21, మే 2022, శనివారం

పాస్క 6 వ ఆదివారం

పాస్క 6 వ ఆదివారం (2)

 అపో 15:1-2, 22-29, దర్శన 21:10-14, యోహను 14:23-29 

ఈనాటి  దివ్య పఠనాలు మరి ముఖ్యంగా మొదటి పఠనం సువిశేష పఠనం శాంతి గురించి బోధిస్తుంది. మనందరం ఐక్యంగా ఒకే ఆలోచనలో, అభిప్రాయంలో వుంటే అక్కడ ఎటువంటి  కలహాలు  వుండకుండా, శాంతి వుంటుంది, అని ఈ దివ్య పఠనాలు తెలియజేస్తున్నాయి. 

మానవ జీవితంలో అనేక సందర్భాలలో కష్టతరమైన, క్లిష్ట సమస్యలకు పరిష్కారం,  సమాధానం వెదికేటప్పుడు అభిప్రాయ భేధాలు రావచ్చు, సంఘర్షణలు రావచ్చు, వివాదాలు, విభేధాలు, మనస్పర్ధలు రావచ్చు. అలాంటి సందర్భాలలో మనం శాంతిని నెలకొల్పేందుకు ఒక మంచి మార్గాన్ని, అందరు మెచ్చే మార్గాన్ని ఎన్నుకోవాలి. 

ఈనాటి మొదటి పఠనంలో తొలి క్రైస్తవులకు ఎదురైన ఒక సమస్యను గురించి వింటున్నాం. 

అప్పుడే విశ్వాసం స్వీకరించిన ఆదిమ క్రైస్తవులకు రక్షణకు సంబంధించిన విభేదాలు వచ్చాయి. రక్షణ పొందాలంటే వాస్తవానికి ఒక వ్యక్తి ఏమి చేయాలి, అనే విషయం గురించి కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సున్నతికి సంభందించినది. 

శ్రీ సభ ప్రారంభమైన తొలి 20 సంవత్సరములు, క్రైస్తవులంటే ఎక్కువగా యూద మతం నుండి క్రైస్తవులుగా మారిన వారే. ఆ సమయంలో ఏ అన్యుడైన, క్రైస్తవునిగా మారాలంటే వారు మొదటిగా యూదులుగా మారాలి. యూదుల అన్నీ ఆచారాలు అనుసరించాలి. అందుకే రక్షణ పొందాలంటే సున్నతి అవసరం అని యూదయ నుండి వచ్చిన అన్యులు అన్నారు. క్రైస్తవులుగా మారాలని ఇష్టపడుచున్న  అన్యులు కూడా అన్నీ ఆచార విధులను పాటించాలని పట్టుబట్టారు. 

అంతియోకు సంఘంలో ఉన్న విశ్వాసులు, క్రీస్తు సంఘంలో సున్నతి లేకుండానే చేరారు. వారు విశ్వసించేదెమిటంటే జ్ఞాన స్నానం , విశ్వాసం ఉంటే చాలు ఎవరైన రక్షణ పొందవచ్చని. 

అప్పటి భేధాభిప్రాయం ఏమిటంటే అన్యులను క్రీస్తు సంఘంలో చేర్చుకునేందుకు వారు మొదటిగా యూదులుగా మారటం అవసరమా? లేదా? అనే భేదాభిప్రాయాలు వచ్చాయి. 

ఈ భేదాభిప్రాయం ఏలా వుందంటే రెండు జాతులు మధ్య భేదాభిప్రాయం, రెండు సంస్కృతులు మధ్య, రెండు రకాల ఆలోచనల మధ్య భేదాభిప్రాయం మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పౌలు, బర్నబా గార్లు ఎవరైన రక్షణ పొందాలంటే క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఆయన్ను అంగీకరిస్తే చాలు, రక్షణ పొందవచ్చు అని తెలిపారు. 

ఈలాంటి పెద్ద సమస్యను వారు ఏకాభిప్రాయం ద్వారా విశ్వాసుల మధ్య శాంతిని నెలకొల్పారు. పౌలు , బర్నబాలు ఈ సమస్యను అపోస్తులతో చర్చించి దీనిని సరి చేశారు. 

మన కుటుంబాలలో కూడా సమస్యలు భేధాభిప్రాయలు ఉంటే వాటిని కూర్చొని మాట్లాడితే, ఏక ఆలోచన , నిర్ణయం కలిగి ఉంటే సమాధానంతో ఉండవచ్చు. 

తొలి క్రైస్తవ సంఘం కూడా యెరుషలేములో  మొదటిగా సమావేశాన్ని ఏర్పరిచారు, పవిత్రాత్మ తో  నడిపింపబడి సరియైన నిర్ణయం తీసుకున్నారు. 

అపోస్తులు తాము తీసుకున్న నిర్ణయం తమ ఒక్కరిదే కాదని స్పష్టం చేశారు. మా చేత  నిర్ణయించబడినది అని తెలిపారు. 

ఈ నిర్ణయం  రెండు కారణాల వల్ల మహిమాన్విత ప్రాముఖ్యతను  కలిగి ఉంది. 

1. మొదటిగా క్రైస్తవ విశ్వాసాన్ని యూదామతం నుండి విస్పష్టంగా వేరు చేసింది. 

2. రక్షణ అనేది మానవుని విశ్వాస జీవితానికి మరియు దేవుని ప్రేమకు చెందినది. 

దేవుడు మనల్ని రక్షించేది ఆయన  ప్రేమ వలనే ఆయన ప్రేమే మనలను కాపాడుతుంది. 

మన విశ్వాస జీవితంలో కూడా  మనం ప్రార్ధించాలి, మంచిగా జీవించాలి, సోదర ప్రేమ , దైవ ప్రేమ కలిగి ఉంటే దేవుని ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనం రక్షణ పొందవచ్చు. 

మన విశ్వాస జీవితంలో  ప్రశాంతంగా వుండాలంటే ఒకే అభిప్రాయం ఉంటే అంతా శాంతి యుతంగా , ఆనందంగా వుంటుంది. 

మన జీవితంలో దేవుని యొక్క తోడు ఎప్పుడు కూడా ఉండాలి. 

ఈనాటి రెండవ పఠనంలో  యోహను గారు నూతన యెరుషలేమును  దర్శనంలో చూసారు.  అది ఎంతో అందంగా, ప్రకాశవంతంగా ఉంది . 

ఈ నూతన  యెరుషలేము చుట్టూ గోడ కలదు, దానికి 12 ద్వారాలు ఉన్నాయి. ఈ పన్నెండు ద్వారాలు 12 మంది దేవ దూతల ఆధ్వర్యంలో  ఉన్నాయి అని తెలిపారు 

యోహను గారు చూసిన ఈ  దర్శనం శ్రీ సభ గురించియే. ఈ నూతన యెరుషలేము అయిన శ్రీ సభ 12 మంది అపోస్తుల  మీద నిర్మించబడింది. ఈ యొక్క శ్రీ సభ బాధ్యతలను మొదటిగా దేవుడు వీరికే అప్పజెప్పారు. 

వారు దేవుని యొక్క నామమును వేదజల్లారు. యేసు క్రీస్తువే వారికి ఆదరువు , ఆయనయే వారికి వెలుగుగా, రక్షకునిగా మార్గ చూపరిగా ఉన్నారు. 

దేవుని వెలుగును స్వీకరించిన వారు ఎల్లప్పుడు శ్రీ సభను ప్రకాశవంతంగా చేస్తారు. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులను ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు. 

మొదటిగా ప్రభువు అంటున్నారు. నన్ను ప్రేమించువారు, నా ఆజ్ఞలు పాటిస్తారు అని, వాస్తవానికి మనం ఎవరినైన ప్రేమిస్తే వారు చెప్పిందల్లా పాటిస్తాం, అనుసరిస్తాం. ఉదాహరణకు ఒక స్నేహితుడు  ఇంకొక స్నేహితుడి పట్ల సోదర ప్రేమ కలిగి  ఉంటే అతని కోసం ఏదైనా చేస్తాడు. 

అదే విధంగా ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ వలన ఒకరి మాట ఒకరు  పాటించుకొని జీవిస్తారు. 

మనం కూడా దేవున్ని ప్రేమిస్తే ఆయన్ను బాధ పెట్టము, ఆయన ఆజ్ఞలు పాటిస్తాము. ఆయన  యొక్క చిత్తమునే  ఈ లోకంలో నెరవేర్చుతాము. 

దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞలను పాటించుట ద్వారా మనం దేవుని ప్రేమకు సాక్షులవుతున్నాము. దేవుడు మనతో ఉంటారు. తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తారు, దేవున పేరిట ఏమి అడిగినను దయ చేస్తారు, దేవుడు మనతో నివసిస్తారు. 

దేవున్ని ప్రేమించని  వారు  ఆయన అజ్ఞలను  పాటించరు, ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు అందుకే ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు. 

ఆయన్ను నిజంగా ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను  శిరసావహిస్తాడు, ఆయన చిత్తానికి  తనను తాను లోబరుచుకుంటాడు. ఆయన మాటను పాటిస్తాడు. 

దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా  ఆయన్ను ప్రేమించుట అసాధ్యం. మనలో చాలా మంది దేవుని సహకారాన్ని అర్ధిస్తున్నమే కానీ  ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు. 

ప్రభువా , ప్రభువా అని పిలిచేవారు పరలోకంలో చేరరు కాని దేవున్ని ప్రేమించి, ఆయన చిత్తాను సారంగా  జీవించేవారే ప్రవేశిస్తారు. మత్తయి 7:21. 

యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు తోడుగా వుండుటకు ఓదార్పు వాడును పంపిస్తానంటున్నారు. పవిత్రాత్మ దేవుడు అందరికి అన్నీ విషయాలు తెలియ పరుస్తానంటున్నారు. 

యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు శాంతిని ఒసగుతున్నారు 27 వ వచనం. ప్రభువు యొక్క శాంతి నీతితోను, సత్యము తోను కూడిన శాంతి. ఈ లోకంలో అందరు శాంతి కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు శాంతి ఇస్తానంటున్నారు. ఆయన శాంతి అంటే మనం ఆయన జీవితంను ఆదర్శం చేసుకొని ఎటువంటి ఆశలకు గురికాకుండా  అధికారం కోసం ఆశించ కుండా డబ్బు మీద ప్రీతి ఉండకుండా కేవలం దేవుని చిత్తం నెరవేర్చుటయే. 

యేసు క్రీస్తు తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చారు. ఆయన శాంతి యుతంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అయన జీవితంను  ఆదర్శం చేసుకొని శాంతి సమాధానాలతో  ఉండాలి. 

ఏ  విషయంలో కూడా  భయ పడకుండా దేవుడే అన్నీ సమకూర్చుతాడు అనే విశ్వాసం కలిగి జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...