లూకా 9:57–62 వివరణ: యేసును అనుసరించడానికి వెల ఏమిటి?
యేసును అనుసరించడం: వెనుకచూపు లేని శిష్యరికం
లూకా 9:57–62
అటుల వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో "మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించివత్తును" అని పలికెను. అందుకు యేసు "నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. కాని మనుష్యకుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు" అని సమాధానము ఇచ్చెను. అపుడు ఆయన మరియొకనితో "నన్ను అనుసరింపుము" అని అనెను. అందుకు అతడు "ప్రభూ! నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధిచేసి వచ్చుటకు సెలవిమ్ము" అని మనవిచేసెను. అందుకు యేసు "మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము. కాని నీవు వెళ్ళి దేవునిరాజ్యమును ప్రకటింపుము" అనెను. మరియొకడు యేసుతో "ప్రభూ! నేను మిమ్ము అనుసరింతును కాని, మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చెదను, సెలవిండు" అని పలికెను. యేసు వానితో "నాగటిమీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు" అనెను.
పరిచయం
క్రీస్తు ప్రభువు చేసిన అధ్భుతాలను చూసి, ఆయన అధికార పూర్వక మాటలను విని ఆయనను అనుసరిస్తే ఎన్నో సౌకర్యాలు ఉంటాయి అనిపించవచ్చు. అలా అనుసరించడం ఎంతో సులువైన విషయంగా అనిపించినప్పటికీ, దానికి చెల్లించాల్సిన వెల చాలా గొప్పది. లూకా సువార్త 9:57–62 వచనాలలో యేసు ప్రభువు తనను అనుసరించాలనుకునే వారికి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి ఆకర్షించడం లేదు. బదులుగా, శిష్యరికం యొక్క తీవ్రతను, త్యాగాన్ని, సంపూర్ణ నిబద్ధతను అత్యంత పారదర్శకంగా వివరిస్తున్నారు. ఇక్కడ కనిపించే ముగ్గురితో ఆయన జరిపిన సంభాషణలు సువార్తలోనే అత్యంత కఠినమైనవిగా అనిపిస్తాయి. కానీ వాటి వెనుక గొప్ప సత్యం ఉంది. ప్రేమతో కూడిన హెచ్చరిక దాగి ఉంది.
ప్రయాణ నేపథ్యం మరియు సిలువ వైపు అడుగులు
లూకా 9:51 ప్రకారం, యేసు ప్రభువు తన యెరూషలేము ప్రయాణానికి స్థిరచిత్తుడయ్యాడు. యేరుషలేముకు ప్రయాణం అంటే మరణానికి సిద్దం అవ్వడం. తన భౌతిక జీవిత లక్ష్యమైన సిలువ మరణం వైపు ఆయన వెనుకడుగు వేయకుండా సాగిపోతున్న సందర్భమిది. (ఇది భౌతిక లక్ష్యం అయినప్పటికీ దాని పరామార్ధం తండ్రి చిత్తమును నెరవేర్చుట, మానవుణ్ణి రక్షించుట.) దీనికి ముందే సమరియ గ్రామం ఆయనను తిరస్కరించినప్పుడు, యాకోబు, యోహానులు పై నుండి అగ్నిని రప్పించి దానిని దహించి వేయాలా అనగా, ఆయన వారిని గద్దించి, ప్రతీకారం లేని ప్రేమను చాటాడు. దాని ద్వారా, శ్రమలు, సిలువ , మరణం మాత్రమే కాక తిరస్కారం కూడా శిష్యరికంలో భాగమేనని స్పష్టం చేశాడు.
ఈ ప్రయాణ మార్గంలో ముగ్గురు వ్యక్తులను మనము చూస్తాము. లూకా వీరి పేర్లను చెప్పడం లేదు. ఎందుకంటే కథలో ముఖ్యమైనది వారి పేర్లు కాదు, వారి అంతరంగ స్పందనలే. అంతేకాకుండా, వారు చివరకు ఆయనను అనుసరించారో లేదో కూడా రాయలేదు. ఎందుకు అంటే ఆ స్థానంలో ప్రతి వ్యక్తి తనను తాను ఉంచుకుని, "క్రీస్తు పిలుపుకు నా స్పందన ఏమిటి?" అని ప్రశ్నించుకోవడానికే ఈ వృత్తాంతం అసంపూర్ణంగా ఉంచ బడింది.
మొదటి వ్యక్తి: ఉత్సాహం ఉండి, వెల అంచనా వేయని స్థితి
మొదటి
వ్యక్తి తానే స్వయంగా ముందుకు వచ్చి యేసు ప్రభువుతో, "మీరు
ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించివత్తును" అని అడిగాడు. ఇది గొప్ప
నిబద్ధతలా కనిపించినా, ఇందులో భావావేశం
ఎక్కువ. సాధారణంగా గురువును అనుసరిస్తే లభించే గౌరవం, స్థిరత్వం, సౌకర్యాలను అతడు
ఆశించి ఉండవచ్చు. రబ్బీల వద్దకు శిష్యులు వచ్చి కొంత కాలం గడిపి, తరువాత వెళ్ళి వారి
జీవితాలు వారు గడిపేవారు. మొదట
వచ్చిన వ్యక్తి అలా కొంత కాలం ప్రభువుతో ఉండుటకు అడిగిఉండవచ్చు. కాని ప్రభువు పిలుపు
అటువంటిది కాదు, ఇది సంపూర్ణమైనటువంటిది.
యేసు
ప్రభువు అతని ఉత్సాహాన్ని మెచ్చుకోకుండా, "నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కానీ మనుష్యకుమారునకు
తలదాచుకొనుటకు తావులేదు" అని బదులిచ్చాడు. సృష్టికర్తయైన క్రీస్తుకు ఈ లోకంలో
స్థిరమైన ఆశ్రయం లేదు. ఇది తిరస్కారం కాదు, శిష్యరికంలో ఉండే
శ్రమను, అస్థిరతను
ముందుగానే స్పష్టం చేయడం. ఈ మాటల ఉద్దేశం అందరూ ఇల్లు వాకిలి వదిలేయాలని కాదు.
పేతురుకు ఇల్లు ఉంది, కానీ అది అతని యజమాని
కాలేదు. ప్రభువు రమ్మన్నపుడు వెంటనే అన్నిటినీ
వదలివేయగల స్వతంత్రం ఉండాలి. లభించే భౌతిక ఆశీర్వాదాల కోసం కాక, క్రీస్తునే ప్రాథమికంగా ప్రేమించే అంతరంగ స్వేచ్ఛ
శిష్యుడికి ఉండాలి.
రెండవ వ్యక్తి: "ముందుగా" అనే వాయిదా ధోరణి
రెండవ
వ్యక్తిని యేసు ప్రభువే స్వయంగా "నన్ను అనుసరింపుము" అని పిలిచాడు. శిష్యరికం
అనేది మానవ ఎంపిక కాదు, దేవుని పిలుపేనని
స్పష్టం చేస్తోంది. కాని ఆ వ్యక్తి
"నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధిచేసి వచ్చుటకు సెలవిమ్ము" అని
కోరాడు.
తండ్రిని
సమాధి చేయడం పవిత్రమైన బాధ్యతే. అతడు చెప్పిన "ముందుగా" అనే మాటకు, నా తండ్రి జీవించి ఉన్నంతకాలం ఆయన సేవలో ఉండి, ఆయన మరణించాక వస్తాను అనే అర్థం కూడా ఉండవచ్చు.
ఏది ఏమైనా, అతడు క్రీస్తు అనుసరించడం
కంటే తన సమయాన్ని, బాధ్యతను ముందు నెరవేర్చాలని అనుకుంటున్నాడు. యేసు
ప్రభువు చెప్పేది, అన్నిటికంటే ముందు
దేవుని పని చేయడం.
ఆ వ్యక్తితో యేసు ప్రభువు "మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము" అని సంచలనాత్మక సమాధానమిచ్చాడు. ఇక్కడ "మృతులు" దేవునితో సంబంధం లేని ఆధ్యాత్మిక మృతులు. దేవుని రాజ్య పిలుపు ఎంత అత్యవసరమైనదో చెప్పడానికే యేసు ప్రభువు ఈ అతిశయోక్తి శైలిని వాడారు. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం ఆయన ఉద్దేశం కాదు; దేవుని పిలుపును వాయిదా వేసే సాకుగా కుటుంబ బాధ్యతలను వాడకూడదని చెప్పడమే ఆయన ఉద్దేశం.
మూడవ వ్యక్తి: విభజించబడిన హృదయం మరియు వెనుకచూపు
మూడవ
వ్యక్తి "నేను మిమ్ము అనుసరింతును కానీ, మొదట నా
కుటుంబములోని వారికి చెప్పి వచ్చెదను" అన్నాడు. ఇది సాధారణ వీడ్కోలు
అభ్యర్థనలా అనిపించినా, యేసు ప్రభువు దానిని అంగీకరించలేదు. పాత నిబంధనలో ఏలియా
ఎలీషాకు వీడ్కోలు చెప్పడానికి అనుమతి ఇచ్చాడు. కానీ ఏలియా కంటే గొప్పవాడైన
క్రీస్తు విషయంలో రాజ్యం సమీపించింది గనుక తక్షణ స్పందన అవసరం.
యేసు ప్రభువు అతనికి "నాగటిమీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు" అనే ఉపమానంతో బదులిచ్చాడు. పొలం దున్నే రైతు ముందుకు మాత్రమే చూడాలి; వెనక్కి చూస్తే సాలు వంకరపోతుంది. అలాగే, క్రీస్తు వైపు అడుగులు వేస్తూ పాత జీవితంపై, గత అనుబంధాలపై మమకారం పెంచుకునే హృదయం దేవుని రాజ్యానికి అనుకూలమైనది కాదు. గత గాయాలు, పశ్చాత్తాపాలు లేదా పాత ఆకర్షణలలో చిక్కుకుపోకుండా దేవుని క్షమను స్వీకరించి ముందుకు సాగడమే నిజమైన శిష్యరికం.
మూడు దృశ్యాల సందేశం
ఈ ముగ్గురి అనుభవాలు మూడు వేర్వేరు సమస్యలను ఎత్తిచూపుతున్నాయి. మొదటి వ్యక్తికి వెల అంచనా వేయకపోవడం సమస్య అయితే, రెండవ వ్యక్తికి వాయిదా వేసే ధోరణి సమస్య, మూడవ వ్యక్తికి విభజించబడిన హృదయం సమస్య. ముగ్గురూ ప్రభువును అనుసరించాలనుకున్నారు, కానీ తమ షరతులపై, తమ అనుకూల సమయానుసారమే నడవాలని భావించారు.
యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని అన్నింటికంటే మొదటి స్థానంలో ఉంచమని కోరుతున్నాడు. ఆయన శిష్యుల నుండి కోరే ప్రతిదానినీ స్వయంగా జీవించి చూపించాడు. ఆయనకు తలదాచుకోవడానికి తావు లేదు, తండ్రి చిత్తానికే ప్రథమ స్థానమిచ్చాడు, తిరస్కారాలకు క్రుంగి పోకుండా వెనుకకు తిరగకుండా సిలువ వైపు సాగిపోయాడు.
నేటి జీవితానికి అన్వయం
నేటి సౌకర్యవంతమైన ప్రపంచంలో, బిజీ జీవితంలో, మానసిక ఒత్తిళ్ల మధ్య ఈ వాక్యభాగం ఎంతో ఉపయుక్తం. విజయానికి, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతిలో క్రీస్తు పిలుపు మనల్ని సరిచేస్తుంది. "పరిస్థితులు కుదిరాక ప్రార్థిస్తాను, ఆధ్యాత్మికంగా జీవిస్తాను" అనే వాయిదా ధోరణికి ముగింపు పలకాలి. కుటుంబం దేవుడు ఇచ్చిన వరమే, కానీ దేవుని పిలుపును తిరస్కరించడానికి కుటుంబ బాధ్యతలను సాకుగా మార్చకూడదు. రోజూ కొద్దిసేపు సువార్త పఠనం, నిశ్శబ్ద ప్రార్థన, ఆత్మపరిశీలన ద్వారా మన నిర్ణయాలను క్రీస్తు వైపు మలచుకోవాలి. యేసు ప్రభువు జీవితం నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం మనం చూస్తాం, అది ఏమిటంటె, ఆయన జీవితంలో ఒక్కటి మాత్రమే ముఖ్యమైనది, అది తండ్రి చిత్తమును నెరవేర్చడం, అందుకే ఆయన చేసినదంత తండ్రి చిత్తం నెరవేర్చడమే.
కృప మరియు అనుసరణ
యేసు ప్రభువు చెప్పిన కఠినమైన మాటలు మనల్ని భయపెట్టడానికి కాదు, అర్ధహృదయ నిబద్ధతతో మోసపోకుండా కాపాడటానికే. మన స్వశక్తితో శిష్యరికాన్ని నెరవేర్చలేము. శిష్యరికానికి పిలిచే క్రీస్తే దానికి కావలసిన కృపను, శక్తిని ప్రసాదిస్తాడు. పడిపోయినా, పశ్చాత్తాపపడి తిరిగి లేవడమే శిష్యత్వ ప్రయాణం.
ప్రార్థన
ప్రభువా, నన్ను నీ శిష్యునిగా పిలుస్తున్నందుకు వందనాలు.
సౌకర్యాలను ప్రేమిస్తూ, శ్రమలకు భయపడుతూ, నీ చిత్తాన్ని ఆచరించడంలో ఆలస్యం చేస్తున్న నన్ను
క్షమించు. మొదటి వ్యక్తివలె మాటలకే పరిమితం కాకుండా, రెండవ వ్యక్తివలె పిలుపును వాయిదా వేయకుండా, మూడవ వ్యక్తివలె వెనుకకు చూడకుండా నన్ను బలపరచు.
నా జీవితాన్ని, నీ సేవకు నీకు అంకితమైన సమర్పణగా మార్చుకుని, చివరి వరకు నమ్మకంగా నిలిచే కృపను ప్రసాదించు.
ఆమెన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి