సకల ఆత్మల పండుగ (నవంబరు 2): ఉత్తరించు స్థలం, మృతుల కోసం ప్రార్థన

 


సకల ఆత్మల పండుగ- కన్నీటి నుండి నిరీక్షణ వైపు ప్రయాణం

కన్నీళ్లు, నిరీక్షణ కలిసే రోజు

ఇంటి గోడపై వేలాడే ఒక ఫోటో, అల్మారాలో భద్రంగా దాచిన పాత చొక్కా, అమ్మ చేతి వంట వాసన, ఒక పాత పాట. ఇవి మనల్ని ఒక్క క్షణంలో గతంలోకి తీసుకువెళ్లి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. మనల్ని విడిచి వెళ్ళిన తల్లిదండ్రులు, తాతముత్తాతలు, జీవిత భాగస్వాములు, పిల్లలు, స్నేహితులు గుర్తుకు వచ్చినప్పుడు హృదయం బరువెక్కుతుంది.

నవంబరు 2న తల్లి శ్రీసభ మనల్ని సకల ఆత్మల పండుగకు పిలుస్తోంది. ఇది కేవలం దుఃఖ దినం కాదు. ఇది కన్నీళ్లు, నిరీక్షణ ఒకే హృదయంలో కలిసే రోజు. పునీత  పౌలు "సోదరులారా! నమ్మకము లేని వ్యక్తులవలె, మీరు విచారపడకుండుటకు, చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలెనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును." (1 తెస్సలొనీయులు 4:13-14). క్రైస్తవుడు కూడా తన ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఏడుస్తాడు, కానీ అతని ఏడుపులో ఆశ ఉంటుంది.

 నిన్న, నేడు: రెండు పండుగల మధ్య అనుబంధం

నిన్న సకల పునీతుల పండుగ జరుపుకున్నాము. పరలోకంలో దేవుని ముఖాముఖి దర్శిస్తూ ఆనందిస్తున్నటువంటి మనకు తెలిసిన, తెలియని పునీతులందరినీ స్మరించుకున్నాము. నేడు, వారి వెనుకే ఆ గమ్యం వైపు ఇంకా ప్రయాణిస్తున్న ఆత్మలను స్మరిస్తున్నాము. ఈ రెండు రోజులు కలిసి ఒకే సత్యాన్ని చెబుతాయి. అది ఏమిటంటె  మనమంతా ఒకే పవిత్రతకు పిలువబడ్డాము.

ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి శ్రీసభను ఒక కుటుంబంగా చూడాలి. ఈ కుటుంబంలో మూడు స్థితుల్లో ఉన్నవారు ఉన్నారు.

  • భూమిపై యాత్రికులుగా విశ్వాసంతో, పాపంతో పోరాడుతున్న మనం. (భూలోకంలో ఉన్నవారు)
  • దేవుని కృపలో మరణించి, పరిపూర్ణ పవిత్రత కోసం ఇంకా శుద్ధి పొందుతున్న ఆత్మలు. (ఉత్తరించు స్థలంలో ఉన్నవారు)
  • పరలోకంలో మహిమలో ఉన్న పునీతులు. (పరలోకంలో దేవునితో ఉన్నవారు)

నిన్నటి పండుగ మూడవ వర్గాన్ని గౌరవించింది. నేటి పండుగ రెండవ వర్గం కోసం ప్రత్యేకంగా ప్రార్థించే రోజు. ఈ ఆత్మలు తమ కోసం తాము ఏమీ చేసుకోలేవు. కానీ మనం చేయగలం. మన ప్రేమ మరణం దాటి కొనసాగే రోజే ఇది.

రెండు వేల ఏళ్ల ప్రేమ ప్రవాహం

మృతుల కోసం ప్రార్థించడం కొత్తగా పుట్టిన ఆచారం కాదు. తొలి శతాబ్దాల క్రైస్తవులు రోమ్‌లోని భూగర్భ సమాధి గదులైన కటకోంబుల్లో మృతుల కోసం ప్రార్థించేవారు. అక్కడి గోడలపై  "శాంతిలో నిద్రించుము", "దేవునిలో జీవించుము" వంటి వాక్యాలు గోడలపై చెక్కి ఈ రోజుకీ కనిపిస్తాయి. తిరుసభ పితరులు మృతుల కోసం దివ్యబలి అర్పించే ఆచారాన్ని ప్రస్తావించారు. మృతుల కోసం మూడవ రోజు, ఏడవ రోజు, ముప్పైవ రోజు, వార్షికోత్సవం నాడు ప్రార్థించడం ఆనవాయితీగా మారింది.

పునీత అగస్టీను తల్లి, పునీత మోనికా మరణ శయ్యపై ఉండి తన కుమారులతో, "నా శరీరాన్ని ఎక్కడ పూడ్చినా పర్వాలేదు, కానీ ప్రభువు బలిపీఠం వద్ద నన్ను ఎల్లప్పుడూ స్మరించండి"  అని కోరింది. తల్లి కోసం అగస్టీను చేసిన ప్రార్థనలు ఆయన "confession " గ్రంథంలో ఇప్పటికీ మనల్ని కదిలిస్తాయి.

ఈ స్మరణకు నిర్ణీత రోజు ఏర్పడింది క్రీ.శ. 998లో. ఫ్రాన్స్‌లోని క్లూనీ మఠాధిపతి పునీత ఒడిలో, నవంబరు 2ను మరణించిన విశ్వాసులందరి కోసం ప్రార్థనా రోజుగా పాటించాలని తన మఠాలను అన్నిటినీ ఆదేశించాడు. ఈ ఆచారం చుట్టుపక్కల మఠాలకు, తర్వాత సామాన్య విశ్వాసుల్లోకి వ్యాపించి, చివరికి శ్రీసభ అంతటా స్థిరపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన దుఃఖ సమయంలో, 1915లో పదిహేనవ బెనెడిక్ట్ పోపుగారు ఈ రోజున ప్రతి గురువు మూడు దివ్యబలులు అర్పించవచ్చని అనుమతించారు. మృతుల పట్ల శ్రీసభ హృదయం ఎంత ఆత్రుతతో ఉందో దీనివల్ల తెలుస్తుంది.

ఈ పండుగ తరతరాలుగా కొనసాగుతున్న ప్రేమ ప్రవాహం. "మరణం కూడా మనల్ని ప్రేమ బంధం నుండి వేరు చేయలేదు" అని శ్రీసభ యుగయుగాలుగా ప్రకటిస్తోంది.

పవిత్ర గ్రంధం  ఏమి చెబుతోంది?

"మృతుల కోసం ప్రార్థించడం బైబిల్లో ఉందా?" అని కొందరు అడుగుతారు. ఉంది. అది కేవలం మానవ భావోద్వేగం కాదు, దానికి దైవ వాక్య పునాది ఉంది.

2 మక్కబీయులు 12:38-46. యూదా యుద్ధంలో మరణించిన తన సైనికుల కోసం పాపపరిహార బలి అర్పించడానికి యెరూషలేము దేవాలయానికి కానుకలు పంపాడు. వారు పునరుత్థానం పొందుతారనే నమ్మకంతోనే ఆ పని చేశాడు. మృతులు పాపాల నుండి విముక్తి పొందేలా వారి కోసం ప్రార్థించడం పవిత్రమైన, భక్తిపూర్వకమైన ఆలోచన అని మక్కబియుల  గ్రంథం చెబుతుంది. అంటే క్రీస్తు రాకముందే దేవుని ప్రజలు మరణం తర్వాత కూడా ప్రార్థన ఫలిస్తుందని విశ్వసించారు.

రెండవది, 1 కొరింథీయులు 3:10-15. ప్రతి ఒక్కరి పని అగ్నిచేత పరీక్షింపబడుతుందని పునీత  పౌలు రాస్తున్నాడు. దేవుని రక్షణ పొందిన వ్యక్తిలో కూడా ఇంకా శుద్ధీకరణ అవసరం ఉండవచ్చని శ్రీసభ ఈ వాక్యంలో చూస్తుంది.

మూడవది, మత్తయి 12:32. కొన్ని పాపాలు "ఈ లోకంలోనైనా రాబోయే లోకంలోనైనా" క్షమింపబడవని యేసు ప్రభువు  అన్నప్పుడు, రాబోయే లోకంలో కూడా కొన్ని పాపాలకు క్షమాపణ ఉండే అవకాశాన్ని తిరుసభ  పితరులు గ్రహించారు.

నాల్గవది, ప్రకటన 21:27. అపవిత్రమైనది ఏదీ పరలోక నగరంలోకి ప్రవేశించదు. దేవుడు సంపూర్ణ పవిత్రుడు. ఆయన్ను ప్రేమిస్తూ మరణించినా, ఇంకా బలహీనతల మచ్చలు కలిగిన కోట్లాది సామాన్య విశ్వాసుల గతి ఏమిటి? దేవుడు వారికిచ్చే శుద్ధీకరణ కృపే శ్రీసభ బోధించే ఉత్తరించు స్థలం.

అన్నిటికంటే ముఖ్యంగా, యోహాను 11. లాజరు సమాధి వద్ద యేసు ప్రభువు కన్నీరు కార్చాడు. ఆ కన్నీళ్లు మన దుఃఖానికి దైవ అంగీకారం. ఆ తర్వాత ఆయన "నేనే పునరుత్థానమును, జీవమును; నన్ను విశ్వసించువాడు చనిపోయినను జీవించును" అని ప్రకటించాడు.  ఈ ప్రకటన మన ఆశకు దేవుని  హామీ. కన్నీళ్లు, నిరీక్షణ ఒకే హృదయంలో నివసించగలవని ఇక్కడ చూస్తున్నాం.

శుద్ధి స్థితి: ప్రేమ అనే అగ్ని (ఉత్తరించు స్థలం)

ఈ పండుగ కేంద్రం  ఉత్తరించు స్థలంలో ఉన్న వారి (Purgatory) గురించిన బోధన. దీని గురించి చాలా అపోహలున్నాయి. కొందరు దీన్ని నరకం చిన్న రూపం అనుకుంటారు. మరికొందరు మరణం తర్వాత దొరికే రెండవ అవకాశం అనుకుంటారు. శ్రీసభ  సత్యపదేశం  (1030-1032) ఈ రెండింటికీ భిన్నంగా బోధిస్తుంది.

దేవుని కృపలో, ఆయన స్నేహంలో మరణించినవారు నిత్య రక్షణ విషయంలో నిశ్చయంగా ఉంటారు. అయినా పరలోక ఆనందంలో ప్రవేశించే ముందు వారు తుది శుద్ధీకరణ పొందుతారు. దీని గురించి నాలుగు విషయాలు గుర్తుంచుకుందాం.

మొదటిది, శుద్ధి స్థితి నరకం కాదు. నరకంలో దేవుని నుండి శాశ్వత వేరుపాటు ఉంటుంది. శుద్ధి స్థితిలోని ఆత్మలందరూ రక్షణ పొందినవారే, వారి గమ్యం పరలోకమే.

రెండవది, ఇది శిక్ష కంటే ప్రేమ అగ్ని. ఒక రాజు విందుకు పిలిచాడు. అతిథి మురికి బట్టలతో వచ్చాడు. రాజు అతన్ని వెళ్లగొట్టడు, "స్నానం చేసి శుభ్రమైన బట్టలతో రా" అంటాడు. స్నానంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు, కానీ లక్ష్యం అతన్ని విందుకు యోగ్యుడిగా చేయడమే. బంగారాన్ని నిప్పులో కరిగించి మలినాన్ని వేరు చేస్తే అది మరింత ప్రకాశిస్తుంది. అలాగే దేవుని ప్రేమ మన హృదయంలో మిగిలిన స్వార్థాన్ని, అహంకారాన్ని, అనుబంధాలను కాల్చివేస్తుంది. బెనెడిక్ట్ XVI  పోపుగారు చెప్పినట్లు, ఆ అగ్ని స్వయంగా క్రీస్తే. అది మన హృదయాన్ని తాకి మార్చే ఆయన చూపు, ఆయన ప్రేమ.

మూడవది, అక్కడి ఆత్మలకు నిరాశ లేదు, ఆశ ఉంది. జెనోవాకు చెందిన పునీత కేథరిన్, ఈ ఆత్మలు దేవుని కోసం గొప్ప ప్రేమతో, గొప్ప ఆనందంతో ఎదురుచూస్తున్నాయని వివరించింది. వారి బాధ దేవుణ్ణి ఇంకా పూర్తిగా చేరలేదనే తపన మాత్రమే.

నాల్గవది, ఇది కాలంతో కొలిచే స్థలం కాదు. శ్రీసభ దీన్ని భౌగోళిక స్థలంగా కాక ఒక స్థితిగా, ఒక శుద్ధి ప్రక్రియగా బోధిస్తుంది. ఎంతకాలం, ఎలా అనేది మనకు తెలియదు. దేవుడు మాత్రమే ఎరుగును.

ఇక్కడ ఒక గొప్ప సత్యం బయటపడుతుంది. ఆ ఆత్మలు తమకు  తాము సహాయం చేసుకోలేవు, కానీ మనం వారికి సహాయం చేయగలం. అది వారి కోసం ప్రార్ధన చేయడం, దివ్య బలి అర్పించడం మొదలగునవి.

పునీతుల సహవాసం: మరణం విడదీయలేని బంధం

ప్రతి ఆదివారం విశ్వాస ప్రమాణంలో "పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను" అని ప్రకటిస్తాం. సకల ఆత్మల పండుగ హృదయం ఇదే. క్రీస్తులో మనమంతా ఒకే శరీర అవయవాలమైతే, మరణం ఆ శరీరాన్ని ముక్కలు చేయలేదు.

ఒక కుటుంబాన్ని ఊహించండి. కొందరు ఒకే ఇంట్లో ఉంటారు, కొందరు ఉద్యోగం కోసం, చదువు కోసం దూరంగా ఉంటారు. అయినా అందరూ ఒకే కుటుంబం, వారి మధ్య ప్రేమ కొనసాగుతుంది. క్రీస్తు కుటుంబం కూడా అలాగే. కొందరు భూమిపై ఉన్నారు, కొందరు శుద్ధీకరణలో ఉన్నారు, కొందరు మహిమలో ఉన్నారు.

ఈ కుటుంబంలో సహాయం రెండు వైపులా ప్రవహిస్తుంది. పరలోక పునీతులు మన కోసం విజ్ఞాపన చేస్తారు. మనం శుద్ధి పొందుతున్న ఆత్మల కోసం ప్రార్థిస్తాం. ఆ ఆత్మలు కూడా, దేవుని స్నేహంలో ఉన్నవారు కాబట్టి, మనల్ని మరచిపోరు.

ఈ సత్యం ఒంటరితనానికి ఎంత గొప్ప ఔషధం! భర్తను లేదా భార్యను కోల్పోయిన వ్యక్తి, బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులు లేని సంతానం, "ఇక అంతా ముగిసింది" అని బాధపడతారు. కానీ ఏదీ ముగిసిపోలేదు. సంబంధం రూపం మారింది, ప్రేమ కొనసాగుతోంది. దివ్యబలిలో ప్రతిసారీ మనం మరణించిన సోదరులను స్మరించినప్పుడు, అక్కడ యాత్రిక శ్రీసభ, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలు, పరలోకం క్రీస్తు బలిపీఠం చుట్టూ కలుస్తాయి అని మన విశ్వాసం చెబుతుంది.

మృతుల కోసం మనం ఏమి చేయగలం?

ప్రేమ మాటలతో ఆగదు, క్రియల్లో కనిపిస్తుంది. శ్రీసభ మనకు కొన్ని మార్గాలు చూపుతోంది.

దివ్యబలిపూజ. ఇది అన్నిటికంటే శక్తివంతమైన ప్రార్థన. మీ కుటుంబంలో మరణించినవారి కొరకు దివ్య బలి అర్పించమని కోరండి.

జపమాల, సంక్షిప్త ప్రార్థనలు. మరియమాత జపమాల, కరుణ జపమాల, "ప్రభువా, వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించుము; శాశ్వత వెలుగు వారిపై ప్రకాశించుగాక; వారు నిత్య విశ్రాంతిలో  విశ్రమించుదురుగాక" అనే చిన్న ప్రార్థన చేయడం.

దానధర్మాలు, త్యాగాలు. దానం మరణం నుండి కాపాడుతుందని తోబీతు గ్రంథం చెబుతుంది. మీ తల్లిదండ్రుల పేరిట ఒక పేద విద్యార్థికి సహాయం చేయడం, అనాథలకు అన్నం పెట్టడం, ఉపవాసం ఉండటం, చిన్న చిన్న త్యాగాలను ఆత్మల కోసం అర్పించడం, ఇవన్నీ ప్రేమకు సజీవ రూపాలు.

పాపశిక్ష విముక్తి (ఇండల్జెన్స్). శ్రీసభ తన ఆధ్యాత్మిక నిధి నుండి ఇచ్చే ఈ అనుగ్రహాన్ని ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కోసం అర్పించవచ్చు. నవంబరు 2న దేవాలయాన్ని సందర్శించి "పరలోక  ప్రార్థన", "విశ్వాస ప్రమాణం" చెప్పడం ద్వారా, లేదా నవంబరు 1 నుండి 8 వరకు భక్తితో సమాధులను సందర్శించి మృతుల కోసం ప్రార్థించడం ద్వారా పూర్ణ పాపశిక్ష విముక్తి పొందవచ్చు. దీనికి పాపసంకీర్తనం, దివ్యసత్ప్రసాద స్వీకరణ, పోప్ గారి ఉద్దేశాల కోసం ప్రార్థన అనే షరతులు ఉంటాయి. ఇది డబ్బుతో కొనే వస్తువు కాదు, క్రీస్తు రక్షణ కార్యం ద్వారా శ్రీసభ అందించే ఆధ్యాత్మిక వరం.

సమాధుల సందర్శన. సమాధులను శుభ్రం చేస్తాం, పూలమాలలు వేస్తాం, కొవ్వొత్తులు వెలిగిస్తాం. ఈ ఆచారాలకు అర్థం ఉంది. శుభ్రత శరీరం పట్ల మన గౌరవాన్ని చూపుతుంది, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ మందిరం, పునరుత్థాన దినాన మహిమ పొందబోయేది. చీకటి సమాధి వద్ద వెలిగిన చిన్న కొవ్వొత్తి, మరణంపై జీవం సాధించిన విజయానికి సాక్ష్యం. కానీ అలంకరణ మాత్రమే సరిపోదు, వాటితో పాటు ప్రార్థన ఉండాలి. ఎవరూ ప్రార్థించని అనాథ ఆత్మల సమాధి వద్ద నిలబడి ఒక్క "నిత్య విశ్రాంతి" చెప్పడం గొప్ప కరుణ కార్యం.

దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ

ఈ రోజు ఈ దివ్యబలిలో ఇటీవలే తమ ప్రియమైనవారిని కోల్పోయినవారు ఉండవచ్చు. కొందరికి ఆ  గాయం ఇంకా పచ్చిగా ఉండవచ్చు. వారికి శ్రీసభ ఇచ్చే ఆదరణ ఇది.

మీ కన్నీళ్లు పాపం కాదు. యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. దుఃఖం ప్రేమకు కొనసాగింపు. మనం ఎంతగా ప్రేమించామో అంతగా బాధ ఉంటుంది.

మీ ప్రియమైనవారు దేవుని చేతిలో ఉన్నారు. నీతిమంతుల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నాయి, ఏ బాధా వారిని తాకదు. మూర్ఖుల దృష్టికి వారు చనిపోయినట్లు కనిపిస్తారు, కానీ వారు శాంతిలో ఉన్నారు.

దేవుని కరుణపై ఆధారపడండి. కొందరు, "మా వాళ్ళు సరిగా చర్చికి వెళ్లలేదు, చివరి సంస్కారాలు పొందలేదు" అని భయపడతారు. మరణ క్షణంలో ఆత్మ ఏ స్థితిలో దేవుని ఎదుట నిలిచిందో దేవునికి మాత్రమే తెలుసు. ఆయన కరుణ మన ఊహకు మించినది. భయంతో కాక, నమ్మకంతో ప్రార్థించండి.

యేసు ప్రభువును, ఆయన మాటను విని, నమ్మే ప్రతి ఒక్కరూ నిత్యజీవం పొందాలనేదే తండ్రి చిత్తం, చివరి దినాన తాను వారిని లేపుతానని  యేసు ప్రభువు చెప్పాడు (యోహాను 6:39-40). ఆ రోజున దేవుడు వారి కన్నీళ్లన్నీ తుడిచివేస్తాడు, ఇక మరణం ఉండదు, దుఃఖం, ఏడుపు, వేదన ఉండదు (దర్శన  21:4).  పునీత పౌలు ప్రకటించినట్లు, మరణమైనా జీవమైనా మనల్ని క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు (రోమీయులు 8:38-39).

 సజీవులైన మనకు ఈ పండుగ పిలుపు

ఈ పండుగ జీవించి ఉన్న మనల్ని ఏమి అడుగుతోందో ఆలోచిద్దాం. సమాధుల మధ్య నిలబడినప్పుడు జీవితం ఎంత చిన్నదో, ఏది నిజంగా ముఖ్యమో స్పష్టమవుతుంది.

జీవితం శాశ్వతం కాదు. "నీవు మట్టి నుండి పుట్టావు, మట్టికే తిరిగి వెళ్తావు" (ఆది 3:19). " ప్రతి వ్యక్తియు ఒకసారియే  మరణించి తదుపరి దేవుని తీర్పు పొందవలెను " (హెబ్రీయులు 9:27). ఇది భయపెట్టడానికి కాదు, మేల్కొలపడానికి. ధనం, పదవి, పేరు ప్రతిష్ఠలు, పగలు, వైరాలు సమాధి ద్వారం వద్ద ఆగిపోతాయి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనిన యెడల వానికి లాభమేమి?  అని యేసు ప్రభువు  అడిగిన ప్రశ్న ఈ రోజు మనందరికీ హెచ్చరిక (మార్కు 8:36).

పాపాన్ని తేలికగా తీసుకోకండి. శుద్ధీకరణ అవసరమైతే, "ఇది చిన్న విషయమే" అనే చిన్న పాపాలు కూడా తేలికైనవి కావు. ఈ జీవితంలోనే శుద్ధి పొందడం తేలిక. అందుకే క్రమం తప్పకుండా పాపసంకీర్తనం చేద్దాం, దివ్యసత్ప్రసాదంతో ఆత్మను బలపరచుకుందాం. "నేను ఈరోజే మరణిస్తే, దేవుని సన్నిధిలో నిలబడటానికి నా హృదయం సిద్ధంగా ఉందా?" అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం.

క్షమించండి, ప్రేమించండి, ఇప్పుడే. మరణించిన తర్వాత సమాధిపై పూలు వేయడం కంటే, బ్రతికి ఉన్నప్పుడు ఒక ప్రేమ పలుకు, ఒక సేవ ఎంతో గొప్పది. మనం ఎవరితోనైనా విరోధంలో ఉంటే వారిని క్షమించి సమాధానపడదాం, ఎందుకంటే రేపటి కోసం మనకు హామీ లేదు. "అపుడే సఖ్య పడలసింది" అని పశ్చాత్తాపపడే రోజు రాకూడదు.

వారి మంచిని కొనసాగించండి. మృతుల కోసం ప్రార్థించడం అంటే వారి మంచి కార్యాలను కొనసాగించడం కూడా. ఒక తల్లి పేదలకు అన్నం పెట్టేదైతే, ఆమె జ్ఞాపకార్థం మనం ఆకలితో ఉన్నవారికి అన్నం పెడదాం. ఒక తండ్రి నిజాయితీగా జీవించాడైతే, మనమూ నిజాయితీగా జీవిద్దాం. తల్లిదండ్రులు నేర్పిన విశ్వాసాన్ని పిల్లలకు అందిద్దాం. ఇదే మృతులకు మనం ఇవ్వగల గొప్ప జ్ఞాపకాంజలి.

ఎవరూ గుర్తుంచుకోని ఆత్మలను గుర్తుంచుకోండి. యుద్ధాలలో, ప్రమాదాలలో మరణించినవారు, పేదరికంలో, అనాథలుగా, నిరాశ్రయులుగా మరణించినవారు, పేర్లు తెలియనివారు, సమాధులు లేనివారు ఉన్నారు. వారి కోసం ప్రార్థించేవారు ఎవరూ లేకపోతే, మీ ప్రార్థనే వారికి ఆధారం. దేవునికి ప్రతి వ్యక్తి విలువైనవాడు, ఆయన ప్రేమలో ఎవరూ మరచిపోబడరు.

ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు

ఇది మన జీవితంలో ఫలించాలంటే కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుందాం.

  • ఈ నవంబరు నెల అంతా ప్రతిరోజూ మన ప్రియమైనవారి కోసం ఒక "నిత్య విశ్రాంతి" ప్రార్థన చెబుదాం.
  • మన కుటుంబంలో మరణించినవారి జాబితా తయారుచేసి, ప్రతి ఆదివారం వారి కోసం ప్రార్థిద్దాం.
  • ఈ నెలలో కనీసం ఒక దివ్యబలిపూజను వారి కోసం అర్పించమని కోరుదాం.
  • వారి పేరిట ఒక దానధర్మ కార్యం చేద్దాం.
  • సమాధులను దర్శించి భక్తితో ప్రార్థిద్దాం.
  • జీవించి ఉన్నవారితో సయోధ్య పొందుదాం.
  • మరణం గురించి, మన అంత్యక్రియల గురించి కుటుంబంలో విశ్వాసంతో బహిరంగంగా మాట్లాడుకునే అలవాటు చేసుకుందాం. భయంతో దాచడం కంటే ఆశతో సిద్ధపడడం మేలు.

ప్రేమ మరణం కంటే బలమైనది

ఈ రోజు మనకు చెప్పే సత్యం ఒక్కటే, ప్రేమ మరణం కంటే బలమైనది. మనల్ని విడిచి వెళ్ళినవారు ఎక్కడో మాయమైపోలేదు. వారు దేవుని చేతుల్లో ఉన్నారు, క్రీస్తు శరీరంలో మనతో ఒక్కటిగా ఉన్నారు. మన ప్రార్థన వారికి సహాయం, వారి ప్రార్థన మనకు బలం. క్రైస్తవ విశ్వాసంలో మరణం, క్రీస్తుతో ప్రారంభమయ్యే నిత్యజీవానికి ప్రవేశద్వారం. ఒక రోజు మనమంతా దేవుని సన్నిధిలో తిరిగి కలుస్తాము.

 ప్రార్థన

కరుణామయుడవైన తండ్రీ, మీ  కుమారుని మరణం, పునరుత్థానం ద్వారా మాకు నిత్యజీవ ఆశను ఇచ్చావు. ఈ లోకాన్ని విడిచిన మా తల్లిదండ్రులను, తాతముత్తాతలను, సోదరీ సోదరులను, బంధువులను, స్నేహితులను, గురువులను, ఉపదేశులను మీ  కరుణ చేతుల్లో ఉంచుతున్నాము. వారి తప్పులను క్షమించి, మీ  ప్రేమ అగ్నిలో వారిని శుద్ధి చేసి, మీ దివ్య దర్శన భాగ్యంలోకి చేర్చుము. ఎవరూ స్మరించని, ప్రార్థించేవారు లేని ఆత్మలను ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్నాము. ఒక రోజు పరలోక కుటుంబంలో అందరమూ కలిసి మిమ్ము  కీర్తించేలా చేయుము. ఆమెన్

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి