ఏడు డెబ్బది పర్యాయములు: మత్తయి 18:21-19:1 వ్యాఖ్యానం| కార్మెల్ శోభ
మత్తయి 18:21-19:1
ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, "ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములా?” అని అడిగెను. అందుకు యేసు “ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు” అని సమాధానమిచ్చెను. ఏలయన పరలోకరాజ్యము ఇట్లున్నది: ఒక రాజు - తన సేవకులనుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగనే కోటివరహాల' ఋణస్థుడొకడు అతని సముఖమునకు తీసికొని రాబడెను. వానికి ఋణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయును విక్రయించి, ఆ ఋణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అపుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి 'కొంత ఓపిక పట్టుము. నీ ఋణమునంతయు చెల్లింతును' అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచి పెట్టెను. వాని అప్పును కూడ క్షమించెను. " కాని, అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనకు కొంత ధనము' ఋణపడియున్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, 'నీ అప్పు చెల్లింపుము' అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అపుడు సాగిలపడి 'కొంచెము ఓపిక పట్టిన నీ ఋణ మంతయు చెల్లింతును' అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక ఋణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను.ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి, జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అపుడు ఆ యజమానుడు వానిని పిలిపించి 'నీచుడా! నీవు నన్ను ప్రార్ధించుటచే నీ ఋణమంతయు క్షమించితిని. నేను నీపట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా?' అని మండిపడి బాకీనంతయు చెల్లించువరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అటులనే ప్రవర్తించును.” తన ఉపదేశమును ముగించిన పిదప, యేసు గలిలీయ సీమను వీడి, యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను.
పరిచయం
పేతురు
అడిగిన ఒక సాధారణ ప్రశ్నతో ఈ సువార్త భాగము ప్రారంభమవుతుంది: సహోదరుడు తనకు ద్రోహము
చేసినప్పుడు ఎన్ని పర్యాయములు క్షమించవలెను? ఆనాటి రబ్బీల సంప్రదాయం ప్రకారము మూడు
పర్యాయములు క్షమిస్తే చాలునని భావించేవారు; నాలుగవ సారి క్షమించవలసిన అవసరం లేదని బోధించేవారు.
పేతురు “ఏడు పర్యాయములా” అని అడగడం ద్వారా ఆ నియమం కంటే రెట్టింపుగా ఎక్కువ
ఔదార్యం చూపిస్తున్నానని అనుకొని ఉంటాడు. బైబిలులో “ఏడు” సంపూర్ణతకు చిహ్నం గనుక, అతని దృష్టిలో
ఇది గరిష్ట ఔదార్యం.
కాని యేసు ప్రభువు సమాధానం పేతురు అంచనాలను పూర్తిగా మారుస్తుంది: “ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు.” అని చెప్పడం, ఆదికాండము 4:24లోని లామెకు ప్రతీకార కాంక్షకు (“లామెకు కొరకు డెబ్బది ఏడు రెట్లు ప్రతీకారం తీర్చుకోబడును”) నేరుగా ప్రతిస్పందన. లామెకు ప్రతీకారాన్ని అపరిమితంగా పెంచితే, యేసు ప్రభువు క్షమాపణను అపరిమితంగా పెంచుతున్నాడు. పాత నిబంధన ప్రతీకార సూత్రాన్ని కొత్త నిబంధన కృపా సూత్రంతో భర్తీ చేస్తున్నాడు. ఇది సంఖ్యల విషయం కాదు; హృదయ వైఖరి విషయం. పేతురు లెక్క పెట్టాలని అనుకున్నాడు, కాని యేసు ప్రభువు లెక్కలు లేని క్షమాపణను బోధించాడు. ఈ సమాధానానికి వివరణగా, పరలోకరాజ్యపు స్వభావాన్ని వెల్లడించే ఒక ఉపమానాన్ని యేసు ప్రభువు చెబుతున్నాడు .
1. గ్రంథాధార వ్యాఖ్యానం: ఉపమాన నిర్మాణం
ఈ
ఉపమానాన్ని నాలుగు దృశ్యాలుగా చూడవచ్చు.
