14, మే 2022, శనివారం

పాస్క కాలపు 5 వ ఆదివారం

పాస్క కాలపు 5 వ ఆదివారం (2)

 అపో 14:21-27, దర్శన 21:1-5, యోహను 13:31-35 

ఈనాటి దివ్య పఠనాలు నూతనమైన విషయములను గురించి  భోధిస్తున్నాయి. క్రొత్త దివి, క్రొత్త భువి , క్రొత్త ఆజ్ఞ  అనే విషయాలు గురించి తెలియజేస్తున్నాయి. 

క్రొత్త  దనం మనందరిలో ఉండాలి, మన  యొక్క పాత జీవితమను విడిచి పెట్టి దేవునిలో క్రొత్త జీవితం ప్రారంభించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో  పౌలు, బర్నబాలు, దెర్బా అను ప్రాంతంలో సువార్త ప్రకటన చేసిన తరువాత అనేక మందిని  నూతనంగా దేవుని శిష్యులుగా చేశారు. సువార్త ప్రకటన కోసం క్రొత్త వారిని ఎన్నుకోంటున్నారు. 

పౌలు గారు అక్కడ ప్రజల విశ్వాస  జీవితములను బలపరుస్తున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టములకు, శారీరక శ్రమలకు, భయపడకుండా దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సహించారు. 

జ్ఞాన స్నానం పొందిన వారు, క్రీస్తు ప్రభువును అంగీకరించినవారు, విశ్వాసంలో  స్థిరంగా ఉండాలని తెలిపారు, అధేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు అనుభవించాలని తెలిపారు. 

ఎందుకు వారి విశ్వాసాన్ని  ప్రోత్సహిస్తున్నారంటే, వారు నూతనంగా ప్రభువును వెంబడిస్తున్నారు, కాబట్టి ఆదిలోనే కష్టాలు వస్తే, విశ్వాసాన్ని విడిచిపెడతారని పౌలుగారు వారిని ప్రోత్సాహిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. 

శ్రమల ద్వారా క్రీస్తు ప్రభువు తండ్రిని మహిమ పరిచారు. అలాగే ప్రతి ఒక్కరు తమ యొక్క శ్రమల ద్వారా దేవున్ని మహిమ పరచాలని తెలిపారు. మనం పొందే శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 1 పేతురు4:1. 

జీవమునకు పోయే మార్గం ఇరుకైనది.  మత్తయి 7:14. శ్రమలు అనుభవించుటకు భయపడకూడదు. 1 పేతురు 3:14,  2 కోరింతి 4:17. 

దేవుని వలె జీవించాలనుకునే వారు కష్టాలకు  గురి అగుతారు. 2 తిమోతి 3:12. 

విశ్వాసులు నూతనంగా క్రీస్తును నమ్ముకోంటున్నారు. కాబట్టి ముందుగానే పౌలుగారు వారికి అన్నీ విషయాలు తెలుపుచున్నారు. 

క్రీస్తు విశ్వసించిన  వారిని ఒక సంఘంగా చేసి పెద్దలను నియమించి నూతన సేవకులను, విశ్వాసులను  తయారుచేశారు. 

ఈ మొదటి పఠనం ద్వారా పౌలుగారు మరియు బర్నబాగారు ,చేసిన సువార్త ప్రకటన గురించి  ధ్యానించాలి. ఎంతో కష్టపడి ఒక నూతన దైవ సంఘంను ఏర్పరిచారు. 

వారు నిస్వార్ధంతో, త్యాగంతో ప్రేమతో సువార్త వ్యాప్తికరణ చేశారు. అధే విధంగా మనం కూడా నూతనంగా సువార్తికరణ చేయాలి. 

ఈనాటి రెండవ పఠనంలో రాబోయే క్రొత్త దివి, భువి,స్వర్ణ యుగం గురించి యోహను గారు ఒక దర్శనం చూసారు. 

ఈ దర్శన గ్రంధం వ్రాయబడినది, ప్రత్యేకంగా   హింసలకు గురియైన విశ్వాసుల కోసం, వారికి  ఒక క్రొత్త భువిని, దివిని దేవుడు ఏర్పరుస్తున్నారు అని వారి విశ్వాసాన్ని ప్రోత్సహించుటకు యోహను గారు ఈ విషయాలు వ్రాస్తున్నారు. 

దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన కంటికి అంతయు బాగుగా ఉండెను. ఆది 1:31. 

దేవుడు సృష్టిని చేసినప్పుడు అంతయు శాంతియుతముగా ఉన్నది, ఎటువంటి చీకుచింతలకు చోటు లేదు, దుఃఖానికి తావులేదు. అలాగా  అంతా బాగుగా ఉన్న సృష్టిలో మానవుని యొక్క పాపం వలన  మచ్చ ఏర్పడింది, అనర్ధాలు ఆరంభమైనాయి. 

పాపం చేయడం వలన క్రమ క్రమేణా మానవ జీవితం క్షీణించిపోయినది. మరణం వచ్చింది. సృష్టిలో ఉన్న జంతువులు, ఒక దానిని  ఒకటి చంపుకొనుట ప్రారంభమైనది, మానవుల మధ్య గొడవలు ప్రారంభమైయాయి. అధే విధంగా ఈ లోకంలో అన్యాయం, అక్రమం , వ్యాధులు, హింసలు, బానిసత్వం, బాధలు ఉన్న సమయంలో ప్రజలు ఒక క్రొత్త భువికై , దివికై ఎదురు చూసారు. 

దేవుడు మరలా ఒక నూతన సృష్టిని చేస్తాడని కాలగన్నారు. యిస్రాయేలు ప్రజలు ఈ విషయంను ధృడంగా నమ్మారు , భావించారు. 

ప్రవక్తలు కూడా ఒక క్రొత్త యుగం  గురించి ప్రకటించారు. యోషయా 65:17, ఇదిగో నేను ఒక క్రొత్త ఆకాశమును, భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకం రావు అని ప్రభువు తెలియచేసారు. 

క్రీస్తు ప్రభువు యొక్క రాకతో పాపం తొలగించబడి, ఒక క్రొత్త  భువి, దివి ఏర్పడినది. ఆయన యొక్క మరణ, పునరుత్థానం ద్వారా సైతాను శక్తులు నశించాయి, యేసు ప్రభువు మానవాళికి నూతన జీవంను ప్రసాదించారు. 

యేసు క్రీస్తును విశ్వసించి ఆయనతో ఏకమై మరణించువాడు ఆయనతో శాశ్వత జీవితానికి లేస్తాడు, పునరుత్థానుడైన యేసు క్రీస్తు జీవాన్ని పొందిన మనం, ఈ క్రొత్త దివికి భువికి నూతన యెరుషలేము పట్టణ నిర్మాణానికి కృషి చేయాలి. 2 పేతురు 3:3-22. 

ప్రతి వ్యక్తి కూడా నూతనత్వంను  కలిగి జీవించాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు నూతన ఆజ్ఞ గురించి భోధిస్తున్నారు. 

యేసు ప్రభువు కడసారిగా తన యొక్క శిష్యులతో మాట్లాడిన మాటలు, ప్రభువు కడరాత్రి భోజనం భుజించిన తరువాత  శిష్యులతో విలువైన మాటలు పలికారు. 

ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు. 

నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును. 

ప్రేమ అనే నూతన ఆజ్ఞను పాటించి జీవించుడు, అనే మూడు మాటలు చాలా విలువైనవి. 

మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు. ఎందుకంటె తండ్రిని సంపూర్ణంగా విధేయించాడు. ఆయన యొక్క  చిత్తంను  నెరవేర్చారు. 

అనేకుల రక్షణ కొరకు సిలువ శ్రమలు అనుభవించబోతున్నాడు. 

మరణించిన తరువాత సిలువ నుండి లేవ నెత్త బడుతారు. అది నిజమైన మహిమ పరపబడటం. ప్రభువు మానవ- దైవ స్వభావంతో తండ్రిని నిత్యం మహిమ పరిచారు. అలాగే కుమారుడిని  తండ్రి ఆయన చేసిన ప్రతి పనిని అంగీకరిస్తూ మహిమ పరిచారు. 

ప్రభువు జీవితం మానవునిగా కొంత కాలం మాత్రమే, అందుకే ఇక మీరు నన్ను చూడజాలరు అని పలికారు. ఆయన శ్రమలు అనుభవించుటకు, రక్షణ కార్యము ముగించుటకును, తండ్రి చెంతకు వెళ్ళుటకు సమయం ఆసన్న మగుచున్నది. కాబట్టి ఇక మీరు నన్ను చూడ జాలరు అని ప్రభువు అంటున్నారు. 

ప్రభువు శిష్యులకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. అది అందరు తమ జీవితంలో అనుసరించాలి. ఇది ఒక ఆజ్ఞ, శాసనం అందరు కూడా తప్పని సరిగా పాటించాలి. 

ఈ ప్రేమ ఆజ్ఞ వాస్తవానికి పాత ఆజ్ఞయే, ఎందుకంటే లెవీ 19:18 లో మీరు పరస్పరం ప్రేమ కలిగి జీవించాలి అని  చెప్పబడింది. 

ఎందుకు  ఇది నూతన ఆజ్ఞ అయిందంటే, క్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. 

మన పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ చూపించారు అన్నది మనం ధ్యానించుకోవాలి. 

దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మన పట్ల ఆయన చూపే ప్రేమ - సంపూర్ణ మైనది, స్నేహ పూర్వకమైనది, కనికరం కలిగినది, పవిత్రమైనది, నిజమైనది, నిస్వార్ధమైనది. 

మనలో దేవుడు చూపించిన ప్రేమ రావాలంటే పాతది పోవాలి. 

క్రొత్తది రావాలి. ఆయన ప్రేమ కేవలం మాటల్లో పలికిన ప్రేమ మాత్రమే కాదు, అది చేతుల్లో చూపించే అంత ప్రేమ. 

ఎవరు చూపించలేనంత ప్రేమ, క్రీస్తు ప్రభువు మనకు చూపించారు. అందులో నూతనత్వం ఉంది. ప్రవక్తలు చూపించలేనటువంటి దైవ ప్రేమ, రాజులు వ్యక్త పరచలేనటువంటి ప్రభుని ప్రేమ, కేవలం క్రీస్తు ప్రభువే చూపించారు. 

పౌలు గారు క్రీస్తు ప్రభువుని ప్రేమ తెలుసుకొన్న వ్యక్తి అందుకే 1 కోరింథీ 13 లో ఆయన ప్రేమకు ఉన్న గొప్ప తనం వివరించారు. 

క్రీస్తు ప్రభుని ప్రేమ విశాలము, ఉన్నతము . ఎఫెసీ 3:18. 

యేసు ప్రభువు ప్రేమలో ఉన్న  నూతనత్వం. 1. ఆయన ప్రేమ సేవతో కూడిన ప్రేమ- ప్రభువు ఈ లోకంలో చేసిన సేవ, ప్రేమతో కుడినసేవ . మత్తయి 20:28. శిష్యుల యొక్క పాదాలు కడిగి తన యొక్క అత్యున్నత ప్రేమ చూపించారు. 

2. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ : ఎన్ని పాపాలు చేసినా సరే ఎంత  బాధ పెట్టినా సరే , ఎంతగా హేళన చేసిన, నిందించినా కానీ ప్రభు అందరిని  క్షమించారు. లూకా 23:34. 

దేవుని ప్రేమ ఎంతో క్షమను కలిగి ఉంది. 

స్నేహితులనుకునే అపోస్తులులే మోసం చేసిన సరే, వారిని క్షమించారు. ప్రభువును అర్ధం చేసుకోకపోయిన వారిని క్షమించారు. 

3. ఆయన ప్రేమ అర్ధం చేసుకొనే ప్రేమ - యోహను 21:15. ప్రభువు అందరి యొక్క వ్యక్తిత్వములు అర్ధం చేసుకున్నారు. వివిధ రకాల మనస్తత్వాలు, ఆలోచనలు , ఉన్న శిష్యులను వ్యక్తిగతంగా వారిలో ఉన్న ప్రతికోణం అర్ధం చేసుకొని ప్రేమించారు. 

మనం కొంత మందితో జీవిస్తే తెలుస్తుంది వారి గురించి. యేసు ప్రభువు అనేక రోజులు అనేక నెలలు శిష్యులతో, ప్రజలతో , శత్రువులతో కలసి తిరిగినప్పుడు వారిని వారిలాగా అర్ధం చేసుకొని ప్రేమించారు. 

ప్రతి ఒక్కరి బలహీనతలను , పాపములను ప్రభువు అర్ధం చేసుకొని ప్రేమించారు. 

4. ఆయన ప్రేమ త్యాగ పూరితమైన ప్రేమ -యోహను 15:13. తన యొక్క స్నేహితుల కొరకు ప్రాణాలు సమర్పించారు. ఇతరుల కొరకు జీవితంను త్యాగం చేసిన ప్రేమ స్వరూపి. 

సీలువను మోసారు, ప్రాణమిచ్చారు. తన చెంత ఉన్న ప్రతిదీ  మన కోసం త్యాగం చేశారు. 

5. ఆయన ప్రేమ నిస్వార్ధ ప్రేమ - ఎటువంటి ఫలితం కూడా ఇతరుల నుండి  ఆశించకుండా  ప్రభువు ప్రేమించారు. యోహను 3:16. తన సొంత లాభం పొందటం కోసం , మెప్పు పొందటం కోసం ఎవ్వరిని ప్రేమించలేదు. 

6. ఆయన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ - ఎటువంటి హద్దులు లేవు. ఆయన మన యొక్క అందం, ఎత్తు , డబ్బు, మొదలగునవి చూసి ప్రేమించరు, మనల్ని ఎటువంటి తరతమ్యం లేకుండా ప్రేమించారు. 

ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో దేనికి లేదు. అందుకే పౌలుగారు ప్రేమ సమస్తమును , భరించును, జయించును అని పలికారు. 1 కోరింథీ 13:7. ప్రేమ బలహీనులను బలవంతులను చేస్తుంది. సామాన్యులను గొప్ప వారిగా, చెడ్డ వారిని మంచి వారిగా చేస్తుంది. 

మనందరం కూడా ప్రేమించుట ద్వారానే యేసు ప్రభువుని శిష్యులం  అవుతున్నాం. కాబట్టి దేవుడు చూపించిన నూతన ప్రేమ మనందరం కలిగి జీవిద్దాం. 

Rev. Fr. Bala Yesu OCD 

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము  ద్వితియెపదేశకాండము 6:2-6 హెబ్రీయులు 7:23-28 మార్కు 12:28-34             ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 3...