పునీత చిన్న తెరేజమ్మ: దేవుని ప్రేమ, చిరు మార్గం ఆధ్యాత్మికత
దేవుని సాక్షి – చిన్న తెరేజమ్మ
పునీత చిన్న తెరేజమ్మకు 19 వ శాతాబ్దంలో దేవుని గురించి ఉన్న కొన్ని సిద్దాంతాల కంటే దేవుని గురించి ఆమెకు వున్న అవగాహన
చాలా గొప్పది. ఆమె అవగాహనకు ప్రధాన ఆధారం పవిత్ర గ్రంథం. ఆమెకు ఉన్న అవగాహన పవిత్ర గ్రంథమంతటా
ప్రత్యక్షమయ్యే, మానవాళిని ప్రేమించే దేవుడు.
దేవునికి దూరమైనవారిని, పాపులను, బలహీనులను
ఆయనకు దగ్గర చేయడమే ఆమె ఆధ్యాత్మిక సందేశంలోని ప్రధాన లక్షణం.
ఆమె జీవించిన రోజులలో చాలామంది దేవుణ్ణి కఠినమైన న్యాయమూర్తిగా, పాపులను
శిక్షించడానికి సిద్ధంగా ఉన్నవానిగా భావించేవారు. ముఖ్యంగా జాన్సెనిస్టు సిద్దాంత ప్రభావంతో దేవుని న్యాయానికి అతిగా ప్రాధాన్యం
ఇచ్చి, ఆయన ప్రేమను మరచిపోయేవారు. దేవుడంటే ఉన్న ఈ భయం
మనుషులను దేవుని దగ్గరకు తీసుకురాకుండా అడ్డుకుంటుందని తెరేజమ్మ గ్రహించింది.
అందుకే దేవుడు కరుణామయుడని, తల్లిలా మృదువుగా
ప్రేమిస్తాడని, మనం అర్హులం కాకపోయినా ఆయనకు
మనలను మనము అప్పగించుకోవచ్చని ఆమె నమ్మి తన
జీవితలో, మాటలలో దానిని వ్యక్త పరిచింది.
చిన్న తెరేజమ్మ దృష్టిలో దేవుడు అందరినీ షరతులు లేకుండా ప్రేమిస్తాడు. తన
మహోన్నత స్థితి నుంచి చిన్నవారి దగ్గరకు దిగివచ్చాడు. ఆయన మన రోజువారీ జీవితంలో ఉంటాడు.
మన ఆత్మలో నేరుగా పని నిర్వహిస్తాడు. ఈ
దేవుని ప్రేమను విశ్వసించి, సంపూర్ణంగా ఆయనకు
అంకితమవ్వడమే ఆమె ఆధ్యాత్మిక జీవితానికి పునాది.
1. మొదట దేవుడే మనలను ప్రేమించాడు
దేవుని ప్రేమే అన్నిటికన్నా గొప్పదని తెరేజమ్మకు
స్పష్టమైన అవగాహన ఉంది. ఆమె ఆధ్యాత్మికతకు కార్మెల్ సంప్రదాయం పునాది. అవిలాపురి తెరేసమ్మ నుండి దేవుడే సమస్తానికి కేంద్రం అని, మానవుడు తన ఉన్నదంతా
దేవుని నుండే పొందుతాడని నేర్చుకుంది.
దేవుడు మన యోగ్యతలను బట్టి ప్రేమించలేదు, మనం ఆయనను
ప్రేమించకముందే మనలను ఆయన ప్రేమించాడు. “దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనము
ప్రేమింతుము” అనే 1 యోహాను 4:19 వాక్యం ఆమె
ఆలోచనలకు ఆధారం. యేసు ప్రభువు కూడా “మీరు
నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మ ఎన్నుకోంటిని ”
అని చెబుతాడు. దేవునితో మన సంబంధంలో మొదటి చొరవ ఎల్లప్పుడూ ఆయన ప్రేమదే. ఆ ప్రేమకు
మనం విశ్వాసంగా ప్రేమతో స్పందిస్తాము.
తెరేజమ్మ ఆత్మకథ ప్రారంభంలోనే దేవుని కరుణను
స్మరించుకుంటుంది. తన జీవిత చరిత్రను తన గొప్పతనానికి సంబంధించిన కథగా కాకుండా, తనలో దేవుడు
చేసిన కార్యాల చరిత్రగా చూస్తుంది. తనకు లభించిన పిలుపు, వరాలు, అనుగ్రహాలు
తన యోగ్యత వల్ల వచ్చినవి కావని గుర్తిస్తుంది.
దేవుని ప్రేమ, కరుణలను
అర్థం చేసుకోవడానికి నిర్గమకాండం 34:6, కీర్తన 103:8, రోమా 9:16 వంటి
వాక్యాలను ఆమె ప్రాముఖ్యంగా స్వీకరించింది. దేవుడు కరుణామయుడు, దయగలవాడు, కోపానికి
నెమ్మదిగలవాడు. ఆయన కరుణ మానవుని ప్రయత్నాలకన్నా గొప్పది. ఈ ఆలోచన కలిగి ఉండటం ద్వారా ఆమె దేవుని న్యాయం, శక్తి, మహిమలను నిరాకరించలేదు.
ప్రకృతి అందాలను చూసినప్పుడు ఆయన గొప్పతనాన్ని గుర్తించింది. అయినప్పటికీ దేవుని
కరుణను ధ్యానించినప్పుడే ఆయనను అత్యంత సన్నిహితంగా అనుభవించింది.
దేవుడు తండ్రి మాత్రమే కాదు, తల్లిలా
కూడా మృదువుగా ప్రేమిస్తాడని ఆమె చెప్పింది. “దేవుడు తల్లి కన్నా మృదువైనవాడు” అనే
ఆమె భావన దేవుని కరుణను తెలియజేస్తుంది. ఆయన ప్రేమ పేదలను, బలహీనులను, పాపులను
వెదికి, వారిని తనవారిగా మార్చుతుంది. దేవుడు యోగ్యులను
మాత్రమే పిలవడు; తాను ప్రేమించేవారిని
పిలుస్తాడు.
ప్రార్దనలో, నిత్య జీవితంలో అసాధారణ దర్శనాలు, ఆధ్యాత్మిక
ఓదార్పులు పొందడంకన్నా దేవుణ్ణి ప్రేమించడం ముఖ్యమని తెరేజమ్మ భావించింది.
ప్రార్థనలకు వెంటనే సమాధానం లభించకపోయినా, విశ్వాసపు చీకటిలో
జీవించాల్సి వచ్చినా దేవునిపై ప్రేమ తగ్గకూడదు అని చెబుతూ దానినే పాటించింది.
దేవుని ప్రేమ ఉచితమైన వరం. మనిషి పాపి
అయినప్పటికీ దేవుడు తన కృపను సమృద్ధిగా అందిస్తాడు. చిన్న తెరేజమ్మ తనను తాను
బలహీనమైన చిన్న పక్షితో పోల్చుకుంది. తనలో గొప్ప పనులు చేసే శక్తి లేకపోయినా, ప్రేమించే
శక్తి ఉందని నమ్మింది. స్వచ్ఛమైన ప్రేమతో చేసే చిన్న పని కూడా గొప్ప మేలు చేస్తుందని పునీత సిలువ యోహాను బోధనను ఆమె తరచుగా గుర్తుచేసుకుంది.
మనిషి తన పనుల ద్వారా రక్షణను సంపాదించలేడు.
చివరి వరకు విశ్వాసంలో నిలబడటం కూడా దేవుని కృపే. దేవునికీ మనిషికీ మధ్య ఉన్న
అపారమైన దూరాన్ని దేవుడే తన ప్రేమతో అధిగమిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించిన తెరేజమ్మ
విశ్వాసపు చీకటిలోనూ ఆశను విడిచిపెట్టలేదు.
2. మహోన్నతుడైన దేవుడు వినయుల దగ్గరకు దిగివస్తాడు
చిన్న తెరేజమ్మ
ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైన అంశం దేవుని మహోన్నత, ఆయన
సాన్నిహిత్యం రెండింటినీ కలిపి అర్థం చేసుకోవడం. దేవుడు సర్వోన్నతుడు అయినప్పటికీ
చిన్నవారి దగ్గరకు దిగివస్తాడు. బలహీనులను ప్రేమిస్తాడు. తన గొప్పతనాన్ని ఇతరులను
అణచివేయడంలో కాకుండా, తనను తాను తగ్గించుకోవడంలో
చూపిస్తాడు.
ఆమె దేవుణ్ణి “మంచి దేవుడు” అని ప్రేమతో
సంబోధించేది. ఈ మాట దేవుని పట్ల ఆమెకున్న సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. అయితే
దేవుడు సన్నిహితుడని చెప్పడం ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవచ్చని కాదు. ఆయన మన
అంతరంగంలో ఉన్నప్పటికీ, మన బుద్ధికి పూర్తిగా అందని
పరమ రహస్యం.
మనిషి తన శక్తితో దేవుని దగ్గరకు చేరలేడు. ఆయన
కృపపై ఆధారపడాలి. తెరేజమ్మ తనను తాను దేవుని ముందు పేదరాలిగా భావించి, అన్నింటినీ
ఆయన నుండే ఆశించింది.
దేవుడు వినమ్రుల హృదయాల్లోకి ప్రవేశించడానికి
తనను తాను తగ్గించుకుంటాడని ఆమె తెలిపింది. ఆయన మహిమ తన అధికారాన్ని
ప్రదర్శించడంలో కాక, బలహీనులను ఆదుకోవడంలో
కనిపిస్తుంది. “వినాశనకరమైన గోతినుండి, బురదగుంటలనుండి
అతడు ఆయన నన్ను బయటికి లాగెను. నన్ను కొండకొమ్మున నిలిపి, నాకు భద్రత కల్పించెను” కీర్తన 40:2. దేవుడు మనం
ఎంత దిగువన వున్న మనలను అడుకుంటాడాని చెబుతుంది. కీర్తన 138:6 ప్రకారం ఆయన
ఉన్నతుడైనా వినయులను ఆడుకుంటాడు. యెషయా 57:15లో ఉన్నతమైన పవిత్ర స్థలంలో
నివసించే దేవుడు నలిగినవారితో, ఆత్మలో అణగినవారితో ఉంటాడని
వెల్లడవుతుంది. “మహోన్నతుడు
శాశ్వతుడు పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: "నేను ఉన్నతమైన
పవిత్రస్థలమున వసించువాడను. అయినను వినయాత్ములును, పశ్చాత్తాప
మనస్కులైన వారితోను వసింతును. వారికి నూత్నబలమును దయచేయుదును.” ఈ విషయాలను ఆమె ఎక్కువగా
గుర్తుపెట్టుకున్నది.
మనతో దేవుని సాన్నిహిత్యం ఆయన గొప్పతనాన్ని
తగ్గించదు. బదులుగా, ప్రేమ ద్వారా తన అనంతమైన
గొప్పతనాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు. అందుకే తెరేజమ్మ దేవుణ్ణి భయంతో దూరంగా
ఉంచకుండా, ప్రేమతో తన దగ్గరకు తీసుకునే తండ్రి కనుక విశ్వాసం
తో ఆయన చెంతకు వెళ్ళమని ప్రోత్సహిస్తుంది.
3. రోజువారీ జీవితంలో దేవుని సంరక్షణ
తెరేజమ్మ తన జీవితంలోని సంఘటనలను దేవుని ప్రేమతో
కలుపుతుంది. తనకు లభించిన వరాలను దేవుని కృపగా, ఎదురైన
బాధలను ఆయన అనుమతించిన అనుభవాలుగా అర్థం చేసుకుంది. రోజువారీ జీవితంలో దేవుని
ఉనికిని గుర్తించడం ఆమె ఆధ్యాత్మికతలో ప్రధానమైనది.
అయితే ప్రతి సంఘటనను దేవుని ప్రత్యేక సంకేతంగా
భావించడం వివేకంతో జరగాలి. తెరేజమ్మ తన అనుభవాలను వివరించేటప్పుడు “నాకు
అనిపిస్తోంది”, “బహుశా” వంటి సంయమనంతో కూడిన
మాటలను ఉపయోగించింది. ఈ విధానం ఆధ్యాత్మిక అనుభవాలను అతిశయోక్తిగా మార్చకుండా
కాపాడుతుంది.
దేవుడు తనకు హాని కలిగించే పుస్తకాలను చదవకుండా
కాపాడాడని, పాపసంకీర్తనం తనకు శాంతిని ఇచ్చిందని, విశ్వసనీయమైన
హృదయాన్ని ప్రసాదించాడని ఆమె భావించింది. తన బలహీనతను అధిగమించడానికి దేవుడు సహాయం
చేశాడని గుర్తించింది. ఈ సంఘటనలను గుర్తుచేసుకోవడం ఆమెలో కృతజ్ఞతను పెంచింది.
అయితే ప్రతి క్రైస్తవుడూ తన జీవితంలో ఇలాంటి
ప్రత్యేకమైన కాపుదలను అనుభవించాలని ఆశించకూడదు. వ్యక్తుల పెంపకం, పరిస్థితులు, దేవుని కృపా
కార్యాలు భిన్నంగా ఉంటాయి. తెరేజమ్మ అనుభవం ప్రత్యేకమైనదైనా, దేవునిపై
ఆధారపడటం అందరికీ వర్తించే ఆధ్యాత్మిక సత్యం.
దేవుని ప్రేమను ఆమె బాధలేని జీవితంగా అర్థం
చేసుకోలేదు. ఆమె జీవించిన కార్మెల్ మఠంలో అనారోగ్యం, క్షయ, ఆధ్యాత్మికముగా
పొడిబారిన జీవితం, అంతర్గత వేదనలు ఆమెను
తీవ్రంగా పరీక్షించాయి. మరణానికి ముందు ఆమె విశ్వాసపు అంధకారాన్ని, నిస్సహాయతను
అనుభవించింది. అయినప్పటికీ దేవుడు తనను విడిచిపెట్టడనే నమ్మకాన్ని నిలుపుకుంది.
దేవుని సాన్నిహిత్యం ఎల్లప్పుడూ ఆనందంగా
అనుభవించబడదు. కొన్నిసార్లు ఆయన లేనట్లుగా అనిపించినప్పటికీ, విశ్వాసంతో
ఆయనపై ఆధారపడవచ్చు. తెరేజమ్మ జీవితంలో దేవుని ప్రేమ, తన ప్రేమ
పరస్పరం కలిశాయి. ఆ ప్రేమ వల్ల బాధల మధ్య కూడా ఆమెకు శాంతి లభించింది.
4. దేవుడు మానవ హృదయంలో నేరుగా పనిచేస్తాడు
దేవుణ్ణి తెలుసుకోవడానికి మనిషికి పవిత్ర గ్రంథం, ధ్యానం, ఆధ్యాత్మిక స్వరూపాలు, దైవ కృప వంటి
మార్గాలు అవసరం. అయితే మనిషి హృదయాన్ని తాకడానికి దేవునికి మధ్యవర్తులు తప్పనిసరి
కావు. తన ఆత్మలో దేవుడు నేరుగా పనిచేశాడని తెరేజమ్మ విశ్వసించింది.
దేవుని అనంతమైన ప్రేమ క్రైస్తవ జీవితానికి
పునాది. అది మనలను ఆకర్షిస్తుంది, మార్చుతుంది, నిలబెడుతుంది, ముందుకు
నడిపిస్తుంది. తెరేజమ్మ దేవుని ప్రేమలో ఎదగడానికే ప్రాధాన్యం ఇచ్చింది. మంచి పనుల
లెక్కలు వేసుకోవడం కన్నా అన్నింటినీ ప్రేమతో చేయాలని కోరుకుంది. యేసు ప్రభువు తనలో
పనిచేస్తాడనే నమ్మకంతో తనను ఆయనకు అప్పగించుకుంది. తనను తాను పూర్తగా దేవునికి సమర్పించుకుంది.
ఈ విధమైన అప్పగింత సోమరితనం కాదు. దేవునిపై
నమ్మకం ఉంచి, ప్రేమతో కార్యాచరణలో పాల్గొనే ధైర్యమైన జీవితం.
దేవునికి దగ్గరవుతున్న కొద్దీ మనిషి మరింత సరళంగా, సులువుగా, మారుతాడని ఆమె తెలిపుతుంది.
దేవుని గురించి మాట్లాడటం కన్నా దేవునితో
మాట్లాడటం ముఖ్యమని ఆమె భావించింది. దేవుని గురించి మనుషులు మాట్లాడేటప్పుడు తమ
స్వప్రేమను, స్వీయ అభిప్రాయాలను కలిపే ప్రమాదం ఉందని
గుర్తించింది. అయినప్పటికీ ఆధ్యాత్మిక విషయాలను వివరించడానికి శుద్ధి చేసిన భావనలు, ప్రతిమలు
అవసరమని అంగీకరించింది. పునీతుల సహవాసానికి కూడా ఆమె గొప్ప విలువ
ఇచ్చింది. అయితే వారి మధ్యవర్తిత్వం పరిశుద్ధాత్మకు ప్రత్యామ్నాయం కాదు.
“అంతా దేవుని కృపే” అనే తెరేజమ్మ మాటకు ఈ సమతుల్యతే
సరైన అర్థాన్ని ఇస్తుంది. దేవుని కృప సాధారణంగా శ్రీసభ సంస్కారాల ద్వారా
అందుతుంది. అయితే సంస్కారాలు దేవుని శక్తిని పరిమితం చేయవు. అవస్త అభ్యంగనం వంటి సంస్కారాలను ఆమె గౌరవంగా స్వీకరించింది.
అదే సమయంలో దేవుడు హృదయంలో నేరుగా చేసే కార్యాన్ని కూడా గుర్తించింది.
5. చిరు మార్గం
ఆధ్యాత్మిక చిరు మార్గం, ప్రేమ మార్గం రెండూ ఒకే
ఆధ్యాత్మిక అనుభవానికి చెందినవి. చిన్నపిల్లవాడు తండ్రిపై నమ్మకం ఉంచినట్లుగా, క్రైస్తవుడు
దేవుని ప్రేమపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఈ నమ్మకం మనిషిని దేవుని ప్రేమకు
అనుగుణంగా మార్చుతుంది.
తెరేజమ్మ ఆధ్యాత్మికతకు దేవుని కుమారుని మనుష్యవతార
రహస్యం కూడా పునాది. దేవుని వాక్కు మానవుడిగా మారడం, సిలువపై
మరణించి మానవ బాధను తనపై తీసుకోవడం, దివ్య సత్ప్రసాదంలో లో మనకు ఆహారంగా తనను తాను
అందించడం అనే మూడు రూపాల్లో దేవుని వినయం వ్యక్తమవుతుంది. ఈ మూడు అంశాలను విడదీసి
చూస్తే ఆమె ఆధ్యాత్మికతలోని సంపూర్ణత అర్థం కాదు.
చిరు మార్గం అంటే బాధలను తప్పించుకోవడం కాదు.
మానవుడిగా మారి, సిలువను స్వీకరించి, పునరుత్థాన
మహిమలోకి ప్రవేశించిన క్రీస్తును అనుసరించడం.
షరతులు లేని నమ్మకం
తెరేజమ్మ దేవునిపై చిన్నపిల్లవాడికి తండ్రి పట్ల
ఉండే నమ్మకాన్ని ఆదర్శంగా తీసుకుంది. సామెతలు, జ్ఞానగ్రంథం, యెషయా
గ్రంథాల్లో కనిపించే చిన్నవారిపై దేవుని కరుణను ఆమె తన ఆధ్యాత్మికతకు ఆధారంగా
చేసుకుంది. దేవుడు గొర్రెపిల్లలను చేతుల్లో మోసే కాపరిలా, తల్లి తన
బిడ్డను ఓదార్చినట్లుగా తన ప్రజలను ఆదరిస్తాడు.
బలహీనమైన, అపరిపూర్ణమైన ఆత్మలు కూడా ఈ
మార్గానికి పిలువబడ్డాయి. ప్రేమలో పరిపూర్ణతను చేరగలననే ఆశను ఎవరూ కోల్పోకూడదు. ఇలా
దేవునికి అప్పగించుకోవడం యోబు అనుభవించిన
తీవ్రమైన పరీక్షల మధ్య కూడా దేవునిపై ఆధారపడే స్థాయికి మనలను నడిపించాలి.
విశ్వాసం, నమ్మిక, ప్రేమ ఈ
సంపూర్ణ అర్పణలో కలిసిపోతాయి. దేవుడు ఎప్పటికీ
తనను విడిచిపెట్టడని తెరేజమ్మ నమ్మింది.
చివరి వరకు విశ్వాసంలో నిలబడటానికి అవసరమైన శక్తిని కూడా దేవుడే ఇస్తాడని
ఆశించింది.
పనుల కన్నా ప్రేమే నిర్ణయాత్మకం
ప్రేమ తనను తాను నిరూపించుకోవడానికి గొప్ప
పనులను తప్పనిసరిగా కోరదు. చిన్నపిల్లవాడు తన తండ్రి కోసం చిన్న చిన్న బహుమతులు
సమర్పించినట్లుగా, తెరేజమ్మ తన చిన్న పనులను
దేవునికి ప్రేమతో అర్పించింది. పూలు చల్లడం, ప్రేమతో పాటడం, పలకరించడం వంటి చిన్న విషయాలను ప్రేమతో చేయడం ఆమె ఆధ్యాత్మికతకు
చిహ్నాలు.
అయితే ప్రేమ కేవలం ఆనందంతో కూడిన చిన్న పనులకు
మాత్రమే పరిమితం కాదు. ప్రేమ కోసం బాధపడటానికీ, ప్రేమ కోసం
ఆనందించటానికీ ఆమె సిద్ధపడింది. ప్రేమతో చేసిన చిన్న అర్పణలను దేవుడు
స్వీకరిస్తాడని నమ్మింది. చివరకు దేవుని ప్రేమాగ్నిలో పూర్తిగా రూపాంతరం చెందాలని
ఆకాంక్షించింది.
ప్రేమకు అంకితమవ్వడం
తెరేజమ్మ ప్రేమను భావోద్వేగంగా మాత్రమే అర్థం
చేసుకోలేదు. యేసుక్రీస్తును అనుకరించడం, సిలువ వేయబడిన, మహిమతో లేచిన
క్రీస్తుతో ఏకమవడం ఆమె ప్రేమకు కేంద్రం. “ఇకపై జీవించేది నేను కాదు, క్రీస్తే”
అనే పౌలు మాట ఆమె జీవితాన్ని వివరిస్తుంది.
శ్రీసభలో అనేక పిలుపులు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ
ఏకం చేసేది ప్రేమేనని ఆమె గ్రహించింది. శ్రీసభ హృదయం ప్రేమతో జ్వలిస్తుందని, ఆ ప్రేమ
అన్ని కాలాలను, స్థలాలను ఆవరించిందని
ప్రకటించింది. తన పిలుపు ప్రేమేనని తెలుసుకుంది. శ్రీసభ హృదయంలో ప్రేమగా ఉండాలని
కోరుకుంది.
కార్మెల్ సంప్రదాయంలో ప్రేమ ఒక జ్వాల వంటిది. ఒక
జ్వాల మరొక జ్వాలను వెలిగించినట్లుగా దేవుని ప్రేమ మనిషిలో ప్రేమను రగిలిస్తుంది.
తెరేజమ్మ తనను దేవుని కరుణామయ ప్రేమకు అర్పించుకోవాలని కోరుకుంది. ప్రేమకు ప్రేమే
ప్రతిఫలం. ప్రేమలేని పనులు శూన్యమైనవి; నిజమైన ప్రేమ బాధను కూడా
స్వేచ్ఛగా స్వీకరించగలదు, తన జీవితంలో కష్టాలను ప్రేమతో స్వీకరించినది, అపుడు అవి ఆమెకు
కష్టాలు అని పించలేదు.
సిలువలో పూర్తిగా అర్పించుకున్న ప్రేమ
ఆధునిక మనిషి ఆనందం, స్వేచ్ఛ
కోరుకుంటాడు. అయితే తెరేజమ్మ క్రీస్తు సిలువలో ప్రేమ యొక్క అత్యున్నత రూపాన్ని
చూసింది. ప్రేమ అనేది గొప్ప భావోద్వేగాలను అనుభవించడం మాత్రమే కాదు; ప్రియమైనవారి
కోసం బాధను స్వీకరించడానికి సిద్ధపడటం కూడా.
గోధుమ గింజ నేలలో పడి చనిపోయినప్పుడు విస్తారమైన
ఫలాన్ని ఇస్తుందనే యేసు ప్రభువు బోధన
ఆమెకు లోతుగా అర్థమైంది. స్నేహితుల కోసం ప్రాణాన్ని అర్పించడంకన్నా గొప్ప ప్రేమ
లేదని యోహాను 15:13 చెబుతుంది. యేసు ప్రభువు ముందుగా మానవ బాధను తనపై స్వీకరించి, చివరకు తన
ప్రాణాన్ని అర్పించాడు.
తెరేజమ్మ ఇరవై నాలుగేళ్ల వయసులో మరణించినప్పటికీ, ఆమె జీవితం
ప్రేమకు అంకితమైన గొప్ప సాక్ష్యంగా నిలిచింది. ఆమె బాధను బాధ కోసమే కోరుకోలేదు.
దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి, శ్రీసభలో
ఆధ్యాత్మిక ఫలాలను సమృద్ధిగా అందించడానికి తనను తాను అర్పించుకుంది.
ఆమె కార్మెలియ జీవితంలోని అనారోగ్యాలు, అంతర్గత
వేదనలు, మరణశయ్యపై ఎదుర్కొన్న బాధలు ఈ అర్పణలో
భాగమయ్యాయి. క్రీస్తు సిలువలో తన బాధలకు అర్థాన్ని కనుగొంది. నిజమైన ప్రేమ
కొన్నిసార్లు మనిషిని సిలువ మార్గంలో నడిపించినప్పటికీ, ఆ ప్రేమ
జీవాన్ని అందించే ఫలవంతమైన అర్పణగా మారుతుంది.
6. పవిత్ర మోము
తెరేజమ్మ
తెరేజమ్మ పూర్తి పేరు “, పవిత్ర మోము
బాల యేసు తెరేసా”. బాలయేసు అనే పేరు ఆధ్యాత్మిక బాల్య మార్గాన్ని
సూచిస్తే, పవిత్ర మేము అనే పేరు బాధలో తనను తాను అర్పించుకున్న
క్రీస్తుతో ఏకత్వాన్ని సూచిస్తుంది.
యెషయా ప్రవక్త వర్ణించిన భాదమయ సేవకుని రూపం ఈ
భక్తికి పునాది. అందం, వైభవం లేని, అవమానాన్ని, బాధను
స్వీకరించిన దేవుని సేవకునిలో తెరేజమ్మ ప్రేమ యొక్క రహస్యాన్ని గాంచింది. పవిత్ర మోము బాధపడుతున్న దేవుని ముఖాన్ని
మాత్రమే కాకుండా, దాహంతో ఉన్న బాధిత మానవాళి
ముఖాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
మొదటిగా, పవిత్ర మోము దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో
తెలియజేస్తుంది. ప్రేమ కోసం మరణించడం అత్యంత మధురమైన సాక్ష్యమని తెరేజమ్మ
భావించింది.
రెండవదిగా, కన్నీళ్లతో నిండిన దేవుని మోము,
మానవ బాధలో దేవుని భాగస్వామ్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మారనివాడని చెప్పడం ఆయన
హృదయం కఠినమైనదని కాదు. తల్లి తన బిడ్డ బాధలో పాలుపంచుకున్నట్లుగా, మనుషిణిగా రావడం
ద్వారా దేవుడు మానవ బాధను తనదిగా
స్వీకరించాడు. బాలయేసు మోము, శ్రమలు అనుభవించిన క్రీస్తు
పవిత్ర మోము ఆమెకు విడదీయరానివి.
మూడవదిగా, పవిత్ర మోము క్రీస్తుతో ఏకత్వానికి చిహ్నం. యేసు
కన్నీళ్లలోని రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, ఆ రహస్యం
ప్రేమకు అడ్డంకి కాదని తెరేజమ్మ నమ్మింది. తనలో క్రీస్తు రూపం ముద్రించబడాలని
ప్రార్థించింది. తన ఆత్మను చూసినప్పుడు ఇతరులు క్రీస్తును గుర్తించగలగాలని
కోరుకుంది.
7. రోజువారీ జీవితంలో ప్రేమ
తెరేజమ్మ ఆధ్యాత్మికతలో బాధ, నిస్సహాయత, ఆధ్యాత్మిక పొడిబారిపోవడం
ముఖ్యమైన భాగాలు. ఇవి ఆమె జీవితంలోని
ప్రతికూల అనుభవాలే అయినప్పటికీ, సాధారణ జీవితంలో ప్రేమ ఎలా
పనిచేస్తుందో వెల్లడించాయి. దేవుడు లేనట్లుగా, ఆశ
లేనట్లుగా భావించే వారికి ఆమె జీవితం ఆశను అందిస్తుంది.
నిరాశ మధ్య ఆశ
తెరేజమ్మ చిరుమార్గాన్ని అనుసరించే వ్యక్తి దేవుని కృపపై ఆధారపడే
వ్యక్తి. అతని నమ్మకం విధిపై కాదు, ప్రేమించే తండ్రిపై ఉంటుంది.
తెరేజమ్మ బాల్యం ఆనందం, శాంతి, ప్రేమతో
నిండింది. తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ, సోదరీమణుల
ఆప్యాయత ఆమెకు భద్రతను ఇచ్చాయి. ఈ అనుభవాలు దేవుని రాజ్యంలోని ప్రేమ, ఆనందం, శాంతిని
ఆమెకు పరిచయం చేశాయి.
అయితే ఆ అందమైన ప్రపంచం కూలిపోయింది. తల్లి మరణం, తండ్రి
అనారోగ్యం, కాన్వెంటులో ఎదురైన కఠినమైన పరిస్థితులు ఆమెను
తీవ్రంగా బాధించాయి. కాన్వెంటు కృపకు కేంద్రంగా ఉండాల్సినప్పటికీ, అక్కడి మానవ
బలహీనతలు, చిన్న చిన్న భావోద్వేగ సమస్యలు ఆమెకు నిరాశ
కలిగించాయి.
ఆమె కూడా ఒంటరితనాన్ని, నిరాశను, తీవ్రమైన
బాధను అనుభవించింది. అయినప్పటికీ ఆశను విడిచిపెట్టలేదు. దేవునిపై, క్రీస్తుపై, మరియమాతపై, పునీతుల
సహవాసంపై నమ్మకాన్ని కొనసాగించింది. ఆశ లేని పరిస్థితుల్లో కూడా దేవునిపై ఆశ
ఉంచడమే ఆమె సందేశం.
సాధారణ జీవితంలో మార్మిక అనుభవం
అవిలా తెరేసాకు అసాధారణ దర్శనాలు, మార్మిక
అనుభవాలు ఉండేవి. కానీ చిన్న తెరేజమ్మ
ప్రత్యేకత సాధారణ జీవితంలో దేవుని ప్రేమను అనుభవించడంలో ఉంది. ఆమె విశ్వాసం అనేక
సందర్భాల్లో ఎండిపోయిన ఎడారిలా, శోధనలతో నిండినదిగా ఉండేది.
అయినప్పటికీ ఆమె అంతరంగంలో లోతైన శాంతి ఉండేది.
ఆమె మరణానికి ముందు అనుభవించిన పారవశ్యం
ఒక్కసారిగా వచ్చిన సంఘటన కాదు. తీవ్రమైన బాధ, ప్రేమతో కూడిన అర్పణ, విశ్వాసపు
పరీక్షల మధ్య క్రమంగా సిద్ధమైన ఆధ్యాత్మిక అనుభవం. దేవుణ్ణి కళ్లతో చూడకపోయినా, ప్రేమ
ద్వారా ఆయనతో ఏకమవగలమని ఆమె జీవితం చూపించింది.
కార్మెల్ మఠంలో ఒక వృద్ధ సోదరికి సహాయం చేస్తూ ఆమె సాధారణ
సేవలోనే దేవుని మహిమను అనుభవించింది. ఆ సేవలో సంగీతం, దీపాలు, బంగారు
అలంకరణలు వంటి బాహ్య వైభవం ఏమీ లేవు. అయినప్పటికీ దేవుని కృప ఆ సాధారణ పనిని
అంతరంగంలో ప్రకాశవంతమైన అనుభవంగా మార్చింది. ప్రేమ ద్వారా సాధారణ జీవితం రూపాంతరం
చెందడమే ఆమె మార్మికతలోని గొప్పతనం.
ముగింపు
చిన్న తెరేజమ్మ ఆధ్యాత్మిక సందేశాన్ని దేవుని
ప్రేమ, సంపూర్ణ విశ్వాసం, వినయం, అర్పణ అనే
అంశాలు ఏకం చేస్తాయి. ఆమెకు దేవుడు కఠినమైన న్యాయమూర్తి కాదు; కరుణామయుడైన
తండ్రి, తల్లిలా మృదువుగా ప్రేమించే దేవుడు. ఆయన
చిన్నవారి దగ్గరకు దిగివస్తాడు, సాధారణ జీవితంలో పనిచేస్తాడు, మన హృదయాలను
నేరుగా స్పృశిస్తాడు.
ఆధ్యాత్మిక చిరు మార్గం బలహీనతను దాచుకోవడం కాదు; మన బలహీనతను
అంగీకరించి దేవుని కృపపై సంపూర్ణంగా ఆధారపడటం. ప్రేమ చిన్న పనుల్లోనూ, బాధలోనూ, సిలువలోనూ
వ్యక్తమవుతుంది. నిజమైన ప్రేమ తనను తాను అర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
తెరేజమ్మ బాధను కోరుకున్నది బాధ కోసమే కాదు.
క్రీస్తుతో ఏకమై, శ్రీసభకు మరియు మానవాళికి
ఆధ్యాత్మిక ఫలాలను అందించడమే ఆమె ఆకాంక్ష. అనారోగ్యం, ఆధ్యాత్మిక పొడిబారిపోవడం
, విశ్వాసపు అంధకారం వంటి అనుభవాల మధ్య కూడా ఆమె ప్రేమను
విడిచిపెట్టలేదు.
ఆమె జీవితంలోని గులాబీల వర్షం అనే వాగ్దానం, దేవుని
కృపను ఇతరులకు అందించాలనే ఆమె ఆకాంక్షకు చిహ్నం. అయితే ఈ ప్రేమ మార్గం బాధలేని
మార్గం కాదు. బాధలోనూ విశ్వాసం, ఆశ, ప్రేమలను
నిలుపుకోవడమే దాని ప్రత్యేకత.
చిన్న తెరేజమ్మ మనకు అందించే ప్రధాన సందేశం ఇదే:
మన యోగ్యతలపై కాకుండా దేవుని అపారమైన కరుణపై నమ్మకం ఉంచాలి. చిన్న పనులను కూడా
ప్రేమతో చేయాలి. సాధారణ జీవితంలో దేవుని ఉనికిని గుర్తించాలి. సిలువలో క్రీస్తుతో
ఏకమై, మన జీవితాన్ని ఇతరుల మేలు కోసం అర్పించాలి.
దేవుని ప్రేమకు మన ప్రేమతో ప్రతిస్పందిస్తూ, మరియమాత వినయం మరియు క్రీస్తు అర్పణను ఆదర్శంగా తీసుకుని
జీవించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి