లూకా 9:18-22 వ్యాఖ్యానం: పేతురు విశ్వాస ప్రకటన - నీవు దేవుని క్రీస్తువు



లూకా 9:18-22

ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసికొనుచుండగా ఆయన శిష్యులుకూడ అచట ఉండిరి. అపుడు ఆయన వారిని "ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు?" అని అడిగెను. "స్నాపకుడగు యోహాను అని కొందరు; ఏలీయా అని మరికొందరు; పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు" అని వారు సమాధానము ఇచ్చిరి. యేసు వారిని "మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు?" అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు "నీవు దేవుని క్రీస్తువు" అని బదులు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని "ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు" అని ఆజ్ఞాపించి "మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింప బడి, చంపబడి, మూడవదినమున ఉత్థానమగుట అగత్యము" అని పలికెను.

"నీవు దేవుని క్రీస్తువు" 

యేసు ప్రభువు కాలంలో ప్రజలను ఒక ప్రశ్న ఎప్పుడూ మనుషులను వెంటాడుతూనే ఉండేది, అది "ఈయన ఎవరు?" ఈ ప్రశ్న ఎంతో విరివిగా వినపడేది. కొందరు ఆయనను ప్రవక్తగా చూశారు, కొందరు అద్భుతాలు చేసే గురువుగా చూశారు, కొందరు రాజకీయ విమోచకునిగా ఆశించారు. లూకా 9:18-22లో యేసు ప్రభువే స్వయంగా ఆ ప్రశ్నను తన శిష్యులను  అడుగుతున్నాడు. ఇది ప్రతి తరంలో, ప్రతి విశ్వాసి జీవితంలో మళ్ళీ మళ్ళీ అడగవలసిన ప్రశ్న.

1. సందర్భం: ఈ సంభాషణ ఎక్కడ, ఎందుకు జరిగింది?

లూకా 9వ అధ్యాయం ప్రారంభంలో యేసు ప్రభువు తన పన్నెండుమంది శిష్యులను సువార్త ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి పంపించాడు (9:1-6). వారు తిరిగి వచ్చిన తర్వాత, ఐదు వేల మందికి ఆహారమిచ్చిన గొప్ప అద్భుతం జరుగుతుంది (9:10-17). ఈ రెండు సంఘటనల మధ్య యేసు ప్రభువు కీర్తి పెరుగుతూ వచ్చింది. హేరోదు కూడా "ఈయన ఎవరు?" అని కలవరపడ్డాడు (9:7-9). ఇప్పుడు అదే ప్రశ్న శిష్యుల ముందుకు వస్తుంది, కానీ ఈసారి దాన్ని అడిగేది యేసు ప్రభువే.

మత్తయి, మార్కు సువార్తలు ఈ సంభాషణ కైసరయ ఫిలిప్పీ ప్రాంతంలో జరిగిందని చెబుతాయి. అబద్ధపు దేవుళ్ళ మధ్యలో నిజమైన దేవుని కుమారుడు ఎవరో తేలవలసిన క్షణం అది. అయితే లూకా దృష్టి అంతా ప్రార్థనపై, పేతురు జవాబుపై కేంద్రీకృతమై ఉంది.

2. "ఆయన ఒంటరిగా ప్రార్థన చేసికొనుచుండగా" - లూకా ప్రత్యేకత

"యేసు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు" అనే వివరం లూకాలో మాత్రమే కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. లూకా సువార్తలో యేసు ప్రభువు జీవితంలోని ప్రతి కీలక మలుపుకు ముందు ప్రార్థన కనిపిస్తుంది. బాప్తిస్మ సమయంలో (3:21), పన్నెండుమంది అపొస్తులులను ఎన్నుకునే ముందు (6:12), రూపాంతరం చెందడానికి ముందు (9:28-29), గెత్సేమనే తోటలో (22:41-44). పేతురు విశ్వాస ప్రకటన, ప్రభువు శ్రమల గురించి మొదటి ప్రవచనం అనే ఈ మలుపు కూడా ప్రార్థనలో నుండే పుడుతుంది. యేసు ప్రభువు "ఒంటరిగా" ప్రార్థిస్తున్నాడని చెబుతూనే, వెంటనే "ఆయన శిష్యులుకూడ అచట ఉండిరి" అని లూకా చెబుతున్నాడు. ఇది వైరుధ్యంగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇది యేసు ప్రభువు ప్రార్థనా జీవితపు అంతస్తును చూపిస్తుంది. ఆయన శారీరకంగా శిష్యులకు దూరంగా వెళ్ళలేదు, కానీ ఆత్మలో తండ్రితో ఏకాంత సంభాషణలో ఉన్నాడు. ఆయన జనసమూహం మధ్యలో ఉన్నా, రోజువారీ కార్యకలాపాల మధ్యలో ఉన్నా, హృదయంలో దేవునితో ఏకాంత సంభాషణ సాధ్యమే.

పేతురు విశ్వాస ప్రకటన కూడా ప్రార్థన నేపథ్యంలోనే వస్తుంది. మనం యేసు ప్రభువును ఎవరని తెలుసుకుంటామో, అనేది మాన జ్ఞాన సముపార్జన వల్ల మాత్రమే కాదు, అది దేవునితో ప్రార్థనాపూర్వక సంబంధం వల్ల వచ్చేది.

3. "ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు?"

యేసు ప్రభువు అడిగిన మొదటి ప్రశ్న బహిరంగ అభిప్రాయం గురించినది. ఇది శిష్యులను రక్షణాత్మక స్థితిలోకి నెట్టదు. వారు తమ సొంత అభిప్రాయాన్ని కాక, ప్రజలు అనుకునేది చెప్పాలి. మొదట బయటి అభిప్రాయాలను సేకరించి, తర్వాత వ్యక్తిగత ప్రశ్నకు దారి తీయడం ఒక బోధనా పద్ధతి.

శిష్యులు ఇచ్చిన సమాధానంలో మూడు అభిప్రాయాలు ఉన్నవి. ఒకటి, స్నాపకుడగు యోహాను, హేరోదు కూడా ఇదే అభిప్రాయం కలిగి ఉన్నాడు. రెండు, ఏలీయా, మలాకీ 4:5-6లో ప్రభువు దినము రాకమునుపు ఏలీయా ప్రవక్తను వస్తాడనే ప్రవచనం ఉంది. యూదులు మెస్సీయ రాకకు ముందు ఏలీయా తిరిగివస్తాడని ఆశించేవారు. మూడు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచివచ్చాడని. ఇవన్నీ  గతంలో జీవించిన ఎవరో ఒకరి పునరాగమనంగా చూస్తాయి. అంటే, ప్రజలు యేసు ప్రభువును గౌరవించారు, ఆయనను ప్రవక్తగా అంగీకరించారు. కానీ ఆయనను దేవుని కుమారునిగా గుర్తించలేకపోయారు.

4. "మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు?"

ఈ వాక్యంలో "మీరు" అనే పదానికి ప్రత్యేక ఉద్ఘాటన ఉంది. "ఇతరులు ఏమనుకున్నా, మీరు ఏమనుకుంటున్నారు?" అన్నట్టుగా ఉంది. ఇది వ్యక్తిగత విశ్వాసానికి, సాధారణ అభిప్రాయానికి మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది.

ఈ ప్రశ్న ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. మనకు వ్యక్తిగతంగా యేసు ప్రభువు ఎవరో తెలుసా? విశ్వాసం అనేది వారసత్వంగా వచ్చే సమాచారం కాదు. అది ప్రతి వ్యక్తి తనదైన రీతిలో ప్రభువును ఎదుర్కొని, ఆయనను గుర్తించి, ఆయనకు జవాబు ఇవ్వవలసిన వ్యక్తిగత అనుభవం. తల్లిదండ్రుల విశ్వాసం మనకు పునాది కావచ్చు, కానీ అది మన సొంత సమాధానానికి ప్రత్యామ్నాయం కాదు.

