సకల పునీతుల పండుగ: పవిత్రతకు పిలుపు, పరలోక నిరీక్షణ
సకల పునీతుల మహోత్సవం: పవిత్రతకు పిలుపు, పరలోక నిరీక్షణ
నవంబరు 1న శ్రీసభ సకల పునీతుల మహోత్సవాన్ని
జరుపుకుంటుంది. ఇది కేవలం తిరుసభ చరిత్రలోని
గొప్పవారిని తలచుకునే రోజు కాదు. మన విశ్వాస గమ్యాన్ని, మన పిలుపును, మన
నిరీక్షణను గుర్తుచేసే పండుగ. మనకు తెలిసిన పునీతులతో పాటు, ఎవరికీ
తెలియకుండా నిశ్శబ్దంగా పవిత్ర జీవితం గడిపి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న
లెక్కలేనంత మందిని ఈ రోజు స్మరిస్తాం.
ప్రధాన సందేశం
పవిత్రత కొద్దిమందికే పరిమితం కాదు. బాప్తిస్మం
పొందిన ప్రతి క్రైస్తవునికీ దేవుడిచ్చిన పిలుపు ఇది. పునీతులు పుట్టుకతోనే
పునీతులు కాలేదు. వారికీ బలహీనతలు ఉన్నాయి, శోధనలు వచ్చాయి, తప్పులు
జరిగాయి. కానీ వారు దేవుని కృపకు స్పందించి, పడిపోయిన ప్రతిసారీ ఆయన వైపే తిరిగారు. పవిత్రత అంటే
దేవునితో సన్నిహిత సంబంధంలో జీవించడం, ఆయన చిత్తాన్ని జీవితానికి
కేంద్రంగా చేసుకోవడం, మన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో
క్రీస్తును ప్రతిబింబించడం.
"మీ పరలోకపు తండ్రి
పరిపూర్ణుడై యున్నట్లు మీరును పరిపూర్ణులై యుండుడి" (మత్తయి 5:48),
"పవిత్రులై యుండుడి; ఏలయనగా నేను పవిత్రుడను"
(1 పేతురు 1:16) అనే వాక్యాలు ఈ పిలుపుకు
ఆధారం.
నేటి మూడు పఠనాలు
దర్శన గ్రంథము 7:2-4, 9-14లో యోహాను ఒక
అద్భుత దర్శనం చూసాడు. ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి ప్రజ, ప్రతి భాష
నుండి వచ్చిన లెక్కించలేనంత జనసమూహం తెల్లని వస్త్రాలతో, చేతుల్లో
ఖర్జూరపు మట్టలతో దేవునిసింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలిచి ఉన్నారు.
ఇందులో నాలుగు సత్యాలు ఉన్నాయి.
- పరలోకం అందరికీ తెరిచి ఉంది. కులం, భాష, సంపద, చదువు అక్కడ అడ్డు కావు.
- వారు "మహా శ్రమల నుండి వచ్చినవారు". కష్టాలు పవిత్రతకు
అడ్డంకి కావు.
- వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతికి తెల్లగా చేసుకున్నారు.
పునీతులు స్వశక్తితో పవిత్రులు కాలేదు, క్రీస్తు కృపలో శుద్ధి
పొందారు. అందుకే ఎంత పాపులమైనా మనకు దేవుని కృపతో పవిత్రత పొందే అవకాశం ఉంది.
- వారి పాట తమ గొప్పతనం గురించి కాదు,
" దేవుని స్తుతి. పునీతుల జీవితానికి
కేంద్రం వారు కాదు, దేవుడు.
కీర్తన 24. "ప్రభు
పర్వతాన్ని ఎక్కగలవాడెవడు?" అని అడిగి, "నిర్దోషమైన
చేతులు, నిర్మలమైన హృదయం కలవాడు" అని సమాధానం
చెబుతుంది. చేతులు మన క్రియలకు, హృదయం మన ఉద్దేశ్యాలకు
గుర్తు. కీర్తన చివరన "ఆయనను ఎదకువారు ఇట్టి వారే" అంటుంది. పునీతుడు
ఎప్పుడూ పడిపోనివాడు కాదు, పడినప్పుడు తిరిగి దేవుణ్ణి
వెదకినవాడు.
1 యోహాను 3:1-3. " తండ్రి
మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు! ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమవలననే మనము దేవుని
బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగ మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు.
అందువలననే అది మనలను కూడ ఎరుగదు. ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు.
క్రీస్తు దర్శనము ఇచ్చునపుడు ఆయన యథార్గ రూపమును మనము చూతుము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును. క్రీస్తుయందే
తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు, క్రీస్తు
పవిత్రుడైనట్లే, తనను
పవిత్రునిగ చేసికొనును.!" నిజానికి దేవుని
బిడ్డలమనే గుర్తింపు మన సంపాదన కాదు, బాప్తిస్మంలో లభించిన కానుక.
ఆ కానుకకు తగినట్లు జీవించడమే పవిత్రత. మన గమ్యం కూడా ఇక్కడే వెల్లడవుతుంది.
మత్తయి 5:1-12, అష్టభాగ్యాలలో యేసు ప్రభువు కొండమీద కూర్చొని తన హృదయాన్ని తెరిచారు. ఈ
భాగ్యవచనాలను "పునీతుల రాజ్యాంగం" అనవచ్చు. నిజానికి ఇవి యేసు ప్రభువు ముఖచిత్రమే. ఆయన ఆత్మలో దీనుడు, సాత్వికుడు, కరుణామయుడు, శాంతికారకుడు, నీతి కోసం
హింసింపబడినవాడు. ఈ భాగ్యాలను జీవించినవారే పునీతులు.
|
భాగ్యం |
సారాంశం |
|
ఆత్మయందు
పేదలు |
దేవుని
కృప లేనిదే మనం ఏమీ కాదని గుర్తించే వినయం. అహంకారం దేవునికి దూరం చేస్తుంది. |
|
దుఃఖించువారు |
బాధలో
ఉన్నవారిని దేవుడు మరువడు. కొడుకు అగస్టీను మార్పు కోసం మోనికమ్మ కార్చిన
కన్నీళ్లు వ్యర్థం కాలేదు. |
|
సాత్వికులు |
సాత్వికత
బలహీనత కాదు, అదుపులో ఉన్న బలం. రాళ్లతో
కొట్టబడుతూ కూడా స్తెఫాను శత్రువుల కోసం ప్రార్థించాడు. |
|
నీతికైఆకలిదప్పులు గలవారు |
న్యాయం, సత్యం
కోసం తపన. ప్రవర్తనలో న్యాయం లేని ప్రార్థన అసంపూర్ణం. |
|
కనికరముగలవారు |
జాలి
మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. మదర్
తెరేసా పేదలలో క్రీస్తును చూసి సేవ చేశారు. |
|
హృదయశుద్ధిగలవారు |
బయటి
భక్తి కాదు, లోపలి నిజాయితీ. అసూయ, ద్వేషం
లేని హృదయమే దేవుణ్ణి చూడగలదు. |
|
సమాధానకర్తలు |
గొడవలు
వద్దనుకోవడమే కాదు, కుటుంబాల్లో, ఊళ్లలో
సయోధ్య నిర్మించడం. |
|
నీతినిమిత్తం హింసింపబడినవారు |
అవమానం, నష్టం, మరణం
ఎదురైనా క్రీస్తుకు విశ్వాసపాత్రంగా ఉండటం. |
మొదటి, చివరి భాగ్యవచనాలకు ఒకే
వాగ్దానం ఉంది: "పరలోకరాజ్యము వారిది".
పునీతులు
ఎవరు?
పునీతులు తప్పులే చేయని వారు కాదు. వారు మనలాంటి
మనుషులే.
- పునీత అగస్టీను: యవ్వనంలో తప్పుదారిలో
నడిచి, దేవుని కృపతో మారి, గొప్ప బిషప్పుగా, తిరుసభ పితరునిగా ఎదిగారు.
- పునీత ఫ్రాన్సిస్ అస్సీసీ: సంపన్న కుటుంబంలో పుట్టి, క్రీస్తు పిలుపు విని
పేదరికాన్ని స్వీకరించారు. సృష్టిలోని ప్రతి జీవినీ ప్రేమించారు.
- పునీత పౌలు: ఒకప్పుడు క్రైస్తవులను
హింసించినవాడు.
- పునీత పేతురు: యేసును మూడుసార్లు
ఎరుగనన్నా, తరువాత స్థిరంగా
నిలిచాడు.
- అవిలాపురి తెరేసమ్మ : ప్రార్థనలో ఎండిపోయిన అనుభవాలు, అనారోగ్యం, విమర్శల మధ్య కూడా "దేవుడొక్కడే చాలు" అంటూ జీవించారు.
- చిన్న తెరేసమ్మ: చిన్న పనులను గొప్ప
ప్రేమతో చేసే "చిన్న మార్గాన్ని" చూపారు.
- పునీత మదర్ తెరేసా: కోల్‌కతా వీధుల్లో
పేదలలో, రోగులలో, మరణశయ్యపై ఉన్నవారిలో క్రీస్తును చూశారు. ఏళ్ల తరబడి ఆధ్యాత్మిక
చీకటిలో ఉన్నా సేవ ఆపలేదు.
మఠాల్లోనే కాదు, కుటుంబాల్లోనూ పవిత్రత ఉంది
"పునీతులు సన్యాసులు, మఠాల్లో
ఉన్నవారు, వారికి ప్రార్థనకు సమయం ఉండేది. కుటుంబ జీవితంలో
ఉన్న మాకు ఇది ఎలా సాధ్యం?" అని కొందరు అనుకుంటారు. ఇది
సరైన ఆలోచన కాదు.
- ప్రేమతో పిల్లలను పెంచే తల్లి పవిత్రత వైపు నడుస్తున్నది.
- నిజాయితీగా కుటుంబాన్ని పోషిస్తూ అన్యాయానికి దూరంగా ఉండే తండ్రి
పవిత్రత వైపు నడుస్తున్నాడు.
- చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తన ప్రతిభను సేవకు
వినియోగించే యువకుడు పవిత్రత వైపు నడుస్తున్నాడు.
- ప్రేమతో బోధించే ఉపాధ్యాయుడు, పేద రోగులకు సేవ చేసే
వైద్యుడు, నిజాయితీగా శ్రమించే
రైతు, నిబద్ధతతో పని చేసే ఉద్యోగి కూడా అంతే.
పవిత్రత అంటే లోకాన్ని విడిచిపెట్టడం కాదు, లోకంలో
జీవిస్తూ లోకపు చెడు విలువలకు లొంగకపోవడం. భార్య, తల్లి, అయిన పునీత జియాన్నా బెరెట్టా మోల్లా, సాధారణ
కుటుంబ జీవితాన్ని పవిత్రంగా గడిపిన లూయీ, సేలీ మార్టిన్ దంపతులు దీనికి
సాక్ష్యాలు. మన ఇల్లు పవిత్రతకు పాఠశాల కావాలి, మన కుటుంబం
ప్రార్థనా మందిరం కావాలి, మన పనిస్థలం సేవకు వేదిక
కావాలి.
సత్సంఘ సహవాసం
ప్రతి ఆదివారం మనం విశ్వాస ప్రమాణంలో
"పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను" అని చెబుతాం. శ్రీసభ
ఒక్కటే, కానీ అది మూడు స్థితుల్లో ఉంది:
- యాత్రిక శ్రీసభ: పవిత్రత కోసం
పోరాడుతున్న మనం.
- ఉత్తరించు స్థలంలో ఉన్న వారు: పరలోక
దర్శనానికి సిద్ధపడుతున్న ఆత్మలు. వీరిని నవంబరు 2న, సకల ఆత్మల దినాన
ప్రత్యేకంగా స్మరిస్తాం.
- పరలోక మహిమలో ఉన్న వారు: దేవుని సన్నిధిలో ఆనందిస్తున్న పునీతులు.
మరణం క్రీస్తు ప్రభువుతో మనకు ఉన్న ఈ ప్రేమ బంధాన్ని తెంచలేదు (రోమా 8:38-39). మనం
పునీతులను గౌరవిస్తాం, వారి మధ్యవర్తిత్వాన్ని
కోరతాం, ఉత్తరించు ఆత్మల కోసం ప్రార్థిస్తాం, భూమిపై
ఒకరికొకరు తోడుగా ఉంటాం. హెబ్రీయులు 12:1 లోని "సాక్షుల గొప్ప
మేఘం" అని చూస్తాము. పరుగు పందెంలో ఉన్న క్రీడాకారుని చుట్టూ ప్రేక్షకులు
ఉత్సాహపరిచినట్లు, పునీతులు మనల్ని చూస్తూ
"నీవూ చేరగలవు!" అని ప్రోత్సహిస్తున్నారు.
పండుగ చరిత్ర
- తొలి శతాబ్దాలు: రోమన్ హింసల కాలంలో
క్రైస్తవులు మరణ సాక్షులను అపారమైన గౌరవంతో స్మరించేవారు. వారి సమాధుల వద్ద, వారి మరణ దినాన దివ్యబలి అర్పించేవారు. డయోక్లీషియన్ హింసల కాలంలో
అమరుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే ప్రతి ఒక్కరికీ వేరే రోజు కేటాయించడం
అసాధ్యమైంది. అప్పుడు అందరికీ కలిపి ఈ పండుగ రూపుదిద్దుకుంది.
- క్రీ.శ. 609/610: 4 వ బోనిఫేస్ పోపుగారు అన్యమత పాంథియాన్ దేవాలయాన్ని క్రైస్తవ
ఆలయంగా మార్చి మరియమాతకు, వేద సాక్షులందరికి అంకితం
చేశారు. సంప్రదాయం ప్రకారం ఇది మే 13న జరిగింది.
- 8వ, 9వ
శతాబ్దాలు: 3 వ గ్రెగరీ పోపు గారు
సెయింట్ పీటర్స్ బసిలికాలో సకల పునీతులకు ఒక ప్రార్థనా మందిరాన్ని
ప్రతిష్ఠించారు, దాని పండుగ నవంబరు 1న వచ్చింది. తరువాత 4 వ గ్రెగరీ పోపుగారు
(సుమారు
క్రీ.శ. 835) ఈ
పండుగను విశ్వశ్రీసభ అంతటికీ విస్తరించారు. అప్పటి నుండి నవంబరు 1 సకల పునీతుల మహోత్సవంగా స్థిరపడింది.
నేటి ప్రపంచానికి పునీతుల అవసరం
మనిషి చంద్రునిపైకి వెళ్తున్నాడు, కృత్రిమ
మేధను అభివృద్ధి చేస్తున్నాడు. కానీ సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ నైతికంగా కూడా
ఎదుగుతున్నామా? డబ్బు కోసం బంధాలను త్యాగం
చేస్తున్నాం, అధికారం కోసం ఇతరులను అణగదొక్కుతున్నాం, కుటుంబాల్లో
ప్రేమ తగ్గి స్వార్థం పెరుగుతోంది, సామాజిక మాధ్యమాలు అసూయను, అపార్థాలను
పెంచుతున్నాయి, పేదలు, వృద్ధులు, అనాథలు
నిర్లక్ష్యానికి గురవుతున్నారు, మతం పేరుతో విభేదాలు
పెరుగుతున్నాయి.
ఈ ప్రపంచానికి మరింత సంపద కలిగినవారు కాదు, మరింత
అధికారం కలిగినవారు కాదు, పునీతులు కావాలి. ప్రేమించే, క్షమించే, నిజం
మాట్లాడే, పేదలకు అండగా నిలిచే, శాంతిని
నిర్మించే పునీతులు మన కుటుంబాల్లో, పాఠశాలల్లో, సంఘాల్లో, సమాజ
వ్యవస్థల్లో కావాలి.
ఈ పండుగ మనకు నాలుగు వరాలు ఇస్తుంది:
- నిరీక్షణ: మరణం ఓటమి కాదు, నిత్యజీవానికి ద్వారం. క్రీస్తు మరణాన్ని జయించారు.
- దిశ: మన గమ్యం లోక విజయం కాదు, దేవునితో శాశ్వత ఐక్యత.
- ఆదర్శం: సువార్తను ఆచరణలో చూపే
సజీవ సాక్ష్యాలు పునీతులు.
- ఐక్యత: కులం, భాష, దేశం, తరం అనే భేదాలు దాటి మనమందరం ఒకే దేవుని కుటుంబం.
పునీతులు
నేర్పే ఐదు పాఠాలు
- ప్రార్థన లేనిదే పవిత్రత లేదు. దివ్యసత్ప్రసాదం, దైవవాక్య ధ్యానం, నిశ్శబ్ద ప్రార్థన, జపమాల, ఆరాధన ద్వారా దేవునితో బంధాన్ని పెంచుకోవాలి.
- ప్రేమే పవిత్రతకు కొలమానం. ఎంత జ్ఞానమున్నా, ఇతరులను ప్రేమించకపోతే
ఆధ్యాత్మికత అసంపూర్ణం (1 కొరింథీ 13).
- త్యాగం లేకుండా పవిత్రత లేదు. సౌకర్యాన్ని వదులుకోవడం, కుటుంబానికి సమయం ఇవ్వడం, కోపాన్ని అదుపు చేసుకోవడం, క్షమించడం, ఇవన్నీ చిన్న త్యాగాలే.
- దేవుని చిత్తానికి విధేయత. గెత్సేమనేలో యేసు ప్రార్థించినట్లు,
"నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక."
- చివరి వరకు నిలకడ. పవిత్రత ఒక్కరోజులో
రాదు. పడిపోయినా తిరిగి లేచి దేవుని వైపు నడవాలి.
ధ్యాన ప్రశ్నలు: నా
విశ్వాసాన్ని తీర్చిదిద్దిన "మా ఇంటి పునీతులు" ఎవరు? భాగ్యవచనాల్లో
నాకు అత్యంత దూరంగా ఉన్నది ఏది? పవిత్రత నాకు సాధ్యం కాదన్న
భావన నాలో ఎందుకు ఉంది? పరలోకంపై నా ఆశ ఎంత బలంగా
ఉంది?
నీవు కూడా
పునీతుడవగలవు
యోహాను చూసిన ఆ గొప్ప జనసమూహం ఇంకా
పూర్తికాలేదు. అక్కడ మన స్థానం సిద్ధంగా ఉంది. ఆ రోజు మనం "నేను గొప్ప పనులు
చేశాను" అని చెప్పనవసరం లేదు. "ప్రభువా, నేను
పడిపోయాను, కానీ నీ కృపతో లేచాను. నేను బలహీనుడను, కానీ నిన్ను
వెదకాను. నా వస్త్రాలను నీ రక్తంలో పవిత్రపరుచుకున్నాను" అని చెప్పగలిగితే
చాలు.
పునీతత్వం అంటే మనం దేవుని వైపు వేసే అడుగులు
మాత్రమే కాదు, మన వైపు దేవుడు నిరంతరం చాచే కృపాహస్తాన్ని
స్వీకరించడం కూడా. పునీతులు చేయగలిగితే, క్రీస్తు కృపతో మనమూ చేయగలం.
ప్రార్థన
ప్రభువా, మీ సన్నిధిలో అసంఖ్యాక పునీతులను స్మరించుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారిలో పనిచేసిన నీ కృపవరము మాలో కూడా పనిచేయునట్లు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని, వినయాన్ని, ప్రేమను, త్యాగస్ఫూర్తిని మాకు ప్రసాదించండి. స్వార్థం నుండి మమ్మల్ని విడిపించి, ద్వేషం నుండి కాపాడి, మా అహంకారాన్ని తొలగించి, క్షమించే హృదయాన్ని ఇవ్వండి. మా కుటుంబాలను పవిత్రం చేసి, ఈ లోకంలో మీకు విశ్వాసపాత్రులుగా జీవించి, పరలోకంలో మీ పునీతులతో కలిసి నిత్యం మిమ్ము స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. ఆమెన్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి