26, ఫిబ్రవరి 2026, గురువారం

లూకా 21: 1-4

 లూకా 21: 1-4 

దేవాలయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, "ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా  ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన  పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు దేవాలయంలో కానుకలను వేయుచున్న ధనికులను చూస్తున్నారు. అందరు వారి వారి సమృద్ధి నుండి అక్కడ కానుకలను వేయుచున్నారు. ఆ ధనము వారు దానం చేయడం వలన వారి జీవితంలో ఏమి లోటు ఉండదు. కానీ అక్కడ ఒక పేద వితంతువు ఉన్నది. ఆమె కూడా ఆ కానుకల పెట్టెలో రెండు కాసులను వేస్తుంది. యేసు ప్రభువు ఆ పేద వితంతువు వేసిన రెండు కాసులను గురించి  అందరి కంటే ఎక్కువ ఆమె ఇచ్చినది  అని చెబుతున్నారు.  ఈ రెండు కాసులు ఎందుకు ఎక్కువ అంటే, ఈ పేద విధవురాలు ఎన్నో అవరోదాలను అధిగమించింది అయినా తన భక్తిని కోల్పోలేదు. ఈమెకు స్త్రీగా ఆనాటి కాలం అనేక విధాలుగా అసమాజం ఆమెను బాధించింది. మరియు ఆమెకు ఆదరువు ఎవరు లేరు కారణం ఏమిటి అంటే ఆమె ఒక వితంతువు. అంతే కాక ఆమె పేదరాలు ఇన్ని అవరోధాలు ఆమెకు ఉన్నకాని ఆమె కానుకను ఇవ్వడానికి సిద్దపడింది. ధనికులు వేయుచున్న కానుకలు వారి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. కానీ ఈ స్త్రీ వేసిన కానుక ఆమె జీవితంలో మార్పు తీసుకువస్తుంది. ఎందుకు అంటే ఆ రెండు కాసులను వేయడం వలన మరుసటి రోజు ఆమెకు ఏమి లేదు. 

యేసు ప్రభువు ఆమె గురించి తన సమస్త జీవనమును సమర్పించినది అని చెప్పారు. ఈ రెండు కాసులు ఆమె యొక్క సమస్త జీవనము. ఈ రెండు కాసులు మాత్రమే ఆమెకు ఉన్నటువంటి ఆస్తి ,  అయినట్లయితే , వాటిని ఆమె ఎందుకు సమర్పించినది? ఆమెకు జీవితము మీద ఆశ లేదా? లేక ఆమె తనకు ఉన్నటువంటిది మొత్తం దేవునికి సమర్పించి చనిపోవాలనువుకున్నదా? ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే ఆమె పేదరాలు , పేదరాలిగా ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తుంది. ఆమె ఒక స్త్రీగా ఆనాటి సమాజం తనను ఒక బలహీనురాలుగా ఉన్నది , బలహీనురాలిగా ఒక పురుషుని మీద ఆధారపడి జీవించవలసి ఉన్నది. ఆమె ఒక వితంతువు అవుట  వలన తన ఆధారపడుటకు ఎవరు లేరు. కనుక తన సమస్తం దేవుడే అవుతున్నాడు. అందుకే ఆ రెండు కాసుల మీద ఆధారపడకుండా వాటిని కూడా ఆ దేవాలయంలో కానుకల పెట్టెలో వేసి దేవుడే తన సమస్తము అని చాటుచున్నది. ఆమెకు దేవుని మీద ఉన్న నమ్మకం ఇక్కడ మనము చూడవచ్చు. ఈ రెండు కాసులను దేవునికి సమర్పిస్తే మరుసటి రోజు ఎలా గడుస్తున్నది అనే చింత లేదు. దేవుడు తనను ఆదుకుంటాడు అనే దానికంటే అయన ఇప్పుడు ఎలా ఆదుకుంటున్నాడు అనే విషయంలో నిమగ్నమయ్యింది. అంతేకాకుండా ఆమె దేవునికీ పూర్తిగా అంకితమైనది. దేవున్ని తన ఆస్తిగా చేసుకున్నది. 

సమృద్ధి నుండి అనేక మంది ధనికులు కూడా అక్కడ అర్పణ ఇచ్చారు, అవి ఇవ్వడం వలన వారికి ఎటువంటి లోటు ఏర్పడలేదు. ఆ ధనము వారి దగ్గర లేక పోవడం వలన వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుటలేదు. మనం అర్పించే అర్పణ కేవలం మన దగ్గర ఉన్న మిగులు మాత్రమే అయితే అది నిజమైన అర్పణ కాదు. మనము అర్పించే ప్రతి అర్పణ అది మన జీవితంలో భాగం అయిఉన్నట్లయితే అది గొప్ప అర్పణ అవుతుంది. ధనికులు తమ జీవితంలో ఉన్నటువంటి మిగులును అర్పించారు. పేద విధవరాలు తన సమస్తము అయిన రెండు కాసులను అర్పించింది. ధనికులు ఎక్కువ అర్పించిన అది వారికున్న సమస్తము కాదు, కానీ పేద విధవరాలు రెండు కాసులే అర్పించిన అది తన సమస్తము. అందుకే యేసు ప్రభువు ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చినది అని చెబుతున్నారు.  ఆమె తన సమస్తము సమర్పించి దేవున్ని తన సమస్తం చేసుకున్నది. 

ఈ సువిశేషభాగం  మనము మనకు ఉన్న మిగులును మాత్రమే దేవునికి సమర్పిస్తూ , ఆ మిగులు ఇవ్వడం వలన మనకు ఎటువంటి లోటు లేదులే అని ఆనందపడుతున్నామా? లేక కొంత బాధకు గురి అయినా మనకు ఉన్న మిగులుకాకుండా, ఉన్నదాని దేవునికి సమర్పించి దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా ? అని మనలను మనం పరిశీలించుకోవాలి అని తెలియజేస్తుంది. పేద వితంతువు వలే పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచి జీవించే గొప్ప జీవితం మనకు కావాలి. దేవుడే మన సమస్తము కావలి. 

ప్రార్ధన  : ప్రభువా మీరు , మీ వాక్కుద్వారా మీ సంకల్పాన్ని మాకు తెలియజేస్తున్నారు. మాలో ఉన్న లోపాలను తెలియజేస్తున్నారు. మేము ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు, మాలో ఉన్న లోపాలను ఎలా అధికమించాలో , మీ వలె ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు.ఈ జీవితమునకును , మీరు ఇచ్చిన ప్రతి అనుగ్రహమునకును మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  పేదరాలి దిన కానుకను చూచిన ప్రభువా! నేను నా జీవితంలో ధనికుల వలె , నాకు ఉన్న మిగులును ఇతరులతో పంచుకొని గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడి వలే చెప్పుకొనుచున్నాను, నాకు మీరు ఇచ్చిన అని వరాలను అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయపడుటకు లేక మీకొరకు వినియోగించుటకు చిన్న ఇబ్బంది కూడా సహించలేకుండా ఉన్నాను.నాకు ఉన్నటువంటి ఆస్తి పస్తులు , నా సర్వస్వం అనే భావనలో ఉన్నాను.  ఇటువంటి ఆలోచనలతో చేసిన అనేక తప్పులకుగాను  నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ లోపాలను తీసివేయుటకు నాకు సహాయం చేయండి. పేద విధవరాలి వలె నేను కూడా నాకు ఉన్న సమస్తాన్ని మీకు అర్పించి, మీరే  నా సమస్తము అని తెలుసుకొని మిమ్ము  నా సమస్తముగా పొందే అనుగ్రహము దయచేయండి. ప్రభువా ! నిన్ను తెలుసుకొనుటకు మరియు అర్ధం చేసుకొనుటకు , మీ వలె మారుటకు సహాయం చేయండి. ఆమెన్ 

లూకా 21:5-11

 లూకా 21:5-11

కొందరు ప్రజలు ఆలయమును గురించి  ప్రస్తావించుచు "చక్కని రాళ్లతోను , దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు"అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా! ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును"అనెను. అపుడు వారు "బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, అయన "మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని, మీరు వారివెంట వెళ్ళవలదు. యుద్ధములను, విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగితీరును. కాని, అంతలోనే అంతము రాదు." ఇంకను అయన వారితో ఇట్లనెను:"ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. 

ధ్యానం: యెరూషలేము దేవాలయం ఒక అద్భుత కట్టడం. ఆ దేవాలయం యిస్రాయేలు ప్రజల కీర్తిని చాటుచున్నది. అంతేకాక దేవాలయం మీద ఆ ప్రజలు ప్రేమను పెంచుకొని ఉన్నారు.  ఆ ప్రేమ ఎంతగా అంటే వారి జీవితంలో ప్రతి విషయం ఈ దేవాలయంతో ముడిపడి ఉండేది. యిస్రాయేలు ప్రజలు దేవాలయ అందం గురించి చెప్పుకుంటు గర్వించేవారు. ఇంతటి గొప్ప కట్టడం ఎక్కడ ఉండదు అనే భావం వారిలో ఉండేది. కేవలం కట్టడం గొప్ప తనమునే కాదు వారు ఈ దేవాలయం దేవుని సాన్నిధ్యానికి గుర్తు అని, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని , వారికి మరియు దేవాలయమును ఎప్పటికి ముప్పు వాటిల్లదు అనే భావనలో జీవించేవారు. దేవాలయం  పడగొట్టబడుతుంది అనే ఆలోచన వారి మనసులలో ఎప్పుడు వచ్చేది కాదు. అటువంటి ఆలోచన వారి ఊహకు అతీతము. కాని యేసు ప్రభువు వారి యెదుట వారి ఊహకందని విషయం చెబుతున్నారు. వారి దృష్టిలో యెరూషలేము ఎప్పటికి నిలిచిపోయే కట్టడం. 

