యేసు తల్లి సోదరులు ఎవరు? లూకా 8:19-21 ధ్యానం

 


యేసు ప్రభువు తల్లి సోదరులు ఎవరు?

లూకా 8:19–21

యేసు తల్లియు, సోదరులును ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుటవలన ఆయనను కలసికొనలేకపోయిరి. "నీ తల్లియు, సోదరులును నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు" అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, "దేవుని వాక్కును ఆలకించి, పాటించువారే నా తల్లియు నా సోదరులు" అని పలికెను.

ఒక చిన్న సంఘటన, ఒక పెద్ద సత్యం

మీ ఇంటి తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు. లోపల మీరు ముఖ్యమైన విషయం చెబుతున్నారు, అందరూ శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు ఎవరో వచ్చి "మీ అమ్మగారు బయట ఉన్నారు" అని చెప్పారు. మీరేం చేస్తారు?

ఈ సువిశేష భాగంలో సరిగ్గా అదే జరుగుతుంది. ఇవి మూడు వచనాలే అయినా, క్రైస్తవ జీవితానికి కావలసిన అసలు సారాంశం ఈ వచనాలలో ఉంది.  ప్రభువుకు దగ్గరవ్వడం అంటే ఏమిటి, ఆయన కుటుంబంలో సభ్యులం కావడం ఎలా అనేదే ఈ వచనాల సారాంశం. 

ఈ సంఘటన ఎక్కడ వస్తుంది?

లూకా దీన్ని యాదృచ్ఛికంగా ఇక్కడ రాయలేదు. దీనికి ముందు విత్తువాని ఉపమానం ఉంది, విత్తనం దేవుని వాక్యం, నేల మన హృదయం. మంచి నేల అంటే "వాక్యమును విని, దానిని పాటించి, ఓర్పుతో ఫలించువారు" (8:15). ఆ తరువాత దీపం ఉపమానం వస్తుంది. "మీరు ఎలా దేవుని వాక్కు వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి" అనే హెచ్చరిక ఇక్కడ  (8:18) వస్తుంది. ఈ  ఉపమానం చెప్పిన వెంటనే లూకా దానికి నిజ జీవిత ఉదాహరణను చూపిస్తున్నాడు.

కుటుంబమే గుర్తింపుగా ఉన్న కాలం 

యేసు ప్రభువు  కాలపు యూదా సమాజంలో ఒక వ్యక్తి ఎవరు అనేది అతని కుటుంబం నిర్ణయించేది. వంశం, ఆస్తి, గౌరవం, దేవుని ఒడంబడికలో స్థానం  ఇవన్నీ  కుటుంబం ద్వారానే వచ్చేవి. "మేము అబ్రాహాము సంతానం" అనేది వారికి గొప్ప భద్రత. అలాంటి సమాజంలో "నా తల్లి, నా సోదరులు ఎవరు?" అనే ప్రశ్నకు యేసు ప్రభువు  కొత్త నిర్వచనం ఇవ్వడం ఒక సామాజిక విప్లవమే. ఇక్కడ "సోదరులు" అనే పదానికి సొంత తోబుట్టువులే కాదు, దగ్గరి బంధువులు అని కూడా అర్థం.  

మూడు దృశ్యాలు

1. క్రిక్కిరిసిన జనం. యేసు ప్రభువు  కుటుంబ సభ్యులు ఆయనను చూడాలని వచ్చారు గానీ, జనం ఎక్కువగా ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేకపోయారు. వారు ఎందుకు వచ్చారో లూకా చెప్పడు; మార్కు సువార్త మాత్రం ఆయన బంధువులు ఆందోళన చెంది ఆయనను తీసుకువెళ్ళడానికి వచ్చారని సూచిస్తుంది (మార్కు 3:21). లూకా దృష్టి మాత్రం యేసు ప్రభువుని   బోధన మీదే ఉంది.

ఇక్కడ యేసు ప్రభువు  దగ్గరకు పోవుటకు  అడ్డువున్నది శత్రువులు కాదు, జనసమూహమే. మన జీవితంలోనూ అంతే, మనలను ప్రభువుకు దూరం చేసేవి పాపాలు మాత్రమే కాదు; పనులు, బాధ్యతలు, ఒత్తిళ్లు, ఆందోళనలు, చివరికి మంచి సేవలు కూడా మనల్ని ఆయన సన్నిధికి రాకుండా అడ్డుకోగలవు.

2. "వెలుపల" వేచి ఉన్నవారు: "నీ తల్లి, నీ సోదరులు వెలుపల నిలబడి ఉన్నారు" అని వారు  యేసు ప్రభువుకు చెప్పారు. ఆ కాలపు సంస్కృతిలో తల్లి వస్తే అన్నీ ఆపి ఆమె దగ్గరకు వెళ్ళడం మర్యాద. కాబట్టి ఇది యేసు ప్రభువుకు ఒక చిన్న పరీక్ష లాంటిది.

ఈ కథలో "వెలుపల", "లోపల" అనే మాటలు కేవలం స్థల వివరణ కాదు.  అవి ఆధ్యాత్మిక సత్యానికి సంకేతాలు. దేవుని రాజ్యంలో దగ్గరితనాన్ని కొలిచేది భౌతిక దూరం కాదు, సిద్ధమైన హృదయం. శరీరరీత్యా ఆయన పక్కనే ఉన్నా, వాక్యానికి హృదయం తెరవనివాడు "వెలుపలే" ఉన్నాడు; ఎంత దూరంలో ఉన్నా వాక్యాన్ని స్వీకరించేవాడు "లోపలే" ఉన్నాడు.

3. యేసు ప్రభువుని జవాబు. ఆయన ఎవరినీ తిరస్కరించలేదు.  ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు.  "దేవుని వాక్కును ఆలకించి, పాటించువారే నా తల్లియు నా సోదరులు." ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి.

ఆలకించడం - పవిత్ర గ్రంథ భాషలో వినడం అంటే చెవిలో శబ్దం పడటం కాదు, విధేయతతో స్పందించడం. "ఇస్రాయేలూ, వినుము" అనే పాత నిబంధన పిలుపు (ద్వితీ 6:4) ఇదే చెబుతుంది. వాక్యం చెవి నుండి హృదయంలోకి, హృదయం నుండి నిర్ణయాల్లోకి, నిర్ణయాల నుండి జీవితంలోకి ప్రవహించాలి.

పాటించడం -  వాక్యాన్ని ఆచరణలో పెట్టడమే. యాకోబు 1:22  వాక్యాన్ని వినేవారు మాత్రమే కాక, దాన్ని అనుసరించి నడుచుకొనేవారుగా ఉండండి; లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం అని చెబుతుంది.  దేవుని కుటుంబంలో సభ్యత్వం పుట్టుకతో రాదు, ఆయన వాక్కుకి మనం ఇచ్చే స్పందనతో వస్తుంది. వాక్యానికి "అవును" అన్న ప్రతి హృదయం క్రీస్తుకు బంధువవుతుంది.

మరియమాత: పక్కన పెట్టబడలేదు, ఆదర్శంగా నిలిచింది

యేసు ప్రభువు  తన తల్లిని పక్కన పెట్టాడేమో అని మొదట అనిపించవచ్చు. కానీ లూకా సువార్తను మొత్తంగా చదివితే, ఇది మరియమాతకు ఇచ్చిన అత్యున్నత గౌరవమని తెలుస్తుంది  ఎందుకంటే "వాక్యాన్ని విని పాటించడం" అనే యేసు  ప్రభువు మాటకు మొట్టమొదటి, అత్యంత పరిపూర్ణ ఉదాహరణ ఆమే:

  • దేవదూత సందేశం విన్నప్పుడు: "ఇదిగో, నేను ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అని వాక్యానికి బద్దురాలయింది.  (లూకా 1:38)
  • గొల్లల సందర్శన తరువాత: "ఈ సంగతులన్నిటిని తన హృదయమందు ఉంచుకొని మననము చేయుచుండెను" అంటే వాక్కును హృదయములో అంటిపెట్టుకుంది.  (2:19).
  • బాలయేసు దేవాలయంలో కనబడిన తరువాత కూడా అదే (2:51) అంత తన మనసులో పెట్టుకొని మననం చేసుకుంటుంది. 

ఇదే మంచి నేల -  విని, నిలుపుకొని, ఫలించడం.

లూకా 11:27-28లో ఒక స్త్రీ "నిన్ను మోసిన గర్భం ధన్యమైనది" అన్నప్పుడు యేసు ప్రభువు, " దేవుని వాక్యం విని దాన్ని పాటించేవారు మరింత  ధన్యులు" అన్నాడు. ఇది మరియమాతను తగ్గించే మాట కాదు, ఆమె గొప్పతనం అసలు ఎక్కడుందో చెప్పే మాట. ఆమె యేసు ప్రభువును తన గర్భంలో మోయక ముందే తన హృదయంలో దేవుని వాక్కును మోసింది.  రెండవ వాటికన్ మహాసభ కూడా ఈ వచనాలను ప్రస్తావిస్తూ, మరియమాత  ఆయన మాటలను నమ్మకంగా ఆచరించిందని బోధిస్తుంది (Lumen Gentium 58). అందుకే ఆమె రెండు విధాలుగా తల్లి,  శరీరరీత్యా, విశ్వాసరీత్యా. 

యేసు ప్రభువు  బంధువులు ఆ సమయంలో ఆయనను విశ్వసించలేదు (యోహాను 7:5). కానీ పునరుత్థానం తరువాత వారు మరియమాతతో, శిష్యులతో కలిసి ఏకమనస్సుతో ప్రార్థనలో నిలిచారు (అపొస్తలుల కార్యములు 1:14). అంటే ఈ రోజు "వెలుపల" ఉన్నవారు రేపు "లోపలికి" రాగలరు.

ఈ సత్యం చెప్పే మూడు విషయాలు

1. దేవుడు తండ్రి, మనం ఒక కుటుంబం. దేవుని రాజ్యం కొత్త రకమైన కుటుంబాన్ని సృష్టిస్తుంది  రక్తం మీద కాక, క్రీస్తు మీద, ఆయన వాక్యం మీద ఇది  నిర్మితమైనది. దేవుడు మన తండ్రి, యేసు ప్రభువు మనకు సోదరుడు (హెబ్రీ 2:11–13), సంఘం మన కుటుంబం (రోమా 8:15–17).

2. ఈ ఆహ్వానం అందరికీ. "వినేవారు, పాటించేవారు" అనే నిర్వచనంలో కులం, జాతి, భాష, ప్రాంతం, చదువు, హోదా అనే అడ్డుగోడలు లేవు. రాజైనా పేదవాడైనా, పట్టణంలోనైనా పల్లెలోనైనా, వాక్యాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ క్రీస్తు కుటుంబ సభ్యులే.

3. విశ్వాసం వారసత్వంగా రాదు. తల్లిదండ్రుల విశ్వాసం మనకు పునాది వేస్తుంది గానీ, ప్రతి ఒక్కరూ తమంతట తామే వాక్యాన్ని విని "అవును" అనాలి. రక్తసంబంధం మనల్ని రక్షించదు,  వ్యక్తిగత స్పందనే క్రీస్తుతో బంధాన్ని నిలబెడుతుంది.

మన జీవితానికి ఎలా వర్తిస్తుంది?

కుటుంబంలో. ఈ భాగం కుటుంబాన్ని తక్కువ చేయదు. సిలువ మీద నుండి కూడా యేసు తన తల్లిని ప్రియ శిష్యునికి అప్పగించాడు (యోహాను 19:26–27). ఆయన చేసింది ప్రాధాన్యతలను సరిచేయడమే. ఒకే ఇంట్లో ఉండటం కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబంగా మార్చదు, కలిసి వాక్యం వినడం, కలిసి ప్రార్థించడం, ఒకరినొకరు క్షమించడం ఇంటిని ఒక చిన్న "శ్రీ సభ "గా మారుస్తాయి.

సంఘంలో. ఇతర విశ్వాసులను సోదరులుగా చూడటం అంటే వారి పట్ల నిజమైన బాధ్యత వహించడం (అపొస్తలుల కార్యములు 4:32–35). ఎంతోమంది తమ కుటుంబంలో దొరకని ఆదరణను సంఘంలో వెతుకుతారు. మన సంఘంలో ఎవరూ "వెలుపల" నిలబడి ఉండకూడదు.

ఆత్మపరిశీలన కోసం

  • నేను వాక్యాన్ని నిజంగా వింటున్నానా, లేక వినడం అలవాటుగా మారిందా?
  • వాక్యం విన్నప్పుడు నా హృదయం ఏ నేల?  దారిపక్కనా, రాతినేలా, ముళ్ళపొదలా, మంచి నేలా?
  • ఇటీవల వాక్యానికి విధేయత చూపి నేను తీసుకున్న ఒక నిర్దిష్ట నిర్ణయం ఏమిటి?
  • నా కుటుంబంలో, నా సంఘంలో "వెలుపల" ఉన్నట్లు భావిస్తున్నవారు ఎవరు? వారిని లోపలికి ఆహ్వానించడానికి నేనేం చేయగలను?
  • మరియమాత వలె "నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అని చెప్పడానికి నాకు ఏది అడ్డు?

ముగింపు

లూకా 8:19–21 చిన్న సంఘటనే, కానీ శిష్యత్వం యొక్క సారమంతా అందులో ఉంది. యేసుతో మన బంధం సంప్రదాయాల మీద, బాహ్య సామీప్యం మీద, మత గుర్తింపు మీద ఆధారపడదు, వాక్యాన్ని వినడం, స్వీకరించడం, ఆచరించడం అనే జీవన విధానం మీద ఆధారపడుతుంది.

విత్తనం మన హృదయంలో పడింది, ఇప్పుడు అది ఫలించాలి. వాక్యం మన చెవిలోకి వచ్చింది, ఇప్పుడు అది మన జీవితంగా మారాలి. క్రైస్తవ జీవితంలోని అసలు ప్రశ్న "నేను ఎంత విన్నాను?" కాదు, "నేను విన్నది నా జీవితంలో ఎంత ఫలించింది?" అనేదే.

ప్రార్థన

ప్రభువా! మీ  వాక్యాన్ని ఆలకించే చెవులను, దాన్ని స్వీకరించే హృదయాన్ని మాకు ప్రసాదించు.
మరియమాత వలె మీ  చిత్తానికి "అవును" అని చెప్పే ధైర్యాన్ని ఇవ్వు. మీ  సమీపంలో ఉండటమే కాక, మీ  వాక్యాన్ని పాటించడం ద్వారా మీ  కుటుంబంలో నిజమైన సభ్యులుగా జీవించేలా మమ్మల్ని నడిపించు. మీ  సంఘంలో ఎవరూ వెలుపల నిలబడకుండా, అందరినీ ప్రేమతో ఆహ్వానించే హృదయాన్ని మాకు దయచేయి. ఆమెన్ 


Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు