14, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 6:1-6,16-18 )

 మత్తయి 6:1-6,16-18 ( జూన్ 15, 2022)

సువిశేషం: మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్ధనా మందిరములలోను , విధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయ వలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది యున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునపుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తులవలే మీరు ప్రార్ధన చేయవలదు. ప్రార్ధనామందిరములలో, వీధులమలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్ధనలుచేయుట వారికి ప్రీతి. వారికి తగినఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్దన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్ధింపుము అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారులవలె విచారవదనములతో నుండకుడు, వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందు వలన అదృశ్యుడైయున్న నీ తండ్రియేకాని, మరెవ్వరునునీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగ ఒసగును. 

దేవునిచేత ఎలా ప్రశంసించబడాలి? 

"మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు." యేసు ప్రభువు తన శిష్యులకు వారు ఏ విధముగా భక్తి కలిగి ఉండాలి అని చెబుతున్నారు. మన భక్తి దేవునికి మనకు మధ్య వ్యక్తిగతమైనదిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. మన భక్తి ఇతరులకు చూపించడానికి కాదు అనే విషయం తెలియ పరుస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువు ఈ మాటలను చెబుతున్నారు అంటే పరిసయ్యులు , ధర్మ శాస్త్ర బోధకులు వారి భక్తి క్రియలన్నీ ఇతరులకు కనబడే విధముగానే చేసేటువంటి వారు. అందరు వారి భక్తికి వారిని గౌరవంగా చూసేవారు మరియు ప్రశంసించేవారు. ఎప్పుడైతే వీరిని అందరు గొప్పగా పొగుడుతున్నారో, ఆ పొగడ్తలకు మురిసిపోయి వాటి కోసమే వారి భక్తిని బయట చూపించేవారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే వారి జీవితాలు కపటత్వంతో నిండిపోయేంతగా వెళ్ళింది. ఇతరులు చూడకుండ వీరు ఏమి చేయడానికి ఇష్టపడలేనంతగా వీరి జీవితాలు ఉన్నాయి. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే వారు బయట నుండి ఒక వస్తువు తీసుకొని వచ్చినప్పుడు దానిని  బయట శుభ్రంగా కడిగితే సరిపోతుంది, లోపల అవసరం లేదు అని చెప్పేంతగా వీరు జీవిస్తున్నారు. 

కొన్ని సంవత్సరాల క్రిందట చదివిన ఒక చిన్న కధ గుర్తుకు వస్తుంది. ఒక ఊరిలో ఒక పెద్ద పేరు మోసిన ఒక లాయరు గారు ఉన్నారు. ఆయన అనేక కేసులలో పేదలవైపున వాదించి పేదలకు సాయం చేసేవారు. ఆ విధంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందరు ఆయనను పొగిడేవారు. గొప్పవాడు అని అందరు ఆయనను కీర్తించే వారు. పేదల పెన్నిది అని చెప్పేవారు. ఈ లాయరు గారు,  ఈ పొగడ్తలకు బాగా అలవాటు పడి పోయాడు. రాను రాను ఏ మంచి పని చేయాలన్న ఎవరైన ఉన్నారా ? నేను చేసే మంచి పని చూడటానికి, అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఒక వేళ తాను చేసే మంచి పని చూడటానికి ఎవరు లేకపోతే, ఆ మంచి పని చేయడం మని వేశాడు. ఎందుకంటే తాను చేసే మంచి పని, కేవలం  కీర్తి , ప్రతిష్టలకోసం , తాను చేసే పని చూడటానికి ఎవరు లేనప్పుడు తాను ఆ పని చేసేవాడు కాదు. ఒక రోజు తాను కారులో ప్రయాణం అయి పోతుండగా అక్కడ  చెరువులో ఒక స్త్రీ నీటిలో మునిగి పోతూ , తనను రక్షించమని వేడుకుంటుంది.  ఆ దారిలో పోతున్న ఈ లాయరు గారికి ఆ అరుపులు వినపడుతాయి.  తాను ఆమెను రక్షించినట్లయితే దానిని చూడటానికి , చూసిన తరువాత దాని గురించి చెప్పి, తనను పొగడటానికి ఎవరైన ఉన్నారా?  అని ఆ లాయరు గారు చుట్టు ప్రక్కల చూసి,  ఎవరు లేరు అని గ్రహించి,  ఆమెను కాపాడకుండా వెళ్ళిపోతాడు. మనం చేసే ప్రతి పనిని ప్రభువు చూస్తూనే వుంటాడు. మనకు బహుమానము ఇచ్చేది ప్రభువే కాని మానవ మాత్రులు కారు. ఇతరులు కంట,  పడటానికే మనం మంచి పని చేస్తే అది స్వార్ధంతో చేసిన పని అవుతుంది. 

యేసు ప్రభువు మనం చేసే ప్రతి మంచి పని,  అది భక్తి తో కూడిన పని అయిన లేక ఉపకారంతో కూడిన పని అయిన ఇతరుల మెప్పు పొందుటకు చేయ వద్దు అని చెబుతున్నారు. మన ప్రభువు మనం చేసే అన్నీ పనులను చూస్తారు, ఇతరులు మెప్పు పొందుటకు మనం మంచి పనులు చేస్తే ఇతరులు మనలను మెచ్చుకుంటారు. మనం పొందవలసిన బహుమానం మనం పొందాము అని ప్రభువు చెబుతున్నారు. మనం బహుమానం పొందవలసినది తండ్రి దగ్గర నుండి. ఆయన మన పనులకు సరి అయిన బహుమానం ఇస్తారు. 

డాంభీకములు చెప్పుకోవడం లేక మేము గొప్ప అని అని పించుకోవడం అనేది మన అజ్ఞానం వలనే జరుగుతుంది. మనం చేసే ప్రతి మంచి పని దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం, దానిని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా ఆయన కృపనే. కనుక అందుకు మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. 

యేసు ప్రభువు మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఎటువంటి విచారాన్ని బయట పడనివ్వకుండ ఉండమని చెబుతున్నారు. ఎందుకంటే మన భక్తి క్రియలన్నీ చూసే ప్రభువు ఖచ్ఛితముగా మనకు కావలసిన అనుగ్రహాలు, ఇస్తారు అని చెబుతున్నారు. అంతే కాదు ప్రభువు మనకు ఈ అనుగ్రహాలు , బహుమానాలు బాహాటముగా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. అప్పుడు మన మంచి తనాన్ని దేవుడే అందరికి తెలియజేస్తారు. దేవునిచేత మనం గొప్ప వారిగా కీర్తించ బడేలా జీవించమని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవిత ప్రయాణంలో అనేక సార్లు ఇతరుల చేత పొగిడించుకోవాలని, మంచి వాడను అని పించుకోవాలని, ఎన్నో మంచి పనులు చేయలని లేకపోయినా చేశాను ప్రభువా. దాని ద్వార నేను మంచి వాడిని అని గొప్ప వాడిని అని పేరు పొందాను. కాని ఎవరు చూడని సమయాలలో అవకాశం ఉండికూడ మంచి చేయడానికి ముందుకు వెళ్లలేదు ప్రభువా. కేవలం నా మంచి పనిని చూడటానికి ఎవరు ఉండరు అనే ఒకే కారణంతో మంచి చేసే అవకాశం వదులుకున్నాను ప్రభువా. ఇటువంటి సంఘటనలు అనేకం నా జీవితంలో జరిగాయి.  ఆ సంఘటనలు అన్నింటిని ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను ప్రభువా. ఇటువంటి ఘటనల నుండి నన్ను క్షమించండి ప్రభువా. మరల ఇటువంటివి నా జీవితంలో జరుగకుండా నన్ను నడపండి. ఇక నుండి నేను చేసే ప్రతి పని ఇతరుల మెప్పు కోసం కాకుండా కేవలం మీ మీద గల ప్రేమ వలనే చేసే విధంగా నన్ను దీవించండి. ప్రభువా , ఇతరుల మెప్పు కాకుండా మీరు మెచ్చుకునే విధంగా జీవించే వానినిగా మార్చండి. ఆమెన్. 


పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...