27, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం,

 మత్తయి 8:18-22 (జూన్ 27,2022)

యేసు తన చుట్టుప్రక్కల నున్న గొప్ప జన సమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని అజ్ఞాపించును. అపుడు ధర్మ శాస్త్ర  బోధకుడొకడు యేసును సమీపించి , "బోధకుడా!  నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను" అనగా  యేసు,  "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" ప్రత్యుత్తర మిచ్ఛెను. మరియొక శిష్యుడాయనతో "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని పలికెను. 

"నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్దుడను", ఈ మాటను ఒక బోధకుడు  యేసు ప్రభువుకు చెబుతున్నారు. ఎందుకు ఇతను యేసు ప్రభువును అనుసరిస్తాను అని అంటున్నాడు అంటే యేసు ప్రభువు చేసిన పనులు ఆయన చూసి ఉండవచ్చు. యేసు ప్రభువు అనేక మంది ఆకలితో ఉన్నవారిని చూశాడు. వారు ఆకలితో ఉన్నారు అని తెలుసుకొని వారి ఆకలిని తీర్చాడు. అంతె కాదు సాతాను చేత పీడింపబడుతున్న వారిని చూశాడు. వారికి సాతాను నుండి విముక్తి ఇచ్చాడు. యేసు ప్రభువు అనారోగ్యంతో ఉన్న వారిని చూశాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ విధముగా ప్రజల అన్నీ సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని వారికీ కావలసినవి ఇచ్చి వారి సమస్యలును తీసివేస్తున్నాడు. అయితే ఇవి అన్నీ తెలిసిన వ్యక్తి  అయివుండవచ్చు, నేను, నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సిద్ధం అని పలికే ఈ వ్యక్తి. ఒక వేళ ఈయనను అనుసరిస్తే నాకు కూడా ఈయన ఇస్తున్నటువంటివన్నీ నాకు రావచ్చు అని అనుకోని యేసు ప్రభువును అనుసరించడానికి వీరు సిద్దం అయి ఉండవచ్చు. లేక యేసు ప్రభువును అనుసరిస్తే ఆయనకు వస్తున్న ఆధరణ నాకు రావచ్చు అని ఆయనను అనుసరించడానికి సిద్దం అయి ఉండవచ్చు. లేక తాను బోధకుడు కాబట్టి యేసు ప్రభువును అనుసరించడం తనకు ముక్తిని దయ చేస్తుంది అని తెలుసుకొని ఆయనను అనుసరించడానకి సిద్ధం అయి ఉండవచ్చు. 

అయితే యేసు ప్రభువు మాత్రం, "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" అని అంటున్నారు. కారణం ఏమి  అయి ఉండవచ్చు అంటే ఆయనను అనుసరించవలసినది, ఆయన ఇతరులకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు, వరాలు, లేక  ఆయన ద్వార వచ్చే ఆదరణకొ కాదు. కేవలం ఆయన ఇచ్చే రక్షణ కోసం మాత్రమే కాదు. మరి ఇంకా ఎందుకు అంటే యేసు ప్రభువును అనుసరించవలసినది, ఆయన తరువాత ఆయన జీవితాన్ని, ఆయన పనులను, ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి. ఇక్కడ ఆ బోధకుడు నేను నిన్ను అనుసరించడానికి సంసిద్దుడను అని అంటున్నాడు. కాని ఆ బోధకుడు ఇవన్నీ చేయడానికి సిద్ధముగా ఉన్నాడా? లేడా ?అనేది ముఖ్యం. అందుకే యేసు ప్రభువు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కాని మనుష్య కుమారునకు మాత్రం తలవాల్చుటకైన చోటు లేదు అంటున్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యుడు ఆయనను అనుసరించుటలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితికి అయిన సిద్దంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎటువంటి సౌకర్యం లేకుండా కూడా ఆయనను అనుసరించుటకు సిద్ధముగా ఉండాలి అని ప్రభువు తెలుపు చున్నాడు. 

ఈ సమయంలో మరియొకడు వచ్చి "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభువుతో తానే వచ్చి చెబుతున్నాడు. నేను నిన్ను అనుసరిస్తాను, కాని దానికి ముందుగా నేను ఇంటి దగ్గరచేయవలసిన పని చేసి వస్తాను అని చెబుతున్నాడు. అంటే నాకు ఎటువంటి ఆటంకం లేనప్పుడు, అంతా అనుకూలముగా ఉన్నప్పుడు నేను నిన్ను అనుసరిస్తాను అని చెబుతున్నాడు. నాకు వ్యతిరేకముగా లేక నాకు కష్టముగా ఉన్న విషయములలో నిన్ను అనుసరించే, అనుసరణలో నాలో లోపం ఉంటుంది అని ముందుగానే తెలియజేస్తున్నట్లున్నది, ఈ శిష్యుని యొక్క అనుసరణ విధానం.

ఇక్కడ యేసు ప్రభువును అపోస్తులులు ఎలా అనుసరించారు అనే  విషయం మనం గమనించాలి. ఎందుకంటే మత్తయిని యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆయన తన సుంకపు పెట్టెను వదలి, రెండవ ఆలోచన లేకుండా యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. యకొబు యోహనులు తమ తండ్రిని పడవలోనే వదలి పెట్టి ప్రభువును అనుసరిస్తున్నారు. కాని ఇక్కడ మాత్రము ఈ వ్యక్తి  అందుకు సిద్ధంగా లేడు, ఎందుకంటే తాను తన తండ్రి మరణించిన తరువాత, తనను సమాధి చేసి తీరికగా యేసు ప్రభువును అనుసరించాలి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభువును, నేను అనుసరించ వలసినది నాకు ఎటువంటి బాధ్యతలు లేని సమయంలో కాదు. నాకు అన్నీ బాధ్యతలు ఉన్న సమయంలో కూడా మనం ఆయనను అనుసరించాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆ వ్యక్తితో, "మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. 

ఎందుకంటె, ఈ వ్యక్తి తండ్రి ఇంకా చనిపోలేదు, కాని ఇతను తన తండ్రి జీవించినంత కాలం తనతో ఉండి, అతడు చనిపోయిన తరువాత తాను చేయవలసిన పనులు చేసి వస్తాను అని అంటున్నాడు. దాని గురించి యేసు ప్రభువు , నీవు ముందుగా నన్ను అనుసరించు , మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము, అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక వ్యక్తి చనిపోతే ప్రవర్తించే తీరు చాలా కారుణ్యంతో ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు పెడుతున్నారు. పేద విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు తనను బ్రతికిస్తున్నాడు. కాని ఈ వ్యక్తి మాత్రం యేసు ప్రభువును అనుసరించడానికి తనకు అనుకూల వాతావరణం కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు ఆయనను అనుసరించుటకు తగిన సమయం అంటూ ఏమీలేదు. ఆయన పిలుపు అందుకున్నప్పుడు మారుమాట్లాడక అనుసరించటమే ఉత్తమం. 

ప్రార్ధన : ప్రభువా ! నేను అనేక సార్లు మిమ్ములను అనుసరించాలి అని అనుకున్నాను ప్రభువా. అది కేవలం నీవు నాకు ఆరోగ్యం  ఇస్తావు అని,  ఉద్యొగం ఇస్తావు అని, మంచి పేరు ఇస్తావు అని మరియు నాకు వున్న సమస్యలు తీరుస్తావు అని మాత్రమే నిన్ను అనుసరించాలి అని అనుకున్నాను, నిన్ను ఎందుకు అనుసరించాలి అని మాత్రము పూర్తిగా అర్ధం చేసుకోలేదు ప్రభువా. అటువంటి సమయాలలో నన్ను క్షమించండి. నా ద్వారా మీ జీవితాన్ని కొనసాగించడానికి నేను మిమ్ములను అనుసరించే వానిగా నన్ను మార్చండి ప్రభువా. ప్రభువా నేను మిమ్ము అనుసరించడానికి అనేక అవకాశాలు వచ్చిన కాని నాకు తగిన సమయం కాదు అని, నాకు వేరె బాధ్యతలు ఉన్నవి అని, మిమ్ములను అనేక సార్లు విస్మరించాను ప్రభువా, అటువంటి సమయాలలో నన్ను క్షమించి, నేను వెల్లప్పుడు మిమ్ములను అనుసరిస్తూ, మిమ్ములను నా ద్వారా ఇతరులకు అందించే విధంగా నన్ను మార్చండి. ఆమెన్. 



సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...