1, జులై 2022, శుక్రవారం

14 వ సామాన్య ఆదివారం (2)

 14 వ సామాన్య ఆదివారం 

యెషయా  66: 10-14, గలతి 6: 14-18, లూకా  10: 1-12, 17-20

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించుట గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా దైవ రాజ్య స్థాపన జరుగుతుంది, దేవుని యొక్క శాంతి నెలకొల్పబడుతుంది. 

దేవుడు సువార్త సేవకులను ఎన్నుకొన్నది ప్రజల యొక్క జీవితంలో దేవుని యొక్క శాంతిని నెలకొల్పుటకు, వారిని పరలోకం చేర్చుటకు, ప్రజల మీద దేవుని ఆశీర్వాదాలను క్రుమ్మరించుటకు, ప్రభువు సువార్త సేవకులను ఎన్నుకొన్నారు. 

దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే వారు సువార్తను అనగా మంచి వార్తను, సంతోష వార్తను, ప్రకటించేప్పుడు ఆనందంగానే ఉండాలి. మనందరం  జ్ఞానస్నానం పొందిన వారు సువార్త సేవకు అర్హులే. మన యొక్క మాటల ద్వారా, జీవితం ద్వారా ప్రభువును ప్రకటించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఒక సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. 

బాబిలోనియా బానిసత్వం నుండి యిస్రాయేలు ప్రజలు విముక్తులవుతారని, అధే  విధంగా వారు యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు శాంతితో , సంతోషముతో ఉంటారని తెలియజేశారు. యిస్రాయేలు ప్రజలు 50 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం 587-537 కాలంలో యెరుషలేముకు తిరిగి వచ్చారు. 

అప్పుడే బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన యిస్రాయేలు ప్రజలను దేవుడు పసికందుతో పోల్చుతున్నాడు. 

తిరిగి వచ్చిన ప్రజలు తమ సొంత ప్రాంతమును మరియు దేవుని నివాస నగరమైన యెరుషలేమును చూసి నిరుత్సహపడ్డారు. శిధిలమైన తమ దేశాన్ని అలాగే కూలిపోయిన తమ యొక్క దేవాలయంను చూసినవారు బాధపడ్డారు. అలాంటి ఒక బాధకరమైన స్థితిలో ఉన్న వారికి దేవుడు సంరక్షణను, ఆనందంను  కలుగజేస్తారని పలుకుచున్నారు. 

ఒక తల్లి -బిడ్డల యొక్క ఉదాహరణతో దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా మేలుగుతారని ప్రవక్త తెలుపుచున్నారు. ఈ ఉదాహరణలో యావే దేవుడును   యెరుషలేముతో పోల్చబడటం జరిగినది . చంటి బిడ్డను యిస్రాయేలుతో  పోల్చారు. 

11 వ వచనంలో యెరుషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు అని పలుకుచున్నారు. అనగా బిడ్డలైన యిస్రాయేలు ప్రజలందరు కూడా దేవుని ద్వారా పోషించబడతారు. దేవుడు వారికి బలమును ఒసాగుతారు. దేవుడు వారి యొక్క ఎదుగుదలకు కారణం అవుతారని తెలుపుచున్నారు. 

యిస్రాయేలు ప్రజలు పుష్కలమైన దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని ఆనందింతురు. అని తెలుపుచున్నారు. 

12 వ వచనంలో దేవుడు, తిరిగి వచ్చిన యిస్రాయేలీయుల యొక్క అభివృద్దికి తోడ్పడుతానని తెలుపుచున్నారు.  వారి యొక్క సంపదలు  పొంగి పొరలినట్లు, వారి యొక్క ఖ్యాతి పేరుగునట్లు  చేస్తానని ప్రభువు  నుడువుచున్నారు. 

యావే దేవుడు తన యొక్క  అమితమైన ప్రేమను, అనురాగంను  యిస్రాయేలు ప్రజలకు  అందజేస్తారు. 

యిస్రాయేలు ప్రజలను చంటి బిడ్డలవలె తన చేతులలోనికి తీసుకొని ముద్దాడతారు. తన ఒడిలో ఒళలాడించేదరు.  యావే దేవుడు యెరుషలేముపై తన శాంతిని ప్రవహింపజేస్తారు, ప్రజలను  ఆనందోత్సాహములతో నింపుతారు. 

ఒక తల్లి తన కుమారుని ఓదార్చిన విధంగా దేవుడు కూడా యిస్రాయేలు ప్రజలను ఓదార్చుతారు. దేవుడు వారిని అదరిస్తారు. ఆదుకుంటారు. ఏ సమయంలోనైనా దేవుడు వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారని తెలుపుచున్నారు. 

యావే దేవుడు మరియు యిస్రాయేలు ప్రజల బంధం చాలా గొప్పది. చాలా సన్నిహితమైనది ఎందుకంటే దేవుడు స్వయంగా వారిని తన బిడ్డలుగా చేసుకున్నారు. తన సంరక్షణను కల్పిస్తానన్నారు. వారిని పోషిస్తానన్నారు, అధేవిధంగా వారిని ఆదుకుంటానని మరియు వారికి సంతోషంను, శాంతిని కలుగజేస్తానని ప్రభువు తెలుపుచున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడి సేవకుడైన  యోషయా  ప్రవక్త తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా  నెరవేర్చారు. అంటే ప్రజలకు సందేశంను (యావే దేవుని సందేశం) అందజేయుట. ఒక ఎన్నుకొనబడిన ప్రవక్త చేయవలసిన పనిని యోషయా ప్రవక్త చేశారు. దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఉన్న తల్లి బిడ్డల బంధం గురించి తెలిపారు. 

ఈనాటి రెండవ పఠనంలో  పౌలు గారు  గలతీయులకు రాసిన చివరి మాటల గురించి చదువుకుంటున్నాం. 

పౌలు గారు దేవుని చేత తన యొక్క సువార్త -సేవకై ఎన్నుకొనబడిన తరువాత ఆయన సేవలో ఉన్న సిలువ పరమార్ధం గ్రహించి తాను సిలువ యందే ఆనందిస్తున్నా,  అని అన్నారు. 

యేసు ప్రభువు సిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని జయించారు, ఈ లోక వ్యామోహలన్నింటిని త్యజించి మనకు రక్షణము ప్రసాదించారు. 

ఆయన సిలువను మోసి తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. మనయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమవలనే క్రీస్తు ప్రభువు సిలువ మీద మరణం పొందారు. 

-సిలువలో రక్షణ ఉందని 

-సిలువలో ప్రేమ ఉందని 

-సిలువలో విజయం ఉందని 

-సిలువలో స్వస్థత ఉందని తెలుసుకున్న పౌలుగారే  సిలువ యందు నేను గొప్పలు చెప్పుకొనుచున్నాను అని పలికారు. 

పౌలుగారు గలతీయుల ప్రాంతం విడిచిపెట్టి  వచ్చినప్పుడు కొంతమంది యూదయ  క్రైస్తవులు యెరుషలేము నుండి గలతీయ ప్రాంతంకు వచ్చి అందరు యేసు ప్రభువు వలె సున్నతి పొందాలి అనే ఒక ఆసత్య ప్రచారం లేక బోధన చేశారు.  ఎందుకంటే యేసు ప్రభువు కూడా సున్నతి పొందారు కాబట్టి మీరు కూడా సున్నతి పొందాలని ప్రకటించారు. దానికి సమాధానంగా వారి యొక్క అసత్య బోధనలను ఖండిస్తూ  పౌలుగారు, యేసు క్రీస్తును విశ్వసించి ఆయన యందు జ్ఞాన స్నానం పొందిన  ప్రతి ఒక్క వ్యక్తి  నూతన సృష్టియే అని తెలిపారు. 

ఒక విధంగా విశ్వాస పరంగా సందిగ్ధతలో ఉన్న గలతీయులకు పౌలు చక్కని భోదన చేశారు. యేసు క్రీస్తునందు జ్ఞాన స్నానం పొందేవారు, దేవుని యొక్క పవిత్రాత్మను పొంది నూతన సృష్టిగా రూపాంతరం చెందుతున్నారని, దేవుని బిడ్డలుగా తయారవుచున్నారని పౌలుగారు తెలిపారు. 

దేవునికి చెందిన వారిగా ఉండాలంటే కేవలం సున్నతి కాదు అవసరం. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం అని పౌలుగారు తెలిపారు, అందుకే నేను సిలువ యందు గొప్పలు చెప్పుకుంటున్నాను అని అన్నారు.  పౌలుగారు పరిసయ్యుల వంశమునకు చెందిన వ్యక్తియైన సున్నతి కలిగిన వ్యక్తి అయినప్పటికి  జ్ఞాన స్నాన విలువను తెలుసుకొని విశ్వాస పాత్రుడిగా జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన యొక్క సువార్త సేవకు శిష్యులను పంపించే  విధానం చదువుకుంటున్నాం. 

సువార్త సేవకు  పంపించే ముందు యేసు ప్రభువు శిష్యులకు  కోన్ని సూచనలు వారు చేయబోయే పరిచర్య గురించి ఇస్తున్నారు. 

ఈ సువిశేష భాగంలో మొదటిసారిగా యేసు ప్రభువు 72 మందిని సువార్త పరిచర్యకు నియమించి, వారిని ఇద్దరిద్దరిని చొప్పున, తనకు ముందుగా పంపారని సువార్తికుడు తెలియజేశారు. మత్తయి, మార్కు, సువార్తికులు కేవలం 12 మంది శిష్యుల యొక్క పరిచర్యను గురించి తెలిపితే, లూకా గారు మాత్రము 12 మంది శిష్యులతో పాటు 72 మంది శిష్యుల  పరిచర్యను కూడా వివరిస్తున్నారు. 

70 అనే సంఖ్య యిస్రాయేలు ప్రజల జీవితంలో గుర్తుండిపోయే సంఖ్య ఎందుకంటే , యకొబు యిస్రాయేలు నుండి ఐగుప్తుకు క్రొత్త జీవితం జీవించడానికి వెళ్లేటప్పుడు 70 మందిని తన వంశస్తులను తీసుకొని వెళ్లారు. వారితో ఒక నూతన రాజ్యం స్థాపించుటకు యాకోబుగారు వెళ్లారు. ఆది 46. 

నోవా కాలంలో కూడా 70 దేశములు /రాజ్యముల గురించి తెలుప బడింది. ఆది 10 వ ఆధ్యాయం. మోషే ప్రవక్త దేవుని ప్రజలను నడిపించుటకు 70 మందిని ఎన్నుకుంటున్నారు. వారు దేవుని మహిమను చూస్తున్నారు. నిర్గమ 24:1,9. 

70 మంది యిస్రాయేలు యొక్క నాయకులు /పెద్దలు . సంఖ్యా 11:16 

ఏలీము వద్ద 70 ఖర్జూరపు వృక్షములు వున్నాయి. నిర్గమ 15:17. 

యూదుల యొక్క sanhedrin సభయమండలి 70 మందితో కూడినది. వారే నడిపించేవారు, నిర్ణయాలు తీసుకునేవారు. 

యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే అప్పట్లో  కేవలం 70   దేశాలు మాత్రమే ఉన్నాయి అన్నది. 

యేసు ప్రభువుకు అనేక మంది శిష్యులున్నప్పటికి కేవలం ఈ 70/72 మంది మాత్రమే ప్రభువును చాలా దగ్గరగా అనుసరించారు. 

ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు ఎందుకంటే, ఇద్దరి సాక్ష్యం ఒక విషయం ఆమోదించుటనికి సహాయ పడుతుంది. ద్వితీయో 19:15, మత్తయి 18:16 , ద్వితీయో 17:6 

అధే విధంగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం సహకరించుకొనుటకు, పరస్పరంప్రోత్సాహించుటకును, తోడుగా ఉండుటకు దేవుడు వారిని ఇద్దరిద్దరి చొప్పున పంపిస్తున్నారు. 

ప్రభువు వారిని పంపించింది ఎందుకంటే తన కొరకు మార్గమును సిద్ధం చేయుటకు, తన రాజ్య స్థాపన కొరకు అదే విధంగా దైవ ప్రేమను అందచేసి ప్రజల యొక్క హృదయంలో  శాంతిని నెలకొల్పుటకు  ప్రభువు  వారిని పంపిస్తున్నారు. 

మనల్ని కూడా దేవుడు సువార్త పరిచర్యకు జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొంటున్నారు. 

ప్రభువు సేవ చేయుట కొరకు పని వారి కోసం ప్రార్ధించమని పలుకుచున్నారు. పంట విస్తారము కాని పనివారు లేరు కాబట్టి పని వారి కోసం ప్రార్ధించమని ప్రభువు పలికారు. విశ్వాసుల సంఖ్య అధికమే కాని సువార్త సేవ చేసే వారి సంఖ్యయే  తక్కువ కాబట్టి వారి కొరకు ప్రార్ధించమని ప్రభువు అంటున్నారు. 

ఈ 72 మంది యొక్క పని మానవుల ప్రణాళికా కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడే వారి ద్వారా పని చేస్తారు. 

ప్రభువు శిష్యులను పంపించె ముందు వారికి గొప్ప గొప్ప వాగ్ధానాలు చేయలేదు వారి జీవితంలో కష్టాలు ఉంటాయని తెలిపారు అందుకే ప్రభువు నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలవలె  పంపిస్తున్నారు అని పలికారు. లూకా 10:3. 

వాస్తవానికి తోడేళ్లకు గొర్రె పిల్లలకు  ఎటువంటి బంధం లేదు. తోడేళ్ళు గొర్రెలను చంపుకొని తింటాయి, హింసిస్తాయి, గాయ పరుస్తాయి. అధే విధంగా తోడేళ్ల మనస్తత్వం కలిగిన వ్యక్తులు కూడా వుంటారని  ప్రభువు తెలిపారు. అంగీకారం  మరియు తిరస్కారం అన్నీ చోట్ల  ఉంటాయి అని ప్రభువు తెలిపారు. 

సువార్తకు పంపబడిన వారు  కూడా గొర్రె పిల్ల మనస్సు కలిగిఉండాలి. వినమ్రత, హాని చేయకుండుట,  యుద్దం చేయకుండుట (non - combative) లక్షణాలు కలిగి జీవించాలి. అపో 20:28-31 , యోహను 15:20 , యోహను 16:1-4, పిలిప్పీ 1:29, 2 తిమోతి  3:12. 

దేవుని కొరకు ఎన్ని కష్టాలు   అయినా అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి దైవ సేవకులు. 

సువార్త సేవకు బయలు -దేరేటప్పుడు వారితో ఏమి తీసుకొని  పోరాదని ప్రభువు తెలుపుచున్నారు. ఎందుకంటే వారు సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడి జీవించాలి. వారి అనుదిన జీవితంకు సైతం అవసరమైన వస్తువులను  సైతం ప్రభువు పరిత్యజించమని కోరుచున్నారు. దేవుడే వారికి అన్నియు సమకూర్చుతారు. వారి యొక్క ఆలోచనలు ధనం గురించి , అధికారం గురించి మిగతా ఈ లోక విషయాలు గురించి ఉన్నట్లయితే వారు ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశ్యమును మరచి పోతారని ప్రభువు వారిని ఏమి తీసుకొని పోరాదని పలికారు. మొదటిగా దేవుని రాజ్యం వేదకితే అన్నీ ప్రభువే సమకూర్చుతారు. మత్తయి 6:33 . పిలిప్పీ 4:11-13, కీర్తన 37:3,5. సామెతలు 3:5 . 

దేవుని సేవకులు,  ప్రభువు యొక్క శాంతిని ప్రకటించాలి ఆహ్వానించే వారు ఉన్నట్లయితే వారి యొక్క ముఖ్య ఆహ్వానం మన్నించి, ప్రభువు యొక్క రాజ్యం గురించి ప్రకటించమన్నారు. ఆహ్వానించే వారు లేకపోతే పాద దూలిని వదలి అక్కడ నుండి వెళ్ళమని ప్రభువు పలుకు చున్నారు . 

దేవుని చేత పంపబడిన వారు ఆయన యొక్క రాజ్యం గురించి ప్రకటించాలి. అదియే వారి యొక్క ప్రధమ  బాధ్యత. వారి యొక్క పరిచర్య సేవ జీవితంలో ఎల్లప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. 

-దేవుని నుండి అంతా ప్రారంభించాలి 

- దేవుని మీద ఆధారపడి జీవించాలి 

-దేవునికొరకు హింసలు అనుభవించుటకు సిద్దంగా ఉండాలి. 

-దేవుడే వారి జీవితంకు కేంద్రం  కాబట్టి ఆయన కొరకు సమస్తము త్యజించాలి. 

-దైవ ప్రేమను పంచాలి, నిస్వార్ధ సేవ చేయాలి

- రోగులను స్వస్త పరచాలి , దేవుని శాంతిని ప్రకటించాలి. 

-దేవుని  ఉద్దేశం నెరవేర్చుట మరచి పోరాదు 

మనందరం కూడా  దేవుని కొరకు జీవించి దేవుని రాజ్య స్థాపన కోసం కృషి చేద్దాం, దేవుని సాక్షులై జీవించుదాం. 

Rev. Fr. Bala Yesu OCD

సామాన్య 14వ ఆదివారం

సామాన్య    14వ ఆదివారం

యెషయా  66: 10-14
గలతి 6: 14-18
లూకా  10: 1-12, 17-20

ప్రచారకులను పంపుట - సువార్త వ్యాప్తి - దైవ రాజ్య స్థాపన


ఈనాడు తల్లి తిరుసభ 14వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నది. ఈనాటి పఠనాలను మూడు అంశాల రూపేనా అర్ధం చేసుకుందాం. 
1  ప్రచారకులను పంపుట
2  సువార్త వ్యాప్తి
3 దైవ రాజ్య స్థాపన  
వీటిని విపులంగా ధ్యానిద్దాం.

1.  ప్రచారకులను పంపుట

ఈనాటి సువార్త పఠనంలో డెబ్బది ఇద్దరు శిష్యులను ప్రభువు పంపుచున్నారు (లూకా 10 : 19 ). “70”  సంఖ్య  పవిత్రగ్రంథంలో చిహ్నాపూర్వకమైన సంఖ్య . పూర్వ నిబన్ధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలను యెడారికి నడిపించుకుని రావడంలో నాయకత్వం వహిస్తూ ఆ బాధ్యతా భారంతో అలసిసొలసి పోయినప్పుడు యావే ప్రభువు మోషే సహాయకులుగా డెబ్బది మందిని నియమిస్తారు (సంఖ్యా 11 : 16 - 17 ). ఇంకా పవిత్రగ్రంథంలో  ఎన్నో  చోట్ల  డెబ్భై  సంఖ్య  యొక్క  ప్రాముఖ్యతను చూస్తున్నాం. 

ఈరోజు కూడా ప్రభువు డెబ్బది రెండు  మందిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణకునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను (లూకా 10 : 1 ). ఇద్దిరిద్దరిని పంపేది కేవలం ఒకరికి ఒకరు సహాయంగా ఉండడానికి మాత్రమే కాక ఇద్దరి సాక్షానికి చట్టరీత్య ఎంతో విలువ ఉంటుందని కూడా పంపుచున్నారు. ఇంకా ప్రభువు వారితో పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్ధింపుడు అనెను (లూకా 1 : 2 ). అంటే ప్రార్ధన ద్వారా దేవునితో కొనసాగింపు అనుబంధాన్ని మరియు నిర్మిత అవినాభావ సంబంధాన్ని  కలిగి యుండి, పరిచర్యలో వచ్చే కొరతలు ప్రభువుకు తెలియజేసి, ఆ కొరత తీరుటలో మధ్యవర్తిత్వాన్ని వర్తిస్తు, వారి ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలని అర్ధము. వీరు తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె పంపబడుచున్నారు.

ఎందుకు ? ఎందుకంటే వీరు సువార్త పరిచర్య  స్వీకరించేటటువంటి  ప్రజలు మరియు వీరు తిరిగేటటువంటి ప్రదేశాలు వీరికి పూర్తిగా అనుకూలంగా మద్దతుగా ఉండకపోవచ్చు.  ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి.  ఎన్నో ఇబ్బందులను అధిగమించాలి. ఎన్నో సమస్యలతో పోరాడాలి.  వీటన్నిటిలో గొర్రెపిల్లవలె ఉండి తోడేళ్లపై విజయాన్ని సాధించాలి. 

ఆ తరుణంలో వీరు పరిపూర్ణ పరిత్యాగాన్ని, పేదరికాన్ని పాటిస్తూ ప్రజల ధాతృత్వంపైన ఆధారపడివుండాలి. జాలెనైనను, జోలెనైనను, పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున ఎవరిని కుశల ప్రశ్నలు అడగరాదు (10 : 14 ) అని ప్రభువు సెలవిస్తున్నారు.  వారికి అప్పగించిన భాధ్యతపై వారి మనసులను కేంద్రికరించి హృదయాలను లగ్నము చేసి శ్రద్ధ వహించి ఈ బాధ్యత నెరవేర్పునకు కృషి చేస్తూ  ముందుకు సాగాలి.  

2.  సువార్త వ్యాప్తి

ఈ డెబ్బది ఇద్దరు పంపబడటానికి ముఖ్య కారణం: సువార్త వ్యాప్తి. సువార్త అనేది స్థంబించినటువంటి ఒక వస్తువుగా ఉండకూడదు. సువార్త అన్ని వేళల అన్ని ప్రదేశాలలో అందరికి వ్యాపించబడాలి. సువార్త వ్యాపించబడాలి అంటే నువ్వు నేను సువార్త సైనికులుగా మారాలి . సువార్త వ్యాపింపచేయాలి అనే తపన కలిగిన వారందరు ఈనాటి రెండవ పఠనంలో (గలతి 6 : 14 - 18 ) చూస్తున్న విధంగా పౌలు గారితో కలిసి “నేను మరి ఇతరములైన దేనియందుగాక మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును.  ఏలయన ఆయన సిలువ మూలముననే నాకు ఈలోకము, నేను ఈలోకమునకు సిలువ వేయబడితిమి” అని చెప్పగలగాలి. ప్రభువే స్వయంగా చెప్తున్నారు "నన్ను అనుసరింపగోరు వాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను" (మత్తయి 16 : 24 ).

పునీతులు కూడా చెప్తుంటారు శిలువే మా  సంపద అని. అవును ఎప్పుడైతే సిలువ మన సంపద అవుతుందో సిలువ వేయబడిన క్రీస్తు మన సర్వసం అవుతారు. అప్పుడు సువార్త వ్యాప్తిలో ఎదురయ్యే ప్రతి సవాలును, ప్రతి కష్టాన్ని నష్టాన్ని , ప్రతి అడ్డంకిని, ఇబ్బందిని తణుకు బెణుకు లేకుండా ఎంతో ధైర్యంతో ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగగలుగుతాము  . మన బోధనలో క్రీస్తుప్రభుని భాధలు, సిలువ మరణము, పునరుత్తనము, మహిమ ప్రధాన అంశాలు కావలి. మన జీవితాలనుండి సిలువను వేరుచేయలేమను సత్యాన్ని ప్రతిక్షణం గ్రహించాలి మరియు   మన జీవితంలో జీవించాలి.  

క్రీస్తుప్రభుని జీవితంలో మరణం తధ్యం, ఆ మరణం కూడా సిలువ మరణమే. క్రైస్తవులుగా క్రీస్తువలె సిలువను హత్తుకొని జీవించాలి. పేతురుగారివలె క్రీస్తు కావలి, సిలువ వద్దు అనే భావంతో ఉండవచ్చు కానీ  తరువాత పేతురుగారికి అర్ధమైంది సిలువలేకుండా క్రీస్తు లేరు అని.

   పేతురుగారు నేను బోధించేది మీరు సిలువ వేసిన క్రీస్తును అని ధైర్యంతో భోధించగలిగారు. పునీత పౌలు గారు పలుకుతున్నవిధంగా ఎవరైతే క్రీస్తునందు, క్రీస్తుమరణంలో మరణిస్తారో వారు క్రీస్తుతో పాటు పునరుత్తానమౌతారు (రోమా  6 : 4 ).  అతడు నూతన సృష్టి ( గలతి 6 : 15 ). తమ తమ జీవితములలో సిలువ సూత్రమును పాటించువారికి సమాధానము, కనికరము తోడుగా ఉంటుంది (గలతి 6 : 16 ). సువార్త వ్యాప్తికై ఎంతగానో ప్రయాణించి శ్రమించిన పౌలుగారు సైతము యేసుక్రీస్తు సిలువనందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును (గలతి 6 : 14 ) అని నొక్కి వక్కాణించుచున్నారు. సువార్త వ్యాప్తికై శ్రమిస్తున్న ప్రతి ఒక్కరినోట ఇదే మంత్రంగా మారాలి. ఇదే వారి చెవులలో మారు మ్రోగాలి. తద్వారా శిలువే మన సంపద కావలి. 

 దైవ రాజ్య స్థాపన 

పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 14 : 18లో దైవరాజ్యము అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. "దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సమాధానములే". దైవరాజ్య స్థాపన అంటే దేవుడు మనకు అనుగ్రహించిన నీతి, సంతోషములను మరి ముఖ్యంగా శాంతిని ఇతరులతో  పంచుకొని, ఈలోకమును ఒక పరలోకముగా మార్చడమే. ఈనాటి మొదటి పఠనములో (యెషయా 66 : 10 - 14 ) యావే ప్రభువు యెరూషలేము ప్రజలకు ఒక శుభసందేశాన్ని ఇస్తున్నారు "మీరు యెరూషలేముతో కలిసి ఆనందించి సంతసింపుడు....... మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు పాలిండ్లనుండి స్తన్యము గ్రోలి  సంతృప్తి చెందుదురు". యావే ప్రభువు మరల తన నివాసాన్ని ప్రజల మధ్య అనగా దేవాలయంలో ఏర్పరచుకున్నప్పుడు ఆ  పట్టణము ఆయన శాంతితో నిండిపోతుంది. ఆ ప్రజల మధ్య దేవుని శాంతి సంపదలు ఒక నది వలె ప్రవహిస్తాయి. ప్రజలు దేవుని అనుగ్రహముతో దీవెనలతో హాయిగా కాలం గడుపుతూ అభివృద్ధి చెందుతారు. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం యేసు ఈ లోకంలో శాంతి నెలకొల్పడానికి వచ్చారు. అందుకే సువార్త పఠనంలో ప్రభువు తన శిష్యులను శాంతిని అందించడానికి పంపుతున్నారు. "మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలుకుడు" ( లూకా 10 : 5 ). 

సమాధానమును  దేవుడు ఒక్కడే  ఇవ్వగలడు. ఇది దేవుని అనుగ్రహవరం. ఈలోక మానవులు ఇవ్వగలిగే శాంతి సమాధానములు క్షణికమే. దేవుడు అనుగ్రహించే శాంతి శాశ్వతం. ఈ శాంతిని పొందాలంటే దానిని స్వీకరించాలి. దానిని స్వీకరించాలంటే దేవుడు పంపిన వారిని ఆహ్వానించాలి. వారిని ఆహ్వానించడం అంటే స్వయంగా దేవుని ఆహ్వానించడమే. అప్పుడు దేవుడే స్వయంగా సమాధానమును మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ మనం దేవుడు పంపిన వారిని ఆహ్వానింపనియెడల దేవుని తిరస్కరించినట్లే. అందుకే ప్రభువు తన శిష్యులతో "మీరు ప్రవేశించిన పట్టణప్రజలు మిమ్ము ఆహ్వానింపనియెడల ఆ పట్టన వీధులలోకి వెళ్లి మీ కాళ్లకు అంటిన దుమ్మును వారికి విరుద్ధంగా అచ్చటనే దులిపివేయుడు. ఇంకా వారికి దేవుని రాజ్యము సమీపించినదని గ్రహించమని గుర్తుచేయుడు అని చెప్పెను" ( లూకా 10 : 10 - 12 ).  

దేవుడు పంపిన వారిని ఆహ్వానింపకపోవడం తేటతెల్లముగా దేవుని పరిత్యజించడం మరియు దేవుని తీర్పును సూచిస్తుంది.  ఈ డెబ్బది ఇద్దరు ప్రభువు వారికి అప్పగించిన పనిని పూర్తిచేసిన తర్వాత వారి అసాధారణ శక్తులను, అనుగ్రహాలను దేవుని సువార్త సైనికులుగా ఉండి వాటిని ఉపయోగించమని క్రీస్తు వారికి అధికారాన్ని ఇస్తున్నారు. 

 దేవుని రాజ్యాన్ని  నా అనుదిన ఆలోచనలు, మాటలు మరియు కార్యాలద్వారా స్థాపిస్తున్నానా? అని  నువ్వు  నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి.  దేవుని రాజ్యస్థాపన కేవలం గురువుల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. ఆ రాజ్య స్థాపనకు చిహ్నం శాంతి. మన వ్యక్తిగత కుటుంబ మరియు సంఘ జీవితంలో దేవుని శాంతిని అనుభవించ గలుగుతున్నామా? శాంతి అనేది మన నిజ జీవితంలో ఒక పరిస్థితి. ఎవరు సృజిస్తారు ఈ పరిస్థితిని అంటే మానవులమైన మనము. దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహించారు. కానీ ఆ శాంతిని మనలో నెలకొల్పుకొని జీవించడమే మానవులమైన మన బాధ్యత.  ఈ శాంతి అనే  పరిస్థితిని మన వ్యక్తిగత , కుటుంబ, మరియు సంఘ జీవితంలో సృజించుకుందాం. క్రీస్తు సైనికులుగా ఉండి సువార్తను వ్యాపింపచేద్దాం. దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. శాంతియుతంగా జీవించుదాం. ఆమెన్.

Br. Sunil Inturi OCD

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...