15, జూన్ 2022, బుధవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి 6:7-15 (జూన్ 16,2022)

సువిశేషం: అన్యులవలె అనేక వ్యర్ధపదములతో మీరు ప్రార్ధింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఏరిగియున్నాడు. మీరిట్లు ప్రార్ధింపుడు:  పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక! నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను  మీరు క్షమించిన యెడల, పరలోక మందలి, మీ తండ్రి , మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. 

ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు  శిష్యులకు ఎలా ప్రార్దన చేయాలి అని నేర్పిస్తున్నారు .  అన్యుల వలె వ్యర్ధ పదములతో మీరు ప్రార్ధింప వలదు అని వారికి చెపుతున్నారు. ఎందుకు వీరు అనేక పెద్ద పెద్ద మాటలతో , గొప్ప వర్ణలతో దేవుడుని ప్రార్ధిస్తారు అంటే దేవునికి ముఖ స్తుతి ఇష్టం అని వీరు భావిస్తారు, అందుకే చాలా అందమైన పదాలను వాడటానికి ఇష్టపడుతారు. నిజానికి దేవునికి ఇటువంటివి ఇష్టం వుండదు.  దేవుడు మన వేడుకోలును అలకించాలి అంటే మనకు కావలసినది భాష ప్రావీణ్యత కాదు. పొగుడుటలో పట్టాలు కాదు. ఈ లోకం యొక్క మెప్పును పొందాలి అనుకునేవారు, దేవుని గురించి సరిగా అర్ధం చేసుకొనివారు చేసే విధంగా కాకుండా తన శిష్యులు ఏ విధంగా దేవున్ని ప్రార్ధించాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. 

మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునపే మీ తండ్రి ఏరిగియున్నాడు . దేవునికి మనం అవసరములు అన్నీ కూడా తెలుసు. మనం కష్ట సుఖాలు అన్నీ ఆయనకు ఎరుకయే. దేవుని మన అవసరములు తెలియదు అన్నట్లు మనం ప్రవర్తిస్తుంటాం. ఏలియా ప్రవక్త,   బాలు ప్రవక్తలతో గొడవ పడినప్పుడు ఆ ప్రవక్తలను ఈ విధముగానే హేళన చేసింది. మీ దేవర నిద్ర పోతున్నదేమో ఇంకా పెద్దగా అరవండి అని అంటున్నారు. దేవుడు మనకు ఉన్న సమస్యలను  ఇతర దేవరల వలె చూడలేని వాడు కాదు. మనం ఎప్పుడు ఆయన కనుసన్నలలోనే ఉంటాము. దేవునికి నీ అవసరం తెలుసు అదే విధముగా నీ కోరిక తెలుసు. నిన్ను ఎంత పరీక్షించాలో తెలుసు. 

"మీరిట్లు ప్రార్ధింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక!"  ఇక్కడ యేసు ప్రభువు మనకు దేవుడు తండ్రి అని చెబుతున్నారు. ఆయనతో మనం మాటలాడటానికి చాలా ఆనంద పడాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడో మనకు దూరంగా ఉండాలి అనుకునే వ్యక్తి కాదు. ఆయన ఎల్లప్పుడు మనతో ఉండాలి అనుకుంటారు. ఆయన పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చిత్తం ఎల్లప్పుడు అక్కడ నెరవేర్చబడుతుంది.

 ఎక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో అక్కడ దేవుడు ఉంటారు. ఎప్పుడైతే భూలోకంలో కూడా దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చ బడుతుందో అప్పుడు భూలోకం కూడా పరలోకంలానె ఉంటుంది. మనం ప్రార్ధించాలనది దేవుని నామమును ఎల్లప్పుడు పవిత్ర పరచ బడాలి అని. దేవుని అందరు కీర్తించాలి అని. దేవుని నామమును అపవిత్రం చేయడం అంటే దేవున్ని కాకుండా దేవునిచే సృష్టిని దేవునిగా ఆరాధించడం. దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్దన చేయాలి అని ప్రభువు చెబుతున్నారు. 

ఏమిటి ఈ దేవుని రాజ్యం. ఎటువంటి అసమానతలు లేని రాజ్యం, అందరు సోదర భావంతో మెలిగే రాజ్యం. ఒకరికోకరు ప్రేమ కలిగి జీవించే రాజ్యం. ప్రతి నిత్యం దైవ సాన్నిద్యం అనుభవించే రాజ్యం. ఇటువంటి రాజ్యం ఈ లోకంలో రావాలని ప్రార్ధించాలి. ఈ రాజ్యాన్ని స్థాపించాలని యేసు ప్రభువు కృషి చేశారు. అందుకే దేవుని రాజ్యం  సమీపించినది అని ప్రభువు చెప్పినది. ఇటువంటి రాజ్యం అంటే దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించ బడాలి అప్పుడు నీకోరికలు అవసరాలు అన్నీ, ఏది కూడా కష్టమైనది కాదు. ఇది మొత్తం సాధ్యం ఎప్పుడైతే దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుందో అప్పుడు. దానికోసం మనం ప్రార్దన చేయాలి. 

"నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము." దైవ రాజ్యం, ఆయన చిత్తం గురించి ప్రార్ధించిన తరువాత నేటికీ కావాలసిన ఆహారం కోసం ప్రార్దన చేయమంటున్నారు. మన భౌతిక అవసరముల కోసం ప్రార్దన చేసిన తరువాత ప్రభువు మనకు చెప్పేది సమాజంలో మన జీవించే తీరు గురించి. మనం ఏ విధముగా ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్నామో మన పట్ల కూడా అదేవిధముగా ప్రవర్తించమని దేవున్ని ఆడగమని ప్రభువు చెబుతున్నారు. నీవు ఇతరులను క్షమించకుండా , ఇతరులకు ప్రేమను పంచకుండా దేవుని నుండి వాటిని ఆశించవద్దు అని ప్రభువు చెబుతున్నారు.ఈలోకం మీద , లోకం వస్తువుల మీద మనకు అనేక శోదనలు వస్తుంటాయి. వాటిలోనికి పడిపోకుండా మనలను రక్షించమని ప్రార్ధించమని చెబుతున్నారు. అనేక మంది గొప్ప వారు ఈ లోక ఆశలకు లోనై దేవున్ని విడనాడి జీవించి ఆయన అనుగ్రహాలు కోల్పోయారు. 

ప్రార్ధన : ప్రభువా! పరలోక ప్రార్దన ద్వారా మేము ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకోకూడదో తెలియజేస్తున్నారు ప్రభువా. దేవా!మీ చిత్తమునే ఎల్లప్పుడు ఈ లోకంలో మేము కోరుకునే విధముగా మమ్ము దీవించండి. అనేక సార్లు మేము అన్యుల వలె అనేక వ్యర్ధ పదాలతో ప్రార్దన ఇతరుల కంట పడాలి అని, మేము బాగా ప్రార్ధన చేస్తాము అని అనిపించుకోవాలని ప్రార్దన చేసిన సమయాలు ఉన్నవి ప్రభువా, అటువంటి క్షణాలలో మమ్ములను క్షమించండి. వాక్యంలో చెప్పబడిన విధముగా మొదట దేవుని చిత్తమును వెదికే వారీగా మమ్ము దీవించండి.   మీ చిత్తమును నెరవేర్చిన తరువాత ప్రభువా, మేము మీ రాజ్యమునకు అర్హులము అవుతాము. మీ చిత్తములో క్షమాపణ ఉంది. మీ చిత్తమును నెరవేర్చువాడు. ఇతరులను క్షమిస్తాడు. ప్రేమిస్తాడు. మీ కరుణకు పాత్రుడు అవుతాడు. మమ్ములను మీ చిత్తము నెరవేర్చేవారిగా చేసి , మీ రాజ్యంలో చేర్చుకోనండి. ఆమెన్. 

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...