మొదటి
దృశ్యంలో ఒక సేవకుడు రాజు ముందు నిలబడతాడు. అతని ఋణం “కోటివరహాలు”, మూలభాషలో పదివేల తలాంతులు. ఒక తలాంతు సుమారు
పదిహేను నుండి ఇరవై సంవత్సరాల కూలికి సమానం గనుక, ఈ మొత్తం ఒక సామాన్యుడు ఎన్ని జన్మలెత్తినా
తీర్చలేని అపారమైన బాకీ. ఇది ఉద్దేశపూర్వకంగా అసంబద్ధమైనంత పెద్ద సంఖ్య. ఇది
మానవ
పాపభారం దేవుని ఎదుట ఎంత అపరిమితమైనదో సూచించడానికి మరియు ఎంతగా దేవుడు క్షమాపణ
చూపిస్తున్నాడో తెలుపుతుంది. సేవకుడు “కొంత ఓపిక పట్టుము, అంతయు చెల్లింతును”
అని వేడుకున్నప్పుడు, వాస్తవానికి అతడు ఆ మాట నిలబెట్టుకోలేడని అందరికీ తెలుసు. అయినప్పటికీ
రాజు వాయిదా వేయడమే కాకుండా ఆ ఋణమంతటినీ రద్దు చేసి, ఉచితంగా క్షమిస్తాడు. ఇది కేవలం
సానుభూతి కాదు; ఇది సంపూర్ణ కృప.
రెండవ
దృశ్యంలో అదే సేవకుడు వెంటనే తనకు కొద్ది మొత్తం, వంద దినారాలు, సుమారు వంద రోజుల కూలి, ఋణపడిన తోటి సేవకుని గొంతు పట్టుకుంటాడు. తాను విన్న అదే ప్రార్థన
మాటలను (“కొంచెం ఓపిక పట్టుము”) తన తోటివాని నుండి విన్నప్పటికీ, అతడు నిరాకరించి అతనిని
చెరసాలలో వేయిస్తాడు. రెండు ఋణాల మధ్య వ్యత్యాసం అపారమైనది, దేవుడు మనలను క్షమించిన దానితో పోల్చితే,
ఇతరులు మనకు చేసే అపకారం ఎంత అల్పమైనదో చూపించడానికి చెప్పడం జరిగినది.
మూడవ
దృశ్యంలో ఇతర సేవకులు జరిగినది చూసి బాధపడి యజమానునికి తెలియజేస్తారు. ఇది సమాజ లేక సంఘ మనస్సాక్షిని, నైతిక
బాధ్యతను సూచిస్తుంది. నాలుగవ దృశ్యంలో యజమానుడు ఆ సేవకుడిని “నీచుడా” అని పిలిచి, తాను చూపిన దయను అతడు ఎందుకు
తోటివానికి చూపించలేదని
ప్రశ్నించి, తాను రద్దు
చేసిన ఋణాన్ని తిరిగి అమలులోకి వచ్చేలా
చేస్తాడు.
ఈ కథ ఒక హెచ్చరికతో ముగుస్తుంది, అది దేవుని క్షమాపణను పొందినవారు
దానిని ఇతరులకు అందించకపోతే, ఆ క్షమాపణను నిజంగా అర్థం చేసుకోలేదని రుజువవుతుంది.
రెండు
ఋణాల మధ్య వ్యత్యాసాన్ని లెక్కల్లో చూస్తే ఈ ఉపమానపు తీవ్రత మరింత స్పష్టమవుతుంది. ఒక తలాంతు సుమారు ఆరు
వేల దినారాలతో
సమానం గనుక, పదివేల తలాంతులు
అంటే 6 కోట్ల దినారాలతో సమానం. మొదటి సేవకుని ఋణం,
రెండవ సేవకుని ఋణం కంటే చాలా
ఎక్కువ.
ఇది కేవలం అతిశయోక్తి కాదు; యేసు ప్రభువు
ఉద్దేశపూర్వకంగా
ఎంచుకున్న సంఖ్యలు. ఒక సామాన్య వ్యక్తి
ఈ కథ వినగానే, రెండు
ఋణాల మధ్య పోలికే అసంభవమని వెంటనే గ్రహిస్తాడు. దేవుడు మనలను క్షమించిన పాపభారం
ముందు, తోటి మనుషులు మనకు చేసే అపకారాలు ఎంత అల్పమైనవో ఇది
మనకు తెలియజేస్తుంది.
ఈ ఉపమానంలో “యాజమాని లేక రాజు ” పాత్ర ప్రత్యేకమైనది. ప్రాచీన సమాజాలలో రాజు తన సేవకులతో లెక్కలు చూసుకోవడం ఒక సాధారణ పరిపాలనా విధానం, కాని ఇక్కడ ఇది అంతిమ తీర్పు దృశ్యానికి ప్రతీకగా మారుతుంది. ప్రతి మనిషి ఒకనాడు దేవుని ఎదుట తన జీవితానికి జవాబు చెప్పవలసిందే అనే సత్యాన్ని ఇది గుర్తుచేస్తుంది. అయితే ఆ తీర్పు దృశ్యంలో మొదట కనిపించేది భయం కాదు, కరుణ, రాజు కోపగించకొకుండా, శిక్షించకుండా, ఉచితంగా క్షమిస్తాడు. ఇదే దేవుని హృదయం.
2. ఆధ్యాత్మిక దృక్పథం
ఆధ్యాత్మికంగా
ఈ ఉపమానం రెండు వాస్తవాలను ఎదురెదురుగా నిలుపుతుంది. దేవుని అపరిమిత కృప, మరియు మానవ హృదయపు మర్చిపోయే
గుణం.
మొదటి సేవకుడు రాజు కరుణను ప్రత్యక్షంగా అనుభవించాడు. తన భార్యాపిల్లలను, తన స్వేచ్ఛను కోల్పోకుండా కాపాడబడ్డాడు.
కాని ఆ కృపను అనుభవించిన మరుక్షణమే, అతడు దానిని మరచిపోయాడు. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక మతిమరుపు, దేవుని ఉచిత కృపను స్వీకరించిన
వ్యక్తి ఇతరుల పట్ల దయ చూపలేకపోవడం.
ఈ
ఉపమానం పరలోక ప్రార్థనలోని
“మా యొద్ద అప్పు పడిన
వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను మీరు
క్షమించండి ” (మత్తయి 6:12) అనే మాటలకు జీవం పోస్తుంది.
మనం దేవుని క్షమాపణను ఎంతగా కోరుకుంటామో, అంతే హృదయపూర్వకంగా ఇతరులను క్షమించడానికి
సిద్ధంగా ఉండాలి. ఇది క్షమాపణను సంపాదించే పద్ధతి కాదు; క్షమింపబడిన హృదయనికి సహజంగా ఉండవలసిన లక్షణం. నిజంగా క్షమింపబడిన వ్యక్తి
క్షమించే స్వభావాన్ని కలిగి ఉండాలి.
మార్కు 11:25లో యేసు ప్రభువు “నీవు
ప్రార్ధించునపుడు నీ సోదరునిపై నీకు ఏమైన మనస్పర్థఉన్నచో వానిని క్షమింపుము. అపుడు
పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును.”
అని బోధించడం దీనినే ధృవీకరిస్తుంది. క్షమించని హృదయం ప్రార్థనా జీవితానికే అడ్డంకిగా
మారుతుంది.
“హృదయపూర్వకముగా”
అనే మాట కీలకమైనది. క్షమాపణ కేవలం బాహ్య మాటలు కాదు; అది అంతరంగ పరివర్తన. బాహ్యంగా
క్షమించినట్టు కనిపిస్తూ లోపల ద్వేషాన్ని పెంచుకోవడం నిజమైన క్షమాపణ కాదు. హెబ్రీ
12:15లో “దేవుని
అనుగ్రహమును పొందుటలో ఎవరు తప్పిపోకుండునట్లు
జాగ్రత్త వహింపుడు. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవర పరుచుట వలన అనేకులు అపవిత్రులై పోకుండునట్లు
జాగ్రత్త పడుడు”
అని హెచ్చరించినట్లు, క్షమించని హృదయంలో పెరిగే చేదు వేరు, కాలక్రమేణా ఆ వ్యక్తినే విషపూరితం చేస్తుంది.
క్షమించని హృదయం క్రమంగా కఠినమవుతుంది, మరియు అది తనను తాను ఒక చెరసాలలో బంధించుకుంటుంది. ఇతరులను శిక్షించాలనుకుంటూ, వాస్తవానికి తనను తానే
బంధించుకుంటుంది.
క్రీస్తు సిలువపై “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము,” అని ప్రార్థించినప్పుడు, క్రైస్తవ క్షమాపణకు అంతిమ మాతృకను చూపించాడు. అదే మాతృకను అనుసరిస్తూ స్తెఫను తనను రాళ్ళతో కొట్టేవారి కొరకు ప్రార్థించాడు. మనం క్షమించేది మన సొంత బలం వల్ల కాదు, క్రీస్తు క్షమాపణను మనం అనుభవించినందువల్లనే. ఈ కోణంలో క్షమాపణ బలహీనత కాదు, అది ఆధ్యాత్మిక శక్తి. ప్రతీకార హక్కును దేవునికి అప్పగించి, తన హృదయాన్ని విముక్తం చేసుకునే ధైర్యం. క్షమాపణ అంటే జరిగినదాన్ని సమర్థించడం, అన్యాయాన్ని ఆమోదించడం, లేదా బాధను నిరాకరించడం కాదు; అది ప్రతీకారాన్ని దేవుని చేతికి అప్పగించి ముందుకు సాగే ఆధ్యాత్మిక పరిపక్వత.
3. సామాజిక విశ్లేషణ
సామాజిక
కోణంలో చూస్తే, ఈ ఉపమానం ప్రాచీన ప్రపంచపు ఆర్థిక-సామాజిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది.
ఆ కాలంలో ఋణం తీర్చలేని వ్యక్తులను, వారి కుటుంబాలను బానిసలుగా అమ్మడం సర్వసాధారణం.
యేసు ప్రభువు
ఈ కథను ఆ నేపథ్యంలోనే
చెప్పి,
దానికి అతీతమైన ఒక కొత్త సమాజ నమూనాను కరుణపై
నిర్మించబడిన పరలోకరాజ్యాన్ని పరిచయం చేస్తున్నాడు.
ఒక
రాజు తన క్రింది వ్యక్తికి
పెద్ద ఉపకారం చేసినప్పుడు, ఆ ఉపకారానికి ప్రతిస్పందనగా విధేయత, గౌరవం, మరియు రాజు విలువలను ప్రతిబింబించే
ప్రవర్తన ఆశించబడేవి. రాజు తన సేవకుని ఋణాన్ని క్షమించినప్పుడు, ఆ సేవకుడు రాజు ఔదార్యాన్ని
తన జీవితంలో ప్రతిబింబించాలని అందరూ ఆశిస్తారు. అతడు అలా చేయకపోవడం కేవలం వ్యక్తిగత
కృతజ్ఞతా రాహిత్యం మాత్రమే కాదు, రాజు గౌరవాన్నే అవమానించే చర్య. అందుకే ఇతర సేవకులు
ఇంత తీవ్రంగా స్పందిస్తారు.
ఇక్కడ
మరో ముఖ్యమైన అంశం సమాజ
స్పందన.
తోటి సేవకులు జరిగిన అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండరు; వారు బాధపడి యజమానునికి తెలియజేస్తారు.
ఇది సమాజంలో అన్యాయాన్ని గమనించి స్పందించవలసిన నైతిక బాధ్యతను చూపిస్తుంది. క్షమాపణ
అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు; అది సమాజ
ఆరోగ్యానికి పునాది.
ఒక సమాజంలో
క్షమాపణ లేకపోతే, చిన్న విభేదాలు క్రమంగా శాశ్వత చీలికలుగా మారతాయి.
మత్తయి
18వ అధ్యాయం మొత్తం సంఘ జీవితం గురించి మాట్లాడుతుంది. వినయం,
తప్పిపోయిన గొర్రెను వెదకడం, సహోదరుని సరిదిద్దే విధానం, మరియు ఈ క్షమాపణ ఉపమానం. కుటుంబాలలో,
సంఘాలలో, సమాజంలో పగ మరియు ప్రతీకార భావం పెరిగితే సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. దీనికి
విరుద్ధంగా, క్షమాపణ ఒక సామాజిక విలువగా
పనిచేసి, కుటుంబాలను,
సంఘాలను, సమాజాలను ఐక్యంగా నిలుపుతుంది. అదే విధంగా క్షమించబడిన వ్యక్తి
క్షమించని వ్యక్తిగా మారడం ఎంత విషాదకరమో ఈ ఉపమానం స్పష్టం చేస్తుంది. ఇది అణచివేత, కాఠిన్యం చక్రాన్ని కొనసాగించడమే అవుతుంది.