యేసు ప్రభువు ఇక్కడ రాతిమీద రాయి నిలువని కాలము వచ్చును అని, అంతయు నాశనము చేయబడును అని అంటున్నారు. ఎందుకు ఈ ప్రజలు ఇంత ప్రేమగా చూసుకునే దేవాలయమును దేవుడు కాపాడలేదు? ఈ ప్రజలు కేవలం దేవాలయం బయట అందాన్ని మాత్రమే చూస్తున్నారు.  వారు ఎప్పుడు నిజమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను వారు పట్టించుకోలేదు. దేవునికి ఇష్టం లేని పనులను వారు చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త చెబుతున్న విధముగా దేవుడు వారి నుండి తన సాన్నిధ్యాన్ని తీసివేయుటకు వెనుకాడడు. దేవుడు తన సాన్నిధ్యాన్ని మొదట షిలోలో ఎరుక పరిచినప్పుడు వారు అనేక విధాలుగా వృద్ధి చెందారు. కాని  వారు ఆయనకు ఇష్టం లేని జీవితం జీవించినప్పుడు తన సాన్నిధ్యాన్ని అక్కడ నుండి తీసివేస్తున్నారు.  ఇక్కడజరుగుతున్నది ఇదే  యెరూషలేము ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు దేవుడు ఇక్కడ నుండి తన సాన్నిధ్యం తొలగిస్తారు.  కాని తన కుమారుని ఇక్కడకు పంపడం ద్వారా తన సాన్నిధ్యం పొందే అవకాశాన్ని మరల కలిగిస్తున్నారు. దేవాలయం ద్వారా కాకుండా యేసు ప్రభువు ద్వారా ప్రతి వ్యక్తి దేవుని సాన్నిధ్యాన్ని పొందుట జరుగుతుంది.  కనుక యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన ప్రజలు దేవుని సాన్నిధ్యం పొందుట  యేసు ప్రభువులో జరుగుతుంది. 

యేసు ప్రభువు 'దేవాలయం ధ్వంసం చేయబడుతుంది' అని చెప్పగానే వారిలో కొంత భయం , బాధ కలిగి యేసు ప్రభువును ఇవి అన్ని ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతున్నారు. వారు యేసు ప్రభువును సూచనలు అడుగుతున్నారు. దేవాలయం ద్వారా కాకుండా దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువు ద్వారా మనము దేవుని సాన్నిధ్యం పొందవచ్చు కాని అయన పేరు చెప్పుకొని , అయన వలే ఉన్నామని, అనేక మంది దైవ సాన్నిధ్యం తమ ద్వారా పొందవచ్చు అని  చెబుతూవుంటారు. వారిని చూసి మోసపోవద్దు అని ప్రభువు చెబుతున్నారు. అనేక మంది యేసు ప్రభువు వలె వచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభువు వలె జీవించడం ఎవరికీ కుదరదు. నిజమైన క్రీస్తు అనుచరులు ఎవరు తామే క్రీస్తు అని చెప్పుకోరు. ఎందుకంటే వారి జీవితం మొత్తం ఆయనను అనుసరించడానికి వినయంతో వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అబద్ధికుడు మాత్రమే అయన డాంభికము కోసం అయన వలె నటిస్తూ ఆ వినయమును చూపించలేక తమ కపటత్వాన్ని కొంతకాలానికి బయలుపరుస్తారు. మనము   యేసు ప్రభువు వలె సంపూర్ణంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. 

ప్రార్ధన: సర్వ సృష్టికి కారకుడవైన ప్రభువా , మీరు ఇచ్చిన తెలివి , జ్ఞానము  చేత మేము ఈ ప్రకృతిని, లోకమును సుందరముగా తీర్చి దిద్దుతున్నాము. వాటిని మా గొప్పతమునుగా భావిస్తూ, మీ అవసరం మాకు లేదు అన్నట్లు జీవిస్తున్నాము. అటువంటి పనులు చేస్తున్నందుకు మమ్ము క్షమించమని వేడుకుంటున్నాము. ప్రభువా మేము మీమమ్ములను కాదని ఈ లోకమును ఈ లోక వస్తువులను ప్రేమిస్తూ అవే ముఖ్యం అని జీవిస్తున్నందుకు మమ్ములను మన్నించండి. ప్రభువా మాకు ఏది సత్యమో , ఏది అసత్యమో తెలియక మేము అనేక మంది చేత చెడు మార్గాలలో నడిపించబడుతున్నాము.  అటువంటి సందర్భంలో మాకు సత్యాన్ని తెలియచేసి మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా దేవాలయం లేకపోయినా మీ ద్వారా ప్రజలు దేవుని కనుగొన్నారు, మీద్వారా తండ్రిని చేరుకున్నారు. మీరు ఎలా దేవాలయం చేసే పనిని మీరు మీ జీవితం ద్వారా చేస్తున్నారో, మేము కూడా ముందు మిమ్ములను అనుసరిస్తూ , తండ్రిసాన్నిధ్యాన్ని పొందే అనుగ్రహం దయచేయండి

లూకా 21:12-19

 లూకా 21:12-19 

ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్ధనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును , వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు ,  బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో  కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తల వెంట్రుకకుడా రాలిపోదు. మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. 

ధ్యానము: యేసుప్రభువును అనుసరించేవారిని యేసు ప్రభువును వ్యతిరేకించేవారు  ఎలా వేధించేది తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను అనేక విధాలుగా హింసిస్తారు. శిష్యులను బంధిస్తారు, ప్రార్ధన మందిరాలకు చెరసాలలకు అప్పగిస్తారు. ప్రార్ధన మందిరాలకు ఎందుకు వారిని అప్పగిస్తారు? ప్రార్ధన మందిరాలు కేవలం ప్రార్ధన మాత్రమే ఇతరులను తీర్పు తీర్చే న్యాయస్థానాలులాగ కూడా పని చేస్తాయి. యేసు ప్రభువు అనుచరులను శిక్షించడానికి కూడా అవి వాడబడతాయి అని ప్రభువు చెబుతున్నారు. చెరసాలలకు యేసు ప్రభువు శిష్యులను ఎలా శిక్షించారో మనకు తెలుసు. వారిని ఎంతో క్రూరంగా హింసించారు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికి కూడా నిజమైన అనుచరులను ఇప్పటికి కూడా అలానే శిక్షిస్తారు. 

యేసు ప్రభువు శిష్యులు లేక ఆయన అనుచరులు అనే ఒకే ఒక కారణం వలన ప్రజలు వీరిని శిక్షిస్తారు. యేసు ప్రభువునువారు ఒక శత్రువులాగ చూస్తున్నారు. అయన అనుచరులను కూడా అలానే చూస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులకు హింసలు  తమ గురువుకు సాక్షులుగా ఉండుటకు ఒక మంచి అవకాశం దీనిని యేసు ప్రభువు అనుచరులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో అనుచరులు సాక్షులుగా ఉండాలి. వీరిని బందించినప్పుడు లేక వారికి కష్టాలు ఉన్నప్పుడు వీరు వాటికి కలవరపడనవసరం లేదు. ప్రార్ధనాలయాలలో, చెరసాలలో , పెద్దల ముందు ఏమి మాట్లాడాలో అని  వీరు ఏమి ముందుగానే తయారుకానవసరం లేదు. వారు ఏమి మాట్లాడాలో కూడా ప్రభువే వారికి తెలియజేస్తారు. ఎవరుకూడా వీరికి నేర్పించనవసరం లేదు. 

విరోధి మాటాలడలేని  విధంగా మాట్లాడే విధంగా , వీరి మాటలను ఖండించలేని జ్ఞానాన్ని వీరికి దేవుడు ప్రసాదిస్తారు. ఈ మాటలు ఎంత నిజమో మనకు స్తెఫాను జీవితం చూసినప్పుడు తెలుస్తుంది. స్తెఫాను మాటలను విన్న పెద్దలు ఆయన వివేకమును వారు ఖండించలేకపోయారు. అందుకే ఆయనను రాళ్లతో కొట్టి చెంపుతున్నారు. మాటలద్వారా లేక జ్ఞానము ద్వారా ఎవరు యేసు ప్రభువు శిష్యులను ఎదుర్కోలేని జ్ఞానము వారికి ఇవ్వడము జరుగుతుంది. అంతమాత్రమున వీరికి అన్ని సమకూర్చబడవు. వీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అందరు వీరిని ద్వేషిస్తారు. అంతేకాదు సొంత తల్లిదండ్రులు, సోదరులు వీరిని శత్రువులను పట్టిస్తారు. మరల వీరిని చంపిస్తారు. విటువంటి పరిస్థితులలో కూడా నిజమైన క్రీస్తు అనుచరులు సాక్షులుగాజీవిస్తారు. అందరు ద్వేషించిన వీరు ఎప్పటికి ఆ ద్వేషాన్ని చూపించకుండా ప్రేమనే చూపిస్తూ ఉంటారు. 

యేసు ప్రభువు తన శిష్యులకు ఒక మాట చెబుతున్నారు. అది అన్నిటికంటే ముఖ్యమైనది అది ఏమిటి అంటే ఇవన్నీ జరిగిన కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. ఈ వచనము  యేసు ప్రభువు తన శిష్యులను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ లోకంలోని ఏమి కూడా యేసు ప్రభువు శిష్యులను ఏమి చేయలేదు. వారిని చంపినా కుడా వారికి ఏమి జరుగదు.  ఎందుకంటే వారికి మరల ప్రాణం ఇచ్చేటువంటి ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. శిష్యుల సహనం వలన వారి ప్రాణం నిలబడుతుంది. ఇక్కడ శిష్యుల సహనము ఏమిటి అంటే  వారు సహనముతో ఎటువంటి ఇబ్బంది అయిన సహిస్తారు.    

ప్రార్ధన : ప్రభువా! ఈ లోకంలో ఎందరో  మిమ్ములను అనుసరించాలని కోరుకుంటున్నారు. కాని మిమ్ములను అనుసరించుట వలన వచ్చే ప్రతికూల విషయాలను తెలుసుకొని మిమ్ములను అనుసరించకుండానే ఉంటున్నాం. తల్లిదండ్రులు , సోదరి సోదరులు , బంధుమిత్రులు వీరు అందరు ఎక్కడ మాకు వ్యతిరేకంగా మారుతారో అని నిన్ను అనుసరించలేక  పోతున్నాము. ప్రభువా!చెరసాలలో బంధించిన ,ప్రార్ధనాలయానికి రానివ్వకపోయినా అందరు నన్ను దూరంగా పెట్టిన, పెద్దల వద్దకు , అధికారుల వద్దకు అధిపతులవద్దకు తీసుకుపోయిన నిన్ను మాత్రమే ప్రేమించే విధంగా నన్ను మార్చండి. ప్రభువా ! మీకు నిజమైన సాక్షిగా జీవించడానికి , సాక్షిగా నిలువడానికి కావలసిన శక్తిని దయచేయండి. ప్రభువా ! నేను  మీకు సాక్షిగా జీవించడానికి ఎన్ని కష్టాలు పడటానికి అయినా సిద్ధముగా ఉన్నాను. కాని నాకు వచ్చే కష్టాలు , హింసలు తట్టుకోవడానికి కావలసిన శక్తిని దయచేయండి. ఆమెన్ 



మత్తయి 4:18-22

 మత్తయి 4:18-22

గలిలీయసరస్సు తీరమున యేసు నడచుచు, వలవేసి చేపలనుపట్టు పేతురు అను పేరుగల సీమోనును, అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు. "మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను"అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటినుండి పోవుచు యేసు జెబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితోపాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా, వెంటనే వారు పడవను, తమ తండ్రిని వదలి పెట్టి ఆయనను వెంబడించిరి. 

ధ్యానము :  సీమోను, అంద్రెయ అను సోదరులు మరియు యాకోబు ,యోహాను అను మరి ఇద్దరు సోదరుల దైవ పిలుపును ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. యేసు ప్రభువు వారిని తనను అనుసరించమని అడిగిన వెంటనే వారు యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వలలను, తండ్రిని కూడా వీరు అక్కడే వదలి పెట్టారు. ఎందుకు వారు ఇలా చేస్తున్నారు? వారు యేసు ప్రభువులో ఏమి చూసారు? ఎందుకు మారుమాట్లాడకుండా ఆయనను  అనుసరిస్తున్నారు? యేసు ప్రభువు ఒక వ్యక్తిని తనను అనుసరించమని అడిగినపుడు ఎవరుకూడా వెనుకకు పోలేదు, యేసు ప్రభువు మాటలు, ఆయన మాటలు చూపులు , వ్యక్తిత్వము మనలను ఆయనను అనుసరించేలా చేస్తాయి. యేసు ప్రభువు నన్ను అనుసరించమని అడిగిన ఆ మోహోన్నత వ్యక్తి మమ్ములును తనను అనుసరించమని అడిగారని వారు తమ జీవనోఫాది అయిన వృత్తిని, వలలను, బంధువులను కూడా వదలి ప్రభువును అనుసరిస్తున్నారు. పూర్తిగా వారు యేసు ప్రభువు శిష్యులుగా   మారిపోతున్నారు. 

యేసు ప్రభువు శిష్యులుగా మారిపోయిన తరువాత వారి  జీవితం ఎలా సాగుతుంది, ఎలా  బ్రతకాలి అనే  విషయాలను వారు ఆలోచించుట లేదు. అంటే ప్రభువు మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎవరో వారికి తెలుస్తుంది. అయన మాటలు వినగానే వారు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నారంటే ఆయన   మాటలలో జీవం ఉన్నదిఅని వారికి తెలుసు . అయన చూపులో వారికి వారి జీవితము మొత్తం కనపడుతుంది. ఆయన  స్పర్శ యొక్క శక్తి వారికి తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగం కూడా ఆయన స్పర్శతో తొలగిపోతుంది. ఆ మోహోన్నతిని వ్యకిత్వం వారికి తెలుసు పాపంలో పట్టుబడిన స్త్రీని క్షమిస్తున్న గొప్ప మనసు ఆయనకే సొంతం. ఇంతటి శ్రేష్టమైన గురువు వారిని అనుసరించమని అడిగిన తరువాత వారిలో ఎటువంటి సందేహం లేదు, మరో ఆలోచన లేదు వారికి ఇది సుదినం. ప్రభువును అనుసరించడానికి సిద్ధపడుతున్నారు.  సాదారణ వ్యక్తులు మనుషులను పెట్టె వారిగా మారుతున్నారు. 

యేసు ప్రభువు సీమోను , అంద్రెయను తనను అనుసరించమని అంటున్నారు. వారు జాలరులు. సీమోను అంటే రెళ్ళుకాడ అని అర్ధం.   గాలికి అటు ఇటు వీచే ఒక రెల్లును యేసు ప్రభువు గాలికి గాని తుపానుకు గాని తొణకని ఒక రాయిగా మారుస్తున్నారు. అంద్రెయ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. అంద్రెయ అంటే పౌరుషము అని అర్ధం. ఈయన మొట్టమొదట యేసు ప్రభువును పేతురుకు తెలియ పరుస్తున్నారు. యేసు ప్రభువును అనుసరిస్తూ మరణించడానికి సిద్ధపడ్డాడు కాని పాపంతో సఖ్యత పడుటకు ఇష్టపడలేదు ఫలితముగా ఇతనిని X రూపంలో సిలువ వేశారు.  ఈ రోజు పునీత అంద్రెయ పండుగను జరుపుకుంటున్న మనము ఆయన మాధ్యస్త ప్రార్ధనను కోరుదాం. ఈ నలుగురు శిష్యులు జాలరులుగా వీరు బ్రతుకుతున్నారు. జాలరులుగా అనేక సంవత్సరాలు బ్రతికారు. యేసు ప్రభువు వారిని అనుసరించమని అడిగిన వెంటనే వారు వలలను అక్కడే వదలి యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వారిని యేసు ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని చెబుతున్నాడు. వీరు మనుషులను పట్టె అంతటి గొప్పవారా?  వారు ఎన్నో సంవత్సరాలు జాలరులుగా పని చేసిన గాని వారికి ఎక్కడ చేపలు పడతాయో పూర్తిగా  వారికి తెలియదు. అందుకే వారికి యేసు ప్రభువు ఎక్కడ వల వేయాలో చెబుతున్నాడు. అటువంటి ఈ జాలరులను  మనుషులను పెట్టె వారినిగా యేసు ప్రభువుగా ఎలా చేస్తాడు, వీరు మనుషులను పట్టేంత గొప్పవారు ఎలా అయ్యారు మనము పరిశీలిస్తే,  తిరుసభ ఇంతగా లోకమంతట  వ్యాపించింది అంటే  ఈ జాలరులు కారణం. అన్ని సంవత్సరాలు జాలరులుగా ఉన్న ఎక్కడ చేపలు ఉంటాయో తెలియని ఈ జాలరులు ప్రపంచ నలుమూలల దైవ రాజ్యాన్ని వ్యాపించడానికి వారు చేసిన కృషి ఎంతో గొప్పది.  యేసు ప్రభువు ఆ శిష్యులను  ప్రపంచ నలుమూలల తన వాక్కును ప్రకటించగల వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు ఈ సాధారణ వ్యక్తులను ఇంత గొప్ప వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు మాటలు మనము వున్నట్లయితే మనలో అన్ని గొప్ప లక్షణాలు లేకున్నా ప్రభువు మనలను గొప్పవారిగా చేస్తాడు అనుటకు ఈ శిష్యుల జీవితం ఒక ఉదాహరణ. 

ప్రభువుతో సంభషణ మరియు ప్రార్ధన  : ప్రభువా మీరు ఎంత గొప్పవారు, చాలా సాధారణ వ్యక్తులను , ఉన్నత వ్యక్తులుగా లోకాన్ని జయించే వారీగా చేస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులను పిలిచినట్లు నన్ను కూడా పిలవండి. వారు ఎలాగైతే మీ మాటకు మారుమాట్లాడకుండా, సర్వమును వదలి మిమ్ములను అనుసరిస్తున్నారో, నన్ను కూడా అలానే మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా ! ఈ శిష్యులు మీములను అనుసరించడానికి తమ వారిని , వారికు ఉన్నదానిని, మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడ్డారు. కాని మిమ్ములను అనుసరించడానికి నేను ఈ శిష్యుల వలె ఏమి వదులుకోలేదు. నాకు ఉన్న ఈ లోక ఆశలు, కోరికలు, సంపదలు ఇవి అన్ని కూడా ఆటంకంగా ఉన్నవి. వీటిని వదులు కోవడానికి చాలా పర్యాయాలు నేను ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేక పోయాను. ప్రభువా ! నాకు పూర్తిగా మిమ్ములను అనుసరించాలి అనే కోరిక  ఉన్నది, కాని నాలో ఉన్న ఇతర కోరికలు నన్ను మిమ్ములను అనుసరించుటకు సన్నద్ధం కానివ్వటం లేదు. వీటి మీద నేను విజయం సాధించేలా నాకు మీ అనుగ్రహాలు మీ పునీతులకు ఇచ్చినట్లు ఇవ్వండి తద్వారాఅప్పుడైన  నేను మిమ్ము పూర్తిగా అనుసరించగలేనేమో. ప్రభువా మీరు ఈ శిష్యులను పిలిచినట్లు నన్ను కూడా ఒకసారి పిలవండి. నన్నును మీ సేవకునిగా, అనుచరునిగా చేయండి. ప్రభువా! మీ శిష్యులు వారికి జీవనోఫాది పోయిన , బంధువర్గాలు పోయిన మీరు మాత్రమే చాలు అనుకున్నారు. నేను కూడా ఆలా జీవించేలా చేయండి. ఆమెన్ 

లూకా 21:29-33

 లూకా 21:29-33 

అయన వారికి ఒక ఉపమానమును చెప్పెను: "అంజూరపు వృక్షము, తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినపుడు, వసంతకాలం సమీపించినదని తెలిసికొందురు. అట్లే ఇవిఅన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు. 

ధ్యానం : యేసు ప్రభుని మాటలు చాల స్పష్టముగా ఈ లోకము గురించి చెబుతున్నారు. చెట్లు కొత్త చిగురును తొడుగుకినునపుడు వసంతకాలం అని అందరికి తెలుసు. వాతావరణమార్పులను బట్టి మనము కాలాలను గుర్తిస్తాము. యేసు ప్రభువు మనలను ఏవిధముగా మనం వీటిని తెలుసుకుంటున్నామో అదేవిధముగా యేసు ప్రభువు చెప్పిన విషయాలు జరుగినపుడు దేవుని రాజ్యము సమీపించినది అని తెలుసుకోమని తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు చెబుతున్న విషయాలు ఏమిటి అంటే భూకంపాలు, ఒక రాజ్యం మీద మరియొక రాజ్యం దండెత్తటము, అశాంతి మరియు హింసలు మొదలయినవి జరుగుతాయి అని చెబుతున్నారు. ఇవి అన్ని జరిగిన తరువాత యేసు ప్రభువు అక్కడ శాంతి నీలకోల్పబడే ఒక సందర్భం గురించే తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు ఇక్కడ వసంత కాలం గురించి చెబుతున్నారు వేరే కాలం గురించి మాట్లాడలేదు. వసంత కాలం క్రొత్త జీవితానికి నాంది. అక్కడ ఒక నూతన జీవితం వస్తుంది.  ఆకు రాలిన కాలం తరువాత క్రొత్త చిగురు వచ్చినట్లుగానే ప్రజలు ఇన్ని ఇబ్బందులు అనుభవించిన తరువాత శాంతియుతమైన కాలం ఉంటుంది అదే దైవ రాజ్యం. అందుకే యేసు ప్రభువు దైవ రాజ్యం సమీపమునే ఉన్నది అని తెలుసుకొనుడు అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు దైవ రాజ్యం గురించి ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. యేసు ప్రభువు ప్రేషిత కార్యం  దైవ రాజ్య స్థాపన ప్రధాన అంశంగా మొదలైనది.  దైవ రాజ్యం అనేది పాత నిబంధనలో మనము చూసే ప్రభుని రోజు ,  కొన్ని సందర్భాలలో తీర్పు తీర్చే రోజుగా వర్ణించబడింది. అది మానిషి చేసిన తప్పులకు విధించే శిక్షలా చూసారు. కాని యేసు ప్రభువు ఇక్కడ ప్రకటించే దైవ రాజ్యం ఒక శుభసూచకం. ఇది అందరు సంతోషించే రోజు. యేసు ప్రభువు తన ప్రేషిత కార్యం మొదలు  పెడుతూ ప్రకటించిన విషయం ప్రభుహిత సంవత్సరం. ఇది దైవ రాజ్యంలో భాగమే.  ఇది గ్రుడ్డివారికి చూపును, కుంటివారికి నడకను, చెరసాలలో ఉన్నవారికి విడుదలను తెలియజేస్తుంది. ఇది ఈ లోకంలో మనం చేసే అన్ని చెడు విషయాలు, సంఘటనలు, అశాంతి, వైకల్యం, కరువు, ఆకలి, పీడనం, లేమి, లోభితనం  ఇటువంటివి ఏమి లేని ఒక రాజ్యం. యేసు ప్రభువు దీనికి ముందుగా చెప్పిన అన్ని సంఘటనలు, అశాంతి , అనారోగ్యం , భూకంపాలు, యుద్దాలు, హింసలు వీటి అన్నింటికీ ఇది ఒక సమాధానము చూపుతుంది. యేసు ప్రభువు దైవరాజ్యం సమీపమునే ఉన్నది అని చెబుతున్నప్పుడు, ప్రజలకు ఇది నిజమైన ఓదార్పు ఇస్తుంది. 

మనకు ఇక్కడ వచ్చే ఒక అనుమానం ఇవి నిజముగా జరుగుతాయా? ఇది కేవలం ఒక ఊహాజనితమైన ఒక ఆలోచనగా మిగిలిపోతుందా!ఈ విషయం గురించి యేసు ప్రభువు మనకు ఒక అభయం ఇస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు ఇచ్చే అభయం కేవలం అహింసలు, భయంకరమైన పకృతి వైపరీత్యాలు గురించి మాత్రమే కాదు. దైవ రాజ్యం గురించి కూడా కనుక దైవ రాజ్యం గురించి యేసు ప్రభువే చెబుతున్నారు కనుక మనం దాని గురించి నిశ్చింతగా ఉండవచ్చు. "ఇవిఅన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు." ఇది ఎప్పుడు జరిగిన మనం సిద్ధంగా ఉండాలి. ఇది మనము బ్రతికి ఉండగా జరుగవచ్చు లేక మనం మరణించిన తరువాత జరుగవచ్చు. కాని తప్పక జరుగును అని తెలుస్తుంది. 

దైవ రాజ్యం  మూడు విధాలుగా ఉంటుంది అని దైవశాస్త్ర పండితులు చెబుతారు అవి ఏమిటంటే 1. మంచి జీవితం , దైవ ప్రణాళిక ప్రకారం జీవించి, దైవ సంకల్పానికి తమ జీవితనాలు అర్పించిన వారు దైవ సాన్నిద్ధ్యాన్ని వారి జీవితంలో అనుభవించారు. అది దైవ రాజ్యం అనుభవించడమే. 

2. ఇప్పుడు ఇక్కడ అనుభవించే దైవారాజ్యం. ఇది కూడా దైవ రాజ్యంలో ఒక భాగం. మంచి పనులు చేస్తూ, దేవుని ప్రణాళిక ప్రకారం జీవిస్తూ  దైవ సాన్నిధ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నవారు. 

3. మనం మరణించిన తరువాత దేవుని ముఖాముఖిగా చూస్తూ దేవుని రాజ్యంను  పూర్తిగా అనుభవించుట. ఇవి మూడు, మూడు రకాలు కాదు కానీ దైవ రాజ్యంను సంపూర్ణంగా  అనుభవించేది  మాత్రం మరణించిన తరువాతనే. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా ఈ లోకంలో దైవ రాజ్యం స్థాపించబడాలని మీరు ఎంతగానో  కాంక్షించారు. మీతో ఉండుటనే దైవ రాజ్యం పొందుట అని మీ శిష్యుల ద్వారా తెలుసుకుంటున్నాము. మీరు ఉన్న చోట అనారోగ్యంతో ఉన్నవారు, ఆరోగ్యవంతులవుతున్నారు. సమస్యలతో ఉన్నవారు బయటపడుతున్నారు. వైకల్యం ఉన్న వారు పరిపూర్ణత పొందుతున్నారు. ఏమి తెలియని వారు జ్ఞానవంతులు అవుతున్నారు. మీతో ఉంటె ఎంత గొప్పగా మా జీవితాలు మారుతాయో నేర్పించారు. ప్రభువా నాకు మీతో ఉండాలని ఉన్నది. ఆ దైవారాజ్యం అనుభవించాలని ఉన్నది. నేను కూడా మీ సంకల్పాన్ని నెరవేరుస్తూ, నాలో ఉన్న లోపాలను తొలగించుకుంటూ , మీ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ , దైవ రాజ్యాన్ని అనుభవించే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

లూకా 21:34-36

 లూకా 21:34-36 

"తుఛ్చ విషయాసక్తితోను, త్రాగుడుతోను, చీకుచింతలతోను మీరు మందమతులు గాక, అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చిపడును. ఏలయన, ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటలనుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని  పొందుటకును ఎల్లప్పుడు జాగరూకులై ప్రార్ధన చేయుడు." 

ధ్యానం : యేసు ప్రభువు తన శిష్యులకు పాస్కా పండుగకు ముందుగా ఈ మాటలను చెబుతున్నారు. ఒకరకముగా యేసు ప్రభువు తన  చివర సందేశము ఇక్కడ బోధిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు చాలా ముఖ్యమైన విషయాలు గురించి చెబుతున్నారు. శిష్యులను మందమతులు కాకుండా ఉండమని చెబుతున్నారు. ఎందుకు మందమతులు అవుతారు ? మంద మతులు కావడానికి అనేకకారణాలు ఉండవచ్చు. కాని యేసు ప్రభువు ,మనకై మనము మందమతులు కాకుడదు అని చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆథ్యాత్మికంగా  తనకు  తాను ఎలా మందమతుడు అవుతాడు  అంటే ఈ మూడు విషయాలతో  చెబుతున్నారు.   తుచ్చ విషయాసక్తితో, త్రాగుడుతో, చీకుచింతలతో మందమతులు అవవద్దు అని యేసు ప్రభువు చెబుతున్నారు. తుచ్ఛవిషయాసక్తి అంటే ఏమిటి ? తుచ్ఛవిషయములు ఏమిటి? ఎటువంటి తుచ్ఛమైన విషయాల యందు మనము ఆసక్తి కలిగి ఉన్నాము, ఐహిక విషయాలు గురించి మనము ఎక్కువగా ఆలోచిస్తూ , ఇహలోకనికి సంభందించిన విషయములకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి , ప్రభువునకు సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా మందమతులు అవుతున్నాము. అవివేకులుగా మిగిలిపోతున్నాము.  

రెండవ విషయము  త్రాగుడుతో మందమతులు కావద్దు అని ప్రభువు చెబుతున్నారు. త్రాగుడుతో మందమతులు అయినటువంటి వారు మన చుట్టుప్రక్కల కూడా  అనేక మంది ఉన్నారు. వీరు మత్తుకు బానిసలుగా మారి , వారి జీవితాల్లో ఏమి చేయలేక పోతున్నారు. వారు బ్రతికి ఉండగా కూడా వారిని, వారి కుటుంబాలే లెక్క  చేయని సంధర్భాలు మనకు కనబడుతూనే ఉంటాయి. మూడవ విషయం చీకు చింతలతో మనం మందమతులు కాకూడదు. ఏమి చీకు చింతలు మనకు ఉంటాయి. యేసు ప్రభువు ఏమి తినుదుమా , త్రాగుదామా అని చింతించకుడు అని చెబుతున్నారు.   అందుకే యేసు ప్రభువు అంటున్నారు. ఆకాశ పక్షులను చూడుడు అవి విత్తవు కోయవు , దాచుకోవు. మనము మాత్రమే వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. లోక సంపద మొత్తం మనకే కావలి అన్నట్లు జ్,  ఇక  ఎవరికి చెందకూడదు అనే విధముగా జీవిస్తుంటాము. పవిత్ర గ్రంధంలో అనేక మంది మనకు వారి జీవితాలలో  ఇటువంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చి నిజమైన జ్ఞానాన్ని, ప్రభువుతో కలిసి ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.   అభిమాలేకు, సౌలు , యరొబాము , ఎలి కుమారులు , నాబాలు ,మీకాలు , అననీయా, సఫీరా పరిసయ్యులు , మొదలగు వారు ఇంకా ఎక్కువ మంది ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చి దేవుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహాలను పోగొట్టుకున్నారు. ప్రభువు ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకోలేక పోయారు. 

ప్రభువు ఎందుకు ఈ విషయములను గురించి చెబుతున్నారు అంటే  ఆయన శిష్యులు ఎల్లప్పుడు అప్రమత్తముగా ఉండాలి అనిచెబుతున్నారు. అప్రమత్తత ఎందుకు అవసరము అంటే? ప్రభువు వచ్చిన రోజున మెలకువతో ఉండి ఆ ప్రభువుతో వెళ్ళుటకు. ఐదుగురు  అవివేకవతులైన  స్త్రీలు ఆయన వచ్చిన సమయంలో అక్కడలేక, ప్రభువుతో వెళ్లే అవకాశము పోగొట్టుకున్నారు. మనము ఈలోక  విషయాల్లో నిమగ్నమై ఉంటె, మనము కూడా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటాము. 

మీరు రానున్న సంఘటలనుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని  పొందుటకును ఎల్లప్పుడు జాగరూకులై ప్రార్ధన చేయుడు.  యేసు ప్రభువు తన శిష్యులు అందరు రక్షింపబడాలి అని కోరుకుంటున్నారు. ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి పోవుటకు అనర్హులుగా ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ప్రభువు వచ్చినపుడు మనం అందరము మెలుకువ కలిగి ఉండటం ఎంతో అవసరం. ఈ మెలుకువ ఎందుకు అంటే ఆ రోజు ఎప్పుడు వస్తున్నది ఎవరికీ తెలియదు అందుకే మెలుకువగా ఉన్నపుడు మాత్రమే మనం ఆ రోజుకు సిద్ధముగా ఉంటాము. యేసు ప్రభువు చెబుతున్న తుచ్ఛవిషయాసక్తి , త్రాగుడు మరియు చీకుచింతలు మనలను పూర్తిగా సన్నద్ధం కనివ్వవు. అందుకే ముందు మనము వీటి నుండి బయట పడాలి. ఈ మూడు విషయాలకు మనం బానిసలుగా ఉండకూడదు. అపుడు మనము యేసు ప్రభువు ప్రక్కన ఉండుటకు అర్హులము అవుతాము. 

ఈ జాగురుకుతతో పాటు యేసు ప్రభువు మనలను ప్రార్ధన చేయమని చెబుతున్నారు. ప్రార్ధన మనలను దైవ చింతనలో ఎల్లప్పుడూ ఉండేలా చేస్తుంది. ప్రార్ధించే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే అతడు అప్రమత్తముగా ఉంటాడు. ఈ విధంగా జీవించినప్పుడు ప్రభువే  అయన వచ్చే రోజున ఆయనతో  ఉండుటకు కావలసిన శక్తిని దయచేస్తాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా ! మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నపుడు కూడా మీ శిష్యులు అప్పుడు మీతో పాటు ఉండుటకు , మరియు వారు మందమతులు కాకుండా ఈలోకవిషయాలలో నిమగ్నమై మీ జీవితంలో ముఖ్యమైన వాటిని మర్చిపోకుండా వారి రక్షణ పోగొట్టుకోకుండాఉండటానికి కావలసిన వాటిని ముందుగానే తెలియజేస్తున్నారు. ప్రభువా మీకు ఎంత కృతజ్ఞతలు తెలియజేసిన అది తక్కువే అవుతుంది. ఎందుకంటే మీరు మా రక్షణ గురించి అంత శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభువా నేను మాత్రం ఎప్పుడు ఈ లోకంలోని తుచ్చమైన వాటి మీదనే నా మనసును ఉంచి మీకు దూరంగా ఉన్నాను. నేను ఏమి చేయలేకున్నా , తినడం త్రాగడం గురించి ఎక్కువ సమయమిచ్చి మిమ్ములను అశ్రద్ధ చేసాను. ఇటువంటి సమయాలలో నన్ను క్షమించండి. నేను మిమ్ములనే కాంక్షిస్తూ , మీతో ఉండుటనే కోరుకునే మనసును దయచేయండి. ప్రభువా ! నేను ఎల్లపుడు అప్రమత్తముగా ఉండి, మీరు వచ్చే సమయానికి వివేకవంతులైన స్త్రీల వలె సంసిద్ధంగా ఉండే శక్తిని ఇవ్వండి. ఆమెన్ 


ఆగమన కాలపు మొదటి ఆదివారం

 ఆగమన కాలపు మొదటి ఆదివారం 

మార్కు 13:33-37 

ఆ సమయము ఎపుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనము వెళ్లుచు, తన సేవకులను, ఆయాకార్యములందు నియమించి, మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సంధ్యాసమయముననో, అర్ధరాత్రముననో, కోడికూయు వేళనో , ప్రాత:కాలముననో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు. ఒక వేళ అతడూ అకస్మాత్తుగా వచ్చి మీరు నిదురించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పునే అందరికి చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు. 

పునీత సిలువ  యోహను గారు, "మరియమాత దైవ వాక్కును మోసుకుంటూ   ప్రయాణిస్తుంది. ఆమెను మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నవా? అని అడుగుతారు?" ఈ ఆగమాన కాలంలో మనలో ఉండవలసిన ఒక ఆలోచన ఇదే. నేను యేసు ప్రభువును నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్ననా ? లేదా? ఒక వేళ నేను ఆహ్వానించినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉండాలి అని ఈనాటి సువిశేషం చెబుతుంది. 

ఈనాటి సువిశేషంలో మనకు ముఖ్యమైన మాటలుగా స్పురించే, జాగరుకులై యుండుడు, మేల్కొని యుండుడు, సిద్ధముగా ఉండుడు అనే మూడు మాటలను   ప్రత్యేకంగా ధ్యానించాలి. ఎందుకు జాగరుకులై ఉండాలి? దేనికి మేలుకొని ఉండాలి? ఎవరి కోసం మనం సిద్ధంగా ఉండాలి. జాగరుకులై ఎందుకు ఉండాలి అంటే మన దగ్గరకు వచ్చేది  స్వయంగా దేవుని కుమారుడు. ఆయన కోసం మనం చూడకపోతే ఆయన తన దారిన తాను వెళ్ళిపోతాడు. దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడు అలానే ఉంటుంది. యేసు ప్రభువు తన బోధనలో కూడా ఈ విషయం వెల్లడి చేస్తున్నారు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మిమ్ము ఆహ్వానించకపోయినచో మీరు మీ కాలి దూలిని అక్కడనె విదిల్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఆయన నీ దగ్గరకు వస్తారు, నీ తలుపు తట్టుచున్నాడు. ఖచ్ఛితముగా నీవు జాగరూకత కలిగి ఉంటేనే ఆయనను ఆహ్వానించగలవు. 

 ఎవరి కోసం మనం ఎదురుచూస్తున్నాము.  నీవు క్రీస్తు కోసము ఎదురు చూసినటులయితే నీవు ఎటువంటి జీవితం జీవించాలి అని మనం ఆలోచించాలి. నీవు ఎల్లప్పుడు సిద్దముగా ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ఆయన ఏ ఘడియలో వచ్చునో నీకు తెలియదు కనుక ఎల్లప్పుడు సిద్ధముగానే ఉండాలి.  ఎవరు ఈయన నీవు ఎదురు చూడటానికి ? ఈయన రక్షకుడు, రాజు, ప్రభువు, దేవుడు నీ నిజ స్థితిని తెలియజేసేవాడు. నిన్ను మరల ఈ నిజ స్థితిని కలిగి జీవించేలా చేసేవాడు.  కనుక నీవు ఎదురు చూడాలి. ఆయన అవసరం అవసరం నీకు  ఉంది కనుక ఎదురు చూడాలి. నీవు నిజముగా రక్షణ పొందాలి అని కోరుకున్నట్లయితే నీవు ఎదురు చూడాలి.  నీ జీవితములో ఆయన లేకుంటే  జీవితం పరిపూర్ణం కాదు. ఆయన నీతో ఉన్నట్లయితే నీ జీవితం  పరిపూర్ణత సంతరించుకుంటుంది.   

 ప్రతి సంవత్సరం ఆగమనకాలం వస్తుంది. కాని నిజానికి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాదారణ ప్రక్రియ కాదు. ప్రతి సారి  దీనికి ఒక గొప్ప అర్ధం వుంది, ప్రతి ఆగమానం మనలను యేసు ప్రభువును ఆహ్వానించడానికి, స్వీకరించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎల్లప్పుడు  ఆయనతో ఉండటానికి అది ఉపయోగ పడుతుంది. అది మన జీవితాన్ని ప్రతి నిత్యం మార్చుకుంటూ ఉండటానికి ఉపయోగ పడుతుంది.  

దేవుని రాకడ లేక ఆగమానం  - ఆయన మరల వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాము.  ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాదు,  ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభువును నీ జీవితం లోనికి ఆహ్వానించాలి. ఆయన నిన్ను ఆహ్వానించాలి అని అనుకోకూడదు. మన కోసం తన మొత్తాన్ని వదులుకొని మనతో ఉండాలి అని మన దగ్గరకు వస్తున్నారు.  దేవుడు తీసుకొచ్చే సంతోషం: ఆగమనకాలం ఏదో బాధలతోనో లేక ప్రాయశ్చితంతోనో గడిపేది కాదు, ఇది ఆనందించే సమయం ఎందుకంటే మన దగ్గరకు రాబోతున్నది స్వయానా దేవుడే. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అది కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయనతో నడవడం అని మనం గ్రహిస్తాం.  

  తీరు సభ మొదటి నుండి కూడా ఆగమన కాలం జరుపుకోలేదు. ఇది నాలుగవ శతాబ్ధం నుండి మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మీరు ఈ పండుగ పూర్వాపరాలు గురించి విని వుంటారు. కాని యూదయ పండుగలలో హనుక్క అనే పండుగ వస్తుంది. అది కిస్లేం అనె నెల 25 వ రోజున వస్తుంది, క్రిస్టమస్ కూడా డిసంబర్ 25 న వస్తుంది. ఏమిటి ఈ హనుక్క పండుగ అంటే అది యెరుషలేము దేవాలమును అంటియొకస్ ఎఫిఫనుస్ ద్వంసం చేసిన తరువాత,  మక్కబియుల గ్రంధంలో  వారు మరల దానిని కట్టి దేవునికి పునఃరంకితం చేసిన రోజునే హనుక్క అనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎనిమిది రోజుల ముందు నుండి సిద్ధపడుతూ ప్రతి రోజు ఎనిమిది రోజులు కూడా ఒక్కో క్రొవత్తిని వెలిగించేవారు. ఇక్కడ ఆగమన కాలంలో మనం ప్రతి వారం, వారానికి ఒక క్రొవత్తిని వెలిగించే దానికి మూలం. ఇక్కడ నుండే వస్తుంది. ఇది ఒక రకముగా మనం సిద్ధ పడటం. లేక పునఃరంకితం చేసుకోవడం. మన జీవితం చెడు మార్గమున ఉండి ఉండవచ్చు, లేక మనం పాడుచేసుకొని ఉండవచ్చు అయిన కాని దానిని మరల దేవునికి పునఃరకితం చేయవచ్చు అని అది తెలుపుతుంది హనుక్క అనే పండుగ. ఈ ఆగమానకాలం మరియు క్రిస్మస్ దీన్ని పరిపూర్తి చేస్తుంది. 

ఆగమన కాలం ఆనందించే కాలం, ఇది దేవుడు మన వద్దకు వచ్చే రోజును  తెలుసుకొని దానికి ఆనందంతో ఎదురు చూసేకాలం. ఈ సిద్దపాటు కూడా మనము ఎవరము? మనము ఎవరి వలె ఉండటానికి పిలవబడ్డాము అని తెలుసుకొనుటకు మరియు మరల దేవుని అలయముగా మారిపోవుటకు, మనము ఈ ఆగమన కాలాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానించుకోవాలి. '

 యేసు ప్రభువు ప్రధమ ఆగమమున దిన మానవ రూపం ధరించి తండ్రి ప్రణాళికా నెరవేర్చి  నిత్య రక్షణ ద్వారము మరల  తెరిచారు. ఆయన మరల వచ్చినప్పుడు ఆయన  వాగ్ధానం చేసిన రక్షణ బాహుమనం మనం పొందుతాము అనే ఆశతో , మేలుకువతో ఉత్సాహముతో నిరీక్షించించె మనం ఆయన అపారమైన  ప్రేమను పొందుటకు ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి. 

 క్రీస్తు ప్రభువు తన జనమునకు సిద్ధ పడుచున్న  మనలను ఆనందంతో నింపుతున్నాడు.  అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మనం, మెళుకువ కలిగి ప్రార్ధించుటలోను అతని స్తుతులను పాడుటలోనూ నిమజ్ఞులమై యేసు ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి.  అంటే మనం  దేవుని వాక్కు అవతరంగా  మారిపోగలగాలి.

లూకా 10:21-24

  లూకా 10:21-24

ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు  నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి  నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మారెవ్వరును   తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికీ ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవినగొరిరి, కాని  వినజాలకపోయిరి" అని పలికెను.  

ధ్యానం: యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో తండ్రికి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నారు. యేసు  ప్రభువు కృతజ్ఞతలు తెలియజేయడానికి గల  కారణం ఏమిట అంటే? ఆధ్యాత్మిక విషయాలు  దైవ రాజ్యం  కేవలం తెలివిగలవారికో, జ్ఞానులకో, పండితులకొ  కాకుండా చిన్న పిల్లలకు , సాధారణ ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకు తండ్రికి, ప్రభువు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యూదయా మత నాయకులు కాని, ఈ లోకంలోని ఆధ్యాత్మిక వేత్తలుకాని  దేవుడు వారి సొత్తు అన్నట్లు మాటలాడటం సర్వసాధారణం. కాని యేసు ప్రభువు,  దేవున్ని, దైవ జ్ఞానాన్ని   సాధారణ మనుషులకు తెలియజేస్తున్నారు. అందుకె యేసు ప్రభువు  దైవ జ్ఞానాన్ని అందరికి పంచి దేవునికి ప్రతి వ్యక్తి ముఖ్యమే అని తెలియజేస్తున్నాడు. 

ఈ విషయాల యేసు ప్రభువు పుట్టుకలో కూడా  జరుగుతున్నాయి. యేసు ప్రభువుని జననం మొదటిగా తెలుసుకున్నది గొర్రెల కాపరులు, ఎవరు ఈ గొర్రెల కాపరులు అంటే వీరు ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంకు గొర్రెలను మేపుకుంటూ , పొలాలలోనే తిరుగుతూ ఉండే ప్రజలు. సహజంగా ఊరికి చివర పొలాల్లో ఉండేవారు. వీరిని దొంగలుగా భావించి ఎటువంటి శుభకార్యములకు ప్రజలు వీరిని పిలిచేవారు కాదు. ఇటువంటి వారికి రక్షకుని జనన విషయము మొదటిగా తెలియయజేయడం జరిగినది. యేసు ప్రభువు శిష్యులు కూడా ఎవరు పండితులు కాదు. సాధారణం వ్యక్తులు, జాలరులు, సుంకరులు. ఇటువంటి సాధారణ వ్యక్తులను యేసు ప్రభువు తన శిష్యులుగా ఎన్నుకుంటున్నారు. ప్రభువుతో కలిసి జీవించే అవకాశం ఇటువంటి సాధారణ వ్యక్తులకు ఇవ్వడము దైవ జ్ఞానాన్ని పామరులకు ఇవ్వడం ఇవ్వన్నీ కూడా మనకు ఇవ్వబడ్డ గొప్ప వరాలే.  ఎవరు కూడా ఇది కేవలం పండితులు మాత్రమే పొందుతారు అని అనుకొనవసరం లేదు. 

యేసు ప్రభువు తండ్రి గురించి తెలియపరచిన తరువాత మనం ఎవరుకూడా పరిసయ్యుల వలె దైవ జ్ఞానం, లేక దైవ రాజ్యం , ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం మనకు మాత్రమే ఉంటుంది. ఇతరులు దానిని పొందలేరు అనే గర్వం, అజ్ఞానం ఉండకూడదు అని తెలుసుకోవాలి. యేసు ప్రభువుతో కలిసి జీవించే గొప్ప అనుభూతి శిష్యులకు, చిన్న పిల్లకు ప్రభువు ఇస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఇవి అన్ని సాధారణ ప్రజలకు తెలియజేయడం తండ్రి సంకల్పం అని  ప్రభువు తెలియ జేస్తున్నాడు. ఇది తండ్రి సంకల్పం అయితే తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్ధమవుతుంది. 

నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ మాట మరియొక చోట కూడా ప్రభువు చెబుతున్నారు. తండ్రి సమస్తం ఆయన కోసమే చేశాడు, ఆయనకే సమస్తాన్ని  అప్పగించి యున్నాడు. సమస్తము మీద ప్రభువుకే అధికారము కలదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, కుమారుడికి మాత్రమే తండ్రి తెలుసు మరియు తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు. తండ్రి గురించి మనకు అనేక మంది చెప్పారు కాని వాస్తవంగా ఈ లోకంలో ఎవరికి పూర్తిగా తెలియదు. అనేక మంది తండ్రి గురించి చెప్పారు. వారిలో ప్రవక్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాని ఎవరు కూడా తండ్రిని పూర్తిగా ఎరుకపరుచలేదు. యేసు ప్రభువు మాత్రమే తండ్రిని, ఆయన యొక్క ప్రేమను, కరుణను, తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రిని అందరికీ తెలియజేస్తున్నాడు. లోక మత పెద్దలు వలె కేవలం కొద్ది మందికి మాత్రమే దైవజ్ఞానం అని కొంతమందిని వేరుచేయడం లేదు. యేసు ప్రభువు శిష్యులకు వారు అనుభవిస్తున్న గొప్ప భాగ్యం గురించి తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అంటే ప్రవక్తలు, రాజులు అనేక గొప్ప వ్యక్తులు క్రీస్తును చూడాలి అని అనుకున్నారు, కాని శిష్యులకు మాత్రమే ఇది ఇవ్వబడింది.   అదేవిధంగా తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు అందుకే తండ్రి , యేసు ప్రభువును గురించి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను సంతసించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అంతేకాక ఈయన చెప్పినట్లు చేయుడు అని చెబుతున్నాడు. ఆదే  విధంగా  కుమారుని జననం గురించి కూడా తండ్రి తన దేవదూతల ద్వారా తెలియజేస్తున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు దైవ జ్ఞానాన్ని సాధారణమైన వ్యక్తులకు తెలియజేయటను మీరు ఎంతగానో ఆనందించారు. మీరు ఈవిషయమై  పవిత్రాత్మ యందు కూడా ఆనందిస్తున్నారు. మాకు దైవ జ్ఞానాన్ని  ఇచ్చి , మా మీద ఉన్న ప్రేమతో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభువా! మీరు తండ్రిని మాకు అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రభువా ఎవరికి తెలియని విషయాలు ,గొప్ప వారు అందరు తెలుసుకోవాలనుకున్న విషయాలు మాకు తెలియ పరస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి గురించి మాకు తెలియజేయడం తండ్రి అభీష్టం అని తెలియజేస్తున్నారు,  అందుకు కృతజ్ఞతలు. ప్రభువా ,మీ అనుచరులుగా ఉన్న మేము, ఎప్పుడు కూడా  మీ గురించి మాకే తెలుసు ఇతరులకు తెలియదు, తెలియకూడదు అనే గర్వం మాలో ఉండకుండా మమ్ములను శుద్దిచెయ్యండి. ప్రభువా! అందరికీ దైవ జ్ఞానం ఉండాలనే కోరిక మీ వలె మేము కూడా ఉండేలా చేయండి. ప్రభువా ఎల్లప్పుడు మేము మీతో ఉండే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

మత్తయి 15:29-37

 మత్తయి 15:29-37

యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి  ఎక్కి కూర్చుండెను. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగగును అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థ పరచెను. అపుడు మూగవారు మాటాడుటయు, వికలాంగులు అంగపుష్టి  పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయమొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, "ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. అపుడు శిష్యులు, "ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి. కొనిరాగలము?" అని పలికిరి. అంతట యేసు "మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?" అని వారిని అడిగెను. "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి" అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జనసమూహమునకు పంచి పెట్టిరి. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండ ఎత్తిరి. 

ధ్యానం: యేసు ప్రభువు గలిలీయా ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన అంతకు ముందు కననీయ స్త్రీ విశ్వాసము గురించి చెప్పి ఆమె కుమార్తెను కాపాడాడు. అది చూసిన ప్రజలు, యేసు ప్రభువు అద్భుతాల గురించి తెలిసిన ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు అక్కడ నుండి గలిలీయా ప్రాంతానికి వచ్చి, అక్కడ  కొండను ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన మాటలను విన్నవారు అందరు ఆయనను వెంబడిస్తున్నారు. అద్భుతాలు చూసిన వారు అనేక మందిని గ్రుడ్డివారిని , కుంటివారిని, మూగవారిని, వికలాంగులను తీసుకొని వస్తున్నారు. ఎందుకు వారందరిని తీసుకొని వస్తున్నారు? వీరు అందరిని తీసుకొనిరావడానికి గల కారణం ఏమిటి అంటే వారు అందరు స్వస్థత పొందాలని, యేసు ప్రభువుని శక్తి తెలుసుకొని వారు ఆయన ద్వారా స్వస్థత పొంది మంచి జీవితం వారు పొందాలని, వారిని తీసుకొని వస్తున్నారు. కేవలం యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొందాలని మాత్రమే కాదు, ఆయన మాటలను వినాలని వారు అందరు వస్తున్నారు. ఆయన చేసే అధ్భుతాలు మాత్రమే కాక ఆయన మాటలు జీవమైన మాటలు, అంతకు ముందు వారు ఇటువంటి జీవమైన మాటలు  వినలేదు. శిష్యులు , యేసు ప్రభువు మాటలు వినిన వారు, అధ్బుతాలు చూసిన వారు,  మిగినలిన వారందరు అక్కడకు రావడానికి ఉపయోగపడ్డారు. మనం కూడా ఆయన అనుచరులుగా కష్టాలు, బాధలలో ఉన్నవారిని, రోగులను, జీవవాక్కు అవసరంలో ఉన్నవారిని ప్రభువు ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. అది వారు బాగుపడుటకు, పరిపూర్ణులు అవుటకు ఉపయోగపడుతుంది. 

వారి అందరిని ప్రభువు స్వస్థ పరిచారు. యేసు ప్రభువు అక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నారు. ఇక్కడ స్వస్థ పరచడం అంటే వారిలో ఉన్న లోపాలను తీసువేసి వారిని  పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఆయన అనుగ్రహం పొంది వెళుతున్నారు అంటే, అతను పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నారు అని మనకు అర్ధం అవుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలను చూస్తున్న, యిస్రాయేలు ప్రజలు దేవున్ని స్తుతిస్తున్నారు. ఇది కేవలం అప్పటి ప్రజలు మాత్రమే కాదు, యేసు ప్రభువును నమ్మిన వ్యక్తులు జీవించే జీవితవిధానం కూడా, ఇతరులను  దేవున్ని స్తుతించేలా చేస్తుంది. అపోస్తులుల కార్యాలలో ఇది మనం చూస్తాము. అంతే కాదు ఇది  క్రీస్తు ప్రభువు అనుచరుల జీవిత విధానం, వీరి ప్రార్ధన ద్వారా ఇతరులు పొందే స్వస్థత కూడా మిగిలినవారు  దేవున్ని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. అది చేయవలసిన బాధ్యత ప్రభువు అనుచరులుగా మన మీద ఉన్నది. 

"ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. యేసు ప్రభువు మన ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు, ఆయన మానవుల  భౌతిక అవసరాలను గురించి  కూడా ఎంతగానో శ్రద్ద కలిగి ఉంటారు. యేసు ప్రభువు అంతమందిని స్వస్థ పరచడం ఇది మనకు తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు అందరు మూడు రోజుల నుండి ఉన్నారు. వారు ఏమి తినలేదు. ఒకవేళ వారు అక్కడ నుండి వెళితే, మార్గ మధ్యలో శక్తిలేక పడి పోతారు ఏమో అని ప్రభువే వారికి భోజన వసతిని కలిపిస్తున్నారు. వారిని అలా పంపించి వేయడం ప్రభువుకు ఇష్టం లేదు అంటే మనం లేమితో ఉండాలి అని ప్రభువు కోరుకోవడం లేదు. ప్రభువునకు మనం అంటే చాలా ఇష్టం అందుకే మానవునికి సంభందించిన ప్రతి చిన్న విషయమును కూడా ప్రభువు అంత శ్రద్ద తీసుకుంటున్నారు. మన తల్లి, తండ్రి వలె ప్రభువు మనలను చూస్తున్నారు. 

అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను చేపలను తీసుకొని దేవునికి అర్పించి వాటిని అందరికీ పంచుతున్నారు. ఇక్కడ మనం చూసే ఈ అధ్భుతం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. మన దగ్గర ఉన్నది అందరం పంచుకుంటే, దేవుని దీవెన అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరికి కోదువ ఉండదు.మరియు ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. యేసు ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యమును, మొదటి క్రైస్తవ సంఘము అవలంభించినది. వారి వద్ద ఉన్నదానిని వారు తీసుకొన వచ్చి, పంచుకొని బ్రతికారు, అందరికీ సమృద్దిగా లభించినది. ఎవరికి తక్కువ కాలేదు. ఇది మనం ప్రభువు వద్ద నుండి నేర్చుకోవాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ఓ ప్రభువా! మీరు ఎంత ఉన్నతులు. అనేక మందిని వారికి ఉన్న వైకల్యం నుండి బయటకు తీసుకువచ్చి వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తున్నారు. వారిలో ఏ లోపం లేకుండా వారిని అందమైన దేవుని సృష్టిగా చేస్తున్నారు. మీ ఓర్పుకు, అనేక రకాలైన లోపాలతో బాధ పడేవారిని, పరిపూర్ణ వ్యక్తులుగా చేసిన మీ మంచి హృదయానికి కృతజ్ఞలు తెలుపుతున్నాను ప్రభువా. ప్రభువా! నాలో  కూడా అనేక లోపాలు ఉన్నవి, అవి మిమ్ములను చూచుటకు, మీ మాటలను వినిపాటించుటకు ఆటంకముగా ఉన్నవి, నాలో ఉన్న ఆ లోపాలను తీసివేయండి. నన్ను కూడా పరిపూర్ణమైన  వ్యక్తిగా మార్చుము. అలానే నేను కూడా మీ వద్దకు ఇతరులను తీసుకువచ్చేలా , ముందు నన్ను మీ నిజమైన అనుచరుడను చేయండి.  ప్రభువా! మీకు ప్రజలు పస్తులు ఉండి మీ వద్ద నుండి వెళ్ళడం ఇష్టం లేక వారికి కావలసిన అహరం ఇవ్వడానికి మీరు సిద్దపడ్డారు. వారికి కావలసిన అహరం వారికి ఇచ్చారు. ప్రభువా! నా జీవితంలో అనేక విషయాలలో మిమ్ములను నమ్మి మీ మాటలను వినాలని,  మీతో ఎప్పుడు ఉండాలని కోరికతో ఉన్నాను. ఆ ప్రజల ఆకలి తీర్చిన విధంగా నాకు ఏమి అవసరమో మీరే ప్రసాదించండి. ఆమెన్. 



మత్తయి 7:21,24-27

 మత్తయి 7:21,24-27

"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో  ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. " నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాది పై నిర్మింపబడుటచే కూలి పోలేదు. నా బోధనలను ఆలకించి  పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలైపారి, పెనుగాలులు వీచినపుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాల ఘోరమైనది." 

ధ్యానం: "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో  ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. యేసు ప్రభువుని మాటలు జీవమై ఉన్నవి అని మనకు తెలుసు. ఈ ప్రభువు మాటలు ఒకసారి ఆలోచిద్దాం. ప్రభూ ప్రభూ అని నన్ను పదే  పదే సంబోధించే వారు పరలోక రాజ్యములో ప్రవేశించారు అని ప్రభువు చెబుతున్నారు. మరి ఎవరు  పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి పరలోక మందున్న తండ్రి చిత్తము? దీని కోసము ఎవరు ఎవరు ఏమి చేశారు? ఒక సారి పవిత్ర గ్రంధం పరిశీలించినట్లయితే కుమారుని ఔన్నత్యం ఆయన ఈ తండ్రి చిత్తము నెరవేర్చిన విధానం ద్వారానే  తెలుసుకుంటాము. అంతేకాక అనేక మంది ప్రవక్తలు, గొప్ప భక్తులు వారి జీవితాలను, పూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి  అంకితం చేశారు. ఈ విషయంలో కుమారుడు అయిన యేసు ప్రభువు ప్రతి మానవునికి ఆదర్శం అవుతారు. 

క్రైస్తవులు ఎక్కువగా ప్రార్ధించే ప్రార్ధన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్దన.  ఈ ప్రార్ధనలో , "మీ  చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక" అని ప్రార్ధిస్తున్నాము. మరల యేసు ప్రభువు తాను గెత్సమేను తోటలో ఉన్నప్పుడు "తండ్రి నేను పానము చేసిననే తప్ప , నా నుండి తొలగిపోవ సాధ్యము కాని యెడల మీ చిత్తమునే నెరవేరనిమ్ము అని ప్రభువు చెబుతున్నారు. అంతకు ముందుకూడా ప్రభువు అంటున్నారు "ఈ పాత్రను నా నుండి తొలగించు కానీ నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేరనిమ్ము" అని అంటున్నారు.  యేసు ప్రభువుకు తాను ఈ దైవ చిత్తము నెరవేర్చడం అంటే, తాను అనేక కష్టలు పొంది మరణశిక్ష పొందడం అని తెలిసి కూడా, మీ చిత్తమె నెరవేరనిమ్ము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుకు తన తండ్రి చిత్తము నెరవేర్చడమును తన ఆహరంగా మార్చుకున్నారు. అందుకే ఆయన అంత కష్టమైన పనిని కూడా చేస్తున్నారు. 

 యేసు ప్రభువు  తండ్రి చిత్తాన్ని ఎవరు పాటిస్తారో , వారు ఎలా దేవునికి కుటుంబంలో వారు అవుతారో చెబుతారు. అది తెలియజేయడానికి, పరలోక మందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చు వాడే , నా సోదరి , సోదరుడు నా తల్లి అని ప్రభువు చెబుతున్నారు. ఈ పసి బాలురలో ఏ ఒకడైన నాశనమగుట మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చువాడే పరలోకమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నాడు. దైవ చిత్తము మన జీవితాలలో చాలా ముఖ్యమైనది. ఇది మనలను దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను సాధిస్తుంది. యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయుట లేదు. మరియమాత తాను దేవుని దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరగాలి అని తన జీవితాన్ని పూర్తిగా దైవ చిత్తానికి అర్పిస్తుంది. యోసేపు, తండ్రి ప్రణాళికా జరుగుటకు తన జీవితాన్ని అర్పిస్తున్నారు. మన జీవితాలలో దేవుని ప్రణాళికా తెలుసుకొని అది జరుగుటకు మన వంతు బాధ్యత మనం ఎప్పుడు చెయాలి. అప్పుడు మనం దేవుని కుటుంబంలో సభ్యులం అవుతాము. 

నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువుని మాటలు ఆలకించుట అంటే ఒకడు తన జీవితాన్ని, పరలోకరాజ్యంలో స్థానాన్ని పదిలపరుచుకున్నట్లే. పరలోక రాజ్యం అంటే సకల సౌక్యాల కంటే, సకల సంతోషాల కంటే గొప్పది. అది  ఎప్పుడు ఆ ప్రభువుతో కలసి ఉండటము. అది కేవలం ప్రభువుని మాటలను ఆలకించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వారికి మాత్రమే ఉంటుంది. ఒక వేళ యేసు ప్రభువు మాటలను పట్టించుకోకుండా, తండ్రి చిత్తాన్ని చేయకుండా ఉన్నట్లయితే వారు తమ ఇంటిని ఇసుక మీద కట్టుకున్న వారి వలె ఉంటారు  అని  ప్రభువు చెబుతున్నారు. ఇసుక మీద కట్టిన ఇల్లు చిన్న కుదుపులను కూడా తట్టుకోలేదు అటువంటిది పెద్ద పెద్ద తుఫానులను ఎలా తట్టుకుంటుంది. యేసు ప్రభువు మాటలను అనుసరించినట్లయితే, వారు యేసు అనే పునాది మీద తమ జీవితాన్ని కట్టుకున్నట్లు, వారు ఎటువంటి కుదుపులకు తొనకరు. మన పునాది క్రీస్తు అని మనం ఎప్పుడు గుర్తించుకొని జీవించాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మీ తండ్రి చిత్తము గురించి, దాని ప్రాముఖ్యతను గురించి చెబుతున్నారు. మీ మాటలను వినమని తండ్రి చెబుతున్నారు. మీరు తండ్రి చిత్తము నెరవేర్చడానికి మీ ప్రాణమును కూడా త్యాగం చేశారు. ప్రభువా , మీరు తండ్రి చిత్తము చేయుట ఎంత కష్టమైన, అది చేయనని తండ్రికి చెప్పలేదు, వీలైతే దీనిని నా నుండి తొలగించండి అని అడుగుతున్నారు. అప్పటికి నా ఇష్టం కాదు మీ ఇష్టమునే నెరవేరనిమ్ము అని చెబుతున్నారు. ప్రభువా నేను నా జీవితంలో సౌక్యాలు పొందాలని,  చిన్న చిన్న ఆనందాల కోసం కూడా తండ్రి చిత్తాన్ని పాటించకుండా ఉన్నాను. అటువంటి పరిస్థితులలో నన్ను క్షమించండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీ వలె  ఎల్లప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఎటువంటి కష్టమునైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిగా నన్ను చేయమని, నా జీవితానికి మిమ్ములను పునాదిగా చేసుకునే భాగ్యం నాకు దయచేయండి. ఎల్లప్పుడు తండ్రి చిత్తాన్ని పాటిస్తూ, మీతో పాటు కలిసి జీవించుటకు అర్హతను దయచేయండి. ఆమెన్. 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...