అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు - మూడవ రోజు

 అక్టోబర్ 8 • పునీత యోసేపు, దేవుని ప్రణాళిక

మౌనంగా నడిచిన ఒక తండ్రి-  పునీత యోసేపు

మొదటి రోజు మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని ధ్యానించాం. రెండవ రోజు ఆయనపై నమ్మకం ఉంచాలని నేర్చుకున్నాం. ఈ రోజు ఆ నమ్మకంతో నడిచిన ఒక గొప్ప వ్యక్తిని చూద్దాం. ఆయనే పునీత యోసేపుగారు. పునీత యోసేపు గారు  సువార్తలలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా ఆయన జీవితం అనేక పుస్తకాల కంటే ఎక్కువ బోధిస్తుంది. పునీత తెరేసమ్మ  ఆయనను తన ప్రత్యేక రక్షకునిగా, ప్రార్థనా గురువుగా భావించింది. ఆమె సంస్కరణ కార్యక్రమమంతా పునీత యోసేపు రక్షణలోనే సాగింది.

వాక్యభాగం: యిర్మీయా 29:11, మత్తయి 1:24

దేవుడు మన క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు ఆయనకు  మాత్రమే తెలుసు. దేవుడు మన  అభివృద్ధినేగాని వినాశనమును కోరడు. మనకు బంగారు భవిష్యత్తును నిర్ణయించానని ప్రభువు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పాడు.  ఈ మాటలు నిజానికి బాబిలోనియాలో బందీలుగా ఉన్నవారికి చెప్పబడ్డాయి. తమ జీవితం ముగిసిపోయిందనుకున్న వారికి దేవుడు ఇచ్చిన భరోసా ఇది. మన జీవితంలో కూడా అర్థం కాని కష్టాలు వచ్చినప్పుడు దేవునికి మన జీవితం మీద ఒక మంచి ప్రణాళిక ఉందనే నమ్మకాన్ని ఈ వాక్యం బోధిస్తుంది.

మత్తయి 1:24లో పునీత  యోసేపు కలలో దేవదూత చెప్పినట్లుగా  చేశాడని చదువుతాం. మరియమాత గర్భవతి అని తెలిసినప్పుడు ఆయన హృదయంలో ఎంత సంఘర్షణ ఉండి ఉంటుందో ఊహించండి. అయినా ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు ఆయన మరియమాతను  తన ఇంటికి తీసుకువెళ్లాడు. ప్రశ్నించలేదు, వాదించలేదు. నిశ్శబ్దంగా విధేయత చూపాడు. ఇదే ఆయన గొప్పతనం.

తెరేసమ్మ  మరియు పునీత యోసేపు

తెరేసమ్మ  యువతిగా ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై, కొంతకాలం శరీరం మొత్తం  చచ్చుబడిపోయి కదలలేని స్థితిలో ఉంది. వైద్యులు నిస్సహాయులయ్యారు. అప్పుడు ఆమె పునీత యోసేపు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఆమె తన స్వీయ చరిత్రలో రాసినట్లు, ఆయన సహాయంతో ఆమె క్రమంగా కోలుకుంది. ఆ అనుభవం ఆమె జీవితాంతం ఆయన పట్ల భక్తిని నింపింది.

తరువాత ఆమె కార్మెల్ సభను సంస్కరిస్తున్నప్పడు తన మొదటి సంస్కరణ మఠాన్ని  అవిలాలో పునీత యోసేపు పేరు మీదే స్థాపించింది. ఆమె స్థాపించిన అనేక మఠాలు ఆయన రక్షణలో ఉంచబడ్డాయి. ఆ సమయంలో పునీత యోసేపు పట్ల భక్తి ఇప్పటిలా తిరుసభలో అంత విస్తృతంగా లేదు. తెరేసమ్మ  తన రచనల ద్వారా, తన ఉదాహరణ ద్వారా ఆయన పట్ల భక్తిని తిరుసభలో వ్యాపింపజేయడానికి గొప్పగా సహాయపడింది.

పునీత సూక్తి

"ఆయనను నేను ఏదైనా అడిగిన తరువాత, ఆయన ఇవ్వకుండా ఉన్న సందర్భం నాకు గుర్తులేదు." తెరేసమ్మ  జీవిత చరిత్ర నుంచి తీసుకొనబడింది.

ఇది ఒక సాక్షి చెప్పే మాట. తెరేసమ్మ  తన అనుభవం నుండి చెబుతోంది. నా ఈ మాటను నమ్మకుండా పరీక్షించి చూడమని మనకు సలహా ఇస్తుంది. అంటే ఆమె మనలను సవాలు చేస్తోంది: మీరూ ఆయనను నమ్మి అడిగి చూడండి. ఇది యోసేపు దేవుడు అని కాదు. ఆయన దేవుని పరిచర్యలో నమ్మకంగా నిలిచినవాడు, కాబట్టి ఆయన విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడని తిరుసభ నమ్ముతుంది.  

యోసేపు మౌనం  నుండి నేర్చుకోవడం

మన కాలం శబ్దాల కాలం. అందరూ మాట్లాడుతున్నారు, అందరికీ అభిప్రాయాలున్నాయి. కానీ యోసేపు మౌనం ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం. ఆయన నిశ్శబ్దం బలహీనత కాదు, అంతరంగ బలం. ఆయన తన మనసును దేవుని వైపు తెరిచి ఉంచాడు. అందుకే కలలో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వినగలిగాడు. నిశ్శబ్దంలోనే దేవుని స్వరం వినిపిస్తుందని ఆయన జీవితం చూపిస్తుంది.

ఈ మౌనం మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనం ప్రతి విషయంలో వెంటనే స్పందించాలనుకుంటాం. వాదిస్తాం, సమర్థించుకుంటాం, ఫిర్యాదు చేస్తాం. కానీ కొన్నిసార్లు ఆగి, ప్రార్థించి, దేవుడు ఏమి కోరుతున్నాడో వినడం ఉత్తమం. కుటుంబంలో గొడవ జరిగినప్పుడు, పనిలో అన్యాయం జరిగినప్పుడు కూడా కొద్దిసేపు మౌనంగా ప్రార్థించిన తరువాత మాట్లాడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.

అర్థం కాని ప్రణాళికలో విధేయత

యోసేపు జీవితంలో ప్రతి మలుపు ఆయన ఊహించనిదే. కాబోయే భార్య గర్భవతి అయింది. బేత్లెహేములో ఉండటానికి చోటు దొరకలేదు. రాత్రికి రాత్రే ఈజిప్టుకు పారిపోవాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్ళ తరువాత తిరిగివచ్చి నజరేతులో స్థిరపడ్డాడు. ఈ ప్రతి సందర్భంలోనూ ఆయనకు పూర్తి విషయం తెలియదు. కేవలం అప్పటికప్పుడు వేయవలసిన  అడుగు మాత్రమే తెలుసు. అయినా ఆయన నమ్మకంగా ఆ అడుగు వేశాడు.

మన జీవితం కూడా అంతే. మనకు ఐదేళ్ళ తరువాత ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు వచ్చిన కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాకపోవచ్చు. విశ్వాసం అంటే అన్నీ అర్థమవడం కాదు, అర్థం కాకపోయినా దేవుని ప్రణాళికను నమ్మడం. యోసేపు నుండి మనం నేర్చుకునేది ఇదే. తదుపరి అడుగు స్పష్టంగా ఉన్నప్పుడు దాన్ని విధేయతతో వేయండి. మిగిలినది దేవుడు చూసుకుంటాడు.

ఇంటి పెద్దలకు, శ్రామికులకు యోసేపు ఆదర్శం

యోసేపు వడ్రంగి పని చేసేవాడు. తన చేతి కష్టంతో కుటుంబాన్ని పోషించాడు. ఇంటి పెద్దలకు, తండ్రులకు ఆయన గొప్ప ఆదర్శం. అతను తన కుటుంబాన్ని రక్షించాడు, పోషించాడు, ప్రేమించాడు. యేసు ప్రభువు యోసేపు వద్ద పని నేర్చుకున్నాడని సంప్రదాయం చెబుతుంది. అంటే దైవకుమారుడు ఒక సాధారణ శ్రామికుని వద్ద శిష్యరికం చేశాడు. కాబట్టి మన రోజువారీ శ్రమ దేవుని దృష్టిలో విలువైనదే.

మీరు రైతు కావచ్చు, కూలీ కావచ్చు, ఉద్యోగి కావచ్చు, గృహిణి కావచ్చు. మీ పనిని యోసేపులా నమ్మకంగా, నిజాయితీగా, దేవుని పేరట చేయండి. ఆయన పేరు మీద మన కుటుంబాలను, పనులను, ఉద్యోగాలను అప్పగించవచ్చు. సంఘం ఆయనను సార్వత్రిక శ్రీ సభ  రక్షకునిగా, కుటుంబాల రక్షకునిగా, శ్రామికుల పోషకునిగా గౌరవిస్తుంది.

పవిత్ర కుటుంబం: మన గృహాలకు  నమూనా

నజరేతులోని ఇల్లు చాలా సాధారణమైనది. అక్కడ ధనం లేదు, పేరు ప్రతిష్ఠలు లేవు. కానీ ఆ ఇంట్లో ప్రార్థన ఉంది, పరస్పర గౌరవం ఉంది, దేవుని చిత్తం పట్ల విధేయత ఉంది. తండ్రి యోసేపు కష్టపడి పని చేశాడు. మరియమాత  ఇంటిని ప్రేమతో నడిపించింది. బాల యేసు వారి మధ్య జ్ఞానంలో, వయసులో పెరిగాడు. మన కుటుంబాలు ఈ నమూనా వైపు చూడాలి. ఇంటి ఐశ్వర్యం కంటే ఇంటి ఆత్మీయత  ముఖ్యం. పిల్లలు తల్లిదండ్రుల ప్రార్థనను చూసి నేర్చుకుంటారు, తండ్రి విధేయతను చూసి విశ్వాసాన్ని నేర్చుకుంటారు.

కష్టకాలంలో పునీత  యోసేపును ఆశ్రయించడం

తిరుసభ సంప్రదాయంలో పునీత యోసేపు ఎన్నో అవసరాలలో సహాయకుడిగా పిలవబడతాడు. ఇంటి అవసరాల కోసం, ఉద్యోగం కోసం, పనిలో నిజాయితీ కోసం, కుటుంబ సమాధానం కోసం ఆయనను అడగవచ్చు. మరణ సమయంలో యేసు మరియమాత చేతుల్లో కన్నుమూశాడని సంప్రదాయం చెబుతుంది కాబట్టి, మంచి మరణం కోసం కూడా ఆయన విజ్ఞాపనను కోరతారు. మనం ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన మనలను యేసు ప్రభువు  దగ్గరకే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ప్రధానమైన వారు యేసు ప్రభువు, మరియమాతే.

దేవుని ప్రణాళికను నమ్మడానికి మూడు అడుగులు

మొదటి అడుగు: ప్రార్థనలో వినండి. నిర్ణయాలు తీసుకునే ముందు కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండండి. ఆయన మన హృదయంలో శాంతి ద్వారా దేవుడే  మార్గం చూపిస్తాడు. రెండవ అడుగు: సలహా తీసుకోండి. యోసేపు కూడా దేవదూత ద్వారా వచ్చిన సూచనను నమ్మాడు. మనం కూడా మన గురువుల నుండి, విశ్వాసంలో పెద్దవారి నుండి సలహా పొందవచ్చు. మూడవ అడుగు: ఆలస్యం చేయకుండా, భయపడకుండా దేవుడు చూపిన పని చేయండి. ఫలితాన్ని ఆయనకు వదిలేయండి. ఈ మూడు అడుగులు యోసేపు జీవితంలో కనిపిస్తాయి.

ఒక్క విషయం మనం మరచిపోకూడదు. దేవుని ప్రణాళిక అంటే మన కష్టాలన్నీ మాయమవడం కాదు. యోసేపు, మరియమాత  కూడా కష్టాలు అనుభవించారు. కానీ ఆ కష్టాల మధ్య దేవుడు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మనలను కూడా విడిచిపెట్టడు.

తెరేసమ్మ  సవాలును స్వీకరించండి

తెరేసా తన మాటను కేవలం వినమని కాదు, పరీక్షించి చూడమని చెబుతుంది. అంటే పునీత యోసేపు పట్ల భక్తి కేవలం ఒక సంప్రదాయం కాదు, అనుభవించి తెలుసుకోవలసిన విషయం. ఈ నవదినాలలో మీ కుటుంబంలోని ఒక ప్రత్యేక అవసరాన్ని ఆయనకు అప్పగించండి. అది ఒక ఉద్యోగ అవసరం కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు, ఒక ఆరోగ్య అవసరం కావచ్చు. తొమ్మిది రోజులూ విశ్వాసంతో అడగండి. దేవుడు తగిన సమయంలో సమాధానమిస్తాడు.

ఈ భక్తిలో కొత్త ఆచారాలు ఏవీ అవసరం లేదు. ప్రతిరోజూ ఒక చిన్న ప్రార్థన చాలు. ఆయన నిశ్శబ్దంగా మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఆయన జీవితము లాగే, ఆయన సహాయం కూడా ఆడంబారాలులేకుండా, నమ్మకంగా ఉంటుంది.

తిరుసభలో  పునీత యోసేపు స్థానం

1870లో తొమ్మిదవ భక్తినాధపోపు గారు,  పునీత యోసేపును సార్వత్రిక శ్రీ సభ  పోషకునిగా ప్రకటించారు. 2020 డిసెంబర్ 8న పోపు ఫ్రాన్సిస్ పునీత యోసేపు సంవత్సరాన్ని ప్రకటించారు. అప్పుడు రాసిన లేఖలో ఆయన యోసేపును ప్రేమించే తండ్రిగా, విధేయతగల తండ్రిగా, పనిచేసే తండ్రిగా, వర్ణించారు. అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం తెరేసమ్మ  చూపిన భక్తి నేటికీ శ్రీసభకు ఆదర్శంగానే ఉంది.

అవిలాపురి  తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు: మూడవ రోజు (అక్టోబర్ 8)

 దేవుని ప్రణాళికను అమలుపరచడం, పునీత యోసేపు

 గురువు: పిత, పుత్ర , పవిత్రాత్మ,  నామమున     ప్రజలు: ఆమెన్.

 గురువు: ప్రభువు, మీతో ఉండును గాక.            ప్రజలు: మీ ఆత్మతో ఉండును గాక

గురువు: ప్రియ సహోదరి,  సహోదరులారా, ఈ రోజు పునీత యోసేపు మౌన విధేయతను ధ్యానిద్దాం. తెరేసమ్మ  ఆయనను తన ప్రత్యేక రక్షకునిగా, ప్రార్థనా గురువుగా భావించింది. అర్థం కాని ప్రణాళికలో కూడా దేవుణ్ణి నమ్మడం ఆయన నుండి నేర్చుకుందాం.

గురువు: ప్రార్ధించుదము

ప్రేమమయుడవైన  తండ్రీ, నీ చిత్తాన్ని మౌనంగా, విధేయతతో నెరవేర్చిన పునీత యోసేపును నీ కుమారునికి, మరియమాతకు  సంరక్షకునిగా ఇచ్చావు. తెరేసమ్మ  ఆయన సంరక్షణలో నమ్మకం ఉంచినట్లు, మేము కూడా అర్థం కాని మార్గాల్లో నీ ప్రణాళికను నమ్మి నడిచేలా మా హృదయాలను సిద్ధం చేయమని  మా  ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

వాక్య పఠనం

పఠకుడు (యిర్మీయా 29:11): నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినేగాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని.

పఠకుడు: ఇది ప్రభువు వాక్కు          అందరు: సర్వేశ్వరునికి వందనములు

పఠనకుడు (మత్తయి 1:24): నిదురనుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను.

పఠకుడు : ఇది క్రీస్తు సువిశేషం          అందరు: క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక

 (కొద్దిసేపు మౌనం)

 దేవుని ప్రణాళిక గురించి విన్నపాలు

 గురువు: ప్రభువా! మా జీవితంలో నీ ప్రణాళిక అర్థం కానప్పుడు.

ప్రజలు: నిన్ను నమ్మి నడిచే మనసు ఇవ్వుము.

 గురువు: తొందరపాటుతో వాదించి, ఫిర్యాదు చేసే సమయాలలో .

ప్రజలు: ప్రభువా, మౌనంగా వినే హృదయం ఇవ్వుము .

 గురువు: తక్షణమే  మేము చేయవలసిన పని మాత్రమే కనిపించే సమయంలో .

ప్రజలు: ప్రభువా, మీ మీద విధేయతతో ముందుకు సాగే  ధైర్యం ఇవ్వు.

పునీత సూక్తి

గురువు: అవిలాపురి  తెరేసమ్మ , "ఆయనను నేను ఏదైనా అడిగి, ఆయన ఇవ్వకుండా ఉన్న సందర్భం నాకు గుర్తులేదు." అని పునీత యోసేపు గారి గురించి రాసింది. (తెరేసమ్మ  స్వీయ చరిత్ర)

గురువు: తెరేసమ్మ అనారోగ్యంలో యోసేపు  సహాయాన్ని అనుభవించింది.

ప్రజలు: ప్రభువా, మా అవసరాలలో, తిరుసభ అవసరాలలో  పునీత యోసేపు  విజ్ఞాపనను ఆలకించు.

గురువు: తెరేసమ్మ  తన మొదటి మఠాన్ని యోసేపు  పేరు మీద స్థాపించింది.

ప్రజలు: ప్రభువా, మా కుటుంబాలను, మీ తీరు కుటుంబం వలె   పునీత యోసేపు  సంరక్షణలో  ఉంచుము.

గురువు: "నమ్మి ప్రయత్నించి చూడండి" అని తెరేసమ్మ  మనల్ని  ఆహ్వానించింది.

ప్రజలు: ప్రభువా యోసేపు పట్ల నమ్మకమైన భక్తిని మాకు ఇవ్వుము.

గురువు: తమ కుటుంబాలను పోషించడానికి కష్టపడే తండ్రుల కోసం.

ప్రజలు: ప్రభువా, వారికి యోసేపులా నమ్మకంగా ఉండే శక్తి ఇవ్వుము.

గురువు: ఉద్యోగం లేక, పని దొరక్క బాధపడే వారి కోసం.

ప్రజలు: ప్రభువా, వారికి నీ ప్రణాళికలో ఆశ ఇవ్వుము.

గురువు: మా ఇళ్ళలో, కుటుంబ శాంతి కోసం.

ప్రజలు: ప్రభువా, పవిత్ర కుటుంబం వంటి ప్రేమను మా ఇళ్ళలో నింపుము.

 ఆత్మపరిశీలన (గురువు నెమ్మదిగా చదివి, ప్రతి ప్రశ్న తరువాత కొద్దిసేపు మౌనం)

గురువు: దేవుని ప్రణాళిక నాకు అర్థం కానప్పుడు నేను ఎలా స్పందిస్తున్నాను: ఫిర్యాదు చేస్తున్నానా, లేక విధేయతతో నమ్ముతున్నానా? (మౌనం)

నా రోజులో నిశ్శబ్దంగా దేవుని స్వరం వినడానికి ఎంత సమయం ఉంది? (మౌనం)

నా కుటుంబాన్ని, నా పనిని పునీత యోసేపు రక్షణకు అప్పగించానా? (మౌనం)

 నేటి ప్రార్థన

గురువు: ప్రార్ధించదము.

అందరు: ప్రభువా, మా జీవితంలో నీ ప్రణాళిక ఏమిటో మాకు తరచు అర్థం కాదు. పునీత యోసేపు లాగా మౌనంగా, విధేయతతో నీ మార్గంలో నడిచే మనసు ఇవ్వు. తెరేసమ్మ ప్రార్థించినట్లు, ఆయన మధ్యవర్తిత్వంతో మా కుటుంబాలను, మా పనులను నీ సంరక్షణలో ఉంచుము. ఆమెన్.

 మధ్యవర్తిత్వ విన్నపాలు

 గురువు: పునీత అవిలాపూరి  తెరేసమ్మ,              ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

 గురువు:  తిరుసభ ప్రార్థనా గురువా,                    ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

 గురువు: తిరుసభ  పండితురాలా,                       ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

 గురువు: కార్మెల్  సభ సంస్కర్తా,                        ప్రజలు : మా కోసం ప్రార్థించండి.

 గురువు: యేసు ప్రభువు  ప్రేమలో జ్వలించిన ఆత్మా,  ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

 వ్యక్తిగత విన్నపాలు

గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదినప్రార్ధనలలో మనం అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం, లేదా ప్రజలు తమ ఉద్దేశ్యాలను పలకవచ్చు)

గురువు: ప్రభువా, మాఈ  మనవులను  ఆలకించండి.

ప్రజలు: ఆమెన్.

గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం మనం కలిసి ప్రార్థిద్దాం.

అందరూ: పరలోక జపం, మంగళవార్త  జపం, త్రిత్వ స్తోత్రం

ముగింపు

గురువు: ప్రార్ధించుదము. ప్రేమమయుడైన ప్రభువా, పునీత యోసేపు విధేయతను, అవిలాపురి తెరేసమ్మ  నమ్మకాన్ని అనుసరించి, నీ ప్రణాళికలో శాంతితో నడిచే వరం మాకు ప్రసాదించమని, మా  ప్రభువైన యేసు క్రీస్తు నామమున  వేడుకుంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

గురువు: ఈ రోజు సంకల్పం: "యేసు ప్రభువుని సాకుడు  తండ్రీ యోసేపా, నా కోసం ప్రార్థించండి" అని ఈ రోజు ఒకసారి జపించండి. మీ జీవితంలో అర్థం కాని ఒక సంగతిని ఆయనకు అప్పగించండి.

గురువు: ప్రభువు మీతో  ఉండుగాక.      ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక  

గురువు: సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ  మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక.

ప్రజలు: ఆమెన్.

గురువు: సమాధనముతో వెళ్ళుము

ప్రజలు: దేవునికి కృతజ్ఞతలు.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి