లూకా 9:7-9 ధ్యానం: హేరోదు కలవరం – యేసు ఎవరు?
హేరోదు కలవరము - యేసు ఎవరు?
లూకా 9:7-9 ధ్యానం
“ఆ కాలమున గలిలీయ రాజ్యపాలకుడగు హేరోదు యేసునుగూర్చి అంతయు విని కలవర పడెను. ఏలయన, స్నాపకుడగు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడెనని కొందరు, ఏలీయా అవతరించెనని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచెనని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. 'నేను యోహాను తలతీయించితినిగదా! మరి నేను వినుచున్న వార్తలన్నియు ఎవరిని గురించియై ఉండవచ్చును' అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను.” లూకా 9:7-9
పరిచయం
లూకా సువార్త 9వ అధ్యాయం యేసు ప్రభువుని పరిచర్యలో ఒక మలుపు తీసుకుంటుంది. యేసు ప్రభువు తన పన్నెండుమంది శిష్యులకు దయ్యాలపై అధికారాన్ని, రోగులను స్వస్థపరచే శక్తిని ఇచ్చి, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి పంపించాడు. (9:1-6). వారి పరిచర్య గలిలయ అంతటా వ్యాపించగా, ప్రభువు కీర్తి హెరోదు రాజ ఆస్థానం వరకు చేరుకుంది. ఈ మూడు వచనాలలో లూకా, గలిలయ రాజ్యపాలకుడైన హేరోదు ఎలా ప్రభువు కీర్తి గురించి స్పందించినది మనకు తెలియజేస్తున్నాడు. హెరోదు ఆనంద పడుటలేదు, కలవరపడుతున్నాడు.
ఈ సువిశేష భాగం “యేసు ప్రభువు ఎవరు?” అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యేలా చేస్తుంది. ఇదే అధ్యాయంలో కొన్ని వచనాల తర్వాత, ఇదే ప్రశ్నను యేసు ప్రభువే స్వయంగా తన శిష్యులను అడుగుతున్నాడు. (9:18-20), అపుడు పేతురు “నీవు దేవుని క్రీస్తువు” అని జవాబిచ్చాడు. హేరోదు కలవరపాటు, పేతురు స్పష్టమైన విశ్వాస ప్రకటనకు నేపథ్యంగా ఈ సువిశేష భాగం వస్తుంది.
ఈ మూడు వచనాలలో మనం ముఖ్యమైన విషయాలను చూస్తాము. అవి మొదటిది, రాజకీయ అధికారం ఎదుట సత్యం ఎలా నిలబడగలదో చూస్తాము. రెండవది, పాపం చేసిన మనస్సు ఎలా భయంతో, గందరగోళంతో నిండిపోతుందో చూస్తాము. మూడవది, యేసు ప్రభువును సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంత అవసరమో చూస్తాము.
హేరోదు అంతియోపస్ ఎవరు?
మనము ఇక్కడ చూసే హెరోదు, హేరోదు మహారాజు కుమారుడైన హేరోదు అంతియోపస్. గలిలయ, పెరయ ప్రాంతాలను రోమా సామ్రాజ్యం తరఫున పరిపాలించాడు.
హేరోదు తన సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను వివాహం చేసుకోవడం, మరియు దీనిని ఖండించిన స్నాపకుడు యోహానును చెరసాలలో వేసి, హేరోదియ కుమార్తె నాట్యానికి మెచ్చి చేసిన మూర్ఖపు ప్రమాణం కారణంగా అతని తల నరికించడం (మార్కు 6:14-29; మత్తయి 14:1-12) వంటి పనులతో గుర్తుండిపోయాడు. ఈ నేపథ్యం తెలియకుండా ఈ సువిశేష భాగం అర్ధం కాదు.
హేరోదు కుటుంబం అధికార దాహంతో నిండిన చరిత్ర కలిగినది. హేరోదు మహారాజు తన సొంత కుమారులను, భార్యలను కూడా అనుమానంతో చంపించాడు. ఈ నేపథ్యం అంతియోపస్ను కూడా ప్రభావితం చేసింది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం నైతికతను త్యాగం చేయడం అతనికి కొత్త విషయం కాదు. అయితే, యోహానును చంపించిన తరువాత అతని అంతరంగంలో నెలకొన్న అశాంతి, అతని కుటుంబ చరిత్రలో మనం చూడని ఒక కొత్త అంశం.
“కలవరపడెను”
తెలుగులో “కలవరపడెను” అని అనువదించిన గ్రీకు పదం diēporei దీని అర్థం సాధారణ ఆశ్చర్యం కాదు, “ఎటూ తోచకపోవడం,” “మార్గం లేని గందరగోళం.” హెరోదులో ఈ స్థితి నిరంతరం కొనసాగుతున్న అంతర్గత సంఘర్షణను గుర్తు చేస్తుంది. హేరోదుకు అధికారం, సంపద, రాజభోగం ఉన్నా, అతని అంతరంగంలో శాంతిలేదు.
ఈ కలవరానికి మూడు కారణాలు మొదటిది, నిరపరాధి అయిన యోహాను రక్తం చిందించడం జరిగినది ఆ అపరాధభావం ఉండవచ్చు. రెండవది, రాజకీయ భయం, ప్రవక్త తిరిగి వస్తే ప్రజలు అతనికి వ్యతిరకంగా మారుతారేమో అని భయం ఉండి ఉండవచ్చు. మూడవది, ఆధ్యాత్మిక అనిశ్చితి, తాను నమ్మని పునరుత్థానం తనను వెంటాడటం అయి ఉండవచ్చు. సామెతలు 28:1 చెప్పినట్లుగా, “తరుమక పోయినను దుష్టుడు పరుగెత్తును. కాని సత్పురుషుడు సింహమువలె ధైర్యముగా ఉండును.” హేరోదు పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది, ఎటువంటి అలజడి జరిగిన కలవరపడుతున్నాడు.
ప్రజాభిప్రాయాలు
1.“యోహాను మృతుల నుండి లేపబడెను”
యోహాను మృతుల నుండి లేపబడ్డాడు అనే ఆలోచన ప్రజలలో ఉన్నట్లు, ఈ ఆలోచన హేరోదు మనస్సులో కూడా బలంగా ఉంది. ఇది మతపరమైన ఊహ కాదు, అపరాధభావన నుండి పుట్టిన భయం. ఒక ప్రవక్తను చంపవచ్చు, కానీ సత్యాన్ని చంపలేరు. ఒక స్వరాన్ని మూయించవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మూయించలేరు. యోహాను మరణించినా, అతని మాటలు హేరోదు మనస్సాక్షిలో సజీవంగా ఉన్నాయి.
2. “ఏలీయా అవతరించెను”
మలాకీ 4:5 ప్రకారం, మెస్సీయ రాకముందు ఏలీయా వస్తాడని యూదులు నమ్మేవారు. ఏలీయా రథం మీద పరలోకమునకు కొనిపోబడినందున (2రాజులు 2:11), అతడు తిరిగి వస్తాడని భావించేవారు. యేసు ప్రభువు, స్వయంగా యోహానును “రాబోవు ఏలీయా”గా చెప్పాడు (మత్తయి 11:14). కానీ ప్రజలు యేసు ప్రభువునే ఏలీయాగా భావించారు, కాని ఆయన మెస్సీయ్యా అని గుర్తించలేకపోయారు.
3. “పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచెను”
మలాకీ ప్రవక్త తర్వాత సుమారు నాలుగు వందల సంవత్సరాలు, ప్రవక్తలు లేరు. కాబట్టి ఒక కొత్త ప్రవక్త అకస్మాత్తుగా అద్భుతాలు చేయడం గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది, “దేవుడు మరల మాట్లాడటం మొదలుపెట్టాడు” అనే భావన వచ్చింది.
ఈ మూడు అభిప్రాయాలు పూర్తిగా అబద్ధాలు కావు, ప్రతి ఒక్కటి యేసు ప్రభవు గురించి ఏదో ఒక పాక్షిక సత్యాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభువు నిజంగానే ఒక ప్రవక్త (అపొ.కా. 3:22-23 చూడండి); ఆయనలో ఏలీయా వంటి ధైర్యం, అధికారం ఉన్నాయి. ఆయన ప్రవక్తల పరంపరను పరిపూర్ణం చేస్తున్నాడు. కానీ పాక్షిక సత్యం పూర్తి సత్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఒక సూక్ష్మమైన, కానీ ప్రమాదకరమైన ఉచ్చు. యేసు ప్రభువు గురించి కొంత సరైన అవగాహన ఉండటం, ఆయనను పూర్తిగా, వ్యక్తిగతంగా తెలుసుకోవడం అనే దానికి ప్రత్యామ్నాయంగా మారిపోకూడదు.
“నేను యోహాను తలతీయించితినిగదా” - అప్రయత్నపూర్వక ఒప్పుకోలు
“నేను” అనే మాట ప్రత్యేకంగా చెప్పబడింది. నేనే ఈ పాపానికి బాధ్యుడను” అనే ఆత్మవిమర్శ దీనిలో దాగి ఉంది. హేరోదు బహిరంగంగా పాపాన్ని ఒప్పుకోవడం లేదు, కానీ తనలో తానే దానిని అంగీకరిస్తున్నాడు. ఇది మనస్సాక్షి శక్తిని చూపిస్తుంది. దేవుడు ప్రతి హృదయంలో నాటిన నైతిక భావన, ఎంత అణచివేసినా తిరిగి తలెత్తుతుంది (రోమా 2:14-15).
ఈ అపరాధభావన మనిషిని అసాధారణ భయాలకు, అసాధారణ ఊహలకు గురిచేస్తుంది. హేరోదు బాహ్యంగా రాజ్యాధికారంతో నిశ్చింతగా కనిపించినా, అంతరంగంలో అతడు శాంతిలేని మనిషి. కయీను (ఆదికాండము 4), సౌలు రాజు (1సమూయేలు 16:14 తర్వాత), యూదా ఇస్కరియోతు (మత్తయి 27:3-5), వీరందరిలో ఇటువంటి అశాంతి చూస్తాము. పాపం చేసిన తరువాత అశాంతి మనలను వెంటాడుతూనే ఉంటుంది.
జాన్ క్రీసొస్తం
తిరిసభ పితరులు ఈ భాగాన్ని మనిషి మనస్సాక్షి నుండి తప్పించుకోలేని స్వభావానికి ఉదాహరణగా చూశారు. పునీత జాన్ క్రీసొస్తం, హేరోదు కలవరాన్ని “పాపం ఫలం” అని అభివర్ణించాడు, బాహ్యంగా విజయం సాధించినట్లు కనిపించినా, అంతరంగంలో అది శాంతిని దొంగిలిస్తుంది.
“ఆయనను చూడగోరెను” - కోరిక స్వభావం
ఇది హెరోదుకు సాధారణ కుతూహలం వలన కాని, తనకు ముప్పు ఉందేమో పరిశీలించాలనే భయంతో కాని, లేదా శత్రుత్వపూరిత ఉద్దేశ్యం అయిఉండవచ్చు. ఈ కోరిక చివరకు యేసు ప్రభువు సిలువ మోసే ముందు రోజు నెరవేరుతుంది, కాని ఇది మారుమనస్సు కోసం కాదు, కేవలం అద్భుతం చూడాలనే వినోద కుతూహలం కోసం. యేసు ప్రభువు అతనికి ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. హృదయాన్ని తెరవని వారికి దేవుని వాక్యం మౌనంగా ఉంటుంది.
ప్రభువును కనుకొనుటకు అర్హత అధికారం కాదు
హేరోదు, ప్రపంచిక అధికారం కలిగినవాడు, “యేసు ప్రభువు ఎవరు?” అని ప్రశ్నించి సరైన సమాధానం కనుగొనలేడు; కాని పేతురు సామాన్య జాలరి, అదే ప్రశ్నకు దేవుని ప్రేరణతో “నీవు దేవుని క్రీస్తువు” అని జవాబిచ్చాడు. యేసు ప్రభువు నిజస్వరూపాన్ని గుర్తించడం బాహ్య అధికారం మీద ఆధారపడదు, అది విశ్వాసం మీద, హృదయ వినయం మీద, వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడుతుంది.
అధికారంలో ఉన్నవారు (హేరోదు, పిలాతు, ప్రధాన యాజకులు) యేసు ప్రభువును సరిగ్గా గుర్తించలేకపోయారు, కాని సామాన్యులు (గొర్రెల కాపరులు, జాలరులు, స్త్రీలు, పాపులు) ఆయనను గుర్తించి, అనుసరించి, రక్షణ పొందారు.
మన సంధర్భంలో ఈ సువిశేష భాగం
అనేక మంది ప్రజలు, క్రైస్తవులు కూడా హేరోదు వంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత పాపాలు, తప్పుడు నిర్ణయాలు, కుటుంబంలో జరిగిన అన్యాయాలు మనస్సాక్షిని వెంటాడుతూనే ఉంటాయి. హేరోదు వలె, మనం కూడా ఆ భావనను మద్యం, పని ఒత్తిడి, లేదా నిరంతర ఏదోక పనితో అణచివేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ నిజమైన విముక్తి క్రీస్తు క్షమాపణలో మాత్రమే ఉంది. కేవలం ప్రభువు గురించి వినడం హృదయాన్ని మార్చదు. హేరోదుకు లభించిన సమాచారం అతనిని మార్చలేదు; అతనికి కావలసింది పశ్చాత్తాపం. కుటుంబంలో కూడా “నేను తప్పు చేశాను” అని చెప్పగల వాతావరణం ఉన్నప్పుడే క్షమ, పునరుద్ధరణ, నిజమైన ప్రేమ పెరుగుతాయి. హేరోదు కుటుంబంలో ఈ వాతావరణం లేకపోవడమే అతని పతనానికి ఒక కారణం కావచ్చు.
హేరోదు నిజంగా పశ్చాత్తాపపడ్డాడా?
లేదు. లూకా 23:8-12 ప్రకారం, యేసు ప్రభువును కలిసినప్పుడు కూడా హేరోదు ఆయనను ఎగతాళి చేసి తిరిగి పంపించాడు, పశ్చాత్తాపానికి బదులు అపహాస్యాన్ని ఎంచుకున్నాడు. (హెరోదు సద్దుకయ్యడు అని తప్పుగా రాయటం జరిగింది, హెరోదు ఎదోమియుల తెగ నుండి వచ్చినవాడు)
ఈ భాగం నుండి ప్రధాన సందేశం ఏమిటి?
ప్రభువు గురించి సమాచారం, కుతూహలం సరిపోవు, యేసును ప్రభువుగా వ్యక్తిగతంగా గుర్తించి, పశ్చాత్తాపంతో ఆయనను అనుసరించడమే ఒక వ్యక్తి చేయవలసినది.
10. జీవిత అన్వయం
అపరాధభావన నుండి మనం పారిపోలేము, ఆ సమయంలో నిజమైన శాంతి పశ్చాత్తాపం ద్వారానే లభిస్తుంది (1యోహాను 1:9)అది ప్రభువు దగ్గరే దొరుకుతుంది. కుతూహలం విశ్వాసానికి ప్రత్యామ్నాయం కాదు, యేసు ప్రభువును “చూడాలని” కోరుకోవడం వేరు, ఆయనను నమ్మి అనుసరించడం వేరు, ఆయనను చూసి, ఆయన మాటలు విని ఆయన ద్వారా ప్రభావితం అయిన జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్యకు కేవలం కోరిక కాదు, పశ్చాతాపం కూడా కలిగింది. యేసు ప్రభువును తెలుసుకోవడం అంటే ఆయన దేవుని కుమారుడు, దేవుడు అని తెలుసుకోవడం.
11. ముగింపు
అపరాధభావన, భయం, తప్పుడు కుతూహలం మనకు అశాంతినే మిగులుస్తుంది. హేరోదుకు రాజ్యం ఉంది, సైన్యం ఉంది, సంపద ఉంది కానీ మనశ్శాంతి లేదు. ఈ భాగం మనలను “యేసు ఎవరు?” అనే ప్రశ్నను ఎదుర్కొనేలా ఆహ్వానిస్తుంది. హేరోదులా భయంతో, గందరగోళంతో ఈ ప్రశ్నను అడగడమా, లేక పేతురులా విశ్వాసంతో “నీవు దేవుని క్రీస్తువు” అని ఒప్పుకోవడమా? అనేది ప్రతిరోజూ, ప్రతి పరిస్థితిలో, మనం కొత్తగా ఎంచుకోవలసిన ఎంపిక. యేసు ప్రభువు గురించిన ఏదైనా వార్త మన హృదయాన్ని తాకినప్పుడు, అది ఒక ప్రసంగం కావచ్చు, పవిత్ర గ్రంధ వచనం కావచ్చు, ఒక మిత్రుని మాట కావచ్చు, మనం హేరోదులా దానిని భయంతో దాటిపోతామా, లేక పేతురులా దానిని విశ్వాసంగా స్వీకరిస్తామా అనేది మన నిర్ణయం.
ప్రార్థన
ప్రభువా, హేరోదు వలె భయంతో, గందరగోళంతో కాక, నిజమైన విశ్వాసంతో మిమ్ము అన్వేషించే హృదయాన్ని మాకు దయచేయుము. మా పాపాలను ఒప్పుకుని, మీ క్షమాపణను పొందుకునే వినయాన్ని మాకు దయచేయుము. మిమ్ము చూడాలనే కోరిక మాత్రమే కాక, మిమ్ము తెలుసుకొని, ప్రేమించి, అనుసరించే కృపను మాకు అనుగ్రహించుము. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment