పునీత పౌలు జీవిత చరిత్ర: సౌలు నుండి అపొస్తలుని వరకు
పౌలు:
జీవితం - పరిచర్య – సందేశం
పరిచయం:
పౌలు సిద్దాంతం మరియు అనుభవం
పునీత పౌలు కేవలం ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త మాత్రమే
కాదు; ఆయన చేతివృత్తి కార్మికుడు, అంకితభావం
గల మిషనరీ. ఆయన రాసిన తాను స్థాపించిన సంఘాలలోని క్రైస్తవుల నైతిక, ఆధ్యాత్మిక
ఇబ్బందులను తీర్చడానికి రాసిన ఉద్రేకభరితమైన సందేశాలు అవి. పౌలు జీవితాన్ని, ఆయన లేఖలను
కలిపి చదివినప్పుడే ఆయన హృదయం మనకు అర్థమవుతుంది.
పౌలు శిక్షణ పొందిన పరిసయ్యునిగా, యూద వారసత్వ
పరిధిలోనే ఆలోచించాడు. ఆదాము పతనం
క్రీస్తు విమోచన అనే పోలిక ఆయన విద్యను ప్రతిబింబించినా, రక్షణ గురించి ఆయన చెప్పిన విషయాలు ఆయన స్వంత
ఆధ్యాత్మిక అనుభవానికి ప్రతీకలు. పౌలు విషయంలో సిద్ధాంతం కంటే ఆయన 'మతానుభవ
ప్రామాణికత' ముఖ్యం. దమస్కు మార్గంలో ఆయన చూసిన దర్శనాలను
మూర్ఛరోగం వల్ల కలిగిన భ్రాంతులని కొందరు భావించినా, ఆ అనుభవమే
ఆయనను లోక రక్షణ కోసం సమాధాన పరిచర్య చేసే మిషనరీగా మార్చింది.
పౌలు
జీవితానికి ఆధారాలు
పౌలు జీవితాన్ని, పరిచర్యను
అర్థం చేసుకోవడానికి రెండు ప్రధాన స్వతంత్ర ఆధారాలు ఉన్నాయి.
1. పౌలు లేఖలు (ప్రధాన ఆధారం)
పౌలును అర్థం చేసుకోవడానికి ఆయన స్వయంగా రాసిన
లేఖలే అత్యుత్తమ ఆధారం. ఇవి నిర్దిష్ట వ్యక్తులకు, సంఘాలకు
రాసిన నిజమైన లేఖలు.
2. అపొస్తలుల కార్యములు (రెండవ ఆధారం)
లేఖలలో సంఘటనల ప్రస్తావన యాదృచ్ఛికంగానే
ఉంటుంది. అందువల్ల చరిత్రను పునర్నిర్మించడానికి లూకా రాసిన 'అపొస్తలుల
కార్యములు' గ్రంథం తోడ్పడుతుంది.
- ప్రత్యక్ష సాక్ష్యాలు: ఇందులో "మేము" అని సంబోధించిన
భాగాలు (16:10-17; 20:7–21:18; 27:1–28:16) లూకా పౌలుతో పాటు ప్రయాణించిన
ప్రత్యక్ష సాక్షి అని సూచిస్తున్నాయి. పౌలు ప్రియ సహచరుడు, వైద్యుడైన లూకా దీనిని
రాశాడని ఆధారాలు చెబుతున్నాయి.
పౌలు బాహ్య జీవిత సంఘటనల కంటే ఆయన 'అంతరంగ
ఆధ్యాత్మిక జీవితం' ఆయన లేఖల ద్వారా స్పష్టంగా
తెలుస్తుంది.
బాల్యం, కుటుంబం మరియు శిక్షణ
1. జన్మస్థలం మరియు కుటుంబ నేపథ్యం
పౌలు తన పుట్టుక గురించి చెబుతూ, దేవుడు తనను
తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచి, తన కృపచేత పిలిచాడని
పేర్కొంటాడు (గలతీ 1:15,16). ఆయనకు కాలం, స్థలం కంటే
తన జీవిత ఆరంభం నుండే దేవుని కృప తోడుగా ఉందనే భావనే ముఖ్యం. ఇది పాత నిబంధనలో
ప్రవక్త యిర్మీయా అనుభవాన్ని గుర్తుచేస్తుంది. పౌలు యూదయా కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఆయన ఇశ్రాయేలులో బెన్యామీను గోత్రీయుడు; ఎనిమిదవ
రోజే సున్నతి పొందిన "హెబ్రీయులలో హెబ్రీయుడు" (ఫిలిప్పీ 3:4,5; 2 కొరింథీ 11:21,22). ఇశ్రాయేలు
తొలి రాజు సౌలు పేరునే ఈయనకూ పెట్టారు. పౌలు లేఖలలో తల్లి పట్ల ఆప్యాయత (రోమా 16:13), పితరుల
సంప్రదాయాల ద్వారా తండ్రి బోధనల ప్రభావం, ఒక సోదరి ప్రస్తావన
కనిపిస్తాయి.
లూకా వృత్తాంతం ప్రకారం పౌలు సీలీషియలోని తార్సు పట్టణానికి చెందినవాడు, పుట్టుకతోనే రోమ పౌరుడు. అప్పట్లో
రోమ పౌరసత్వం ఉన్న యూదులకు సైనిక సేవ నుండి మినహాయింపు ఉండేది. తండ్రి లేదా
పూర్వీకులు సేవ ద్వారా గానీ, ధనం ద్వారా గానీ ఈ
పౌరసత్వాన్ని పొంది ఉండవచ్చు. కాబట్టి పౌలు కుటుంబం తార్సులోని యూదులలో ప్రముఖ
స్థానంలో ఉండేదని స్పష్టమవుతోంది.
2. తార్సు వాతావరణం మరియు తొలి శిక్షణ
తార్సు మధ్యధరా తీరానికి సమీపంలో, కిద్నస్ నది
ఒడ్డున ఉన్న ప్రముఖ గ్రీకో-రోమన్ నగరం.
- నగరం ప్రత్యేకతలు: చల్లని, వేగవంతమైన కిద్నస్ నది పక్కనే యువకుల వ్యాయామశాల ఉండేది. కఠిన నియమాలు
గల యూద కుటుంబం కాబట్టి పౌలు అందులో ఈదేవాడు కాకపోయినా, సమాజ వాతావరణాన్ని గమనించేవాడు.
- తొలి విద్య: తాల్ముద్ శాసనం ప్రకారం
ఏడేళ్ళ వయస్సులో పౌలు బడికి వెళ్ళడం ప్రారంభించి ఉంటాడు. తండ్రి, ఉపాధ్యాయుల నుండి ఇంటి వద్దే ధర్మశాస్త్ర ప్రాథమిక పాఠాలు
నేర్చుకున్నాడు. "ఇశ్రాయేలూ వినుము, మన దేవుడైన యావే ఏకైక
ప్రభువు" (ద్వితీ. 6:4-9) అనే
విశ్వాస ప్రమాణాన్ని పదేపదే వల్లించడం ద్వారా ఏకదేవుని భావన ఆయన మనసులో బలంగా
నాటుకుపోయింది.
తార్సు ఒక వాణిజ్య, సాంస్కృతిక
కేంద్రం. చారిత్రక కిద్నస్ నది, ఓడరేవు, ఉత్తరాన
టారస్ పర్వతాల "కిలికియన్ ద్వారాలు" (కనుమ) తార్సు ప్రజల జీవితంలో
భాగాలు. ఇక్కడ అగస్టస్ చక్రవర్తి జారీ చేసిన శాసనం ప్రకారం యూదులకు ధర్మశాస్త్ర
ఆచరణ, విశ్రాంతిదిన మినహాయింపులు, యెరూషలేముకు
పవిత్ర ధనం పంపే స్వేచ్ఛ వంటి ప్రత్యేక హక్కులు ఉండేవి.
ఈ గ్రీకో-రోమన్ నాగరికత మధ్య పెరగడం వల్ల పౌలుకు
వివిధ సంస్కృతులు, భిన్న రకాల ప్రజల పట్ల అవగాహన
ఏర్పడింది. ఇదే వాతావరణం తరువాత ఆయనను "అన్యజనులకు అపొస్తలుడు"గా
మార్చడానికి దేవుడు సిద్ధం చేసిన వేదికగా నిలిచింది.
3. ప్రార్థనా మందిరం మరియు చేతివృత్తి
పౌలు బాల్యంలోనే తార్సు ప్రధాన పరిశ్రమ అయిన గుడారాలు కుట్టే వృత్తిని (కిలికియా
మేకల బొచ్చుతో చేసే "కిలికియం" వస్త్ర వ్యాపారం) నేర్చుకున్నాడు. ఇది
ఆయనకు స్వయం సమృద్ధిని ఇచ్చింది.
అలాగే ప్రార్థనా మందిరంలో (Synagogue) ప్రతి వారం
లేఖనాలు వినడం, చదవడం ద్వారా యూద ధర్మాన్ని
క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. పాత నిబంధన గ్రీకు అనువాదమైన సెప్టువజింట్
(LXX) లో ప్రావీణ్యం సంపాదించి, తన లేఖలలో
దాని నుంచే ఎక్కువ వాక్యాలను వాడాడు.
4. యెరూషలేములో ఉన్నత శిక్షణ
యూద బాలురు సుమారు 14–16 ఏళ్ళ
వయస్సులో ఉన్నత విద్య కోసం యెరూషలేము వెళ్ళేవారు. పౌలు కూడా వెళ్లి, ఆ కాలంలో
అత్యంత ప్రసిద్ధుడైన పరిసయ్యుడు గమలీయేలు వద్ద శిష్యరికం చేశాడు.
- కఠిన ధర్మశాస్త్ర శిక్షణ: గమలీయేలు పాదాల వద్ద కూర్చుని "ధర్మశాస్త్రం యొక్క కఠిన పద్ధతి
ప్రకారం" శిక్షణ పొంది పరిసయ్యుడిగా మారాడు.
- మౌఖిక ధర్మశాస్త్రం: అప్పట్లో రబ్బీల మౌఖిక వ్యాఖ్యానాలకు ప్రాధాన్యత ఉండేది. హిల్లేల్, షమ్మాయి అనే రెండు వ్యాఖ్యాన పాఠశాలలు ఉండేవి. షమ్మాయి కఠినంగా, అక్షరార్థానికి ప్రాధాన్యమిస్తే, హిల్లేల్ శాంతిని, ప్రేమను, సౌమ్యతను బోధించేవాడు.
గమలీయేలు హిల్లేల్ మనవడు కావడం వల్ల పౌలు హిల్లేల్ సూక్తులను, మౌఖిక సంప్రదాయాలను క్షుణ్ణంగా కంఠస్థం చేశాడు.
- ఆచారాలకే ప్రాధాన్యత: ధర్మశాస్త్ర ఆత్మ, సారాంశం కంటే చిన్న
నియమాలు, బాహ్య ఆచారాల పాటింపుపైనే ఉపాధ్యాయులు
ఎక్కువగా చర్చించేవారు.
- స్వతంత్ర ఆలోచనకు తావు లేకపోవడం: విద్యార్థులు గత బోధకుల సూక్తులను, లేఖనాలను యథాతథంగా వల్లించాల్సి వచ్చేది.
- అధికార విధేయత: ప్రతి చిన్న విషయమూ నియమాలచేత బంధించబడి ఉండేది.
5. మెస్సీయ నిరీక్షణ
యూద విద్యార్థుల మనసులకు స్వేచ్ఛను, ఉత్సాహాన్ని
ఇచ్చిన ఏకైక అంశం "మెస్సీయ రాక, రాబోయే
దేవుని రాజ్యం". పౌలు దానియేలు గ్రంథంతో పాటు, ఆ కాలంలో
ప్రాచుర్యంలో ఉన్న "ఎనోకు
గ్రంథం", పరిసయ్యుల కీర్తనలు కూడా లోతుగా అధ్యయనం చేశాడు.
- ఎనోకు గ్రంథంలోని "మనుష్యకుమారుడు",
"ఏర్పరచబడినవాడు" సింహాసనంపై కూర్చుని
పాపులకు తీర్పు తీర్చడం, దేవుని రాజ్యం
స్థాపించబడడం వంటి అంశాలు పౌలు భావజాలాన్ని ప్రభావితం చేశాయి.
- దావీదు కుమారుడైన మెస్సీయ వచ్చి యెరూషలేమును శుద్ధి చేసి నీతికరమైన
రాజ్యాన్ని పరిపాలిస్తాడనే నిరీక్షణ పౌలులో తీవ్రమైన దేశభక్తిని, మతాభిమానాన్ని రగిల్చింది.
తార్సు గ్రీకో-రోమన్ సంస్కృతిలో ప్రాథమిక అవగాహన, యెరూషలేములో
అత్యుత్తమ పరిసయ్య విద్య, గుడారాలు కుట్టే వృత్తి, మెస్సీయ
పట్ల తీవ్ర ఆసక్తి ఇవన్నీ కలిసి పౌలును తన వయస్సు వారందరికంటే యూద మతంలో ముందంజ
వేసిన అతివాద ఉత్సాహవంతునిగా తీర్చిదిద్దాయి.
క్రీస్తును స్వీకరించడానికి ఆయనను దేవుని కృప ఈ విధంగా సిద్ధం చేసింది.
కొత్త
ఉద్యమం పట్ల వైఖరి – హింసకుడైన సౌలు
పౌలు యెరూషలేములో ఉన్నత ధర్మశాస్త్ర విద్య
అభ్యసిస్తున్న కాలంలోనే, గలిలయలోని కఫర్నాము కేంద్రంగా నజరేతు యేసు "దేవుని రాజ్యం
సమీపించింది" అని ప్రకటించడం ప్రారంభించాడు.
యేసు
పరిచర్య – ధర్మ శాస్త్ర బోధకుల వ్యతిరేకత
యేసు ఉపదేశాలు, స్వస్థతలు, అద్భుతాల
వార్తలు యెరూషలేముకు చేరాయి. అయితే సాంప్రదాయ పరిసయ్యులు, ధర్మ శాస్త్ర
బోధకులు యేసు బోధనా శైలిని తీవ్రంగా కోపగించారు. యేసు ప్రభువు పాస్కా పండుగ
సమయంలో యెరూషలేములో ప్రవేశించాడు. దేవాలయ ప్రాంగణంలోని వ్యాపారులను తరిమివేసి, పరిసయ్యుల,
ధర్మ శాస్త్ర బోధకుల అధికారాన్ని సవాలు చేస్తూ ధైర్యంగా బోధించారు.
చివరికి మహాసభ (సన్హెడ్రిన్) ఆయనపై దైవదూషణ ఆరోపణ మోపి, రోమన్
అధికారుల ద్వారా సిలువ మరణశిక్ష అమలు చేయించింది.
పౌలు యేసును
నేరుగా చూశాడా?
పౌలు యేసు ప్రభువును ఆయన పరిచర్య కాలంలో
ప్రత్యక్షంగా చూసినట్లు లేఖలలో ఎలాంటి ఆధారాలు లేవు. ఆ సమయంలో ఆయన తార్సుకు వెళ్లి
ఉండవచ్చు, లేదా యెరూషలేములోనే ధర్మ శాస్త్ర బోధకుల బోధనలలో
మునిగి ఉండవచ్చు. యూద సాంప్రదాయాల పట్ల తీవ్ర ఆసక్తి కలిగిన పౌలుకు, ఒక నజరేతు
వడ్రంగి దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ఆకర్షణీయంగా అనిపించి ఉండదు.
సిలువ మరియు
సంఘ నిర్మూలన సంకల్పం
ద్వితీయోపదేశకాండం ప్రకారం మ్రానుపై
వేలాడదీయబడినవాడు, దేవునిచేత శపించబడినవాడు. కాబట్టి సిలువ వేయబడిన యేసు ప్రభువు దేవుని అభిషిక్తుడైన మెస్సీయ అని నమ్మడం పౌలు
దృష్టిలో ఘోరమైన దైవదూషణ. అయితే యేసు ప్రభువు శిష్యులు ఆయన పునరుత్థానుడై జీవిస్తున్నాడని, ప్రకటించడం
ప్రారంభించారు. ఇది యూద ధర్మశాస్త్రానికి, దేవుని ప్రణాళికకు తీవ్ర
ముప్పు అని భావించిన పౌలు ఈ కొత్త ఉద్యమాన్ని నాశనం చేయడమే తన కర్తవ్యంగా
ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో దేవుని కృపతో బోధించిన స్తెఫను మరణానికి పౌలు
సమ్మతించాడు. ఆ తరువాత ఇల్లిల్లూ చొరబడి స్త్రీలను, పురుషులను
ఈడ్చుకెళ్లి చెరసాలలో వేశాడు. అంతటితో ఆగక, దమస్కులోని
ప్రార్థనా మందిరాలలో ఉన్న యేసు ప్రభువు అనుచరులను బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి
ప్రధాన యాజకుని నుండి అధికార పత్రాలు పొంది ప్రయాణమయ్యాడు.
పౌలు అంతరంగ
సంఘర్షణ
హింసకుడిగా కనిపిస్తున్నా, పౌలు
అంతరంగంలో తీవ్ర పోరాటం సాగుతోంది. స్తెఫను మరణం, విశ్వాసుల
నిశ్చలమైన ప్రేమ, మరణానికి భయపడని వారి ధైర్యం
ఆయన సున్నిత హృదయాన్ని కదిలించాయి.. ధర్మశాస్త్రం బాహ్య క్రియలను నియంత్రించగలదు
కానీ, హృదయంలోని ఆశలను, అత్యాశను
మార్చలేదని గ్రహించాడు. "నేను కోరే మంచిని చేయలేకపోతున్నాను, ద్వేషించే
చెడునే చేస్తున్నాను... అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఈ
మరణ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు?" అని ఆయన ఆత్మ రోదించింది.
దమస్కు
మార్గంలో – జీవితాన్ని మార్చిన అనుభవం
దమస్కు మార్గంలో పౌలు జీవితాన్ని సంపూర్ణంగా
మలుపు తిప్పిన ఒక మహత్తర అనుభవం ఎదురైంది. హింసకుడిగా వెళ్తున్న సౌలును క్రీస్తు
రాయబారిగా మార్చిన సంఘటన ఇది.
అంతరంగ
ప్రకాశం మరియు క్రీస్తు ప్రత్యక్షత
పౌలు దీనిని ప్రధానంగా ఆత్మ సంబంధమైన, అంతరంగ
అనుభవంగా వర్ణించాడు. "దేవుడు తన కుమారుణ్ణి నాలో ప్రత్యక్షపరచడానికి
ఇష్టపడ్డాడు" అని గలతీయులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. తాను శపించబడినవాడిగా
భావించిన నజరేతు యేసే మహిమగల దేవుని కుమారుడని ఆయన గ్రహించాడు. అందుకే, "నేను
మన ప్రభువైన యేసును చూడలేదా?" అని ధైర్యంగా ప్రకటించాడు.
అపొస్తలుల కార్యములలో లూకా దీనిని బాహ్యంగా
జరిగిన సంఘటనగా, ఆకాశం నుండి కాంతి
ప్రకాశించడం, స్వరం వినబడడం వివరించాడు. ఈ వివరణలలో చిన్న
భేదాలు ఉన్నా, "సౌలు, సౌలు, నీవు నన్ను
ఎందుకు హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్న యేసును
నేనే" అనే ప్రధాన ఘట్టంలో అవి ఏకీభవిస్తాయి. పౌలు ప్రత్యక్షంగా
పునరుత్థానుడైన క్రీస్తు సన్నిధిని అనుభవించాడు.
నూతన జన్మ
మరియు విడుదల
ఈ అనుభవం పౌలును ధర్మశాస్త్ర బంధకాల నుండి
విడుదల చేసింది. "నేను దేవుని కొరకు జీవించునట్లు ధర్మశాస్త్రము ద్వారా
ధర్మశాస్త్రమునకు చనిపోతిని; నేను క్రీస్తుతో కూడా సిలువ
వేయబడియున్నాను" అని ప్రకటించాడు. స్వంత నీతిని సాధించాలనే నిష్ఫల ప్రయత్నం
ముగిసి, క్రీస్తు ఆత్మ ఆయనలో జీవించడం ప్రారంభించింది.
భయం, వేదన స్థానంలో దేవుని ప్రేమ, "అబ్బా, తండ్రీ"
అని పిలిచే కుమారుని ఆత్మ ఆయన హృదయంలోకి ప్రవేశించాయి.
ఆలోచనలో, జీవితంలో మార్పులు
అరేబియాలో
ఏకాంతం
దమస్కు అనుభవం తరువాత పౌలు ఏ మనుష్యుడితోనూ, అపొస్తలులతోనూ
సంప్రదించలేదు. దేవుడు తనలో బయలుపరచిన కుమారుని ప్రత్యక్షతను, దైవ
ప్రణాళికను లోతుగా ధ్యానించడానికి అరేబియా ఎడారి ప్రాంతానికి వెళ్లాడు. తన సువార్త
మానవ మాతృకల నుండి రాలేదని, నేరుగా యేసుక్రీస్తు
ప్రత్యక్షత ద్వారానే వచ్చిందని ఆయన నమ్మాడు.
ధర్మశాస్త్ర
రద్దు మరియు అన్యజనులకు మార్గం
అరేబియాలో ఉన్నప్పుడు పౌలుకు ఒక విప్లవాత్మక
సత్యం స్పష్టమైంది. యూదుడైన తనకు క్రీస్తు మెస్సీయగా ప్రత్యక్షమయ్యాడు; మరి
ధర్మశాస్త్రంతో సంబంధం లేని అన్యజనుల పరిస్థితి ఏమిటి? దేవుడు
వారిని ఎలా రక్షిస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానంగా
క్రీస్తు సిలువ మరణం యొక్క నిజమైన అర్థాన్ని ఆయన గ్రహించాడు.
"మ్రానుపై వేలాడదీయబడిన
ప్రతివాడు శాపగ్రస్తుడు" అని ధర్మశాస్త్రం చెబుతుంది. యేసు మన కొరకు శాపమై, ధర్మశాస్త్ర
శాపం నుండి మనలను విమోచించాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపడం ద్వారా ఆయన
శపించబడినవాడు కాదని, అత్యంత పరిశుద్ధుడని
నిరూపించాడు. కాబట్టి క్రీస్తు పునరుత్థానంతో పాత ధర్మశాస్త్ర, అడ్డుగోడలు
రద్దయ్యాయి. అబ్రాహాముకు లభించిన ఆశీర్వాదం ధర్మశాస్త్రంతో ప్రమేయం లేకుండా, కేవలం
విశ్వాసం ద్వారా అన్యజనులకూ అందుబాటులోకి వచ్చింది.
తార్సులో పెరిగిన పౌలుకు గ్రీకులు, రోమన్ల
సంస్కృతి తెలుసు. వారు యూద ఆచారాలను పాటించడం అసాధ్యమని ఆయనకు తెలుసు. క్రీస్తు
ద్వారా ఇప్పుడు సమస్త ప్రజలకు దేవుని రక్షణ ఉచితంగా లభించే మార్గం సుగమమైందని
గ్రహించి, తాను "అన్యజనులకు అపొస్తలుడిగా"
పిలవబడ్డానని స్పష్టమైన నిశ్చయతకు వచ్చాడు.
దమస్కులో
పరిచర్య మరియు తప్పించుకోవడం
అరేబియా నుండి దమస్కుకు తిరిగి వచ్చిన పౌలు
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రార్థనా మందిరాలలో యేసే దేవుని కుమారుడని, ఆయనే నిజమైన
మెస్సీయ అని ప్రభావవంతంగా బోధించాడు. ఇది యూదులలో తీవ్ర అలజడి సృష్టించింది. వారు
పౌలును చంపడానికి కుట్ర పన్ని పట్టణ ద్వారాల వద్ద కాపలా ఉంచారు. నబాతీయుల రాజైన
అరేతా కింద ఉన్న అధికారి కూడా యూదుల ప్రేరణతో పౌలును బంధించడానికి ప్రయత్నించాడు.
అయితే శిష్యులు రాత్రివేళ పౌలును ఒక గంపలో ఉంచి పట్టణపు గోడ కిటికీ గుండా కిందకు
దించి రక్షించారు.
యెరూషలేము నుండి భయంకరమైన హింసకుడిగా బయలుదేరిన
పౌలు, దేవుని మహా కృప ద్వారా క్రీస్తు కోసం హింసలు
అనుభవించే నూతన దైవ సేవకుడిగా, ప్రపంచ రక్షణ చరిత్రను మలుపు
తిప్పే అపొస్తలుడిగా తిరిగి వచ్చాడు.
యెరూషలేము
మొదటి సందర్శన మరియు తార్సులోని నిశ్శబ్ద సంవత్సరాలు
యెరూషలేము
మొదటి సందర్శన
దైవ పిలుపు పొందిన తరువాత పౌలు వెంటనే
యెరూషలేములోని పెద్దలను సంప్రదించలేదు. మూడు సంవత్సరాల సిద్ధపాటు తరువాత మాత్రమే
పేతురును కలవడానికి యెరూషలేముకు వెళ్ళాడు.
పేతురుతో గడిపిన ఆ పదిహేను రోజులు అత్యంత ప్రాముఖ్యమైనవి.
గలిలయ పరిచర్య నుండి సిలువ మరణం, పునరుత్థానల వరకు యేసు ప్రభువు
భౌతిక జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన పేతురు అనుభవాలను పౌలు ఆసక్తిగా
తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోయి, పాతిపెట్టబడి, మూడవ దినాన
లేచి పేతురుకు, శిష్యులకు, ఐదువందల
మందికి పైగా సహోదరులకు, యాకోబుకు, అపొస్తలులందరికీ, చివరగా తనకు
ప్రత్యక్షమయ్యాడని పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు.
యెరూషలేములో ఆయన కేవలం పేతురును, యాకోబును
మాత్రమే కలిశాడు. యూదయలోని ఇతర సంఘాలకు ఆయనతో ఎటువంటి ముఖపరిచయం లేదు. అందువల్ల, కొద్ది
రోజులు అక్కడ ఉండి గ్రీకు మాట్లాడే యూదుల వద్దకు వెళ్ళి ఉండవచ్చు. అక్కడ ఆయన మీద వ్యతిరేకత
ఎదురవ్వడంతో ఆయన కైసరయ ద్వారా తన స్వస్థలమైన తార్సుకు వెళ్ళిపోయాడు.
తార్సులోని
నిశ్శబ్ద సంవత్సరాలు
ఆ తరువాత సుమారు పది సంవత్సరాల కాలం పౌలు జీవితం
గురించి ఎక్కువగా తెలియదు. కానీ ఇవి ఆయన పరిచర్యకు
అత్యంత కీలకమైన సన్నద్ధత సంవత్సరాలు. తార్సు ఆ కాలంలో గొప్ప విశ్వవిద్యాలయ నగరం, స్టోయిక్
తత్వశాస్త్రానికి కేంద్రం; ఏథెన్సు, అలెగ్జాండ్రియాల
లాగే విజ్ఞానానికి, తత్వ విచారణకు అది ప్రసిద్ధి గాంచింది.
గుడారాలు కుట్టే వృత్తితో జీవనం సాగించిన పౌలు,
అతని చుట్టూ ఉన్న అన్యజనుల సంస్కృతిని, జీవితాన్ని
లోతుగా పరిశీలించాడు.
- స్టోయిక్ ప్రభావం: స్టోయిక్ తత్వవేత్తల
బోధనలు, సామాజిక బాధ్యతలపై వారి ఆలోచనలు తార్సులో
బాగా ప్రచారంలో ఉండేవి. బహిరంగ స్థలాలలో ప్రసంగించే తత్వవేత్తలను చూడడం వల్ల
అన్యజనులకు సువార్తను ఎలా చెరవేయాలో పౌలుకు స్పష్టమైన అవగాహన వచ్చింది.
- వివిధ సామాజిక వర్గాలు: ఉన్నత నైతికతను బోధించే తత్వవేత్తలను, కఠినంగా ధర్మశాస్త్రం పాటించే యూదులను, నిరాశా నిస్పృహలతో నిండిన సామాన్య వస్త్ర కార్మికులను, బానిసలను పౌలు గమనించాడు.
ఈ వైవిధ్యమైన వాతావరణంలో, యేసు
ప్రభువు ఇచ్చిన అంతరంగ సంపదే మానవాళికి
నిజమైన నిరీక్షణ అని ఆయన గ్రహించాడు. "గ్రీకులకు, అనాగరికులకు, జ్ఞానులకు, అజ్ఞానులకు
నేను ఋణస్థుడను" అని తరువాత ఆయన రాసిన మాటలకు ఈ తార్సు అనుభవాలే పునాది
వేశాయి.
అంతియొకియ
మరియు మొదటి మిషనరీ యాత్ర
స్తెఫను మరణం తరువాత చెలరేగిన హింస వల్ల
శిష్యులు వివిధ ప్రాంతాలకు చెదరిపోయారు. వారిలో కొందరు సిరియా రాజధాని అంతియొకయకు
వచ్చి, యూదులకే కాక సామాన్య గ్రీకులకూ యేసు ప్రభువును ప్రకటించారు.
అనేక మంది గ్రీకులు విశ్వాసంలోకి రావడంతో యెరూషలేము సంఘం బర్నబాను అక్కడకు
పంపింది. పరిచర్య విస్తరిస్తుండడంతో గ్రీకు సంస్కృతి తెలిసిన పౌలు సహాయం అవసరమని
గుర్తించి, బర్నబా తార్సుకు వెళ్ళి పౌలును అంతియొకియకు
తీసుకువచ్చాడు. వారిద్దరూ ఒక సంవత్సరమంతా అక్కడ బోధించారు. ఇక్కడే శిష్యులకు
మొదటిసారిగా "క్రైస్తవులు" అనే పేరు వచ్చింది.
అంతియొకియ సంఘం
ప్రేరణతో పౌలు, బర్నబాలు మొదటి మిషనరీ
యాత్రను ప్రారంభించారు.
- సైప్రస్: యోహాను మార్కుతో కలిసి సెలూసియా
వెళ్ళి అక్కడ నుండి సైప్రస్ వెళ్ళారు. సలామీసు, పాపోసు నగరాలలో సువార్త
ప్రకటించారు. సెర్జియా,
పాపోసు దీవి అధిపతి, పౌలు సువార్తను అతడు నమ్మడం, ఒక మాంత్రికుని సమక్షంలో నాటకీయ పరిణామాలు జరగడం ఇక్కడి ముఖ్య
సంఘటనలు.
- ప్రమాదకరమైన ప్రయాణం: పాపోసు నుండి పెర్గాకు
వెళ్ళినప్పుడు యోహాను మార్కు వారిని విడిచి వెళ్ళిపోయాడు. రోమన్ పాలనకు సరిగా
లొంగని ఆ పర్వత ప్రాంతాలలో దొంగల ప్రమాదాలు, ఉప్పొంగే నదుల భయాలు ఎక్కువ. పౌలు తరువాత ప్రస్తావించిన "నదుల
ప్రమాదాలు, దొంగల ప్రమాదాలు" ఈ
ప్రయాణాన్నే సూచిస్తాయి.
- దక్షిణ గలతీయ పట్టణాలు: పిసిదియ లోని అంతియొకియ, ఇకొనియ, లిస్త్ర, దెర్బే ప్రాంతాలలో పర్యటించారు. పౌలు తన లేఖలలో రోమన్ ప్రావిన్సుల
పేర్లనే వాడడం వల్ల, గలతీయులకు రాసిన లేఖ ఈ
దక్షిణ గలతీయ సంఘాలకే రాయబడిందనేది "దక్షిణ గలతీయ నమ్మకం".
- లిస్త్రలో లో
అనుభవాలు: లిస్త్రలో పౌలు ఒక కుంటివానిని స్వస్థపరచడంతో ప్రజలు
తమ లికోనియా భాషలో బర్నబాను "ద్యుపతి"
అనీ, మాట్లాడడంలో నేర్పరియైన పౌలును "హెర్మె"
అనీ భావించి బలులు అర్పించడానికి సిద్ధపడ్డారు. పౌలు, బర్నబాలు తమ దుస్తులు చింపుకుని, ఆకాశాన్ని భూమిని
సృష్టించిన జీవంగల దేవుని వైపు మరలాలని ఆ అన్యజనులకు బోధించారు. ఈ ప్రసంగం
యూదులకు చేసిన ప్రసంగాల కంటే భిన్నంగా, వారి మానసిక స్థితికి
తగినట్లుగా ఉంది. అయితే అంతియొకియ నుండి వచ్చిన యూదులు ప్రజలను
రెచ్చగొట్టడంతో పౌలుపై రాళ్ళు రువ్వి, చనిపోయాడనుకుని నగరం
వెలుపల పడేశారు. అయినా ఆయన లేచి దెర్బేకు వెళ్ళి సువార్తను కొనసాగించాడు.
ఆ తరువాత ఆయా పట్టణాలలో కొత్తగా చేరిన శిష్యులను
బలపరుస్తూ, సంఘాలలో పెద్దలను నియమిస్తూ వారు అంతియొకియకు
తిరిగి వచ్చారు.
సున్నతి
వివాదం - యెరూషలేము సమావేశం
అన్యజనులు విశ్వాసంలోకి రావడం పెరిగేకొద్దీ తొలి
సంఘంలో ఒక పెద్ద వివాదం తలెత్తింది. "మోషే ఆచారం ప్రకారం సున్నతి పొంది
ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే తప్ప రక్షణ కలగదు" అని యూదయ నుండి వచ్చిన కొందరు
యూద-క్రైస్తవులు బోధించడం ప్రారంభించారు.
యూద మతంలోకి మారాలనుకునే "దేవునికి
భయపడే" అన్యజనులు ధర్మశాస్త్రాన్ని ఎంతవరకు పాటించాలనే దానిపై అప్పట్లో భిన్న
అభిప్రాయాలు ఉండేవి. కానీ యేసు ప్రభువు ఇచ్చిన సువార్త కేవలం యూద ఆచారాల ముసుగులో
ఉండకూడదని, అది సార్వత్రికమైనదని పౌలు గట్టిగా నమ్మాడు. ఈ
సమస్యను పరిష్కరించడానికి అంతియొకియ సంఘం పౌలు, బర్నబాలను, అన్యజన
క్రైస్తవుడైన తీతును యెరూషలేముకు పంపింది.
పౌలు
స్వాతంత్ర్యం కోసం నిలబడడం (గలతీ 2)
పద్నాలుగు సంవత్సరాల తరువాత పౌలు ఒక ప్రేరణతో
యెరూషలేముకు వెళ్ళాడు. తన సువార్త దైవికమైనదే అయినా, యెరూషలేములో
"క్రైస్తవ మూల స్తంభాలుగా" ఎంచబడిన పేతురు, యాకోబు, యోహానులతో
ఏకాంతంగా మాట్లాడి అవగాహనకు రావడం అవసరమని భావించాడు. అపొస్తలుల సహకారం లేకపోతే తన
శ్రమ వ్యర్థమయ్యే ప్రమాదం ఉందని గ్రహించాడు.
- కపట సహోదరుల కుట్ర: సంఘంలోకి రహస్యంగా
ప్రవేశించిన కొందరు "కపట సహోదరులు" క్రీస్తులోని స్వాతంత్ర్యాన్ని
హరించి అన్యజనులను ధర్మశాస్త్ర దాస్యంలోకి నెట్టాలని చూశారు. గ్రీకు
దేశస్థుడైన తీతుకు బలవంతంగా సున్నతి చేయించాలని పట్టుపట్టారు.
- పౌలు దృఢ నిశ్చయం: పౌలు వారి వాదనకు లొంగలేదు.
తీతుకు సున్నతి చేయించకుండానే తన నిలకడను నిరూపించుకున్నాడు.
- అపోస్తులుల ఆమోదం: యెరూషలేములో అపొస్తలులు పౌలు జీవితంలో దేవుని కృపను, ఆయన శ్రమ ఫలితాన్ని గుర్తించారు. పేతురుకు "సున్నతి
పొందినవారికి" (యూదులకు) సువార్త ప్రకటించే బాధ్యత ఎలా అప్పగించబడిందో, పౌలుకు "సున్నతి లేనివారికి" (అన్యజనులకు) అప్పగించబడిందని
వారు గ్రహించారు.
పేతురు, యాకోబు, యోహానులు
పౌలుకు, బర్నబాకు సహవాస
హస్తాన్ని ఇచ్చారు. అన్యజనుల వైపు పౌలు, యూదుల వైపు
పేతురు వెళ్ళడానికి ఒప్పందం కుదిరింది. వారు పౌలును కోరిన ఒకే ఒక్క విషయం, "యెరూషలేములోని బీదలను జ్ఞాపకం
చేసుకోవడం." పౌలు అప్పటికే ఆ పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు.
సముచిత
విశ్లేషణ మరియు చారిత్రక సమన్వయం
యెరూషలేము సమావేశం గురించి గలతీ లేఖలోని పౌలు
వృత్తాంతాన్ని, అపొస్తలుల కార్యములు 15లోని లూకా
వృత్తాంతంతో పోల్చినప్పుడు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి.
- పౌలు తన లేఖలో వ్యక్తిగత అనుభవాన్ని, ఏకాంత చర్చలను నొక్కిచెప్పగా, లూకా దానిని అధికారిక
సంఘ సభగా వర్ణించాడు. తరువాతి కాలంలో చరిత్ర రాసిన లూకాకు అది అధికారిక
తీర్మానంగా కనిపించడం సహజం.
- సందర్శనల సంఖ్య: లూకా అంతియొకియ నుండి
పౌలు చేసిన మూడు యెరూషలేము ప్రయాణాలను నమోదు చేయగా, పౌలు గలతీ లేఖలో రెండింటినే పేర్కొన్నాడు. కరువు సహాయం తీసుకువెళ్ళిన
ప్రయాణంలోనే (రెండవ సందర్శన) ఈ సువార్త అంశాన్ని కూడా చర్చించి ఉండవచ్చు. ఒకే
ప్రయాణంలో రెండు పనులు జరగడం వల్ల లూకా దానిని వేర్వేరు ప్రయాణాలుగా భావించి
ఉండే అవకాశం ఉంది.
- ఆధ్యాత్మిక పరిణతి: ధర్మశాస్త్ర ప్రాముఖ్యత
విషయంలో, పరిచర్య పద్ధతులలో పౌలుకు, యెరూషలేము పెద్దలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినా బాహ్య ఆచారాల
కంటే వ్యక్తిలోని దేవుని "కృపను", ఆత్మ నడిపింపును బట్టి వారు ఒకరినొకరు గౌరవించుకున్నారు.
పౌలు చేసిన ఈ పోరాటం ద్వారా క్రైస్తవ సువార్త
యూద మతంలోని ఒక ఉపశాఖగా మిగిలిపోకుండా ప్రపంచవ్యాప్తమైన స్వతంత్ర మార్గంగా
రూపాంతరం చెందింది. "కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తులలో ఉంచలేము" అనే
యేసు మాటలోని పూర్తి భావాన్ని పౌలు అర్థం చేసుకున్నాడు. రక్షణకు ప్రాతిపదిక బాహ్య
ఆచారాలు, ధర్మశాస్త్ర నియమాలు కావు; క్రీస్తు
నందలి విశ్వాసం, అంతరంగ ఆధ్యాత్మిక అనుభవమే
అని ఆయన ప్రపంచానికి చాటాడు.
అంతియొకియలో
పేతురును ఎదిరించడం
యెరూషలేము సమావేశం తరువాత అంతియొకియలో తలెత్తిన
పరిస్థితులు అన్యజనుల సువార్త స్వాతంత్ర్యానికి పెద్ద సవాలుగా మారాయి. పౌలు
యెరూషలేము నుండి తిరిగి వచ్చి అన్యజన క్రైస్తవులతో సంపూర్ణ సహవాసాన్ని, సామూహిక
భోజనాలను కొనసాగించాడు. కానీ పేతురు అంతియొకియకు వచ్చినప్పుడు కొత్త సమస్య
మొదలైంది.
ప్రారంభంలో పేతురు అన్యజనులతో కలిసి భోజనం
చేస్తూ స్వేచ్ఛగా సహవాసం చేశాడు. అయితే యెరూషలేము నుండి యాకోబు పంపిన కొందరు
వచ్చినప్పుడు, పేతురు అన్యజనుల నుండి వెనక్కి తగ్గి తనను వేరు
చేసుకున్నాడు. ఈ తడబాటు అంతియొకియ సంఘంలో తీవ్ర కలవరం కలిగించింది. అతని ప్రవర్తన
చూసి మిగిలిన యూదులు, చివరికి పౌలుతో కలసి ఉన్న బర్నబా
కూడా ఆ కపటత్వంలో బాగమయాడు. యెరూషలేము సమావేశంలో యూదుల, అన్యజనుల
పరిచర్య రంగాలు వేర్వేరుగా అంగీకరించబడినా, వారిద్దరూ ఒకే చోట కలిసి
జీవిస్తున్నప్పుడు ఆచరించవలసిన పద్ధతులపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం.
పౌలు ఈ సంఘటనలో తీవ్రమైన ప్రమాదాన్ని గమనించాడు.
పేతురు చర్య వల్ల అన్యజన క్రైస్తవులు అల్పులుగా, అపవిత్రులుగా
పరిగణించబడే ప్రమాదం ఏర్పడింది. ఇది సువార్త సత్యానికి, క్రీస్తులో
లభించిన స్వాతంత్ర్యానికి పూర్తి ప్రతిబంధకం. అందుకే పౌలు పేతురును అందరి ఎదుట
ఎదిరించాడు. యూదుడైన పేతురు స్వయంగా ధర్మశాస్త్ర క్రియల వల్ల కాక క్రీస్తు నందలి
విశ్వాసం ద్వారానే నీతిమంతునిగా తీర్చబడి అన్యజనుల వలె జీవిస్తున్నప్పుడు, అన్యజనులను
యూదుల వలె జీవించమని బలవంతం చేయడం కపటత్వమని స్పష్టం చేశాడు. ధర్మశాస్త్రానికి
చనిపోయి క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం ద్వారా తనలో క్రీస్తే జీవిస్తున్నాడని, ఈ అంతరంగ
విశ్వాస జీవితానికి ఏ బాహ్య ఆచారాల అడ్డుగోడలూ ఉండకూడదని ఆయన నిరూపించాడు. ఈ
బహిరంగ చర్య ద్వారా అంతియొకయలో సువార్త
సత్యం నిలబెట్టబడింది.
రెండవ
మిషనరీ యాత్ర – ఐరోపాలోకి సువార్త
యాత్ర ఆరంభం
దీని తరువాత పౌలు రెండవ మిషనరీ యాత్రకు సిద్ధమయ్యాడు.
పంపిలియాలో తమను విడిచిపెట్టిన యోహాను మార్కును వెంట
తీసుకువెళ్ళే విషయంలో బర్నబా, పౌలు విడిపోయారు. అంతియొకియ సంఘం పౌలును, సీలాసును
దేవుని కృపకు అప్పగించగా, వారు సిరియా, సిలిషియా
గుండా పాత సంఘాలను స్థిరపరుస్తూ బయలుదేరారు. లిస్త్రలో నమ్మకమైన యువకుడు తిమోతి
వీరితో జతకలిశాడు.
దేవుని
నడిపింపు – త్రోయా దర్శనం
ఈ ప్రయాణంలో దేవుని నడిపింపు అత్యంత ఆసక్తికరంగా
సాగింది. ఆసియా రోమా ప్రావిన్స్‌లో వాక్యం వినిపింపనియలేదు. బితూనియాలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా యేసు
ఆత్మ వారిని అనుమతించలేదు. వారు మిసియాను దాటి త్రోయా నగరానికి చేరుకున్నారు.
దేవుడు తమను ఎక్కడికి నడిపిస్తున్నాడో తెలియక అన్వేషిస్తున్న సమయంలో, త్రోయాలో
పౌలుకు రాత్రి వేళ ఒక దర్శనం కలిగింది. ఒక మాసిడోనియా మనిషి నిలబడి తమ వద్దకు వచ్చి
సహాయం చేయమని వేడుకోవడం ఆయన చూశాడు.వెంటనే అక్కడకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ సమయంలోనే లూకా వారితో కలిశాడు. పరిస్థితుల
సాక్ష్యాన్ని, అంతరంగ స్వరాలను బేరీజు వేసుకుని, ఐరోపా
ఖండంలోని మాసిడోనియాకు వెళ్ళడమే దేవుని చిత్తమని పౌలు బృందం నిర్ధారించుకుంది.
ఫిలిప్పీ
త్రోయా నుండి సమొత్రాకు, నెయాపొలి
మీదుగా వారు మాసిడోనియాలోని ప్రముఖ రోమా కాలనీ ఫిలిప్పీకి చేరుకున్నారు. అక్కడ
యూదుల ప్రార్థనా మందిరం లేకపోవడంతో, నది ఒడ్డున ప్రార్థనకు
కూడుకునే స్త్రీల వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించారు. తైయతీరా నగరానికి చెందిన ఊదా
రంగు వస్త్రాల వ్యాపారి లూదియ మనస్సును దేవుడు తెరవగా, ఆమె, ఆమె
ఇంటివారు బాప్తిస్మం పొంది పౌలు బృందానికి తమ ఇంటిలోనే నివాసం కల్పించారు. అలా
ఐరోపా ఖండంలో మొదటి సంఘం ప్రారంభమైంది.
అయితే సోదె చెప్పే ఆత్మ కలిగిన ఒక బానిస యువతి
నుండి ఆ ఆత్మను పౌలు వెళ్ళగొట్టడంతో సమస్య మొదలైంది. ఆమె యజమానులు తమ లాభం
పోయిందని కోపగించి పౌలును, సీలాసును అధికారుల ముందుకు ఈడ్చుకెళ్ళారు. అధికారులు వారి
బట్టలు చింపి, కొట్టించి, చెరసాలలో వేసి బందించారు.
అర్ధరాత్రి వేళ పౌలు, సీలాసులు ప్రార్థిస్తూ దేవుని కీర్తిస్తుండగా గొప్ప
భూకంపం వచ్చి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఖైదీలు పారిపోయారనుకుని ఆత్మహత్య
చేసుకోబోయిన చెరసాల అధికారిని పౌలు
వారించాడు. ఆ అధికారి సత్యం గ్రహించి, రక్షణ మార్గం అడిగి
తెలుసుకుని, తన కుటుంబమంతటితో బాప్తిస్మం పొంది వారికి
ఆతిథ్యమిచ్చాడు.
మరుసటి రోజు అధికారులు వారిని రహస్యంగా
పంపించివేయాలని చూడగా, తాము రోమా పౌరులమని, బహిరంగంగా
కొట్టిన అధికారులే వచ్చి స్వయంగా తమను బయటకు తీసుకువెళ్ళాలని పౌలు పట్టుబట్టాడు.
అధికారులు వచ్చి క్షమాపణ చెప్పి వారిని సాగనంపారు. ఫిలిప్పీని వదిలేముందు పౌలు
లూదియ ఇంట్లోని సహోదరులను కలిసి ఓదార్చాడు. ఆ తరువాత కాలంలో ఫిలిప్పీ సంఘం పౌలు
అవసరాలకు పరిచర్య చేస్తూ ఆయనకు ఎంతో ఆనందాన్ని, తెచ్చిపెట్టింది.
ఈ విధంగా సువార్త విశ్వాసపు దీపం ఆసియా సరిహద్దులు దాటి ఐరోపా ఖండంలో
ప్రవేశించింది.
తెస్సలొనీక
ఫిలిప్పిలో తీవ్రమైన శ్రమలు, అవమానాలు
ఎదుర్కొన్న తరువాత పౌలు, సీలాసు, తిమోతి
ప్రయాణించి తెస్సలొనీకకు చేరారు. ఇది మాసిడోనియాలోనే అత్యంత ముఖ్యమైన మహానగరం, స్వతంత్ర
గ్రీకు పాలన కలిగిన రోమన్ నగరం. ఇక్కడ పాలనాధికారులను పొలిటార్కులు అని
పిలిచేవారు. పౌలు ఎప్పటిలాగే మొదట యూదుల ప్రార్దన మందిరానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అయితే
యూదుల కంటే గ్రీకు ప్రజలే పౌలు బోధల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించారు.
విగ్రహారాధకులైన అనేకమంది గ్రీకులు దేవుని
వైపు తిరిగారు. పౌలు కేవలం ప్రార్దన మందిరానికే పరిమితం కాకుండా అన్యమత భక్తులకు, సాధారణ
ప్రజలకు కూడా దేవుని వాక్యాన్ని అందించాడు.
మాసిడోనియా విశ్వాసులకు ఎవరికీ భారంగా ఉండకూడదనే
ఉద్దేశంతో పౌలు తన చేతులతో గుడారాలు కుట్టే పని చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు.
ఆయన స్వయంగా శ్రామికుడిగా జీవించడం వల్ల అక్కడి అనేకమంది శ్రామికులకు, చేతివృత్తుల
వారికి ఆయన పట్ల గౌరవం, ఆసక్తి పెరిగాయి. తన సొంత
చేతులతో పనిచేస్తూ నిశ్శబ్దంగా జీవించాలని ఆయన వారిని కోరాడు. పౌలు కేవలం దేవుని
సువార్తనే కాక తన సొంత ప్రాణాన్ని కూడా పంచిపెట్టడానికి సిద్ధపడేంతగా వారిని
ప్రేమించాడు. ముఖస్తుతి మాటలు లేకుండా, లోక మహిమను కోరకుండా, ఒక తండ్రి
తన పిల్లలను సంరక్షించినట్లు వారి పట్ల నిందారహితంగా ప్రవర్తించాడు. తెస్సలొనీక ప్రజలు
కూడా ఈ వాక్యాన్ని మనుష్యుల మాటగా కాక
దేవుని మాటగానే స్వీకరించి, ఎంతో బాధలో కూడా పరిశుద్ధాత్మ
ఆనందంతో అంగీకరించారు. పౌలు అక్కడ ముఖ్యంగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి
బోధించాడు.
అయితే పౌలుకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేని
కొందరు యూదులు పట్టణంలోని అరాచకం చేసేవారిని కూడగట్టి అల్లర్లు సృష్టించారు. వారు యాసోను
ఇంటిపై దాడి చేసి, పౌలు దొరకకపోవడంతో యాసోనును, కొందరు
సహోదరులను పొలిటార్కుల(అధికారుల) ముందుకు ఈడ్చుకెళ్ళారు. ఎల్లడల కల్లోలము చేసేవారు ఇక్కడికి వచ్చారని, చక్రవర్తి శాసనాలకు విరుద్ధంగా యేసు అనే వేరొక రాజు
ఉన్నాడని వీరు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. పొలిటార్కులు యాసోను నుండి పూచీకత్తు
తీసుకుని వారిని విడుదల చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి సహోదరులు వెంటనే పౌలును, సీలాసును
రాత్రికి రాత్రే బెరయకు పంపించారు. హఠాత్తుగా వారి నుండి వేరు చేయబడిన పౌలు వారిని
తన ఆశగా, ఆనందంగా, అతిశయ కిరీటంగా భావించాడు.
బెరయ
బెరయలోని యూదులు తెస్సలొనీక వారి కంటే మంచి
వారిగా ఉండి, పూర్ణ
మనస్సుతో వాక్యాన్ని స్వీకరించి, పౌలు చెప్పిన విషయాలు
లేఖనాలలో సరిగ్గా ఉన్నాయో లేదో ప్రతిరోజూ పరిశోధించారు. బెరయలో గొప్ప పరిచర్య
జరుగుతుండగా, తెస్సలొనీక నుండి వచ్చిన శత్రువులు అక్కడ కూడా ప్రజలను
రెచ్చగొట్టి అల్లరి చేశారు. దాంతో సహోదరులు పౌలును సముద్ర మార్గాన ఏథెన్సుకు
పంపించారు. సీలాసు, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.
ఏథెన్సు
ఏథెన్సుకు వచ్చిన పౌలు ఒంటరిగా ఉన్నా, మాసిడోనియాలోని
తన సంఘాల విశ్వాస స్థితిని తెలుసుకోవడానికి ఆతురత పడ్డాడు. అందుకే తాను ఒంటరిగా
ఉండటానికి సిద్ధపడి, తెస్సలొనీయులను
స్థిరపరచడానికి తిమోతిని తిరిగి పంపాడు.
ఏథెన్సు ప్రపంచ మేధో సంపత్తికి, తత్వశాస్త్రానికి
కేంద్రం. పట్టణమంతా విగ్రహాలతో నిండి ఉండడం చూసి పౌలు ఆత్మ తీవ్రంగా కలవరపడింది.
ఆయన ప్రతిరోజూ ప్రార్ధన మందిరంలో
యూదులతోను, సంత విధులలో కలిసే సాధారణ ప్రజలతోను, స్టోయిక్, ఎపిక్యూరియన్
తత్వవేత్తలతోను సంభాషించాడు. కొందరు ఆయనను వాగుడుకాయ అని భావించగా, మరికొందరు
వింత దేవుళ్ళను ప్రకటించేవాడని అనుకుని అరేయొపగస్ అనే ప్రాచీన న్యాయస్థానం వద్దకు
తీసుకువెళ్ళారు. అక్కడ పౌలు అత్యంత జ్ఞానయుక్తమైన ప్రసంగం చేశాడు. వారు తెలియకుండా
ఆరాధిస్తున్న 'తెలియని దేవునికి' అనే
బలిపీఠాన్ని ప్రస్తావిస్తూ, సమస్తాన్ని సృష్టించిన ఏకైక
నిజమైన దేవుని గురించి వివరించాడు. దేవుడు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడని, మనమందరం ఆయన
సంతానమని స్టోయిక్ కవి మాటలను ఉటంకించాడు. అయితే యేసు పునరుత్థానం గురించి
చెప్పినప్పుడు కొందరు అపహసించారు. అయినప్పటికీ డయొనిసియస్, డెమారిసు వంటి కొద్దిమంది దేవుని వాక్యాన్ని నమ్మి
రక్షించబడ్డారు.
కొరింతులో
ఆత్మ మతం – థెస్సలొనీక పత్రికలు, గలతీయులకు లేఖ
కొరింథులో
ప్రారంభం
ఏథెన్సు నుండి పౌలు కొరింథుకు వెళ్ళాడు. ఇది
గొప్ప వాణిజ్య కేంద్రం. అక్కడ రోమ్ నుండి వెళ్ళగొట్టబడిన అక్విలా, ప్రిస్కిల్లా
అనే దంపతులను కనుగొని, వారిదీ గుడారాలు కుట్టే
వృత్తే కావడంతో వారితో కలిసి నివసిస్తూ పనిచేశాడు. ఈ సమయంలో మాసిదోనియా నుండి సీలాసు, తిమోతి
కొరింతుకు వచ్చి ఫిలిప్పీ సంఘం పంపిన సహాయాన్ని, తెస్సలొనీక
సంఘం విశ్వాసంలో స్థిరంగా ఉందనే నమ్మకమైన నివేదికను అందించారు. ఈ వార్త పౌలుకు
ఎంతో ప్రాణపదమైన ఊరటను ఇచ్చింది.
తెస్సలొనీక ప్రజలకు
లేఖ
తెస్సలొనీకయులు అడిగిన ప్రశ్నలకు, వారి
అనుమానాలకు సమాధానంగా పౌలు వారికి లేఖ రాశాడు. యేసు రాకడ సమయానికి మరణించిన క్రైస్తవుల
పరిస్థితి ఏమిటనేది వారి ప్రశ్న. పౌలు భరోసా ఇస్తూ, క్రీస్తు
నందు నిద్రించినవారు నశించిపోలేదని, ప్రభువు రాకడలో మొదట క్రీస్తు
నందు మృతులైనవారు లేస్తారని, తరువాత సజీవులుగా ఉన్నవారు
వారితో కలిసి ప్రభువును ఎదుర్కొంటారని స్పష్టం చేశాడు. ప్రభువు దినం రాత్రివేళ
దొంగలా హఠాత్తుగా వస్తుంది కాబట్టి అందరూ వెలుగు కుమారులుగా, జాగరూకతతో, మత్తెక్కకుండా
ఉండాలని హెచ్చరించాడు. రాకడ నమ్మకంతో తమ
బాధ్యతలను, పనులను మానివేయకుండా, ప్రతి
ఒక్కరూ సొంత చేతులతో పనిచేస్తూ నిశ్శబ్దంగా జీవించాలని బోధించాడు. దేవునితో
జీవించడమనేది భవిష్యత్తు ఆశ మాత్రమే కాక, ప్రస్తుత జీవితంలో పరిశుద్ధత, సంతోషం, నిరంతర
ప్రార్థన, కృతజ్ఞతాభావం ద్వారా వ్యక్తమవ్వాలని నొక్కి
చెప్పాడు.
కొరింతు ప్రార్ధన మందిరం నుండి తీతుయూస్తు ఇంటికి
తెస్సలొనీక నుండి వార్త అందిన శుభ వార్త తరువాత
పౌలు నూతన ఉత్సాహంతో ప్రార్దన మందిరంలో బోధించాడు. అక్కడ యూదుల నుండి తీవ్ర
వ్యతిరేకత ఎదురైంది. దాంతో పౌలు తన వస్త్రాలను దులుపుకుని, "మీరు
పెడదారిన పోయినచో మీ రక్తం మీ మీదనే ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల పోయేదను" అని స్పష్టం చేశాడు. తరువాత ప్రార్దన
మందిరానికి చేరువలోనే ఉన్న తీతుయూస్తు
ఇంట్లో పరిచర్య కొనసాగించాడు. ప్రార్దన మందిరాధికారి క్రిస్పు పౌలు సాక్ష్యానికి
ప్రభావితుడై విశ్వాసంలోకి రాగా, పౌలు స్వయంగా అతనికి
బాప్తిస్మం ఇచ్చాడు.
పౌలు ప్రారంభంలో కొరింతుకు వచ్చినప్పుడు
ఉత్సాహంతో లేడు. తెస్సలొనీకలో ఎదురైన అవమానకర వీడ్కోలు, ఏథెన్సులో
ఆశించినంత విజయం లభించకపోవడం వల్ల బలహీనతతో, భయంతో, ఎంతో
వణుకుతో ఉన్నానని ఆయన పేర్కొన్నాడు. కానీ కొత్త పరిచర్య ప్రారంభమయ్యాక దేవుని
నుండి ప్రత్యేకమైన ఆదరణ, ధైర్యం లభించాయని లూకా
రాశాడు.
గలతీయులకు
లేఖ
కొరింతులో పని ప్రేషిత కార్యం ముమ్మరముగా సాగుతున్న సమయంలోనే గలతీయ సంఘాల నుండి దుఃఖకరమైన వార్త
పౌలుకు చేరింది. అక్కడ యూద బోధకులు వేరొక సువార్తను ప్రచారం చేస్తూ, క్రైస్తవులు
మోషే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలని ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాక పౌలు
నిజమైన అపొస్తలుడు కాదని ప్రచారం చేశారు. గలతీయులు అప్పటికే యూద పండగలను, ఆచారాలను
పాటించడం మొదలుపెట్టి, సున్నతి పొందాలా వద్దా అని
ఆలోచనలో పడ్డారు. ఇది విన్న పౌలు తీవ్ర వేదనతో వారికి లేఖ రాశాడు. క్రీస్తు మీలో రూపుదిద్దుకునే వరకు నేను
మళ్ళీ ప్రసవ వేదన పడుతున్నానని, క్రీస్తు కృప నుండి వేరొక
సువార్త వైపుకు వారు ఇంత త్వరగా మళ్ళడం చూసి ఆశ్చర్యపోతున్నాననీ ఆవేదన వ్యక్తం
చేశాడు.
సువార్త సత్యాన్ని కాపాడడానికి పౌలు తన
అపొస్తలత్వాన్ని సమర్థించుకోవాల్సి వచ్చింది. తన పిలుపు ఏ మనుష్యుని వల్ల కాక
నేరుగా యేసుక్రీస్తు ద్వారానే లభించిందని, యెరూషలేములోని అపొస్తలుల
నుండి తాను ఏమీ పొందలేదని వివరించాడు. యెరూషలేము సమావేశాన్ని, అంతియొకియలో
పేతురును ఎదురించిన ఘటనను గుర్తుచేస్తూ, అన్యజనులపై
ధర్మశాస్త్రాన్ని మోపడానికి యెరూషలేము పెద్దల ఆమోదం లేదని నిరూపించాడు. బుద్ధిహీనులైన గలతీయులారా, ఆత్మతో
ఆరంభించి ఇప్పుడు శరీరంతో సంపూర్ణులు కావాలనుకుంటున్నారా? అని
ప్రశ్నించాడు. వారు ఆత్మను పొందింది ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు, విశ్వాసంతో
వినడం ద్వారానే అని గుర్తుచేశాడు.
ధర్మశాస్త్రం కంటే విశ్వాసమే ప్రాచీనమైనది.
అబ్రాహాము దేవుని విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది; కాబట్టి
విశ్వాసమున్నవారే అబ్రాహాముకు నిజమైన పిల్లలు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా
పాటించలేనివారంతా శాపం కింద ఉన్నారు; ఆ శాపాన్ని క్రీస్తు
తొలగించాడు. అబ్రాహాముకు లభించిన వాగ్దానాన్ని 430 ఏళ్ళ తరువాత
వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయలేదు అని వారికి వివరించాడు.
మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు? మనుషులు తమ
అపరాధాలను గుర్తించి నూతన నీతి మార్గాన్ని ఆశ్రయించేలా చేయడానికి అది మధ్యలో
చేర్చబడిందని పౌలు చెప్పాడు. అది మనుషులకు జీవాన్ని, అంతరంగ
ప్రేరణను ఇవ్వలేదు; మనలను క్రీస్తు వద్దకు
నడిపించే పర్యవేక్షకుడిగా మాత్రమే పనిచేసింది. ఇప్పుడు విశ్వాస యుగం వచ్చింది
కాబట్టి మళ్ళీ పర్యవేక్షకుని కింద ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి బానిసలుగా
ఉండడం అంటే దాసి హాగరు పిల్లలుగా ఉండడమే, కానీ విశ్వాసులు
స్వతంత్రురాలైన సారా పిల్లల వంటివారు. క్రీస్తును ధరించుకున్న వారందరూ దేవుని
కుమారులు. దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాలలోకి పంపి "అబ్బా తండ్రీ"
అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. క్రీస్తు మనకు ప్రసాదించిన స్వాతంత్ర్యంలో
స్థిరంగా నిలబడాలని, మళ్ళీ దాస్యమనే కాడి కింద
చిక్కుకోకూడదని ఆయన పిలుపునిచ్చాడు.
ఇలా పౌలు గలతీయులను ఆచారాల, చట్టాల
నుండి ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ వైపు నడిపించాడు. ఆత్మను అనుసరించే క్రైస్తవులు ఆ
స్వాతంత్ర్యాన్ని, పాపపు కోరికలకు అవకాశంగా వాడుకోరని, ప్రేమతో
ఒకరికొకరు సేవ చేసుకుంటారని ఆయన నమ్మాడు. వారు శరీర క్రియలను విడిచి ఆత్మ ఫలాన్ని
ఫలిస్తారు. లేఖ చివర పౌలు తన సొంత
చేతివ్రాతతో సాక్ష్యమిస్తూ, క్రీస్తు సిలువ ద్వారా లోకం
తనకు, తాను లోకానికి సిలువ వేయబడ్డామని ప్రకటించాడు.
నూతన సృష్టిగా మారిన వారికి క్రీస్తు ప్రేమతో నిండిన జీవితమే కొత్త నియమం. ఈ లేఖను
గలతీయకు తీసుకువెళ్ళినది తిమోతి అయి ఉండవచ్చు.
గల్లియో
సమక్షంలో
అదే సమయంలో కొరింతులో పౌలు తీవ్ర వ్యతిరేకతను
ఎదుర్కొన్నాడు. యూదులు ఆయనను నూతన ఆకాయ అధిపతి గల్లియో సమక్షానికి లాక్కెళ్ళారు.
గల్లియో ప్రసిద్ధ స్టోయిక్ తత్వవేత్త సెనెకా సోదరుడు. ఇది కేవలం యూదుల మతపరమైన
తర్కమని గ్రహించి ఆ కేసును కొట్టివేసి, ఫిర్యాదుదారులను న్యాయపీఠం
నుండి బయటకు పంపేశాడు. ఈ సంఘటన పౌలుకు కొరింథులో మరింత స్వేచ్ఛగా పరిచర్య
చేయడానికి మార్గం సుగమం చేసింది. గల్లియో ఎదుట పౌలును వ్యతిరేకించిన సోస్తెనిసు
తరువాత కాలంలో క్రైస్తవుడై పౌలుకు తోడ్పడ్డాడు.
కొరింతు సంఘ జీవితం
కొరింతు నగరం విచ్చలవిడితనానికి, దుర్మార్గమైన
విగ్రహారాధనకు పేరుగాంచింది. అక్రొకొరింథస్ శిఖరంపై ఉన్న వీనస్ ఆలయం నగర
సంస్కృతిని ప్రభావితం చేసింది. అలాంటి దురాచారాలలో మునిగిన ప్రజలకు వారి శరీరాలు పరిశుద్ధాత్మ
ఆలయాలని, క్రీస్తు అవయవాలని బోధించడానికి ఎంతో ధైర్యం
కావాలి. పౌలు సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే వారి మధ్య ప్రకటించాలని నిశ్చయించుకున్నాడు. యేసు
త్యాగం ద్వారా మనుషుల జీవితాలు రూపాంతరం చెందుతాయని బలంగా నమ్మాడు. ఒక్కడు అందరి
కోసం చనిపోయాడు కాబట్టి జీవించేవారు ఇకపై తమ కోసం కాక క్రీస్తు కోసం జీవించాలని
బోధించాడు. శ్రమల ద్వారా విజయం సాధించిన
పునరుత్థానుడైన క్రీస్తు వార్త కొరింథీయులను మార్చింది. వారు క్రీస్తు మనస్సును
పొంది నూతన వ్యక్తులుగా మారారు. పౌలు ఈ దేవుని మర్మాన్ని ఎటువంటి వక్తృత్వ
ప్రగల్భాలు లేకుండా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ప్రకటించాడు.
ఈ క్రైస్తవ సమాజం ఉమ్మడి అనుభవాలతో బలపడింది.
బాప్తిస్మాన్ని పాపానికి చనిపోయి క్రీస్తులో కొత్తగా జీవించడానికి చిహ్నంగా పౌలు
వివరించాడు. ప్రభువు రాత్రి భోజనం ద్వారా వారు క్రీస్తు శరీరంలో, రక్తంలో
పాలుపంచుకుంటూ ఒకే శరీరంగా ఐక్యమయ్యారు. ఆరాధన సమావేశాలలో ప్రతి ఒక్కరూ తమకు
లభించిన ఆత్మ వరాలను, బోధలను, ప్రార్థనలను
సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు. ఆత్మ ఇచ్చిన స్వాతంత్ర్యంతో పాటు పరిశుద్ధతతో
జీవించాలని పౌలు వారికి ఉద్బోధించాడు.
ఎఫెసులో
పరిచర్య – కొరింతు కోసం ఆందోళన
ఎఫెసుకు
ప్రయాణం
పౌలు, ప్రిస్కిల్ల, అక్విలా కొరింథును విడిచి కెంక్రేయ ఓడరేవుకు
చేరుకున్నారు. అక్కడ కెంక్రేయ సంఘ పరిచారిక ఫీబే వారికి సహాయపడింది. పౌలు తన ఒక
మొక్కుబడిని ముగించుకుని సముద్రం దాటి ఎఫెసుకు వచ్చాడు. ప్రిస్కిల్ల, అక్విలా అక్కడ గుడారాల వ్యాపారం ప్రారంభిస్తూ ఆరాధన
కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పౌలు యెరూషలేము, గలతీయ సంఘాలను
సందర్శించడానికి ప్రయాణమయ్యాడు.
ఆ సమయంలో అలెగ్జాండ్రియాకు చెందిన విద్యావంతుడు
అపొల్లో ఎఫెసుకు వచ్చి, యేసు గురించిన వివరాలు
పూర్తిగా తెలియకపోయినా ఉత్సాహంగా బోధించడం ప్రారంభించాడు. ప్రిస్కిల్ల, అక్విలా అతనికి సత్యాన్ని స్పష్టంగా వివరించగా, అతడు
క్రీస్తుకు గొప్ప మద్దతుదారుడై కొరింతుకు వెళ్ళాడు. పౌలు తిరిగి ఎఫెసుకు వచ్చి
గుడారాల పనిశాలనే సత్య వ్యాప్తికి కేంద్రంగా మార్చుకున్నాడు. అనేక శ్రమలు, ఆకలిదప్పులు, నివాసం లేని
పరిస్థితుల మధ్య తన సొంత చేతులతో కష్టపడుతూ సువార్త అందించాడు.
ఎఫెసులో
పరిచర్య, ప్రమాదాలు
ఎఫెసు నగరం దియానా దేవత ఆరాధనకు నిలయం. ప్రార్ధన
మందిరంలో వ్యతిరేకత ఎదురైనప్పుడు పౌలు
శిష్యులను వేరుచేసి తుర్మన్ను పాఠశాలలో ప్రతిరోజూ బోధించడం ప్రారంభించాడు. అక్కడ
పరిచర్య చేస్తూనే అన్ని సంఘాల భారం తనపై ఉందనే ఆందోళన పడ్డాడు. కొరింథులో అనైతికత
వ్యాపిస్తోందని విని, దుష్టులతో సాంగత్యం చేయవద్దని
హెచ్చరిస్తూ ఒక పత్రిక రాశాడు. ఎఫెసులో ఆయన ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నాడు; "మనుష్య
రీతిగా ఎఫెసులో క్రూరమృగాలతో పోరాడాను" అని పేర్కొన్నాడు. భౌతిక శరీరానికి
కలిగే శ్రమల కంటే అంతరంగ పురుషుని నూతనత్వానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు.
ప్రిస్కిల్ల, అకుల కూడా ఆయన ప్రాణ రక్షణ కోసం తమ ప్రాణాలను
పణంగా పెట్టారు.
మొదటి
కొరింథీయుల లేఖ
కొరింతు నుండి క్లోయే ఇంటివారి ద్వారా వచ్చిన వార్తలను
బట్టి సంఘంలో వర్గాలు ఏర్పడ్డాయని తెలిసింది. అపొల్లో పక్షం, పేతురు పక్షం, పౌలు పక్షం అని చీలిపోయిన
వారిని చూసి పౌలు తీవ్రంగా విచారించాడు. పౌలు ఎవరు, అపొల్లో
ఎవరు, విశ్వసించడానికి సాధనాలు మాత్రమే; నాటినవాడు, నీరు
పోసినవాడు ముఖ్యం కాదు, వృద్ధి కలగజేసిన దేవుడే
ముఖ్యుడని గుర్తుచేశాడు. కొరింథీయులు పంపిన ప్రశ్నలకు సమాధానంగా వివాహం, విగ్రహార్పితాలు, ఆత్మ వరాలు, చందా వసూలు
వంటి విషయాలపై స్పష్టత ఇచ్చాడు. ఇతరుల మనస్సాక్షిని గాయపరచకుండా స్వాతంత్ర్యాన్ని
ప్రేమతో ఉపయోగించాలని బోధించాడు; దేవుని మహిమ కొరకే సమస్తం
చేయాలని సూచించాడు.
సభలలో క్రమశిక్షణ, ప్రభువు
రాత్రి భోజనంలో యోగ్యమైన ప్రవర్తన, ఆత్మ వరాల సరైన వినియోగం
గురించి వివరించాడు. వరాలన్నింటిలో ప్రేమ అత్యుత్తమమైనదని చెబుతూ, తాను
మనుష్యుల, దూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే మోగే గంట
వంటివాడినేనని పలికాడు. పునరుత్థాన నిరీక్షణ క్రైస్తవ జీవితానికి పునాది అని, క్రీస్తు
పునరుత్థానం వల్లనే మన విశ్వాసం సార్థకమవుతుందని ఉద్బోధించాడు. చివరగా
యెరూషలేములోని పేద పరిశుద్ధుల కోసం చందా సమకూర్చే విధానాన్ని వివరించి, త్వరలోనే
వారి వద్దకు వస్తానని మాట ఇచ్చాడు.
ప్రేమ
కొరింథులో క్రమాన్ని పునరుద్ధరించింది – రెండవ కొరింథీయుల లేఖ
ఎఫెసులో గొప్ప పరిచర్య ద్వారం తెరిచి ఉన్నందున
పెంతెకొస్తు వరకు అక్కడే ఉండాలని పౌలు భావించాడు. కానీ కొరింథులోని సమస్యల తీవ్రత
వల్ల ఆయన అక్కడికి ఒక చిన్న అత్యవసర సందర్శన చేయాల్సి వచ్చింది. ఆ సందర్శన ఆశించిన
ఫలాన్ని ఇవ్వకపోగా పౌలు తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. దాంతో ఆయన ఎంతో కన్నీళ్లతో, హృదయ వేదనతో
ఒక కఠినమైన లేఖ రాసి తీతు ద్వారా పంపాడు.
ఆ ఉత్తరంలో తనను విమర్శిస్తున్న నకిలీ అపొస్తలుల ఆరోపణలను ఖండించాడు. తాను
బలహీనతలోనే దేవుని శక్తిని అనుభవించానని, తన శరీరంలోని ముల్లు కూడా
దేవుని కృపను చాటడానికేనని వివరించాడు.
ఎఫెసులో దేమేత్రి అనే శిల్పి దియానా విగ్రహాల
వ్యాపారం దెబ్బతింటోందని ప్రజలను పౌలుకు వ్యతిరేకముగా పూరికొల్పడంతో
పెద్ద అల్లరి జరిగింది. ఆ ముప్పు
నుండి తప్పించుకున్న పౌలు త్రోయ మీదుగా మాసిడోనియకు వెళ్ళాడు. కొరింతు నుండి తీతు తెచ్చే వార్త కోసం తీవ్రంగా
నిరీక్షించాడు. మాసిడోనియలో తీతును కలిసినప్పుడు కొరింతియులు పశ్చాత్తాపపడి పౌలు
పట్ల ప్రేమను, విధేయతను చాటారని తెలిసి ఎంతో ఓదార్పు పొందాడు.
వారి దుఃఖం సరైన మార్పునకు దారితీసిందని సంతోషించాడు.
ఆనందంతో పౌలు కొరింతియులకు మరొక ఆదరణకరమైన
పత్రికను రాశాడు. కొరింతియుల రూపాంతరమే తన పరిచర్యకు జీవమున్న పత్రిక అని
ప్రకటించాడు. ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని, దేవుని
మహిమను చూస్తూ విశ్వాసులు మహిమ నుండి మహిమకు రూపాంతరం చెందుతారని వివరించాడు.
శ్రమలు ఎదురైనా ఈ మహిమాన్విత సువార్త నిధిని మట్టి పాత్రలలో కలిగి ఉన్నామని, నాశనం
కాకుండా ముందుకు సాగుతామని ధైర్యం చెప్పాడు. యెరూషలేము నిధి కోసం ఉదారంగా విరాళాలు
ఇవ్వాలని ప్రోత్సహిస్తూ, "ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని
ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై
ఉండుగాక" అని దీవిస్తూ తన లేఖను ముగించాడు.
యెరూషలేము
చందా మరియు రోమీయులకు లేఖ
కొరింతులో ప్రేమ, విశ్వాసం
విజయం సాధించినా, పౌలు ఒక గొప్ప ఉద్దేశంతో
ప్రణాళికలు రచించాడు. అన్యజనులకు ధర్మశాస్త్రంతో నిమిత్తం లేకుండా సువార్త
ప్రకటించడం వల్ల తన సొంత ప్రజలైన యూదులను తృణీకరిస్తున్నాడనే అపార్థం ప్రజల్లో
బలపడింది. ఇది క్రైస్తవ సమాజాన్ని యూదు, అన్యజాతి వర్గాలుగా
విభజిస్తుందనే భయం ఏర్పడింది. ఈ అపార్థాలను తొలగించి క్రీస్తు నందు ఉన్న ఐక్యతను
చాటడానికి, అన్యజాతి క్రైస్తవుల నుండి యెరూషలేములోని పేద
పరిశుద్ధుల కోసం చందా సేకరించి సమర్పించాలని పౌలు సంకల్పించాడు. అంతకు ఏడాది
క్రితమే మొదలైన ఈ చందా కొరింతియుల ఇబ్బందుల వల్ల ఆలస్యమైనా, తీతును పంపి
దాన్ని పూర్తి చేయించాడు. "దేవుడు సంతోషంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు"
అనే సూత్రాన్ని బోధించాడు. ఈ ఉదారత యెరూషలేము పరిశుద్ధుల అవసరాలు తీర్చడమే కాక, యూదుల
హృదయాలలో అన్యజనుల పట్ల ఉన్న ద్వేషాన్ని తొలగించి ప్రేమను పెంపొందిస్తుందని
ఆశించాడు. గలతీయ ప్రాంత విశ్వాసులు కూడా పౌలు బోధను స్వీకరించి ఈ ఉదార
ధర్మకార్యంలో భాగస్వాములయ్యారు.
రోమీయులకు
లేఖ
చివరకు పౌలు కొరింతుకు చేరుకుని గాయి ఇంట్లో
నివసించాడు. అక్కడ ఎరస్తు, క్వర్తు, లూకియ, యాసోను, సోసిపత్రు
వంటి స్నేహితులతో కలిసి పరిచర్య కొనసాగించాడు. ఈ సమయంలోనే కెంక్రేయ సంఘ నివాసియైన
ఫీబేను సిఫారసు చేస్తూ, రోమాలోని విశ్వాసులకు తన
అత్యంత సంపూర్ణమైన లేఖను వ్రాశాడు. తాను ఎన్నడూ చూడని రోమీయులకు రాస్తూ, వారిలో
ఆత్మీయ ఫలం పొందడానికి, వారిని స్థిరపరచడానికి రోమాను
దర్శించాలని ఉందనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు
సువార్తను పూర్తిగా ప్రకటించానని, ఇక ఈ ప్రాంతాలలో తనకు స్థలం
లేనందున స్పెయిన్ వెళ్లే మార్గంలో రోమాను చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఈ లేఖలో తన సువార్త సారాంశాన్ని సంపూర్ణంగా
వివరించాడు. రక్షణ కలిగించే దేవుని శక్తి సువార్తే అని, ధర్మశాస్త్ర
క్రియల వల్ల ఏ మనిషీ నీతిమంతుడు కాలేడని స్పష్టం చేశాడు. యేసుక్రీస్తు నందలి
విశ్వాసం ద్వారా దేవుని నీతి ప్రత్యక్షపరచబడిందని, పని
చేయనివాడైనా భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చువానియందు విశ్వాసముంచినప్పుడు ఆ
విశ్వాసమే నీతిగా ఎంచబడుతుందని బోధించాడు.
విశ్వాసం అనేది కేవలం ఒక ఆలోచన లేదా నమ్మకం
మాత్రమే కాదు; అది మనిషి అంతరంగంలో నిజమైన నీతిని ఉత్పత్తి
చేసే దైవ శక్తి అని పౌలు వెల్లడించాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా
తీర్చబడినప్పుడు హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది; ఆ ప్రేమ
నుండే నిజమైన క్రియలు ప్రవహిస్తాయి. దేవుడు కేవలం క్రియలను తూచే న్యాయాధిపతి కాడు, తన పిల్లల
ప్రేమను కోరుకునే తండ్రి. క్రీస్తు మరణం దేవుని ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ.
ప్రాయశ్చిత్తం అంటే దేవుణ్ణి శాంతింపజేయడం కాదు; దేవుడే తన
కృపతో యేసును ప్రాయశ్చిత్తంగా నియమించాడు. క్రీస్తు మన కొరకు చనిపోవడం ద్వారా
దేవుడు మన పట్ల తన ప్రేమను కనుపరిచాడు. పౌలు దృష్టిలో ఆధ్యాత్మిక జీవితం అంటే
క్రీస్తు మరణ పునరుత్థానాలతో ఐక్యం కావడం. పాపశరీరం నిర్మూలమయ్యేలా మన పాత మనిషి
ఆయనతో పాటు సిలువ వేయబడ్డాడు. క్రీస్తుతో చనిపోవడం మాత్రమే కాక, ఆయన ఆత్మ
ద్వారా జీవించడం దేవుని బిడ్డల మహిమాయుత స్వాతంత్ర్యానికి దారితీస్తుంది.
ఈ లేఖలో తన సొంత ప్రజలైన యూదులు క్రీస్తును
తిరస్కరించినందుకు పౌలు తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశాడు. వారు క్రీస్తును
అంగీకరించడానికి తాను శపించబడడానికైనా సిద్ధపడ్డాడు. అయినా దేవుడు తన ప్రజలను
పూర్తిగా త్రోసివేయలేదని, అన్యజనుల రక్షణ ద్వారా
యూదులలో ఆధ్యాత్మిక అసూయ కలిగి వారు తిరిగి సువార్తను స్వీకరించే రోజు వస్తుందని
నమ్మాడు. యూదులను సహజ ఒలీవ చెట్టుతోను, అన్యజనులను అంటుకట్టిన అడవి
కొమ్మతోను పోల్చాడు. రోమాలోని అన్యజాతి సంఘం తమ జీవితాలను సజీవ యాగంగా అర్పించి
అత్యున్నత నైతిక ప్రమాణాలతో జీవించాలని కోరాడు.
యెరూషలేముకు
యాత్ర, అరెస్టు మరియు విచారణలు
యెరూషలేము
వైపు పయనం
లేఖను పంపిన తరువాత పౌలు తాను సేకరించిన కానుకలతో
యెరూషలేము వైపు పయనమయ్యాడు. ఓడలో ఆయన ప్రాణం తీయడానికి యూదులు కుట్ర పన్నడంతో మాసిడోనియా
మీదుగా ప్రయాణాన్ని మార్చుకున్నాడు. అన్యజాతి సంఘాల ప్రతినిధులు, లూకా ఆయనతో
చేరారు.
త్రోయలో అర్ధరాత్రి వరకు పౌలు వాక్యబోధ
చేస్తుండగా యూతికుసు అనే యువకుడు
నిద్రమత్తులో పైన కిటికీ నుండి పడిపోయాడు; పౌలు అతన్ని
బ్రతికించాడు. మిలేతు వద్ద ఎఫెసు పెద్దలను పిలిపించి, తన
పరిచర్యను గుర్తుచేస్తూ, యెరూషలేములో తాను
బంధించబడవచ్చునని, ఇకపై తన ముఖాన్ని వారు చూడరని
వీడ్కోలు పలికాడు. వారితో కలిసి మోకరించి ప్రార్థించినప్పుడు వారు ఎంతో దుఃఖించి
ఓడ వరకు సాగనంపారు.
దారిలో తూరు, కైసరయలలో
శిష్యులు పౌలును హెచ్చరించారు. కైసరయలో ప్రవక్త అగబు పౌలు నడుముకట్టు తీసుకుని, యెరూషలేములో
పౌలు కాళ్ళు చేతులు బంధించబడతాయని చెప్పాడు. అయినా పౌలు తన నిర్ణయాన్ని
మార్చుకోకుండా, ప్రభువైన యేసు నామం కొరకు
బంధించబడడానికే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా
ఉన్నానని ప్రకటించాడు.
యెరూషలేములో
యెరూషలేము చేరిన పౌలును యాకోబు, పెద్దలు
ఆనందంతో స్వాగతించారు. అన్యజనుల మధ్య దేవుడు చేసిన కార్యాలను పౌలు వివరించాడు.
అయితే ధర్మశాస్త్రాన్ని పాటించే వేలాదిమంది యూదయ క్రైస్తవులు పౌలు
ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడని భావించారు. ఈ అపార్థాన్ని తొలగించడానికి
పెద్దల సూచన మేరకు నలుగురు పేదవారి నాజీరు మొక్కుబడి ఖర్చులను భరించి, దేవాలయంలో
శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి పౌలు
అంగీకరించాడు.
కానీ ఆసియా నుండి వచ్చిన యూదులు పౌలు
దేవాలయాన్ని అపవిత్రం చేశాడని నిందమోపి, ఆయనను బయటకు ఈడ్చి చంపడానికి
ప్రయత్నించారు. ఆ సమయంలో రోమా సైనికులు, సహస్రాధిపతి లూసియ వచ్చి
ఆయనను బందించి రక్షించారు. కోట మెట్లపై
నిలబడి పౌలు తన పరివర్తనను వివరించాడు. అయితే దేవుడు తనను అన్యజనుల వద్దకు పంపాడని
చెప్పగానే వారు మళ్ళీ కోపంతో రగిలిపోయారు.
మరుసటి రోజు మహాసభ ఎదుట విచారణలో పరిసయ్యులకు, సద్దూకయ్యులకు
మధ్య పునరుత్థానం విషయమై వివాదం రాగా, లీసియా పౌలును కాపాడాడు. పౌలును చంపడానికి నలభై మంది
యూదులు చేసిన కుట్రను ఆయన సోదరి కుమారుడు వెల్లడించడంతో, రాత్రివేళ
బలమైన కాపలాతో పౌలును కైసరయలోని రాష్ట్రాధిపతి ఫేలిక్సు వద్దకు పంపారు.
కైసరయలో
కైసరయలో యూదుల తరఫున తెర్తుల్లు అనే వక్త పౌలు
అల్లర్లు రేపేవాడని ఆరోపణలు చేశాడు. పౌలు తన నిర్దోషిత్వాన్ని సమర్థించుకున్నాడు.
ఫేలిక్సు పౌలు నిర్దోషి అని గ్రహించినా, యూదులను సంతృప్తిపరచడానికి, లంచం ఆశించి
ఆయనను జైలులోనే ఉంచాడు. ఫేలిక్సు, అతని భార్య ద్రుసిల్లా పౌలు
ద్వారా నీతి, ఆత్మనిగ్రహం, రాబోయే
తీర్పు గురించి విని భయపడ్డారు.
రెండేళ్ళ తరువాత ఫేలిక్సు స్థానంలో ఫేస్తు వచ్చాడు. యూదుల ఒత్తిడికి లొంగి ఫేస్తు
"యెరూషలేములో విచారణ జరుపమంటావా ?" అని అడిగినప్పుడు, పౌలు తన
ప్రాణానికి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి, రోమా పౌరుడిగా కైసరుకు అపీలు
చేసుకుంటున్నానని ప్రకటించాడు. దీంతో ఫేస్తు ఆయనను రోమాకు పంపడానికి నిశ్చయించాడు.
ఈ లోపు అగ్రిప్ప రాజు ఎదుట పౌలు తన రక్షణ అనుభవాన్ని శక్తివంతంగా సాక్ష్యమిచ్చాడు.
రోమాకు
ప్రయాణం – తుఫాను, ఓడ బద్దలు
రోమాకు పౌలును తీసుకువెళ్లే ప్రయాణం లూకా, అరిస్టార్కు
తోడుగా శతాధిపతి జూలియసు సంరక్షణలో
ప్రారంభమైంది. శీతాకాలం కావడంతో సముద్ర ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. క్రీటు
ద్వీపం దాటిన తరువాత భయంకరమైన తుఫాను ఓడను
చుట్టుముట్టింది. నావికులు, సైనికులు నిరాశలో
మునిగిపోయినప్పుడు, దేవుని దూత తనకు కనబడి ధైర్యం
చెప్పాడని పౌలు వెల్లడించాడు. ఓడలో ఉన్న వారందరికీ ధైర్యం చెప్పి, భోజనం
చేయించి, దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఓడ బద్దలైనా అందరూ సురక్షితంగా మాల్టా ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ పాము పౌలు
చేతిని కరిచినా ఆయనకు ఏ హానీ కలగలేదు; దాంతో స్థానికులు ఆయనను
దేవుడని భావించారు. అక్కడ పౌలు ప్లూబియా అను
ఆ దీవి నాయకుని తండ్రిని, మరికొందరిని
స్వస్థపరిచాడు. మూడు నెలల తరువాత మరొక ఓడలో ప్రయాణించి రోముకు చేరుకున్నాడు.
మార్గమధ్యంలో అప్పి సంత వద్ద రోము నుండి సహోదరులు కలిసినప్పుడు, ఆయన
దేవునికి కృతజ్ఞతలు చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు.
రోములో ఖైదు
కాలం – చెరసాల లేఖలు
రోములో పౌలు సైనికుని కాపలాలో తాను అద్దెకు
తీసుకున్న ఇంట్లో రెండేళ్ళు నివసించాడు. అక్కడి యూదులను, సందర్శకులను
ఆహ్వానిస్తూ దేవుని రాజ్యాన్ని గూర్చి ధైర్యంగా బోధించాడు. ఈ ఖైదు కాలంలోనే ఆయన
అనేక ప్రాముఖ్యమైన లేఖలను వ్రాశాడు.
ఫిలేమోనుకు
లేఖ
ఫిలేమోను దాసుడైన ఒనేసిము యజమానిని విడిచి
పారిపోయి, రోములో పౌలు ద్వారా రక్షణ పొంది సహోదరుడిగా
మారాడు. పౌలు అతనిని తిరిగి ఫిలేమోను వద్దకు పంపుతూ, కేవలం
దాసుడిగా కాక ప్రియ సహోదరుడిగా చేర్చుకోవాలని వేడుకున్నాడు.
కొలొస్సయి
సంఘానికి లేఖ
తుకికు ద్వారా కొలొస్సయి సంఘానికి లేఖ పంపాడు.
అక్కడి తప్పుడు బోధలను ఖండిస్తూ, క్రీస్తు సమృద్ధిని, ఆయన
దైవత్వాన్ని హెచ్చించాడు. క్రీస్తు నందు జ్ఞాన విజ్ఞానములు సమస్త నిధులు దాచబడి ఉన్నాయని, ఆయన అదృశ్య
దేవుని స్వరూపి అని బోధించాడు. విధిలేఖలను, ఆచారాలను పాటించడం కంటే, క్రీస్తుతో
లేపబడినవారు దైవ రాజ్యమునకు చెందిన వాటినే
వెదకాలని, కనికరం, దయ, వినయం, ప్రేమ కలిగి
ఉండాలని ఉద్బోధించాడు.
ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు లేఖలు
ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు
రాసిన లేఖలు కూడా ఈ కాలంలోనే వెలువడ్డాయి. ఫిలిప్పీయుల నుండి ఎపఫ్రొదితు తెచ్చిన
కానుకలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన బంధకాలు సువార్త
అభివృద్ధికి ఎలా తోడ్పడ్డాయో వివరించాడు. ప్రిటోరియన్ కాపలాదారులకు, కైసరు
ఇంటివారికి కూడా సువార్త చేరిందని తెలిపాడు. క్రీస్తును తెలుసుకునే ఆధిక్యత
నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానని, వెనుక ఉన్నవి మరచి ముందున్న
వాటి కోసమే పరుగెత్తుతున్నానని రాశాడు. "జీవించుట క్రీస్తే, చనిపోవడం లాభం" అనే
ఆధ్యాత్మిక దృక్పథాన్ని వ్యక్తపరిచాడు. క్రీస్తు ప్రభువు దేవుని రూపంలో ఉండియు, తన్ను తాను
ఖాళీ చేసుకుని సేవకుని రూపం ధరించి సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్న మనస్సునే
విశ్వాసులు కలిగి ఉండాలని పిలుపునిచ్చాడు.
చివరి
రోజులు మరియు అమరత్వం
తన విచారణ మొదటి వాదనలో అందరూ తనను
విడిచిపెట్టినా, ప్రభువు తన పక్కన నిలిచి
ధైర్యపరిచాడని, సింహం నోటి నుండి
విడిపించబడ్డానని పౌలు పేర్కొన్నాడు. తన జీవిత చరమాంకంలో "మంచి పోరాటం
పోరాడాను, పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని
కాపాడుకున్నాను" అని సంతృప్తి చెందాడు. తొలి సంప్రదాయాల ప్రకారం రోములో నీరో చక్రవర్తి ఆజ్ఞ మేరకు పౌలు శిరచ్ఛేదం
చేయబడి అమరవీరుడయ్యాడు.
పౌలు
వారసత్వం – ప్రపంచానికి ఆయన సందేశం
పౌలు యొక్క ప్రపంచవ్యాప్త సందేశం కేవలం మొదటి
శతాబ్దానికి పరిమితం కాక, అన్ని కాలాల మానవాళికి
సత్యంగా నిలిచింది. ఆయన సందేశంలోని ప్రధాన సూత్రాలు ఇవి:
- దేవుడే మనలను వెతుకుతున్నాడు: యేసు జీవితం, మరణం ద్వారా దేవుడు
మనుష్యులలో తనను తాను వెతుకుతున్నాడనే సత్యాన్ని ఆయన గ్రహించాడు.
- ఆత్మ–ఆత్మల ఐక్యత: మనిషి ఆత్మ దేవుని
ఆత్మతో ఐక్యం కాగలదని, మనం దేవుని పిల్లలమని
ఆత్మయే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తుందని బోధించాడు.
- క్రీస్తును అనుకరించడం: అది కేవలం బాహ్య ప్రవర్తన కాదు; క్రీస్తు ఆత్మ మనలో
నివసించడమే.
- సిలువ ధ్యానం: దీని ద్వారా మనిషిలోని
చెడుకు మరణం, దైవిక స్వభావానికి జీవం
లభిస్తాయని చూపించాడు.
- అంతరంగ విశ్వాసానికి ప్రాధాన్యం: బాహ్య ఆచారాలు, క్రతువుల కంటే అంతరంగంలో
దేవుని పట్ల ఉండే విశ్వాసమే ముఖ్యమని స్పష్టం చేశాడు.
- ప్రేమ – అత్యంత శ్రేష్ఠమైనది: భాషలు, ప్రవచనాలు, జ్ఞానం తొలగిపోయినా ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుందని చాటాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ నిలిచి ఉంటాయని, వీటిలో అత్యంత గొప్పది ప్రేమేనని ప్రకటించాడు.
- క్రీస్తు ప్రేమ నుండి ఏదీ వేరు చేయలేదు: యేసుక్రీస్తు ముఖమందు ప్రత్యక్షమైన దేవుని మహిమను చూసిన పౌలు, ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఖడ్గమైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయలేదని, ఆయన ద్వారా మనం జయించిన వారికంటే అధికంగా జయం పొందుతామని బలంగా
విశ్వసించాడు.
ముగింపు
హింసకుడైన సౌలు నుండి అన్యజనుల అపొస్తలుడైన
పౌలుగా మారిన ఈ ప్రయాణం, దేవుని కృప ఒక మనిషిని ఎంతగా
రూపాంతరం చెందించగలదో చాటుతుంది. తార్సులో పునాది, యెరూషలేములో
విద్య, దమస్కులో పరివర్తన, అరేబియాలో
ధ్యానం, అంతియొకయలో పిలుపు, మిషనరీ
యాత్రలలో శ్రమ, కొరింథు–ఎఫెసులలో సంఘ
నిర్మాణం, రోమా చెరసాలలో లేఖా రచన, చివరకు
అమరత్వం ఇవన్నీ కలిసి పౌలు జీవితాన్ని
క్రైస్తవ చరిత్రలో ఒక అద్వితీయ అధ్యాయంగా నిలిపాయి. ఆయన జీవితం, సువార్త
సందేశం లోక చరిత్రను, మానవ హృదయాలను శాశ్వతంగా
మార్చివేశాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి