లూకా 16:9-15 వివరణ: దేవుడా? ధనమా? అన్యాయపు సొమ్ము, నమ్మకత్వం

 


 లూకా 16:9-15

“అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన, ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడుగా ఉండును. అల్పవిషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోను నమ్మదగనివాడుగా ఉండును. కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగినవారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? “ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన, వాడు ఒకనిని ద్వేషించు ను, వేరొకనిని ప్రేమించును. లేదా, ఒకనిని అను సరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవ మును, ద్రవ్యమును సేవింపలేరు.” ధనలోభులగు పరిసయ్యులు ఈ మాటలు అన్నియు విని ఆయనను హేళనచేయుచుండగా, యేసు వారితో ఇట్లు పలికెను: “మనుష్యుల యెదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పు కొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును.

అన్యాయపు సొమ్ము, నమ్మకత్వం, దేవుడు-ధనం మధ్య ఎంపిక

పరిచయం

సంపద దేవుడు మనకు  అప్పగించిన సాధనం. దానిని స్వార్థానికి కాక ప్రేమకు, సేవకు వాడాలి. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవారికే గొప్ప బాధ్యతలు అప్పగించబడతాయి. హృదయానికి యజమాని ఒక్కడే ఉండాలి. దేవుణ్ణి, ధనాన్ని ఒకేసారి సేవించలేము. దేవుడు మన అంతరంగ నిజాయితీని చూస్తాడు.

ఈ భాగం యేసు ప్రభువు బోధనల్లో అత్యంత సవాలుతో కూడినది. దీనిని అర్థం చేసుకోవాలంటే ముందు దీని నేపథ్యమైన ఉపమానాన్ని చూడాలి.

ఉపమానం నుండి బోధకు

16:1-8 ఉపమానంలో ఉద్యోగం పోనున్న ఒక నిర్వాహకుడు, భవిష్యత్తులో ఆదరణ పొందడానికి యజమాని బాకీదారుల రుణాలను తగ్గించాడు. యజమాని అతని అన్యాయాన్ని కాదు, అతని ముందుచూపును, నిర్ణయాత్మకతను మెచ్చుకున్నాడు. యేసు ప్రభువు కూడా అవినీతిని ఆమోదించడం లేదు. లోకసంబంధులు తాత్కాలిక లాభం కోసం ఇంత తెలివి చూపితే, వెలుగు సంబంధులు శాశ్వతమైన దాని కోసం ఇంకెంత తెలివిగా, ఉదారంగా ఉండాలి అన్నదే ఆయన వాదన. మరణం, తీర్పు, నిత్యజీవం సమీపిస్తున్నాయని గ్రహించి, ధనం, సమయం, సామర్థ్యాలను ఇప్పుడే శాశ్వతమైన దాని కోసం వినియోగించాలి. ఈ పిలుపు నుండే 9వ వచనం మొదలవుతుంది.

 అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు

"అన్యాయపు సొమ్ము" అనే పదానికి మూలం అరామిక్ "మామోన్", అంటే ధనం, భౌతిక సంపద. లోక ధనం తరచు దోపిడీ, మోసం, అసమానతలతో ముడిపడి ఉంటుంది, అది అస్థిరమైనది, మనిషిని లోబరచుకొని యజమానిగా మారగలదు. అయినా ధనం స్వతహాగా చెడ్డది కాదు, అది ఒక సాధనం. దానిని ఎలా వాడతామన్నదే ముఖ్యం.

"స్నేహితులను సంపాదించుకొనుట" అంటే ఆకలిగొన్నవారికి, పేదలకు, రోగులకు, నిరాశ్రయులకు, విద్యకు, దైవరాజ్య వ్యాప్తికి సంపదను వినియోగించడం. ఈ అత్యల్పులలో ఒకనికి మీరు ఏది చేసితిరో, అది నాకే చేసితిరి అని ప్రభువు చెబుతారు. (మత్తయి 25:40). మరణంలో ఆస్తులు, బ్యాంకు నిల్వలు మనతో రావు (1 తిమోతి 6:7), కానీ మనం చేసిన ప్రేమ కార్యాలు దేవుని ముందు నిలుస్తాయి. "నిత్యనివాసములు" అంటే పరలోకంలోని శాశ్వత నివాసాలు (యోహాను 14:2).

 దీని అర్ధం "డబ్బుతో పరలోకాన్ని కొనవచ్చు" అని కాదు. రక్షణ దేవుని కృపా వరం. అయితే విశ్వాసం ప్రేమ ద్వారా క్రియాశీలమవుతుంది (గలతీ 5:6), దానధర్మాలు చేయడం ఆ విశ్వాసపు ఫలం. లోక వస్తువులకు "సార్వత్రిక గమ్యం" ఉంది, అంటే మన ఆస్తికి సామాజిక బాధ్యత ఉంటుంది. ఇది మఠాలు, పాఠశాలలు, ఆసుపత్రుల ఆస్తులకు కూడా వర్తిస్తుంది. ధనాన్ని ఎలా వాడాలో చెప్పిన యేసు ప్రభువు, తర్వాత ఆ వాడకానికి పునాదియైన నమ్మకం గురించి చెబుతారు.

 నమ్మకత్వపు సూత్రం

"స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడుగా ఉండును." నమ్మకత్వం పరిమాణంపై ఆధారపడదు, అది ఒక స్వభావం. ఎవరూ చూడనప్పుడు కూడా నిజాయితీగా ఉండటమే నిజమైన పరీక్ష. గ్రీకు పదం "పిస్టోస్" నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని రెండింటినీ సూచిస్తుంది. అంటే క్రైస్తవ విశ్వాసం కేవలం నమ్మడం కాదు, విశ్వసనీయంగా జీవించడం. చిన్న అబద్ధం, చిన్న మోసం, చిన్న అలక్ష్యం క్రమంగా పెద్ద పతనానికి దారితీస్తాయి. పోతీఫరు ఇంట్లో యోసేపు, గొర్రెల కాపరిగా నమ్మకంగా ఉన్న దావీదు, ఏ ఆరోపణా మోపలేని దానియేలు దీనికి ఉదాహరణలు.

 "ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును?" ఇక్కడ రెండు రకాల సంపదలు ఉన్నాయి. ఈ లోక సంపద అస్థిరం, తాత్కాలికం, అది ఒక పరీక్షా క్షేత్రం. నిజమైన సంపద దేవుని కృప, పరిశుద్ధాత్మ వరాలు, దేవునితో సంబంధం, నిత్యజీవం. భౌతిక సంపదను ఎలా నిర్వహిస్తున్నామన్నది ఆధ్యాత్మిక పరిపక్వతకు కొలమానం. ధనవంతుడవడం దేవుని ఆశీర్వాదానికి ఏకైక గుర్తు కాదు, పేదరికం శాపానికి గుర్తు కాదు. ఈ లోక సంపదలో నిజాయితీగా ఉంటేనే ఆథ్యాత్మిక విషయాలలో భాధ్యతను దేవుడు మనకు ఇస్తాడు.

 "పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగినవారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును?" ఇది ఈ భాగంలోని అత్యంత లోతైన వాక్యం. కీలక భావన నిర్వాహకత్వం. "భూమియు దానిలోనున్న సమస్తమును ప్రభువుదే" (కీర్తన 24:1). మన డబ్బు, ప్రతిభ, సమయం, ఆరోగ్యం అన్నీ దేవుడు అప్పగించినవే, మనం యజమానులం కాదు, నిర్వాహకులం. "మీ సొంతమైనది" అంటే దేవుడు శాశ్వతంగా ఇచ్చే పరలోక వారసత్వం. ఇది నాయకులకు మరింత గంభీరంగా వర్తిస్తుంది. సంఘ ఆస్తులను, మఠ సంపదను, దాతల విరాళాలను వ్యక్తిగత ప్రయోజనానికి వాడకూడదు. ఆర్థిక పారదర్శకత పరిపాలనా నియమం మాత్రమే కాదు, సువార్తకు సంబంధించిన నైతిక బాధ్యత.

నమ్మకంగా నిర్వహించాలంటే ఒక్క యజమానికే మనం విధేయత కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువు తర్వాతి వచనంలో ఎంపిక ప్రశ్నను ముందుకు తెస్తారు.

 ఇద్దరు యజమానులు

"ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు… మీరు దైవమును, ద్రవ్యమును సేవింపలేరు" (మత్తయి 6:24 కూడా చూడండి). ఇక్కడ "సేవకుడు" అంటే ఇంటి దాసుడు, అతని సమయం, శక్తి, విధేయత అన్నీ ఒక్క యజమానికే చెందాలి. ఇద్దరి ఆదేశాలు విభేదించినప్పుడు ఒకరిని ఎంచుకోక తప్పదు. "ద్వేషించుట" అంటే భావోద్వేగ ద్వేషం కాదు, రెండవ స్థానమివ్వడం ఇక్కడ అర్ధం. (లూకా 14:26).

ధనం మంచి సేవకుడే, కానీ చెడ్డ యజమాని. ధనమే లక్ష్యంగా, భద్రతకు ఆధారంగా, జీవిత ప్రాధాన్యతగా మారినప్పుడు విగ్రహారాధన అవుతుంది (కొలొస్సయులకు 3:5). ఎవరైనా ప్రతిరోజూ ప్రార్థిస్తూ, చర్చికి వెళ్తూ ఉండవచ్చు, కానీ అతని నిర్ణయాలన్నింటినీ డబ్బే నియంత్రిస్తుంటే అతని నిజమైన యజమాని ఎవరో తెలుస్తుంది. "ఆదివారం దేవునికి, మిగతా రోజులు ధనానికి" అనే జీవనశైలికి ఇక్కడ చోటు లేదు. తటస్థటకు  స్థానం లేదు, ఎంపిక చేయకపోవడం కూడా ఒక ఎంపికే. ధనం సంపాదించడం పాపం కాదు. దేవుడు యజమాని అయితే ధనం సేవకుడవుతుంది, ధనం యజమాని అయితే మనిషి దాని బానిస అవుతాడు.

పరిసయ్యుల హేళన, యేసు ప్రభువు  ఖండన

ఇక్కడ ఈ బోధను విన్నవారి ప్రతిస్పందన ఎలా ఉందో లూకా చెబుతున్నాడు. 14 వ వచనంలో "ధనలోభులైన" పరిసయ్యులు యేసు ప్రభువును హేళన చేశారు. యూదయా సంప్రదాయంలో సంపద దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా భావించబడేది (ద్వితీయోపదేశకాండము 28), కాబట్టి "ధనాన్ని పేదలకు ఇవ్వాలి" అనే బోధన  వారికి అసంబద్ధంగా అనిపించింది. మన సౌకర్యాన్ని ప్రశ్నించినప్పుడు మన సహజ స్పందన తరచు ఎగతాళి లేదా తిరస్కారమే అవుతుంది. ఇక్కడ ఇదే జరుగుతుంది. దేవుని వాక్కు  మన తప్పులను బయటపెట్టినప్పుడు మనల్ని మనం మార్చుకుంటున్నామా, లేక వాక్యాన్నే ప్రశ్నిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి.

15 వ వచనంలో యేసు ప్రభువు కోపంతో కాక, వారి హృదయ  అంతర్గతాన్ని బహిర్గతం చేస్తున్నారు. వారు మనుష్యుల ఎదుట తమను నీతిమంతులుగా చూపుకుంటున్నారు, ఇది స్వీయ నీతి (లూకా 18:9-14), "వారి అంతరంగములను దేవుడు ఎరుగును". మనుషులు బాహ్యరూపాన్నే చూడగలరు, దేవుడు హృదయాన్ని చూడగలడు (1 సమూయేలు 16:7). మన సేవ వెనుక ప్రేమ ఉందా, పేరు కొరకు కోరిక ఉందా? మన దానం వెనుక కరుణ ఉందా, ప్రశంసల ఆశ ఉందా? "మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండవచ్చు". "అసహ్యం" అనే పదం సాధారణంగా విగ్రహారాధనను వర్ణించడానికి వాడేది. లోకం గౌరవించే ధనం, హోదా, అధికారం దేవుని విలువలకు విరుద్ధం కావచ్చు.

ఇతర లేఖన భాగాలతో సంబంధం

ఈ బోధ బైబిలు అంతటా ప్రతిధ్వనిస్తుంది. మత్తయి 6:19-24 పరలోకంలో సంపద కూడబెట్టమంటుంది. లూకా 12:13-21లో ధనవంతుడైన మూర్ఖుడు తన కోసం ధనం కూడబెట్టుకొని  "దేవుని యెదుట ధనవంతుడు" కాలేకపోయాడు. 1 తిమోతి 6:6-19 ధనాపేక్షను హెచ్చరిస్తూ, ధనవంతులు "సత్కార్యములయందు ధనవంతులు" కావాలంటుంది. తోబీతు 4:7-11, సీరాకు 29:11-12 దానధర్మం పరలోక నిధిగా మారుతుందని చెబుతాయి. సంపద దేవుని అప్పగింత, హృదయం దేవునికే చెందాలి.

వివరణలు

"యేసు ప్రభువు అన్యాయాన్ని ప్రోత్సహించలేదు." ఆయన మెచ్చినది నిర్వాహకుని ముందుచూపు మాత్రమే.

"దానధర్మంతో రక్షణ కొనలేరు." రక్షణ కృప ద్వారా, దానం విశ్వాసపు ఫలం.

"ధనము  చెడ్డది కాదు” దాని  ధనం పట్ల అనురక్తి  చెడ్డది. (1 తిమోతి 6:10).

"ధనవంతులు రక్షణ పొందగలరు" జక్కయ్య, అరిమతయి యోసేపు ధనవంతులై ఉండీ నీతిమంతులయ్యారు.  15వ వచనం  ధనవంతులను కాదు, తప్పుడు విలువలను ఖండిస్తుంది.

"సంపాదన తప్పు కాదు” అది  శ్రమించి సంపాదించాలి. (2 థెస్సలొనీకయులకు 3:10), అది దేవుని చిత్తానికి లోబడి ఉండాలి.

ఆత్మపరిశీలన ప్రశ్నలు

  1. నా జీవితంలో మొదటి స్థానం దేవునికా, ధనానికా?
  2. నా సంపదతో నేను ఎవరిని "స్నేహితులుగా" సంపాదించుకున్నాను?
  3. ఎవరూ చూడనప్పుడు, చిన్న విషయాల్లో నేను నమ్మదగినవాడినా?
  4. ఇతరుల నిధులు, విరాళాలు, సంస్థ ఆస్తులను న్యాయంగా వాడుతున్నానా?
  5. నా బాహ్య భక్తికి, అంతరంగ జీవితానికి మధ్య తేడా ఉందా?
  6. నేను మనుష్యుల మెప్పు కోసం జీవిస్తున్నానా, దేవుని మెప్పు కోసమా?
  7. నా సంపద నా జీవితానికి సాధనమా, యజమానా?

ముగింపు

యేసు ప్రభువు మూడు స్పష్టమైన సందేశాలు ఇస్తున్నారు. మొదటిది, ధనం నశించిపోతుంది, కానీ ధనం ద్వారా చూపిన ప్రేమ శాశ్వతం. రెండవది, నమ్మకత్వం చిన్న విషయాల్లోనే మొదలై అక్కడే రుజువవుతుంది. మూడవది, హృదయానికి ఒకే యజమాని ఉండాలి, అతడు దేవుడే. మనుష్యులు గొప్పగా భావించేది దేవుని దృష్టిలో విలువ లేనిది కావచ్చన్న హెచ్చరిక మనల్ని వినయంలోకి నడిపిస్తుంది.

యేసు ప్రభువు  ధనాన్ని, సరిగ్గా వాడమని పిలుస్తున్నారు. ఆకలిగొన్నవారికి ఆహారం, నిరాశ్రయులకు ఆశ్రయం, పేద పిల్లలకు చదువు, రోగులకు సహాయం, ఒంటరివారికి తోడు ఇవ్వడం ద్వారా మన సంపద క్రీస్తు ప్రేమకు సాక్ష్యమవుతుంది, మన జీవితమే సజీవ సువార్త అవుతుంది. "ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును?" ఈ ప్రశ్న నేడు మనందరిని అడుగుతున్నారు.

ప్రార్థన

ప్రభువా! మా సొంతమని భావించే అన్నిటికీ యజమానివి మీరే అని గుర్తించే వివేకాన్ని మాకు ప్రసాదించండి. మీ ఆస్తికి నమ్మకమైన నిర్వాహకులమై, చిన్న విషయాల్లోనూ విశ్వసనీయంగా ఉండేలా చేయండి. ధనం మాకు యజమాని కాకుండా, మీ ప్రేమను పంచే సాధనంగా వాడెలా చేయండి. మనుష్యుల మెప్పు కాక, మా హృదయాన్ని మీరు మెచ్చుకునేల చేయండి. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి