26, ఫిబ్రవరి 2026, గురువారం

సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు

 సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు 

 యోహాను 20: 2-8 

అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన  మరియొక  శిష్యుని  యొద్దకు పరుగెత్తుకొని పోయి,  "వారు ప్రభువును  సమాధినుండి  ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము"అని చెప్పెను. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధివైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని, ఆ శిష్యుడు పేతరుకంటే వేగముగా పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్లలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి,  సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతోపాటు కాక, విడిగచుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను

ధ్యానం:  ఈ రోజు సువార్తకారుడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాము. ఈ పునీతుని గొప్పతనం, యోహాను సువార్తను చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సువార్తను నలుగరు సువిశేషకారులు రాసినప్పటికి యోహాను సువిశేషం ఒక ప్రత్యేకత కలిగిఉన్నాది. యోహాను గారు యేసు ప్రభువు శిష్యులలో ఒకరుగా ఉన్నారు. ప్రతి సువిశేషమునకు ఒక గుర్తు ఉన్నది. యోహాను సువిషమునకు ఉన్న గ్రద్ద గుర్తుగా ఉన్నది. ఎందుకు గ్రద్ద గుర్తుగా ఉన్నది అని ఒక సారి మనం పరిశీలించినట్లయితే, ఒక విషయం మనకు తెలుస్తుంది. అది గ్రద్ద ఆకాశంలో ఎక్కడో విహరిస్తున్నప్పటికి భూమిమీద ఉన్న కీటకాన్ని కాని లేక అది ఏమి పట్టుకోవాలనుకున్నదో దానిని ఖచ్ఛితముగా ఎటువంటి పొరపాటు లేకుండా అది దానిని పట్టుకోగలదు. గ్రద్దకు ఖచ్చితమైన గురి ఉన్నది. యోహాను  సువిశేషంలో మొదటి నుండి యేసు ప్రభువు దేవుడు అనే విషయమును వెల్లడి చెస్తున్నారు. మిగిలిన సువిశేష కారులు యేసు ప్రభువు పుట్టుకతోటి, లేక ఆయన జ్ఞానస్నానంతో మొదలు పెడుతున్నారు. కాని యోహాను మాత్రం తన సువిశేషాన్ని యేసు ప్రభువు ఎలా తండ్రితో కలిసి ఉన్నాడని మరియు ఏవిధముగా ఆయన దేవుడు అనే విషయాన్ని సువిశేషం మొదటి నుండి చెబుతున్నారు. 

యోహాను సువిశేషం, ఎందుకు యోహాను ఈ సువిశేషాన్ని రాశారో తెలియజేస్తుంది.   యోహాను మూడు సార్లు తన సువిశేష ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సువిశేష మొదటిలో , మధ్యలో మరియు చివరిలో ఎందుకు ఆయన సువిశేషం రాసినది తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ ఉద్దేశ్యం అంటే, యేసు ప్రభువును అందరు విశ్వసించాలి, ఆయనను విశ్వాసించిన వారికి నిత్యజీవం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ సువిశేష ఉద్దేశ్యం. ఈ సువిశేషం రెండు భాగాలుగా చేసిన మొదటి భాగం 7 అద్భుతాలు యేసు ప్రభువు చేస్తున్నారు. ఈ ఏడు అద్భుతాలు కూడా దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతాలు. ఎంతటి గొప్ప వారు అయినప్పటికీ  దేవుడు కాకపోతే ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని యోహాను సువిశేషకారుడు యేసు ప్రభువు ఇచ్చే అనుగ్రహమును బట్టి తెలియజేస్తున్నాడు.  అవి ఏమిటి అంటే, యేసు ప్రభువు జీవ జలం, యేసు ప్రభువే జగజ్యోతి, యేసు ప్రభువే జీవహారం. యేసు ప్రభువే జీవ వాక్కు.యేసు ప్రభువే తండ్రి వద్దకు మార్గము.  ఈ సువిశేష రెండవ భాగాన్ని మహిమ పుస్తకం అంటారు. ఈ భాగంలో ఎలా యేసు ప్రభువు తండ్రి పవిత్రాత్మలతో కలసి ఉన్నది. మనం ఎలా దేవునితో కలసి ఉండవచ్చు అనే విషయములు కూడా తెలుసుకుంటాము. శిష్యులతో యేసు ప్రభువు ఎటువంటి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ఎలా దానిని శిష్యులు పొందవచ్చు అనే విషయం మనం తెలుసుకుంటాము. శిష్యులను ప్రభువు ఎంతలా ప్రేమిస్తున్నారు అనే విషయము కూడా ఈ సువిశేషం ద్వారానే మనం నేర్చుకుంటాము. 

ఎవరు ఈ యోహాను? యేసు ప్రభువు శిష్యులలో ఒకడు. జబదాయి కుమారుడు. ఈయన కడరా భోజన సమయమున యేసు ప్రభువు హృదయమునకు దగ్గరగా ఉన్నాడు. ఆయన  యేసు ప్రభువుకు అంతా దగ్గరగా ఉన్నాడు కనుక దేవుని గురించి ఇతర సువిశేషకారులు తెలుపని విషయాలను వివరిస్తున్నారు. హృదయము దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభువు చేత కూడా ఈ శిష్యుడు ప్రేమించబడ్డాడు. అంతేకాదు శిష్యులు అందరు యేసు ప్రభువును బంధించినప్పుడు వెళ్ళి పోయినను ఈ శిష్యుడు మాత్రము ఆయనను ఎవరికి తెలియకుండా అనుసరిస్తున్నాడు. సిలువ క్రింద మరియమాతతో పాటు ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు తన తల్లిని తన ప్రియయమైన శిష్యునకు అప్పగించాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా మీరు ప్రేమించిన మీ శిష్యున్ని జ్ఞానంతో నింపారు. కేవలం జ్ఞానంతో నింపటమే కాకుండా దేవుని గురించితెలుకొని నేర్పే వానిగా తీర్చిదిద్దారు. మీ మీరు చేసిన ప్రతి పని మీరు  దేవుడు అని తెలియజేస్తున్నది అని తెలుసుకోలేకపోయాము. మీ శిష్యుడు మిమ్ములను మాత్రమే పరిలించే విధంగా మీరు చేశారు కనుక మిమ్ములను మాత్రమే ధ్యానిస్తూ.మీగురించి నిగూడ సత్యాలను తెలుసకొనుటకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా మీరు చేసిన అధ్భుతాల ద్వారా మీరు దేవుడు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అంతె కాక మేము ఏ విధంగా మీతో కలసి ఉండాలో చెబుతున్నారు. మీరు లేకుండా మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు. మేము మీతో కలసి ఉండాలి అని కోరుతున్నారు. ప్రభువా! మమ్ములను కూడా మీ ప్రియమైన శిష్యున్ని ప్రేమించినట్లుగానే ప్రేమించండి. మమ్ములను కూడా మీ హృదయమునకు  దగ్గరగా ఉండనివ్వండి. దాని ద్వారా యోహాను వలె మేము కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకొని మీతో ఐక్యం అయ్యేలా మమ్ము దీవించండి. ఆమెన్. 

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

 హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు 

మత్తయి 2:13-18 

వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని  ఆదేశించెను. అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు  తనను మోసగించిరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహామందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువులందరిని చంపుడని అతను ఆజ్ఞాపించెను.  

ధ్యానము: "ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువునకు చంపుటకు హెరోదు వేదకబోవుచున్నాడు" అని చెప్పాడు.  ఎందుకు హెరోదు యేసు ప్రభువును చంపుటకు  వేదకబోవుచున్నాడు? హెరోదు రాజుతొ  తూర్పునుండి వచ్చిన జ్ఞానులు, యూదుల రాజుగా  పుట్టిన శిశువు నక్షత్రం  చూచి, ఆయనను మేము  ఆరాధించుటకు వచ్చాము, ఆయన ఎక్కడ జన్మించారు అని  వారు  అడిగారు. హెరోదు రాజు తన అధికార వ్యామోహం కలిగినవాడు. తన సొంత కుమారులను కూడా అధికారం కోసం చంపించినవాడు, అందుకే ఆరోజులలో హెరోదు కుమారునిగా కంటే హెరోదు దొడ్డిలో పందిగా పుట్టటం మేలు అనే నానుడి ఉండేది.  తన అధికారమునకు అడ్డుగా ఎవరు వచ్చిన, దానిని సహించని వ్యక్తి హెరోదు. మరియొక రాజు పుట్టాడు అని తెలువగానే ఆ శిశువును, ఎలా అయిన చంపాలి అనే ఆలోచన హెరోదుకు వస్తుంది. మనుషుల అంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు హెరోదు చేయబోయే ఘోరాన్ని యోసేపుకు తెలియజేసాడు.

 "నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని యోసేపును దేవదూత   ఆదేశించెను. "అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ప్రభువు దూత చెప్పినట్లుగా యోసేపు మరియమ్మను, బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నారు.  హెరోదు మరణించినంతవరకు పవిత్ర కుటుంబం  ఐగుప్తు లోనే ఉంటుంది.  ఈ ఇద్దరు కూడా తమ బిడ్డ కోసము పడిన కష్టం చాలా గొప్పది. వీరు ఇద్దరు కూడా తమ కుమారుని కొరకు జీవిస్తున్నారు. మనతో పాటు ఉన్న వారు అపాయములో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో వీరు చెబుతున్నారు. దేవుడు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు? కారణం ఏమి అయి ఉండవచ్చు అంటే, ఐగుప్తు  హెరోదు పరిదిలో లేదు,  అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. మరల  హొషయ ప్రవక్త చెబుతున్నట్లుగా నేను నా కుమారున్నీ ఐగుప్తు నుండి పిలిచాను అనే ప్రవచనం వెరవేరుతుంది. 

యేసు ప్రభువును హెరోదు చంపించలేకపోయాడు. కాని తన అధికారమునకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అనుకునే హెరోదు, ఆ శిశువును ఎలాగైన చంపాలి అని బేత్లెహేము మరియు ఆ పరిసర ప్రాంతములో ఉన్న రెండేండ్లు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బిడ్డలు ? ఈ చిన్న బిడ్డలు అందరు కూడా ఎవరు కాపాడుటకు లేనివారు, ఏ మాలిన్యం లేని వారు. పవిత్రంగా ఉన్నవారు. యోసేపు, మరియమ్మ లాంటి వారు తోడు లేని వారు.

 అంతమంది చిన్న బిడ్డలను హెరోదు చంపనవసరం లేదు. కాని పదవి వ్యామోహం, అధికార దాహం అనేవి  మనలను ఎటువంటి హత్యలను, ఘోరాలను కూడా చేయుటకు ప్రేరేపిస్తుంది. వివేకము కోల్పోయేవిధంగా చేస్తుంది. ఆ చిన్న బిడ్డలు పెరిగి, అధికారానికి  రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంత కాలం హెరోదు బ్రతకడు అనే విషయం కూడా ఆలోచించలేక పోయాడు. మన ఆలోచనలను కూడా అధికారం వ్యామోహం చంపివేస్తుంది. 

 "రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహెలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను" అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను." ఎందుకు రాహెలు ఏడుస్తుంది అంటే,  రాయహేలును యాకోబు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తన అక్కకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనే బాధను ఆమె చాలా ఎక్కువగా పొందింది. పిల్లల కోసం చాల ఆశ పడింది.  ఆమె చనిపోయిన తరువాత రామా వద్ద సమాది చేశారు. ఇంత మంది చిన్న బిడ్డలను చంపినప్పుడు ఆ తల్లి బిడ్డలకోసము విలపిస్తుంది.ఆమెనుఓదార్చుటఅలవికానటువంటిది. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా!  మీరు జన్మించినప్పుడు ఎంతో ఆనందపడిన యోసేపు, మరియ తల్లి మిమ్ములను అధికార దాహం, పదవి కాంక్ష కలిగిన వారి నుండి కాపాడుటకు ఎంతో కష్టపడ్డారు. మీరు మీ పరిచర్య మొదలు పెట్టిన తరువాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు, మిమ్ములను అనేక విధాలుగా కష్ట పెట్టుటకు ప్రయత్నించారు. ప్రభువా! మేము కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పదవి, అధికారం వంటి కోరికలకు, ఆశలకు లోనవుతాము. అటువంటి సమయాలలో నిజమైన జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మిమ్ములను అనుసరించెలా చేయండి. యోసేపు మరియతల్లి మిమ్ములను కాపాడినట్లు  ఇటువంటి అపాయములకు లోనయె వారికి సహాయం చేసేలా మమ్ము దీవించండి. చనిపోయిన చిన్న బిడ్డలలో, వారి ఆలోచనలలోకాని, మాటల్లో కాని, పనులలో కాని ఎటువంటి చెడు లేకుండా, నిర్మలముగా ఉన్నారో అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి బిడ్డలను రక్షించు అవకాశము మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట

 యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట 

 లూకా 2: 22-35 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. 

నిర్గమ ఖాండం 13 వ అధ్యాయంలో తొలిచూలు పుట్టిన కుమారుడు దేవునకి చెందిన వాడు. మొదట పుట్టిన కుమారుడు దేవాలయంలో సేవ చేయాలని నియమం ఉన్నది. కనుక ఆ బిడ్డను దేవునికి అంకితము  చేయడానికి దేవాలయమునకు  తీసుకొని వస్తారు. తరువాత ఆ బిడ్డకు బదులుగా సుమారు 5 తులముల వెండిని చెల్లించి ఆ బిడ్డను తీసుకొని వెల్లవారు సంఖ్యా 3:11-13. కుమారుడు  పుట్టిన తరువాత తల్లిదండ్రులు శుద్దికరణ నిమిత్తమైన లెవీయ ఖాండం 12:3-8  ప్రకారం వారు ఒక గువ్వను కాని దహన బలిగా ఒక గొర్రెను కాని అర్పించవలసినది. పేదవారు, అవి అర్పించలేనివారు రెండు గువ్వలను అర్పించాలి. అందుకే యేసేపు మరియమ్మలు రెండు గువ్వలను అర్పిస్తున్నారు. మరియమ్మ యోసేపులు పేదవారు అయినప్పటికీ దైవ భక్తి యందు వారు గొప్పవారు అందుకే దేవాలయమునకు వచ్చి ఇవి అన్నియు వారు  చేస్తున్నారు. యిస్రాయేలు చట్ట ప్రకారం  40 రోజులకు  శుద్దికరణ జరుగుతుంది.  మరియ మాత  యోసేపులు తమ తొలిచూలు బిడ్డను దేవాలయములో  దేవుని సేవకు అర్పించడానికి తీసుకొని వెళుతున్నారు. వారు దేవలయంలో ఉండగా పవిత్రాత్మ ప్రేరణతో  సిమియోను ప్రవక్త వారిని చూస్తున్నారు. సిమియోనుతో దేవుడు మెస్సీయ్యా గురించి అంతకు ముందుగానే మాటలడాడు. రానున్న మెస్సీయ్యా గురించి సిమియోను ఎదురుచూస్తున్నాడు. యేసు ప్రభువు దేవాలయం లోనికి రాగానే సిమియోను అక్కడకు వస్తున్నాడు.  

సిమియోను జీవితం 

సిమియోను అంటే వినుట అని అర్ధం. సిమియోను దేవుని మాటను విని ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తి. తన జీవితం మొత్తం మెస్సీయ్యా గురించి ఎదురుచూస్తున్న వ్యక్తి.రక్షకుని  చూచి మరణించాలని కోరుకున్న వ్యక్తి. సిమియోను నీతిమంతుడు అనే విషయం దేవుని వాక్కు ద్వారా తెలుస్తుంది. నీతిమంతుడు అంటే దేవుని చట్టమును తప్పక పాటించేవాడు. యోసేపును కూడా పవిత్ర గ్రంధం నీతిమంతుడు అని చెబుతుంది. యేసు ప్రభువును చూచి తండ్రితో తనను ఇక నిష్క్రమింపమనీ చెబుతున్నాడు. తాను చూడాలనుకున్న రక్షకుని చూసి తృప్తి పొందుతున్నాడు. 

దేవాలయములోనికి తీసుకొని వచ్చిన యేసు ప్రభువును  సిమియోను తన   హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు." యేసు ప్రభువు గురించి సిమియోను మాటలాడిన మాటలు ముఖ్యముగా "దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ"  అనే ఈ మాట చాలా ముఖ్యమైనది. యేసు ప్రభువు అందరికీ రక్షకుడు. యేసు ప్రభువు చేసిన పనులు చూసి ఈ మాట సిమియోను అనుట లేదు. పవిత్రాత్మ ప్రేరణతో బాల  యేసును తన చేతులలోనికి తీసుకొని అంటున్నాడు.  ప్రభువు అన్యులకు వెలుగుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు వెలుగును చూస్తారు. వెలుగును చూచుట అంటే వారి జీవితమును తెలుసుకోవడం.  ఎటువంటి జీవితం జీవిస్తున్నది తెలుసుకోవడం. యేసు ప్రభువు వద్దకు వచ్చుట ద్వారా మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని తెలుసుకుంటాము. యేసు ప్రభువు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు ఎందుకంటే దేవునికి దూరముగా ఉండి వారి మహిమను కోల్పోయారు, యేసు ప్రభువు ద్వారా యిస్రాయేలు మరల మహిమను పొందుతుంది. 

ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. యేసు ప్రభువు గురించి సిమియోను పలికిన ఈ మాటలు మొత్తం కూడా వేరుతున్నాయి. ఆయన అనేకుల ఉద్దరింపునకు కారణం అయివున్నాడు. ఆయనను అందరు అంగీకరించలేదు. అనేకుల మనోగతలను ఆయన బయలుపరిచాడు. ఎవరు ఎటువంటి వారు అనే విషయాలు ప్రభువు తెలియజేస్తున్నాడు. అంతేకాక అనేక గొప్ప కార్యలు చేసిన ప్రభువును తన తల్లి అందరు విడచివెళ్ళడం చూస్తుంది. సిలువ వేయడం, ఈటెతో పొడవడం, మరణించిడం చూస్తుంది. అందుకే నీ హృదయము నందు ఒక ఖడ్గం దూసుకొనిపోతుంది అని సిమియోను  చెబుతున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మిమ్ములను దేవాలయంలో మిమ్ము అంకితం చేసినప్పుడు సిమియోను ప్రవక్త మీ నిజ రూపాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఈ లోక రక్షణ అని మేము తెలుసుకుంటున్నాము. మీఋ అన్యులకు వెలుగు అని తెలుసుకుంటున్నాము. మీరు వెలుగు అని  మాకు మార్గదర్శి అని తెలుసుకొని వెళ్లప్పుడు మీ దగ్గర వుండి మీ వెలుగులో మమ్ములను మేము తెలుసుకొని, ఎప్పుడు ఆ వెలుగులో జీవించేలా చేయండి. ప్రభువా అనేక మంది ప్రజలు  ఉన్నప్పటికీ సిమియోనికి మాత్రమె  మిమ్ములను చూచి మీరే రక్షకుడు అని ప్రకటిస్తున్నారు. ఆయన భక్తి, నీతిమంతమైన జీవితం, పవిత్రాత్మ ప్రేరణ మిమ్ములను మీరు రక్షకుడు అని తెలుసుకొనుటకు ఉపయోగపడుతున్నవి. ప్రభువా ! మేము కూడా భక్తి వంతమైన జీవితం , నీతివంతమైన జీవితం జీవించేలా మీ అనుగ్రహం దయచెయండి. సిమియోను వలె మాకు కూడా మీ పవిత్రాత్మ అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్. 

దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం

 దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం 

లూకా 2:36-40 

అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ధ్యానం: అన్నమ్మ ఒక ప్రవక్తి , తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఆమె విధవరాలుగా, దేవలయంలోనే ఉన్నది. ఆమె ఫనుయేలు కుమార్తె అని చదువుతున్నాము.  అంటే తన భర్త పేరు కాకుండా తండ్రి పేరుతో ఆమెను పరిచయం చేస్తున్నారు అంటే ఆమె భర్త కన్నా ఆమె తండ్రి ఎక్కువ కాలం బ్రతికిఉంటాడు. ఆ రోజులలో యుక్త వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు కనుక ఆమె 15 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి చేసుకొని వుండవచ్చు. ఆమెకు పెళ్లయిన ఏడుసంవత్సరాలకు ఆమె భర్త చనిపోయాడు. అంటే రెండు పదుల వయసులోనే ఆమె విధవరాలుగా మారింది. సుమారు 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నది. అప్పటి నుండి ఆమె దేవాలయంలోనే, దేవునికి సేవ చేస్తూ ఆమె జీవితాన్ని గడుపుతుంది.  ఆమె గురించి చెప్పిన మాటలు చాలా లోతైన భావాలు కలిగియున్నవి. ఆమె ఆషేరు వంశస్తురాలు. ఆషేరు అంటే భాగ్యం, సంతోషం అని అర్ధము. ఆమె పొందిన భాగ్యం ఏమిటి అంటే దేవుని సన్నిదిలో తన జీవితం మొత్తం కూడా గడపటం. అదే విధంగా ఆమె ఫనుయేలు కుమార్తె ఆదిఖాండంలో ఫేనుయేలు అని ప్రదేశం గురించి మనం వింటాము. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్ధం. పనుయేలు అనే మాట దైవ సాన్నిద్ధ్యం అనే భావం వుంది. ఆ విధముగా ఆమె దేవుని సాన్నిధ్యంలో అనగా దేవాలయంలో తన జీవితాన్ని మొత్తం కూడా గడిపింది. 

ఆమె దేవాలయమును వదలలేదు, అంటే దేవాలయం తెరచినప్పటి నుండి మూసేవరకు దేవలయంలోనే ఉండేది. పాతనిబంధంలో యేస్సీయ్యా రాజుగా ఉండగా   ప్రవక్తీ గా ఉన్న ఉల్దకు దేవాలయంనే ఒక గదిని ఇవ్వడం జరిగినది. అటులనే అన్నమ్మకు కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈమె రేయింబవళ్ళు ప్రార్ధన మరియు  ఉపవాసంతో ఆమె దేవున్ని  స్తుతించుచు బ్రతికినది. ఆమె దేవాలయమునకు వచ్చి దేవునికి వందనములు అర్పించి, యెరుషలెము విముక్తి కోసం ఎదురుచూచుచున్న వారికి యేసు ప్రభువు గురించి ఆమె చెప్పసాగిందంటే, ఎప్పుడు దేవాలయ పరిసరాలలోనే ఉండేది.  https://www.daivavaakkudhyaanam.com/2023/12/blog-post_29.html

ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. యెరుషలెము విముక్తికై నిరీక్షించు వారు ఎవరు? ప్రార్ధనలు, ఉపవాసాలు చేస్తూ అనేక మంది మెస్సీయ్యా కొరకు నిరక్షించుచున్నారు. మెస్సీయ్యా రాక కోసం ఆనాటి యిస్రాయేలు ప్రజలు చాలామంది నిరీక్షించుచున్నారు. కొంత మంది ఎడారిలో ఉండి, కొంత మంది సమూహాలుగా ఉండి మెస్సీయ్యా కోసం ప్రార్దన, ఉపవాసంతోటి ఎదురుచూస్తున్నారు. వీరు అందరు పవిత్రతతో  ప్రత్యేక విధంగా మెస్సీయ్యా కోసం సిద్దపడుతున్నారు. సాధారణ ప్రజలు కూడా చాలా మంది మెస్సీయ్యా కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరకి మరియు యెరుషలెము విముక్తి గురించి ఎదురుచూచే వారికి మరియు రక్షణ కొరకు చూచే వారి అందరికీ కూడా అన్నమ్మ యేసు ప్రభువును గురించి చెబుతున్నది. వారి ఎదురుచూపులకు, వారికి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా ,  సమాధనముగా దేవుడు ఇచ్చిన సమాధానం ఈ చిన్న బాలుడే అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 

వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. యోసేపు మరియమ్మల విశ్వాస జీవితం ఉన్నతమైనది. వారి జీవితంలో దేవుని ఆజ్ఞలకు ప్రధమ స్థానం వుంది. వారు ఇరువురు కూడా దేవుని చిత్తమును నెరవేర్చడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారు. అందుకే వారి విధులను పూర్తిగా నెరవేర్చి తమ పట్టణానికి వెళుతున్నారు.  యేసు ప్రభువు గురించి వారికి తెలిసిన విషయాలు ఎలిశబేతమ్మ, జ్ఞానులు, సిమియోను, అన్నమ్మల నుండి వినినప్పుడు వారికి యేసు ప్రభువు మీద ఇంకా ఎక్కువ మక్కువ కలిగిఉండాలి. యేసు ప్రభువును చిన్నప్పటి నుండి దేవుని యందు, దైవ కార్యములందు నిమగ్నమయేలా వారి జీవితాలు ఉన్నాయి. వీరి పెంపకంలో పెరిగిన యేసు ప్రభువు దృడకాయుడై పరిపూర్ణ  జ్ఞాని అవుతున్నాడు. యేసు ప్రభువు జీవితమే పరిపూర్ణతను పొందుటకు ఆధారము. అటువంటి ప్రభువు పరిపూర్ణ జ్ఞాని అవుట సహజమే. దేవుని అనుగ్రహము ఆయన మీద ఎప్పుడు ఉంటుంది. ఆయనే దేవుడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ సన్నిదిలో ఉన్న అన్నమ్మ అనేక సంవత్సరాలు ప్రార్దనలతో ఉపవాసంతో జీవిస్తున్నారు. మీ సన్నిదిలో నివసించిన వారికి మిమ్ములను తెలుసుకునే భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. మిమ్ములను తెలుసుకోవడమే కాకుండా మీగురించి ప్రకటించే అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మేము కూడా ఎల్లప్పుడు మీ సన్నిదిలో నివసించుటకు కావలసిన అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మరియమ్మ యోసేపులు వారి జీవితం మొత్తం మీ చిత్తమును నెరవేర్చడానికి అంకితం చేశారు. ప్రభువా మీ చిత్తము నెరవేర్చుటకు వారు ఎన్నో కష్టాలు అనుభవించిన మీకు దూరంగా ఉండకుండా, మీకు ఎల్లప్పుడు సేవచేయుటకు మీకు దగ్గరగా ఉన్నారు. ప్రభువా మేము కూడా మీ చిత్తం నెరవేర్చుటకు, మా జీవితాలలో మీ పట్ల మేము చేయవలసిన బాధ్యతను నెరవేర్చునట్లు మమ్ము దీవించండి. మీ వలె జ్ఞానమందు ఎదిగే అనుగ్రహం మాకు దయచేయండి. ఆమెన్ 

తిరు కుటుంబ మహోత్సవం

 తిరు కుటుంబ మహోత్సవం

లూకా 2:22-40 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి.  ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ఈ రోజు పరిశుద్ద కుటుంబ పండుగను జరుపుకుంటున్నాము. కుటుంబమును చిన్న తిరుసభగా మనం గుర్తిస్తాం. ఈనాటి సువిశేషంలో ఒక కుటుంబం ఎలా ఉన్నట్లయితె దేవుని అనుగ్రహములు మనకు వస్తాయో చూస్తాము. నజరేతు చిన్న కుటుంబంద్వార ఇది మనం చూడగలుగుతాము.  ప్రతి మానవ కుటుంబానికి నజరేతు కుటుంబం ఒక ఆదర్శం.  ఈ పవిత్ర కుటుంబ ఐక్యత, పరస్పర ప్రేమ, మరియు వారి కుటుంబ ధ్యేయం, మన చూసినప్పుడు, ఎలా ఈ కుటుంబం మనకు మాతృక అనే విషయం తెలుస్తుంది. 

పవిత్ర కుటుంబం గురించి మనం తెలుసుకునేముందు, మానవ కుటుంబాలలో ఉండ కూడని కొన్ని లక్షణాలు మనం చూద్దాం. అవ్వ, ఆదాముల కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రభావితం చేయడానికి ప్రయత్నించుచున్నారు. అవ్వ తన  తప్పులో ఆదామును పాలుపంచుకునేలా ఆయనను ప్రభావితం చేసింది. దాని ద్వారా పాపమును లోకములోనికి వారు తీసుకొని వస్తున్నారు. కయ్యాను తన తమ్ముడు మీద అసూయ పొంధుతున్నాడు. అసూయ తోటి హత్య చేస్తున్నాడు. తన తమ్ముడు, దేవుని మెప్పు పొందుటను ఓర్వ లేకపోతున్నాడు. రెబ్కా తన కుమారులకు చూపిన ప్రేమలో ఉన్న వ్యత్యాసం వలన అన్నదమ్ములు విడిపోవవలసివచ్చింది.  తమ తండ్రి చిన్న వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని, ఆ చిన్న వాడినే చంపాలని ఒక ప్రణాళిక ఏసుకుంటున్నారు యాకోబు కుమారులు.  చిన్న వాడి మీద ప్రేమను కూడా ఓర్చుకోలేని భావాలు  మానవునిలో ఉన్నాయి. ,వాయి వరసలు లేని కామం కుటుంబ కీర్తని నాశనం చేస్తుంది. రూబెను అందరికంటే పెద్దవాడు అయినప్పటికీ ఎప్పటికీ ఆ పెద్దరికానికి నోచుకోలేకపోయాడు.  భర్తను అవమానించిన మీకాలు ఎప్పటికీ పిల్లలను కనకుండా ఉండిపోయింది. తండ్రిని అవమానించి, మాట వినని అబ్షలోము మరణాన్ని తెచ్చుకుంటున్నారు. ఇతర కుటుంబాన్ని విచ్ఛిన్న చేసిన దావీదు కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. ఒకరి చెడు కోరికలను తీర్చుకోవడానికి ఒకరికొకరు సహకరించుకొవడం, ఒకరిని చేతకాని వారీగా చిత్రీకరిస్తుంది. ఎసెబేలు రాణి అలానే తన భర్తను చేస్తుంది. 

ఇప్పుడు మనం చూసిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు ఒకసారి మనం పరిశీలిస్తే అవి ఏమిటి అంటే, నా మాటే వినాలి అనే మనస్తత్వం. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి అసూయ ఉండటం, ఒకరి ఉన్నతిని మరియొకరు ఓర్వలేక పోవడం, తల్లి దండ్రులు చూపే ప్రేమలో వ్యత్యాసాలు చూపించడం, తల్లి దండ్రులను అవమానపరచడం, వావివరసలు లేని కామం కలిగి ఉండటం, భర్త భార్యను, భార్య భర్తను అవమానించడం ఇవి అన్ని కూడా పవిత్ర గ్రంధంలో కొన్ని కుటుంబాలు వాటి గొప్పతనం, వారు సాధించిన ఘనతను కోల్పోవడానికి కారణం అయ్యాయి. వారు పొందవలసిన కీర్తిని వారు పొందలేక పోయారు. ఈ సమస్యలు అన్ని ఆనాటి కుటుంబాలలో మాత్రమే కాదు, ఈనాటి కుటుంబాలలలో కూడా ఉన్న సమస్యలే. అంత మాత్రము చేత ఇవి ఏమి  పరిష్కారం లేని సమస్యలు కాదు. ఈ సమస్యలకు సమాధానాలు ఉన్నట్లయితే అవి ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే, యేసుప్రభువు మరియమ్మ, యేసేపుల నజరేతు కుటుంబం. 

ఎందుకు మన కుటుంబాలలో ఉన్న ఈ సమస్యలు, ఆ కుటుంబంలో లేవు, దానికి కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబములోని వారు అందరు జీవించే విధానం చాల ప్రత్యేకమైనది.వీరు ఒకరికొరకు ఒకరు జీవించారు. యోసేపు మరియమ్మలు యేసు ప్రభువు కోసం జీవించారు. ఒకరి మీద ఒకరికి వారికున్న ప్రేమ గొప్పది.  మొదటిగా యోసేపుగారు ఈయన దేవుని మీద అచంచలమైన భక్తి కలవాడు. దేవున్ని ఎంతగా నమ్ముతాడు అంటే కలలో దేవదూత కనపడి చెప్పిన ప్రతి విషయాన్ని ఎటువంటి అపనమ్మకం  లేకుండా అన్ని పాటించేవాడు. నీతిమంతుడు అయిన యోసేపు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు అని కోరుకునేవాడు, కనుకనే తన భార్య తన ప్రేమేయం లేకుండా గర్బవతి అయ్యింది అని తెలిసిన కాని ఆమెను అవమానింప ఇష్టపడలేదు. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న  తన కుటుంబాన్ని కాపాడుటకు అన్ని ప్రయత్నాలు చేశాడు. తన కుటుంబాన్ని కాపాడాడు. తండ్రిగా తన ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎప్పుడు, ఎటువంటి అలసటను వ్యక్త పరచలేదు. దేవుని ప్రణాళిక నెరవేర్చడమే తన ధ్యేయంగా జీవించాడు. 

మరియమాత జీవితం  ప్రతి కుటుంబానికి ఆదర్శం. తన జీవితం మొత్తం కూడా తన కుమారుని కోసం జీవిస్తున్నారు.  చిన్నప్పటి నుండి వారు బాలయేసుకు కావలసిన ప్రతి దానిని చేకూర్చడమే కాకుండా, బాల యేసును చిన్నప్పటినుండి దేవుని ప్రణాళికకు అనుకూలంగా వారు పెంచుతున్నారు. ఆమె జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎవరైన ఆపదలో ఉన్నట్లయితే వారిని ఆదుకోవడం. మరియు దేవుని వాక్కును  ధ్యానించడం. వీటితో పాటు దేవుని ప్రణాళిక ప్రకారం జీవిచడం. అందుకే ఈ కుటుంబానికి దేవుడే పునాది. అందుకే వారు అన్ని కష్టాలు పడిన ఆ కుటుంబం కీర్తిని పోగొట్టుకోలేదు, ఇంకా ఎక్కువగా పొందుతుంది. 

వీరిద్దరితోపాటు యేసు ప్రభువు ఆ కుటుంబం  జీవించారు. పవిత్ర గ్రంధంలో ఆయన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడని చదువుతున్నాము. ఆయన తన తల్లిదండ్రులకు  విధేయుడుగా జీవించాడు. దా ని ద్వారా , జ్ఞానమందు ప్రాయమందు ఎదిగాడు.ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడు.  ఆ కుటుంబం అంతగా ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చారు. యోసేపు మరియమ్మల జీవితం మొత్తం యేసు ప్రభువు కొరకే జీవించారు. మన కుటుంబాలలో కూడా దేవున్ని పునాదిగా చేసుకొని మన బిడ్డలకోసం జీవించుదాం 

25, ఫిబ్రవరి 2026, బుధవారం

మానవుడు దేనిని వెదకాలి

 మానవుడు దేనిని వెదకాలి 

యోహాను 1: 35-42 

మరునాడు మరల యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా, ఆ సమీపమున  నడచిపోవుచున్న యేసును చూచి "ఇదిగో'!దేవుని గొర్రె పిల్ల" అనెను. అది విని, ఆ యిద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, "మీరేమి వెదకుచున్నారు?" అని అడిగెను. "రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము. 

ధ్యానము: యోహాను యేసు ప్ర,భువును తన శిష్యుల ఎదుట మరియు ప్రజల ఎదుట దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించుటకు ఏనుకడుగు వేయుట లేదు. యేసు ప్రభువును చూసిన ప్రతి సారి ఆయనను ప్రకటించడానికి ఎంతగానో ఆనందపడుతున్నారు. యేసు ప్రభువు ఆ సమీపమున నడచిపోవుచున్నప్పుడు ఆయనను చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను  చెబుతున్నాడు. గొర్రె పిల్లను  యూదులు, వారికి బదులుగా, వారి పాపాలను పరిహరించుటకు  బలి ఇచ్చేవారు. వారి  పాపములను ఆ గొర్రె మొస్తుంది అని వారు నమ్మేవారు. అందుకే యోహాను మానవుల పాపములను మోసే గొర్రె పిల్లగా యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన మన పాపములను మోసే గొర్రెపిల్ల. మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి మన వద్దకు వచ్చాడు. వాస్తవానికి గొర్రె పిల్ల రక్తం వారిని రక్షించలేదు, కేవలం యేసు ప్రభువు రక్తం మాత్రమే మనలను రక్షించగలదు అని పూర్తిగా తెలిసిన యోహాను, యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నారు. 

యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నప్పుడు యోహనుతో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇది రెండవ సారి యోహాను, యేసు ప్రభువును గొర్రె పిల్లగా ప్రకటించడం. యోహాను శిష్యులకు తమ గురువు పదేపదే యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నారు కనుక ఆయన గురించి తెలుసుకోవలనుకుంటున్నారు. అందుకే ఆ శిష్యులు ఇద్దరు కూడా ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. అది గమనించిన యేసు ప్రభువు వారితో మీరేమి ఎదుకుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు వారు జవాబు ఇవ్వడం లేదు. కాని మరొక ప్రశ్న అడుగుతున్నారు. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. కారణం ఏమిటి అంటే వారికి ఏమి అడగాలో కూడా తెలియదు. ఆనాటి యోహాను శిష్యులు మాత్రమే కాదు, దేవుని మీద నమ్మకం ఉన్న వారు, దేవుని ఆజ్ఞల మీద నమ్మకం ఉన్నవారు ఎదురు చూసేది, వేదికేది కేవలం రక్షకుడిని మరియు మెస్సీయ్యాను. ఇది వారు చెప్పక పోయిన, వారు కూడా తెలియకుండా చేసేది కూడా అదే. 

"రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. యేసు ప్రభువు వారికి తాను ఎక్కడ నివసించుచున్నది చెప్పడం లేదు, కాని వారిని వచ్చి చూడమని  ఆహ్వానిస్తున్నారు. వారు దానికి మారు మాటలాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు. ఆరోజు వారు ఆయనతో గడుపుతున్నారు. ఆయనతో గడపటం వలన వారు అనుభవపూర్వకంగా, యేసు ప్రభువు మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నారు. యోహాను వారికి యేసు ప్రభువు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు కాని ఇప్పుడు వారికి ఆయన కేవలం  పాపములను మోసె గొర్రెపిల్ల మాత్రమే కాదు, దేవుడు ఏర్పరిచిన రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నారు. 

యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము. యోహాను శిష్యులు ఆయనను వదలి యేసు ప్రభువును అనుభవపూర్వకంగా మెస్సీయ్యా అని, సిఖారు పట్టణ వాసుల వలె, ఎవరో చెప్పినందుకు కాక, ఆయనతో ఒక రోజు గడిపి  తెలుసుకున్నారు. ఈయనే నిజమైన మెస్సీయ్యా అని తెలుసుకున్న ఈ శిష్యులలో ఒకరు, సీమోను సోదరుడు అయిన ఆంద్రెయ. ఆయన తన సోదరుడు అయిన సీమోను పేతురుతో మేము మెస్సీయ్యాను కనుగొన్నాము అని చెప్పాడు. మెస్సీయ్యాను కనుగొనుట అనెది జ్ఞానంతో కూడిన ఒక పక్రియ. అనేక మంది మంచి పనులు చేసిన వారు, దేవుడు గురించి చెప్పిన వారు ఉండవచ్చు కాని అందరు మెస్సీయ్యా కాదు. యోహానుకు  మాత్రమే నిజమైన మెస్సీయ్యా తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయనకు మెస్సీయ్యా ఎవరు, ఎలా ఉంటారు అని చెప్పాడు, ఆయన శిష్యుడైన ఆంద్రెయకు మెస్సీయ్యాను కనుగొనుట సాధ్యమే. తన గురువు ఆయన గురించి చెప్పాడు మరియు ఆయన యేసు ప్రభువుతో గడిపి ఆ విషయం తెలుసుకుంటున్నాడు. ఆయన పేతురును యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. యేసు ప్రభువు ఆయనను కేఫా అని పిలుస్తున్నారు. ఆయన అంతగట్టివాడు కాకపోయినప్పటికి, అంత గట్టిగా ఆయనను చేస్తాడు యేసు ప్రభువు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మా పాపములను మోసే దేవుని గొర్రె పిల్ల అని యోహాను ద్వారా తెలుసుకుంటున్నాం. యోహాను తన శిష్యులు మిమ్ములను అనుసరిస్తున్నందుకు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తనను వీడిపోతున్నారు అనే బాధలేకుండా మిమ్ములను తెలుసుకుంటున్నారు అనే సంతోషం ఆయనలో ఉన్నది. మేము కూడా మా జీవితాలలో అటువంటి భావాలు కలిగి జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. యోహాను చెప్పినందుకే కాకుండా మిమ్ములను అనుసరించి, మీ దగ్గర ఉండి, మీరు ఎంత గొప్ప వారో, మరియు మీరు రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నట్లుగా మేము కూడా అనుభవ పూర్వకంగా మిమ్ములను తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా! మీరు ఏమి వెదకుచున్నారు అని శిష్యులను  అడుగుతున్నారు. మేము కూడా మా జీవితములలో చాలా వేదకూచున్నాము. శిష్యుల వలె రక్షకుడను  వేదకుట లేదు. ఏమి వెదకాలో మాకు తెలియదు. మిమ్ములను వెదికే జ్ఞానము మాకు దయచేయండి. సీమోను వలె మమ్ములను గట్టివారిగా  చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్ 

ఫిలిప్పు మరియు నతనయేలుల మనస్తత్వం

 ఫిలిప్పు మరియు  నతనయేలుల మనస్తత్వం

యోహాను 1: 43-51 

మరునాడు యేసు గలిలీయా వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో "నన్ను అనుసరింపుము" అని పలికెను. ఫిలిప్పు కూడఆంద్రెయ పేతురుల నివాసమగు బేత్సయిదా పుర నివాసియే. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు గలిలీయాకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభువు అనేక అద్భుతకార్యాలు ఈ ప్రదేశములోనే చేసినది. అంతేకాక ఈ ప్రదేశమున యూదులు మాత్రమే కాక అనేక మంది ఇతరులు అన్యులు కూడా ఉండేవారు. యేసు ప్రభువు పిలిప్పును చూసి నన్ను అనుసరింపమని అడిగాడు. పిలిప్పు యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. అంతేకాక పిలిప్పు జీవితంలో ఎంతో మందిని ప్రభువు దగ్గరకు తీసుకువచ్చిన ఉదంతమును సువిశేషంలో మనం చూస్తాము. ప్రభువుకు ప్రజలకు అనుసంధానం చేయడంలో పిలిప్పు చాలా నేర్పరిగా ఉండేవాడు. రెండు చేపలను ఐదు రొట్టెలను ఐదువేల మందికి పంచి పెట్టినప్పుడు ఒక పిల్లవాని దగ్గర ఉన్న చేపలను రొట్టెలను తీసుకొని వచ్చినది ఇతనే. మరియు కొంతమంది గలిలీయులు యేసు ప్రభువును కలుసుకొనుటకు వచ్చినప్పుడు కూడా ఈ పిలిప్పు వారిని ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నతానియేలును ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. 

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. పిలిప్పు కూడ ఆంద్రెయ వలె యేసు ప్రభువు గురించి అనుభవపూర్వకముగా తెలుసుకొని ఆయన మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నాడు. అందుకే ధర్మశాస్త్రమునందు, ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వానిని కనుగొన్నాము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుతో ఉండటం, ఆయనను కలవడం, ఆయనతో మాట్లాడటం ఒక వ్యక్తిని పూర్తిగా దైవ అనుభవంలోనికి తీసుకువెళ్తాయి. మిగిలిన ఎంత గొప్ప విషయంకూడ ఇటువంటి దైవ అనుభవాన్ని ఇవ్వలేవు. పిలిప్పు ఈ విషయము గురించి నమ్మకంతో ఉన్నాడు. ఫిలిప్పు సహాజముగానే దేవుని అన్వేషించే వ్యక్తి అందుకే ఆయనను యేసు ప్రభువే కనుగొంటున్నాడు. దేవున్ని మనం అన్వేషించినట్లయితే దేవుడే మనకు ఆవిష్కారం అవుతారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫిలిప్పు ఇప్పుడు ఈ విషయములను నతనయేలుకు చెబుతున్నారు. 

"నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలుకు మెస్సీయ్యా నజరేతు నివాసి అని చెప్పడం వలన ఆయన దానిని నమ్మలేకున్నాడు. ఎందుకంటే యిస్రాయేలులో నజరేతు ఒక తృణీకరింపబడిన పట్టణం. అక్కడ నుండి రక్షకుడు వస్తాడు అంటే నమ్మలేకపోయాడు. నజరేతు నుండి ఏదైన మంచి రాగలదా అని నతనయేలు అడిగిన కాని ఫిలిప్పు ఆయనతో వచ్చి చూడమని చెబుతున్నాడు. యేసు ప్రభువును  చూడడం వలన మనం ఆయనకు పూర్తిగా చెందినవారిగా మారిపోతాము. అందుకే ఫిలిప్పు వచ్చి చూడమని నతనయేలుతో అంటున్నాడు. "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. ఫిలిప్పు చెప్పినట్లుగానే యేసు ప్రభువు దగ్గరకు రాగానే నతనయేలు ఆశ్చర్యపోతున్నాడు. నతనయేలు గురించి యేసు ప్రభువు అతనిలో ఎటువంటి కల్మషం లేదు అని అంటున్నాడు. యిస్రాయేలు అంటేనే కల్మషం లేని వాడు అని అర్ధం. యాకోబు అంటే మోసగాడు కాని దేవునికి ఆ పేరు ఇష్టం లేదు. కనుక యాకోబు పేరు మారుస్తున్నాడు. అతనికి యిస్రాయేలు అని పేరుపెడుతున్నాడు. కానాను అంటే నైతిక విలువలు లేనిది కాని, ఆ భూమిని ప్రభువు తన సొంత ప్రజలకు ఇస్తున్నప్పుడు  ఆ భూమికి యిస్రాయేలు అని పేరు పెడుతున్నాడు. నతనయేలును చూసి ఆయనను నిజమైన యిస్రాయేలియుడు అని చెబుతున్నాడు. అతని గురించి పూర్తిగా తెలిసినట్లుగా ప్రభువు మాటలాడుతున్నాడు. అంజూరపు చెట్టుక్రింద ఉండటం నేను చూశాను అని తెలియజేస్తున్నాడు. అంటే జ్ఞానం కోసం ఎదుకుచున్నప్పుడు చూశాను అని అర్ధం. 

 "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. వెంటనే నతనయేలు యేసు ప్రభువును దేవుని కుమారుడవు , యిస్రాయెలు రాజువు  అని సంబోధిస్తున్నాడు. ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వారు, ఇలానే ప్రభువు గురించి తెలుసుకుంటారు.ప్రభువుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేలా మనకు ఉండేలా మనం ప్రయత్నించాలి అప్పుడు మనకు ప్రభువుతో ఉన్న అనుభవం మారిపోతుంది. ప్రభువు ఇక్కడ నతనయేలుతో ఇంతకంటే గొప్ప విషయాలు చూచెదవు అని చెబుతున్నారు. దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరని చెబుతున్నాడు. యేసు ప్రభువు భూలోకమునుండి  పరలోకానికి  పోవుటకు నిచ్చెన ఆయన ద్వారానే మానవుడు పరలోకం పోవడం జరుగుతుంది ఇవి అన్ని కూడ చూడగలం అని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన:  ప్రభువా! మీరు మిమ్ము అన్వేషించే పిలిప్పును కనుగొని అతనికి రక్షకుడిని తెలుసుకునే అనుగ్రహమును ఇస్తున్నారు. ఫిలిప్పు ఏవిధముగా అయితే అనేక మందిని మీ వద్దకు తీసుకొని వస్తున్నాడో, మేము కూడా అలానే మీ  వద్దకు ఇతరులను తీసుకొని వచ్చేందుకు కావలసిన అనుగ్రహములను పొంది, ఇతరులను మీ వద్దకు తెచ్చేలా మమ్ములను మార్చండి. ప్రభువా ! మిమ్ములను అనుభవపూర్వకంగా తెలుసుకొనుటకు మేము చేయవలసినదంతయు ఎటువంటి లేమి లేకుండా చేసేలా మమ్ము దీవించండి. ప్రభువా! నతనయేలు మీరు నజరేతువాసి అంటే నమ్ముటకు సిద్దంగా లేడు, కాని మిమ్ము చూసిన తరువాత ఆయన అభిప్రాయం మొత్తం మారిపోయింది. మీరు నతనయేలును నిజమైన యిస్రాయేలు అని చెబుతున్నారు. ఆయనలో ఎలా కల్మషం లేకుండా ఉన్నారో మేముకూడా మేము కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఉండేలా మమ్ము దీవించండి. ఆమెన్.   

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 మత్తయి 2:1-12

హెరోదు రాజు పరిపాలనాకాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు  తూర్పు దిక్కు నుండ యెరుషలెమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున  చూచి మేము ఆరాధింపవచ్చితిమి" అని అనిరి. ఇది విని హెరోదు రాజును, యెరుషలెము నగరవాసులందరను కలతచెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్రభోదకులను సమావేశపరచి "క్రీస్తు ఎచట జన్మించును?" అని ప్రశ్నించెను. "యూదయ సీమయందలి బెత్లెహేమునందు" అని వారు సమాధానమిచ్చిరి. "యూదయ సీమయందలి బెత్లెహేమా! నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఎలయన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలోనుండి వచ్చును" అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును  వారి నుండి తెలిసికొనేను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును" అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్లిపోయిరి. అదిగో! తూర్పుదిక్కున వారిముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి.  
 
 హెరోదు రాజు  యూదయా ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం  37 వ సంవత్సరం నుండి  4 వ సంవత్సరం వరకు పాలించాడు. మీకా గ్రంధం 5:1-3 ప్రకారం బెత్లేహేము రక్షకుని యొక్క  జన్మ స్థలం. మరియు అది దావీదు  రాజు యొక్క జన్మ స్థలం కూడా.  లోక రక్షకుడు జన్మించిన విషయం తెలుసుకున్న ముగ్గురు రాజులు యేసు ప్రభువును చూసి ఆరాధించుటకు అక్కడకు వస్తున్నారు. ఈ ముగ్గురు రాజులు హేరేడేటాస్ అనే చారిత్రకారుని  ప్రకారం మెదియ అనే  తెగకు  చెందినవారు. మెదియా అనేది  పర్షియా రాజ్యంలో ఒక భాగం. మెదియా ప్రజలు  పర్షియన్ల పాలన నుండి స్వాతంత్ర దేశంగా ఎదగాలని అనుకునేవారు. అనేక సార్లు యుద్దాలు చేసి ఓడిపోయారు.   వారికి ఉన్న ఈ కోరిక సాధ్యంకాక వారు వేరే విధంగా స్థిరపడ్డారు.  ఏవిధంగా వీరు స్థిరపడ్డారు అంటే వీరికి అంతరిక్ష శాస్త్రంలో ఉన్న నైపుణ్య కారణంగా అంతరిక్షంలో ఏర్పడే మార్పుల ఆదరముగా భవిష్యత్తును చెప్పడం. జ్ఞానమునకు వీరు ఇచ్చే ప్రాముఖ్యతకు అనుకూలంగా దైవ జ్ఞాన విషయాల గురించి తెలుసుకుంటూ యాజకులుగా స్థిరపడ్డారు. భవిష్యవాణి చెప్పేవారిగా , జ్ఞానులుగా మరియు యాజకులుగా స్థిరపడిన వీరు పాలన చేయాలనే రాజ్యాధికార వ్యామోహం వదలిపెట్టారు.  పర్షియా దేశంలో వీరిని జ్ఞానులుగా  మరియు పవిత్రులుగా చూసేవారు. వీరు ప్రవచనాలు చెప్పడంలో , వైద్య శాస్త్రంలో  మరియు అంతరిక్ష శాస్త్రాలలో ప్రసిద్దులు. అంతరిక్షం లో జరిగే మార్పులను బట్టి వీరు ఏమి జరుగుతున్నదో చెప్పేవారు. వీరు యూద ప్రజలు కాదు. వీరు కూడా అన్య ప్రజలే కానీ పరిస్థితులను అవగాహన చేసుకోగలిగిన వారు. మంచి చెడులు తెలిసినవారు. 

ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే, ఎందుకు అంటే ఆదికాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులే, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవునికి  అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తిస్తున్నారు, తెలుసుకుంటున్నారు మరియు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. కనుక వీరి రాకతో మరియు వీరు అర్పించిన బహుమానములతో యేసు ప్రభువు దేవుడు అనే విషయం తెలుస్తుంది. 

ఈ ముగ్గురు రాజులు, ఆకాశంలో ఒక నక్షత్రం చూసి, ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో  జన్మించారు, అని తెలుసుకున్నారు. వారు ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. అది ఏమిటి అంటే ఇన్నాళ్ళూ వారు ఆకాశంలో చూసిన అన్ని మార్పులు వారి జీవితంలో మార్పు తీసుకురాలేదు. కాని ఈ నక్షత్రం ఖచ్చితంగా మార్పు తీసుకువస్తుంది అని వారు నమ్ముతున్నారు. వారు జ్ఞానులుగా ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారు తెలుసుకున్న విషయం వారిజీవితంలో తెలుసుకున్న అన్ని విషయాల కంటే గొప్పది అది ఏమిటి అంటే లోక రక్షకుడు ఎవరు అనెది. బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభువు రక్షకుడు అని మరియు దేవుడు అని వారు తెలుసుకుంటున్నారు. అంతే కాదు ఈయన మాత్రమే వారి జీవితాలలో ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయగలరు అని తెలుసుకుంటున్నారు.   ఉన్న   వారి అన్ని ఆశలకు సమాధానం ఈ నక్షత్రం తెలియచేస్తుంది అని నమ్మారు, లేకపోతే   వారు అంత దూరంనుండి  వచ్చే వారు కాదు. ఇంత దూరం వచ్చి ఏమి చూసారు అక్కడ? కేవలం చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను,  అటువంటి ప్రదేశంలో మరియు అటువంటి పరిస్థితిలో ఉన్న యేసు ప్రభువును ఎందుకు వారు ఆరాధించారు? ఈ ప్రశ్న మనం అడిగినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వారికి  అక్కడ  దేవుని మహిమను కనబడింది.   వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. దేవుని చూడటానికి వెళుతున్నారు. నిజమైన జ్ఞానాన్ని పొందడానికి వెళుతున్నారు. దేవున్ని కలవడానికి వెళుతున్నారు. ఇవి అన్ని యేసు ప్రభువులో చూస్తున్నారు.  అందుకే ఆయనను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉండి యేసు ప్రభువు రాజరికాన్ని ఆమోదిస్తున్నారు.   దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి  వెళుతున్నారు. 

 ఈ కారణాల వలన ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం.  ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఈ జ్ఞానులకు తనని తాను  తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక  నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. మనం కూడా ఆయన గురించి విని ఉన్నాము. ఆయన చేసిన పనులు తెలుసుకొని వున్నాము. ఆయనను మనం కూడా గుర్తించి, అంగీకరించి, ఆరాధించి ఆయన దైవత్వాన్ని అంగీకరించి ఆయన రాజరికాన్ని అంగీకరించి ఆయన దీవెనలు పొందవచ్చు. 

ఈ జ్ఞానులు ఏమి అర్పిస్తున్నారు?  యేసు ప్రభువుకి ఆయనను ఆరాధించిన తరువాత వారు బంగారం వారు అర్పిస్తున్నారు. బంగారం ఎందుకు అర్పిస్తున్నారు  అంటే బంగారాన్ని రాజులకు అర్పిస్తూ ఉంటారు, అంటే వారు  ఆయనను రాజుగా వారి అధిపతిగా అంగీకరిస్తున్నారు. మరల పరిమళ ద్రవ్యాలను ఇస్తున్నారు. అవి ఆయన శ్రమలు మరియు మరణాన్ని గుర్తు చేస్తున్నాయి.  ఆయన ఏ విధంగా ప్రజలను రక్షించబోతున్నారు అని తెలియ చేస్తున్నాయి. తరువాత వారు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. ఇది దేవుని ఆరాధనకు  అర్పించేది ఎందుకంటే ఆయన తమ యాజకునిగా, దేవునిగా వారు  గుర్తించారు. వారు కూడా యాజకులుగా స్థిరపడినవారే అయినా కాని  నిత్య యాజకునిగా ఆయనను వారు గుర్తిస్తున్నారు. 

వీరు యేసు ప్రభువుని తెలుసుకొని రాజుగా, యాజకునిగా మరి ముఖ్యముగా దేవునిగా తెలుసుకుంటున్నారు. అయన దగ్గరకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు ఆయన యూదుల రాజు పుట్టాడు మేము ఆయన్ను చూడటానికి వచ్చాము అని చెప్పగానే ఆయన ఆందోళన చెందుతున్నాడు. యేసు ప్రభువును తన ఆధికారముకి అడ్డంగా ఉంటాడు అని ఆయనను చంపాలని అనుకుంటున్నాడు. యేసు ప్రభువు అధికారం మనం చూపించే అధికారం లాంటిది కాదు. అది ప్రేమించే అధికారం, రక్షించే అధికారం. క్షమించే అధికారం. అది తెలియని హెరోదు అనేక మంది చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. హేరోదు రాజు  యూదయ పెద్దలను అందరిని పిలుస్తున్నాడు.  యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడో తెలుసుకుంటున్నాడు.  మతపెద్దలకు  ఆయన ఎక్కడ పుడతాడో  తెలుసు.  కాని వారు జ్ఞానుల వలె   ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి అని అనుకోలేదు. మనం వీరిలా ఉండకూడదు.  ఈ  ముగ్గురు జ్ఞానులే ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి.  మనము వీరిని ఆదర్శముగా తీసుకోవాలి, ఆ విధంగా జీవించాలి. అందుకు కావలసిన అనుగ్రహాలు ఇవ్వమని ఆ ప్రభువును అడుగుదాం. 



యేసు క్రీస్తుని బప్తిస్మం

 యేసు క్రీస్తుని బప్తిస్మం 

మార్కు 1: 7-11 

"నా కంటే శక్తిమతుడోకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని. కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. ఆ రోజులలో  గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యొర్ధాను నదిలో యోహనుచేత బప్తిస్మము పొందెను. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువబడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుట చూచెను. అపుడు పరలోకము నుండి ఒక వాణి "నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను" అని వినిపించెను

ధ్యానం: యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు. 

యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భాషలా ఉంది. పరలోకం తెరవ బడటం అంటే  యుదయా ప్రజలు పరలోకానికి భూలోకానికి మధ్య ఒక విభజన ఉంది అని, అవి ఇప్పుడు వేరు చేయ బడినవి  అని నమ్మారు.  అంటే ఇప్పుడు పరలోకానికి , భూలోకానికి ఒక అడ్డు ఉందని అది కొన్ని ప్రత్యేక సంధర్భాలలో తొలగించబడుతుంది అని వారి నమ్మకం. ఎప్పుడు  ఈ ప్రత్యేక సంధర్భం లేక ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే పాత నిబంధనలో ప్రవక్తలు , దీర్ఘ దర్శులు దేవ రహస్యాలను చూస్తారు కాబట్టి వారి దృష్టిలో పరలోకం భూలోకం ఏకమవుతాయి. అంటే దేవుడు భూలోకానికి వస్తున్నాడు అని అర్థం. పరలోకం మరియు భూలోకం మధ్య సంగమం ఏర్పడుతుంది. 

ఇది చాలా కాలం తరువాత యేసు ప్రభువు బాప్తిస్మము రోజున జరుగుతుంది. మనం యెషయా  64:1 లో చూసినట్లయితే యెషయా ప్రవక్త "ఓ దేవా ! నీవు పరలోకం చీల్చి క్రిందికి దిగి రమ్ము" అని అంటున్నారు. ఈ ప్రార్ధన అర్ధం దేవుడు ఆయన్ను పూర్వ కాలంలో వలే తెలియ పరచాలి అని, నిర్గమ 19:16-19 , ఇక్కడ దేవుడు పర్వతము నుండి వస్తారు. అంటే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తూంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియ చేసే సమయంలో లేక కొన్ని గొప్ప కార్యాలు ప్రారంభించే సమయములో జరుగుతుంది.  

యేసు ప్రభువు బాప్తిస్మము లో జరుగుతుంది కూడా ఇదే. ఇక్కడ సంభాషణ  జరుగుతుంది యేసు ప్రభువుకి మరియు దేవునికి మద్యలో, అందుకే యేసు ప్రభువు ప్రారంభించే పని, సరి అయినది అని దేవుని ఆమోదం పరలోక వాణి ద్వార మరియు పవిత్రాత్మ  యేసు ప్రభువు  మీద పావుర రూపమున దిగి రావడం ద్వార తెలుస్తుంది. రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి  దేవుని అనుగ్రహం ఇక్కడ జరుగుతుంది. పవిత్రాత్మ ఈ కార్యానికి తోడ్పాటు అందిస్తుంది. 

 పరలోక వాణి  : బాప్తిస్మము జరుగుతున్న సమయములో పరలోకము నుండి ఒక వాణి  వినబడుతుంది.  ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మిగిలిన వారు నిజముగా అక్కడ ఉన్న వారందరికీ వినబడింది లేనిది మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభువు పౌలుకు  డమాస్కస్ (అ. చ 9:7,22:9) దర్శన మిచ్చిన సమయములో పౌలుతో ఉన్న ప్రజలు వెలుగును మాత్రమే చూసారు, శబ్దం విన్నారు కానీ ఆ మాటలను గుర్తు పట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రము ఇక్కడ తండ్రి మాటలు ఊరటను బలాన్ని ఇస్తున్నాయి. 

దేవుడు ప్రజలతో మాట్లాడటం మనం పాత నిబంధనలో కూడా  చూస్తాం. ద్వితీ 4:10-12, నిర్గమ 3:4 కనుక పరలోక వాణి అనేది యిస్రాయేలు ప్రజలకు తెలుసు. నీవు నా ప్రియమైన కుమారుడవు పరలోక వాణి పలుకుతుంది  అని వింటున్నాము.  అంటే ఈ మాటలు యేసు ప్రభువు కొరకు వచ్చినవి. ఈయన దేవుని కుమారుడు అని అదే విధముగా ఈయన చేసే పని దేవుని కార్యము అని తెలియచేస్తుంది. అంటే ఈయన చేయబోయే పనికి తండ్రి ఆమోదం ఉంది అని తెలియచేస్తుంది. 

ఈ క్రీస్తు బాప్తిస్మము మనకు ఏమి తెలియ చేస్తుంది? అని అంటే మొదటిగా దేవుని ప్రణాళిక అమలు చేయడానికి నేను సిద్దముగా ఉండాలి అని తెలియ చేస్తుంది. ఎందుకంటే పునీత బాప్తిస్మ యోహను గారు యేసు ప్రభువు బాప్తిస్మము స్వీకరించడానికి వచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడానికి అర్హుడను కాను నేనే నీ వద్ద బాప్తిస్మము స్వీకరించ వలసిన వాడను అని అంటున్నారు. కాని యేసు ప్రభువు ఇప్పడు నిర్ణయించబడిన విధముగా జరగనివ్వమని చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి ఆయన తన గొప్పతనం  లేక దేనినైనా కూడా వదులు కోవడానికి సిద్దముగా ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుతో తన రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పరిచర్య , స్వస్థత చేయటం, క్షమించడం, దేవుని నుండి దూరముగా వెళ్ళిన వారిని వెదకి  తీసుకురావడం మొదలు పెట్టబోవుచున్నారు. వానికి ముందుగా  బాప్తిస్మ యోహను దగ్గరకు వస్తున్నారు. యోహను పాప క్షమాపణ పొందడానికి పశ్చాతాపం కలిగి జీవించమని పిలుపు ఇచ్చారు, వారికి బాప్తిస్మము ఇస్తున్నారు. 

ఎందుకు యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు?  యోహను ఇచ్చే బాప్తిస్మము పాప క్షమాపణకు కదా!  మరి యేసుప్రభువులో ఎటువంటి పాపం లేదు కదా ! యేసు ప్రభువుకి ఈ బాప్తిస్మము అవసరం లేదు, అందుకే యోహను యేసు ప్రభువుతో  నేనే నీ వద్ద బాప్తిస్మము తీసుకోవలసిన వాడిని, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడమా ? అని అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఇప్పటికీ ఇటులనే కానిమ్ము,   దైవ  సంకల్పమును మనము ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని చెపుతున్నారు.  దాని అర్దము దేవుని సంకల్పమును నెరవేర్చుటకు నేను ఏమి చేయడానికి అయిన సిద్దమే అని తెలుపుతున్నారు. యేసు ప్రభువు జీవితము మొత్తము కూడా తండ్రి దేవుని సంకల్పమును నెరవేర్చడమే. అది చేయడము కోసము యేసు ప్రభువు ఎంత వరకు అయిన వెళతారు. తన కంటే తక్కువ వాడైన యోహను ఇచ్చే బాప్తిస్మము తీసుకుంటున్నారు. తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన ప్రాణాన్ని ఇస్తున్నారు.  దేవునితో తన సమానత్వాన్ని వదలి మానవునిగా మన మధ్యకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం నెరవేరాలి. యేసు ప్రభువు ఒక అనమకునిగా ఎందుకు జన్మించాలి, ఎందుకు మరణించాలి, పాపుల చేత ఎందుకు నిందించబడాలి, ఎందుకు వారి చేత శిక్షించబడాలి , అన్నిటికీ సమాదానం యోహానుకు యేసు ప్రభువు ఇస్తున్నారు. దేవుని సంకల్పం నెరవేరుటకు ఈ విధముగా జరుగనివ్వు అని అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువును గురించి తండ్రి దేవుడు చెప్పే విషయాలు మనకు ఇక్కడ వివరించబడ్డాయి. తండ్రి దేవుడు తన కుమారుడును ప్రవర్తన పట్ల ఎంతో ఆనందముగా ఉన్నాడు. అదే విధంగా తన కుమారుడు తండ్రి కోసం ఏమి అయిన చేస్తాడు.  

ఈ రోజు యేసు ప్రభువు బాప్తిస్మము ద్వార ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఏమి చేయడానికైనా సిద్దముగా ఉండాలి. మనము కూడా ఆ విధంగా జీవించడానికి సిద్దముగా ఉందాం. ఆమెన్

కుష్ట రోగి స్వస్థత- యేసు ప్రభువు కరుణ

 కుష్ట రోగి స్వస్థత- యేసు ప్రభువు కరుణ 

మార్కు 1:40-45 

కుష్టరోగి ఒకడు వచ్చి ప్రభువుఎదుట మోకరించి, "నీకు ఇష్టమగుచో  నన్ను స్వస్థపరపగలవు" అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి, చేయిచాచి, వానిని తాకి "నాకు ఇష్టమే శుద్దిపొందుము"అనెను. వెంటనే అతని కుష్టరోగము తొలగిపోయెను. అతడు శుద్దుడయ్యెను. యేసు అపుడు "నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు" అని గట్టిగా అజ్ఞాపించి, "నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. కాని వాడుపోయి, ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక, నిర్జనప్రాంతమునకు వేళ్ళను. కాని నలుదేసలనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. 

ధ్యానము: నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ఒక కుష్టరోగి ప్రభువుతో అంటున్నాడు. కుష్టు రోగము అనే జబ్బును దేవుని శాపంగా ప్రజలు భావించేవారు. లేవియఖాండంలో 13 మరియు 14 అధ్యాయాలలో కుష్టురొగులును యాజకులు అశుద్దులుగా ప్రకటించారు. దీని పర్యవసానంగా కుష్టురోగంతో ఉన్నవారు మత పరమైన మరియు సామాజిక పరమైన విషయాలలో పాల్గొనడం నిషేదించబడింది. ఆనాటి సమాజం కుష్టురోగితో ఎటువంటి సాన్నిహిత్యం లేకుండా ఉండటానికి కోరుకున్నారు.   కుష్టురోగం వారిని కలిసిన వారిని, వారితో మాటలాడిన వారిని కూడా అపవిత్రులను చేస్తుంది అని చెప్పడం వలన వారిని తాకడం లేక వారితో మాట్లాడటం కూడా ప్రజలు ఇష్టపడలేదు. మరియు కొన్ని సార్లు వారిని అశుద్దులుగా పరిగణించి రాళ్ళతో కొట్టేవారు. ఇది అంటురోగం కావడం వలన వారితో సాన్నిహిత్యం ప్రజలు హర్షించలేదు, ఒకరకంగా ద్వేషించారు. వారి పేరు ఉచ్చరించాలన్న భయపడేవారు. సమాజికంగా, సాంఘికంగా మత పరంగా కుష్టురోగి అవమానంతో రోజు మరణించేవాడు. జబ్బుతో మనిషి కృశించి పోయేదానికన్నా సామాజికంగా ఎడబాటు వారిని ఎక్కువగా బాధించేది. 

యేసు ప్రభువు కేవలము దైవికమైన విషయాలు మాత్రమే బోధించలేదు. ఆయన దేవుడు కనుక సమాజంలో ఉన్న అన్ని సమస్యలు, అసమానతలు తెలిసినవాడు. ఒక సంఘ సంఘసంస్కర్త వలె  ఆయన సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు పరిష్కారం చూపడమే కాకుండా, ఇటువంటి సమస్యలతో బాధించబడే వారితో ఎలా ఉండాలో కూడా తన జీవితంతో నేర్పుతున్నారు. కనుక కుష్టురోగంతో ఉన్న వ్యక్తిని తాకుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క విలువ మానవ ఆకారంలో కాదు ఆయన వ్యక్తిత్వంలో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. కుష్టు రోగం ఒక వ్యక్తిని అందవికారముగాచేయడమేకాక ఆ వ్యక్తిని  అనేక విధాలుగా తింటుంది. యేసు ప్రభువు  కుష్టు రోగికి మరల ఆ కోల్పోయిన భాగాన్ని అతనికి వచ్చే విధంగా చేస్తున్నాడు.  కుష్టు రోగమునకు స్వస్థత అనేది లేదు, కాని ఆనాటి  ప్రజలు ప్రతి చర్మ వ్యాధిని కూడా కుష్టు రోగముగానే పరిగణించేవారు. ఒక వ్యక్తి స్వస్థత పొందినట్లయితే దానికి దృవీకరించవలసినది యాజకుడు కనుక వారు యాజకుని దగ్గర దృవీకరించుకోవాలి. వారు శుద్దిపొందారు అని యాజకులు నిర్ధారించేవారు. 
 
యేసు ప్రభువు ఆ వ్యక్తి మీద జాలి పడి, చేయి చాపి అతనిని  తాకి నాకు ఇష్టమే. స్వస్థత పొందుము అని అంటున్నాడు.  యేసు ప్రభువు బాధలలో, కష్టాలలో ఉన్న వారి పట్ల ఎంతో ఆధరణ  చూపేవాడు. వారి బాధ తాను అనుభవించినంతగా వారి కోసం పరితపించేవాడు. అందుకే మన అందరి పాపలు మోయుటకు కూడా సిద్దపడ్డాడు. కనుకనే అడిగిన వెంటనే ఆ వ్యక్తి బాధను తీసివేయాలని చేయి చాపి, అతనిని తాకుతున్నాడు.  ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుతున్నాడు. యేసు ప్రభువు  మానవుడు అన్ని విధాలుగా సంపూర్ణతను పొంది వుండాలి అని కోరుకుంటాడు. మానవుడు ఎటువంటి లోపం లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఆ వ్యక్తికి కోల్పోయిన సంపూర్ణతను ఇస్తున్నాడు. ఆ వ్యక్తి కోల్పోయిన ఆరోగ్యమును తిరిగి ఇస్తున్నాడు. అతడు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండేటట్లు చేస్తున్నాడు. నీవు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అని ప్రకటిస్తున్నాడు. కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి కూడా అన్ని విధాలుగా ఎదగాలని, సంపూర్ణత కలిగిఉండాలని మరియు ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. 

"నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. యేసు ప్రభువు ఆ వ్యక్తి స్వస్థత పొందిన తరువాత ఆ వ్యక్తిని వెళ్ళి యాజకునికి కనిపించమని చెప్పుట వలన, యాజకుడు ఆ వ్యక్తిని శుద్దుడు అని దృవీకరించుట వలన సమాజంలోనికి  అతను  అధికారికంగా రాగలుగుతాడు. ఎవరు ఆయనను ఆటంకపరచరు. కాని అలా చేయకపోతే ఇది అతని మీద అనేక అనుమానాలకు దారితీస్తుంది. మరియు ఆ వ్యక్తి  వివక్షకు గురిఅవుతూనే ఉంటాడు. కాని ప్రభువు ఆ వ్యక్తి ఎటువంటి వివక్షకు గురికాకూడదు అని అనుకుంటున్నాడు. అందుకే అతన్ని పోయి అర్చకునికి కనపడి, నీవు చట్టపరంగా చెల్లించవలనసినది చెల్లించమని సూచిస్తున్నాడు. ప్రభువుకు మానవుడు ఏ విధంగా కూడా అసమానతలకు, అవమానములకు, వివక్షకు గురికాకూడదు అని కోరుకుంటున్నాడు. 

సంభాషణ మరియు ప్రభువుతో ప్రార్ధన:   ప్రభువా ! మీ కరుణ ఎంత ఉన్నతమైనది. లోకం మొత్తం కూడా భయంతో కుష్టువారిని దగ్గరకు, రానివ్వప్పటికి వారిని  దగ్గరకువారిని రాళ్ళతో కొట్టలేదు.  వచ్చిన వారిని అసహ్యించుకోలేదు.  మీరు మాత్రం వారిని తాకుతున్నారు. వారు స్వస్థత పొందాలని కోరుతున్నారు. అంతే కాకుండా వారిని స్వస్థపరుస్తున్నారు. కుష్టు రోగి స్వస్థ పడుట నాకు ఇష్టమే అని తెలియజేస్తున్నావు. ప్రభువా మీరు కోల్పోయిన ఆరోగ్యమును తిరిగిఇస్తున్నారు. సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని ఇస్తున్నారు. మా జీవితంలో కూడా ప్రభువా అనేక అసమానతలకు మరియు వివక్షకుఅవుతున్నాము. కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్న అసమానతనలను చూసి వాటిని తీసివేయడానికి మీవలె మేము కూడా కృషి చేసేలా చేయండి. ప్రభువా! మీరు స్వస్థత పొందిన వ్యక్తిని సమాజంలో గౌరవం పొందాలని, ఆ విషయం చట్టపరంగా దృవికరించబడాలని కోరుతున్నారు. మేము కూడ ప్రతి వ్యక్తి సమాజంలో వివక్ష లేకుండా ఉండుటకు చేయవలసిన పని చేయుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్ 


లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...