17, జూన్ 2022, శుక్రవారం

సామాన్య కాలపు పన్నెండవ ఆదివారము

క్రీస్తు ప్రభువు శరీర రక్తాల  మహోత్సవము

ఆది 14: 18-20 , 1 కొరింతి 11: 23-26 , లూకా 9: 11-17

క్రీస్తునాధుని యందు  ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీసభ దివ్యసత్ప్రసాద మహోత్సవమును   కొనియాడుతున్నది. ఈనాటి  మూడు పఠనములు సంపూర్ణ సమర్పణ గూర్చి ధ్యానించమని మన అందరిని తల్లి అయిన శ్రీ సభ మన అందరిని ఆహ్వానిస్తోంది. 

 మొదటి పఠనంలో మేల్కేసెదెకు క్రీస్తుకు సంకేతంగా ఉంటాడు, ఇతడు రాజు, యాజకుడు. ఇతడు రొట్టె ద్రాక్ష రసాలను పదోవంతు దేవునికి అర్పించాడు. ఇతనికి ప్రతిబింబమైన క్రీస్తు కూడా దేవునికి ఇవే కానుకలు అర్పించాడు. కనుక క్రీస్తు మనకు నూతన మేల్కేసెదెకు లాంటి వాడు. 

సువిశేష పఠనంలో యేసు ప్రభు ఐదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేల మందికి ఆహారంగా  సమకూర్చి, వారి యొక్క భౌతికమైన ఆకలి తీర్చాడు.

మరియు రెండొవ పఠనంలో క్రీస్తు ప్రభు మన అందరి కోసం తన శరీరమును, మరియు రక్తమును మన అందరి యొక్క ఆధ్యాత్మిక ఆకలి  తీరుస్తుంది.

1)  దివ్య సత్ప్రసాదం మనలను క్రీస్తుతో ఐక్యం చేస్తోంది: భౌతికమైన ఆహారం మన శరీరాన్ని   పోషిస్తుంది. అలాగే దివ్య సత్ప్రసాదం మన ఆత్మను పోషిస్తుంది. అది మన్నాను మించిన భోజనం, మన్నా  కేవలం భౌతిక ఆహారం కానీ సత్ప్రసాదం ఆధ్యాత్మిక ఆహారం. ఈ ఆహారం ద్వారా భక్తుడు క్రీస్తుతో ఐక్యమౌతాడు. క్రీస్తు తన తండ్రి నుండి జీవని పొందుతాడు. ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ద్వారా మనం క్రీస్తు నుండి జీవన్నీ పొందుతాము. దివ్య సత్ప్రసాదం ఒక విందు, మనకు జీవం ఇచ్చే విందు. కనుక మనం దీని స్వీకరించటానికి పూజలో పాల్గొంటే చాలదు, కానీ ఈ  పరమ భోజనాన్ని కూడా స్వీకరించాలి అప్పుడే మనకు విందు అవుతుంది. యేసు ప్రభు మానవ దేహాన్ని చేకొన్నపుడు ఆ దేహాన్ని దేవుడు జీవమయం చేసాడు. ఈ జీవమయ శరీరాన్ని భుజించినప్పుడు మనము కూడా సమృద్ధిగా జీవాన్ని పొందుతాము. నిప్పులో పెట్టిన ఇనుప ముక్క తాను నిప్పు అవుతుంది, అలాగే జీవ పరిపూర్ణుడైన క్రీస్తుని భుజించిన మనం కూడా జీవంతో నిండిపోతాం. క్రీస్తు తండ్రి నుండి, మనం క్రీస్తునుండి జీవన్నీ  పొందుతాము. 

దివ్య సత్ప్రసాదం మనకు ఉత్తానమును ప్రసాదిస్తుంది. విత్తనాన్ని భూమిలో నాటుతాం. దానిలోని జీవ శక్తి వలన అది మళ్ల మొలకెత్తుతుంది. అలాగే మనం స్వీకరించిన దివ్య సత్ప్రసాదం ఒక బీజంలా మనలో ఉండిపోతుంది. భూమిలో పాతి పెట్టిన మన శరీరం ఆ జీవ బీజం వలన మళ్లా లోకాంతంలో మొలకెత్తుతుంది. అదే మన ఉత్థానం. అన్ని భోజనాలు మనలోకి మారతాయి. కానీ దివ్య భోజనం మనలోకి మారదు. మనలని తనలోకి మార్చుకుంటుంది. అది మనలోకి మారితే మన లాగే  పాపపు మానవుడు అవుతుంది. కానీ అది దేవుడు కనుక మనలను తనలోనికి మార్చుకొంటుంది. మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది.

2. దివ్య సత్ప్రసాదం మనలను తోటి నరులతో ఐక్యం చేస్తుంది:- పునీత పౌలు గారు ఇలా పలికారు ఒకే రొట్టెను భుజించే మనమంతా ఒక శరీరమౌతాం . అనగా  సత్ప్రసాదం  స్వీకరించే వారు ఒకరితో ఒకరు ఐక్యంమౌతారాని భావం . తొలినాటి యెరూషలేములోని  భక్తులు ఈ ఆహారం పరస్పరం ఐక్యమై సమష్టి  జీవనం గడిపారు. నేడు మనము  ఇలాగే ఐక్యమై ప్రేమ జీవితం గడపాలి .  దివ్య సత్ప్రసాదంలో వుండే ఆత్మ మనలను  ఐక్యం చేస్తుంది. 

చాలా  గోధుమ గింజలు ఒక అప్పంగా, చాలా ద్రాక్షపండ్లును  నలిపి పాత్రలోని చేరెడు రసంగా తయారు చేస్తాం.  వీటిని స్వీకరించిన మనం కూడా ఒక్క సమాజంగా  ఐక్యం అవుతాం.

సత్ప్రసాద  బలి  సిలువ  బలి . ఆ బలి  ఏక కుటుంబం గా  ఐక్యం చేసేది. శిరస్సులోని అవయవాలు తమలో తాము ఐక్యం కావాలి క్రీస్తు పెక్కు అవయవాలతో  ఏక  శరీరం లాంటి వాడు. ఆ శరీరం మనమే. క్రీస్తులోనికి ఐక్యమైన వారిలో జాతి, వర్గ, లింగ, భేదాలు ఉండకూడదు. కానీ మనదేశంలోని ప్రజలు ఎప్పుడు కుల, వర్గ, లింగ, విభజనలతో సతమత మవుతుంటారు. దేవుడితో ఐక్యం కావటం సులభం. తోటి నరుడితో ఐక్యం కావటం కష్టం. ఇలాంటి పరిస్థితులలో సత్ప్రసాదం మనకు ఐక్య సాధనం కావాలి. ప్రొటెస్టెంట్ శాఖలకు మనకు కూడా ఐక్యత చేకురాలి. 

3. దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువు యొక్క జ్ఞాపకార్థం; 

క్రీస్తు రొట్టెను ద్రాక్షారసమును ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చిన పిమ్మట, మీరు దీనిని నా జ్ఞాపకార్ధం చేయండి అన్నాడు. ఇక్కడ దేనిని అంటే? క్రీస్తు చేసిన కార్యాన్ని . అతడు రొట్టెను తీసుకొని దేవుని స్తుతించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చారు. వాళ్ళను తినమన్నారు. అలాగే పాత్రను తీసుకొని దేవునికి వందనములు అర్పించి దానిని శిష్యులకు ఇచ్చి పానము చేయమన్నారు. ఈ క్రియలన్నిటిని క్రీస్తు చేసినట్లుగానే తరువాత శిష్యులుకూడా చేయాలి . దివ్య సత్ప్రసాద బలి క్రీస్తు జ్ఞాపకార్ధం జరగాలి. అనగా భక్తుడు, క్రీస్తు యొక్క మరణ పునరుత్తానమును తండ్రికి జ్ఞాపకం చేస్తారు. ఆ తండ్రి తన కుమారుని మరణమును పునరుత్తానమును  జ్ఞప్తికి తెచ్చుకొని ఆ కుమారుని విశ్వసించే భక్తులందరిని కనికరిస్తారు.

ప్రతి  పూజలో  మనం  క్రీస్తు  మరణ పునరుత్తనాలను తండ్రికి జ్ఞాపకం చేసేటప్పుడు రెండు పనులు చేస్తాం. మొదటిది ఆ క్రీస్తు ద్వారా మనలను రక్షించినందులకు తండ్రికి మనం వందనాలు అర్పిస్తాం. 

రెండవది ఆ క్రీస్తుని చూచి ఇప్పుడు కూడ మనలను కాచి కాపాడాలని తండ్రికి మనవిచేస్తాం. 

దివ్య సత్ప్రసాదం గురించి మన తల్లియైన తిరుసభ గొప్పగా బోధిస్తుంది. దివ్య సత్ప్రసాదం అంటే గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో యేసు నాదుని  దివ్య ఆత్మా దివ్య శరీరము, రక్తము , దైవ స్వభావము వేంచేసియుండు దేవద్రవ్యఅనుమానము అని భోదిస్తుంది. 

దీనిని ఒక్కముక్కలో చెప్పాలంటే దివ్య సత్ప్రసాదము అంటే సాక్షాత్తు యేసు ప్రభువే . 

మరి ఎందుకు యేసు ప్రభువు దీని స్తాపించాడు అంటే ;

మొదటిగా మన ఆత్మకు దివ్య భోజ్యమై ఉండుటకు యోహాను 6 ; 53 -56  లో చూస్తే దేవుడు ఇలా అంటున్నాడు , మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన తాగిననే తప్ప మీలో జీవము ఉండదని అని పలికారు. అయితే మనఅందరిలో జీవం ఉండాలంటే మన ఆత్మా రక్షింపబడాలి అంటే మనందరం ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. దీనిని మనం భాహ్యమయిన కళ్ళతో చూడక అంతరంగిక హృదయముతో  విశ్వాస దృష్టితో చూడాలి . అప్పుడే మనం పరమ రహస్యాన్ని గ్రహించగలం.

అందుకే పునీత పౌలు గారు కూడా  అంటున్నారు దేవుని పాత్రలోనిది మనం ఆశీర్వదించి త్రాగునప్పుడు రక్తమున పాలు పంచుకొనుట లేదా ? 1 కొరింతి 11: 27 -30 

2.  మనతో వాసము చేయుటకు:

యోహాను 15 :4 

"నేను మీయందు ఉందును మీరు నాయందు ఉండదు." యేసు ప్రభువు ఒక్క శిష్యులు ప్రాణ భయముతో ఎమ్మావు మార్గములో వెళ్లుచున్నప్పుడు , దేవుడు వారికీ దర్శనమిచ్చాడు. ఆయన వారితో మాట్లాడిన తరువాత వారు యేసు ప్రభువుని  "మాతో ఉండుడు అని అడిగారు. మరి యేసు ప్రభువు వారితోనే ఉండుటకు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చారు. లూకా 24 :30 . దీని అర్థం ఏమిటంటే యేసు ప్రభువు తాను ప్రేమించినవారితో ఉండటానికి తనను తానూ త్యాగం చేసుకొని తనవారితో వాసం చేశాడు అని  అర్థం .

 అదే విధంగా యేసు ప్రభువు మనల్ని అనాధలుగా విడిచి పెట్టడు . 

పునీతుల వ్యక్తిగత జీవితాలలో దివ్య సత్ప్రసాదం నుండి పొందిన అనుభూతి.

పునీత జాన్ మరియ వియాన్ని గారు దివ్య సత్ప్రసాదం ముందు మోకరించి ప్రార్థించి తార్సు పట్టణాన్ని మార్చాడు. 

పునీత మథర్ థెరెసా గారిని ఒకరోజు, అమ్మ నీ శక్తికి గల కారణమేమిటి అని అడిగినప్పుడు, ఆమె ఇలా అంది ; రోజు దివ్యసత్ప్రసాదం ముందు గంట సేపు మోకరించి ప్రార్థించటమే. వీరిలా మనకు విశ్వాసముంటే ఇంకా ఎన్నో అద్భుతాలు పాత నిబంధనలో చుస్తే దివ్యమందసాన్ని  ఓబేదెదోము  ఇంటికి ఆహ్వానింపగా వారి కుటుంబము అమితముగా ఆశీర్వదింపబడినది. 2 సమూయేలు 6 :11- 12 .  

1 వ సమూయేలు 7 : 6 లో ప్రజలు మిస్ఫా వద్ద ప్రోగై పాపములను ఒప్పుకొని , దహన బలిని సమర్పించిన తరువాత ఫిలిస్తెయులను దేవుడు శిక్షించారు. చివరకు సాలొమోను దేవాలయమును నిర్మించి మందసాన్ని మందిరంలో ఉంచారు. 

మరి ఇంత శక్తి దివ్య మందసంలో ఇమిడి ఉండటానికి దాంట్లో ఏముందంటే "మోషే హోరేబు కొండ చెంత ఉంచిన రెండు రాతి పలకలు , మన్నా , మరియు  అహరోను కర్రా . వీటికే ఇంత శక్తి ఉంటె ఇప్పుడు మన దివ్య మందసంలో సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు నివసిస్తున్నాడు. ఆయొక్క దివ్య సత్ప్రసాదానికి ఇంకెంత శక్తి ఉండాలి. కాబట్టి మనమందరం కూడా దివ్య సత్ప్రసాదముయొక్క శక్తిని , పవిత్రతను తెలుసుకొని ఆయనను కొనియాడుతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసంతో ఆయనను స్వీకరించి ఆయనలో ఏకమవుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్.

By బ్రదర్ . సైమన్


అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 7: 19-23 


(ఇది ఈరోజు సువిశేష భాగము కాదు అని గమనించాలి,  ధ్యానం లో భాగంగా దీనిని ధ్యానించు కొరకు మాత్రమే)
మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు. ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే  పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు  చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. 

యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో మంచి పండ్లనియని ప్రతిచేట్టును నరికి మంటలో పడవేయుదురు అని చెబుతున్నారు.  ఎందుకంటే అప్పటి వరకు ఆ  చెట్టు మొక్కగా ఉన్నప్పటి నుండి ఎదిగి పండ్లు ఇచ్చే స్థితి వరకు దానిని పెంచి , పెద్ద చేసి అది మంచి పండ్లను ఇవ్వాలని దానికి కావలనసిన అన్నీ రకాల ఎరువులు వేసి పెంచిన తరువాత, అది మంచి పండ్లను ఇవ్వకపోతే దానిని రైతు నరికి వేస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునిచే ప్రేమించ బడినవాడే. ప్రతి వ్యక్తికి దేవుడు తగిన విధమైన ప్రతిభను ఇచ్చాడు. దానిని వినియోగించుకొని తగిన ప్రతిఫలాన్ని ఇవ్వవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

 "వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు." యేసు ప్రభువు ఇక్కడ కపట ప్రవక్తల గురించి మాటలాడుతున్నారు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే బయటకు దేవుని సందేశమును ప్రవచిస్తున్నాము అని వారికి  ఉపయోగపడే మాటలను మాత్రమే వారు అనేక సార్లు చెబుతున్నారు. ఒక విధముగా యేసు ప్రభువు పరిసయ్యుల జీవితాలను ఉద్దేశించి మాటలాడిన మాటలు ఇవి. వీరు చెప్పే మాటలు అన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తాయి. కాని చాలా స్వార్ధంగా ఉంటాయి. ఉదా .. తల్లిదండ్రులను గౌరవించాలి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ.  ఒక వేళ  దేవాలయానికి మనం అర్పణ ఇచ్చి తల్లిదండ్రులకు మిమ్ములను చూసుకోవాలసిన సొమ్మును నేను దేవాలయానికి ఇచ్చాను అని చెప్పినట్లయితే అప్పుడు వారు తల్లిదండ్రులను చూడనవసరం లేదు అని వారు బోధించారు. 

కేవలం ఇది మాత్రమే కాదు. అనేక విషయాలు వినడానికి చాలా బావుంటాయి. కాని దేవునికి ఇష్టమైన పనులు కాదు.  వారి ఫలములు అనేక సార్లు ఏమి చేస్తాయి అంటే  ఇతరులకు  నష్టమును కలుగజేస్తాయి. ఉదా.. వీరు కాపరుల వలె మందలోనికీ వస్తారు కాని క్రూర మృగమును చూసి వీరు పారిపోతారు. వారి ప్రాణముల కొరకు మందలను నాశనం చేస్తారు. వీరు అనేక మంచి విషయములు  చెప్పిన మంచి పనులు వీరు చేయరు. అందుకే వీరిని యేసు ప్రభువు మీరు బయటకు సుందరముగా ఉన్న సమాధులు వంటివారు అని అన్నారు. బయటకు చాలా అందముగా ఉన్నకాని లోపల మొత్తం కుళ్లిపోయిన శరీరమే ఉంది. కేవలం మనం చేసే ప్రతి మంచి పని వలన మాత్రమే మనలని ఇతరులు  తెలుసుకోగలగాలి. మనం చూపించే ప్రేమ, కరుణ, దయ వంటి గుణాల వలన మనం ఆయన అనుచరులం అని  పిలిపించుకోగలగాలి.

 "ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే  పరలోక రాజ్యమున ప్రవేశించును." యేసు ప్రభువు మాటలు మనం చాలా శ్రద్దగా ఆలకించాలి. మనం ప్రతి నిత్యం ప్రార్దన చేయడానకి  దేవుని గురించి చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తాము ,  అది తప్పు కాదు. కాని దాని కంటే ముఖ్యం మనం దేవుని చిత్తానుసారముగా జీవించుట.  యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడం తన ఆహరముగా భావించాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎంతటి కష్టమైన అనుభవించడానికి సిద్దపడ్డాడు, కష్టాన్ని అనుభవించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. 

 కపట ప్రవక్తలు ఎవరు ఇటువంటి జీవితానికి సిద్ద పడలేదు. వాటి నుండి దూరంగా వెళ్లిపోయారు. వారు స్వార్ధంతో జీవించారు. ఎవరైతే ఇటువంటి జీవితానికి సిద్ద పడుతారో వారికి దైవ రాజ్యంకు అర్హుడవుతాడు. తండ్రి చిత్తము అనేది మనకు ఎలా తెలుస్తుంది? పది ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా దేవుడు తన చిత్తము తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా తన చిత్తము తెలియజేశాడు. తన కుమారుని ద్వారా తన చిత్తము తెలియజేశాడు. నాకు ఆయన చిత్తము తెలియదు అని మనం చెప్పలేం. ఎందుకంటే తన చిత్తం ఏమిటి అని తండ్రి ఎప్పుడు తెలియ పరుస్తూనే ఉన్నాడు. మనం ప్రతి నిత్యం ప్రభూ ప్రభూ అని అనుటకంటే  ఆయన చిత్తము నెరవేర్చడానికి పునుకోవాలి.

 "ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు  చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును."  యేసు ప్రభువు  ఇచ్చేటువంటి కొన్ని అనుగ్రహాలు ద్వారా శిష్యులు కొందరు కొన్ని అద్భుతాలు చేసి వారు అంతిమ దినమున మేము మీ పేరున అనేక గొప్ప పనులు చేశాము , పిసచ్చములు పారద్రోలాము అని చెబుతారు అయిన నేను వారిని నేను తిరస్కరిస్తాను అంటున్నారు. నేను మిమ్ము ఎరుగను అంటాను అని చెబుతున్నారు. కారణం ఏమిటి అంటే వీరు ఎంతటి గొప్ప పనులు చేసిన దేవుని చిత్తము వీరు నెరవేర్చారా ? లేదా? అనేది ముఖ్యం. వీరు ఆజ్ఞలు పాటించి , ఆయన చిత్తం నెరవేర్చితె అంటే ఆయన చూపిన సుగుణాలు కలిగి జీవిస్తూ తండ్రి చిత్తం నెరవేర్చడానకి  ఎంతకైనా మనం పాటుపడితే అప్పుడు ఆయన మనలను ఎరుగుతాను అని అంటారు. 

ప్రార్దన : ప్రభువా ! నా  జీవితంలో నేను మీ ప్రేమను, దయను , ప్రతిభను , కరుణను పొందాను. కాని దానికి తగిన విధముగా నా జీవితములో మంచి ఫలాలు ఇవ్వడంలో నేను విఫలం చెందాను. అటువంటి సమయాల్లో నన్ను క్షమించండి. నేను మరలా నా జీవితంలో మీరు ఇచ్చిన అన్నీ అనుగ్రహాలును వాడుకొని మంచి ఫలాలు ఇచ్చే విధంగా నన్ను దీవించండి. ప్రభువా మీ చిత్తమును విడచి పెట్టి ఈ లోక విషయముల మీద చాల సమయం వృధా చేశాను ప్రభువా. నేను కూడా మీ వలె తండ్రి చిత్తము నెరవేర్చడం నా ఆహారం అనే విధంగా నా జీవితాన్ని మార్చండి . మీ చిత్తం నెరవేర్చే వానిగా నన్ను మార్చండి. ఆమెన్ .  
11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...