కుటుంబ జీవితంలో ఈ ఉపమానం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వారసత్వ వివాదాలు, ఆస్తి తగాదాలు, పాత మాటపట్టింపులు ఎన్నో కుటుంబాలను సంవత్సరాల తరబడి విడదీస్తుంటాయి. తరచుగా అవి ప్రారంభమైనప్పుడు చిన్నవిగానే ఉంటాయి, కాని క్షమించని హృదయాల మధ్య అవి పెద్ద గోడలుగా మారతాయి. అదే విధంగా సమాజంలో కుల, మత, రాజకీయ విభేదాలు తరతరాలుగా కొనసాగడానికి కారణం కూడా ప్రతీకార సంస్కృతియే. లామెకు మార్గం “నన్ను గాయపరిస్తే ఏడింతలు ప్రతీకారం తీర్చుకుంటాను” అనే దొరణి సమాజాన్ని హింసా చక్రంలోకి నెట్టివేస్తుంది. క్రీస్తు మార్గం, “నన్ను గాయపరిచినా నేను క్షమిస్తాను” ఆ చక్రాన్ని విచ్ఛిన్నం చేసే ఏకైక మార్గం. ఈ కోణంలో క్షమాపణ కేవలం మతపరమైన ఆచారం కాదు; అది సామాజిక శాంతికి, మానసిక ఆరోగ్యానికి కూడా అవసరమైన సాధనం. ద్వేషం, కక్ష మనిషిలో ఒత్తిడిని, ఆందోళనను పెంచి సంబంధాలను దెబ్బతీస్తే, క్షమాపణ అంతరంగ శాంతిని, ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహిస్తుంది.
4. అన్వయం
పేతురు ఎన్ని సార్లు? అని అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువు
ఇచ్చిన సమాధానం హృదయంతో మార్చే సమాధానం. యేసు ప్రభువుకు ఒక కొత్త సంఖ్యను ఇవ్వడం
లక్ష్యం కాదు; క్షమాపణను లెక్కల పరిధి నుండి పూర్తిగా తొలగించడం లక్ష్యం. దేవుని రాజ్యంలో
క్షమాపణకు గడువు లేదా పరిమితి ఉండదు.
మత్తయి
18:35లో “మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా
క్షమింపనియెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అటులనే ప్రవర్తించును”. మనం విశ్వాసం ద్వారా మనం
దేవుని నుండి క్షమాపణను పొందుతాము; కాని ఆ క్షమాపణను నిజంగా జీవించడానికి, అనుభవించడానికి,
మనం ఇతరులను క్షమించాలి. క్షమించని హృదయం క్షమాపణను పూర్తిగా స్వీకరించడానికి అడ్డంకిగా
మారుతుంది. ఇది క్షమాపణను సంపాదించడం కాదు; క్షమాపణకు తగిన జీవితాన్ని జీవించడం.
ఇది కేవలం వ్యక్తిగత భావోద్వేగ సలహా కాదు; సంఘ జీవితానికి పునాదిగా ఇవ్వబడిన బోధన. ఈ బోధన కేవలం మాటలతో ఆగిపోకుండా, జీవితంలో ఆచరణలోకి తీసుకువెళ్ళవలసినదని సూచిస్తూ అక్కడ నుండి ప్రభువు గలీలియ ప్రాంతానికి వెళుతున్నాడు.
5. నేటి జీవితంలో క్షమాపణ
ఈ సువిశేష భాగం వ్యక్తిగత స్థాయిలో,
ఆత్మ
పరిశీలనకు పిలుస్తుంది, నా హృదయంలో ఇంకా క్షమించని
వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నేను దేవుని కృపను మరచిపోయి ఇతరుల చిన్న తప్పులపై కఠినంగా
ప్రవర్తిస్తున్నానా? క్షమాపణ అనేది ఒకేసారి జరిగే సంఘటన కాదు; గాయం లోతుగా ఉన్నప్పుడు
అది ఒక ప్రక్రియగా సాగుతుంది. అయినప్పటికీ ఆ ప్రయాణాన్ని ప్రారంభించడానికి నిరాకరించడం,
రాజు క్షమించిన సేవకుని లాగే ప్రవర్తించడమే.
కుటుంబ,
సంఘ స్థాయిలో, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు-పిల్లల మధ్య, సోదర సోదరీమణుల మధ్య తలెత్తే
చిన్న చిన్న
అపార్థాలను హృదయపూర్వకంగా
క్షమించుకోవడం, ఆ సంబంధాలను కాపాడుతుంది. సంఘంలో కూడా అసూయ, అపార్థాలు
సహజమే; కాని క్రమశిక్షణ అవసరమైనప్పుడు కూడా దాని లక్ష్యం ఎప్పుడూ శిక్ష కాదు, పునరుద్ధరణ
మరియు సయోధ్యే.
సమాజ
స్థాయిలో, ఈ బోధన జాతి విభజనలు, రాజకీయ శత్రుత్వాలు, వర్గ వైషమ్యాలతో సతమతమవుతున్న
మన సమాజానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తుంది. క్షమాపణ లేని సమాజం ప్రతీకారం
వైపు, విచ్ఛిన్నం వైపు పోతుంది; క్షమాపణతో నిండిన సమాజం సయోధ్య వైపు, పునర్నిర్మాణం
వైపు సాగుతుంది. ఈ మూడు స్థాయిలలోనూ సూత్రం ఒక్కటే, దేవుని కరుణను
అనుభవించిన ప్రతి హృదయం ఆ కరుణను ఇతరులకు అందించడం ద్వారానే తన విశ్వాసాన్ని నిజం చేసుకుంటుంది.
ఈ సందర్భంలో మూడు ప్రశ్నలు ప్రతి విశ్వాసిని ఆత్మపరిశీలనకు నడిపిస్తాయి. మొదటిది, దేవుడు నన్ను ఎంత క్షమించాడో నేను నిజంగా గుర్తిస్తున్నానా, లేక ఆ కృపను తేలికగా తీసుకుంటున్నానా? రెండవది, నేను ఇప్పటికీ క్షమించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బహుశా కుటుంబ సభ్యుడు, సహోద్యోగి, స్నేహితుడు, లేదా సంఘ సభ్యుడు కావచ్చు? మూడవది, నా హృదయం నిజంగా స్వేచ్ఛగా ఉందా, లేక పాత గాయాల చుట్టూ ఇంకా బంధించబడి ఉందా? క్షమించని హృదయమె మొదట బాధపడేది. క్షమాపణ ఇతరులను విడిపించడమే కాదు, మనలను కూడా విముక్తి చేస్తుంది.
ముగింపు
క్షమాపణ
దేవుని నుండి ప్రారంభమవుతుంది, మనం దానిని ఉచితంగా పొందుతాము, దానిని ఇతరులకు అందించడం
ద్వారానే అది పూర్తవుతుంది. ఇది జరుగకపోతే
మనం
పొందిన కృపను నిజంగా అర్థం చేసుకోలేదని అర్థం.
క్షమాపణ
అంటే జరిగిన అన్యాయాన్ని
సమర్థించడం
కాదు, బాధను నిరాకరించడం
కాదు. అది ప్రతీకార
హక్కును
దేవునికి
అప్పగించి,
తన హృదయాన్ని ద్వేషమనే
చెరసాల
నుండి
విడిపించుకునే
మార్గం.
“
దేవుని కరుణను అనుభవించిన
ప్రజలుగా, ఆ కరుణను కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో పంచే శిష్యులుగా జీవించమని ఈ సువార్త
భాగం మనలను ఆహ్వానిస్తుంది. “ప్రభూ! నీవు నన్ను క్షమించినట్లు, నేనుకూడ నా సహోదరుని
క్షమించుచున్నాను” అని హృదయపూర్వకంగా చెప్పే
మనసును ఇవ్వమని వేడుకుందాం. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment