మత్తయి 9: 1-8
అంతట యేసు పడవనెక్కి, సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని , కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో "కుమారా! ధైర్యము వహింపుము . నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. అపుడు ధర్మ శాస్త్ర బోధకులు కొందరు, "ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు"అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు , "మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము ? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిపుడే తెలియును" అని పలికి, ఆ రోగితో "నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి పొమ్ము" అనెను. అతడు వెంటనే లేచి తన యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి.
యేసు ప్రభువు పడవ నెక్కి సరస్సు దాటిన తరువాత అక్కడ ఆ పట్టణములో కొంత మంది పడకపై పడియున్న పక్ష వాత రోగిని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు కుమారా ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు మాటలాడిన ఈ మాటలు అక్కడ ఉన్నవారికి దైవ దూషణ అని అంటున్నారు. అయితే ఆ పక్ష వాత రోగికి యేసు ప్రభువు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. పాపము చేయడం అంటే అతను పాపమునకు బానిసగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన పాపము నుండి విముక్తి పొందబోవుతున్నాడు. అతను ఒక స్వతంత్రుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన బానిసగా ఉండడు. కనుక యేసు ప్రభువు ఆ వ్యక్తికి భయ పడ వలదు అని అంటున్నాడు. తన రోగంతోనే కాదు తన సమాజం పట్ల కూడా ఆయనకు భయం ఉంది. అందరు ఆయనను పాపిగా పరిగణిస్తున్నారు. మరియు ఆ విధంగా చూస్తున్నారు. యేసు ప్రభువు మాత్రం ఆయన పాపములను పరిహరిస్తాను అని చెబుతున్నారు.
యేసు ప్రభువు ఈ మాటలు మాట్లాడినది ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసంను చూసి ఈ మాటలు అంటున్నారు. ఎందుకు వీరి విశ్వాసం చూసి యేసు ప్రభువు మాటలాడుతున్నారు అంటే, వీరు వారి కోసం కాక అవసరంలో, అనారోగ్యంలో ఉన్న ఒక వ్యక్తిని, యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడు అని యేసు ప్రభువు దగ్గరకు వారు ఆయనను తీసుకొని వచ్చారు. వీరు తమ కోసం కాక వేరె వారి కోసం , వారి కష్టాలు తీర్చడం కోసం చేసిన మంచి పనిని చూసి మరియు యేసు ప్రభువు యందు వారికి గల విశ్వాసం చూసి ఆయనను స్వస్థత పరుస్తున్నారు. విశ్వాసం అంటె ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కూడా నా దేవుడు నన్ను అవమానమునకు గురికానివ్వడు అనే నమ్మకం ఇక్కడ వారి సొంతం. విశ్వాసం మనకు మాత్రమే ఉపయోగపడేది కాదు. అది అందరికి ఉపయోగ పడుతుంది. ఇతరుల శ్రేయస్సు కూడా విశ్వాసం కాంక్షిస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఇదియే. దీని ద్వారా లబ్ది పొందిన ఆ వ్యక్తి కూడా ప్రభువును విశ్వసిస్తాడు. మన విశ్వాసం ఇతరులకు ఈ విధంగా ఉపయోగ పడాలి.
ఆ మాటలు వింటున్న ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు దైవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ అని ధర్మ శాస్త్ర బోధకులు అనడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పడం. వారికి దేవుడు మాత్రమే పాపములను పరిహరింపగలడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములను ఎవరు క్షమించలేరు, అటువంటిది యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడినవి అంటున్నారు. కనుక వీరు యేసు ప్రభువు తనను తాను దేవునికి సమానముగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఆయన దేవుడు అని వారు గమనించలేక పోయారు. అంతేకాదు ఆయన గురించి వారు తప్పుగా అనుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువు పక్ష వాత రోగిని లేచి నడువమని చెబుతున్నారు, దాని ద్వారా వారికి ఆయనకు ఉన్నటువంటి శక్తిని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు.
"ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిపుడే తెలియును అని పలికి, ఆ రోగితో నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి." ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే యేసు ప్రభువు తనకు ఉన్నటు వంటి శక్తిని చూపుతున్నాడు. అంతేకాదు తాను దేవుడను అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. ధర్మ శాస్త్ర బోధకులకు మానవుడు చేయలేని పనిని ఇక్కడ యేసు ప్రభువు చేయడం ద్వారా ఈయన దేవుడు అని తెలుసుకోవాలి కాని వారు ఆ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. కాని యేసు ప్రభువు మాటను పాటిస్తున్న ఆ పక్షవాత రోగి తన రోగం నుండి విముక్తి పొందుతున్నాడు. యేసు ప్రభువుని నమ్మి జీవించినప్పుడు మన సమస్యల నుండి విముక్తి పొందుతారు.
ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సార్లు మేము మీ మాటలను నమ్మడంలో , మీ మీద విశ్వాసం ఉంచడంలో విఫలం చెందుతున్నాము. దాని వలన మేము మా బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నాము. మీ మాటను ఎల్లప్పుడు పాటిస్తూ మా సమస్యల నుండి మేము విముక్తి పొందే వారిగా మమ్ములను మార్చండి. బాధల్లో, కష్టాలలో ఉన్నవారికి మేము కూడా మా వంతు సాయం చేస్తూ వారికి వారి సమస్యల నుండి విముక్తి పొందేందుకు మేము చేయగలిగె సాయం చేయు వారిగా మమ్ము దీవించండి. మేము మీ శక్తిని తెలుసుకొని ఎల్లప్పుడు మిమ్ములను మీ మీద విశ్వాసం ఉంచి జీవించే వారిగా మమ్ము మార్చండి. ప్రభువా అనేక సార్లు మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. పక్షవాత రోగి పాపములను క్షమించిన విధముగా మా పాపములను క్షమించండి. అతనికి ఇచ్చిన విముక్తిని మాకును దయచెయ్యండి. ఆమెన్.