13, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 5: 43-48 )

 మత్తయి 5: 43-48 (జూన్ 14, 2022)

 సువిశేషం: "నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము  అని పూర్వము చెప్పిబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిపుడు మీతో చెప్పునదేమన : మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా  ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై , దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా  వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అటులచేయుట లేదా?మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!

నీ పొరుగు వానిని ప్రేమింపుము ; నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా! మీ పొరుగువానిని ప్రేమింపుము అని లెవీయకాండంలో మరియు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. శత్రువును ద్వేషింపుము అని మనం చూడము. కాని వారి వ్యావహారిక విషయాలలో అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ఇష్టం లేని వారిని ప్రేమించడం మనకు చాలా కష్టం. మనలను ద్వేషించే వారిని ప్రేమించడం అంత సులువైన విషయము కాదు. ఆ విధంగా చేయడానికి మనం చాలా అధ్యాత్మికంగా ఎదగాలి .  మనం అంటే ఇష్టం లేని వారిని ద్వేషించడం లేక దూరం పెట్టడం మనం కొన్ని సారులు చేస్తుంటాము.  కాని ఇది దేవుని వాక్కును సరిగా  అర్ధం చేసుకోకుండా మనం చేసే పని. యేసు ప్రభువు ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి వారి ఆలోచనలు  సరి చేస్తున్నారు.  ఎందుకు వారు ఈ విధంగా ఆలోచించకూడదు అని బోధిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు మీ శత్రువులను ప్రేమింపుడు అని అంటున్నారు. 

మీ శత్రువులను ప్రేమింపుడు.  యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరచి ఉండవచ్చు. ఇవి సాధ్యపడే మాటలు కాదు అని అనిపించి ఉండవచ్చు. నేను ఎలా నా నాశనము కోరుకునే వ్యక్తిని ప్రేమించాలి? అని అనుకోని ఉండవచ్చు. మనం కూడా అటులనే అనుకుంటూ వుండవచ్చు. అసలు నేను ఎందుకు నన్ను వ్యతిరేకించే, లేక నాకు కీడు తలపెట్టే వ్యక్తిని ప్రేమించాలి? అని మనం ఆలోచించినప్పుడు మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. అది ఏమిటి అంటే ప్రేమకు మాత్రమే మానవుడు లొంగిపోతాడు. మనం ఒక వ్యక్తిని గెలవ గలిగేది కేవలం ప్రేమతో మాత్రమే. మనం ద్వేషం చూపిస్తే తాను అదే విధంగా స్పందిస్తాడు కాని ప్రేమకు మాత్రము దాసోహం అవుతారు. వారు మారి అనేక మందికి మార్గ చూపరులు అవుతారు. ప్రేమకు మొదటిలో కోపంతో లేక ద్వేషంతో స్పందించిన తరువాత ఖచ్చితంగా వారు మారుతారు. అందుకే మానవున్ని ఎప్పుడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. తన వద్దకు ఆహ్వానిస్తూనే ఉంటాడు. 

"మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అప్పుడు మీరు పరలోక మందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు" : ఆదిమ క్రైస్తవులు ఈ పనులు ఖచ్ఛితముగా పాటించారు. వారిని రాజులు, పాలకులు హింసించినప్పుడు వారి కొరకు ప్రార్ధన చేశారు. స్తేఫాను గారు అందరు రాళ్ళు వేస్తున్న కూడా ఆయన యేసు ప్రభువు వలె ప్రభువు వీరు చేయునదేమో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ప్రార్ధన చేశారు. ఆయన మాత్రమే కాదు, అనేక మంది ఆదిమ క్రైస్తవులు ఈ విధంగా ప్రార్ధన చేశారు, వారిని ఇతరులు హింసించినప్పుడు. హింసించే వారి మీద పగ తీర్చుకోలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఇతరులను హింసించే వారు వారి అజ్ఞానంతో ఆ పని చేస్తున్నారు అని .  దైవ జ్ఞానం కలిగి వివేకం కలిగిన దైవ జనుడు అటువంటి హింసను చేయడు. కాని వారి కోసం ప్రార్ధన చేస్తారు. ఇది యేసు ప్రభువు చూపించిన మార్గం.  ఆయనను సైనికులు హింసిస్తున్న వారి కోసం ప్రార్దన చేస్తున్నారు. అప్పడు కూడా తన ప్రక్క వాని విన్నపాన్ని ఆమోదీస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు. మనలను కూడా ఆయన వలె చేయమని చెబుతున్నారు. ఈ విధంగా జీవించడం వలన మనం దేవుని కుమారులం కాగలమని ప్రభువు చెబుతున్నారు. 

అంతేకాదు ఇది దేవుని గుణం. ఆయన ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరిపై తన ప్రేమను ఒకే విధంగా చూపిస్తున్నారు. "ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా  ప్రకాశింపజేయుచున్నాడు" ఈ సువిశేషము మనలను దేవుని గుణగణాలు కలిగి ఉండే వారిగా జీవించమని కోరుతుంది. మన జీవితంలో  మనం ఎంత గొప్ప ధ్యేయలు సాధించిన కాని యేసు ప్రభువు మనకు చూపిస్తున్న ఈ గొప్ప గుణాలు అంతటివి అవి కాలేవు. ఎందుకంటే ఇవి దైవ లక్షణాలు. అంతే కాదు యేసు ప్రభువు ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నారు, మిమ్ములను ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే దానిలో మీ గొప్పతనం ఏమి ఉంది అని అడుగుతున్నారు. అందరు ఆ విధంగానే చేస్తారు కదా! సుంకరులు కూడా అలానె చేస్తున్నారు. యూదులు  సుంకరులను , తక్కువ వారిగా చూసేవారు. అంటే మీరు ఎవరి కంటే గొప్ప కాదు అని ప్రభువు వారికి చెబుతున్నారు.   క్రీస్తు అనుచరునిగా , దేవుని నమ్మిన వానిగా నేను పరిపూర్ణత కలిగి జీవించాలి. ఆయన ప్రేమ , వాత్సల్యం ఇతరులకు పంచగలగాలి. దిని కోసం ప్రభువు నన్ను పిలుచుకున్నాడు అని విశ్వసించి మనం జీవించాలి. 

ప్రార్దన : ప్రభువా ! మా జీవితంలో అనేక సార్లు నేను నిజమైన క్రీస్తు అనుచరునిగా జీవించాలి అని అనుకుంటున్నాను కాని ఈలోక ఆశలు లేక ఇతరుల మీద నాకున్న చెడు అభిప్రాయాలు వలన అందరిని దూరం పెడుతూ , ఎవరికి నీ ప్రేమను చూపించ కుండ జీవిస్తున్నాను. నీవు మాత్రము ప్రభువా, నేను నీ వలె, తండ్రి వలె పరిపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా, నేను నీ వలె జీవించలేక పోయినందుకు , ఆ అవకాశాలు చేజార్చుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభువా. నాలో ఉన్న చెడు లక్షణాలును, ఇతరులను ద్వేషించే మనస్సును, హింసించే హృదయాన్ని తీసివేయండి.   ఇతరులను క్షమిస్తు, ప్రేమిస్తూ మీ సుగుణాలును అలవర్చుకునే అనుగ్రహం నాకు దయ చేయండి. ఎప్పుడు ఎవరిని ద్వేషించకుండ అందరిని ప్రేమించె మనస్సును ఇవ్వండి ప్రభువా. మీ యొక్క కుమారుని వలె జీవించెలా జేయండి. ఆమెన్ . 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...