రాజకుమారుని వివాహ విందు ఉపమానము| మత్తయి 22:1-14 వ్యాఖ్యానం|కార్మెల్ శోభ
మత్తయి 22:1-14
రాజకుమారుని వివాహ విందు ఉపమానము
యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. "పరలోక రాజ్యము ఇట్లున్నది: ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి, ఆహ్వానింపబడిన వారిని 'విందుకు బయలుదేరిరండు' అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, 'ఇదిగో! నా విందు సిద్ధపరుపబడినది. ఎద్దులును, క్రొవ్వినదూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రండు' అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడినవారు దానిని లక్ష్యపెట్టక, తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరియొకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగుల బెట్టించెను. అంతట, తన సేవకులను పిలిచి, 'నా విందు సిద్ధముగా ఉన్నది. కాని, నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు' అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్ళి, మంచి, చెడు తేడా లేక తమ కంటబడిన వారినందరను తీసుకొనివచ్చిరి. ఆ కల్యాణమండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి, వివాహవస్త్రములేని వానిని ఒకనిని చూచి, 'మిత్రమా! వివాహవస్త్రము లేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి?' అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అపుడు ఆ రాజు తన సేవకులతో, 'ఇతనిని కాలుసేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు' అనెను. పిలువబడిన వారు అనేకులు, కాని, ఎన్నుకొనబడిన వారు కొందరే.
పరిచయం
యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యలో ఎక్కువగా ఉపమానముల ద్వారా బోధించారు. "ఉపమానము
లేకుండ ఆయన వారితో ఏమియు పలుకలేదు" (మత్తయి 13:34) అని మత్తయి
సువార్తికుడు పేర్కొనుటలో ఈ సత్యము
స్పష్టమగుచున్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయములో
కనిపించు "రాజకుమారుని వివాహ విందు" ఉపమానము యేసు ప్రభువు యెరూషలేము
దేవాలయములో, తన శ్రమలకు ముందు, ధర్మ శాస్త్ర బోధకులతో, మతనాయకులతో
ఘర్షణ తీవ్రమగుచున్న సందర్భములో బోధించిన ఉపమానములలో ఒకటి.
ఈ ఉపమానము దేవుని రాజ్య స్వభావమును,
మానవుని ప్రతిస్పందనను, మరియు అంత్యకాల
న్యాయనిర్ణయమును ప్రతిబింబించె సందేశము. ఈ
ఉపమానమును శాస్త్రీయ, వ్యాఖ్యాయన, ఆధ్యాత్మిక
మరియు సామాజిక కోణములలో పరిశీలిద్దాం.
శాస్త్రీయ కోణం
ఈ ఉపమానము మత్తయి సువార్తలో "వివాద
ఉపమానముల త్రయము"లో మూడవది. మొదటిది ఇద్దరు కుమారుల ఉపమానము (21:28-32),
రెండవది ద్రాక్షతోట కౌలుదారుల ఉపమానము (21:33-46), మూడవది ఈ వివాహ విందు ఉపమానము (22:1-14). ఈ
మూడు ఉపమనములు యెరూషలేము దేవాలయములో,
ప్రధానయాజకులు మరియు పెద్దలు యేసు ప్రభువు అధికారమును ప్రశ్నించిన తరువాత వరుసగా
చెప్పబడినవి. ఈ ఉపమానము ఇశ్రాయేలు మతనాయకత్వమును ఉద్దేశించి చెప్పబడినది.
ఉపమానమును మూడు ప్రధాన భాగలు ఉన్నవి
• మొదటి ఆహ్వానము తిరస్కరణ (22:1-7)
రాజు తన
సేవకులను రెండు సార్లు పంపాడు ; ఆహ్వానితులు నిర్లక్ష్యము చేసి, కొందరు సేవకులను చంపివేసారు; రాజు ప్రతీకారము
తీర్చుకొనును.
• విస్తృత ఆహ్వానము (22:8-10) వీధులలోని వారందరిని పిలుచుకొని రమ్మని రాజు ఆజ్ఞాపించును; మంచివారు,
చెడ్డవారు అందరు వచ్చెదరు.
• వివాహవస్త్రము లేని వ్యక్తి సంఘటన (22:11-14)
విందులోనికి వచ్చిన ఒక వ్యక్తికి తగిన
వస్త్రము లేకపోవుటచే బహిష్కరింపబడును; "పిలువబడినవారనేకులు,
ఏర్పరచబడినవారు కొందరే" అను ముగింపు వాక్యము.
పాత నిబంధన నేపథ్యము
"వివాహ విందు" పాత నిబంధనలో దేవుడు
తన ప్రజలతో చేసుకొను నిబంధనను, మెస్సీయ కాలపు ఆనందమును సూచించుటకు
తరచుగా వాడబడినది. యెషయా 25:6లో సైన్యములకధిపతియగు యావే ఈ పర్వతమందు సకల విందును చేయునని వ్రాయబడినది. యెషయా 62:5లో
వరుడు వధువును సంతోషించునట్లు దేవుడు తన ప్రజలయందు సంతోషించునని చెప్పబడినది.
హోషేయ, యిర్మీయా గ్రంథములలో కూడ ఇశ్రాయేలు దేవుని వధువుగా చిత్రింపబడినది.
II. వ్యాఖ్యాయన శాస్త్ర కోణం
ఈ ఉపమానము ప్రాచీన సంఘపు వ్యాఖ్యాతల
నుండి నేటివరకు ప్రధానముగా అలిగోరికల్ పద్ధతిలో ప్రకారం ప్రతి పాత్ర, వస్తువు ఒక ప్రతీకగా భావింపబడినది, దాని ప్రకారం
• రాజు = తండ్రి దేవుడు
• కుమారుడు = యేసుక్రీస్తు
• వివాహ విందు = దేవుని రాజ్యము, మెస్సీయ యుగము
• మొదటి ఆహ్వానితులు = ఇశ్రాయేలు జనులు,
ప్రత్యేకించి మతనాయకులు
• పంపబడిన సేవకులు = ప్రవక్తలు, అపొస్తలులు
• సేవకుల హత్య = ప్రవక్తల హింస, హతమార్పు
• పట్టణము తగులబెట్టుట = యెరూషలేము నాశనము
(క్రీ.శ. 70)
• వీధులలోని వారు = అన్యజనులు, పాపులు, సమాజపు అంచులలోనున్నవారు
• వివాహవస్త్రము లేని వ్యక్తి = బాహ్యముగా
విందులో చేరినను అంతరంగిక మార్పు లేనివాడు
చారిత్రక దృక్పథము
ఆధునిక పవిత్ర గ్రంధ పండితులు ఈ ఉపమానమును మత్తయి సువార్తికుడు సవరించి, తన
సమాజపు అవసరములకు అనుగుణముగా మలచడని చెబుతారు.
ముఖ్యముగా 22:7లో "సైన్యమును పంపి వధించి
పట్టణమును తగులబెట్టుట" అను వివరము, మామూలు వివాహవిందు
కథలో ఇమడడు, ఇది స్పష్టముగా క్రీ.శ. 70లో రోమా సైన్యము
యెరూషలేమును నాశనము చేసిన సంఘటనను చూపిస్తుంది.
మూడు ఆహ్వానములు
ఈ ఉపమానములో ఆహ్వానము మూడుమార్లు ఇవ్వబడింది. మొదటి ఆహ్వానము, రెండవ
ఆహ్వానము (విందు సిద్ధమైనదని చెప్పుట), మూడవ ఆహ్వానము
(వీధులలోనికి వెళ్ళి అందరిని పిలుచుట). ఇది దేవుని సహనమును, ఆయన
కృప పదేపదే మనుష్యుని వెదకుచున్నదని సూచిస్తుంది.
"పిలువబడినవారు - ఎన్నుకొనబడినవారు "
14వ వచనము ("పిలువబడినవారనేకులు,
ఎన్నుకొనబడినవారు కొందరే") అనేక చర్చలకు కేంద్రబిందువైనది.
దేవుని ఆహ్వానము (klēsis) విస్తృతమైనది, అందరికి
అందించబడినది; కాని ఆ ఆహ్వానమునకు నిజమైన, హృదయపూర్వక ప్రతిస్పందన ఇచ్చువారు, అనగా
"ఎన్నుకొనబడినవారు" (eklektoi) తక్కువమంది. ఇది
దేవుని పక్షపాతము కాదు, మానవుని స్వేచ్ఛా ప్రతిస్పందనను సూచింస్తుంది.
దేవుడు అందరిని రక్షింపగోరుచున్నాడు (1 తిమోతి 2:4),
కాని మానవుని స్వేచ్ఛా ఆ కృపను అంగీకరించుటలో లేదా తిరస్కరించుటలో
నిర్ణాయక పాత్ర వహిస్తుంది.
III. ఆధ్యాత్మిక కోణం
దేవుని అపరిమిత కృప మరియు సహనము
ఈ ఉపమానములో కనపడే ఆధ్యాత్మిక సత్యము దేవుని అనంతమైన కృప, ఆహ్వానము,
మరియు సహనము. రాజు ఒక్కసారి తిరస్కరింపబడినను నిరుత్సాహపడక, మరల మరల సేవకులను పంపుతాడు. ఇది దేవుడు మానవుని పదేపదే వెదకుచున్న
ప్రేమను చూపిస్తుంది. తప్పిపోయిన గొఱ్ఱెను
వెదకు కాపరి, తండ్రి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురుచూచుట (లూకా 15) వంటి ఉపమానములతో దీనికి సారూప్యత ఉంది. దేవుని రాజ్యమునకు ఆహ్వానము
ఒక్కసారికే పరిమితము కాదు; అది జీవితమంతటిలో పలుమార్లు, వివిధ రూపములలో మనలను చేరుచున్నది.
ఆహ్వానము తిరస్కరించుటకు కారణములు - ఆధ్యాత్మిక నిర్లక్ష్యము
ఆహ్వానితులు తిరస్కరించుటకు కారణము
శత్రుత్వము కాదు. "ఒకడు తన పొలమునకు,
మరియొకడు తన వ్యాపారమునకు వెళ్ళెను" అను వాక్యము గమనింపదగినది.
ఇది హింసాత్మక తిరస్కరణ కాదు, నిత్యజీవిత తొందరపాటు, భౌతిక వ్యాపకములపట్ల మక్కువ వలన కలిగిన నిర్లక్ష్యము. ఇది నేటి
ఆధ్యాత్మిక జీవితమునకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. దేవుని రాజ్యమును తిరస్కరించుటకు ద్వేషము అవసరము
లేదు; కేవలము వ్యాపారము, ఆస్తి, భౌతిక
చింతలు చాలు. యేసు ప్రభువు మరియొక సందర్భములో చెప్పినట్లు, "“ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని
ద్వేషించును. మరియొకనిని ప్రేమించును, ఒకనిని నమ్ముకొని, మరియొకనిని
తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవమును, ధనమును సేవింపజాలవు." (మత్తయి 6:24).
వివాహవస్త్రము - అంతరంగిక పరివర్తన
మూడవ భాగములోని వివాహవస్త్రము లేని
వ్యక్తి సంఘటన తెలుసుకొనవలసినది, అతడు హృదయము పరివర్తన చెందలేదు, పరిశుద్ధత లేదు, క్రీస్తును ధరించలేదు, (గలతీయులకు 3:27)
. తిరుసభ పితరులు ఈ వస్త్రమును ప్రేమగా, లేదా
క్రీస్తు నీతిని ధరించుకొనుటగా వ్యాఖ్యానించారు. కేవలము బాహ్యముగా క్రైస్తవ
సమాజములో సభ్యుడైయుండుట సరిపోదు; అంతరంగిక పరివర్తన, పరిశుద్ధ జీవితము అవసరము.
తీర్పు యొక్క వాస్తవికత
ఉపమానము ముగింపులో "కాలుసేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి
త్రోసివేయుడు" అనే మాట దేవుని కృప అపరిమితమైనను, తీర్పు
వాస్తవమని బోధిస్తుంది. దేవుడు ప్రేమమయుడైనను, ఆయన
నీతిమంతుడు కూడ. కృపను నిర్లక్ష్యము చేయుట, లేదా
దానిని దుర్వినియోగము చేయుట పర్యవసానములు కలిగియుంటుంది. ఇది సౌమ్యత లేని
కఠినత్వము కాదు, బాధ్యతను గుర్తుచేయు వాస్తవికత.
IV. సామాజిక దృక్పథము
ప్రాచీన సమాజములో వివాహ విందుల ప్రాముఖ్యత
మొదటి శతాబ్దపు యూద-గ్రీకో-రోమ సమాజములో
రాజకుటుంబపు వివాహ విందు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సామాజిక ఘటన. దానికి ఆహ్వానము
పొందుట గౌరవముగా భావింపబడెడిది; దానిని తిరస్కరించుట రాజుకు ఘోరమైన
అవమానము, ద్రోహముగా పరిగణింపబడెడిది. కావున
ఆహ్వానితులు తిరస్కరించుట, సేవకులను కొట్టిచంపుట, ఇది కేవలము
వ్యక్తిగత అగౌరవము కాదు, రాజ్యద్రోహ చర్యగా భావింపబడెడి తీవ్రమైన
సామాజిక తిరుగుబాటు.
సామాజిక వర్గముల మార్పు - అట్టడుగు వర్గముల చేరిక
ఈ ఉపమానములోని ముఖ్యమైన సామాజిక సందేశము. మొదటి ఆహ్వానితులు తిరస్కరించినపుడు, రాజు "వీధి మార్గములకు" వెళ్ళి "మంచి, చెడు తేడా లేక" కనబడిన వారినందరిని పిలుచుకొని రమ్మని
ఆజ్ఞాపించుట. ఇది సమాజముచే వెలుపల పెట్టబడినవారు, పేదలు, పాపులుగా
ముద్రవేయబడినవారు, సామాజిక బహిష్కృతులు, దేవుని రాజ్యములోనికి చేర్చబడుటను సూచిస్తుంది.
ఇది యేసు ప్రభువు పరిచర్యలో పదేపదే
కనిపించు అంశము, సుంకరులు, పాపులతో భోజనము చేయుట (మత్తయి 9:10-13),
సమరయ స్త్రీతో సంభాషణ (యోహాను 4). మత్తయి
21:31లో యేసు ప్రభువు స్వయముగా
"సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో
ప్రవేశించుచున్నారు" అని చెప్పాడు.
సామాజిక దృక్పథము నుండి చూచినపుడు,
ఇది మతపరమైన, సామాజికమైన అధికార నిర్మాణములను
తలక్రిందులు చేయు సందేశము. దేవుని రాజ్యము
పుట్టుక, హోదా, సంపద,
మతపరమైన స్థానము ఆధారముగా కాక, కృపను
స్వీకరించు వినయము ఆధారముగా నిర్ణయింపబడుతుంది.
"మిశ్రమ సమాజము"
విస్తృత ఆహ్వానము తరువాత విందు
"మంచివారితో, చెడ్డవారితో" నిండెను అను వాక్యము,
సంఘపు వాస్తవ స్వభావమును సూచిస్తుంది.
సంఘము పరిపూర్ణుల సమాజము కాదు; అది పాపులు, పరిశుద్ధులు
కలిసియున్న "మిశ్రమ సమాజము". ఇది గోధుమలు-కలుపు మొక్కల ఉపమానముతో
(మత్తయి 13:24-30) సారూప్యత కలిగిఉంది.
ఆధునిక సామాజిక అన్వయము
నేటి సమాజ సందర్భములో ఈ ఉపమానము ప్రత్యేక
ప్రాధాన్యత కలిగియున్నది.
• కుల, వర్గ
భేదములను అధిగమించుట: దేవుని రాజ్య ఆహ్వానము కుల, వర్గ,
ఆర్థిక స్థాయిల ఆధారముగా వివక్ష చూపదు. సంఘము సమాజములోని అట్టడుగు
వర్గములను, అణగారిన వర్గములను చేరదీయవలసిన బాధ్యతను
ఇది గుర్తుచేస్తుంది.
• మతపరమైన నిర్లక్ష్యము పట్ల హెచ్చరిక:
బాహ్యముగా మతపరమైన ఆచారములు పాటించుచున్నను, అంతరంగిక
పరివర్తన లేని క్రైస్తవులకు ఇది గట్టి హెచ్చరిక.
• వ్యాపార, భౌతిక
చింతల ప్రాధాన్యత: ఆధునిక సమాజములో ఆర్థిక ఒత్తిడులు, ఉద్యోగ
వ్యాపకములు దేవుని పిలుపును నిర్లక్ష్యము చేయుటకు ప్రధాన కారణములుగా నేటికిని
కొనసాగుచున్నవి.
ముగింపు
చివరిగా, ఈ
ఉపమానము ప్రతి పాఠకునికి, ప్రతి విశ్వాసికి ఒక వ్యక్తిగత ప్రశ్నను
ఎదుర్కొనునట్లు చేస్తుంది. "నేను ఆహ్వానమును అంగీకరించితినా? నేను వివాహవస్త్రమును ధరించితినా, అనగా, నా జీవితము
క్రీస్తు నీతిని ప్రతిబింబించుచున్నదా?" దేవుని
రాజ్యపు విందుకు ఆహ్వానము అందరికి తెరిచియున్నది, కాని
ఆ ఆహ్వానమునకు తగినట్లు జీవించుట మన బాధ్యత. "పిలువబడినవారు అనేకులు, ఎన్నుకొనబడినవారు కొందరే" అను వాక్యము మనలను భయపెట్టుటకు కాదు,
మేల్కొల్పుటకు, నిత్యము జాగరూకతతో, కృతజ్ఞతతో, పరివర్తన చెందిన హృదయముతో దేవుని
ఆహ్వానమునకు ప్రతిస్పందించుటకు ప్రేరేపించుటకు వ్రాయబడినది.
ప్రార్ధన
ప్రభువా! నీ అపరిమితమైన కృపతో మమ్ములను నీ రాజ్యపు వివాహ విందుకు ఆహ్వానించినందుకు నీకు స్తుతులు . లోక సంబంధమైన వ్యాపారములలో, ఐహిక విచారములలో మునిగిపోయి నీ దివ్య పిలుపును నిర్లక్ష్యం చేయకుండా, నిత్యం నీ వెలుగులో నడుచుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము. ప్రభువా, కేవలం బాహ్య సంబంధమైన ఆచారాలతో సరిపెట్టుకొనక, క్రీస్తు నీతియనే 'వివాహ వస్త్రాన్ని' ధరించి, అంతరంగ పరివర్తనతో జీవించే కృపను మాకు దయచేయుము. నీ ఆత్మ నడిపింపు ద్వారా నిత్యము జాగరూకత కలిగి, నీవు ఎన్నుకొన్న వారిలా నిలిచేలా మమ్ములను బలపరచమని వేడుకొనుచున్నాము.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment