లూకా 9:1-6 ధ్యానం - పన్నెండుగురు శిష్యుల పంపకం
పన్నెండుగురు శిష్యుల పంపకం
లూకా 9:1-6 ఒక ధ్యానం
యేసు తన పన్నెండుమంది శిష్యులను చెంతకు పిలిచి, దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. "మీరు ప్రయాణము చేయునపుడు ఊతకట్టనుగాని, జోలెనుగాని, రొట్టెను గాని, ధనమునుగాని, రెండు అంగీలనుగాని తీసికొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినపుడు తిరిగి పోవువరకు అచటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించిపొండు" అని యేసు వారికి ఉపదేశించెను. అంతట వారు వెళ్ళి గ్రామగ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు పర్యటింపసాగిరి.
పంపబడినవారు
ఊతకర్రా లేకుండా, జోలె లేకుండా, ధనం లేకుండా — శిష్యులు తొలిసారి యేసు అధికారంతో లోకంలోకి అడుగుపెట్టిన క్షణం
యేసు ప్రభువు తన పన్నెండుమంది శిష్యులను చెంతకు
పిలిచాడు. ఇంతవరకూ వారు, ప్రభువు చేసే పనులు, చెప్పే వాక్కును కేవలం
చూస్తూ, వింటూ ఉన్నవారు. తుఫానును ఆయన శాంతపరచడం చూశారు, దయ్యము పట్టిన
వ్యక్తిని విడిపించడం చూశారు, యాయీరు కుమార్తెను లేపడం, రక్తస్రావంతో
బాధపడిన స్త్రీని స్వస్థపరచడం చూశారు. ప్రతిసారీ యేసు ప్రభువే మాట్లాడాడు, ప్రభువే చెయ్యి చాచాడు, ప్రభువే అధికారంతో ఆజ్ఞాపించాడు. శిష్యులు ప్రేక్షకులుగా మాత్రమే ఉన్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. యేసు ప్రభువు తన అధికారాన్ని శిష్యులుకు అప్పగిస్తున్నాడు. దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను
పోగొట్టుటకు శక్తిని, అధికారమును ఇచ్చి, దేవుని
రాజ్యము ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని
పంపుతున్నాడు. ఇప్పటివరకు యేసు ప్రభువు చేసే వానిని చూస్తున్నవారు ఇప్పుడు చేసేవారుగా మారుతున్నారు.
చారిత్రక నేపధ్యం
యేసు ప్రభువు పన్నెండుమందిని ఎన్నుకోవడం యాదృచ్ఛికం కాదు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, వారికి పన్నెండు గోత్రాలు ఉన్నవి. ఈ సంఖ్య ద్వారా యేసు ప్రభువు
దేవుని కొత్త ప్రజలను
స్థాపిస్తున్నానని సూచన ఇస్తున్నాడు. గ్రీకు భాషలో పంపబడినవాడిని 'అపోస్టోలోస్' అంటారు. ఇతను
అధికారిక సందేశంతో పంపబడిన ప్రతినిధి, కనుక
ఖచ్ఛితమైనటువంటి పని ఇతనికి ఉంటుంది. ఈ సంఘటనతో
శిష్యులు "నేర్చుకునే" అనే
స్థాయి నుండి "పంపబడిన రాయబారులు" అనే స్థాయికి ఎదుగుతున్నారు.
ఆ కాలంలో ప్రయాణాలు కాలినడకన సాగేవి, దారిదోపిడీలు, ఆహార కొరత
సాధారణంగా ఉంటుంది. అటువంటి వాతావరణంలోకి యేసు ప్రభువు తన శిష్యులను ఏ భౌతిక భద్రత
లేకుండా పంపడం వారి విశ్వాసానికి తొలి పరీక్ష. ఇంకో ఆసక్తికరమైన అంశం పాదధూళి
ఆచారం. యూదులు అన్యజనుల ప్రాంతాల నుండి తిరిగి వచ్చేటప్పుడు, ఆ అపవిత్రత
తమకు అంటకూడదని పాదాల ధూళిని దులిపేసేవారు. యేసు ప్రభువు ఈ ఆచారాన్నే యూదా గ్రామాలకు అన్వయించి, సువార్తను
నిరాకరించే గ్రామం కూడా అన్యజనుల గ్రామంతో సమానమని సూచిస్తున్నాడు. ఆ కాలపు వారికి ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. అది దేవుని ప్రజలగా
ఉండాలా లేదా అని నిర్ణయించుకోమని చెప్పే ఒక సందేశం.
వాక్యం లోతుల్లోకి
మొదటి వచనం రెండు ప్రత్యేక గ్రీకు పదాలను
ఉపయోగిస్తుంది. దూనమిస్ (అంటే శక్తి ) ( పని చేయగల
సామర్థ్యం) మరియు ఎక్సూసియా , (అంటే అధికారం) ( ఇచ్చిన శక్తిని ఉపయోగించే చట్టబద్ధమైన హక్కు). ఈ రెండూ
కలిస్తేనే పరిచర్య ప్రభావవంతంగా ఉంటుంది. శక్తి మాత్రమే ఉండి అధికారం లేకపోతే అది
అరాచకం చేసేలా చేస్తుంది; అధికారం ఉండి శక్తి లేకపోతే
అది నిస్సహాయత అవుతుంది. ఈ అధికారం శిష్యుల స్వంతం కాదు. ప్రభువు నుండి అప్పగించబడింది. ఇది వినయాన్ని
నేర్పుతుంది. సేవకుడు యజమాని కాదు, పంపబడినవాడు
మాత్రమే.
రెండవ వచనం పరిచర్యలోని రెండు కోణాలను చూపుతుంది. అవి దేవుని రాజ్యం ప్రకటించడం, రోగులను
స్వస్థపరచడం. ఒకటి మాటల ద్వారా, మరొకటి చర్యల ద్వారా జరుగుతుంది.
సువార్తకు మాట ఉంది, చేతలు కూడా ఉన్నాయి. దేవుని
రాజ్యం కేవలం భావన కాదు. మానవుని జీవితములోని ప్రతి విషయాన్ని స్పర్శించగలదు,
అది మానవ బాధను తాకే వాస్తవిక
శక్తి.
"మీరు ప్రయాణము చేయునపుడు ఊతకర్రనుగాని, జోలెనుగాని, రొట్టెను
గాని, ధనమునుగాని, రెండు
అంగీలనుగాని తీసికొని పోరాదు." - లూకా 9:3
ఈ నిరాడంబర ప్రయాణపు ఆజ్ఞ వెనుక మూడు విషయాలు ఉన్నవి.
1. దేవుని సంరక్షణపై సంపూర్ణముగా ఆధారపడటం, 2. పరిచర్యను
ధనార్జన మార్గంగా మార్చుకోకూడదనే హెచ్చరిక, మరియు 3. సందేశానికి
విశ్వసనీయత స్వార్థం లేని ఉద్దేశం ప్రజలకు కనిపించాలి. దీని తరువాత నాలుగవ వచనంలో శిష్యులను యేసు ప్రభువు , మొదట వెళ్ళిన
చోటునే ఉండమని చెప్పాడు. "అచటనే ఉండుడు" అనే ఆజ్ఞ మెరుగైన
సదుపాయాల కోసం ఇల్లు మారవద్దని చెబుతుంది. ఈ వాక్యము సంతృప్తిని, స్థిరమైన
సంబంధాలను, కృతజ్ఞతను నేర్పుతుంది. సేవకుడు తన సౌకర్యాన్ని
సందేశం కంటే ఎక్కువ చేసుకోకూడదు. సువిశేషమును బోధించువారు సౌకార్యాల కోసం ప్రాకులాడకూడదు.
ఉన్న దానితో తృప్తి పొందాలి.
ఐదవ వచనంలో మీ పాదధూళి విదిలించమని చెప్పడం శాపం కాదు, ఇది ఒక సాక్ష్యం. సువిశేష సందేశాన్ని ప్రకటించడం శిష్యుని బాధ్యత; దాన్ని
స్వీకరించడమో తిరస్కరించడమో వినేవారి బాధ్యత. చివరి వచనంలో శిష్యులు వెళ్ళి
సువార్తను ప్రకటించి, రోగులను స్వస్థపరిచారు. యేసు ప్రభువు ఇచ్చిన అధికారం వారి ద్వారా
క్రియారూపం దాల్చింది.
మూడు సత్యాలు
అధికార బదిలీ. దేవుని
అధికారం ప్రతినిధుల ద్వారా పనిచేస్తుంది. యేసు ప్రభువు సర్వాధికారి అయినా, తన
అధికారాన్ని తన అనుచరులకు అప్పగిస్తాడు. ఆ
అధికారం ఎప్పుడూ క్రీస్తు నుండి ఉద్భవించి, ఆయనకు లోబడి ఉండాలి.
రాజ్యం ఇప్పుడే వస్తోంది. స్వస్థత దేవుని రాజ్యం రాకడకు సంకేతం. ప్రతి
స్వస్థత, ప్రతి సాతానును వెళ్ళగొట్టడం
చీకటి రాజ్యంపై దేవుని రాజ్యం విజయానికి ఒక సూక్ష్మచిత్రం.
సంఘం స్వభావం. జ్ఞాన స్నానం
పొందిన ప్రతి విశ్వాసి ఏదో ఒక రూపంలో
పంపబడినవాడే. ఒక తల్లి తన పిల్లలకు, ఒక
ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు, ఒక వైద్యుడు తన రోగులకు.
"ఉండుట, తరువాత పంపబడుట"
వాక్యం ముందుగా వారిని "పిలిచెను" అని
చెబుతుంది, తరువాతే "పంపెను" అని చెబుతుంది. ఈ
క్రమం యాదృచ్ఛికం కాదు. పంపబడటం యేసు
సన్నిధి నుండి ప్రారంభమవుతుంది. శిష్యత్వ క్రమం ఇలా ఉంటుంది. యేసు ప్రభువు
దగ్గరకు రావడం, ఆయన మాట వినడం, ఆయన నుండి
శక్తి పొందడం, ఆయన తరఫున వెళ్లడం. యేసు ప్రభువుతో సంబంధం
లేకుండా చేసే పరిచర్య క్రమంగా వ్యక్తిగత ప్రతిభ ప్రదర్శనగా మారే ప్రమాదం ఉంది.
ఇక్కడ ఒక గొప్ప నాయకత్వ నమూనా కూడా
కనిపిస్తుంది. మంచి నాయకుడు అన్నీ తానే చేయడు, పిలుస్తాడు, శిక్షణ
ఇస్తాడు, అధికారాన్ని అప్పగిస్తాడు, పంపిస్తాడు.
యేసు ప్రభువు పన్నెండు మందిని తన దగ్గరే
ఉంచుకుని అన్నీ తానే చేయవచ్చు, కానీ చేయలేదు. సేవను
విస్తరించేది ఒక్క వ్యక్తి కాదు, శిష్యులను తయారు చేసే వ్యవస్థ. ఇది నేటి సంఘ
నాయకత్వానికి కూడా వర్తిస్తుంది. బాధ్యతలను పంచుకోవడం, ఇతరులకు
అవకాశాలు ఇవ్వడం ద్వారానే పరిచర్య పెరుగుతుంది.
సామాజిక, ఆచరణాత్మక కోణం
శిష్యులు గ్రామగ్రామానికి వెళ్ళారు, పెద్ద
పట్టణాలకే పరిమితం కాలేదు. ఇది దేవుని రాజ్యానికి భౌగోళిక పరిమితులు లేవని
చూపిస్తుంది. గ్రామీణులు, పేదలు, అట్టడుగు
వర్గాలు అందరూ దేవుని ప్రేమకు అర్హులు. సువార్త ప్రకటన మరియు సామాజిక సేవ పరస్పర
విరుద్ధాలు కావు. నిజమైన సువార్త ఆకలిని, అనారోగ్యాన్ని, ఒంటరితనాన్ని, అన్యాయాన్ని
గమనిస్తుంది. అయితే స్వస్థత పరిచర్యను మూఢనమ్మకాలతో గానీ, తగిన వైద్య
చికిత్సకు ప్రత్యామ్నాయంగా గానీ చూడకూడదు, ప్రార్థన, వైద్య సహాయం
రెండూ బాధ్యతగల క్రైస్తవ జీవితంలో భాగమే.
తిరస్కారాన్ని ఎదుర్కోవడం
పరిచర్యలో తిరస్కారం అనివార్యం. కొంతమంది మన
మాటలను అంగీకరించరు, కొంతమంది మంచి ఉద్దేశాలను
తప్పుగా అర్థం చేసుకుంటారు. అప్పుడు కోపం, ప్రతీకారం, నిరాశ అనే ప్రలోభాలు
ఎదురవుతాయి. యేసు ప్రభువు చూపిన మార్గమును
అనుసరిస్తూ ఆయన సందేశాన్ని కొనసాగించాలి, ద్వేషాన్ని
మోసుకుపోకుడదు. పాదధూళి విదిలించడం అంటే "నేను నా వంతు చేశాను; ఇప్పుడు
దేవుని చేతుల్లో వదిలేస్తున్నాను" అనే స్వేచ్ఛను పొందడం. ప్రతి తలుపు
తెరుచుకోదు. కానీ మూసుకున్న తలుపు ముందు నిలబడి కుంగిపోవడం కాదు, తదుపరి
తలుపు వైపు నడవడం, ఇదే సేవకుని ధైర్యం.
ఆత్మపరిశీలన కోసం
- నేను యేసు దగ్గర తగినంత సమయం గడుపుతున్నానా, తరువాతే సేవకు బయలుదేరుతున్నానా?
- నా భద్రతకు నేను దేని మీద ఆధారపడుతున్నాను, నా వనరుల మీదా, దేవుని మీదా?
- నా జీవితంలో ప్రకటన (మాటలు) మరియు సేవ (చర్యలు) రెండూ కలిసి ఉన్నాయా?
- ఇటీవల నేను తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు ఎలా స్పందించాను?
- నా కుటుంబంలో, నా సమాజంలో నేను ఎవరికి
పంపబడ్డానో గుర్తిస్తున్నానా?
ముగింపు
లూకా 9:1-6 శిష్యత్వం, పరిచర్య, సంఘం
స్వభావం గురించి లోతైన సత్యాలను కలిగి ఉంది. యేసు ప్రభువు, తన శిష్యులకు అధికారం, శక్తి ఇచ్చి, నిరాడంబరతను, దేవుని మీద
ఆధారపడటాన్ని, తిరస్కారాన్ని ఎదుర్కొనే పరిపక్వతను
నేర్పించాడు. శిష్యులు ఆ ఆదేశాలను విశ్వాసంతో పాటించి, దేవుని
రాజ్యాన్ని ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ
ముందుకు సాగారు.
విత్తనం చేతిలో పట్టుకుని కూర్చుంటే అది ఫలించదు; నేలలో
పడాలి. శిష్యులు కూడా అంతే, యేసు ప్రభువు దగ్గర
నేర్చుకున్నదాన్ని లోకంలోకి తీసుకెళ్ళినప్పుడే అది ఫలించింది. ఈ వాక్యభాగం నేటి
ప్రతి విశ్వాసికి ఒక ఆహ్వానం: క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని స్వీకరించి, నిరాడంబరతతో, విశ్వాసంతో, ధైర్యంతో
దేవుని రాజ్యాన్ని జీవితంలో, మాటలలో, చేతలలో ప్రకటించాలి.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment