లూకా 15:1-10 తప్పిపోయిన గొఱ్ఱె, నాణెము ఉపమానాల వ్యాఖ్యానం
లూకా 15:1-10
సుంకరులు,
పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయనవద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “ఇతడు పాపులను చేరదీయుచు, వారితో
కలిసి భుజించుచున్నాడు” అని సణుగుకొనసాగిరి. అపుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను: “ఒకడు తనకు ఉన్న నూరు గొఱ్ఱెలలో ఒకటి
తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ
అరణ్యముననే విడిచి పెట్టి, దానిని వెదకుటకై పోవునుగదా! అది దొరికినపిమ్మట వాడు సంతోషముతో దానిని
భుజములపై వేసికొని, ఇంటికి తీసికొని వచ్చి, తన మిత్రులను, ఇరుగు పొరుగు వారలను పిలిచి, 'తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది. నాతోపాటు ఆనందింపుడు' అని చెప్పును. అట్లే
హృదయపరివర్తనము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతులకంటె, హృదయపరివర్తనము
పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయ ముగా
చెప్పుచున్నాను. “పది
వెండినాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనినయెడల, దీపము
వెలిగించి, ఇల్లు ఊడ్చి, అది
దొరకునంతవరకు పట్టుదలతో వెదకదా? అది దొరకగనే స్నేహితురాండ్రను, ఇరుగుపొరుగు స్త్రీలను చేరబిలిచి 'నాతో
పాటు ఆనందింపుడు. నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినది' అని
చెప్పును. అట్లే హృదయపరివర్తనము చెందు ఒక
పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను.”
తప్పిపోయిన గొఱ్ఱె మరియు పోగొట్టుకొనిన నాణెము
యేసు ప్రభువు ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడు?
లూకా 15వ అధ్యాయాన్ని
"సువార్తలోని సువార్త" అని, "కోల్పోయిన వాటి అధ్యాయం"
అని పిలుస్తారు. ఇందులో మూడు ఉపమానాలు ఉన్నాయి. అవి తప్పిపోయిన గొఱ్ఱె, పోగొట్టుకొనిన
నాణెము, తప్పిపోయిన కుమారుడు. ఈ మూడూ ఒకే ప్రశ్నకు
జవాబు: యేసు ప్రభువు పాపులను ఎందుకు చేరదీస్తున్నాడు?
సుంకరులు, పాపులు ఆయన బోధలు వినడానికి
"వచ్చుచుండిరి" అని మొదటి వచనం చెబుతుంది. ఇది ఒక్కసారి జరిగిన సంఘటనను
కాదు, నిరంతర ప్రవాహాన్ని సూచిస్తుంది. సుంకరులు రోమా
ప్రభుత్వం కోసం పన్నులు వసూలు చేసేవారు. వారి సొంత ప్రజల నుండి అధికంగా వసూలు చేసి
లాభపడేవారని ప్రజలు వారిని దేశద్రోహులుగా, అపవిత్రులుగా ద్వేషించారు. ఇక్కడ
"పాపులు" అంటే ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా అతిక్రమించేవారు, సమాజం
వెలివేసినవారు. వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు, ఎందుకంటే
ఆయన మాటల్లో వారికి తీర్పు కాక ఆశ కనిపించింది. వారు "వినడానికి" వచ్చారు, ఎందుకంటే
హృదయపరివర్తనకు మొదటి మెట్టు దేవుని వాక్యాన్ని వినడమే.
పరిసయ్యులు, ధర్మశాస్త్ర
బోధకులు "ఇతడు పాపులను చేరదీయుచు, వారితో కలిసి
భుజించుచున్నాడు" అని సణిగారు. ఈ "సణుగుట" ఎడారిలో ఇస్రాయేలీయులు ప్రజలు
మోషేకు వ్యతిరేకంగా సణిగిన సంఘటనలను (నిర్గమ 16) గుర్తుచేస్తుంది.
అంటే వారి సణుగుడు నిజానికి దేవుని కరుణకే వ్యతిరేకం. వారి అభ్యంతరంలో రెండు
భాగాలు ఉన్నాయి. "చేరదీయడం", "కలిసి భుజించడం". కలిసి
భోజనం చేయడం స్నేహానికి, అంగీకారానికి, ఐక్యతకు
చిహ్నం. పవిత్రత అంటే పాపులకు దూరంగా ఉండటమని పరిసయ్యులు భావించారు "పరిసయ్యుడు"
అనే పేరుకే "వేరుపడినవాడు" అని అర్థం. అందుకే యేసు ప్రభువుని చర్య
వారికి పాపాన్ని సమర్థించినట్లు కనిపించింది. పరిసయ్యుల భక్తి నిజమైనదే, కానీ అది
ఇతరులను చిన్నచూపు చూసే స్థితికి చేరింది.
యేసు ప్రభువు వారికి వాదనతో కాక కథతో సమాధానమిస్తున్నాడు. ఈ ఉపమానాలను
వినే వారు సణుగుతున్న పరిసయ్యులే కాని, పాపులు కాదు. యేసు ప్రభువు తనను
సమర్థించుకుంటూనే, దేవుని ఆనందంలో
పాలుపంచుకోమని పరిసయ్యులను ఆహ్వానిస్తున్నాడు.
తప్పిపోయిన గొఱ్ఱె (4-7)
"మీలో ఎవడు...?" అనే
ప్రశ్నతో యేసు ప్రభువు ప్రారంభిస్తాడు. నూరు గొఱ్ఱెలున్న కాపరికి ఒకటి తప్పిపోతే, తక్కిన
తొంబది తొమ్మిదింటిని అరణ్యంలో విడిచి, అది దొరికే వరకు వెదకడానికి
వెళ్తాడు. ఏ
కాపరైనా అలాగే చేస్తాడని ప్రభువు చెబుతున్నాడు.
- కాపరి తర్కం అంటే ప్రేమ తర్కం, లెక్కల తర్కం కాదు. ఒక్కదాని కోసం తొంబది
తొమ్మిదింటిని ప్రమాదంలో వదలడం లెక్కల ప్రకారం అవివేకంగా కనిపిస్తుంది. దేవునికి
వ్యక్తీ కేవలం "ఒక సంఖ్య" కాదు. పది మంది పిల్లల్లో ఒకరు
కనిపించకపోతే తల్లి మిగిలిన తొమ్మిది మందితో తృప్తి చెందదు కదా. అలానే ప్రతి బిడ్డ
దేవునికి అమూల్యమే.
- చొరవ కాపరిదే. గొఱ్ఱె తిరిగి వస్తుందని
అతడు వేచి ఉండడు. గొఱ్ఱె దిక్కుతోచని జంతువు, మంద నుండి తప్పిపోతే నిస్సహాయంలో ఉంటుంది. కనుక పాపి దేవుని
వెదకకముందే దేవుడు పాపిని వెదకుతున్నాడు. ఇది లూకా 19:10 "తప్పిపోయినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను", యెహెజ్కేలు 34:16 "తప్పిపోయినదానిని
వెదకెదను" అను వాక్యాలను ప్రతిధ్వనిస్తుంది.
- "అది దొరకునంతవరకు" అన్వేషణ ఆగదు. దేవుని అన్వేషణకు నిరాశ లేదు. మానవుని కోసం నిత్యం ఆయన వేదకుతూనే ఉంటాడు.
- కాపరి గొఱ్ఱెను సంతోషంతో భుజాలపై వేసుకుంటాడు. ఇక్కడ కాపరి దానిని కొట్టడు, తిట్టడు, నడిచి రమ్మని బలవంతం
చేయడు. గొఱ్ఱె అలసిపోయింది కాబట్టి దాని భారాన్ని తానే మోస్తాడు. ఇది యెషయా 40:11,
53:4-6 వాక్యాలను గుర్తుచేస్తుంది. మన పాపభారాన్ని
సిలువపై మోసిన క్రీస్తుకు ఇది సూచన అని క్రైస్తవ సంప్రదాయం భావించింది.
- ఆనందం పంచుకోబడుతుంది. కాపరి మిత్రులను, ఇరుగుపొరుగు వారిని
పిలిచి "తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది, నాతోపాటు ఆనందింపుడు" అంటాడు. "నా" అనే పదం ఇక్కడ ముఖ్యమైనది.
తప్పిపోయిన గొఱ్ఱె కాపరికి చెందినదే. పాపి దేవుని నుండి
దూరమైనా ఆయన బిడ్డగానే ఉంటాడు.
ఇక్కడ రెండు అర్ధాలు ఉన్నాయి. మొదటిది వ్యంగర్ధం
హృదయపరివర్తనము అవసరం లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల కంటె, హృదయపరివర్తనము
పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది అనే మాట, తమను తాము
నీతిమంతులుగా భావించి పరివర్తన అవసరం లేదనుకునే పరిసయ్యులను ఉద్దేశించి యేసు ప్రభువు
చెబుతున్నాడు. కానీ "అందరూ పాపము చేసి" ఉన్నారు (రోమీ 3:23), కాబట్టి పాపం
చేయలేదు అనే వర్గం లేదు, ఒక వేళ ఒక వ్యక్తి నేను పాపం చేయలేడు అని అనుకుంటే అది తనని
తాను వంచన చేసుకోవడమే. దేవుని చెంతనే ఉన్నవారి పట్ల ఆయన ప్రేమ తగ్గదు, కానీ తిరిగి
వచ్చినవారి విషయంలో కలిగే ప్రత్యేక ఆనందాన్ని ఇక్కడ చెబుతున్నాడు.
పోగొట్టుకొనిన నాణెము
ఉపమానం అరణ్యం నుండి ఇంటికి, పురుషుడైన
కాపరి నుండి ఒక స్త్రీకి మారుతుంది. ఒక స్త్రీ తన వద్ద పది వెండి నాణెములు (డ్రాక్మాలు, ఒక్కొక్కటి
సుమారు ఒక రోజు కూలీకి సమానం) ఉన్నాయి, అందులో ఒకటి పోయింది. ఇలాంటి
నాణెములు స్త్రీ వివాహ తలకట్టులో భాగమై వుంటాయి. అవి తమ గౌరవానికి
చిహ్నంగా ఉండేవని కొందరు చెబుతారు. ఒక కుటుంబానికి ఒక నాణెం కోల్పోవడం చిన్న విషయం
కాదు.
ఆ స్త్రీ అన్వేషణలో మూడు చర్యలు ఉన్నాయి
- దీపం వెలిగించడం. పాలస్తీనా ఇళ్లు చిన్నవి, కిటికీలు తక్కువ, చీకటిగా ఉండేవి.
ఆధ్యాత్మికంగా ఇది చీకటిలో వెలుగుగా దేవుని వాక్యాన్ని సూచిస్తుంది (కీర్తన 119:105).
- ఇల్లు ఊడ్చడం. అన్వేషణ శ్రమతో, క్రమపద్ధతిలో సాగుతుంది.
ఆధ్యాత్మికంగా ఇది హృదయ శుద్ధిని, అంటే పేరుకుపోయిన ద్వేషం, గర్వం, అసూయ, క్షమించలేని మనస్తత్వాన్ని తొలగించడాన్ని సూచిస్తుంది.
- దొరికే వరకు పట్టుదలతో వెదకడం.
నాణెం దొరికినప్పుడు ఆమె స్నేహితురాళ్లను, ఇరుగుపొరుగు
స్త్రీలను పిలిచి ఆనందాన్ని పంచుకుంటుంది. 10వ వచనం "దేవదూతల
సన్నిధిలో" ఒక్క పాపి హృదయపరివర్తనకు సంతోషం ఉంటుందని చెబుతుంది.
ఈ భేదాలు ఏమి చెబుతున్నాయి
- తప్పిపోవడంలో రెండు రకాలు. గొఱ్ఱె తన దారిన తిరిగి తప్పిపోతుంది, అంటే తమ ఎంపికల వల్ల దూరమయ్యేవారికి ఇది ఉదాహరణ. నాణెం తనంతట
తప్పిపోదు, అంటే పరిస్థితుల వల్ల, ఇతరుల నిర్లక్ష్యం వల్ల దూరమైనవారికి, బహుశా తాము దూరమయ్యామని కూడా తెలియనివారికి ఇది ఉదాహరణ.
- బయట తప్పినవారు, లోపల
తప్పినవారు. నాణెం ఇంటిలోనే పోయింది.
దేవుని ప్రజల మధ్య ఉండి కూడా తప్పిపోవచ్చు. పరిసయ్యులు దేవునికి దగ్గర
"ఇంట్లో" ఉన్నా, తమకు తెలియకుండానే
తప్పిపోయి ఉండవచ్చని సూచిస్తుంది.
- దేవుడు కాపరిగా, గృహిణిగా. పురుషుడిని, స్త్రీని ఇద్దరినీ ఈ ఉపమానముల వాడటం ద్వారా దేవుని ప్రేమ ఏ ఒక్క మానవ
పాత్రకూ పరిమితం కాదని తెలుపుతుంది.
రెండింటిలోనూ ఉన్న ఉమ్మడి నమూనా: కోల్పోవడం, వెదకడం, కనుగొనడం, ఆనందాన్ని పంచుకోవడం. "ఆనందం"
ఈ అధ్యాయానికి కీలక పదం.
ఇతర అంశాలు
దేవుని చొరవ, కృప. రెండు ఉపమానాల్లోనూ కోల్పోయిన గొర్రె కాని, నాణెము
కాని తన రక్షణకు ఏమీ చేయలేదు; వెదికింది కాపరి, గృహిణి. అంటే
మనం దేవుని వైపు తిరగకముందే ఆయన కృప మనలను తాకుతుంది. దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడానికి
కారణం ఇదే. దేవుడే మానవుని వెదకడానికి వచ్చాడు.
ప్రతి వ్యక్తికి అంతర్గత విలువ. గొఱ్ఱె ఏమీ సాధించలేదు, నాణెం ఏమీ
చేయలేదు, అయినా రెండూ విలువైనవే. విలువ యజమానికి
చెందియుండటంలో ఉంది, పనితీరులో కాదు. తమను
పనికిరానివారిగా, అవమానితులుగా, ఒంటరులుగా
భావించేవారికి ఇది గొప్ప ఓదార్పు. దేవుడు
వారిని వెదుకుతున్నాడు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన (ఆదికాండము 1:26-27) ప్రతి మనిషి
గౌరవం, అతని స్థితి, కులం, గతంతో
సంబంధం లేకుండా నిలిచే ఉంటుంది.
హృదయపరివర్తనము (మెటనోయా) అనే గ్రీకు
పదానికి మనస్సు, దిశ మారడం అని అర్థం, కేవలం
విచారం కాదు. ఇందులో పాపాన్ని గుర్తించడం, పశ్చాత్తాపం, క్షమాపణ
కోరడం, జీవితాన్ని మార్చుకోవడం, సాధ్యమైనంత
వరకు చేసిన హానిని సరిదిద్దడం ఉంటాయి. పరివర్తన మొదట దేవుని కృప అయినా దానికి
మనిషి స్వేచ్ఛతో స్పందించడం కూడా అవసరం. ఈ
ఉపమానాలు పాపాన్ని తేలిక చేయవు. గొఱ్ఱె తప్పిపోవడం నిజమైన విషాదం, అందుకే
వెదకడం అవసరమైంది. యేసు ప్రభువు పాపులను
ఆహ్వానించేది వారు అలాగే ఉండిపోవడానికి కాదు, మారడానికి.
పరలోకపు ఆనందం. దేవుడు న్యాయాధిపతి
మాత్రమే కాదు, బిడ్డ తిరిగి వచ్చినందుకు ఉత్సవం చేసే తండ్రి. పరలోకవాసులు
మన పరివర్తనలో ఆనందిస్తారు. అలాగే పాపసంకీర్తన దివ్య సంస్కారంతో, పశ్చాత్తాపపడేవాడు
శిక్షను కాక కాపరి భుజాలను కనుగొంటాడు.
పరిసయ్యులకు, మనకు సవాలు
ఈ కథల అసలు శ్రోతలు సణుగుతున్న పరిసయ్యులే
కాబట్టి, అవి వారికి ఒక ప్రశ్న వేస్తాయి. కాపరిలా
మీరు కూడా ఆనందించగలరా? మూడవ ఉపమానంలో అన్న ఇంటి బయట నిలబడి సణుగుతూ
విందులో పాల్గొనడానికి నిరాకరించే చోట ఈ ఆహ్వానం పరాకాష్ఠకు చేరుతుంది.
- నేను తప్పిపోయినవాడినా? ప్రార్థనలో, క్షమాపణలో, కుటుంబ సంబంధాల్లో, నా పిలుపులో ఎక్కడ దారి
తప్పాను?
- నేను వెదికే కాపరినా? తల్లిదండ్రిగా, గురువుగా, సన్యాసినిగా, సంఘ నాయకుడిగా, స్నేహితుడిగా దూరమైనవారిని వెదకుతున్నానా, లేక తీర్పు తీరుస్తున్నానా?
- నేను సణిగేవాడినా? ఎవరైనా తిరిగి వచ్చినప్పుడు నాకు ఆనందమా, అసూయా, అసంతృప్తా?
ఆచరణాత్మక అన్వయాలు
- వ్యక్తిగతంగా: భయంతో కాక నమ్మకంతో
దేవుని వద్దకు వెళ్లాలి. ఏ దూరమూ మరీ ఎక్కువ కాదు, అలసినవారిని కాపరి మోస్తాడు.
- కుటుంబాల్లో: దూరమైనవారిని గృహిణి
పట్టుదలతో, కాపరి సౌమ్యతతో వెదకాలి.
వారిని అవమానించకూడదు, తిరిగి వచ్చినప్పుడు
గతాన్ని తవ్వకూడదు, ఆనందంతో స్వాగతించాలి.
- సంఘంలో: సంఘం పరిపూర్ణుల
ప్రదర్శనశాల కాదు, గాయపడినవారికి సంఘం ఆసుపత్రి (పోప్ కావాలి. అట్టడుగున ఉన్నవారిని, సంఘానికి దూరమైనవారిని చేరుకోవాలి, తిరిగి వచ్చినవారిని నిజమైన ఆనందంతో స్వాగతించాలి.
- తీర్పు విషయంలో: నిజమైన పవిత్రత ఇతరులను అవమానించదు, దేవుని వైపు నడిపిస్తుంది.
తప్పుగా అర్థం చేసుకోకుండా జాగ్రత్తలు
- పాపం తేలికైనది కాదు. దేవుడు పాపులను ప్రేమిస్తాడంటే పాపం ముఖ్యం కాదని కాదు.
- పశ్చాత్తాపం ఇంకా అవసరమే. 7, 10 వచనాలు
దాన్ని స్పష్టంగా చెబుతాయి.
- తొంబది తొమ్మిది మంది విలువ తగ్గదు. ఒకరు తిరిగి వచ్చినప్పుడు కలిగే ఆనందం గురించి, ప్రభువు చెబుతున్నారు.
- ఇది కేవలం లెక్కల విషయం కాదు. దేవుని ప్రేమ లెక్కలకు అతీతం.
ముగింపు
దేవుడు తప్పిపోయినవారిని వెదకుతాడు, కనుగొన్నప్పుడు
ఆనందిస్తాడు, ఆ ఆనందంలో
పాలుపంచుకోమని మనలను పిలుస్తాడు. గొఱ్ఱె, నాణెం విలువ
అవి సాధించినదానిలో కాక యజమానికి చెందియుండటంలో ఉన్నట్లే, మన విలువ మన
యోగ్యతలో కాక దేవుని ప్రేమలో ఉంది. ఈ ఉపమానాలు మనలను ఒకేసారి రెండు స్థానాల్లో
నిలబెడతాయి. కనుగొనబడవలసిన వారిగా, అలాగే
ఇతరులు కనుగొనబడినప్పుడు ఆనందించవలసిన స్నేహితులుగా, ఇరుగుపొరుగువారిగా
ఉండమని కోరుతున్నవి.
ప్రార్ధన
ప్రభువా! మీ అనంతమైన కృపకు, అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు. దారి తప్పిన గొఱ్ఱెను కాపరిలా, పోయిన నాణెమును వెతికే గృహిణిలా మీరు ఎల్లప్పుడూ మమ్ము ప్రేమతో వేదకుతూనే ఉన్నారు. మా బలహీనతలను, పాపాలను బట్టి మమ్ము విడిచిపెట్టకుండా, మీ భుజములపై వేసుకొని నన్ను రక్షించండి. ఇతరుల తప్పులను చూసి సణిగే పరిసయ్య హృదయం కాకుండా, తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరిని చూసి పరలోకం ఆనందించినట్లే ఆనందించే విశాలమైన మనసును మాకు దయచేయండి. చీకటిలో నుండి వెలుగులోకి, మా స్వంత మార్గాల నుండి మీ మార్గంలోకి మమ్ము నడిపించండి. ఆమెన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి