లూకా 14:7-11 వ్యాఖ్యానము: ప్రధాన ఆసనము, వినయము మరియు యేసు బోధ

 


లూకా 14:7-11 వ్యాఖ్యానము

ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను: “ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినపుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీ కంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము' అనును. అపుడు నీవు సిగ్గుతో కడపటిచోటున కూర్చుండవలసివచ్చును. అందుచేత నీవు పిలువబడినపుడు అందరికంటె కడపటి చోటున కూర్చుండుము. అపుడు మిమ్ము పిలిచినవాడు వచ్చి నీతో స్నేహితుడా!ముందుకు వెళ్ళి కూర్చుండుము' అని చెప్పును. అపుడు అతిథులందరి యెదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తననుతాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును” అనెను.

పరిచయము

లూకా 14:7-11 వచనాలు ఒక సాధారణ సలహాలా కనిపిస్తుంది. కానీ  ఇక్కడ యేసు ప్రభువు ఒక సామాజిక ఆచారాన్ని తీసుకొని దేవుని రాజ్య సూత్రాన్ని బోధించారు. అది ఏమిటంటె, "తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును." ఈ సువిశేష  భాగము గర్వము, నిజమైన గౌరవము ఎక్కడ నుండి వస్తుందని, దేవుని రాజ్యము ఈ లోకపు విలువలను ఎలా తారుమారు చేస్తుంది అనే విషయాలను తెలియజేస్తుంది.

సందర్భము

ఈ సంఘటన లూకా 14:1లో మొదలవుతుంది. యేసు ప్రభువు విశ్రాంతి దినమున ఒక పరిసయ్యుల నాయకుని ఇంట భోజనానికి వెళ్ళారు. అక్కడివారు ఆయనను జాగ్రత్తగా గమనిస్తున్నారు, అంటే వారి ఆహ్వానములో ప్రభువును పరీక్షించే ఉద్దేశము కూడా ఉన్నది. యేసు ప్రభువు అక్కడ రోగిని స్వస్థపరిచారు (14:2-6). విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా అని ఆయన అడిగినపుడు వారు మౌనముగా ఉండిపోయారు.

ఇంతవరకు యేసు ప్రభువును గమనించినవారిని ఇప్పుడు ఆయన గమనిస్తున్నారు. అతిథులు ప్రధాన ఆసనములను ఎన్నుకొనుట చూచి ఆయన ఈ ఉపమానమును చెప్పారు. ఇది ఆకస్మికమైన బోధ కాదు; వారి హృదయములోని గర్వమునకు ప్రభువు ఇచ్చిన సమాధానము.

సాంస్కృతిక, చారిత్రక నేపథ్యము

ఆసన క్రమము

ఆ కాలపు అధికారిక విందులలో అతిథులు గ్రీకో-రోమన్ పద్ధతిలో మంచములపై ఆనుకొని భోజనము చేసేవారు. యజమానికి దగ్గరగా ఉండే స్థానము ఎక్కువ గౌరవము కలది. అందువలన ఎవరు ఎక్కడ కూర్చుంటారనేది వారి హోదాను బహిరంగ పరచటమే.

గౌరవము

ఆనాటి సమాజములో గౌరవము బహిరంగముగా సంపాదింపబడేది, బహిరంగముగానే కోల్పోయేది. అందరి ఎదుట ప్రధాన స్థానము నుండి చివరి స్థానమునకు పంపబడుట తీవ్రమైన అవమానము. ప్రార్ధన మందిరములలో ఎత్తుగా ఉండే ముందు వరుస రాతి బల్లలు, "తమ తమ స్థాయి ప్రకారము" కూర్చోవలెనని చెప్పే కుమ్రాన్ నియమము ఉండేది.

"తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును"

యేసు ప్రభువు వారిని గమనించుట

 యేసు ప్రభువు బాహ్య ప్రవర్తనను దాటి హృదయమును చూస్తారు. మనము కూర్చునే స్థలమును ఎన్నుకునే తీరు మన అంతరంగ స్థితిని చూపుతుంది. ప్రార్ధన మందిరములలో ప్రధాన ఆసనములను ప్రేమించేవారిని యేసు ప్రభువు ఇతర చోట్ల కూడా విమర్శించారు (లూకా 11:43; 20:46). మన పనులన్నీ కూడా ప్రభువుకు తెలుసు, ఎవరు ఆయన నుండి వారి పనులను దాయలేరు.

"ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు"

యేసు ప్రభువు తన బోధను వివరించడానికి పెండ్లి విందును ఎంచుకున్నారు, ఎందుకంటే అక్కడ స్థాయి (స్తితి గతుల) పోటీ ఎక్కువ. పవిత్రగ్రంధంలో  పెండ్లి విందు మెస్సీయ విందుకు, దేవుని రాజ్యానికి సూచనగా  కూడా వాడబడింది.(యెషయా 25:6; ప్రకటన 19:9). ఎందుకు ప్రభువు  ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు అంటున్నాడు, దానికి ప్రభువు ఇచ్చిన కారణము చాలా సులభమైనది, "అతడు నీ కంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును." మన గురించి మనకు ఉన్నా  అంచనా తప్పు కావచ్చు, స్థానములను నిర్ణయించేది యజమాని, అతిథి కాదు. అతిథి అక్కడ ఉన్నది ఆహ్వానము వలన, తన అర్హత వలన కాదు.

అవమానము

ఇక్కడ యజమాని వచ్చి "ఇతనికి చోటు ఇమ్ము" అంటాడు. మిగిలిన స్థానములన్నీ నిండియుండుటచే అతడు అందరి ఎదుట కడపటి చోటునకు వెళ్ళవలసి వస్తుంది. యేసు ప్రభువు  ఇక్కడ శిక్షను కాదు, పర్యవసానమును చూపుతున్నారు. గర్వములోనే దాని పతనపు బీజములు ఉన్నాయి. గౌరవమును కాపాడుకోవాలనే ప్రయత్నమే అత్యంత అవమానమును తెస్తుంది. ఇది సామెతలు 16:18ను గుర్తు చేస్తుంది.

మంచి మార్గము

కడపటి చోటున కూర్చుంటే యజమాని "స్నేహితుడా! ముందుకు వెళ్ళి కూర్చుండుము" అంటాడు, అతిథులందరి ఎదుట గౌరవము కలుగుతుంది. ఇక్కడ కొన్ని అంశములు పదేపదే కనిపిస్తాయి:

  • "స్నేహితుడా" అనే సంబోధన ప్రేమపూర్వకమైనది. వినయవంతుడు మంచి స్థానమునే కాక యజమాని స్నేహమును కూడా పొందుతాడు (యోహాను 15:15).
  • ఈ గౌరవము ఇవ్వబడేది, లాక్కొనేది కాదు. యజమాని బహిరంగముగా ఇచ్చిన గౌరవము నిలుస్తుంది; మనకు మనమే ఇచ్చుకున్నది శూన్యమే.
  • పైకి ఎదగాలంటే ముందు కింద కూర్చో" అనుకుంటే అది మరింత సూక్ష్మమైన గర్వము. నిజమైన వినయము ప్రతిఫలమును లెక్కించదు.    

ముఖ్యమైన భావన

వినయము అంటే ఏమిటి?

వినయమంటే ఆత్మన్యూనత కాదు, మన సామర్థ్యములను తిరస్కరించుట కాదు. దేవుని ఎదుట మనమెవరమో సరిగా చూడగలగడం. మనము సృష్టింపబడినవారము, ఆయన కృపపై ఆధారపడినవారము. మన బలములను ఆయన వరములుగా అంగీకరించాలి, బలహీనతలను ఆయన ఎదుట నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజమైన వినయము గలవాడు ప్రధాన ఆసనములో ఉన్నా, కడపటి చోట ఉన్నా ప్రశాంతంగా ఉంటాడు, ఎందుకంటే అతని గుర్తింపు అతను ఉన్న  స్థానము నుండి కాక దేవునితో ఉన్న  సంబంధము నుండి వస్తుంది. ప్రధాన ఆసనములో గర్వపడుట, కడపటి చోట అశాంతిగా ఉండుట, ఈ రెండూ ఒకే అభద్రతా భావము నుండి పుడతాయి.

గర్వము యొక్క స్వభావము

గర్వము పాపములన్నిటికీ మూలము; ఆదిలో సర్పము "మీరు దేవునివలె అగుదురు" అని శోధించింది. గర్వమునకు అనేక రూపముల ఉన్నవి,  ధన, పదవి, విద్య, కుల, అంద గర్వములు, మరియు అధికారము, సేవ విషయములో గర్వము కూడా ఉంటుంది. వీటన్నిటిలో అత్యంత సూక్ష్మమైనది ఆధ్యాత్మిక గర్వము. అందుకే యేసు ప్రభువు ఈ బోధను మత నాయకుల ఇంటిలోనే చేశారు.

దైవరాజ్యములోని తారుమారు

దేవుని రాజ్యము లోకపు స్థాయిలను తలక్రిందులు చేస్తుంది. గౌరవము దేవుడు ఇచ్చే బహుమతి, బలవంతముగా లాక్కొనేది కాదు.

కృప మరియు తీర్పు. ఒక వ్యక్తి "హెచ్చింపబడుట" అనేది దేవుని చర్య కాబట్టి అది మన సంపాదన కాదు, అది దేవుని కృప మాత్రమే.  వినయము ఒక అర్హత కాదు, దేవుని కృపను స్వీకరించుటకు తెరచిన హృదయం అవుతుంది. తుది తీర్పు దేవునిదే కాబట్టి మనము ఇతరులను అంచనా వేయనక్కర లేదు.

క్రీస్తు పరిపూర్ణ ఆదర్శము. యేసు ప్రభువు  తాను బోధించినది జీవించారు.  పశువుల పాకలో జననము, నజరేతులో వడ్రంగిగా జీవితము, శిష్యుల పాదములు కడుగుట (యోహాను 13), సిలువపై అత్యల్ప స్థానమును స్వీకరించుట, ఆ తరువాత తండ్రిచే హెచ్చింపబడుట (ఫిలిప్పీయులకు 2:5-11) వీటి ద్వారా ప్రభువు తన జీవితము ద్వారా మనము ఎలా వినయముతో జీవించాలో చెప్పాడు.   

 ఆచరణాత్మక అన్వయములు

  • వ్యక్తిగత జీవితములో-  మనము "ప్రధాన ఆసనములను" ఎక్కడ వెదుకుతున్నామో గుర్తించాలి.  మన మాటె నెగ్గాలి అనే పట్టుదల, క్రెడిట్ కోసం తపన, ప్రశంసల కోసం ఎదురుచూపు, ఇతరుల విజయములను చూసి సంతోషించలేకపోవుట, తప్పును ఒప్పుకొనుటకు సంకోచము. ప్రతి రాత్రి "ఈ దినము నేను ఎవరి మెప్పు కొరకు జీవించితిని?" అని ప్రశ్నించుకోవడం మేలు.
  • కుటుంబములో- "నేనే సరియైనవాడను" అనే భావన అనేక కలహములకు మూలము. మొదట క్షమాపణ కోరుటకు, మొదట సేవ చేయుటకు, మొదట తగ్గుటకు సిద్ధపడిన కుటుంబములో శాంతి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చి అవమానించకూడదు.
  • సంఘ జీవితములో-  పదవులు, వేదికపై స్థానములు, ఎవరి పేరు ముందు వ్రాయబడుతుంది అనే విషయములు పోటీకి కారణమవుతాయి. పరిచర్య గౌరవమును సంపాదించే మార్గము కాదు, సేవ చేయు అవకాశము. పెద్ద బాధ్యతలు నిర్వహించేవారినే కాక నిశ్శబ్దముగా సేవ చేసేవారిని కూడా గౌరవించాలి. అధికారమును చూపి లోబరచుకొనకూడదు.
  • సమాజములో- కులము, ధనము, పదవి, విద్య ఆధారముగా మనుషులను విభజించే ధోరణిని విడనాడాలి. పేదలను, సామాన్యులను, గుర్తింపు లేనివారిని గౌరవించి, వారితో కూర్చుని, వారి మాట వినాలి.
  • ప్రార్థన, ఆరాధనలో- పరిసయ్యుని వలె "నేను ఇతరులవంటివాడను కాను" అని కాక, సుంకరివలె "దేవా, పాపినైన నాయందు దయచూపుము" అని ప్రార్థించాలి (లూకా 18:9-14). పాపసంకీర్తనము, దివ్యబలి పూజ, ఉపవాసము, దానధర్మములు వినయములో ఎదగడానికి సాధనములు.

ధ్యాన ప్రశ్నలు

  1. నా జీవితములో నేను ఏ "ప్రధాన ఆసనముల" కొరకు తహతహలాడుచున్నాను: గుర్తింపు, పదవి, మెప్పు, లేక నియంత్రణ?
  2. ఇతరులకు గౌరవము లభించినపుడు, లేక నా సేవను ఎవరూ గుర్తించనపుడు నా మనసులో ఏ భావన కలుగుతుంది?
  3. నా వినయము నిజమైనదా, లేక ప్రశంస పొందుటకు ధరించిన ముసుగా?
  4. "కడపటి స్థానము" ఎంచుకొనుట నాకు ఎక్కడ కష్టము: కుటుంబములోనా, పనిలోనా, సంఘములోనా?
  5. ఈ వారము ఎవరికైనా గుర్తింపు ఆశించకుండా సేవ చేయడానికి నేను తీసుకోగల ఒక నిర్దిష్ట అడుగు ఏమిటి?

ప్రధాన సందేశము

మన విలువ మనము ప్రకటించుకొనే హోదాలో లేదు, దేవుడు మనకిచ్చే ప్రేమలో ఉంది. నిజమైన గౌరవము లాక్కొనేది కాదు, స్వీకరించేది. యేసు ప్రభువు స్వయముగా కడపటి స్థానమును (సిలువను) ఎంచుకొని తండ్రిచే అత్యున్నతముగా హెచ్చింపబడ్డారు, తనను అనుసరించువారిని అదే మార్గములోనికి  పిలుస్తున్నారు. "కడపటి చోటు" ఓటమి కాదు, స్వేచ్ఛ. అక్కడ మనము ఇక పోటీ పడనక్కర లేదు, ఎందుకంటే మనలను పిలిచిన యజమాని మనలను ఎరుగును, తగిన సమయములో మన స్థానమును ఆయనే నిర్ణయిస్తారు. ఆయన "స్నేహితుడా! ముందుకు వెళ్ళి కూర్చుండుము" అని పలికే దినమున ఆ స్వరమును ఆనందముగా వినగలుగునట్లు జీవింతుము.

ప్రార్థన

ప్రభువా! మా హృదయములలోని గర్వమును, అసూయను తొలగించమని; క్రీస్తును అనుసరించే కృప ఇమ్మని; గౌరవమును స్వీయ ప్రచారము ద్వారా కాక మిమ్ము సేవించుట  ద్వారా స్వీకరించునట్లు చేయమని; ఇతరులను సేవించుటలో ఆనందింపజేయమని వేడుకుంటున్నాము. ఆమెన్

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి