13, డిసెంబర్ 2021, సోమవారం

పునీత సిలువ యోహను

పునీత సిలువ యోహను

పునీత సిలువ యోహనుగారు  ఒక తిరు సభ పండితుడుగా, ఆధ్యాత్మిక జీవిత మార్గ చూపరిగా అందరికి సుపరిచితులే. కానీ ఆయన జీవితం అందరికి అంతగా తెలియదు. అతను  తన మాటలలో, చేతలలో ఒక ప్రవక్త అంతటి గొప్పవాడు. ఏలియా ప్రవక్త అంతటి ఆత్మీయ శక్తి కల వాడు.

సిలువ యోహను గారి కుటుంబ నేపధ్యం

సిలువ యోహాను గారు ఫోన్టిబెరోస్ అనే గ్రామములోని  ఆవిలా  మెత్రాసనం లో జన్మించారు. ఆయన తండ్రిగారి పేరు యెపేస్ గోన్సాలో , యెపేస్ అనేది తోలేదో అనే పట్టణంలో  ఉన్న ప్రాంతం, ప్రాంతం నుండి , కుటుంబం పేరు పొందింది. ఆయన తల్లి పేరు కతలీన అల్వెరోస్, ఆమెది  తోలేదో పట్టణం, గోన్సలో గారు,   ధనిక కుటుంబం నుండి వచ్చినా కానీ, తన భార్య వలె ఒక పేద, చెనేత వృత్తిని  తాను కూడా నేర్చుకున్నాడు. ఆయన తన   తండ్రి చనిపోయిన తరువాత, తన తండ్రి  సోదరులు ఆయనను దత్తత తీసుకొని వెళ్లారు. తన మారు తండ్రి చాలా ధనవంతుడు మరియు వ్యాపారి. కనుక ఆయన గోన్సలో గారిని తన వ్యాపార పనిలో పెట్టాడు.  వ్యాపార పనిమీద తరచూ ఆయన మెదిన దేల్ కాంపో   అనే నగరానికి వెళ్ళేవాడు. అప్పుడు అది ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప నగరం. ప్రయాణం మధ్యలో గోన్సలో గారు ఫోన్టిబెరోస్ వద్ద తోలేదో  నుండి వచ్చిన ఒక విధవరాలి దగ్గర విడిదికి ఉండేవాడు. ఆమె దగ్గర అనాథగా ఉన్న కతలీన అల్వెరోస్ ని చూసి, ఆమె సుగుణాలకు ముగ్ధుడై  , ఆమె  కతోలిక విశ్వాసాన్ని  మెచ్చి, తన కుటుంబానికి కూడా చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన కుటుంబానికి తెలియకుండా, తాను చేసిన పనికి  కుటుంబం మొత్తం అతనికి వ్యతిరేకము అయ్యింది. తన కుటుంబం మొత్తం ఆయనను వదిలివేసింది. అతను చేసిన ఒక్క పనితో పేద వాడిగా మారిపోయాడు. తన భార్య వృత్తిని చేపట్టి ఆమెకు తోడుగా ఉన్నాడు. తన భార్య చేసే నేత పని వలన చాలా తక్కువ సంపాదన వారికి వచ్చేది. కనుక పేదరికం వారిని చాల ఇబ్బంది పెట్టేది. వీరు పేదరికంలో ఉండగానే వారికి ముగ్గురు పిలలు జన్మించారు. వారు ఫ్రాన్సిస్, లూయిస్ మరియు మన సిలువ యోహను. కుటుంబానికి సాయం చేస్తూ, తల్లి లేని కతలీనకు తల్లిగా ఉన్న విధవరాలు మరణించారు. అటు  తరువాత గోన్సలో గారు రెండు సంవత్సరాలు, అనారోగ్యంతో బాధ పడి, ముగ్గురు పిల్లలను తల్లికి వదలి, పేరును మాత్రమే శేషంగా వదలి,1545 సంవత్సరంలో  మరణించారు.

కతలీన తన భర్త మరణించిన తరువాత,  ఆయన కుటుంబాన్ని తన పిల్లలను ఆదుకోమని, తొర్రిహోస్ , గలివేస్  అడగడానికి వెళ్ళింది, కానీ వారు సహాయం చేయలేదు.  అక్కడ నుండి మరల ఫోన్టిబెరోస్కి, తన బిడ్డలతో కలిసి వచ్చి తన చేతులతో తన బిడ్డలకు ఆహారాన్ని సంపాదించినది. రెండవ కుమారుడు లూయిస్ చనిపోయాడు.  

బాల్యం

1542 లో పునీత సిలువ యోహను గారు ఫోన్టిబెరోస్లో జన్మించారు. ఆయన జూన్ 24 తేదీన జన్మించారా లేక డిసెంబర్ 27 జన్మించారా అనేది పూర్తిగా తెలియదు. కానీ రెండు తేదీలలో ఒక రోజున ఆయన జన్మించారు. ఎందుకంటే తన జ్ఞాన స్నాన సమయంలో యోహను అనే పేరును ఆయనకు పెట్టారు. సంవత్సరంలో యోహను గారి పండుగ రోజున  జన్మించారు, యోహను అనేది మనకు కచ్చితముగా తెలియదు. జ్ఞానం స్నాన రికార్డు 1546 లో  ఫోన్టిబెరోస్ విచారణ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు కాళీ పోయాయి. 1545 సంవత్సరంలో తన తండ్రి చనిపోయారు.కతలీన  తన భర్త తరుపువారు ఏమి సహాయం చేయకపోవడంతో ఒక సంవత్సరం గలవేస్ లో వుండి మరల  పొంటివెరోస్ వచ్చారు. 1548 సంవత్సరంలో అరవేలో లో ఉన్నారు. ఇక్కడే రెండవ కుమారుడు లూయిస్ చనిపోయారు. 1551 సంవత్సరంలో మరల ఆర్ధిక అవసరాలు, పేదరికం మనసులో పెట్టుకొని మెదిన దేల్ కంపో   వచ్చారు. అప్పది నుండి 1564 వరకు అక్కడే ఉన్నారు.

కతలీన  అల్వేరేస్  తన పిల్లలను కటిక పేదరికంలో పెంచినప్పటికీ వారిని  గొప్ప మాతృ వాత్సల్యంతో పెంచారు. వారికి యేసు ప్రభువును ఆశ్రయించడం, మరియ మాత మీద భక్తిని  నేర్పింది.  దైవ భయం లో తన పిల్లలు ఎదిగేలా చేసింది. అదే విధముగా పవిత్ర వస్తువులను గౌరవించడం ఆమె నేర్పింది. తన బిడ్డలు సుగుణాలు కలిగి జీవించే విధంగా చేసింది. తన పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఎప్పుడు వారి వద్దనే ఉండేది. ఆమె వారి ఆటలలో కూడా పాల్గొనేది. ఒక రోజు యోహను ఒక పిల్లవాడితో ఆడుకోవడానికి వెళ్ళి, చెరువులో ఉన్న  మట్టిలో అడుకొంటు ఉండగా, నీటిలో మునిగి పోయాడు. కానీ వెంటనే పైకి తేలడం జరిగినది. అతనికి ఎటువంటి దెబ్బలు కాని గాయాలు కానీ జరగకుండా పైకి రావడం జరిగినది. తాను మరియమాత ద్వార మరణం నుండి తప్పించుకున్నానని యోహను గారు గట్టిగా  నమ్మాడు. మరియమాత తనకు ప్రత్యక్షమై, తనను పైకి తీయడానికి చేయి చాపగా, ఆయన తన చేయి ఇవ్వడానికి సాహసించలేదు.  ఎందుకంటే తాను చాలా మురికి అంటుకొని  ఉన్నందుకు, ఆమెకు ఎక్కడ బురద అంటుకుంటుందో అని  వేరె ఒక వ్యక్తి వచ్చి తనను పైకి తీసినంతవరకు, ఆమెకు తన చేయి ఇవ్వడానికి  తాను సాహసించలేదు.  మరియ మాత మీద యోహను గారి భక్తి ఎప్పటికీ తగ్గకుండా అలానే ఉంది. ఆయన తరువాత ఎప్పుడు ప్రాంతమునకు వెళ్ళిన కానీ ఒక యాత్రకు వెళ్ళినట్లు గా వెళ్ళేవాడు.

సిలువ యోహను గారి భక్తి మరియు మేదిన దేల్ కాంపో వద్ద ఆసుపత్రి

ఫ్రాన్సిస్ అయిన యోహను గారి అన్న గారి  ప్రకారం, వారు ఇద్దరు తమ తల్లి గారితో కలిసి మెదిన కు వెళ్ళేవారు. మెదిన కు వెళ్ళేముందు ఉన్న చెరువు వద్దే  మరియమాత ఆయనను రక్షించడం జరిగినది. ఫ్రాన్సిస్ తన తమ్ముడు గురించి చెబుతూ , ఆయనను   దర్జీ , వడ్రంగి, పెయింటింగ్ , శిల్ప కళ మొదలయిన పనులను  నేర్పించాలని చూసిన, ఆయన వాటికి తగిన నైపుణ్యాన్ని కనబర్చలేదు. దేవుడు ఆయనకు గొప్ప కార్యాన్ని అప్పగించబోతున్నాడు, అందుకేనేమో ఆయన వాటిలో కొనసాగలేక పోయాడు.  తన తల్లి ఆయనను మంచి పాఠశాలలో వేయాలి అనుకున్నది, కానీ వారి ఆర్ధిక స్తోమత దానికి సహకరించలేదు. మెదిన లో ఉన్న పేద మరియు అనాధుల పాఠశాలలోనే చేర్పించారు. ఇక్కడ కొంత కాలం యోహను గారు చదువుకుంటూ, ప్రార్థన మరియు భక్తి పరమైన పనులు చేస్తూ అందరికి ఆదర్శముగా  ఉండేవాడు.   సమయములోనే ఉదయాన్నే ఆయన దివ్య బలి పూజకు పునీత అగుస్తిను సభకు చెందిన,  పునీత ముగ్ధల మరియా ఆశ్రమానికి వెళ్ళేవాడు. అక్కడ దివ్య బలి పూజలో గురువుకి, చాల భక్తితో సహాయం చేసేవాడు. ఆయనను అందరూ మెచ్చుకునేవారు. తన సుగుణాలు, దైవ భక్తి తనను చూసేవారి అందరికి ఒక ఆకర్షణగా ఉండేది. విధముగా ఆయనకు ఆకర్షించబడిన  వారిలో తోలేదో నుండి అల్వేరేస్ గారు. ఆయన తన జీవితాన్ని పేదలకు,  రోగులకు అంకితం చేసి జీవిస్తున్నారు.    ఆయన  అక్కడ ఒక ఆసుపత్రి నడుపుతుండేవాడు. ఆయన యోహను గారు తల్లి కతలీన దగ్గరకు వచ్చి, యోహనును ఆసుపత్రి లో సేవ చేయడానికి పంపమని అడిగారు. యోహను గారికి అప్పుడు 12, 13 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. అల్వేరేస్ గారు , యోహను ఆసుపత్రి లో సేవ చేస్తూ చదువుకోవచ్చు అని , తరువాత తనని గురువును చేసి, ఆసుపత్రి ని యోహనుకు అప్పగిస్తాను అని చెప్పడం జరిగినది. విధముగా యోహను మరియు కతలీన దానికి ఒప్పుకున్నారు . విధముగా సిలువ యోహను గారు  మేదిన ఆసుపత్రిలో పేదలకు , రోగులకు సేవ సాగించాడు.

ఆయన ఉపకారాలు, చదువు, ప్రార్థన జీవితం

అక్కడ ఉన్న ఆసుపత్రి, యోహను గారు తన సుగుణాలను వ్యక్త పరచడానికి అనేక అవకాశాలను ఇచ్చింది. తన నిద్రను కూడా మానుకొని, ఆయన అక్కడ ఉన్న రోగుల ప్రక్కనే ఉంటూ, వారి బాగోగులను చూసుకునే వాడు. యోహాను గారు ఎప్పుడు కూడా అలసట లేకుండా ఉండేవాడు. రోగుల బాధ సాదలను పట్టించుకొని, వారికి  సమయానికి మందులు ఇస్తూ ఎంతో ప్రేమగా ఉండే వాడు. ఎవరికైతే ఎటువంటి మందులు ఉపయోగ పడక  బాధపడుతూ ఉంటారో, వారికి దగ్గర ఉండి  తన మాటలతో ఊరటను ఇచ్చేవాడు. యోహను గారి చదువు గురించి  ఫ్రాన్సిస్ చెబుతూ,  వారి అమ్మ మొదట యోహాను గారిని  పాఠశాలలో  క్రైస్తవ సిద్దాంతము నేర్చుకోవడంలో వేయడము జరిగినది. అక్కడ ఆయన చదవడం , రాయడం, చాలా త్వరగా నేర్చుకున్నాడు. వారు ఆయనను  లాటిన్ నేర్చుకోవడానికి, యేసు సభ  కళాశాలకు  పోవడానికి అనుమతి ఇచ్చారు. ఆయన తన చదువులలో చాలా చురుకుగా ఉండేవాడు.  యోహాను గారు తెలివైన విద్యార్థి గా పేరు తెచ్చుకున్నాడు. తక్కువ సమయం లోనే అక్కడ తన చదువును పూర్తి చేశారు. ఆసుపత్రి లోని  వారు యోహాను గారు  రాత్రి సమయములో చదువుకుంటూ ఉండగా చూసేవారు. యేసు సభ కళాశాలలో, ఆయనకు  వారు వ్యాకరణం, వాక్చాతుర్యం నేర్పించారు. వాటిలో  ఆయన అసామాన్య ప్రతిభ కనబరిచాడు. 

మేదిన  దేల్ కంపోలోని కార్మెల్ ఆశ్రమం లో  యోహను

యోహనుగారు  20  సంవత్సరాల వయసులో, ఎటువంటి  కల్మషం లేని రెండు సంవత్సరాల  పిల్లవాడిగా, 50 సంవత్సరాల వ్యక్తి  వలె వివేకము కలిగి  ఉండేవాడు. యోహనుగారు  అల్పమైన విషయాలను మాటలాడటానికి కానీ, సమయం వృధా చేయడం గాని ఎప్పుడు ఉండేది కాదు. అందుకే  ఆయన అనేక సుగుణాలలో ఎదగడానికి అది ఉపయోగపడినది. యోహను గారు ఒక రోజు ప్రార్ధన చేస్తూండగా, దేవున్ని తాను ఎటువంటి జీవితం ఎన్నుకోవలో, మార్గం చూపమని, ముఖ్యముగా  ఎందులో అయితే తాను పూర్తిగా దేవుని సంకల్పాన్ని నిర్వర్తించగలడు,  దానికి దారి చూపమని వేడుకున్నాడు. తన ప్రార్ధన విన్న దేవుడు, ఆయనకు ఓదార్పునిస్తు, ఒక సందేశం ఇచ్చాడు. ఆయన ప్రార్థనలో ఉండగా ఆయన ఒక స్వరం విన్నారు, మాటలు ఏమిటంటే నీవు నాకు  ఒక పురాతన సభ ద్వార సేవ చేయాలి, దాని పూర్వ స్థితికి తీసుకురావడానికి నీవు సహాయం చేయాలి.”

మాటల ద్వార  దేవుడు, తనను ఒక సన్యాస సభకు పిలుస్తున్నాడు, అని ఆయన అర్దం చేసుకున్నాడు. కానీ అది సభకు వెళ్ళాలో ఆయనకు తెలియలేదు. ఒక పురాతన సభను పూర్వ స్థితికి తీసుకురావడం అంటే ఆయనకు అర్దం కాలేదు. విషయాన్ని, కొన్ని సంవత్సరాల  తరువాత పవిత్ర జీవితం జీవించిన,  ఆవిలాపురి తెరేసమ్మగారి  సహచరురాలు అయిన  యేసు అన్నమ్మ అనే కన్య స్త్రీ కి తెలియచేశాడు.  1560 లో కార్మెల్ సభ గురువులు మెదిన నగరానికి వచ్చారు. అక్కడ అన్నమ్మ గారి మఠాన్ని ఏర్పరిచారు. ఒకరోజు యోహనుగారు అక్కడకు వెళ్ళారు. అక్కడ సభ వస్త్రాన్ని చూసి చలించిపోయారు. దాని ద్వార దేవుడు తనను  సభకు పిలుస్తున్నాడు అని  అర్ధం చేసుకున్నారు. మఠము లోనికి వెళ్ళి తనను సభలోనికి తీసుకొమ్మని  కోరారు. మఠ వాసులు ఎంతో ప్రేమతో ఆయనను ఆహ్వానించారు. అప్పటికే యోహను గారు, మెదిన నగరంలో  గొప్ప వ్యక్తిగా అందరికి సుపరిచితులుగా  ఉండటం వలన, వారు ఆయనను ఆనందముగా ఆహ్వానించారు.   అటు తరువాత ఆయన  కార్మెల్ సభ వస్త్రాన్ని, తన  21 సంవత్సరాల వయసులో పునీత  మత్తయి  పండుగ రోజున అంటే ఫిబ్రవరి 24, 1563 లో స్వీకరించాడు, అందుకే ఆయనను మొదటగా జాన్ ఆఫ్ మత్తయాస్ అనేవారు.  

 నోవిషియేట్ జీవితం- కార్మెల్ సభ మొదటి నియమావళి

నోవిషీయెట్ లో ఉండగా అతని క్రమబద్ధమైన విధేయత జీవితం, ఉత్సాహం , కఠిన జీవితాన్ని నిష్ట తో జీవించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. 1564 సంవత్సరంలో యోహను తన మాట పట్టును తమ పెద్ద గురువు గారైన ఫా. ఏంజిల్ గారి  చేతుల మీదుగా స్వీకరించాడు.                                                                                           

  మాట పట్టుకు  అలెన్సొ  అల్వెరోస్ కూడా హాజరయ్యారు. మాట పట్టు రికార్డు మఠములో ఉంచబడింది. అందులో యోహను గారు చేసిన సంతకం ఉండటము తో దానిని పునీతునీ గుర్తుగా ఉంచారు. కార్మెల్ సభకు తనను  తీసుకువచ్చినందుకు నిరంతరము దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఆయన ప్రధానంగా, కార్మెల్ సభ  మొదటి నియమావళిని జాగ్రత్తగా చదవి దానిని సంపూర్ణముగా జీవించడానికి ప్రయత్నించాడు. ఆయన అప్పుడు ఒక  విషయం తెలుసుకున్నాడు. అది ఏమిటి అంటే?  పునీత ఆల్బర్ట్ గారు ఇచ్చిన నియమావళిని స్వీకరిస్తున్నప్పటికీ వారు ఆవిధముగా జీవించడము లేదు అని , అంతేకాదు, తరువాత అది  నాలుగవ ఇన్నోసెంట్ పోపు గారు మార్పు చేసిన నియమావళి కూడా కాదు అని ,ఎంతో సవరించబడిన నాలుగవ ఎవుజినియస్ పోపు  గారి చేత ఆమోదించబడిన నియమావళిని వారు పాటిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. దానిలో కఠినమయిన నియమాలు అన్నీ తీసి వేయబడినవి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత మొదటి నియమావళిని స్వీకరించి, చదివి దానిలో ఉన్న అన్నీ నియమాలను పాటించడానికి అనుమతిని కోరాడు పునీత యోహనుగారు. ఆయన ఉత్సాహాన్ని చూసి, సభ పెద్దలు  ఆయనకు అందుకు అనుమతిని ఇచ్చారు. కానీ వారు అప్పుడు చేస్తున్న పనిని కూడా వదలి వేయకూడదు అని, మరియు అప్పుడు మఠం లో ఉన్న క్రమాన్ని పాటించాలి అని, వారు ప్రస్తుతం జీవిస్తున్న అన్నీ పనులలో యోహానుగారు హాజరు అవ్వాలని, ఇవి చేయుటకు ఎటువంటి ఆటంకం ఉండకూడదనే  షరతుతో అనుమతిని ఇచ్చారు.    కానీ పునీత సిలువ యోహను గారు మొదటి నియమావళి అడిగిన దాని కన్నా, ఇంకా  ఎక్కువ కఠిన జీవితాన్ని జీవించారు. మరియు తాను మఠ నియమాలను దేనిని విడవకుండా అందరితో కలిసి, అన్నీ పనులలో పాలుపంచుకునేవాడు.  సిలువ మహోత్సవం  పండుగనుండి క్రీస్తు పునరుత్థాన మహోత్సవం వరకు ఆయన ఉపవాసాన్ని ఆచరించేవాడు.

ఆయన చదువు - సాలమాంక లో ఆయన కఠిన  జీవితం మొదటి దివ్య పూజ బలి

ఆయన మఠ పెద్దలు  యోహను గారి యొక్క ప్రతిభను, ఆయన  సుగుణాలు  చూసి, ఆయనను దైవ శాస్త్ర  చదువుకు సాలమాంక  లో ఉన్న వారి కళాశాలకు వెళ్ళడానికి,  ఆయనకు అనుమతి ఇచ్చారు.  ఆయన చదువుకొని వారికి ఉపయోగపడతారు అని అనుకున్నారు. సాలమాంక లో ఉన్న కళాశాల పేరు పునీత ఆంద్రేయ  కానీ తరువాత దానిని పునీత తెరెసా కళాశాల గా మార్చారు. కళాశాలకు యోహనుగారు 1564 లో వెళ్లారు. ఆయన అక్కడ కూడా తన నోవిషీయెట్  జీవితాన్నే జీవించాడు. నియమాలన్నీ యోహనుగారు, చాలా సునాయాసంగా పాటించారు. ఆయన జీవించే విధానం అందరికి తెలిసినది. నిష్టతో కూడిన ఆయన  జీవితం మరియు ప్రార్థన,  రెండు ఆయన ఆధ్యాత్మిక జీవితానికి రెండు కళ్ళు. వీటి ద్వారానే ఆయన ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. ప్రార్థన ఆయనకు సర్వస్వం అయ్యింది.

ఆయన కార్మెల్ సభ మొదటి నియమావళిని పాటించినప్పటికీ, ఎప్పుడు కూడా మఠ నియమాలను వేటిని విస్మరించలేదు. 1567 లో తన చదువు, అతడు  25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు  పూర్తి అయ్యింది. దాని తరువాత సభ పెద్దలు, తనను గురుత్వ అభిషేకానికి సిద్దపడమని, తమ అనుమతిని తెలియచేశారు.   బాధ్యతను తీసుకునే ముందు తనను తాను  సిద్ద పరుచుకోవడానికి ధ్యాన వడకమునకు  వెళ్ళాడు. అదే సంవత్సరం సాలమాంక లో  గురువుగా అభిషేకం పొందాడు.  అభిషేకం పొందిన వెంటనే మఠ పెద్దలు, ఆయనను మెదినలో తన మొదటి  దివ్య బలి పూజ అర్పించడానికి పంపించారు. ఎందుకంటే ఆయన మఠం నుండి  వచ్చాడు, మరియు తన తల్లి అక్కడే ఉన్నది. తన మొదటి దివ్య బలి పూజలో, “తాను  నిర్మలముగా ఉండటానికి, ఎప్పటికీ మలిన పడకుండా, తన జ్ఞాన స్నాన నిర్మలత్వం అలానే ఉంచ గలిగే   శక్తినిఅడిగారు. 

 కర్తుసియాన్ అవ్వాలనుకోవడం తెరెసా ను కలవడం

యోహాను గారికి లౌకిక విషయాలనుండి  దూరముగా ఉండాలని,  దేవునితో ఉండవలసిన  ఆవశ్యకత ఎక్కువ ఉంది అనిపిస్తూండేది. అందుకే ఆవిదంగా ఉండాలని  నిర్ణయించుకున్నాడు. అవకాశం ఉంటే  అందరికి దూరముగా ఎడారి ప్రాంతంలో, ఎక్కడైతే దేవుడు, తాను, మాత్రమే  ఉండే ప్రదేశమునకు వెళ్లాలనుకున్నాడు. ఆయన తన జీవితాన్ని మొత్తం  దేవునికి అర్పించాడు. ఇంకా ఆయన దగ్గర ఏమీలేదు, కానీ అబ్రహాము వలె ఆకాశ  పక్షులను తోలడం ఆయన కర్తవ్యం అని,   పక్షులు,   అర్పణను మలినం చేయకుండా చూడటం తన బాధ్యత అని, విధంగా జీవించాడు. పునీత యోహను గారికి,  అబ్రహాము వలె జీవించడానికి  ఒకే ఒక మార్గం  కనపడినది, అది కర్తుసియాన్ సభ ఎందుకంటే అది మాత్రమే ఒక కార్మెల్ సభ  మఠ వాసి వెల్లగలిగేది.   సమయంలోనే తెరెసా గారు కార్మెల్ సభ సన్యాసినుల విభాగాన్ని నూత్నీకరించారు. మరియు పురుషుల విభాగాన్ని కూడా నూత్నీకరించడానికి  ఇటువంటి అభిప్రాయాలు కలిగిన  కొంత మంది గురువుల కోసం చూస్తుంది. ఆలోచనలతో ఉన్న తెరెసా  మెదినలో రెండవ  నూతన కార్మెల్ను స్థాపించడానికి వచ్చారు. తెరెసా గారు తన ఆలోచనలు ఆంటోనియో హెరోడియా అనే మెదిన  కార్మెల్ మఠ పెద్దకి తెలియచేసింది. అందుకు ఆంటోనియా గారు సుముఖంగా ఉన్నప్పటికీ, ఆయన వయస్సు రీత్యా కఠిన జీవితం జీవించగలడా, అనే అనుమానం తెరెసా గారికి ఉండేది.  యోహనుగారు  మెదినలో తన మొదటి పూజ తరువాత మరల   సాలమాంక వెళ్ళారు.  తరువాత అదే సంవత్సరం ఒరోస్కో పేతరు గారితో కలిసి  సేగోవియా లో ఉన్న  కర్తుసియాన్ మఠం లో చేరాలనే ఆలోచనతో  యోహనుగారు మెదినకు   వచ్చాడు. కొన్ని రోజులు ఆయన అక్కడే  కార్మెల్ మఠం లో ఉన్నాడు. పేతురు గారు తెరెసాగారికి యోహను గారి గురించి చెప్పారు. ఆయన ఎటువంటి  జీవితం జీవిచ్చేది,  ఆయనకు కార్మెల్ సభ మీద ఉన్న అవగాహన  మొత్తం ఆమెకు చెప్పడం జరిగినది. యోహను గారు  పునీత తెరెసా గారిని కలిసినప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలు. నాలుగు సంవత్సరాలు సభలో ఉన్నారు, ఆమె  అప్పటికే  33 సంవత్సరాలు సభలో ఉన్నారు. అప్పుడు ఆమె వయసు 53.  తెరెసా యాబై మూడు సంవత్సరాల వయసులో వీరు ఇద్దరు కలిశారు. ఒరేస్కో  పేతురు గారి  అభ్యర్ధన ప్రకారం మేదిన కార్మెల్  కాన్వెంట్ లో  ఆమెను  కలిసి, ఆయన ఆలోచలను ఆమెతో చెప్పగా, ఆమె ఏమి చేయాలనుకుంటున్నది చెప్పింది. ఆయన కార్మెల్ సభలోనే ఉన్నట్లయితే  మొదటి నియమావళిని పునరుద్దరించవచ్చు అని కోరింది. దానికి యోహను గారు ఒక షరతుతో ఒప్పుకున్నారు . షరతు ఏమిటంటే అది త్వరగా జరగాలని. తెరెసా కి ఇది దేవుని  వరం లా కనబడింది.  ఎందుకంటే ఆమె అనుకున్నటువంటి  వ్యక్తి, ఆమెకు ఇంత వరకు కనబడలేదు,కాని యోహను గారితో తన పనికి తగిన వ్యక్తి దొరికినట్లయింది. ఇప్పుడు నిశ్చింతగా తన పునరుద్దరణ కార్యాన్ని కొనసాగించవచ్చు.

ఇద్దరు సన్యాసులు, ఆంటోనియో మరియు యోహను గారు జీవితానికి స్వస్తి చెప్పి, మొదటి నియమావళిని అవలంభించడానికి సిద్దమయారు.  కానీ వారికి ఒక మఠం కావలసివుంది. వారి వద్ద మఠం ఏర్పాటుచేయడానికి డబ్బు కూడా లేదు.  తెరెసా 1567 చివరలో మెదిన నుండి  మాద్రిద్  వెళ్లిపోయారు. 1568 ఏప్రిల్ లో ఆమె సన్యాసినుల మఠాన్ని మళగొన్ లో స్థాపించారు, వయడోలీడ్ లో వేరె మఠాన్ని స్థాపించడానికి సిద్దపడుచున్నారు. మలగొన్ లో తెరెసా ను  యోహను గారు కలిశారు. అప్పుడు  రఫాయేలు అనే ఒక పెద్ద మనిషి  తనకు దురుఎలో లో ఉన్న చిన్న ఇంటిని మఠాన్ని స్థాపించడానికి ఇస్తాను అని చెప్పాడు. ఇంటిని స్వీకరించిన తెరెసా అది సంస్కరించబడిన కార్మెల్ కు బెత్లెహేము లాంటిది అని  అనుకున్నది.

దురుఏలో లో యోహను సంస్కరణ ప్రారంభం  

 తెరెసా వయాదోలీద్కు  మఠాన్ని  స్థాపించడానికి  వెళ్ళారు. ఆమె యోహనును,  ఆమెతోపాటు తీసుకొని వెళ్ళింది.అక్కడ  ఆయన వారి జీవిత  విధానము చూడటానికి తీసుకొని వెళ్ళింది. వయదోలిద్  లో సన్యాసినుల కొంత కాలం పూర్తిగా లోపల లేకుండా  జీవించారు, అక్కడ  మఠంలో పని జరుగుతూ ఉంది . ఇది వారి జీవిత విధానము  యోహను చూడటానికి చాలా ఉపయోగపడింది. విధముగా మరొక కసారి నోవిస్ గా  ఉన్నారు. తెరెసా  ప్రొవిన్సియల్  అనుమతి కోసం ఎదురుచూచ్తుంది. యోహను వారి మొదటి ఆధ్యాత్మిక గురువుగా, అక్కడ వారి పాప సంకీర్తనలు వింటున్నారు. ఆయన కార్మెల్ సభ మొదటి ఆధ్యాత్మిక  గురువు, అటు గురువులకు మరియు సన్యాసినులకు.  జెనరల్ గారి అనుమతితో నిష్పాదుక కార్మెల్ సభ సన్యాసుల మొదటి మఠం స్థాపించడానికి ఉన్న అన్నీ అవరోధాలు తొలగిపోయాయి.  తెరెసా మరియు ఆమె సహచరులు మొదటి అంగీని తయారు చేసి యోహను గారికి ఇవ్వడము జరిగినది. అంగీతో దివ్య బలి పూజ చేయడానికి యోహనుగారు  దురుఏలో బయలుదేరి వెళ్ళేడు. అంతకు ముందు దురుఏలోను ఆయన  ఎప్పుడు చూడలేదు. 1568 లో అక్కడ మఠాన్ని స్థాపించారు. అక్కడకు వెళ్ళిన వెంటనే  అక్కడ ఉన్న కర్రలతో సిలువలు చేసి, దానిని దేవాలయముగా మార్చాడు పునీతుడు. దేవాలయములో ఉన్న ఆభరణాలు ఏమిటి అంటే కర్రలతో చేసిన సిలువలు మరియు  మనిషి పుర్రెలు సిలువలుగా చేసి ఉంచాడు. అవి భయాన్ని అదే విధముగా, పునీతుడు ఎంత నిష్టతో కూడిన  జీవితము జీవించాడో  తెలియచేస్తుంది. ఉదయాన్నే బలి పిఠాన్ని సిద్దం చేసి, తాను స్వీకరించిన అంగీని బలి పీఠం మీద ఉంచి, దీవించి పూజ చివరిలో అంగీని ధరించాడు. ఆవిధముగా నిష్పాధుకా కార్మెల్ సభ అంగీని మొదట ధరించాడు.  ఆయనకు చలి నుండి కాపాడుకోవడానికి తగిన వస్త్రాలు కానీ  పాదరక్షలు  కానీ లేవు.

(1568-74 )నిష్పాధుక కార్మెల్ సభలో ముఖ్యమైన రోజులు

1568 సంవత్సరంలో నవంబర్ 28 తేదీన ప్రొవిన్సియల్ గారు  దురువేలో లో, దివ్య బలి పూజ అర్పించి  మొదటి  పురుషుల నిష్పాధుక కార్మెల్ సభ మఠంను  అధికారికంగా ప్రారంభించారు. 1569 సంవత్సరంలో ప్రొవిన్సియల్ గారు నిష్పాధుక కార్మెల్ ను నోవిసులను తీసుకోవడానికి అనుమతిని ఇచ్చారు. యోహను గారిని సుపీరియర్ గా మరియు నోవిసుల శిక్షణ గురువుగా నియమించబడ్డాడు. సంవత్సరంలో చివరలోనే ఆయన మెదినలో తెరెసాను కలిశారు.

1570 సంవత్సరం జూన్ 11 తేదీన దురుఏలో నుండి సాలమాంక  దగ్గరలో మన్సెర కు బదిలీ అయి అక్కడ సుపీరియర్ మరియు నోవిసుల శిక్షణ గురువుగా నియమించ బడ్డారు. 1570 సంవత్సరం అక్టోబర్ 8 యోహను గారి మొదటి నోవిసులు మాటపట్టు తీసుకున్నారు. సమయంలో యోహను గారు ప్రయాణ బడలిక చేత చాలా అలసిపోయేవారు. అక్కడ నుండి పస్త్రన లో నోవిషియేట్ మొదలు పెట్టడానికి అక్టోబర్ నవంబర్ నెలలలో వెళ్లారు.

1571 సంవత్సరం జనవరి లో ఆల్బ దె తోర్మేస్ కు తెరెసా గారెకి తోడుగా వెళ్ళి అక్కడ మఠ స్థాపనలో పాల్గొని అక్కడ నుండి కొన్ని నెలలు మన్సెర తిరిగి వచ్చారు. మరలా ఏప్రిల్ నెలలో ఆల్కలా దె హేనేరేస్కు వెళ్ళి అక్కడ ఉన్న సభ  కళాశాల రెక్టర్ గా ఉన్నారు. 1572 సంవత్సరంలో ఏప్రిల్ -మే నెలల్లో అల్కాలా నుండి పస్త్రనలో నోవిషియేట్ స్థాపించాడానికి అనుమతికొసమై వెళ్ళి అక్కడ నుండి మరలా తన మఠం అయిన అల్కాలకు తిరిగివచ్చాడు. మే మరియు జూన్ నెలల్లో ఆవిలాలో ఉన్న ఇంకర్నెషన్  మఠానికి ఆధ్యాత్మిక గురువుగా తెరెసా గారు మఠ పెద్దగా ఉండగా ఆమె యోహనుగారిని ఆధ్యాత్మిక గురువుగా కోరి ఆమెకు సహాయం చెయడానికి మఠాన్ని ఆధ్యాత్మికంగా ప్రత్యేక అనుమతితో తీసుకున్నారు. ఇదే సమయములో నిష్పాధుక కార్మెల్ సభ సభ్యుల గురించి సవరించబడిన కార్మెల్ సభ నియమావళిని పాటిస్తున్న వారి మనసులు మారిపోయాయి. దీనికి కారణం ఏమిటంటే 1566 సంవత్సరంలో కార్మెల్ సభ జెనరల్ గారు అయిన రూబీయో గారు స్పెయిన్ దేశంలో ఉన్న అన్నీ కార్మెల్ సభ మఠలను సందర్శించి వెళ్లారు. తరువాత సంవత్సరం రెండవ పిలిప్పు రాజు ట్రెంట్ మహా సభ ఆదేశాలను అవలంభించడానికి మఠాల పునరుద్దరణకు సభ జెనరల్ కు ఉండే అటువంటి అధికారం కలిగిన ప్రత్యేక అధికారులను నియమించడానికి అనుమతిని పొందారు. సమాచారం రూబీయో గారికి 1568 లో చేరింది. దానిని రద్దు చేయించాలనుకున్నారు రూబీయో గారు. కానీ పిలిప్పు గారు ఇద్దరు దోమినిక్ సభ గురువులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరిలో ఒకరు జెనరల్ గారి ప్రకారం ప్రవర్తించాడు. కానీ రెండవ వ్యక్తి పూర్తిగా స్వతంత్రంగా ప్రవర్తించి సవరించిన నియమావళిని పాటిస్తున్న మఠాన్ని   నిష్పాధుక కార్మెల్ ఇచ్చి , ఇంకా సేవియా , గ్రనాధ , పెనుఎలా లో నూతన మఠాలను స్థాపించడానికి అనుమతిని ఇచ్చాడు.  ఇవి అన్నీ జెనరల్ రూబీయో గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. సమాయములోనే 1574 లో స్పెయిన్ దేశంలో ఉన్న అన్నీ ప్రొవిన్సిలు ప్రత్యేక అధికారులుగా కార్మెల్ సభ సభ్యులను నియమించమని కోరారు. అదే సంవత్సరం ఆగస్ట్ 3 వారి కోరికకు అనుకూలముగా 13 గ్రేగరి పోపు గారు ఆదేశించారు. కానీ పోపు గారి ప్రతినిధి ఒరమెంతో గారు తన ఆధికారాన్ని ఉపయోగించి వారినే కొనసాగించారు. మరియు నిష్పాధుక కార్మెల్ సభ్యుడైన జెరోమ్ గ్రషీయన్ ను నిష్పాధుక కార్మెల్ సభ ప్రొవిన్సియల్ గా మరియు అందలుసియాలోని సవరించిన నియమావళిని అనుసరిస్తున్న కార్మెల్ సభ్యులకు ప్రత్యేక అధికారిగా నియమించారు. 1574 సంవత్సరం డిసెంబర్ 27 తేదీన పోపు గారు నిర్ణయాలకు ఆమోదం తేలిపారు. 1575 లో కార్మెల్ సభ పియ జెన్స , ఇటలీ లో జరిగిన చాప్టరులో స్పైయిన్ జరుగుతున్న విషయాలమీద చర్చించి జెనరల్ గారి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మఠాలను మూసివేయాలని ఆదేశించారు. విధంగా కార్మెల్ సభ పునరుద్దరణ కొంత ఆగవలసినవచ్చింది. నిష్పాధుక కార్మెల్ సభ్యులు 1576 సెప్టెంబర్ లో అల్మోదొర్ వద్ద ఎన్నిక జరిగింది అని కోపంతో ఉన్నారు.

 

 పునీతుని మీద ఒత్తిడి మరియు శిక్ష

కార్మెల్ సభ సభ్యులు 1576 సంవత్సరం మేలో పునీత సిలువ యోహను గారిని మరియు ఆయన సహచరుడిని ఇంకార్నెషన్ మఠం వద్ద  అరెస్టు చేసి మెదిన వద్ద ఉంచారు, పోపుగారి ప్రతినిధి ఒరమెంతో గారి ఆదేశం తో కొన్ని రోజుల తరువాత వదలి వేశారు. 1577 సంవత్సరం డిసెంబర్ నెల రెండవ తేదీన రాత్రి మరల వారు సిలువ యోహను గారిని అరెస్టు చేశారు. పూర్తిగా పునరుద్దరణ గురించి మాటలాడకూడదని, మరల అటువేళ్ళకూడదని , వదలివేయాలని అడిగారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు.  అక్కడ నుండి తోలేదో తీసుకొని వెళ్లారు. అక్కడ ఎనిమిది నెలల పైన మఠ చరసాలలో ఉంచారు. ఆయనను ఉంచిన చరసాల గది కూడా చాలా చిన్నది. ఆయన పద్యాలు కొంత భాగాన్ని ఇక్కడే రాశారు. అక్కడ చరసాలలోనుండి 1578 సంవత్సరం ఆగస్ట్ నెల 16-18,తేదీల మధ్య  మరియ మాత మోక్ష రోపణ పండుగ అష్టకం లో  అక్కడ నుండి తప్పించుకున్నారు.

బేయజ వద్ద మఠం మఠ పేదరికం

బేయజ ప్రజలు అందరు పెనుఎలాలో నిష్పాదుకా కార్మెల్ సభ గురువులను చూసి వారిని తమ పట్టణం లో కూడా ఉండాలి అని ఫా. ఏంజల్  గారిని అభ్యర్దించ్చారు.  1579 లో  కోరేంజుఎలా నుండి పెనుఎలా లో ఉన్న పాత మఠం దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ నుండి  పునీతుడు చాలా మంది సన్యాసులను బేయజ వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ మఠానికి కావలసిన అన్నీ సమకూర్చి మరలా పెనుఎలా కు రావడం జరిగినది,  తరువాత జూన్ 13, 1579 లో  ప్రారంభించారు. దివ్య బలి అర్పించి అక్కడ మఠాన్ని ప్రారంభించారు. ఇది శిక్షణా మఠం వలె ఉండేది,  అంతకు ముందు 1570 లో హేనేరస్ వద్ద నిర్మించిన మఠంలో కూడా పునీత సిలువ యోహనుగారు మఠ స్థాపకుడు మరియు మఠ పెద్ద. మఠాన్ని అన్నీ విధాలుగా నడుపుతూ నూతన మఠ వాసులకు తర్పీదు  ఇస్తూ మఠాన్ని ప్రార్థన , మౌనం , ధ్యానం నియమావళి అనుకూలంగా నడిపేవాడు. అక్కడి విశ్వ విద్యాలయ పండితులు క్రొత్త మఠ గొప్పదనం గురించి వారి ప్రసంగాలలో కూడా ప్రస్తావించేవారు. విధంగా అందలుసియాలో అందరికి మఠం గురించి తెలిసింది. అక్కడ ఉన్న మఠ వాసులు ఎప్పుడు కూడా దేవాలయంలోనే ఉండేవారు, కేవలం మఠ విద్యార్ధులు మాత్రమే చదువులు నిమిత్తం బయటకు వెళ్ళేవారు. వారిని చూసిన వారిలో ఒక రకమైన భక్తి కలిగించింది.  మఠ పెద్దగా తమ ఆంతరంగిక  మరియు  బాహ్య జీవితాన్ని మిళితం చేసి జీవించారు.  తాను విశ్వాసులు ఇచ్చే ఉపకారం మీద బతుకుతున్నప్పటికి,  తనకి మంచి చేసిన వారికి ఆయన మంచి చేస్తున్నప్పటికి, ఈయన  ఎప్పుడు మఠ మౌనం ఉల్లంఘించలేదు. మఠ వాసులు ఎప్పుడు విధులలో కనపడేవారు కాదు. పునీతుడు దేవునితో అద్బుతమైన సంభంధం అనుభవిస్తుండగా బేయజలో అప్పుడే 13 గ్రేగరి పోపుగారు  నిష్పాదుకా  కార్మెల్ సభ్యులు అధికారికంగా వేరు పడే ఆదేశం ఇచ్చారు. ఆదేశాన్ని అమలు చేయడానికి నిష్పాధుకా కార్మెల్ సభ గురువులు 1583 మార్చి 4 తేదీన చాప్టర్ చేశారు. చాప్టర్ లో నలుగురు డెఫినిటర్లను నియమించారు. వారిలో 3 డెఫినిటర్ పునీత సిలువ యోహనుగారు. చాప్టర్ తరువాత పునీత సిలువ యోహను గారు బయేజ వెళ్ళి  మరల తన పనిని ప్రారంభించాడు. బయేజ వద్ద జూన్ 14 వరకు వున్నారు. గ్రనాధ మఠం పునీత యోహను గారిని వారి మఠ పెద్దగా ఎన్నుకొన్నారు. ఇది మొదటి సారి పునీత యోహను గారు ఒక  మఠాన్ని నడిపించినది. ప్రత్యేక పర్యవేక్షకుడు ఫా.దీయగో అక్కడకు వచ్చినప్పుడు, వారు అందరు చాలా లోకం నుండి పూర్తిగా విరమణ తీసుకున్నట్లుగా ఉన్నారు అనుకున్నారు. మఠ పెద్ద ఎప్పుడు బయట కనపడేవాడు కాదు.

గ్రనాథ లో సభ సన్యాసినుల మఠం

గ్రనాధ ప్రజలు వారి జీవితము చూసి, నూతన కార్మెల్ సభ సన్యాసినులను కూడా వారి పట్టణం లో కావాలని కోరుకున్నారు. విషయాన్ని అక్కడి ప్రజలు అందలుసియా ప్రొవిన్సియల్  అయిన ఫా. దీయగో గారెకి తెలియచేసారు. విషయాన్ని దైవ భక్తురాలు అన్నమ్మ గారెకి ఆమె బయేజ వద్ద ఉన్నప్పుడు,అక్టోబర్ నెల 1581 లో  వారిని చూడటానికి వచ్చినప్పుడు  చెప్పడం జరిగింది. అన్నమ్మ గారు అస్వస్థతకు గురి అయ్యి వుండటం వలన మరియు వారు  ఫా. దీయగో గారెకి ఇచ్చిన  మాటలలో నమ్మకం లేక ముందుకు సాగలేకపోయింది. అంతే కాక అర్చి బిషప్ మరియొక మఠాన్ని అనుమతించరని అనుకున్నారు. కానీ ఒక రోజు ఉదయం తన ఆధ్యాత్మిక గురువు సిలువ యోహనును సంప్రదించి, దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె తన మనస్సు మార్చుకొని, గ్రనాధ వెళ్ళడానికి నిశ్చయించుకుంది. నవంబర్ 13 తేదీన ఫా. దీయగోగారు, పునీత సిలువ యోహను గారిని ఆవిలా వెళ్ళి  తెరెసాగారిని తీసుకురావలసినదిగా ఆదేశించారు. పునీత యోహాను గారు తాను తప్పించుకున్న తరువాత మొదటి సారి తెరేసాను మరల ఇప్పుడే కలవడం. కానీ తెరెసాగారు బుర్గోస్ లో నూతన మఠ స్థాపన నిమిత్తమై గ్రనాధ వెళ్లలేకపోయింది. 1581 నవంబర్ 29 తేదీన నిష్కళంక మాత పండుగా రోజున ఆవిలా నుండి పునీత యోహను గారు ఇద్దరు సన్యాసినులతో ఒకరు ఆవిలా మరియొకరు తోలేదో నుండి బేయజ వచ్చారు.   సన్యాసినులు బేయజ వద్ద 1582, జనవరి 15 వరకు ఉన్నారు. అప్పుడు సిలువ యోహాను ,అన్నమ్మ మరియు ఫా. పీటర్ కలిసి ఉదయాన్నే గ్రనాధ బయలుదేరి వెళ్లారు. అక్కడ  యోహాను గారి శిష్యురాలు అన్న అనే ఆమె ఉన్నారు. ఆమె తన సోదారునితో అక్కడే ఒక మంచి ఇంటిలో ఉండేవారు. ఈమె సోదారుడే అక్కడ మరియొక మఠం కావాలని కోరినది. అతను సన్యాసినులు రోడ్డు మీద ఉన్నారు, వారికి ఒక ఇల్లు దొరికినంత వరకు ఇక్కడ ఉండనివ్వమని కోరాడం జరిగింది. అందుకు ఆమె ఇంటిని ఇవ్వడం మాత్రమే కాకుండా వారికి కావలసినవి అన్నీ సమకూర్చారు. వారు ప్రార్థన చేసుకోవడానికి ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు . జనవరి 20 తేదీన 1582 , ఉదయం 3 గంటలకు ఇద్దరు గురువులతో సన్యాసినులు అక్కడకి వెళ్ళేసరికి వారిని స్వీకరించడానికి అక్కడ తలుపు దగ్గరే నిలుచొని ఉన్నారు. అన్నమ్మగారు  ఆక్కడే ఉన్నారు. యోహను గారు వారిని అక్కడ వదిలి తమ ఇంటికి వెళ్లిపోయారు.కాని  తరువాత వారికి కావలసిన వాటిని అన్నింటినీ సమకూరుస్తూనే ఉన్నాడు.  

అల్మొదవర్   లో సభ ఎన్నిక , మలాగ మఠ స్థాపన

అలమొదవర్ వద్ద మే  నెల, 1583  లో పునీత యోహాను గారు గ్రనాధ మఠ పెద్దగా  ప్రొవిన్స్  ఎన్నికలకు   హాజరయ్యారు.  నలుగురు సలహాదారులను ఎన్నుకున్న తరువాత మఠ పెద్దలను ఎన్నుకోవడం గురించి చర్చించారు. పునీత యోహానుగారు మఠ పెద్ద గారిని , ప్రొవిన్సియల్ ఎన్నికలలో కాకుండా  మఠ సభ్యులు ఎన్నుకోవాలి అని కోరాడు. కానీ ఎన్నికలలో పునీత యోహాను గారి కోరికకు వ్యతిరేకముగా నిర్ణయించారు. మరలా ఆయనను గ్రనాథ మఠ పెద్దగా ఎన్నుకొన్నారు. 1584 సంవత్సరాలలో స్పెయిన్ దేశంలో చాలా పెద్ద కఠినమైన కరువు కాలం, ముఖ్యముగా అందలుసియా ప్రాంతం చాలా కఠినమైన కరువును అనుభవించినది. అన్నీ గ్రామలనుండి ప్రజలు గ్రనాధకు రొట్టెలను అడగడానికి వచ్చేవారు. వచ్చేవారి మీద పునీత యోహాను గారికి తన గురువు క్రీస్తువలె కనికరపడి , ఆయనే పెద్ద మఠాన్ని నడుపుటకు వేరె వారిమీద ఆదరపడుతున్నప్పటికి ధారాళంగా అదిగినవారందరికి సహాయం చేశారు. మొదట సాధ్యమైనంత మందిని మఠాన్ని నిర్మించడానికి వారిని ఉపయోగించుకొని వారికి ఉద్యోగం ఇచ్చారు. కరువు కాలంలోనే మఠాన్ని నిర్మించారు. ఉదారవేత్తల నుండి సమీకరించిన డబ్బుతో కావలసిన ధాన్యాన్ని కొని , మఠానికి వచ్చిన వారిని ఎవరిని కాలి చేతులతో పంపలేదు. సమయంలోనే  యోహను గారు  ఆధ్యాత్మిక గీతం మీద వివరణ రాస్తూ ఉన్నారు. ఎక్కడ  దాగి ఉంటివి అనే భాగం మీద రాశారు. మరియు ఇదే సమయంలో  ఆయన శిష్యురాలు అన్న గారికోసము  ప్రేమ జీవ జ్వాల మీద కూడా వివరణ రాస్తున్నారు. డిసెంబర్ 1584లో ప్రొవిన్సియల్  ఫా. జెరోమ్ గారు మలాగ వద్ద మఠం స్థాపించడానికి నిర్ణయించి తాను స్వయంగా అక్కడకు వెళ్లలేక పునీత యోహాను గారిని అందలుసియా  వికార్ ప్రొవిన్సియల్, మరియు గ్రనాధ మఠ పెద్దగా  గా పంపడం జరిగింది. పునీత యోహను గారు మఠ స్థాపకులైనా సన్యాసినులతో వెంటనే ప్రయాణం మొదలు పెట్టారు. ఫెబ్రవరి ,17 తేదీన 1585 అక్కడకు చేరుకున్నారు. పునీత జోజప్ప గారి పేరున మఠాన్ని స్టాపించారు. పునీత సిలువ యోహను గారు దివ్య బలి పూజ అర్పించారు.

లిస్బన్ వద్ద సభ ఎన్నికలుయోహను గారెని అందలుసియా వికారు ప్రొవిన్సియల్ చేయుట

పునీత సిలువ యోహను గారు గ్రనాథ మఠ పెద్దగా ఉన్నప్పుడు సభ మూడవ ఎన్నికలు జరిగినవి. ఇవి లీస్బోన్ వద్ద జరిగినవి. 1585లో మే 11   జరిగినవి. ఫా. నికోలస్ సభ రెండవ ప్రొవిన్సియల్ గా ఎన్నిక అయ్యారు. నలుగుగు నూతనముగా ఎన్నికయిన ప్రొవిన్సియల్ సలహాదారుల్లో రెండవ సలహాదారుడు పునీత యోహాను గారు. నికోలస్ గారు జెనీవా నుండి వచ్చిన వెంటనే  అందరిని పస్ట్రాన  వద్ద అక్టోబర్  17 సమావేశ పరచారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలలో సభను నాలుగు భాగాలుగా ఏర్పరిచారు. నాలుగు భాగాలను నలుగురు ప్రొవిన్సియల్ సలహాదారులు పాలిస్తారు. వాటిలో అందలుసియాను పునీత యోహను గారు ప్రొవిన్సియల్ సలహదారునిగా పాలిస్తారు. సలహా దారులకి ఇప్పుడు ఎక్కువ ఆధికారం ఉంది. ఎందుకంటే జెరోమ్ ప్రొవిన్సియల్ ఉన్నప్పుడు ఆయన వారిని నియమించారు. కానీ ఇప్పుడు వీరు ఎన్నుకోబడ్డారు.  పునీతుడు పసత్రాన నుండి గ్రనాధ కు వచ్చిన తరువాత 13 మఠాల పర్యవేక్షణ ఆయన  మీద పడింది. వాటిలో 7 పురుషులవి 6 స్త్రీలవి. మఠాలను పునీత యోహను గారు తరచూ వాటిని దర్శించి కావలసిన చేసేటివాడు. వారి జీవిత విధానం పరిశీలించి లోపాలను గుర్తించి వారి మార్గాలను సరిచేసేవారు. ఒక మఠాన్ని దర్శించిన సమయంలో మొదట అక్కడ దేవాలయం లోనికి వెళ్ళి దివ్య సత్ప్రసాద మందసం ముందు ప్రార్థన చేసి , ఎవరైనా అస్వస్థతతో బాద పడినట్లయితే ముందు వారిని పరామర్శించేవారు.  

సేగోవియా , కోర్దోబ మఠాల స్థాపన మరియు సేవియ్యే ను దర్శించుట

పునీతుని శిష్యురాలు అన్న గారు ఆమె భర్త గారి విల్లు అమలు చేయడానికి యోహను గారి సలహాను తీసుకొని సేగోవియా లో నిష్పాధుకా  కార్మెల్ సభ మఠాన్ని స్థాపించడానికి నిశ్చయించుకున్నారు. పునీత యోహనుగారు ప్రొవిన్సియల్గా ఒప్పుకోని ఫా.గ్రెగోరిని మఠ స్థాపనకు ఆదేశించారు.  పునీత యోహను గారు చెప్పినట్లుగా ఫా. గ్రెగోరి గారు చేసి 1586,మే 3 మఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమయములో పునీతుడు కారవాక ను దర్శించడానికి వెళ్లారు. ఇక్కడ మఠ పెద్దగా తన శిష్యరాలు అన్న ఆల్బర్ట్  అనే ఆమె ఉండేవారు. ఆమె పునీత యోహను గారితో  కారవాకలో  పురుషుల మఠం లేకపోవడం గురించి మాటలాడింది. 1586 సంవత్సరం  ఫెబ్రవరి లో పునీత యోహను గారు కారవాక  నుండి పెనుఎలా మఠానికి వచ్చాడు. అక్కడ శ్రమల కాలం మొత్తం అక్కడే ఉన్నారు. అక్కడ నుండి వారంలో మూడు సార్లు వాక్య పరిచర్యకు కాలి నడకమీద వెళ్ళి అలానే నడక మీదనే వచ్చేవాడు.  అక్కడ భోజనం కూడా తీసుకునే వాడు కాదు.  పెనుఎలా నుండి కోర్డోబ కు వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిని మఠానికి ఇచ్చారు. ఆనందంగా తీసుకొని, 1586 లో  మే  నేల  18 తేదీన  మఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత  మఠానికి పస్త్రన లో తన శిష్యుడుగా ఉన్న ఫా. అగస్టీన్ ను  మఠ పెద్దగా చేసి యోహనుగారు  సేవియ్యే వెళ్లారు. సేవియ్య లో ఉన్న సన్యాసినులు అనుకూలమైన స్థలం లో లేరు. పునీత తెరెసా గారే ఆమె కోరికలకు అనుకూలముగా ఉండే స్థలం చూడలేకపోయింది. కాని ఇప్పుడు వారికి ఒక మంచి ఇల్లు దొరికింది ప్రొవిన్సియల్ ప్రతినిధి వారిని ఇంటిలో చేర్చారు.

పునీతున్ని ప్రొవిన్సియల్ గారు మాద్రిద్కు పిలుచుట

 ప్రొవిన్సియల్ గారు తన ప్రతినిధులను, 1586 లో  ఆగస్ట్ 13 తేదీన  మాద్రిద్ రావాలని పిలువగా యోహను గారు మార్గ మద్యలో తోలేదో వద్ద అనారోగ్యానికి గురయ్యారు కనుక మాడ్రిడ్ వెళ్లలేక పోయాడు. తాను కోలుకున్న తరువాత తన మఠానికి వెళ్ళాడు. ఆయన గ్రనాధ వెళ్ళగానే ఫా. నీకోలాస్ గారు అక్కడి మఠ పెద్ద అయిన అన్నమ్మ గారి ని మాద్రిద్ తీసుకురమ్మని ఆదేశించారు. ఆమె అక్కడ క్రొత్త మఠానికి పెద్దగా ఉండలని ప్రొవిన్సియల్గారు కోరుకున్నారు. పునీత యోహను గారు వినయ పూర్వకముగా వెళ్లారు. తరువాత ఆయన అక్కడనుండి మంచా ఏయల్ వెళ్ళి అక్కడ అక్టోబర్ 12 క్రొత్తహత మఠాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఫా. జెరోమ్ గారు గువల్కజర్ వద్ద  ఒక క్రొత్త మఠాన్ని అంగీకరించారు,మార్చి 24,1585 లో  డానిలోనికి ప్రవేశించారు.  కానీ డానికిక్ సంభందించిన కొన్ని పనులు మిగిలిపోగా, వాటిని పూర్తి చేయడానికి ప్రొవిన్సియల్ గారు పునీత యోహను గారెని వాటిని పూర్తి చేయవలసినదిగా పంపారు. అక్కడి మఠ వాసులు ఎంతో ప్రేమగా పునీతున్ని ఆహ్వానించారు. ఎటువంటి సమస్య లేకుండా పునీతుడు పని పూర్తి చేశారు. 1586,నవంబర్  చివరిలో  పునీతుడు బుహాలన్సే కి నూతన మఠాన్ని స్థాపనకి వెళ్లారు. అక్కడ ఉండగా ప్రొవిన్సియల్ దగ్గర నుండి మాద్రిద్ రావలసినదిగా ఆదేశించారు. ఉదయాన్నే పునీతుడు మాద్రిద్ కు ప్రయాణం అయ్యాడు. అక్కడి నునిద వెళ్ళే ముందు ఫా. దీయగో గారెని కారవాకలో మఠాన్ని స్థాపించ వాలసినదిగా ఆదేశించారు.  దీని గురించే కరవాక  మఠ పెద్ద అన్నమ్మగారు  పునీతునితో మాట్లాడినది. 1586, డిసెంబర్ 18   ఫా. దీయగో గారు మఠాన్ని స్వాదినపరుచుకున్నారు.

బయదొలిద్  వద్ద సభ చర్చలు మరియు ఎన్నికలు

యోహాను గారు మార్చి మొదటి 1587 మార్చి మొదటి వరకు మాడ్రిడ్ లోనే ఉన్నారు. అక్కడ నుండి కారవాక వద్ద మఠ పెద్ద ఎన్నిక   పర్యవేక్షణకై అక్కడకు వెళ్లారు. ఆయన ఎన్నిక రోజు దివ్య పూజ బలిని అర్పించగా అక్కడి సన్యాసినులు ఆయన చుట్టూ  ఒక వెలుగును చేసేము అని చెప్పారు.  ఇది నిజమా లేక వారు బ్రమ పడుతున్నమా? అని వేరె చోటనుండి వారు చూసిన  అలానే వారికి కనిపించింది అని చెప్పారు. కారవాక నుండి ప్రొవిన్సియల్ గారి పిలుపు మేరకు బయదోలీద్కు వెళ్లారు. అక్కడ ఏప్రిల్ 7 ప్రొవిన్సియల్ ఎన్నికలకు సిద్దపరచి 17 ఎన్నికలు జరిపారు. మరలా గ్రనాధ మఠ పెద్దగా ఎన్నిక అయ్యారు. ఆయన మరలా బలవంతముగానే బాధ్యతను తీసుకున్నారు. అవి అయిపోయిన తరువాత యోహనుగారు గ్రనాధకు వెళ్ళడం జరిగినది. అక్కడి  మఠ వాసులు చాలా ఆనందముతో పునీత యోహాను గారెని తమ పెద్దగా ఆహ్వానించారు. ఇప్పుడు ఆయన వరుసగా  మూడవ సారి వరుసగా మఠ పెద్దగా ఎన్నుకోబడ్డారు. ఆయన మఠాన్ని కట్టడం పూర్తి చేసి, దానికి నీటి సదుపాయం ఏర్పాటు చేసి, ద్రాక్ష తోట నాటి దానిని అన్నీ సభ మఠాలకు ఆదర్శమూగ చేశారు.

నిష్పాధుకా కార్మెల్ సభ మొదటి సాధారణ చర్చ మరియు ఎన్నిక

1588, జూన్ నెలలో పునీత యోహాను ,  ప్రొవిన్సియల్ గారి ఆజ్ఞ ప్రకారం మాడ్రిడ్ లో పాల్గొన్నారు. 5 సిక్టస్  పోపుగారు    నిష్పాదుకా కార్మెల్ సభ్యులు మరియు   కఠిన  నియమావళి  తగ్గించిన కార్మెల్ సభ సభ్యుల మధ్య పూర్తిగా విడిపోయే విధంగా జులై 10 తేదీన 1587 లో పోపు గారు ఆదేశం ఇచ్చారు.  ఆదేశాన్ని అమలు చేయడానికి అప్పుటి ప్రొవిన్సియల్ ,నలుగురు సలహదారులైన వారిని పిలవడం జరిగినది. ఇది ఏవిధంగా ఇది అమలు చేయాలో చర్చించడానికి జూన్ 10 తేదీ ,1588 లో మాడ్రిద్ దగ్గర కలవడం జరిగింది.  పోపు గారు నుండి వచ్చిన ఆదేశం చదివిన తరువాత దానిని అమలు చేయడానికి పూనుకున్నారు. దాని ప్రకారం 6 గురు సలహాదారులు ఉండాలి. వారిలో సిలువ యోహను గారెని మొదటి వానిగా ఎన్నుకున్నారు.అదే విధంగా ఆయనను సేగోవియా మఠానికి పెద్దగా ఎన్నుకున్నారు. మఠాన్ని ఆయన శిష్యురాలు అన్నమ్మ గారు ఏర్పాటు చేసింది.  ఆయన సేగోవియకు ఆగస్ట్ నెల మొదటిలో వెళ్ళి తన పనిని మఠాన్ని మంచి ఆరోగ్యకర స్థానంలో పుననిర్మించి  ప్రారంభించాడు. సమాయములోనే పునీతుని తల్లి మెదిన దేల్ కంపోలో మరణించారు. ఆమె అక్కడే జీవించేది. తెరేసా గారు ఆమెకు కావాలిసినవి అన్నీ వారే సమకూర్చాలి అని చెప్పింది. అదే విధంగా వారు ఆమెకు కావలసినవి అన్నీ సమకూర్చారు. కెథరీన్ అల్వేరేస్ చనిపోయినప్పుడు వారితోటి అక్కడ సమాధి చేయబడింది. మఠం   ఆమె దేహాన్ని పొందటం ఒక ఆభరణంగా భావించింది. ఎందుకంటే ఆమె జీవితం అంత గొప్పది. ఆయన అక్కడ మొదటి పూజ చేసిన తరువాత ఆమెను చూడలేదు.

ఫా. నికోలస్ సభలో నూతన పరిపాలన విదానం ప్రవేశ పెట్టుట

  విధానం లో ఏడుగురు సభ్యులు ఒక కమిటిగా చేసి వారి ముందుకు ఒక మఠం లో జరిగిన అన్నీ విషయాలను, ముఖ్యముగా వారి లోపాలను , చివరికి చిన్న చిన్న సమస్యలను కూడా  వారి ముందుకు తీసుకురావాలి. క్రొత్త విధానం సభలో పురుషుల మరియు స్త్రీల విభాగాలలో  చాలా అలజడి సృష్టించింది. వారి చిన్న చిన్న  తప్పులు ఒకరి ముందుకు కాకుండా  ఏడుగురు సభ్యులు కమిటీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడలేదు.  ఇటువంటి పరిస్థితిలో వారు సహయం కోసం సభ బయట అర్థించారు. నియమానికి ఎక్కువగా బాధ పడిన వారిలో ముఖ్యలు దైవ భక్తురాలు మాడ్రిడ్ మఠపెద్ద అయిన అన్నమ్మ గారు. ఆమె ధ్రుష్టిలో సన్యాసినులు ఒక పెద్ద యొక్క ఆధీనంలో ఉండాలి కాని ఇలా అనేకమంది చేతులలో కాదు. ఆమె మర్మోల్ అనే గురువు గారెతో ఒక లేఖను పోపు గారెకి పంపింది. మర్మోల్ జెరోమ్ గ్రశీయన్ గారి బంధువు.  పోపు గారు మఠ వాసులుకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని పంపించారు. సన్యాసినులు చేసిన పనిని  ఫా. నికోలస్ చాలా అవమానముగా భావించి   తన సలహా కమిటీని అత్యవసరముగా పొలిచి విషయమును ఏమి చేయాలి అని తన సలహా కమిటీని కోరాడు. మీటింగ్ లో వారు ఇక అప్పటినుండి సన్యాసునులతో తమకి సంభందం లేదని వారికి అప్పటినుండి ఆధ్యాత్మిక తోడ్పాటు , మరియు వారి దార్శనికత ఉండవని నిర్ణయించారు.   సభ సన్యాసినుల పట్ల ఇది చాలా కఠినమైన నిర్ణయం. పెంతకోస్తు పండుగ రోజు మాడ్రిడ్ లో ఫా. నికోలస్ మరియొక చాప్టరు నిర్వహించక అక్కడ సన్యాసినులు మరియు ఫా. నికోలస్ మద్య సఖ్యత నెలకొంది. సిలువ యోహనుగారికి మరియు అం దైవ భక్తురాలు అన్నమ్మ గారెకి మధ్య ఉన్న స్నేహం కారణంగా అనేక మంది గురువులు సన్యాసినులలో తరహా ఆలోచన లేక విప్లవ దృక్పథం రావాడానికి యోహను గారే కారణం అని అనుమానించారు.   విషయాలు తెలిసి ఫా. నికోలస్ పునీత సిలువ యోహాను గారిని ఉన్న పళంగా   జూన్ నెల 1591 లో జరిగిన చాప్టర్ కు సేగోవియా నుండి పిలిపించాడు. పునీత సిలువ యోహను గారి మీద వారికున్న వ్యతిరేకతను వారు చాప్టర్ లో చూపించారు. నిష్పాదుకా కార్మెల్ సభ మొట్ట మొదటి సభ్యునికి ఎవరు తమ ఓటు వేయలేదు. ఎన్నికలు అయిన తరువాత జరిగిన వాదనలలో డిస్కషన్ లో పునీత యోహనుగారు నియమావళిలో  కొన్ని  నియమాలు  వెరే నియమాలకు వ్యతిరేకముగా ఉన్నవి అని చెప్పాడు.  అదే విధంగా జెరోమ్ గ్రషీయన్కు అనుకూలముగా మాటలాడాడు. మరియు  సభ సన్యాసినులతో ప్రేమగా ఉండవలసిన ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. అప్పటివరకు  పునీత యోహను గారి మీద అనుమానపడిన వారు, ఎప్పుడైతే యోహనుగారు సన్యాసీనుల పట్ల ప్రేమగా ఉండాలి అని అన్నారో, వారి అనుమానాలు ఋఢీ  అయినవి అని వారు  భావించారు. ఫా. నికోలస్ , సన్యాసీనులకు  ఖండనగా  పునీతున్ని  ప్రొవిన్సియల్ గా తీసివేశారు. అప్పుడు పునీతుడు ఆయనను పెనుఎలా మఠానికి తనను పంపమని కోరాడు. అది సభలో చాలా కఠినమైన మఠం. 1591 జులై లో పునీతుడు పెనుఎలా వెళ్ళాడు. అక్కడ ఉన్న మఠ వాసులు చాలా ప్రేమగా పునీతుని ఆహ్వానించారు. మఠ పెద్ద పునీతుని శిష్యుడు. కనుక ఆయన మరల తన గురువు గారి దగ్గర శిష్యరికం చేయవచ్చు అనుకున్నాడు. ఆయన పేరు దీయగో ఆఫ్ ఇంకార్నెషన్. పునీతుని ఆరోగ్యం తన నిష్టలతో చాలా వరకు క్షీణించింది.  అప్పడే కౌన్సిల్  ఆయనను  ఇండీస్ వెళ్ళమని కబురు పంపింది.  వెంటనే పునీతుడు తనతో పాటు వచ్చేవారిని సిద్దము చేయమని రాయడం జరిగినది, కానీ ఒక విష జ్వరం తో పునీతుడు జబ్బున పడ్డాడు. ఇది తెలుసుకున్న ప్రొవిన్సియల్ ఆంటోనియో హెరోదియా పెనుఎలా లో కంటే బయేజ లేక ఉబెద లో వైద్య సదుపాయం మెరుగుగా ఉండవచ్చు అని రెండు ప్రదేశాలలో ఏదో ఒకటి  ఎంచుకోమని కోరాడు. పునీతుడు ఉబెద కు పంపమని కోరాడు. 1591 సెప్టెంబర్ 31   పునీతుడు ప్రయాణం ప్రారంభించారు అది చాలా కష్టం తో కూడిన ప్రయాణం.

ఉబెద మఠ పెద్ద కాఠిన్యం -

 పునీత సిలువ  యోహను గారు  అందలుసియా  ప్రొవిన్సియల్ గా ఉన్నప్పుడు ఇద్దరు గురువులు గొప్ప ప్రసంగీకులుగా పేరుగాంచి ఉన్నారు. వారీలో  ఫా. దీయగో ఒకరు,  పునీత యోహను గారు ఆయన్ను తన మఠ క్రమ శిక్షణను ఉల్లంఘించి ఎక్కువ సమయాన్ని బయట ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆయనను హెచ్చరించినందుకు ఆయన పునీతుని మీద చాలా పగ పెంచుకున్నాడు.  ఆయన డెఫినిటర్ అయిన తరువాత కొంతమంది మఠ వాసులు జీవితాలను వారి ప్రవర్తనను పరిశీలించడానికి ఒక  కమీటీ ఏర్పడిన తరువాత దీయగో అనే డెఫినిటర్  పునీతుని ప్రవర్తన గురించి  ఆరాతీయడం ప్రారంభించాడు తనం పని కాకపోయినా కానీ తనకు ఉన్న పగతో పునీతుని సభ నుంచి  బయటకు పంపాలని చూశాడు. మరియొక గురువు ఫ్రాన్సిస్ క్రీసొస్తం అనే గురువును కూడా పునీతుడు క్రమ శిక్షణ గురించి హెచ్చరించి ఉన్నాడు. అతను కూడా పునీతుని మీద పగతో ఉన్నాడు. కానీ పునీతుడు గురువు ఉబెద మఠ పెద్ద అని తెలిసికూడ కష్టాలను కోరి అక్కడ ఉండటానికి వెళ్ళేడు. పునీతుడు పెనువేలో నుండి ఉబెద వెళ్ళిన ప్రయాణం చాలా కష్టతరమైంది. ఒక మఠ వాసితో కలిసి పునీతుడు కాలి  నడకన వెళ్ళాలి అనుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం సహకరించక ఆయను గాడిద మీద తీసుకెల్లవాలసి వచ్చింది. ఉబెద వెళ్ళేసరికి పునీతుడు చాలా అనారోగ్యానికి గురిఅయ్యాడు. మఠ పెద్ద పరిస్థితిలో ఉన్న పునీతుని చూసి కూడా చలించలేదు. ప్రయాణం పునీతుని ఆరోగ్యం ఇంకా క్షీణించింది. మరుసటి రోజు పునీతుని పాదం మీద 5 కంటే ఎక్కువ రక్తం స్రవించే గాయాలు అయ్యాయి.  అది చూసిన వైద్యుడు మార్టిన్ ఇయారఎల్  అక్కడి మాంసం తీసియడం తప్ప వేరొక మార్గం లేదు అని అది తీసివేయగా కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. కాని  ఇవి అన్నీ చూసికూడా సాధారణంగా ఇచ్చే వైద్య సాదుపాయం కూడా అతను కల్పించలేదు.  కొంతమంది స్త్రీలు పునీతుని గురించి తెలిసి ఆయన వాడిన బట్టలు గాయలుకు కట్టిన బట్టలు శుద్ది చేయడానికి సిద్దపడి చేస్తుండగా అది తెలుసుకున్న వెంటనే  మఠ పెద్ద ఫ్రాన్సిస్ వారిని అది చేయడాన్ని నిషేధించాడు.  అది సభ పేదరికానికి వ్యతిరేకం అని చెప్పాడు అటువంటి వాటిని అనుమతించాలేను అని చెప్పాడు. అదే విధంగా మఠ పెద్ద ఎవరు తన అనుమతి లేకుండా పునీతుని పరామర్శించడాన్ని నిషేధించాడు. పునీతుడు  ఎవరిని కాలవడాన్ని సంతోష పడుతాడో వారికి అనుమతిని ఇవ్వలేదు. చివరికి  పునీతునికి సహయముగా ఉన్న వానినికూడ తన పని నుండి తప్పించాడు. దానికి ఫా. విధేయించినప్పటికి అప్పటి ప్రొవిన్సియల్ గారెకి సమాచారాన్ని అందించాడు.

పునీతుని కోసం ప్రొవిన్సియల్  రావడం

ఆంటోనియో  హెరోడియా  పునీతుని పరిస్థితిని గురించి తెలిసి,    బెర్నార్డ్ అనే గురువుగారు పంపించిన సమాచారం తెలుసుకొని,   అది విన్న వెంటనే  ఉబెదకు వచ్చారు.   మఠ పెద్ద, పునీతుని పట్ల వ్యవహరించిన విధానానికి చాలా బాధ పడి  మఠ పెద్దను ఖండించి,  పునీతిని చూడటానికి వెళ్ళాడు. అప్పుడు  పునీతుడు ఉన్న గదిని వేరె సహచరులు పునీతుని  పరామర్శించడానికి  తెరిచి ఉంచారు.  తరువాత ఆయనన మఠపెద్ద,    మఠ తలుపులును పునీతుని ప్రజలందరూ చూడటానికీ తెరువమని చెప్పారు.  ఫా. ఆంటోనియా  హెరోడియా కొద్ది రోజులు అక్కడ ఉండి వెళ్లిపోయారు. ఆయన రాక మఠ పెద్ద మనసు పునీతుని పట్ల మారింది, అని మిగిలినవారు కూడా గ్రహించారు. దాని తరువాత మఠ పెద్ద పునీతుని క్షమాపణ అడిగి మఠాన్ని నడుపుటకు తన సలహాలు కూడా అడిగారు.

పునీతుని మరణం

అక్కడ  1591 సెప్టేంబర్  చివర నుండి నిష్కలంక మాత పండుగ వరకు అక్కడ ఉన్నారు.  పునీతుని  చూస్తున్న వైద్యుడు  ఆయన ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పడం జరిగింది.   వార్తను ప్రొవిన్సియల్  గా ఉన్నటువంటి ఒకప్పటి పునీతుని సహచరుడు ఆంటోనియో హెరోడియా కు చెప్పేరు. ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నాడు. వారంలో పునీతుడు, రోజు ఏమిటని వారిని అడిగాడు. గురువారం ఆయన అనారోగ్య సమయంలో, అతనితో పాటు  ఉన్న బర్తలోమియో అనే గురువును తన తలగడ క్రింద ఉన్న సంచి తీసుకొని దానిలో ఉన్న పత్రాలను కాల్చివేయమని అడిగారు. గురువారం సాయంత్రం దివ్య సత్ప్రసాదం తీసుకు వచ్చినప్పుడు పునీతుడు వారి అందరినీ, తాను ఏమైనా చెడు మాతృకను చూపించినట్లయితే క్షమించమని అడిగి,  వారిలో మఠ పెద్ద లేడని గ్రహించి ఆయనను కూడా పిలిచి తనను క్షమించమని అడిగారు. దానికి గురువు కూడా తన తప్పులను క్షమించమని, తాను చాల కఠినముగా ప్రవర్తించినందుకు క్షమించమని కోరారు. అప్పుడు దివ్య సత్ప్రసాదం స్వీకరించారు. పునీతుడు  మఠ పెద్దను చివరిగా తనను, సభ వస్త్రంతోనే  సమాధి చేయాలని కోరాడు. అదే ఆయన తన జీవితం లో కోరుకున్నది అయ్యి ఉండవచ్చు. తన వస్తువులను మిగిలిన సన్యాసులు కోరగా తనకు సంబంధించినవి మొత్తం మఠ పెద్దకు చెందుతాయని, ఆయనను అడగమని చెప్పారు. శుక్రవారం, ఆంటోనియో హెరోడియా పునీతిని చూడటానికి వచ్చారు. ఆయనను చూడటానికి పునీతుడు ఆనందపడినప్పటికి తనకు ఉన్న నొప్పి వలన ఆయనతో మాట్లాడలేకపోయారు. 11:30 గం. లకు  పునీతుడు అందరికి పిలవమని చెప్పాడు. అందరూ వచ్చిన తరువాత చనిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థించారు. వారు 12 గం లకు ప్రార్థనకు  గంట కోట్టగా పునీతుడు నేను పరలోకంలో  ప్రార్థిస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న సీలువను ముద్దుపెట్టుకొని వారి వైపు చూసి కళ్ళు మూసుకొని నా ఆత్మను నీ చేతులలో అప్పగిస్తున్నాను అని కళ్లుమూసుకున్నారు. దేవుడు ఆయనను డిసెంబర్ 14, 1591  శనివారం ఉదయం తీసుకున్నారు. అప్పుడు ఆయనకు 50 సంవత్సరాలు.  28 సంవత్సరాలు  కార్మెల్ సభలో జీవించారు.

పునీతుని దేహం కోసం గొడవలు

 

ఉదయాన్నే పునీతుని దేహాన్ని దేవాలయంలోనికి  సమాధి చేయడానికి తీసుకొని వచ్చారు. అక్కడి ప్రజల, గురువులు, సన్యాసులు   అందరూ దేవాలయానికి పునీతుని చివరి సారిగా చూడటానికి వచ్చారు. తరువాత తొమ్మిది నెలలకు సమాధి తెరవగానే పునీతుని దేహం  పాడు కాకుండా అలానే ఉంది. పెనసొల కు చెందిన అన్నమ్మ గారు , ఆమె సోదరుడు లూయిస్ గార్లు వికార్ జెనెరల్  గారు ఫా. నికోలస్ గారి దగ్గర నుండి దేహాన్ని ఉబెద నుండి సేగోవియా తీసుకుపోవడానికి అనుమతిని తీసుకున్నారు. కాని అది సాధ్యం పడలేదు, ఎందుకంటే వారి అనుమతి  కేవలం మిగిలిన ఎముకలను మాత్రమే తీసుకుపోవడానికి, కాని పునీతుని దేహం చెక్కు చెదరలేదు. కనుక  మరల దేహాన్ని ఆక్కడ తిరిగి పెట్టడానికి ముందు అక్కడ మఠ పెద్ద అన్నమ్మ గారికి ఇవ్వడానికి ఒక ఏలు తీసుకున్నారు.  మరల తొమ్మిది నెలలు తరువాత ఉబెద నుండి పునీతుని ఎముకలను తీసుకుపోవడానికి వచ్చారు. కానీ  వారు అంతకుముందు స్థితిలో అయితే చూశారో మరలా అదే విధంగా   దేహం ఉంది. వారు దేహాన్ని  అక్కడ నుండి తీసుకొని వెళ్లారు. అప్పుడు మర్తోస్ వద్ద వారిని అక్కడ ప్రజలు అడ్డగించారు. వారు మాద్రిద్ వచ్చిన తరువాత, అక్కడ కార్మెల్ సన్యాసినుల వద్ద భద్రంగా ఉంచారు. అక్కడ అన్నమ్మ ఒక మోచేతిని ఆయన గుర్తుగా తీసుకున్నారు.  దానిని సేగోవియా కు తీసుకెళ్లారు. పునీతుని దేహాన్ని మాద్రిద్  లో సభ సన్యాసినులు ఎంతో గౌరవముగా చూసారు.  సేగోవియా లో గురువులు పునీతుని దేహాన్ని ఎంతో గౌరవంగా స్వీకరించారు. చాలా మంది ప్రజలు 8 రోజులు పునీతుని దేహాన్ని చూడటానికి వచ్చారు.  పునీతుని  దేహాన్ని ఉబెద నుండి దొంగిలించారు అని తెలుసుకున్న ఉబెద వాసులు చాలా బాధపడి రోము నగరానికి వారి ప్రతినిధులను పంపి పోపు గారి నుండి మరల పునీతుని దేహాన్ని ఇప్పించాలి అని పంపారు.   8 క్లేమెంట్ పోపుగారు , ఉబెద బిషప్  మరియు సేగోవియా  బిషప్   ,  సభ పెద్దలు కలిసి   రెండు నగరాల్లో   శతృత్వం లేకుండా ఉబెదకు  పునీతుని కాళ్ళు, చేతులు, సేగోవియకు  తల మొండెం ఇవ్వడం జరిగింది. అన్నమ్మ ఒక మోచేయిని గుర్తుగా తీసుకుంది. పునీత సిలువ యోహను గారిని గౌరవించడానికి కారణం, ఆయన ద్వార అనేక  అధ్బుతాలు జరగడం. సిలువ యోహను గారు 1674 లో ధన్య జీవిగా ప్రకటించబడ్డారు. 13   బెనెడిక్ట్  పాపు గారు పునీతునిగా , డిసెంబర్ 27  ,1726 లో  ప్రకటించారు. 1926  లో  తీరుసభ పండితునిగా ప్రకటించారు.

 

 

 Rev.Fr. Amruth OCD

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...