5. "నీవు దేవుని క్రీస్తువు"

పేతురు వెంటనే జవాబిస్తున్నాడు. తరచూ మొదటగా మాట్లాడటం, కొన్నిసార్లు తొందరపడటం, అతనికి అలవాటే, కానీ ఇక్కడ అతని జవాబు ఖచ్చితమైనది, విలువైనది. "నీవు దేవుని క్రీస్తువు"  అని సమాధానం ఇచ్చాడు. "క్రీస్తు" (Χριστός) అనే గ్రీకు పదం హీబ్రూ "మెస్సీయ" (מָשִׁיחַ) పదానికి అనువాదం. దీని అర్థం "అభిషిక్తుడు." పాత నిబంధనలో రాజులను, యాజకులను, కొన్నిసార్లు ప్రవక్తలను తైలంతో అభిషేకించి దేవుని సేవకు ప్రత్యేకపరిచేవారు. కాలక్రమేణా "మెస్సీయ" అనే పదం ఇశ్రాయేలును విమోచించి, దేవుని రాజ్యాన్ని స్థాపించే ప్రత్యేక వ్యక్తి కోసం వాడబడింది. పేతురు "దేవుని క్రీస్తువు" అని చెప్పడం ద్వారా, యేసు ప్రభువు ఆ నిరీక్షించబడిన అభిషిక్తుడేనని ప్రకటిస్తున్నాడు.

6. "ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు" -మౌనాజ్ఞ ఎందుకు?

పేతురు సరైన సమాధానం ఇచ్చిన వెంటనే యేసు ప్రభువు దానిని రహస్యంగా ఉంచమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది మొదటి చూపులో వింతగా అనిపించవచ్చు. నిజం బయటపెట్టకుండా ఎందుకు దాచాలి? ఆ కాలంలో చాలామంది యూదులు మెస్సీయను ఒక రాజకీయ, సైనిక విమోచకునిగా ఊహించుకున్నారు. రోమా పాలననుండి ఇశ్రాయేలును విడిపించే యుద్ధవీరునిగా చూశారు. "నీవు క్రీస్తువు" అనే ప్రకటన బహిరంగంగా వ్యాపిస్తే, ప్రజలు యేసు ప్రభువును బలవంతంగా రాజుగా చేయడానికి ప్రయత్నించే ప్రమాదం ఉంది (యోహాను 6:15లో ఇలాంటి సంఘటనే జరుగుతుంది). అలాంటి తప్పుడు అవగాహనతో కూడిన ఉద్యమం, యేసు ప్రభువు నిజమైన లక్ష్యానికి (అది శ్రమలను, బాధలు అనుభవించి మరణించి, పునరుత్థానమై రక్షణను సాధించడానికి,) ఆటంకంగా మారేది.

7. "మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి."

ఇక్కడ యేసు ప్రభువు తనను తాను "మనుష్య కుమారుడు" అని సంబోధించుకుంటాడు. ఇది యేసు ప్రభువు తన గురించి తానే ఎక్కువగా వాడుకున్న మాట. దానియేలు 7:13-14లో "మనుష్య కుమారుని పోలిన ఒకడు" ఆకాశ మేఘాలతో వచ్చి, నిత్య రాజ్యాన్ని పొందుతాడని ప్రవచించబడింది. అది మహిమ, అధికారం సూచించే బిరుదు. అయితే యేసు ప్రభువు  ఈ మహిమాన్విత బిరుదును శ్రమ, తిరస్కారం, మరణంతో ముడిపెడతాడు. ఇది ఆనాటి యూదుల ఊహకు పూర్తిగా విరుద్ధమైనది. మహిమగల మనుష్యకుమారుడు బాధపడతాడని ఎవరూ ఊహించలేదు.

ఇక్కడ యేసు ప్రభువు నాలుగు విషయాలను స్పష్టంగా చెబుతున్నాడు, 

అనేక శ్రమలు అనుభవించడం - ఇది సాధారణ బాధ కాదు, తీవ్రమైన, బహుముఖమైన బాధ.

పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడటం - ఇది యూదా సన్హెడ్రిన్ (మహాసభ) సభ్యులను సూచిస్తుంది, ఆనాటి మత నాయకత్వం మొత్తం.

చంపబడటం - స్పష్టమైన మరణ ప్రవచనం.

మూడవదినమున లేచుట - పునరుత్థాన నిరీక్షణ విజయంతో ముగియుట.

ఈ ప్రవచనంలో ఒక ముఖ్యమైన సత్యం దాగి ఉంది: సిలువ శ్రమలు యాదృచ్ఛికమైన దుర్ఘటన కాదు, దేవుని ప్రణాళికలో అవసరమైనవి. మనుష్యుల ద్రోహం, మతనాయకుల కుట్ర సిలువకు కారణమైనప్పటికీ, మానవుల చెడుతనాన్ని కూడా దేవుడు తన మంచి ఉద్దేశం కోసం వాడుకోగలడు.

8. "మనుష్య కుమారుడు" మరియు యెషయా బాధమయ సేవకుడు

మనుష్యకుమారుని శ్రమలు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలోని మరో ప్రవచనాన్ని కూడా చూడాలి. యెషయా 52:13-53:12లో వర్ణించబడిన "బాధమయ సేవకుడు" (Suffering Servant).

యూదా సంప్రదాయంలో మెస్సీయ, బాధమయ సేవకుడు అనేవి సాధారణంగా వేర్వేరు వ్యక్తులుగా అనుకున్నారు. ఒకరు జయించే రాజు, మరొకడు బాధపడే సేవకుడు. కాని యేసు ప్రభువు "క్రీస్తు" (అభిషిక్త రాజు) మరియు "బాధమయ సేవకుడు" ఒకరే అని ప్రకటించడం ఆనాటి యూదయ ప్రజలకు క్రొత్త భోద. పేతురు "నీవు దేవుని క్రీస్తువు" అని చెప్పినప్పుడు రాజరిక కోణాన్ని మాత్రమే చూశాడు; యేసు ప్రభువు వెంటనే దానికి సేవక, శ్రమల కోణాన్ని జోడించి, పూర్తి చిత్రాన్ని ఇచ్చాడు.

9. పేతురు స్వభావం: ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి

పేతురు పాత్రను ఈ భాగంలో మాత్రమే కాక, సువార్తలలో మొత్తం చూస్తే ఒక ఆసక్తికరమైన వ్యక్తిత్వం కనిపిస్తుంది. అతడు తరచూ ముందుగా, ధైర్యంగా మాట్లాడతాడు, కానీ అతని అవగాహన ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఇక్కడ మాత్రం ప్రభువు గురించి ఖచ్చితమైన మాటను చెబుతున్నాడు. మత్తయి కథనం ప్రకారం అదే సంభాషణ కొనసాగింపులో యేసు ప్రభువు శ్రమల ప్రవచనాన్ని వినగానే అతడు "ప్రభువా, అది నీకు జరుగక ఉండునుగాక" అని అభ్యంతరం చెబుతాడు, దానికి ప్రభువు "సాతానా, వెనుకకు పొమ్ము" అని తీవ్రంగా గద్దిస్తాడు (మత్తయి 16:22-23). ఒకే సంభాషణలో అత్యున్నత విశ్వాస ప్రకటన, తీవ్రమైన అపార్థం రెండూ కలిసి కనిపించడం మానవ విశ్వాసపు వాస్తవికతను చూపిస్తుంది. మనం ఒక్క క్షణంలో గొప్ప విశ్వాసాన్ని ప్రకటించి, మరు క్షణంలోనే దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇది మనలను నిరుత్సాహపరచడానికి కాదు, ఓదార్చడానికి ఉపయోగపడే విషయం. అసంపూర్ణమైన అవగాహనతో ఉన్నా, పేతురు యేసు ప్రభువును వెంబడించడం మానలేదు. విశ్వాస ప్రయాణం క్రమంగా పరిపక్వం చెందేదె, కాని ఒక్క క్షణంలో పరిపూర్ణమయ్యేది కాదు.

10. ఈ భాగం మనకు ఏమి నేర్పుతుంది?

ఎ. విశ్వాసం వ్యక్తిగతమైనది: "ప్రజలు ఏమనుకుంటున్నారు" అనే ప్రశ్న నుండి "మీరు ఏమనుకుంటున్నారు" అనే ప్రశ్నకు మారడం మనకు ఏమి గుర్తుచేస్తుంది అంటే విశ్వాసం అరువు తీసుకోలేనిది. ప్రతి తరం, ప్రతి వ్యక్తి యేసు ప్రభువును స్వయంగా కలుసుకొని తమదైన సమాధానం ఇవ్వాలి.

బి. సరైన గుర్తింపుకు సరైన అవగాహన అవసరం: పేతురు "నీవు క్రీస్తువు" అని సరిగ్గా గుర్తించాడు, కానీ "క్రీస్తు" అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోలేదు. మత్తయి 16:22-23లో అదే సంభాషణ కొనసాగింపులో పేతురు యేసు ప్రభువు శ్రమల ప్రవచనాన్ని వ్యతిరేకించి గద్దింపు పొందాడు. సరైన గుర్తింపు ఇచ్చినంత మాత్రాన సరైన అవగాహన వచ్చినట్టు కాదు. మనం కూడా "యేసు ప్రభువు" అని నోటితో ఒప్పుకుంటూనే, ఆయన శ్రమలు పొందిన  మార్గాన్ని, సేవా జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు.

సి. మహిమ శ్రమల ద్వారా వస్తుంది: మనుష్యకుమారుని మహిమ (దానియేలు 7 ప్రవచనం) శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా సాకారమవుతుంది. ఇది క్రైస్తవ జీవితానికి కూడా ఒక మాదిరి, నిజమైన మహిమ, నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల సులభమైన మార్గంలో కాదు, శిలువను మోసే మార్గంలో వస్తుంది.

డి. ప్రార్థన ద్వారా వచ్చే జ్ఞానం: దేవుని గురించిన లోతైన సత్యాలు కేవలం మేధో పరిశోధన ద్వారా మాత్రమే కాదు, ప్రార్థనాపూర్వక సంబంధం ద్వారా వెల్లడవుతాయి.

11.  మన జీవితానికి ఈ సువిశేష భాగం  ఏమి చెబుతుంది?

క్రైస్తవులు అందరు  ఈ ప్రశ్నను ఒక్కసారైనా విని ఉంటారు, "మీ దృష్టిలో యేసు ఎవరు?" అని ఎవరైనా అడిగితే, వెంటనే బోధనాపరమైన సమాధానం ఇవ్వడం సులభం. కానీ ఆ ప్రశ్నను మనమే మననం చేసుకున్నప్పుడు తెలుస్తుంది, నిజమైన సమాధానం రావాలంటే ముందు ప్రార్థనలో తెలుసుకోవాలి, తర్వాతే మాట పెదవుల మీదకు రావాలి.

ఈ వచనభాగం మనలను మూడు విధాలుగా సవాలు చేస్తుంది:

మొదటిది, "ప్రజలు ఏమంటారో" అనే స్థాయి నుండి బయటపడి, యేసు ప్రభువుతో వ్యక్తిగత సంబంధంలోకి రావాలి. కుటుంబ సంప్రదాయం వల్ల, పుట్టుకతోనే క్రైస్తవులమైనంత మాత్రాన మన విశ్వాసం పరిపక్వమైనదని అనుకోకూడదు. మొదట ప్రభువు ముందు నిలబడి, "నాకు నీవు ఎవరు?" అని తనను తానే ప్రశ్నించుకోవాలి.

రెండవది, మనం అంగీకరించే యేసు శ్రమలు అనుభవించైనా యేసు కూడా అని గుర్తుంచుకోవాలి. సౌకర్యవంతమైన, సమస్యలేని క్రైస్తవ జీవితాన్ని ఆశించడం పేతురు మొదటి తప్పిదానికి దగ్గరగా ఉంటుంది.

మూడవది, ఏకాంత ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ముగింపు

లూకా 9:18-22 ఇది ప్రతి విశ్వాసి జీవితంలో పునరావృతమయ్యే ఆధ్యాత్మిక క్షణం. ప్రజల అభిప్రాయాల గందరగోళం మధ్య, యేసు ప్రభువు మనలను వ్యక్తిగతంగా అడుగుతున్నాడు. "మరి నీవు నన్ను ఎవరినని అనుకుంటున్నావు?" ఈ ప్రశ్నకు మన సమాధానం మన నోటి మాటలతోనే కాదు, మన జీవిత విధానంతో కూడా ఇవ్వాలి. పేతురులా "నీవు దేవుని క్రీస్తువు" అని ఒప్పుకోవడం మొదటి అడుగు మాత్రమే, ఆ క్రీస్తు శ్రమలు పడిన, సిలువ మోసిన, పునరుత్థానమైన క్రీస్తు అని పూర్తిగా అంగీకరించి, ఆయన బాటలోనే నడవడమే నిజమైన శిష్యరికం.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి