నిత్య జీవము పొందుటకు ఏమి చేయాలి | Matthew 19:16-22 Telugu Homily - Carmel Shobha

 మత్తయి 19: 16-22

అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?"  అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము.  అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను. 

దేవుని మంచితనం – సకల సద్గుణాల నిధి

"నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమిటి ప్రభువా?" అని అడిగిన ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచివాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. లోకంలో మానవుడు చేసే 'మంచి' వెనుక ఏదో ఒక స్వార్థం, కీర్తి కాంక్ష లేదా ప్రతిఫలాపేక్ష దాగి ఉంటాయి. కానీ దేవుని మంచితనం నిష్కల్మషమైనది, పరిపూర్ణమైనది. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు. ఆయన స్వభావమే మంచితనం. మానవుని వలే దేవునిలో దురాలోచనలు, చేడు పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన ఉండదు. మానవ హృదయం పాపపు ప్రలోభాలకు లోనై అపవిత్రమవుతుంది, కానీ దేవుడు పవిత్రతకు నిలయం.

ఆయన సకల సద్గుణాల నిధి. సృష్టిలోని ప్రతి జీవి పట్ల ఆయనకు ఉన్నది అపారమైన కరుణ. ఆయన ఎల్లప్పుడూ ఇతరుల ఉన్నతిని, ముఖ్యంగా మానవాళి రక్షణను కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పరిశుద్ధ గ్రంథంలో పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన కేవలం ప్రేమిoచేవాడు మాత్రమే కాదు, 'ఆయనే ప్రేమ' అయి ఉన్నాడు. దైవిక ప్రేమకు, మానవ ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉంది. దేవుని ప్రేమ సమస్తమును భరిస్తుంది, ఓర్చుకుంటుంది, క్షమిస్తుంది. కానీ బలహీనుడైన మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఎంతమాత్రం ఓర్చుకోలేడు. చిన్న అవమానాన్ని కూడా భరించలేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతాడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా ఆయన వలే పవిత్రంగా ఉండాలని, ఆయన చూపిన ప్రేమ మార్గంలో నడవాలని కోరుతున్నాడు. మన జీవితాలలో కేవలం స్వార్థపూరిత మానవ స్వభావం కాక, నిష్కల్మషమైన దైవిక స్వభావం మనలో ప్రతిబింబించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

దైవాజ్ఞలు – నిత్యజీవానికి అర్హత మార్గాలు

యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపుమని చెబుతున్నారు. లోకసంబంధమైన సంపద, భోగభాగ్యాలు తాత్కాలికమైనవని, మరణంతో అవన్నీ ముగిసిపోతాయని గ్రహించిన ఆ యువకునికి ఉన్న ఏకైక ఉన్నతమైన కోరిక నిత్య జీవం పొందాలని. ఆ యువకుడు అడిగినది సాధారణ మానవుడిని కాదు, సాక్షాత్ దేవుని కుమారుడైన యేసు ప్రభువును. ఎందుకంటే కేవలం యేసు ప్రభువు మాత్రమే మానవాళికి పాపవిముక్తిని, నిత్య జీవాన్ని ఇవ్వగలడు. కానీ నిత్య జీవం ఇచ్చే సార్వభౌముడైన ప్రభువు, నేరుగా దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దీని అర్థం ఏమిటంటే, దేవుని ఆజ్ఞలు కేవలం కొన్ని నియమ నిబంధనలు కావు; అవి మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేసే ఆత్మీయ సాధనాలు.

దేవుని ఆజ్ఞలు ఏమి? అని ఆ యువకుడు కుతూహలంతో ప్రభువును అడుగుతున్నాడు. సమాజంలో తాను ఒక నీతిమంతుడిగా చలామణి అవుతున్నప్పటికీ, ఆత్మీయంగా ఇంకా ఏదో లోటు ఉందని అతనికి తెలుసు. అందుకే యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే దేవుని ఆజ్ఞలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే:

  • నరహత్య చేయకుండా ఉండటం: తోటి మానవుని జీవించే హక్కును గౌరవించడం.

  • వ్యభిచరించకుండా ఉండటం: నైతిక పవిత్రతను, కుటుంబ వ్యవస్థను కాపాడటం.

  • దొంగిలింపకుండా ఉండటం: పరుల సొమ్ముకు ఆశపడకుండా, నిజాయితీగా జీవించడం.

  • అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం: సత్యాన్ని పలకడం, ఇతరుల జీవితాలను అపనిందలతో నాశనం చేయకుండడం.

  • తల్లితండ్రులను గౌరవించడం: మనల్ని లోకానికి తెచ్చిన వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించడం.

  • పొరుగువానిని ప్రేమించడం: ఒక వ్యక్తి తనను తాను ఎంతగా ప్రేమించుకుంటాడో, ఆప్యాయతతో చూసుకుంటాడో, అదే విధంగా ఇతరులను ప్రేమించడం.

ఈ ఆజ్ఞలు ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక, మన అంతరంగంలో దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి. బాహ్యంగా కనిపించే భక్తి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమని ఇవి నిరూపిస్తాయి. మనం ఈ ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించినప్పుడు, అవి మనలను దేవునికి అత్యంత ఇష్టమైన వారిగా, ఆయన నిజమైన బిడ్డలుగా మారుస్తాయి.

మానవ బలహీనత – ఆస్తిపాస్తుల పట్ల వ్యామోహం

ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి ఎంతో నిష్ఠతో పాటిస్తున్నాను అని గర్వంగా చెబుతున్నాడు. సమాజం దృష్టిలో అతడు ఉత్తముడు, ధార్మికుడు. కానీ ఆ యువకుని అంతరంగంలో ఎదో ఒక వెలితి, ఒక లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది. అందుకే "ఇంకను నాకు లోటు ఏమి?" అని అడిగాడు. ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే, నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు బాహ్యంగా పాటించాడే కానీ, వాటి అంతరార్థాన్ని పరిపూర్తిగా గ్రహించి ఆచరించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో అత్యంత కీలకమైనది "నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము" అని చెబుతున్నాయి. పొరుగువానిని ప్రేమించడం అంటే కేవలం వారికి కీడు చేయకుండా ఉండటం మాత్రమే కాదు, వారి అవసరాలలో పాలుపంచుకోవడం.

ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాను అని అన్నప్పటికీ, అంతర్యామియైన ప్రభువు అతని హృదయంలోని అసలైన బలహీనతను చూశాడు. అందుకే, "నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు వెళ్లి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము" అని అంటున్నాడు. ఈ మాటతో ఆ యువకుని అసలు రంగు బయటపడింది. అంటే ఈ యువకుడు తన సంపదను అనుభవిస్తున్నప్పుడు, తన కళ్లముందే ఆకలితో, దారిద్ర్యంతో అలమటిస్తున్నటువంటి పేదలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. పొరుగువానిని ప్రేమించాలనే ఆజ్ఞను అతడు కేవలం మాటలకే పరిమితం చేశాడు కానీ చేతలలో చూపించలేదు. ఈ ఘోరమైన లోపం ఈ యువకునిలో ఉన్నది.

అదే విధంగా అతడు తన ఆస్తిని, అంతస్తును వదులుకోవడానికి ఏమాత్రం ఇష్ట పడటం లేదు. సృష్టికర్త అయిన దేవుని కంటే, ఆయన ఇచ్చే నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు తన లౌకిక ఆస్తిని ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు తీవ్రమైన బాధతో, నిరాశతో యేసును విడిచి వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి అతని స్వార్థ హృదయం ఇష్టపడలేదు. యేసు ప్రభువు అతనికి నశించిపోయే ఈ లోక సంపదను వదులుకుంటే, పరలోకంలో ఎన్నటికీ తరిగిపోని శాశ్వతమైన ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపినప్పటికీ, దురదృష్టవశాత్తూ కేవలం ఈలోకం ఆస్తుల మీదనే, క్షణభంగురమైన ఐశ్వర్యం మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు. ఫలితంగా నిత్యజీవానికి అతి సమీపంలోకి వచ్చి కూడా, దానిని అందుకోలేకపోయాడు.

దేవునితో ఆత్మీయ సంభాషణ 

అంతరంగ శోధన – అజ్ఞల ఆచరణలో వైఫల్యం

ప్రభువా! నేను కూడా ఈ సువార్తలోని యువకుని వలే అంతరంగంలో నిత్య జీవం పొందాలనే తీవ్రమైన ఆశ కలిగి ఉన్నాను. నా అనుదిన జీవితంలో మీ వాక్యాన్ని విన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో మీ జీవితాన్ని గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవాన్ని ఇవ్వగలరని నా పూర్ణహృదయంతో తెలుసుకున్నాను. లోకంలోని ఏ సంపద, ఏ అధికారం ఇవ్వలేని ఆ అద్భుతమైన శాశ్వత ఆనందాన్ని, మీరు మాత్రమే ఇవ్వగలిగే ఆ నిత్య జీవాన్ని పొందాలని ప్రతిక్షణం అనుకుంటాను. కానీ నా వాస్తవ జీవితంలోకి వచ్చేసరికి, ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హుణ్ణి చేసేటువంటి మీ ఆజ్ఞలను నేను పాటించుటలో అనేక సార్లు ఘోరంగా విఫలం చెందుతున్నాను.

నా బలహీన స్వభావం వల్ల, "నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో" పూర్తిగా విఫలం చెందాను. నా హృదయంలో స్వార్థం, అహంకారం నిండిపోవడం వల్ల తోటివారు, నా పొరుగువారు గొప్పగా ఉంటే, వారు సమాజంలో వృద్ధిలోకి వస్తుంటే నేను చూసి ఓర్చుకోలేకపోయాను. నాలో తెలియకుండానే అసూయ, ద్వేషం అనే కలుపు మొక్కలు మొలిచాయి. అనేకసార్లు మీ పవిత్రమైన ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను.

నా సుఖం, నా సంతోషం, నా ప్రతిష్ఠ ముఖ్యం అనుకుంటూ నన్ను నేను మాత్రమే ప్రేమించాను, అభిమానించాను. నేను మాత్రమే అన్ని రంగాలలో వృద్ధిలోకి రావాలని, నా కుటుంబం మాత్రమే బాగుండాలని కాంక్షించాను. కానీ నా కళ్లముందే ఉన్న ఇతరులను, కష్టాల్లో ఉన్న పొరుగువారిని ఆ కరుణతో, ప్రేమతో చూడలేక పోయాను. నా స్వార్థమే నా కళ్లకు పొరలుగా మారింది.

లోక వ్యామోహం నుండి విముక్తి కొరకు ప్రార్థన

ప్రభువా! నోటి మాటలతో నిన్ను అనుసరించాలని, నీ వలె పవిత్రంగా ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. కానీ నా ప్రవర్తన మాత్రం ఆ ధనవంతుడైన యువకుని వలెనే ఉంది. ఈ లోక విషయాలు, ఆస్తులు, లౌకిక సుఖాలు, ధన సంపాదన మీదనే నా మనసును నిరంతరం కేంద్రీకరించాను. రేపు నశించిపోయే ఈ లోక ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి పడే తపనలో, నిత్యమైన నీ రాజ్యాన్ని మరచిపోతున్నాను.

నీ వలె పరలోక తండ్రి చిత్తము మీద, ఆయన నీతి మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను. నా ఆస్తి, నా సమయం, నా ప్రతిభను ఇతరులతో పంచుకోవడానికి నా హృదయం వెనకాడుతోంది. నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకోకుండా, ఏదో ఒక లోకసంబంధమైన బంధనానికి బానిసనై బ్రతుకుతున్నాను.

ప్రభువా, నాలోని ఈ లోటును, ఈ పాపపు స్వభావాన్ని నీ పాదాల చెంత ఒప్పుకుంటున్నాను. నా హృదయాన్ని మార్చండి. నన్ను క్షమించి, నీ దివ్యమైన ప్రేమతో నన్ను నింపండి. లౌకికమైన వాటన్నిటికంటే మిన్నగా నిన్ను, నీ రాజ్యాన్ని ప్రేమించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి.

ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి.  నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్ 

Fr. Amruth 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు