ఆవగింజ, పులిసిన పిండి ఉపమానాలు: లూకా 13:18-21 వ్యాఖ్యానం
లూకా 13: 18-21
యేసు
మరియొక ఉపమానము చెప్పెను: “పరలోకరాజ్యము దేనితో పోల్చదగును? అది ఒకడు తన తోటలో
వేసిన ఆవగింజను పోలియున్నది. అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్యెను. ఆకాశపక్షులు
వచ్చి, ఆ
చెట్టు కొమ్మలలో గూడు కట్టుకొని నివసించెను.” ఆయన ఇంకను
ఇట్లనెను: “నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చెదను? “అది ఒక స్త్రీ పులిసిన పిండిని మూడంతలు
పిండిలోనుంచగా, అంతయు పులియబారిన పిండిని పోలియున్నది.”
పరిచయం
యేసు ప్రభువు తన బోధనలో ఉపమానాలను ప్రధాన
సాధనంగా వాడారు. రోజువారీ జీవితం నుండి తీసుకున్న సంఘటనల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను సామాన్యులకు
అందించారు. ఆవగింజ, పులిసిన పిండి ఉపమానాలు రెండు
మూడు వాక్యాలే ఉన్నాయి. అయినా దైవరాజ్య స్వభావం, ఆరంభం, పెరుగుదల, ప్రభావం
అన్నీ వాటిలో ఇమిడి ఉన్నాయి. రెండింటి సందేశం ఒకటే, దైవరాజ్యం చిన్నగా, గుప్తంగా
ఆరంభమై, దేవుని శక్తితో విశ్వవ్యాప్తమవుతుంది.
సందర్భం
లూకా 13వ అధ్యాయంలో ఈ
ఉపమానాలకు ముందు, యేసు ప్రభువు విశ్రాంతి దినాన పద్దెనిమిది సంవత్సరాలుగా
వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచారు (13:10–17). ఆ వెంటనే ఈ ఉపమానాలు వస్తాయి.
అంటే వంగిన స్త్రీని నిలబెట్టిన ఆ నిశ్శబ్ద స్వస్థతే దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో చూపే మొదటి
చిత్రం.
యేసు ప్రభువు కాలంలో యూదులు మెస్సయ్య రాజ్యం గురించి గొప్ప
ఆశలు పెట్టుకున్నారు. రోమా పాలన నుండి విముక్తి, ఇశ్రాయేలు
పునరుద్ధరణ, శత్రువుల పతనం ఒక్కసారిగా వస్తాయని
ఊహించారు. కానీ యేసు ప్రభువు ప్రకటించిన
రాజ్యం భిన్నమైనది. అది చిన్నదిగా, నిశ్శబ్దంగా, లోపలి నుండి
పనిచేసేదిగా ఉంది. యూదులు ఊహించుకున్న తప్పుడు
అంచనాలను సరిదిద్దడమే ఈ ఉపమానాల లక్ష్యం.
"దేవుని రాజ్యం దేనితో
పోల్చదగును?" అనే ప్రశ్న యేసు ప్రభువు అడుగుతున్నాడు ఏ ఒక్క పోలికా దేవుని రాజ్యాన్ని పూర్తిగా వర్ణించలేదు, దేవుని రాజ్యం" అంటే ఒక స్థలం కాదు, మానవ హృదయాల్లో అమలయ్యే దేవుని పరిపాలన.
ఆవగింజ ఉపమానం
"అది ఒకడు తన తోటలో వేసిన
ఆవగింజను పోలియున్నది. అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్యెను. ఆకాశపక్షులు వచ్చి దాని
కొమ్మలలో గూడు కట్టుకొనెను."
చిన్నతనం. పాలస్తీనాలో
పెరిగే నల్ల ఆవ గింజ దాదాపు ఒక మిల్లీమీటరు మాత్రమే ఉంటుంది. యూదుల సామెతల్లో
"ఆవగింజంత" అంటే అతి స్వల్పం. వృక్షశాస్త్రం ప్రకారం దానికంటే చిన్న
విత్తనాలు ఉన్నా, శ్రోతలు రోజూ చూసే
విత్తనాల్లో ఇదే చిన్నది. వారికి అర్థమయ్యే భాషలో యేసు మాట్లాడారు.
విత్తేవాడు. ఒకడు తన
తోటలో ఉద్దేశపూర్వకంగా నాటాడు. దేవుని రాజ్యారంభం యాదృచ్ఛికం కాదు, అది దేవుని
ప్రణాళిక. అయితే పెరుగుదల మనిషి చేతిలో లేదు. మార్కు 4:26-29 చెప్పినట్లు, రైతుకు
తెలియకుండానే భూమి ఫలిస్తుంది. పౌలు అన్నట్లు, నాటేవాడు, నీరు
పోసేవాడు మనమే, కానీ ఎదిగించేవాడు దేవుడే (1 కొరింథీ 3:6-7).
చెట్టు. లూకా దీన్ని
"చెట్టు" అంటాడు. నిజానికి ఆవ మొక్క ఒకటి నుండి మూడు మీటర్ల ఎత్తు
పెరిగే పొద. ఇక్కడ యేసు ప్రభువు కొంత
అతిశయోక్తి వాడారు. ఆయన ఉద్దేశం వృక్షశాస్త్రం గురించి చెప్పడం కాదు, ఆరంభపు
అల్పత్వానికి, అంతపు గొప్పతనానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని
చూపడం.
ఆకాశపక్షులు. యెహెజ్కేలు 17:23,
31:6, దానియేలు 4:12 వంటి భాగాల్లో గొప్ప వృక్షం
కొమ్మల్లో పక్షులు ఆశ్రయం పొందడం గొప్ప సామ్రాజ్యాలకు చిహ్నం.
యేసు ప్రభువు ఈ చిత్రాన్ని తీసుకున్నారు.
కానీ ఆయన ఎంచుకున్నది గంభీరమైన దేవదారు చెట్టు కాదు, సాధారణమైన ఆవ పొద. లోక
సామ్రాజ్యాలు బలప్రయోగంతో విస్తరిస్తాయి. దేవుని రాజ్యం వినయంగా పెరుగుతుంది, చివరికి
అన్ని జాతులకూ ఆశ్రయమిస్తుంది. లూకా 13:29 ఇదే అధ్యాయంలో తూర్పు పడమరల
నుండి ప్రజలు వచ్చి పరలోక విందులో
కూర్చుంటారని చెబుతుంది.
ప్రధాన బోధలు:
- నజరేతు వడ్రంగి, గలిలయ జాలరులతో ఆరంభమైన
రాజ్యారంభం. లోక దృష్టిలో అల్పం, దేవుని దృష్టిలో
మహావృక్షానికి బీజం.
- విత్తనం పెరగడం దాని స్వభావం. దేవుని సంకల్పం అడ్డంకులు, హింసల మధ్య కూడా నెరవేరుతుంది.
- దేవుని రాజ్యం అందరికీ ఆశ్రయమిస్తుంది: పేదలు, పాపులు, అన్యజనులు.
- పెరుగుదలకు సమయం పడుతుంది, కాబట్టి సహనం అవసరం.
పులిసిన పిండి ఉపమానం
"అది ఒక స్త్రీ పులిసిన
పిండిని మూడంతలు పిండిలో ఉంచగా, అంతయు పులియబారిన పిండిని
పోలియున్నది."
పులిసిన పిండి. ముందు రోజు
పిండిలో కొంత భద్రపరచి, అది పులిసిన తర్వాత కొత్త
పిండిలో కలపడం ఆనాటి పద్ధతి. కొద్ది పిండి మొత్తాన్ని మార్చేస్తుంది, పైగా
నిశ్శబ్దంగా, కంటికి కనపడకుండా చేస్తుంది.
ఒక ఆసక్తికర సవాలు. పవిత్ర గ్రంధంలో
పులిసిన పిండి తరచూ చెడుకు సూచన. పాస్కలో
దాన్ని ఇళ్ళ నుండి తొలగించాలి (నిర్గమ 12:15). "పరిసయ్యుల
పులిసిన పిండి విషయమై జాగ్రత్త" అని యేసు ప్రభువు హెచ్చరించారు (లూకా 12:1).
"కొంచెం పులిసిన పిండి మొత్తాన్ని పులియజేయును" అని పౌలు అన్నాడు (1 కొరింథీ 5:6). అయినా ఇక్కడ
యేసు ప్రభువు దాన్ని దేవుని రాజ్యానికి పోలికగా వాడారు. ఉపమానంలో అన్ని వివరాలూ
సరిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోలిక దాని నైతిక స్వభావానికి కాదు, దాని పని
విధానానికి: చిన్నదైనా, దాగి ఉన్నా, మొత్తాన్ని
రూపాంతరం చేసే శక్తి.
ప్రధాన బోధలు:
- అంతర్గత మార్పు: పులిసిన పిండి బయటి
నుండి ఒత్తిడి చేయదు, లోపలి నుండి
మారుస్తుంది. దేవుని రాజ్యం బలవంతంగా
కాక హృదయాలను మార్చడం ద్వారా పనిచేస్తుంది.
- దాగిన శక్తి: ప్రక్రియ కనబడదు, ఫలితం తప్పక కనబడుతుంది.
- సంపూర్ణ పరివర్తన: "అంతయు
పులియబారెను." రాజ్యం జీవితంలోని ఏ భాగాన్నీ వదలదు: ఆలోచనలు, సంబంధాలు, పనులు, సమాజం.
- చిన్నదైనా గొప్ప ప్రభావం: కొద్దిమంది శిష్యులు ప్రపంచాన్ని మార్చగలరు.
ఆవగింజ ఉపమానం దేవుని రాజ్యం యొక్క పరిమాణాన్ని, పులిసిన
పిండి దైవ రాజ్య గుణాన్ని చూపుతుంది. సంఘం సంఖ్యలో పెరగాలి, లోతులో
రూపాంతరం కూడా చెందాలి. సంఖ్య మాత్రమే ఉండి మార్పు లేకపోతే అది పైపై విస్తరణ.
మార్పు ఉండి బయటికి వ్యాపించకపోతే అది అసంపూర్ణం.
తిరుసభ బోధన
ఇప్పటికే – ఇంకా లేదు. దేవుని రాజ్యం యేసు
ప్రభువు రాకతో ఆరంభమైంది ("దేవుని
రాజ్యం మీ మధ్యనే ఉన్నది", లూకా 17:21). కానీ అది
ఇంకా సంపూర్ణం కాలేదు. ఆవగింజ ఇంకా పెరుగుతోంది, పులిసిన
పిండి ఇంకా పనిచేస్తోంది.
దేవుని కృప ప్రధానం. రెండు
ఉపమానాల్లోనూ ఫలితానికి కారణం దేవుని శక్తి. మానవుని పాత్ర కేవలం నాటడం, కలపడం
మాత్రమే. కాథలిక్ బోధనలో దేవుని కృప, మన సహకారం
రెండూ ఉన్నాయి: దేవుడు ఆరంభిస్తాడు, మన సహకారంతో నెరవేరుస్తాడు.
ఆధ్యాత్మిక అన్వయం
వ్యక్తిగత జీవితంలో. చిన్న
ఆరంభాలను తృణీకరించవద్దు. ఒక చిన్న
ప్రార్థన, ఒక క్షమాపణ, ఒక చిన్న
సేవ దేవుని చేతిలో గొప్ప ఫలమిస్తాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల ఒక్క రోజులో జరగదు.
మార్పు నెమ్మదిగా ఉన్నప్పుడు నిరాశ చెందకుండా, నిన్నటి
కంటే ఈ రోజు దేవునికి దగ్గరగా ఉన్నానా అని చూసుకోవాలి. పులిసిన పిండి మన అంతర్గత
పరివర్తన గురించి కూడా ప్రశ్నిస్తుంది. దేవుని వాక్యం నా జీవితంలో ఒక మూలలోనే ఉందా, లేక ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు
అన్నింటినీ మారుస్తోందా? అని చూసుకోవాలి.
కుటుంబంలో. కుటుంబం
విశ్వాసపు మొదటి తోట, మొదటి వంటగది. తల్లిదండ్రులు
పిల్లల హృదయాల్లో నాటే విశ్వాస విత్తనాలు సంవత్సరాల తరబడి పెరుగుతాయి. ఒక తల్లి
నిశ్శబ్ద ప్రార్థన, ఒక తండ్రి నిజాయితీ, ఇల్లంతటినీ
మారుస్తాయి. తరతరాలకు విశ్వాసాన్ని అందించడంలో తల్లుల పాత్ర అమూల్యం.
సంఘంలో. సంఖ్యాబలం
కాదు, సాక్ష్య బలం ముఖ్యం. భారతదేశంలో క్రైస్తవులు
చిన్న సమూహమే అయినా, విద్య, వైద్యం, సేవా
రంగాల్లో వారి ప్రభావం ఎంతో ఉంది. అయితే అది వినయంతో నెరవేరాలి, గర్వంతో
కాదు. అలాగే సంఘం ఆవ చెట్టులా పేదలకు, బాధితులకు, వెలివేయబడినవారికి, సంశయించేవారికి
ఆశ్రయ స్థలంగా ఉందా అని పరిశీలించుకోవాలి.
సమాజంలో. క్రైస్తవులు
సమాజానికి ఉప్పు, వెలుగు, పులిసిన
పిండి. పులిసిన పిండి పిండి నుండి వేరుగా ఉంటే ప్రయోజనం లేదు, కలిస్తేనే
పనిచేస్తుంది. కానీ పూర్తిగా కలిసిపోయి తన స్వభావాన్ని కోల్పోయినా ప్రయోజనం లేదు.
న్యాయం, కరుణ, సత్యం, శాంతి
విలువలను లోపలి నుండి నింపుతూ, మన విశ్వాస ప్రత్యేకతను
కాపాడుకోవాలి. అంతరంగ పరివర్తన అంటే అన్యాయాన్ని మౌనంగా సహించడం కాదు. దేవుని
ప్రేమ హృదయాన్ని మార్చినప్పుడు, మనిషి బాధితుల పక్షాన నిలబడి
శాంతియుతంగా న్యాయం కోసం కృషి చేస్తాడు.
నిరాశ సమయాల్లో. లోకం చెడు
వార్తలతో నిండినట్లు, ప్రయత్నాలు ఫలించనట్లు
అనిపించినప్పుడు, దేవుడు ఇప్పటికీ దాగి
పనిచేస్తున్నాడని ఈ ఉపమానాలు గుర్తు చేస్తాయి. విత్తనం మట్టి కింద కనబడకపోయినా
చనిపోలేదు. పులిసే ప్రక్రియ కనబడకపోయినా ఆగిపోలేదు. కనుక మన ప్రయత్నం నిరంతరం జరుగుతూనే
ఉండాలి.
సాధారణ అపార్థాలు. దేవుని రాజ్యం
ఇప్పటికే పూర్తిగా వచ్చేసిందనుకోవడం పొరపాటు. మనమే రాజ్యాన్ని
నిర్మిస్తున్నామనుకోవడం కూడా పొరపాటు. సంఖ్యా బలమే విజయ కొలమానమనుకోవడం మరో
పొరపాటు. దాగి ఉండటం అంటే నిష్క్రియత కాదు. విత్తనం, పులిసిన
పిండి నిశ్శబ్దంగానే అయినా నిరంతరం పనిచేస్తాయి.
ధ్యాన ప్రశ్నలు
- నా జీవితంలో దేవుడు నాటిన ఏ "ఆవగింజలను" నేను అల్పంగా
భావించి విస్మరిస్తున్నాను?
- దేవుని వాక్యమనే పులిసిన పిండి నా జీవితంలో ఏ భాగాల్లో ఇంకా కలవలేదు?
- నా కుటుంబంలో, పనిస్థలంలో, సమాజంలో నేను పులిసిన పిండిలా ఎలా ఉండగలను?
- ఫలితం కనబడనప్పుడు నేను సహనంతో ఎదురుచూడగలనా?
- నా సంఘం, నా కుటుంబం ఎవరికైనా
ఆశ్రయ స్థలంగా ఉన్నాయా? ఎవరైనా వెలుపల నిలిచి
ఉన్నారా?
ప్రార్థన
ప్రభువా! మీరు చిన్నవాటిలో గొప్ప కార్యాలు చేస్తారు, మీ రాజ్యపు విత్తనాన్ని మా
హృదయాల్లో నాటినందుకు వందనాలు. మా అల్పమైన విశ్వాసాన్ని, బలహీనమైన
ప్రయత్నాలను మీ చేతుల్లో ఉంచుతున్నాము. మీ కృపతో వాటిని పెంచి ఫలింపజేయండి. పులిసిన
పిండిలా మీ వాక్యం మా ఆలోచనలను, మాటలను, క్రియలను మా లోపలి నుండి రూపాంతరం చేసేలా చేయండి. నిరాశ
సమయాల్లో మీరు మాలో దాగి
పనిచేస్తున్నారని మాకు గుర్తు చేయండి. ఆమేన్.
మన పిలుపు స్పష్టం: విశ్వాసంతో విత్తడం, సహనంతో వేచి
ఉండటం, వినయంతో సేవ చేయడం, పెరుగుదలను
దేవునికి వదిలివేయడం. దైవరాజ్య విజయం దేవుని చేతిలో ఉంది. మన పాత్ర విశ్వసనీయంగా
ఉండటమే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి