నియమమా? కరుణా? లూకా 14:1-6 జలోదర రోగి స్వస్థత
లూకా 14:1-6
యేసు ఒక
విశ్రాంతిదినమున పరిసయ్యుల అధికారులలో ఒకని యింట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను
గమనించుచుండిరి. అప్పుడు జలోదర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. “విశ్రాంతిదినమున స్వస్థపరచుట ధర్మమా? కాదా?” అని యేసు
ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను పశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమీయక
మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థ పరచి, పంపివేసి వారితో, “మీ కుమారుడుగాని, మీ ఎద్దుగాని, బావిలో పడినపుడు
విశ్రాంతిదినమైనను వెంటనే దానిని బయటకు తీయనివారు మీలో ఎవరున్నారు?" అనెను. వారు
అందుకు సమాధానము ఈయజాలక పోయిరి.
విశ్రాంతిదినమున జలోదర రోగికి స్వస్థత
పరిచయం
యేసు ప్రభువు యెరూషలేము వైపు సాగుతున్న ప్రయాణంలో, ఒక
విశ్రాంతిదినమున ఒక పరిసయ్యుల అధికారి ఇంట
భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక రోగిని స్వస్థపరిచి, మతనాయకుల
కపటత్వాన్ని ఒకే ప్రశ్నతో బయటపెట్టాడు. ఈ సంఘటన మనకు ఒక ప్రశ్న వేస్తుంది. దేవుని ఆజ్ఞలు మనిషిని బంధించడానికా, జీవింపజేయడానికా?
చారిత్రక నేపథ్యం
యూదుల జీవితంలో విశ్రాంతిదినం అత్యంత
పవిత్రమైనది. దానికి రెండు పునాదులు ఉన్నాయి. నిర్గమకాండము 20:8-11 ప్రకారం, దేవుడు
సృష్టి తరువాత విశ్రమించాడు కాబట్టి ప్రజలు కూడా విశ్రమించాలి పని చేయకూడదు. ద్వితీయోపదేశకాండము 5:12-15 ప్రకారం, ఐగుప్తు
బానిసత్వం నుండి విడుదల పొందిన ప్రజలు, సేవకులకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. అంటే
విశ్రాంతిదినం మూలంలోనే సృష్టికి, విమోచనకు, మానవ
గౌరవానికి చిహ్నం.
కాలక్రమేణా ధర్మశాస్త్ర బోధకులు "పని"
అంటే ఏమిటో నిర్వచించడానికి లెక్కలేనన్ని నియమాలు చేర్చారు. ఫలితంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ యొక్క ఉద్దేశం మరుగున పడి, నియమాల భారం
పెరిగింది. ప్రాణాపాయం లేని సందర్భాల్లో స్వస్థత కూడా "పని"గా
పరిగణించబడే స్థితి వచ్చింది.
జలోదర రోగికి ప్రభువు కరుణ - విశ్రాంతి దినం
జలోదర రోగం అంటే శరీరంలో, ముఖ్యంగా
ఉదరం, కాళ్ళలో నీరు చేరి వాపు రావడం. ఇది తరచుగా గుండె, కాలేయం, మూత్రపిండాల
వ్యాధులకు సూచన. ఆ కాలంలో దీనిని తీవ్రమైన వ్యాధిగా భావించేవారు, కొందరు
దీనిని పాపఫలంగా కూడా చూసేవారు. కాబట్టి ఈ రోగి శారీరకంగా బాధపడటమే కాక, సామాజికంగా
కూడా దిగువున ఉన్నవాడు.
యేసు ప్రభువు పరిసయ్యుల అధికారి ఇంటికి
వెళ్ళాడు. అంటే యేసు ప్రభువు తనను వ్యతిరేకించేవారిని కూడా తిరస్కరించలేదని చూపిస్తుంది.
అయితే "ప్రజలు ఆయనను గమనించుచుండిరి" అని లూకా చెబుతున్నాడు. అంటే ఆ
ఆతిథ్యం వెనుక పరీక్ష ఉంది. ఒకవైపు భోజనపు బల్ల, మరోవైపు
పరిశీలించే చూపులు.
అప్పుడు జలోదర రోగి యేసు ప్రభువు ముందు ఉన్నాడు. యేసు ప్రభువును పరీక్షించడానికి పరిసయ్యులే
అతన్ని అక్కడకు తెచ్చి ఉండవచ్చు. అదే నిజమైతే, ఒక మనిషి
బాధ ఇతరుల వాదనలో పావుగా మారిందన్నమాట. కానీ యేసు ప్రభువు అతన్ని పావుగా కాక, స్వస్థత
అవసరమైన వ్యక్తిగా చూశాడు. ఆ రోగి ఏమీ అడగలేదు; అతని ఉనికే
ఒక మౌన ప్రార్థన, ఒక వేడుకోలు.
ఇక్కడ "విశ్రాంతిదినమున స్వస్థపరచుట ధర్మమా? కాదా?" అని
ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను యేసు ప్రభువు అడిగాడు. వారు ఆరోపణ చేయక ముందే
ఆయన విషయాన్ని బహిరంగంగా చర్చకు తెచ్చాడు. ఈ ప్రశ్న అవును-కాదు అనే రెండు
సమాధానాలే ఉన్నది. కానీ దాని వెనుక అసలు ప్రశ్న విశ్రాంతిదినం దేనికోసం ఇవ్వబడింది?
వారు మౌనంగా ఉండిపోయారు. "ధర్మమే"
అంటే యేసు ప్రభువు చేసే చర్యను
అంగీకరించినట్లు అవుతుంది. "కాదు" అంటే తమ కఠినత్వం బయటపడుతుంది.
కాబట్టి మౌనమే వారికి సురక్షితం. ఇది సత్యం తెలిసినా అంగీకరించని హృదయ
కాఠిన్యానికి గుర్తు. అయితే యేసు ప్రభువు వారి సమాధానం కోసం ఆగలేదు. ఆయన రోగిని చేరదీసి, తాకి, స్వస్థపరిచి, పంపివేశాడు.
యూదుల శుద్ధత నియమాల ప్రకారం రోగిని తాకడం
అంటే అపవిత్రత తెచ్చుకోవడం, కానీ యేసు ప్రభువు స్పర్శ అతనికి గౌరవాన్ని, అంగీకారాన్ని, స్వస్థతను
ఇచ్చింది. "పంపివేసి" అనే మాటలో కూడా కరుణ ఉంది. యేసు ప్రభువు అతన్ని ఆ శత్రుత్వపు వాతావరణం నుండి
విడిపించి, తన జీవితానికి తిరిగి వెళ్ళే స్వేచ్ఛ ఇచ్చాడు.
యేసు ప్రభువు తను చేసిన పనిని సమర్థించుకున్నాడు.
"మీ కుమారుడుగాని, మీ ఎద్దుగాని బావిలో పడినపుడు
విశ్రాంతిదినమైనను వెంటనే దానిని బయటకు తీయనివారు మీలో ఎవరున్నారు?" ఎద్దును
రక్షించడానికి అనుమతి ఉంటే, మనిషిని స్వస్థపరచడం ఇంకెంత
ధర్మం! "మీ" అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తుంది. తమకు ప్రియమైన వాటి విషయంలో
నియమాలను సడలించుకునే వారు, ఇతరుల అవసరంలో మాత్రం కఠినంగా
ఉంటారని యేసు ప్రభువు చూపిస్తున్నాడు.
"వెంటనే" అనే పదం అత్యవసరాన్ని సూచిస్తుంది: ప్రాణం ప్రమాదంలో
ఉన్నప్పుడు ఆలస్యం ఉండదు. "వారు అందుకు సమాధానము ఈయజాలక
పోయిరి." సత్యం ఎదుట కపటం నిలవలేదు. అయితే వారు ఓడిపోయినా మారలేదు. ఈ విరోధం
క్రమంగా పెరిగి, చివరకు సిలువ వరకు చేరుతుంది.
విశ్రాంతిదినం యొక్క నిజమైన ఉద్దేశం
యేసు ప్రభువు
మార్కు సువిశేషం రెండవ అధ్యాయంలో విశ్రాంతిదినము మనుష్యుని కొరకే కాని మనిషి విశ్రాంతిదినము కొరకు ఏర్పాడలేదు అని చెబుతాడు. యేసు ప్రభువు విశ్రాంతిదినాన్ని రద్దు చేయలేదు; దాని అసలు
అర్థాన్ని పునరుద్ధరించాడు. అది బానిసత్వం నుండి విడుదలను గుర్తుచేసే దినం కాబట్టి, ఆ దినాన ఒక
వ్యక్తిని వ్యాధి బంధకాల నుండి విడిపించడం దాని ఉద్దేశానికి సరిగ్గా సరిపోతుంది.
ధర్మశాస్త్ర ఆత్మ
పరిసయ్యులు అక్షరర్ధాన్ని
పట్టుకున్నారు; యేసు ప్రభువు ఆత్మను బోధించాడు. ధర్మశాస్త్రమంతా దేవుని
ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం అనే రెండు ఆజ్ఞలలో
ఇమిడి ఉంది (మత్తయి 22:37-40). ఏ నియమమైనా
ఈ ప్రేమకు సేవ చేయాలి, దానికి అడ్డు కాకూడదు. దేవుడు
కోరునది దయను గాని బలిని కాదు (హోషేయ 6:6) అనే మాట
ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది.
యేసు ప్రభువు కరుణ, అధికారం
రోగి అడగకముందే యేసు ప్రభువు స్పందించాడు.
దేవుని కరుణ మన అర్హతపై ఆధారపడదు; మన అవసరాన్ని చూసి ఆయన
స్పందిస్తాడు. అదే సమయంలో "మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువు"
(లూకా 6:5) కాబట్టి దాని అర్థాన్ని నిర్ణయించే అధికారం
ఆయనకు ఉంది.
స్వస్థత, దేవుని రాజ్యానికి సూచన
యేసు ప్రభువు స్వస్థతలు కేవలం శారీరక సహాయాలు
కావు; దేవుని రాజ్యం వచ్చిందనే సూచనలు. లూకా సువార్తలో
విందు కూడా దేవుని రాజ్యానికి చిహ్నం.
లూకా సువార్త విశ్రాంతిదినాన జరిగిన అనేక
స్వస్థతలను నమోదు చేసింది. కఫర్నాములో దయ్యం పట్టినవాడు (4:31-37), పేతురు అత్త
(4:38-39), ఊచచేయి గలవాడు (6:6-11), వంగిపోయిన
స్త్రీ (13:10-17), మరియు ఈ జలోదర రోగి (14:1-6) స్వస్థతలు విశ్రాంతి దినాన జరిగినవి. ఈ క్రమములోనే
యేసు ప్రభువుకు, మతనాయకులకు
మధ్య ఘర్షణ పెరుగుతూ పోవడం కనిపిస్తుంది. ప్రతిసారీ యేసు ప్రభువు చూపే కరుణ యూద నాయకులు
చెప్పే నియమాల కంటే ముందు నిలుస్తుంది.
కతొలిక దృక్పథం
కతొలిక సంప్రదాయంలో ఆదివారం ప్రభువు దినం, క్రీస్తు
పునరుత్థానాన్ని స్మరించే రోజు. ఆ రోజున దివ్యబలిపూజలో పాల్గొనడం ప్రధానం. అయితే తిరుసభ
సత్యపదేశం ప్రకారం కరుణ కార్యాలు, అవసరమైన సేవలు ఆదివార
విశ్రాంతి దినానికి విరుద్ధం కావు; అవి దానిని
నెరవేరుస్తాయి. రోగులను దర్శించడం శారీరక కారణ్య పనులలో ఒకటి (మత్తయి 25:36). తిరుసభ నియమాలన్నీ మనుషుల మేలుకే.
ఆధ్యాత్మికత ప్రార్థనను, సేవను వేరు చేయదు.
దేవుని సన్నిధిలో నిలబడినవాడు, అదే సమయంలో ప్రజల అవసరాలకు
స్పందిస్తారు. నిజమైన ప్రార్థన మనల్ని స్వార్థం నుండి బయటకు తెచ్చి, ఇతరుల బాధను
గుర్తించే హృదయాన్ని ఇస్తుంది. ప్రార్థన మనలో కరుణను పెంచకపోతే, మనం ఎక్కడో దారి
తప్పిపోయామని తెలుసుకొని, ఆత్మపరిశీలన చేసుకోవాలి.
నేటి జీవితానికి అన్వయం
నియమాలు, ప్రేమ మధ్య
సమతుల్యత. కుటుంబంలో, సంఘంలో, పనిలో
నియమాలు అవసరమే. కానీ ఒక నియమం ఒక వ్యక్తి అవసరానికి అడ్డుగా నిలిచినప్పుడు దాని ప్రాధాన్యతను
గురించి అడగాలి: ఈ నియమం ఏ ఉద్దేశంతో ఇవ్వబడింది? ఇప్పుడు
ప్రేమ ఏమి కోరుతోంది?
ద్వంద్వ ప్రమాణాలను పరిశీలించుకోవడం. మన స్వంత కుటుంబ లాభం
విషయంలో ఎంత వేగంగా స్పందిస్తాం! ఇతరుల విషయంలో అంత శ్రద్ధ చూపుతున్నామా?
మౌనంగా బాధపడేవారిని గమనించడం. జలోదర రోగి ఏమీ అడగలేదు. మన చుట్టూ కూడా
ఒంటరితనం, అనారోగ్యం, అప్పులు, మానసిక
భారంతో మౌనంగా బాధపడేవారు ఉన్నారు. యేసు ప్రభువులా వారిని గమనించి, చేరదీయాలి.
గమనించడంలో వ్యత్యాసం. పరిసయ్యులు
యేసు ప్రభువును తప్పు పట్టడానికి ఆయన్ని గమనించారు; యేసు ప్రభువు
రోగిని కరుణతో చూశాడు. ఇతరులను చూసేటప్పుడు మనం తప్పులు వెతుకుతున్నామా, వారి అవసరాలను
చూస్తున్నామా?
మేలు చేయడాన్ని వాయిదా వేయకపోవడం. "ఇది సరైన
సమయం కాదు", "ఇతరులు ఏమనుకుంటారో" అనే
ఆలోచనలతో మేలు చేయడాన్ని ఆపకూడదు. యేసు ప్రభువు అందరూ చూస్తుండగానే, విమర్శ
వస్తుందని తెలిసీ స్వస్థపరిచాడు.
సత్యాన్ని ప్రేమతో చెప్పడం. యేసు ప్రభువు తన విరోధులను అవమానించలేదు. ప్రశ్నల ద్వారా వారి
హృదయాలతో మాట్లాడాడు, ఆలోచించే అవకాశం ఇచ్చాడు. మనం
కూడా సత్యం చెప్పేటప్పుడు ఇతరుల గౌరవాన్ని కాపాడాలి.
ధ్యానానికి
ప్రశ్నలు
- నా జీవితంలో ఏ నియమాలు, సంప్రదాయాలు ఇతరులకు
సహాయం చేయకుండా నన్ను ఆపుతున్నాయి?
- నా చుట్టూ ఉన్న "జలోదర రోగులు" ఎవరు? ఎవరు మౌనంగా నా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు?
- నేను ఇతరులను విమర్శనాత్మకంగా గమనించేవాడినా, కరుణతో చూసేవాడినా?
- సత్యం తెలిసీ అంగీకరించకుండా నేను మౌనంగా ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయా?
- నా బాధను, బలహీనతను యేసు ముందు
ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నానా?
ప్రార్థన
ప్రభువా, మీరు విశ్రాంతిదినమునకు అధిపతులు, నియమాల కంటే మనిషి విలువను ఎరిగినవారు, పరిసయ్యుల ఇంట రోగిని చేరదీసి స్వస్థపరచి, మీ కరుణను చూపించినట్లు, మా బాధలను, బలహీనతలను కూడా తాకి స్వస్థపరచండి. మా హృదయాల్లోని కాఠిన్యాన్ని తొలగించి, ఇతరుల తప్పులను మాత్రమే కాక, వారి బాధలను చూసే కన్నులను, వారికి సహాయం చేసే చేతులను మాకు ప్రసాదించండి. ఆమెన్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి