కావలి దూతల పండుగ: పరలోకంలో గొప్పవాడు ఎవరు? – మత్తయి 18:1-5, 10
మత్తయి 18:1-5, 10
ఆ సమయమున శిష్యులు యేసువద్దకు వచ్చి, “పరలోకరాజ్యమున అందరికంటె గొప్పవాడు ఎవ్వడు?” అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారిమధ్యన నిలిపి, “మీరు పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించు చున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించు వాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
పరిచయం
ఈ సువిశేష భాగం మత్తయి సువార్తలోని "సంఘము గురించి యేసు ప్రభువు చెప్పిన నాలుగవ
ప్రసంగము" (మత్త 18:1–35)
ప్రారంభంలో ఉంది. ఇదే సంఘటన మార్కు 9:33-37, లూకా 9:46-48లలో
కూడా కనిపిస్తుంది. ఈ రోజు (అక్టోబరు 2) పవిత్ర కావాలి సన్మానస్కుల
స్మరణ. ఈ పండుగకు సువార్త పఠనంగా ఈ సువిశేష
భాగం ఉపయోగించబడుతుంది.
సందర్భం
మత్తయి 16-17 అధ్యాయాల్లో శిష్యులు అనేక గొప్ప సంఘటనలకు సాక్ష్యంగా నిలిచారు. పేతురు ప్రభువును "సజీవ దేవుని కుమారుడవు" అని ఒప్పుకున్నాడు, అతనికి పరలోకరాజ్యపు తాళపుచెవులు వాగ్దానం చేయబడ్డాయి, యేసు ప్రభువు రూపాంతరం చెందాడు. అదే సమయంలో ప్రభువు తన శ్రమలు, మరణం గురించి రెండుసార్లు ముందుగా చెప్పాడు. శిష్యులు సిలువ గురించి వింటుండగా, తమలో ఎవరు గొప్ప అనే విషయం మీద ఆలోచిస్తున్నారు. ప్రభువు మాటలు, శిష్యుల ఆలోచనలు పూర్తిగా వేరు వేరు దిశల్లో ఉన్నాయి. ఈ వైరుధ్యమే ఈ భాగాన్ని అర్థం చేసుకునే తాళం.
18వ అధ్యాయం శిష్యులు ఎలా జీవించాలో బోధిస్తుంది. దీనిలో భాగమే చిన్నవారిని కాపాడడం, తప్పిపోయిన గొఱ్ఱెను వెదకడం, సోదర దిద్దుబాటు, క్షమాపణ. అందుకే "గొప్పతనం" అనే ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత భక్తి మాత్రమే కాక, సంఘ జీవన నియమంగా కూడా ఇవ్వబడింది.
శిష్యుల ప్రశ్న
"ఆ సమయమున శిష్యులు యేసువద్దకు వచ్చి, 'పరలోకరాజ్యమున అందరికంటె గొప్పవాడు ఎవ్వడు?' అని అడిగిరి." ఈ ప్రశ్న అమాయకంగా కనిపించినా, దాని వెనుక ఈ లోకపు కొలమానాలు ఉన్నాయి. "అందరికంటె గొప్పవాడు" అనే పదం స్థానం, అధికార శ్రేణి గురించిన ఆలోచనను సూచిస్తుంది. శిష్యులు పరలోకరాజ్యం గురించి అడుగుతున్నారు, అంటే అది ముఖ్యమైన విషయమే, కానీ దానిని వారు లోకపు ఆలోచన విధానంతో అర్థం చేసుకుంటున్నారు. దేవుని రాజ్యాన్ని కోరుకోవడం తప్పు కాదు. దేవుని రాజ్యంలో తమ శ్రేణి కోరుకోవడమే సమస్య. ఇది ఆధ్యాత్మిక జీవితంలో కూడా అహంకారం చొరబడగలదని ఇది చూపిస్తుంది.
బాలుని మధ్యన నిలపడం
"యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారిమధ్యన నిలిపి…"
యేసు ప్రభువు మొదట మాటలతో కాక, చేతలతో సమాధానం ఇస్తున్నాడు. ఆయన బోధనలో అనేక సంజ్ఞలు తరచు కనిపిస్తాయి. ఇక్కడ గ్రీకు పదం paidion, అంటే చిన్న బిడ్డ అని అర్ధం. ఆ కాలపు యూదా, గ్రీకో-రోమన్ సమాజంలో బిడ్డలకు సామాజిక హోదా దాదాపు లేదు. వారికి హక్కులు లేవు, ప్రభావం లేదు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు. గొప్పతనం గురించి చర్చిస్తున్న పెద్దల మధ్యలో, సమాజంలో అతి చిన్నవాడిని నిలపడం వారి ఆలోచనలను తలకిందులు చేసే చర్య. గొప్ప తనం గురించిన కొలమానాలు మారాలని యేసు ప్రభువు తన చేతల ద్వారా చెబుతున్నాడు.
పరివర్తన అనే షరతు
"మీరు పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె
రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను." ఇది ఈ
భాగానికి ముఖ్య వచనం. ఇక్కడ మూడు అంశాలు ముఖ్యమైనవి.
మొదట "పరివర్తన చెందాలి " దీని అర్ధం "తిరగడం,
దిశ మార్చుకోవడం" అని. ఇది metanoia (మనస్సు
మార్పు) భావానికి దగ్గరిది. శిష్యులు అప్పటికే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు.
అయినా వారు దిశమార్చుకోవాలి అంటే పరివర్తన ఒకసారి జరిగే సంఘటన కాదు, శిష్యుని
జీవితమంతా కొనసాగే ప్రక్రియ.
రెండవదిగా, "చిన్నబిడ్డలవలె ఉండాలి" ఇక్కడ బిడ్డల అమాయకత్వాన్ని
భావోద్వేగంగా కీర్తించడం లేదు. బిడ్డల నైతిక పరిపూర్ణతను పొగడడం కూడా కాదు. 4వ వచనం ఈ పోలికకు అర్థం చెబుతుంది. బిడ్డ ఇతరులపై ఆధారపడతాడు, తనను తాను నిలబెట్టుకోలేనని తెలుసు, ఇవ్వబడినదాన్ని
స్వీకరిస్తాడు. తండ్రి చేతిలో తనకు తానే విలువ నిర్మించుకోవలసిన అవసరం లేదు.
మూడవదిగా "ప్రవేశింపరు." శిష్యులు "ఎవరు గొప్ప" అని
అడిగారు. యేసు ప్రభువు ప్రశ్ననే మార్చాడు. అసలు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందా? అనేదే అసలు విషయం. గొప్పతనం
గురించిన చర్చకంటే ముందు పరలోక రాజ్య ప్రవేశానికి కావలసిన స్థితి ముఖ్యం. ఈ విధంగా
యేసు ప్రభువు ప్రశ్న యొక్క పునాదినే
సరిదిద్దుతున్నాడు.
తగ్గించుకొనుట
"కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ
బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు."
ఇక్కడ "తగ్గించుకొను" అనే క్రియ ముఖ్యమైనది. యేసు ప్రభువు "తనను తాను తగ్గించుకొని" అంటున్నాడు. అంటే ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛగా చేయవలసిన పని. బిడ్డ తన స్థితిని ఎంచుకోలేదు, కానీ శిష్యుడు ఆ స్థితిని స్వీకరించాలి. ఒక వ్యక్తి తన నిజమైన స్థానాన్ని దేవుని ముందు, ఇతరుల ముందు గుర్తించడం, తాను ఎన్నుకున్న జీవితాన్ని జీవించడం నిజమైన వినయం. వినయాన్ని తనను తాను తక్కువగా భావించుకోవడంగా కాక, సత్యంలో నడవడంగా అర్థం చేసుకోవాలి.
యేసు ప్రభువు గొప్పతనం అనే భావనను తిరస్కరించడం లేదు, దాని నిర్వచనాన్ని మారుస్తున్నాడు. దేవుని రాజ్యంలో గొప్పతనం ఉంది, కానీ అది అధికారం, స్థానం, గుర్తింపు ద్వారా కొలవబడదు. ఇదే బోధ 20:26–28లో మళ్ళీ వస్తుంది. మీలో గొప్పవాడు కాగోరినవాడు మీకు సేవకుడై యుండవలెను, అని చెబుతాడు. యేసు ప్రభువే దీనికి ఆదర్శం, ఎందుకంటే ఆయన, సేవ చేయించుకొనుటకు కాదు, సేవ చేయుటకే వచ్చాడు.
చిన్నవారిని స్వీకరించుట
"ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు."
ఇప్పటివరకు శిష్యుని అంతర్గత స్థితి గురించి మాటలాడిన ప్రభువు, ఇప్పుడు అది ఇతరుల పట్ల ప్రవర్తనగా మారుతుంది. "స్వీకరించు" అనే పదం ఆతిథ్యాన్ని, ఆదరణతో ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. "నా పేరిట" అంటే క్రీస్తు కారణంగా, ఆయనకు చెందినవారినిగా ఉన్నవారిని. చిన్నవానిని స్వీకరించడం క్రీస్తును స్వీకరించడంతో సమానం. క్రీస్తు అతి బలహీనులతో తనను తాను ఐక్యం చేసుకున్నాడు. మత్తయి 25:40లో, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి చేసినాను, నాకు చేసితిరి అని చెబుతున్నాడు. కనుక చిన్నవారిని ఆదరించడం కేవలం దయాగుణం కాదు, క్రీస్తుతో సంబంధం కలిగి ఉండుటకు మార్గం.
"చిన్నవాడు" అనే పదాన్ని మత్తయి 18లో రెండు అర్థాల్లో చదవవచ్చు. అక్షరార్థంగా చిన్న బిడ్డలు. విశ్వాసంలో చిన్నవారు, అంటే సమాజంలో బలహీనులు, నిర్లక్ష్యానికి
గురైనవారు, కొత్తగా విశ్వసించినవారు.
ఎవ్వరినీ తృణీకరింపకుడి
"ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు.
ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను."
"తృణీకరింపకుడు." అంటే "తక్కువగా చూడడం, చిన్నచూపు చూడడం." ఇది అహంకారానికి నేరుగా వ్యతిరేకం. చిన్నవారిని తక్కువగా చూడడం అనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది, ఎందుకంటే గొప్పతనం గురించి ఆలోచించేవారు సహజంగా ఇతరులను తక్కువగా చూస్తారు.
"వీరి దూతలు." ఇది కావాలి దూతల సిద్ధాంతానికి అత్యంత ముఖ్యమైన ఆధారాల్లో
ఒకటి. సంఘ పితరులు దీనిని ప్రతి విశ్వాసికి ఒక దూత ఉన్నాడని అర్థం చేసుకున్నారు.
"తండ్రి సముఖమున సదా నిలిచియున్నారు." ఈ మాట రెండు విషయాలు చెబుతుంది. మొదటిది, చిన్నవారికి దేవునితో నేరుగా, నిరంతరమైన సంబంధం ఉంది. రెండవది, వారిని తృణీకరించడం దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నవారిని అవమానించడం. లోకం దృష్టిలో అల్పులు, పరలోకంలో అత్యంత సమీపులు.
ప్రధాన అంశాలు
గొప్పతనం యొక్క పునర్నిర్వచనం. దేవుని రాజ్యంలో
గొప్పతనం అధికారంతో కాక, వినయంతో, సేవతో
కొలవబడుతుంది. ఈ సూత్రం క్రీస్తు జీవితంలో, ముఖ్యంగా
సిలువలో పరిపూర్ణంగా కనిపిస్తుంది.
దేవుని ముందు పిల్లల స్థితి. బిడ్డలా ఉండడం అంటే
తండ్రిపై సంపూర్ణ నమ్మకం, ఇవ్వబడినదాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం.
రక్షణ సంపాదించుకునేది కాదు, బహుమతిగా పొందేది.
బలహీనులతో క్రీస్తు ఐక్యత. చిన్నవారిని
స్వీకరించడం క్రీస్తును స్వీకరించడం. సంఘం యొక్క నిజమైన ముఖం, అది బలహీనులను ఎలా చూస్తుందనే దానిలో కనబడుతుంది.
దేవుని సంరక్షణ. దూతల ప్రస్తావన, ప్రతి చిన్నవానికీ దేవుడు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తాడని నిరూపిస్తుంది. లోకం విలువ లేనివారిగా చూసేవారు పరలోకంలో అమూల్యులు.
అపార్థాలు
బిడ్డ స్వభావం అంటే అపరిపక్వత కాదు. పౌలు
1 కొరింథీ 14:20లో బుద్ధిలో పసిబిడ్డలుగా కాక పెద్దలుగా ఉండమని చెబుతాడు. విశ్వాసంలో బిడ్డలా నమ్మకం ఉండాలి, ఆలోచనలో పరిపక్వత ఉండాలి.
బిడ్డలను ఆదర్శంగా చూడటం కాదు. బిడ్డలు
కూడా స్వార్థం చూపవచ్చు. యేసు ప్రభువు సూచిస్తున్నది వారి ఆధారపడే స్థితి, వినయం. రాజ్యంలో గొప్పతనం ఉంది, కానీ
దాని మార్గం వినయం.ఆశయం ఉండకూడదు
అని చెప్పటం లేదు.
అన్వయం
వ్యక్తిగత జీవితంలోప్రతిరోజూ మనల్ని మనం
ప్రశ్నించుకోవచ్చు నా ఆలోచనలు, నిర్ణయాలు గుర్తింపు, స్థానం కోసమా, లేక దేవుని చిత్తం కోసమా? తండ్రి చేతిలో నన్ను నేను అప్పగించుకునే నమ్మకం నాకుందా?
కుటుంబంలో: తల్లిదండ్రులు బిడ్డలను విలువైన వ్యక్తులుగా చూడాలి, వారి నుంచి కూడా విశ్వాసం గురించి నేర్చుకోవాలి. బిడ్డల విశ్వాసాన్ని కాపాడడం తమ బాధ్యత అని గుర్తుంచుకోవాలి. సంఘంలో: ప్రాధాన్యం, పదవులు, గుర్తింపు గురించిన పోటీ సంఘ జీవితాన్ని దెబ్బతీస్తుంది. పేదలను, వృద్ధులను, బిడ్డలను, కొత్తగా వచ్చినవారిని ఆదరించడమే సంఘం యొక్క నిజమైన పరీక్ష.
ముగింపు
ఈ సువిశేషభాగం, దేవుని రాజ్యం యొక్క తర్కాన్ని పూర్తిగా తిప్పివేస్తుంది. లోకం గొప్పతనాన్ని పైకి ఎగబాకడంలో చూస్తే, యేసు ప్రభువు దానిని క్రిందికి దిగటంలో చూపిస్తున్నాడు. లోకం బలవంతుల వైపు చూస్తే, పరలోకం బలహీనుల వైపు చూస్తుంది. శిష్యుడు కావడమంటే నిరంతరం తండ్రి వైపు తిరిగి, బిడ్డలా నమ్మకంతో జీవిస్తూ, తన చుట్టూ ఉన్న చిన్నవారిలో క్రీస్తునే స్వీకరించడం. ఈ రోజు కావలి దూతలను స్మరించుకుంటున్న మనం, దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ఎంత ప్రేమగా, వ్యక్తిగతంగా కాపాడుతున్నాడో గుర్తుచేసుకుందాం.
ప్రార్థన: ప్రభువా, మా అహంకారాన్ని తొలగించి, నీ ముందు బిడ్డల
వలె వినయంగా నిలబడే కృపను దయచేయి. చిన్నవారిని, బలహీనులను
నీ పేరిట స్వీకరించే హృదయాన్ని మాకు ఇవ్వు. నీ దూతల సంరక్షణలో మమ్మల్ని నడిపించు. ఆమెన్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి