని చెప్పడం నేర్చుకుందాం.
గురువు: ప్రార్ధించుదము:
ప్రేమస్వరూపుడవైన తండ్రీ, నీవు ఎన్నడూ మారని దేవుడవు. అవిలాపురి తెరేసమ్మ
శ్రమలు, బాధలు, అనారోగ్యంలో కూడా నిన్ను
నమ్మి శాంతితో జీవించింది. మా భయాలను, చింతలను నీలో ఉంచి, నీవొక్కడే చాలు
అని చెప్పగల విశ్వాసాన్ని మాకు ప్రసాదించు. మా
ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవిని వేడుకుంటున్నాము.
ప్రజలు: ఆమెన్.
వాక్య పఠనం
(కీర్తన 62:8): “జనులారా! మీరెల్లవేళల ప్రభువును నమ్ముడు. మీ
గోడులు ఆయనకు విన్నవించుకొనుడు. మనకు ఆశ్రయనీయుడు ఆయనే.”
పఠకుడు: ఇది ప్రభువు వాక్కు .
ప్రజలు: సరేశ్వరునికి వందనములు .
(కొద్దిసేపు మౌనం)
నమ్మకం గురించి విన్నపాలు
గురువు:
ప్రభువా భయాలు మా హృదయాన్ని
కదిలించినప్పుడు.
ప్రజలు: నీ సన్నిధిలో మా హృదయాలను ఉంచి, ఏ
పరిస్థితిలోను తోట్రిల్లని ధైర్యాన్ని
ప్రసాదించు.
గురువు: ప్రభువా! రేపటి గురించి,
మా బిడ్డల భవిష్యత్తు
గురించి చింతించే సమయాలలో.
ప్రజలు: అన్నీ నీ చేతికి అప్పగించే
నమ్మకం ఇవ్వు.
గురువు: సమస్తము మారిపోయే ఈ లోకంలో
ప్రజలు: ప్రభువా, మారని నీ ప్రేమలో
మమ్మల్ని నిలబెట్టు.
పునీతురాలి సూక్తి
గురువు: అవిలాపురి పునీత తెరేసమ్మ తన పార్ధనా పుస్తకంలో
"ఏదీ నిన్ను కలవరపెట్టనియక, భయపెట్టక
ఉండనిమ్ము సమస్తము గతించిపోవును. దేవుడొక్కడే ఉండును. సహనము సమస్తమును సాధించును. దేవుడున్నవానికేలోటుండదు.
దేవుడొక్కడే చాలును." అని రాసుకున్నది.
గురువు: ఏదీ మమ్ము కలవరపెట్టనియక, భయపెట్టనియకుండ చేయుము.
ప్రజలు: ప్రభువా, భయం మమ్మల్ని
పాలించకుండా కాపాడు.
గురువు: అన్నీ గతించిపోవును, దేవుడొక్కడే
మారకుండును.
ప్రజలు: ప్రభువా, నీ మారని
ప్రేమతో మమ్ము ఎల్లప్పుడు కరుణించు.
గురువు: సహనము సమస్తమును సాధించును
ప్రజలు: ప్రభువా, నీవు నిర్ణయించిన
సమయం కోసం ఎదురుచూసే సహనము మాకిమ్ము.
గురువు: అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో
బాధపడే కుటుంబాల కోసం.
ప్రజలు: ప్రభువా, వారికి నీ శాంతిని
ప్రసాదించు.
గురువు: భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న
యువత కోసం.
ప్రజలు: ప్రభువా, నీ ప్రణాళికపై
వారికి నమ్మకం ఇమ్ము.
గురువు: ఒంటరిగా భయపడుతున్న వృద్ధుల
కోసం.
ప్రజలు: ప్రభువా, వారికి తోడుగా
ఉండు.
ఆత్మపరిశీలన (గురువు నెమ్మదిగా
చదువుతాడు)
గురువు: ఈ రోజు నన్ను ఎక్కువగా
భయపెడుతున్న విషయం ఏమిటి? (మౌనం)
ఆ విషయాన్ని నేను దేవునికి నిజంగా
అప్పగించానా, లేక నేనే మోస్తూ ఉన్నానా? (మౌనం)
"దేవుడొక్కడే చాలు" అని
చెప్పడానికి నాకు ఏది అడ్డుగా ఉంది?
(మౌనం)
గురువు: ప్రార్ధించుదము
అందరూ: కరుణామయుడైన దేవా, నా భవిష్యత్తు
గురించి, నా కుటుంబం గురించి,
నా అవసరాల గురించి నేను భయపడుతున్నాను. అన్నిటినీ నీ చేతికి
అప్పగిస్తున్నాను. పునీత తెరేసమ్మ లాగా, నీ ప్రేమను నమ్మి, ముందుకు సాగే ధైర్యాన్ని ప్రసాదించు. పునీత తెరేసమ్మ గారా, మా నమ్మకం
బలహీనపడినప్పుడు మాకు తోడుగా ఉండండి. ఆమెన్.
మధ్యవర్తిత్వ విన్నపాలు
గురువు: అవిలాపురి తెరేసమ్మ ప్రజలు : మా కోసం
ప్రార్థించండి.
గురువు:
తిరుసభ ప్రార్థనా గురువా, ప్రజలు
: మా కోసం ప్రార్థించండి.
గురువు: శ్రీ సభ పండితురాలా, ప్రజలు : మా కోసం ప్రార్థించండి.
గురువు: కార్మెల్ సభ సంస్కర్తా, ప్రజలు : మా కోసం ప్రార్థించండి.
గురువు: ప్రభువు ప్రేమలో జ్వలించిన ఆత్మా,
ప్రజలు : మా కోసం ప్రార్థించండి.
వ్యక్తిగత విన్నపాలు
గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదినాలలో మనం
అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం, లేదా ప్రజలు తమ
ఉద్దేశ్యాలను పలకవచ్చు)
గురువు: ప్రభువా, మా ఈ మనవులను
ఆలకించండి.
ప్రజలు: ఆమెన్.
గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం కలిసి
ప్రార్థిద్దాం.
అందరూ: పరలోక జపం, మంగళ వార్త జపం, త్రిత్వ స్తోత్రం
గురువు: ప్రార్ధించుదము
ప్రేమమయుడైన దేవా, పునీత తెరేసమ్మ
చూపిన నమ్మకపు మార్గంలో నడిచి,
మా అనుదిన జీవిత భయాలు, చింతలు, అభద్రతల మధ్య కూడా నీ శాంతిని కనుగొనే
వరం మాకు ప్రసాదించమని, మా ప్రభువైన యేసు క్రీస్తు
ద్వారా వేడుకుంటున్నాము.
ప్రజలు: ఆమెన్.
గురువు: ఈ రోజు సంకల్పం: ఈ రోజు
మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే విషయాన్ని పేరుతో దేవునికి అప్పగించండి. రోజులో భయం
వచ్చినప్పుడు "దేవుడొక్కడే చాలు" అని మనసులో చెప్పుకోండి.
గురువు: ప్రభువు మీతో ఉండును గాక.
ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక
గురువు: సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర పవిత్రాత్మ
మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక!
ప్రజలు: ఆమెన్.
గురువు: సమాధనముతో వెళ్లుము .
ప్రజలు: దేవునికి కృతజ్ఞతలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి