28, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 8: 23-27 

అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను. అప్పుడు శిష్యులు  ఆయనను మేలుకొలిపి "ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ,  యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని పలికి , లేచి గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి. 

యేసు ప్రభువు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు నిద్రపోతున్నారు. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి , పడవను ముంచెత్తింది.  సముద్రములో అలలు  చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు భయ పడుతున్నారు. ఎందుకు ఈ శిష్యులు అందరు భయపడుతున్నారు. వారు ఏమి  సముద్రం గురించి తెలియని వారు కాదు. వీరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారు. ఈత తెలిసిన వారు. సముద్రం గురించి తెలిసిన వారు. కాని వారు భయ పడుతున్నారు. ఎందుకంటే ఆ అలలు చాలా భయంకరమైనవి. వారు అంతకు ముందు చూడనివి కావచ్చు. ఆ అలల తీవ్రతను బట్టి వారు దానిని ఒక సాధారణమైన తుఫాను కాదు అని  అంచనా వేశారు. అందుకే వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సముద్రములో చెలరేగిన ఈ అలలు ఇప్పుడు వారి జీవితములో చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియదు. వారు చనిపోతారో, బ్రతుకుతారో తెలియదు. వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి తమ గురువుకు తాము అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా  తెలియచేయాలా  అని వారు ఒక సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. 

"ఆయనను మేలుకొలిపి,ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము అని" చెబుతున్నారు. ఇక్కడ శిష్యులు చాలా వరకు వారి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి యేసు ప్రభువు దగ్గరకు వెళుతున్నారు. వారి జీవితం ముగిస్తుంది అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని దేవుడు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వారికి తుఫాను గురించి బాగా తెలుసు. సముద్రం గురించి తెలుసు. ఎప్పుడు సముద్రం తీవ్ర రూపం దాల్చుతుందో వారికి తెలుసు. ఈ పరిస్థితిలో వారు జీవించడానికి యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు వారిని కాపాడలేరు. వారు నాశనం చెందకూడదు అనుకున్నారు. వెంటనే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. మమ్ములను రక్షింపుము అని వేడుకుంటున్నారు. ఈ వెడుకోలులో వారి భయం, ప్రాణం మీద ఆశ అన్నీ అరచేతిలో పెట్టుకొని ఏమి అవుతుందో అని ప్రభువు దగ్గరకు వెళ్లారు. వారిని ప్రభువు రక్షిస్తున్నారు.  సముద్రంను ఆయన శాసిస్తున్నాడు. ఆయన మాటను విని సముద్రం శాంతిస్తుంది.   

యేసు వారితో , ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ? అని అంటున్నారు.  యేసు ప్రభువు వారిని అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులకు వీరు సాక్షులు, సముద్రాన్ని , దాని అలలను అంచనా వేయగలిగిన వీరు వారితో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువు ఎవరు అని వారు గ్రహించలేక పోయారు. ఆయన మనతో ఉన్నంత కాలం మనకు ఎటువంటి అపాయం ఉండదు అని గ్రహించలేకపోయారు. వారు భయ పడుతున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులను చూసికూడా వీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేక పోయారు. పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ కొదవయు లేదు అని అంటున్నారు. యేసు ప్రభువు శిష్యులు కూడా అలానే ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇక ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోవాలి. అది వీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాడంలో వారు ఇఫలం చెందారు అందుకే యేసు ప్రభువు యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని  అంటున్నారు. 

అప్పుడు యేసు ప్రభువు లేచి  "గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి." గాలిని , సముద్రమును యేసు ప్రభువు గద్దింపగా సముద్రము శాంతించింది. ఇది యేసు ప్రభువు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు శిష్యులు యేసు ప్రభువు స్వస్థత  ఇవ్వడం చూసారు. అద్భుతాలు చేయడం చూసారు. కాని ఇక్కడ యేసు ప్రభువుకు ప్రకృతి కూడా ఆయన మాట వింటున్నది. ఆయన చెప్పినట్లు చేస్తుంది.  అప్పుడు అది చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎవరు , ఈయనకు ప్రకృతి కూడా మాట వింటున్నది అని వారు అనుకుంటున్నారు. యేసు ప్రభువుతో మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ సమస్యలు తీరుతాయి. ఆయనతో మనతో ఉంటే మనకు ఏ కొదవయు ఉండదు. అంతే కాదు ప్రశాంతత మన జీవితంలో ఎల్లప్పుడు ఉంటుంది. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవితంలో అనేక సార్లు అనేక కల్లోలాలు వచ్చినవి అటువంటి సమయంలో నేను భయ పడి పోతున్నాను. నాకు నాశనము తప్పదు అని అనుకుంటున్నాను. నిరాశలో జీవిస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు నన్ను క్రమ్మేస్తున్నాయి. అప్పుడుకూడా నేను భయ పడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు అని తెలుసుకోలేక పోతున్నాను. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోలేకపోయాను. అటువంటి సమయంలో నన్ను క్షమించండి. నీవు నాకు తోడుగా ఉన్నవన్న విషయాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకునే విధంగా దీవించండి. నా జీవితంలో వచ్చే అనేక అలలను ఎదుర్కోడానికి కావలసిన శక్తిని దయ చేయండి. మీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవించే వానిగా నన్ను చేయండి. ప్రభువా! నీవు సముద్రమును గద్దింపగా అది శాంతించింది. అటులనే నా జీవితంలో మీ మీద విశ్వాసం సన్నగిళ్ళే ప్రతి విషయాన్ని గద్దించండి.  మీ మీద ఎప్పుడు విశ్వాసం ఉండే వానిగా చేయండి. ఆమెన్ . 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...