26, ఫిబ్రవరి 2026, గురువారం

తపస్సు కాల మూడవ ఆదివారం

 తపస్సు కాల మూడవ ఆదివారం 

యోహాను 4:5-42

యేసు సమరియాలోని సిఖారు పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే  ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరీయ స్త్రీ  నీటికొరకు  అక్కడకు వచ్చెను. యేసు ఆమెను "నాకు త్రాగుటకు నీరు ఇమ్ము" అని అడిగెను. అయన శిష్యులు  ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్లియుండిరి. ఆ సమరీయ స్త్రీ యేసుతో, "యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు?" అని అనెను. ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు. అప్పుడు యేసు "దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము, అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని  ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు అయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు" అని సమాధాన మిచ్చెను. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చెదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి  తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతనికంటే గొప్పవాడవా? అని అడుగగా , యేసు సమాధానముగా ఆమెతో "ఈ నీటిని త్రాగువాడు మరల దప్పికగొనును. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు  నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును" అని చెప్పెను. అపుడు ఆమె "అయ్యా! నేను మరల దప్పికగొనకుండునట్లును,నీటికై ఇక్కడకు రాకుండునట్లును, నాకు ఆ నీటిని ఇమ్ము" అని అడిగెను. అప్పుడు యేసు "నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము" అనెను. అందుకు ఆమె "నాకు భర్త లేడు" అని చెప్పెను. నాకు భర్త లేడు  అని నీవు యధార్ధముగా చెప్పితివి. నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు  నీతో ఉన్నవాడు నీ భర్తకాడు నీవు యధార్ధము చెప్పితివి అని యేసు పలికెను. ఆ స్త్రీ ఆయనతో అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి. కాని , దేవుని ఆరాధించవలసిన స్ధలము యెరుషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు" అని పలికెను. స్త్రీ నామాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీదకాని, యెరూషలేములో కాని తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయన రక్షణ యూదులనుండియే వచ్చును.  కాని  నిజమైన ఆరాధకులు ఆత్మ యందును, సత్యమందును  తండ్రిని  ఆరాధించు సమయమిప్పుడే వచ్చి యున్నది. అది ఇపుడే వచ్చియున్నది. నిజముగ  తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి  కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును" అని యేసు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ "క్రీస్తు అనబడు మెస్సయా రానున్నాడని నేను ఎరుగుదును. అయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయును" అని పలికెను. "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను!" అని యేసు చెప్పెను. అంతలో శిష్యులు వచ్చి, అయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కాని, ఎవడును నీకేమి కావలయును" అని గాని "నీవు ఎందుకు ఈమెతో మాటాడుచున్నావు " అనిగాని అడుగలేదు. ఆమె తన కడవను అక్కడే వదలి పెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో, "ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన క్రీస్తు ఏమో! అని చెప్పెను. ప్రజలు పట్టణమునుండి బయలుదేరి ఆయనవద్దకు వెళ్లిరి. ఈలోగా అయన శిష్యులు "బోధకుడా! భోజనము చేయుడు" అని బ్రతిమాలిరి. యేసు వారితో "భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు" అని చెప్పెను. ఎవరైన ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా?అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటయు, అయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురుకదా! పొలములవైపు కన్నులెత్తి చూడుడు.  అవి పండి, కోతకు సిద్ధముగా ఉన్నవి. కోత కోయువాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు. ఇందువలన విత్తువాడు, కోయువాడు ఇద్దరును సంతసింతురు. విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు అని లోకోక్తి ఇక్కడ సార్ధకమైనది. మీరు శ్రమింపదానిని కోయుటకు మిమ్ము పంపితిని. ఇతరులు శ్రమించితిరి. వారి ఫలితము మీకు లభించినది అని చెప్పెను. "నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను" అని ఆ స్త్రీ చెప్పినదానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరీయవాసులు వచ్చి ఆయనను తమయొద్ద ఉండమని వేడుకొనగా, అయన అచట రెండు రోజులు ఉండెను. అయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా అయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగ ఆయన లోక రక్షకుడని మాకు తెలియును అని వారు ఆమెతో చెప్పిరి.  

సమరియా స్త్రీతోటి యేసు ప్రభువు జరిపిన సంభాషణ సువిశేషలలో యేసు ప్రభువు జరిపిన సంభాషణలలోముఖ్యముగా  స్త్రీలతో ఇది  అతి పెద్ద సంభాషణ.  ఈ స్త్రీ యేసు ప్రభువును ఎవరు అడగనటువంటి ప్రశ్నలు అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలు అన్ని విశ్వాసము గురించి మరియు ఆరాధన గురించియే. ఆమెను ఒక ఆధ్యాత్మిక వేత్తగా , అపోస్తురాలిగా, నాయకురాలిగా, సాక్షిగా మరియు భోదకురాలిగా చూడవచ్చు. ఆమెకు పాత నిబంధన మీద మరియు వారి సంప్రాదాయాల మీద ఉన్న అవగాహన అమోఘం. అందుకే యేసు ప్రభువును ఆమె ఒక ప్రవక్త వలె గుర్తించింది. యేసు ప్రభువు ఒక గొప్ప గురువు. ప్రపంచం ఎన్నడు చూడనటువంటి ఒక గురువు. ఆయన ప్రతి వ్యక్తికి గుర్తింపు ఇచ్చారు మరియు గౌరవం ఇచ్చారు.

 యాకోబు బావి వద్ద సమరియా స్త్రీతో యేసు ప్రభువు జరిపిన  సంభాషణ కొన్ని గొప్ప విషయాలను మనకు తెలియచేస్తుంది. ఇక్కడ ఆమెకు ఒక పేరు ఏమి ఇవ్వలేదు. సమరియా  స్త్రీకి పేరు లేదు. యోహాను సువార్తలో ఇది సర్వసాధారణం.  చాలా మంది పేరులేని వ్యక్తులు ఉన్నారు. పేరు లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి ప్రతి వ్యక్తిని పోలి ఉన్నట్లు, ప్రతి వ్యక్తి లోని భావాలకు ప్రతీక అని అర్ధం వస్తుంది.  ఆమె కథ ప్రారంభ క్రైస్తవ సమాజాలలో మహిళల ప్రాముఖ్యత గురించి స్పష్టమైన భావాన్ని తెలియచేస్తుంది.  స్త్రీ మౌనంగా లేదు, స్త్రీలు కేవలం పురుషులకు సహాయం చేయుటకే పరిమితం కాలేదు. ఆమె తన మాటల ద్వారా   యేసు ప్రభువుతో  ఆసక్తి  కలిగించే కొన్ని  ఆధ్యాత్మిక విషయాలు  మరియు ప్రశ్నల గురించి సంభాషింది.  ఆమె యేసు ప్రభువుతో  మాట్లాడటానికి అనుమతి కోసం వేచి చూడలేదు,  కానీ చొరవ తీసుకుంది. ఆమెకు  యేసు ప్రభువు పై ఉన్న  విశ్వాసం దశల వారీగా పెరుగుతూ వచ్చింది. ఎలా అంటే మొదట అయన  దగ్గర నీరు తోడుటకు ఏమి లేదు అనే స్థితి నుండి అయన రక్షకుడు అని గుర్తించే స్థాయికి ఆమె ఎదుగుతుంది, యేసు ప్రభువుతో మనకు ఉన్న సాన్నిహిత్యం , అయనతో గడిపే కొద్దీ పెరుగుతుంది అని ఇది మనకు తెలియజేస్తుంది. 

క్లుప్తంగా ఆమె యొక్క జీవితం ఏమిటి అంటే, యేసు ప్రభువును  కలుసుకొని; ఆయన గురించి తెలుసుకొని, అయనను విశ్వసించి ఎలా ఆ విశ్వసాన్ని వెల్లడించింది అనేది ఆమె జీవితం.  ఆమె వెళ్లి అతని గురించి ఇతరులకు చెప్పింది. మనము చేయవలసినది కూడా ఇదే. నిజానికి ఇది యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం. ఆమె ఇచ్చిన సాక్షం ద్వారా అనేక మంది యేసు ప్రభువును రక్షకుడు అని తెలుసుకోవడమే కాదు అనుభవపూర్వకంగా సాక్షం ఇస్తున్నారు. 

 సమరియా  స్త్రీని యేసు  సమీపించుట 

 ఒక స్త్రీ నీళ్ళు తోడుటకు మధ్యాహ్నపు వేళ నీరు తోడుటకు వచ్చింది. (యోహాను 4:7). యేసు ప్రభువు కూడా ఆ బావి వద్దకు వచ్చాడు. ప్రయాణ బడలికచే అలసిపోయి వున్నాడు. అటువంటి పరిస్థితిలో ఆమెను యేసు ప్రభువు త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగుతున్నారు.  యూదయ పురుషులు సాధారణంగా స్త్రీలతో బహిరంగంగా మాట్లాడరు (యోహాను 4:27).   వారు   ఉదయాన్నే ప్రార్థన చేస్తూ,  ఆరోజు వారు అన్యులును, స్త్రీలను, సమరియులను కుష్టువారిని చూడకూడకుండా ఉండాలని కోరుకుంటారు.  అటువంటి ఒక యూదయ వ్యక్తి అయిన యేసు ప్రభువు, ఒక సమరియా స్త్రీని త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగుతున్నాడు. దేవుని కుమారునిగా యేసు ప్రభువు ఇక్కడ ఆ సమాజంలో ఉన్న కొన్ని రకాల అసాంఘిక అసమానతలను తీసివేస్తున్నాడు.  ఒకరిని దేవునికి దూరం చేసే అసాంఘిక కార్యక్రమాన్ని తొలగిస్తున్నారు. ఎందుకంటే సమరియులు దేవునికి దూరంగా ఉన్నారు అని వారితో ఎటువంటి సాన్నిహిత్యం ఉండకూడదు అని యూదులు అనుకునేవారు. కానీ యేసు ప్రభువు  ఈ స్త్రీతో మాటలాడి రెండు రకాలుగా స్త్రీని తక్కువ చేసి చూడటాన్ని మరియు సమరియులు దేవునికి దూరంగా ఉన్నారు, వారితో ఎటువంటి బంధం ఉండకూడదు అనే రెండు సాంఘిక అసమానతలు తొలగిస్తున్నారు. 

యేసు ప్రభువు ఆ స్త్రీని నీరు అడిగిన వెంటనే ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది.  అతనితో యూదుడవైన నీవు సమరియా స్త్రీ అయిన నన్ను త్రాగుటకు నీరు అడుగుటయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.  యేసు ప్రభువు చెప్పిన సమాధానము అంతకంటే ఎక్కువ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది ఏమిటి అంటే నిన్ను అడిగినది ఎవరో నీవు తెలుసుకొని ఉంటే ఆయననే నీవు అడిగేదానవు అని అంటున్నాడు. ఆయన నీకు జీవ జలం ఇచ్చేవాడు అని చెబుతున్నాడు. 

ప్రభువు మాటలు ఆమెకు వింతగా అనిపించాయి. అందుకే  ఆమె  తన స్వరం మార్చి  గౌరవపూర్వకంగా, అయిన నీరు తోడుటకు నీ దగ్గర ఏమిలేదు, నీవు ఎలా జీవ జలం ఇవ్వగలవు అని  అంటుంది. ఈమెకు అయన మాటలు చాలా కుతూహలానికి గురిచేసాయి. ఆమె ఈ జీవ జలం ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటుంది.  ఆ జీవజలం ఎక్కడ లభిస్తుంది? అనేక ప్రశ్నలు ఆమెలో వస్తున్నాయి. 

అందుకే  మీరు మా తండ్రి యాకోబు కంటే గొప్పవారా ? అని అడుగుతుంది.  సమరియుల దృష్టిలో ఆ బావి , దానిలోని నీరు చాలా గొప్పవి. ఎందుకంటే తమ పూర్వీకుడు యాకోబు ఇచ్చిన బావి నీటి నుండి అనేక తరాల వారు, వారి పశువులు మొత్తం, ఆ నీటిని త్రాగి బ్రతుకుతున్నారు. ఇది ఒకరకంగా వారికి జీవ జలం లాంటిది. కాని ఆమెలో యేసు ప్రభువు చెప్పిన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. అవి ఏమిటి అంటే నేను ఇచ్చే నీటిని త్రాగితే మరల దప్పిక గొనరు అని. కాని ఈ బావి నుండి త్రాగిన వారికి మరల దప్పిక కలుగుతుంది. ఈ మాటలు ఆమెను నూతన ఆశను నెలకొల్పాయి, ఆ జీవ జలం కావలనిపించింది. అందుకే ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడుగుతుంది.  

జీవజలం కోసం  ఆమెలో ఉన్న ఆసక్తిని గమనించిన యేసు ప్రభువు  ఆ నీటిని ఇవ్వడానికి ఒక షరతును పెడుతున్నారు. నీ భర్తను తీసుకొని రమ్మని అడుగుతున్నారు. ఆమెకు భర్త లేడు  అని ఆమె చెబుతుంది.  

పాపం  బహిర్గతమవుతుంది

యేసు ప్రభువు ఆమెతో మాటాలాడుతున్నప్పుడు, ఆమె వ్యక్తిగత జీవితం ఎంత ముఖ్యమో వివరిస్తున్నాడు. ఆమె జీవ జలం కోసం అడుగుతున్నప్పుడు నీ భర్తను తీసుకురమ్మని చెబుతున్నాడు. అలా చేయడం ద్వారా, ఆమె  మనస్సాక్షిని  మేలుకొలుపుతున్నాడు. ఆమె ఎటువంటి జీవితం జీవిస్తుందో తెలియజేస్తున్నాడు. ఆమె వినయముగా అయ్యా! నాకు భర్త లేడు అని చెబుతుంది.  దానికి యేసు ప్రభువు ఆమెను అభినందిస్తున్నారు. అమ్మా, నీవు నిజం చెప్పావు. కాని  నిజానికి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, మరియు ఇప్పుడు నితో ఉన్న వ్యక్తి ని  భర్త కాదు. (యోహాను 4:18) యేసు ప్రభువు చెప్పిన మాటలు ఆమెను భయానికి మరియు ఆశ్చర్యానికి గురిచేసాయి. ఎందుకంటే యేసు ప్రభువు ఆమెకు  అపరిచితుడు, కాని  తన జీవితానికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాడు. ఆ స్త్రీ తెలివైనది కాబట్టి, ఆ స్త్రీ అయ్యా మీరు ఒక ప్రవక్త అని నాకు తోచుచున్నది అని చెప్పింది. ( యోహాను 4:19 ). 

నిజమైన ఆరాధన

 ఆయన ప్రవక్త అని తెలుసుకున్న ఆమె వెంటనే, సమరీయుల మరియు యూదుల ఆరాధన మరియు అర్చన సంబంధించిన విషయాలు గురించి అడుగుతుంది. యూదుల దేవాలయం యెరుషలేములో ఉన్నట్లే, సమరియుల దేవాలయం గెరిజీము పర్వతము మీద ఉంది.  సమరియులు మరియు యూదులు ఎల్లప్పుడూ ఈ రెండు దేవాలయాలలో ఏది నిజమైన ఆరాధన స్థలం అని వాదించుకునేవారు. అందుకే నిజముగా ఎక్కడ దేవునికి  ఆరాధన చేయాలి యెరుషలేములోనా? లేక గెరిజీములోనా? ఇటువంటి ప్రశ్నలు యేసు ప్రభువును ఈమె మాత్రమే అడుగుతుంది. యూదులు, సమరియులు ఇద్దరి వాదనలు ఏవి ముఖ్యమైనవి కాదు. మెస్సియ్య ఇవి అన్ని మారుస్తాడు. ఏమిటి ఆ మార్పు అంటే నిజమైన ఆరాధకులు దేవున్ని సత్యమందును మరియు ఆత్మయందును ఆరాధించాలి. అంటే స్ధలం కాదు ముఖ్యం మరి ఏమిటి అంటే మన స్థితి. ఆమె ఇంకా అనేక ప్రశ్నలు ప్రభువును అడుగుతుంది. ఆరాధన ఏదో ఒక బాహ్య స్థలానికి సంబంధించినది కాదు.   (అపొస్తలుల కార్యములు 17:24).  అది ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటుంది. దేవునికి ఆమోదయోగ్యమైన ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉంటుంది, ఇది  ఒక వ్యక్తి భావించే  సత్యం కాదు, పవిత్రాత్మతో కూడిన సత్యము.

  మెస్సియా వస్తున్నాడు

ఈ మహిళ యేసు ప్రవక్త అని నిర్ధారించింది. మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు: ఆయన  వచ్చినప్పుడు, మాకు   అన్ని విషయాలు తెలియజేస్తాడు, అని చెబుతుంది. ఇవే ప్రశ్నలు ఈమె యేసు ప్రభువును అడిగి తన ఇంటికి వెళ్లిన తరువాత, అయన నాకు అన్ని విషయాలు తెలియజేశాడు అని గ్రహించి ఈయన మెస్సియ్య ఏమో అని  తన పట్టణ ప్రజలకు తెలియచేస్తుంది. (యోహాను 4:25).స్త్రీ ఇంటికి తిరిగి వస్తుంది, అంతటితో ఆమె దేవునితో చేసిన సంభాషణ, దేవున్ని కలుసుకోవడం, ఆమెను  పాత సాధారణ జీవితంలోనే ఉండనివ్వలేదు. తన ఊరి ప్రజలందరికి చెబుతుంది.  నేను చేసినదంతా నాకు ఒక వ్యక్తి చెప్పాడు, అతను మెస్సియా ఏమో చుడండి అని  చెబుతుంది. ఆ నగర ప్రజలు తమ పనులను వదలి ఆయనను చూడటానికి వచ్చారు.  

ఆ స్త్రీ తన నీటి కుండను విడిచిపెట్టి నగరంలోకి ప్రవేశించింది. నేను చేసినదంతా నాకు చెప్పిన వ్యక్తిని కలిసినట్లు ఆమె వారికి చెప్పింది.  ఇది యేసు యొక్క అతీంద్రియ స్వభావాన్నీ తెలియజేస్తుంది. ఓక స్త్రీ సాక్షం వారు ఒప్పుకోరు అని ఆమెకు తెలుసు. కాని తన సాక్షం చెప్పాలి, అందరికి యేసు ప్రభువు గురించి ఆమె వారికి చెప్పాలి అని అనుకున్నది. అందుకే అతను క్రీస్తు ఏమో ఒకసారి చుడండి అని ఆమె చెబుతుంది. క్రీస్తును చూసి, ఆయనతో మాట్లాడి, ఆయన్ను తెలుసుకొని ఆయనే ఎవరో మీరే నిర్ణయించండి అని తెలియజేస్తుంది. 

సమరియా ప్రజలు యేసు ప్రభువును నమ్మట 

చాలా మంది సమరియులు యేసు ప్రభువును  విశ్వసించారు, అని  వింటున్నాం. సమరియులు మొదట్లో ఆ  స్త్రీ చెప్పిన మాటల ఆధారంగా విశ్వసించారు. ఈ స్త్రీ యొక్క సాక్ష్యం చాలా శక్తివంతమైనది.  ఆమె యేసు ప్రభువు  మెస్సీయ కావచ్చునని సూచిస్తూ, యేసు గురించి అందరికీ చెప్పింది. యేసు మరణం మరియు పునరుత్థానం తర్వాత, యేసు ప్రభువు శిష్యులు వచ్చి యేసు గురించి ప్రజలకు చెప్పారు. సమరియా  స్త్రీ కూడా అదే చేసింది,  ఆమె తన  సొంత  చొరవతో యేసు ప్రభువు గురించి అందరికి తెలియచేస్తుంది. 

సమరియా  స్త్రీ: ఒక అపొస్తురాలు 

ఆ స్త్రీ యేసుప్రభువుతో ఉన్నది. మరల అయన గురించి ఇతరులకు చెపుతుంది. అపోస్తులు అంటే ప్రభువుతో ఉంది అయన చేత పంపబడి అయన గూర్చి చెప్పేవాడు.  ఇక్కడ  ఆమె అపొస్తలురాలిగా ప్రవర్తించింది. యేసు ప్రభువు  గురించి ప్రజలకు చెప్పడానికి వెళ్లి, వారిని ఆయన వద్దకు నడిపించింది. "నేను చేసినదంతా అతడు నాతో చెప్పాడు" అనే స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణంలోని చాలా మంది సమరియులు అతనిని విశ్వసించారు, కాబట్టి సమరియులు అతని వద్దకు వచ్చినప్పుడు, వారు అతనిని తమతో ఉండమని అడిగారు మరియు అతను రెండు రోజులు అక్కడ ఉన్నాడు. యోహాను  4: 39-42. చాలా మంది ప్రజలు యేసును నమ్మారు, కేవలం స్త్రీ వల్ల మాత్రమే కాదు, యేసు రక్షకుడని వారు స్వయంగా చూశారు. ఇది వారి యొక్క అనుభవం కూడా అయినది.  

ఆమె  సందేశం ఏమిటి? "నేను చేసినదంతా అతను నాకు చెప్పాడు."  యేసుతో సంభాషణలో, రాబోయే మెస్సీయ "మాకు ప్రతిదీ చెబుతాడు" అని ఆమె చెప్పింది. తరువాత నేను చేసినదంతా అయన నాకు చెప్పాడు,  కనుక అయన రక్షకుడు ఏమో  వచ్చి చుడండి అని చెబుతుంది. ఇదే మాటలను ఆమెకు యేసు ప్రభువు చెప్పాడు. రానున్న రక్షకుడను నేనే అని ఆమెతో మాత్రమే యేసు ప్రభువు చెప్పినది. యేసు ప్రభువు తాను రక్షకుడను అని బహిర్గతం చేసినది ఇక్కడ మాత్రమే. 

 సమరియా  స్త్రీ తనమాటల ద్వారా యేసుతో ఆమెకు ఉన్న అనుభవం ద్వారా సిఖారు పట్టణంలోని ప్రజలను  ప్రేరేపించి, వారు యేసు వద్దకు వెళ్లేలా చేసింది. ఆమె ఇతను క్రీస్తు , రక్షకుడు అయి ఉంటాడు ఏమో అని ఆ ప్రజలకు చెబుతుంది. వారిని బలవంతంగా నిమ్మించ ప్రయత్నం చేయలేదు.  ఆమె తన జీవితం గురించి యేసు చెప్పిన మాటలను బయట చెప్పుటకు సిగ్గుపడలేదు. 

సమరియా స్త్రీ ఇతరులను యేసు ప్రభువు దగ్గరకు తీసుకురావడానికి కృషి చేస్తుంది. తాను యేసు ప్రభువు వద్ద పొందిన , తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకొనుట ద్వారా యేసు ప్రభువును ఇతరులకు తెలియజేస్తుంది. ఆమె చెప్పిన దానిని బట్టి ఆయనను చూడాలి అని అయన దగ్గరకు వచ్చారు.  

ముగింపు

సమరియా స్త్రీ జీవితంను పరిశీలించినయితే   ఆమె అపొస్తల కర్తవ్యాన్ని చేస్తుంది, ఎందుకంటే అపొస్తలుడు అంటే  క్రీస్తుతో ఉన్నవాడు మరియు క్రీస్తుని సువిశేషం ప్రకటించినవాడు. ఈ రెండు పనులు ఆమె చేస్తుంది.  ఆమె క్రీస్తుతో ఉండి , విశ్వాసం మరియు ఆరాధన గురించి క్రీస్తుతో మాట్లాడింది. పాత నిబంధనలో యేసే మెస్సీయ అని గ్రహించగలిగే అనేక మంది దీర్ఘదర్శలు మరియు ప్రవక్తలను మనం చూస్తాము. చాలా మంది ప్రజలు యేసును వేర్వేరు ప్రశ్నలు అడిగారు, కానీ ఈ స్త్రీ మాత్రమే విశ్వాసానికి మరియు ఆరాధనకు సంబంధిచిన ప్రశ్నలను అడిగి, వాటికీ సంబంధించిన సమాధానాలను పొందింది.  ఆమె సిఖారు  ప్రజలను ప్రేరేపించడంద్వారా వారు యేసు ప్రభువును చూస్తున్నారు.  ఆమె నిష్ణాతులైన అపొస్తలురాలు మరియు బోధకురాలు. పవిత్ర గ్రంధంలో ఈమె వలె  విశ్వాసం, ఆరాధన మరియు ప్రార్ధన విశ్వాసం అనే  విషయాలపై యేసు ప్రభువుతో ఇంత  గొప్ప సంభాషణ ఎవరు చేయలేదు.  ఆమె క్రీస్తు గురించి ప్రకటించింది. క్రీస్తును  కలుసుకోవడం ఆమెను మార్చింది  ఆమెను బలపరిచింది. మనము కూడా ఆయన్ను కలుసుకొని ఆయనతో మనము గడిపితే మన జీవితాలలో కూడా ఇదే జరుగుతుంది. 


ధనవంతుడు- లాజరు

 సంపదను దైవ రాజ్యప్రవేశానికి మార్గంగా చేసుకోవచ్చు

లూకా 16: 19-31 

ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపు చుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహామంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకు చుండెను. ఆ నిరుపేద మరణింపగా. దేవదూతలు  అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధ పడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు 'తండ్రి అబ్రహామా!నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడి పోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము ' అనెను.  అందుకు అబ్రహాము , కుమారా ! మరువకుము. నీ  జీవితములో  నీవు సకల సంపదలను అనుభవించు చుండ, లాజరు అష్ట కష్టములను అనుభవించేను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖ పడుచున్నాడు. అంతేకాక, మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన ఆచాటివారు ఇచ్చటకు రాలేరు. ఇచ్చటివారు అచటకు పోలేరు' అని పలికెను. అందుకు ధనవంతుడు 'అట్లయిన నాదొక మనవి. నాకు ఐదుగురు సహోదరులున్నారు. వారు కూడ ఈ ఘోరనరకమునకు రాకుండ హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి యింటికి పంపుము' అనెను. అందుకు అబ్రహాము  'వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును' అని సమాధానమిచ్ఛెను. 'అది చాలదు తండ్రీ ! అబ్రహామా!మృతులలో నుండి ఎవరైన వారి వద్దకు వెళ్ళిన యెడల వారికి హృదయ పరివర్తనము కలుగును' అని అతడు మరల పలికెను . అందులకు అబ్రహాము 'మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని  పెట్టువారు, మృతులలో నుండి ఒకడు సజీవుడై, వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు' అని ప్రత్యుత్తరమిచ్ఛెను". 

ఈ సువిశేష భాగంలో ధనవంతుడు పేదవాని పట్ల తన నిర్లక్ష్యపు ప్రవర్తనకు కారణంగా శిక్షించబడ్డాడు. లాజరు ధనవంతుని వాకిలి  వద్ద కూర్చొని ఉంటున్నాడు. ధనవంతుడు శిక్షించబడటానికి లేక  నరకానికి పోవడానికి గల చేసిన తప్పు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్ధం అవుతాయి. మనం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఆడగవలసి ఉంది. అవి ఏమిటి అంటే ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళవలసి వచ్చినదిఎందుకు ఆయన అంత అగ్నిలో కాలుతుండాలిఒక నీటి బొట్టు కోసం అడుగుకునే పరిస్థితి ఎందుకు వచ్చినదిఎందుకు ఆయనను అబ్రహాము,  లాజరుల నుండి దూరం చేస్తూ అంత పెద్ద అగాధం ఉండాలిఅంత దూరం పెట్టె అంతటి తప్పు ఇతను ఏమి చేశాడు?

ధనవంతుడు- నీతిమంతునిగా జీవించాడా?

 ధనవంతుడు  నీతి మంతుడు కాదుఈ ఉపమానం లోభితనంతో ఇతరుల సంపదను ,మిగుల సంపదను తమకు సంభందించినదిదానిలో ఎవరికి భాగం లేదు అని ఆలోచించే పరిసయ్యుల గురించిమరియు శిష్యులు అలా ఉండకూడదు అని చెప్పిన ఒక ఉపమానం ఇది. ధనవంతుడు యొబు వలె నీతిమంతుడు అయినట్లయితే ప్రభువా నేను ఏ తప్పు చేసాను అని,  నాకు ఈ శిక్ష వేస్తున్నారనినేను వీటిని పొందవలసిన వాడిని కాదు అని చెప్పటం లేదులేక కీర్తన కారుని వలె మంచి వారు ఎందుకు శ్రమలు అనుభవించాలి అని ప్రశ్నించడం లేదు.  అంటే తాను నీతి మంతుడు కాదు అని ఆయనకు కూడా తెలుసు.
 ధనవంతుని యదార్ధ  స్థితి
 ఈ లోకంలో  ఉండగా ధనవంతుడు సకల ఐశ్వర్యాలను అనుభవించాడు. అంతే కాదు తాన బాధ్యతలను మరచిపోయాడు. తాను చాలా సంపన్నమైన జీవితమును జీవిస్తున్నాను, అని తన పరిసరాలనుతన చుట్టూ ఉన్నవారిని మరిచిపోయి జీవిస్తున్నాడు. అతను రోజు నూతన పట్టు వస్త్రాలనువిందులను చేసుకుంటున్నప్పటికి అతని యదార్ధ స్థితి ఏమిటి అంటే తన భోజనపు బల్ల దగ్గర పడే రొట్టె ముక్కల కోసం ఎదురుచూసే లాజరు శరీరాన్ని దాని మీద ఉన్న వ్రణాలను కుక్కలు నాకుతున్న పరిస్థితి ఉన్న, వాటిని తన ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడు.  అంటే అతను ఎంతో పరిశుభ్రమైన పరిస్థితులలోఉన్నాను అనుకున్నప్పటికీ అది నిజం కాదు అతను చాలా దుర్భరమైన స్థితిలోనే ఉన్నాడు. ఇది కేవలం ఈ ధనవంతుని పరిస్థితి మాత్రమే కాదు. ఎవరైన సంపదలు వచ్చిన తరువాత దేవుని మరచి పోయే వారి పరిస్థితి ఇలానే ఉంటుంది. వారు దేవున్ని మరచిపోతారుదేవుని పట్ల వారి బాధ్యతలు మరచిపోతారుతమ పరిసరాలను మరచిపోతారుతమతో ఉన్న వారిని మరచిపోయి జీవిస్తారు.
 లూకా సువిశేషంలో యేసు ప్రభువు అనేక పర్యాయలు ధనవంతులుకు వ్యతిరేకముగా మాటలాడారు. లూకా 6:24, “అయ్యో !ధనికులారా ! మీకనర్ధము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు.” లూకా 12 : 21,తన కొరకు ధనము కూడబెట్టుకొనువారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు” అని చెప్పెను. ఇక్కడ సంపదతో కూడిన చెడు గురించి కూడా యేసు ప్రభువు చెప్పటం మనం చూస్తాం. అదే విధంగా పేదవారికి  దేవునిమీద నమ్మకం ఉండే విధంగా చేయడం మనం ఇక్కడ చూస్తున్నాము.

ఎందుకు ధనవంతుడు శిక్షించబడ్డాడు ?

ధనవంతుడు తన సంపదలను అనుభవించాడని శిక్షించలేదు. కేవలం ఇతనికి ధనం ఉంది అని శిక్షించబడలేదు.  ధనవంతుడు పేదవారిని నిర్లక్ష్యం చేసినందుకు తనకు ఉన్న సంపదతో పేదవారిని స్నేహితులుగా మార్చుకోలేదని శిక్షకు గురవుతున్నాడు.  ధనవంతునికి లాజరు పరిస్థితి మొత్తము తెలుసు అయిన కాని తనకు సహాయ పడుటకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు. తాను నిర్లక్ష్యం చేసినది ఒక నీతి కార్యమును. ధనవంతులైన అబ్రహాము నీతి మంతుడు కనుక ఇతరులకు సహాయం చేస్తూతన నీతిని నిరూపించుకున్నాడు. హృదయ  పరివర్తన గురించి వారికి బాప్తిస్మ యోహను అంతకు ముందుగానే తెలియ చేశారు. హృదయ పరివర్తన ఫలితం మనకు ఉన్న దానిని లేని వానితో పంచుకోవాలి అని తెలియజేస్తున్నాడు. లూకా 3:11. “రెండు అంగీలున్న వ్యక్తి ఏమియు లేనివానికి ఒక దానిని ఈయవలయును. భోజనపదార్ధములు ఉన్న వారు  కూడ అట్లే చేయవలయును” అని యోహను సమాధానము ఇచ్చెను. యేసు ప్రభువు ధనవంతులకు పేదవారినికుంటి వారిని గ్రుడ్డి వారిని వారి పండుగలకు పిలవమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది పునరుత్థాన సమయంలో వారికి ఉపయోగ పడుతుంది. (లూకా 14:12-14) . ధనవంతుడు ఇది కూడా చేయలేదు కనుక ఇతను ఎటువంటి బహుమానం ఆశించడానికి వీలు లేదు. అలా అని ఇతను ఎవరికైనా ధన ధర్మాలు చేసిన వ్యక్తి కూడా కాదు. ధనవంతునికి  లాజరుకు సహయం చేసే అవకాశం ఉంది తాను నరకానికి పోకుండా ఉండే అవకాశం పొందాడుకాని అతను వాటిని వినియోగించుకోలేదు. లాజరును యేసు ప్రభువు చెప్పినటువంటి అవినీతి సంపదతో మీరు మిమ్ములను పరలోకానికి ఆహ్వానించే మిత్రులను ఏర్పాటు చేసుకోండి అని చెప్పిన మాటను మనం చూస్తున్నాము. ఇతను చివరకు అదికూడా చేయలేదు. అంటే అంత నాకు కావాలి నేనే పొందాలి అనే కోరికతోనే జీవించాడు. ఇక్కడ ధనవంతుడు తన సంపన్నుడు అయినందుకు శిక్షించబడలేదు. తన సంపదను కొద్దిగా కూడా అవసరాలలోఉన్న వారితో పంచుకోలేక పోవడం తో ఆయన శిక్షించబడ్డాడు

మరణించిన తరువాత ధనవంతుని పరిస్థితి

ధనవంతుడు అబ్రహామును తండ్రి! నా మీద కరుణ చూపించమని అడుగుతున్నప్పుడు ఇతను తన వాకిలి  దగ్గర ఉన్న లాజరుకు ఎటువంటి కరుణ చూపించలేదు అని అర్ధం అవుతుంది. కనుక కరుణ పొందే అవకాశం కోల్పోతున్నాడు. యేసు ప్రభువు అనేక సార్లు మీరు ఏ కొలతతో కొలిచెదరో అదే కొలతతో మీకును కొలవబడును అని చెప్పారు, ఇక్కడ జరుగుతుంది కూడా అదే.  మరణించిన తరువాత ధనవంతుడు ఇంకా చేయడానికి ఏమిలేదు. ఎందుకంటే అతను బ్రతికి ఉన్నప్పుడే ఇతరులకు సహాయం చేసినట్లయితే, తాను ఇప్పుడు సహాయం పొందడానికి అవకాశం ఉండేది. కాని అతను అన్ని అవకాశలు కోల్పోయాడు.

మనం ఎలా జీవిస్తే దేవుని రాజ్యం పొందుతాము ?
 
పునీత లూకా గారు సువిశేషంలో అనేక మంది సంపన్నులును వారు పొందిన బాధలను చూపుతూ వారు ఎందుకు పరలోకానికి దూరంగా ఉండిపోతున్నారో తెలియజేస్తూఎలా ఉంటే లేక జీవిస్తే వారు పరలోకంలో ఉంటారో తాను రాసిన అపోస్తులుల కార్యాలలో తెలియజేస్తున్నాడు. అపోస్తులుల కార్యాలలో మొదటి క్రైస్తవ సంఘంలోని ప్రజలు,   వారికి ఉన్న దానిని ఇతరులతోలేని వారితో  పంచుకొని కలిసి జీవించడం. అపో కా 2-44 , “విశ్వసించిన వారందరు కలసి సమిష్టిగా
జీవించుచు తమకు కలిగినదానిలో అందరు పాలుపంచుకొనుచుండిరి,” వారు చేసిన పనుల ద్వారా వారి మధ్య అవసరాలలో కొట్టుమిట్టాడేవారు తరిగిపోయారు. అపో. కా 4:34. “వారిలో ఏ ఒక్కనికి కొరతలేదు. ధనవంతుడుతినడానికి ఏమి లేక తన భోజన బల్ల కింద పడే ముక్కల కోసం కాచుకొని కూర్చొన్న వాని ఆకలి తీర్చడంలో విఫలం చెందాడు. కాని అపోస్తుల కార్యాలలో మనం అంతియోకియాలో ఉన్న సంఘం రాబోవు కరువును పసిగట్టి దాని కోసం వారు దయగుణంతో స్పందించారు. తరువాత ధనవంతుడు పేదలనుకుంటి వారిని తన నిత్యం చేసుకునే విందులకు పిలవడంలో విఫలం చెందాడు. కాని అపోస్తుల కార్యాలలో క్రీస్తు సంఘం ఎలా వారు అభాగ్యులకు ఎలా అతిధ్యయం ఇచ్చారో మనం తెలుసుకోవచ్చు.  ఇంకా ధనవంతుడు తన వాకిలి  వద్ద  యాచిస్తున్న లాజరుకు కరుణ చూపించడంలో విఫలం అయ్యాడు. కాని అపోస్తుల కార్యాలలో మనకు అపోస్తులు కొంతమందిని కేవలం ఇతరులకు సహాయం చేయడం కోసమే నియమించడం జరిగింది.  కొర్నెలియసు మొదలగువారు.

లూకా సువిశేషంలో మనం పేదవారికి దేవుని రాజ్యంలో ప్రవేశం త్వరగా దొరుకుతుంది అన్నట్లుగా చూస్తాం అదే విధంగా ధనికులు పేదవారికి సహాయం చేస్తే వారికి కూడా అలానే దొరుకుతుంది ,జక్కయ్య దానికి ఉదాహరణ.
ధనికుడు లాజరు ఉపమానం మనం మరణించిన తరువాత ఏమి పొందుతాము అనేది  మనకు దేవుడు ఇచ్చిన అవకాశలు మరియు అనుగ్రహాల ద్వార ఇక్కడే మనం  నిర్ణయించాలి అని తెలియజేస్తుంది.

సంపద విలువ

 
లూకా సువిశేషంలో సంపదను  పేదవారికి ఉపయోగించక పోయినప్పడు అది చెడ్డది అన్నట్లుగా మనం చూస్తాము. ఈ సంపదను ఇతరులకు ఉన్నతికి వాడక పోయిన, ఇతరుల నిత్య అవసరాన్ని తీర్చడానికి వాడి నట్లయితే అది ధన వంతునికి గొప్ప వనరుగా మారి తనను దేవుని రాజ్యానికి ఆహ్వానిస్తుంది.  పేదవారిని ఆదుకోవడం అనేది నీకు పరలోకంలో స్థానాన్ని పదిలం చేస్తుంది. ధర్మ శాస్త్రంలో ప్రవక్తల ప్రభోదలలో ధనికులకు పేదవారిని ఆదుకునే బాధ్యత ఉంది. సంపదను దేవుని దీవెన వలె చూస్తుంది పాత నిబంధన. అబ్రహాముసోలోమోను ,యొబు వీరు ధనవంతులు మరియు భక్తిపరులు వీరి భక్తి మరియు విశ్వాసం వీరిని సంపన్నులను చేస్తుంది. కనుక సంపద అనేది చెడ్డది ఏమి కాదు. వారు భక్తి పరులు మరియు విశ్వాస పరులు కనుక వారు దాతృత్వం కలిగిన వారు కాగలిగారు.  పేదరికం అనేది తీసివేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచించవలసినది ఎవరు నాకు సంబంధం లేదు అని చెప్పలేం. దీనిని తీసివేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం  చేయాలి. కనుక పేదవారిని అదుకొనకపోవడం మనలను పరలోకంలో స్థానం లేకుండా చేస్తుంది. అంటే దీనిని తీసి వేయవలసిన బాధ్యత ఎంత ఉందో తెలుస్తుంది. 

క్రైస్తవులకు  ఈ ఉపమానం ఒక మేలుకొలుపు లాంటిది. ఈ ఉపమానంలో  యేసు ప్రభువులోభితనముతో అత్యాశతో ఉన్న పరిసయ్యులతోసంపదలను సరిగా వాడుకోకపోతే వచ్చే అనర్ధలు గురించిశిష్యులు ఎలా ఉండకూడదో   చెప్పిన ఒక ఉపమానం. ఈ ఉపమానంలో మనం చూసేటువంటివి ప్రధానంగా సంపద పేదరికం జీవితాలు తారుమారవడం మరియు మోషే ధర్మ శాస్త్రం మరియు ప్రవక్తల ప్రభోదల విలువ. పేదలకు ఆకలితో ఉన్నవారికి శోకంలో ఉన్నవారికి యేసు ప్రభువు ఓదార్పు ఇవ్వడం మరియు వారికి దేవుని రాజ్యంలో స్థానం కల్పించడం గురించి మనం వింటువుంటాము.  యేసు ప్రభువు లూకా 12:1 వ వచనం మరియు 13:21 వ వచనాలలో మానవ జీవితం సిరి సంపదల సమృద్దిలో లేదు అని చెబుతున్నారు. జక్కయ్య ధనవంతుడే తన ఆస్తిలో సగ భాగంను పేదలకు పంచుతున్నాడు. యేసు ప్రభువు ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటున్నారు.కనుక అలా జీవించడానికి ప్రయత్నిద్దాం.

పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవం

 పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవం

పేతురు గారు పవిత్ర గ్రంధంలో యేసు ప్రభువుని అపోస్తులులలో  ప్రముఖమైన శిష్యుడు. ఈయన బెత్సయిదా నుండి వచ్చిన ఒక జాలరి. బెత్సయిదా అంటే చేపల ఇల్లు అని అర్ధం. తరువాత ఆయన కపర్నాములో తన నివాసం ఏర్పారుచుకున్నాడు. పేతురు గారి తండ్రి గారి పేరు యోనా, ఇతనికి ఆంద్రెయ అను సోదరుడు కలడు. వీరు ఇద్దరు జాలరులే.  ఈయన మొదటిగా యేసు క్రీస్తును కలిసినది యోహను బాప్తిస్మం ఇస్తున్న యొర్ధాను నది తీరంలో ఉన్న  బేతానిలో. పేతురు మరియు ఆంద్రెయ గార్లు బాప్తిస్మ యోహను గారి యొక్క శిష్యులు. ఆంద్రెయ గారు యేసు ప్రభువు గురించి మొదట  పేతురు గారికి  తెలియచేశాడు. పేతురు అంటే రాయి అని అర్ధం. ఈయన అసలు పేరు సిమోను. సిమోను అంటే రెల్లు కాడలాంటి వాడు అని అర్ధం. పేతురు గారు కూడా మొదటిలో అలానే ఉన్నాడు. ఎవరు ఏమి మాటలాడిన వారికి భయ పడిపోయారు. కాని యేసు ప్రభువు ఆయనను దృడంగా మారుస్తున్నారు. ఆయనను పేతురును చేస్తున్నారు. తన సంఘానికి పునాదిగా చెస్తున్నాడు. 

పేతురు గారు విలక్షణ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఈయన జీవితాన్ని అనేక కోణాలులో విశదీకరించవచ్చు. సహజ సిద్దముగా ఈయన అవేశపరుడు. మృదువర్తనుడు, ఆధ్యాత్మిక విషయాల్లో కొంత అవగాహన కలిగిన వ్యక్తి . తన విశ్వాస జీవితంలో తాను చేసిన తప్పును ఒప్పు కొనే   ధైర్యం కలిగిన వ్యక్తి,  మరియు  సహజముగా పిరికివాడు.  అపరాధ భావం కలిగినవాడు, తన తన ప్రభువు తెలియడు అని చెప్పాను అని , తన తప్పు గ్రహించ కలిగిన వ్యక్తి. తనను తాను త్యజించుకుంటున్నారు. కాని మరల ఈ లోక వస్తువుల మీద ఆశ కలిగి ఉన్న వ్యక్తి , ఈ విధముగా అనేక విరుద్ధ భావాలు, వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. 

ఈయన అపోస్తులులలో   నాయకుడు. యేసు ప్రభువుని ముగ్గురు ముఖ్యమైన శిష్యులలో ఈయన ఒకడు.  చనిపోయిన  యాయిరు   కుమార్తెను యేసు ప్రభువు మరణం నుండి లేపుతున్నప్పుడు పేతురుగారు ఉన్నారు. యేసు ప్రభువు రూపాంతరికరణ సమయంలో పేతురుగారు అక్కడ ఉన్నాడు . యేసు ప్రభువు ఓలివు తోటలో వేదన పొందుతున్నప్పుడు  పేతురు గారు ఉన్నారు. ఇన్ని గొప్ప కార్యాలకు సాక్షిగా ఉన్న పేతురు పిరికివాడు. ఎటువంటి ఇబ్బంది సహించలేడు. తనకు ప్రభువు పట్ల ఎంతో ప్రేమ ఉంది అని నిరూపించుకోవాలి అనుకునేవాడు. అందుకే ఏ చిన్న అవకాశం ఉన్న తాను ఎంతో ప్రేమిస్తున్నాను అని ప్రకటించుటకు సిద్దంగా ఉండేవారు. కాని కష్టం వచ్చినప్పుడు ఆయనను విడచి పెట్టుటకు ఎటువంటి వెనుకడుగేయలేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియడు అని చెబుతున్నారు. 

 ఇటువంటి పేతురు గారు అద్భుతాలు చేసేటు వంటి పరిచారకుడు అయ్యాడు. యేసు ప్రభువు ఈయనను ఒక గొప్ప వ్యక్తిగా మార్చుతున్నాడు. తనను శిష్యులకు నాయకునిగా ఎన్నుకుంటున్నాడు. అంతేకాదు ఈయన మీద తన సంఘంను  నిర్మిస్తాను అని వాగ్ధానం చేస్తున్నాడు. ఆయనకు స్వర్గపు తాలపు చెవులను ఇస్తున్నాడు.  స్వర్గపు తలుపులను ప్రజలకు తెరిచే అవకాశం ప్రభువు  పేతురుకు ఇస్తున్నాడు. 

కాని పేతరుగారు యేసు ప్రభువు శ్రమలను అనుభవిస్తున్న సమయంలో తన విశ్వాసం చూపించుటలో చాలా ఘోరముగా విఫలం చెందుతున్నారు. ఆయన మాత్రమే కాదు తనను గొప్ప వానిగా చెప్పిన ప్రభువును కూడా ఆయన ఒడిస్తున్నాడు. తాను ఆయన అనుచరుడును కాను అని చెబుతున్నాడు. కాని ప్రభువు ఆయనను వదల లేదు,  తన పునరుత్థానం తరువాత మరలా పేతురు గారిని తన గొర్రెలను కాయమని, తన సంఘంను నడుపమని ప్రభువు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని పేతురు గారు ఎంతో గొప్పగా వినియోగించుకున్నాడు. 

ఈయన పడి లేచిన మనిషి. పడి లేచిన తరువాత పడని మనిషి. ఎలా పడకుండ ఉండాలో నేర్పే మనిషి. తన గురువుకు ప్రామాణికంగా ఉండే మనిషి. తాను గొప్ప నాయకుడు అయ్యాడు. పసి సంఘాన్ని కంటికి రెప్పలా కాపాడాడు, గురువు యొక్క శిష్యునిగా పరిణితిని ప్రతి విషయంలో చూపించిన వ్యక్తి. 

పెంతుకోస్తు పండుగ తరువాత మొదటగా యేసు ప్రభువు  పసి సంఘాన్ని యెరుషలేములో పేతురుగారు  నడపారు. తరువాత పాలస్తీనాలో కొంత కాలం సంఘాన్ని నడిపారు. ఈ సమయంలోనే పేతురు లిద్దా  , యోప్పా ప్రదేశములలో ఉన్నాడు. ఈ సమయంలోనే కైసరియాకు ఈయన పిలువబడ్డాడు. ఇక్కడ కొర్నేలియసు ఇంటి వద్ద అన్యులకు సంఘ  తలుపులను  తెరిచాడు. అటు తరువాత సిరియాలో అంతియోకు కేంద్రంగా పనిచేశారు. అటుతరువాత రోము నగరానికి వెళ్ళాడు. అప్పటికి పౌలుగారు మొదటిసారి చెరసాల నుండి వదలి వేయబడ్డాడు. తరువాత అక్కడె ఆయన హింసించబడి మరణానికి గురయ్యాడు. అంతేకాదు తన ప్రభువు వలె సిలువ వేయబడటానికి ఆర్హుడను కాదని తనను తలక్రిందులుగా సిలువ వేయమని వెదుకొనుచున్నాడు. పేతురుగారు క్రీస్తు సంఘాన్ని నిర్మించాడు. ప్రభువు కోసం మరణించడం గొప్ప భాగ్యం అని చాటి చెప్పాడు. పిరికివాడు, ధైర్యంగా ప్రభువు సంఘాన్ని నడిపాడు. అద్భుతాలు చేశాడు. క్రీస్తు అనుచరునిగా జీవించాడు. 

పౌలు 

సంఘములను ఏర్పరచిన అపోస్తులుడు 

పునీత పౌలును  అన్యుల యొక్క అపోస్తులుడుగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆదిమ క్రైస్తవులకు దశ దిశ తెలియచేసిన అపోస్తులుడు. ఈయన ఆదిమ సంఘ నిర్మాత. అంతేకాదు అనేక లేఖల ద్వారా దేవుని మార్గాన్ని అన్యులకు తెలియచేసిన గొప్ప దార్శనికుడు. 

ఈయన సీలీషియాలోని తార్సు లో జన్మించాడు. ఆయన ఒక పరిసయ్యుడు, మరియు రోమా సామ్రాజ్య పౌరుడు. కఠినమైన యూద మత శిక్షణ పొందాడు. యూదయ బాలునిగా ఆయన ధర్మ శాస్త్రంను ఎప్పుడు మననం చేసుకుంటూ ఉన్నాడు. తాను అప్పటి గొప్ప గురువు అయిన గమాలియేలు తాత్వికుని  దగ్గర శిష్యరికం చేశాడు. అప్పటి ఆలోచన విధానం , తాత్వికంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 

పునీత పౌలుగారు మొదట  శ్రీసభ హింసకుడు. క్రైస్తవులను హింసించాడు. ఆయన ఎవరిని చంపినట్లు మనం చూడం కాని అతను క్రైస్తవులను చంపుతున్నప్పుడు సాక్షిగా ఉన్నాడు. క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు మార్గ మద్యంలో యేసు ప్రభువు, సౌలు సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు , అని మాట్లాడిన మాటలు  ఆకాశం నుండి  వింటున్నాడు. తాను దృష్టిని కోల్పోతున్నాడు. ఎవరు ప్రభువా మీరు అని అడుగగా నీవు హింసిస్తున్న క్రీస్తును నెనే అని ప్రభువు చెబుతున్నాడు. ఇక్కడ మారుతున్నాడు.  హింసకుడు విశ్వాసిగా మారుతున్నాడు. ఆయన ఒక నూతన సృష్టిగా మారుతున్నాడు. పౌలుగారు తన మారు మనసు పొందిన విధానం, డమస్కస్ మార్గ మధ్యంలో జరిగిన సంఘటనను చెప్పడం  ఎప్పుడు కూడా మరచిపోలేదు. ఆయన పది సంవత్సరాలు తను  పరిచర్య చేయుటకు శిక్షణ పొందాడు. అరేబియా , డమస్కస్ , యెరుషలేము , సిరియా మరియు శీలిసియాలలో ధర్మ శాస్త్రంను  అధ్యాయనం చేస్తూ , ప్రార్ధనలో జీవించాడు. తనను పిలిచిన దేవునికి సాక్షిగా జీవించడానికి సిద్దపడ్డాడు. 

పునీత పౌలుగారు  అనేక నూతన సంఘాలు ఏర్పాటుచేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. నూతన సంఘాలు ఏర్పాటు చేస్తూ అనేక ప్రదేశాలు తాను స్వయంగా ప్రయాణీంచాడు. ఆయన అన్నీ ప్రయాణాలలో కూడా పౌలుగారు తనను పంపిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి అని కృతనిశ్చయంతో ఉన్నాడు. 

పునీత పౌలు గారు గొప్ప బోధకుడు మరియు లేఖనకారుడు.   నూతన నిబంధంలో 13 లేఖలు ఆయన రాశాడు. ఆయన రాసిన లేఖలు మనకు ఆయన వ్యక్తిత్వాన్ని , ఆయన విశ్వాసాన్ని , ఆయన నైతికతను తెలుపుతాయి. పౌలు గారు ఇతరులను క్రీస్తు అనుచరులుగా చేయడం కోసం బ్రతికాడు. ఆ పనిలోనే అమరుడయ్యాడు. తన కోసం ఏమి కోరుకోలేదు. కాని తనకు తెలుసు దేవుని ముందు మంచి జీవితం జీవించాడు అని. పౌలు గారు జీవితంలో పొందిన అనేక శ్రమలలో ఆయన ఎప్పుడు నిరాశ చెందలేదు. ఇంకా ఎక్కువగా ప్రభువు కోసం పని చేశాడు. సంఘాలను ప్రోత్సహించాడు. వారిని వదలి వేయకుండా తన లేఖల ద్వారా వారికీ మార్గ నిర్దేశం చేశాడు. అన్నీ వదలి పెట్టి దేవుని మీద ఎలా ఆదారపడి బ్రతకాలో పౌలు గారు చూపించారు. కాని తాను పని చేయడం మానలేదు. దేవుని యెడల ఒకే విశ్వాసం కలిగి ఉన్నాడు. అది "నీ కృప నాకు చాలును." మన విధులను మనం నెరవేరుస్తూ దేవుని కృప చాలును అని జీవిద్దాం.

యేసు క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం

 యేసు క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం 

అదికాండం 14:18-20 1కోరింథీ 11:23-26 లూకా 9:11-17 

 సువిశేషం: జనసమూహములు ఈ విషయమును తెలిసికొని వారిని వెంబడించేను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్ధుగ్రుంక నారంభిచినప్పుడు  పన్నిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి , "ఇది నిర్జన ప్రదేశము. ఇక వీరిని పంపివేయుడు; పల్లె పట్టులకు వెళ్ళి, వారికి కావలసిన భోజనవసతులను చూచుకొందురు." అని ఆయనతో చెప్పిరి. "మీరే వీరికి భోజనము పెట్టుడు" అని ఆయన పలుకగా "మా యొద్ద ఉన్నవి అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే. మేము పోయి, వీరికి అందరకు కావలసిన ఆహార పదార్ధములు కొనితెత్తుమా?" అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి అయిదువేలమంది పురుషులుండిరి . వారిని పంక్తులుదీర్చి, పంక్తికి ఏబది మంది చొప్పున కూర్చుండ బెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట  యేసు ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసికొని, ఆకాశమువైపు  చూచి , వానిని ఆశీర్వదించి , త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరు భుజించి , సంతృప్తిపడిన పిదప మిగిలిన  ముక్కలను శిష్యులు పండ్రెండుగంపలకు ఎత్తిరి.

 చారిత్రక నేపధ్యం:  బెల్జియం దేశానికి చెందిన  జులియాన అనే ఒక   సన్యాసిని తనకు కలిగిన ఒక దర్శనం ద్వారా యేసు ప్రభువు యొక్క దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని జరపాలి అని కోరారు. 1230 వ సంవత్సరంలో తన దర్శనాన్ని కొంతమంది పండితలుకు తెలియజేసిన అది బయటకు పొక్కి ఆమెను అనేక మంది హేళన చేశారు. కాని 1246 వ సంవత్సరంలో లియేజ మెత్రాసనం  ఈ పండుగ జరుపడానికి ఆమోదం తెలిపింది. జులియానకు సహాయంగా ఉన్న జకేస్ పంటలోన్ 1261 లో 4 వ ఉర్బన్  పోపు గారు అయ్యారు. 1264 లో తిరుసభ మొత్తనకి ఈ పండుగను వ్యాపింపచేశారు.

 దివ్య సత్ప్రసాదం మానవ కోరిక : దివ్య సత్ప్రసాదం అంటే ఏమిటి యేసు ప్రభువు మానవునితో కలిసి ఉండటానికి పవిత్ర పూజలో అప్ప ద్రాక్ష రసంలను తన శరీరం , రక్తంగా మార్చి తన సాన్నిధ్యాన్ని మనం అనుభవించే విధంగా చేసి మనలోనికి రావడానికి మనతో ఉండటానికి దేవుడే ఏర్పరిచిన ఒక దివ్య సంస్కారం. శ్రీ  సభలో అనేక పండుగలు ఉన్నాయి కాని యేసు ప్రభువు యొక్క దివ్య శరీర రక్తముల మహోత్సవం ఒక ప్రత్యేకం అయినది. ఎందుకంటే యేసు ప్రభువు యొక్క నిజమైన సాన్నిధ్యానికి ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి పండుగ ఇది.  ఇది   దివ్యసత్ప్రసాద దైవ సంస్కారానికి సంభందించిన పండుగ. ఈ పండుగ  యేసు ప్రభువుని దివ్య సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడు అనుభవించాలి అనే ఒక కోరికతో , ఆయన సాన్నిధ్యానికి మరియు  దేవుడు మనకు దివ్య సత్ప్రసాద రూపంలో   తోడుగా ఉన్నందుకు   కృతజ్ఞత తెలియచేసే పండుగ. 

ఈ పండుగలో మనము  ముఖ్యముగా ఏమి నేర్చుకోవాలి అంటే యేసు ప్రభువు సాన్నిధ్యాన్ని ఎలా అనుభవించాలి అని నేర్చుకోవాలి.  యేసు ప్రభువు కడరా బోజన సమయంలో రొట్టెను తీసుకోని  ఇది నా శరీరము  మీరందరు దీనిని తీసుకోని  భుజించండీ అని చెప్పడం వలన తన శిష్యులను యేసు ప్రభువు అర్హులుగా చేస్తున్నారు అంటే వారిని పవిత్ర పరుస్తున్నారు.  ప్రతి ఒక్కరు ఆయనను స్వీకరించలేరు. ఆయనను స్వీకరించడానికి నీవు అర్హుడవు కావాలి ముందు.పాత నిబంధనలో అపవిత్రంగా దివ్య మందసాన్ని తాకిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. కాని ఇక్కడ మనం పాపులుగా ఉన్న యేసు ప్రభువు మనలను పవిత్ర పరచి ఆయనను స్వీకరించడానికి అర్హులుగా చేస్తున్నారు. ఇది మనం ఊహించలేని ఒక వరం. అందుకే పునీతులు దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్న యేసు ప్రభువును స్వీకరించడానికి ఎంతో ఇష్టపడేవారు.

 పునీతులు ఎలా దివ్య సత్ప్రసాదంను గౌరవించారు

 ఆరోజులలో ప్రతి రోజు దివ్య బలి పూజ ఉండేది కాదు. వారనికి ఒక సారి  ఉండేది. పునీత చిన్న తెరజమ్మ గారు యేసు ప్రభువును స్వీకరించాలి అనె గొప్ప కోరిక కలిగి ఉండేది.  తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో తన గది నుండి దివ్య పూజ బలి జరిగే ప్రదేశానకి రావడానికి చాలా సమయం పట్టేది.  ఆమె తన గది నుండి క్రిందకు దిగి వచ్చే సమయాంలో ప్రతి మెట్టు దగ్గర ఆగవలసి వచ్చేది. అప్పుడు ఆమె అసమాతో బాధపడుతూ ఉండేది.  అవి ఒకరకముగా ఆమె చివరి రోజులు. వారానికి ఒక సారి అయిన నేను యేసు ప్రభువును నాలోనికి స్వీకరించాలి అని ఆమె ప్రొద్దున్నే తన గది నుండి దివ్య పూజ బలి జరిగే ప్రదేశం వచ్చే సరికి మూడు గంటలు సమయం పట్టేది. అది చూసిన ఆ మఠ పెద్ద గారు , ఆమెను నీవు రావద్దులే అనినా కాని యేసు ప్రభువును తనలోనికి స్వీకరించాలి అని ఆమె వచ్చేది.

ఆవిలాపూరి తెరేసమ్మ గారు తాను నూతన మఠాలను స్థాపించడానికి గల కారణం ఏమిటి అని చెబుతున్నప్పుడు శ్రీ సభకు వ్యతిరేకముగా ఉద్యమం జరిగినప్పుడు అనేక చర్చిలలో దివ్య సత్ప్రసాదంను నేల మీద పడవేసి అగౌరపరిచారు. అది యేసు ప్రభువును అగౌరపరచడం అని ఆమె అనుకునేవారు. ఆ అగౌరవానికి పరిహారముగా తాను నూతన మఠాలను ఏర్పరిచేవారు. ఆ మఠాలలో సన్యాసినులు  ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్న యేసు ప్రభువును ఆరాధించేవారు, ఆ విధంగా యేసు ప్రభువుకు జరిగిన అగౌరవాన్ని, తాను ఈ నూతన మఠాల ద్వారా పరిహారం చేయాలనుకున్నాను అని ఆమె చెబుతుంది. 

ఇది మన రక్షకుడు  అయిన యేసు ప్రభువు తన సాన్నిధ్యాన్ని మన మధ్య ఏర్పారుచుకున్నందుకు కృతజ్ఞతగా జరుపుకునే పండుగ అని చెప్పుకున్నాం. అసలు  యేసు ప్రభువు   ఎందుకు యేసు ప్రభువు మన  మధ్య ఉండాలి అని తన సాన్నిధ్యం ఏర్పరుచుకున్నారు? దీనికి సమాదానం ఆయన శిష్యులు   ఎక్కువ తెలివి గలవారో , ఇతరులను ప్రభావితం చేయగలవారో అని కాదు,  కానీ వారు చాలా బలహీనులు అని ,  ఆయన వారితో ఉన్నట్లైయితే వారు మంచి వారీగా , చేడుకు దూరముగా అదే విధముగా దైవ నిబంధనలకు అనుకూలమైన వారీగా జీవిస్తారు అని.  యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నప్పుడు వారు చాలా ధైర్యంగా ఉన్నారు.  యేసు ప్రభువు వారి మధ్య లేనప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభువుకు తెలుసు.  వారు అందరు భయ భ్రాంతులకీ గురి అవుతున్నారు.  పారిపోతున్నారు. అందుకే ఆయన వారి మద్యనే ఉండాలి. ప్రభువు దివ్య పూజ బలి ద్వారా, దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడము ద్వారా ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మనం ఈనాడు ఆయన శరీరరక్తాలను స్వీకరిస్తూ ఆయన సాన్నిధ్యం అనుభవిస్తున్నాం. 

దైవ సాన్నిధ్యం  - దివ్య బలిపూజ 

యేసు ప్రభువు రొట్టెను విరుచుటతోటి ఎమ్మావు  మార్గాన పోయే శిష్యులు ఆయనను గుర్తు పడుతున్నారు. అంతకు ముందు వారు దేవుని వాక్కుని విన్నారు. కాని అప్పుడు వారు గుర్తించలేని దైవ సాన్నిధ్యాన్ని ఆయన రొట్టను విరిచినప్పుడు గారు గుర్తిస్తున్నారు.  యేసు ప్రభువు సాన్నిధ్యము  వారి మధ్యనే ఉంది అని  ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఆయనను కనుగొన్నారు. దీనినే శిష్యులు కూడా చేయడం ప్రారంభించారు. వారు వెళ్ళిన ప్రతిచోట  దైవ వాక్కు బొదిస్తూ   కలిసి రొట్టె విరవడం మొదలు పెట్టారు. కనుకనే మొదటి క్రైస్తవులు ఒకే హృదయము,  మనసు కలిగి,  కలిసి ప్రార్దన చేసి ,భుజించారు. ప్రభువు విందును తీసుకున్నారు. ఈనాటి సువిశేషంలో మనము చూస్తాము యేసు ప్రభువు రొట్టెను చేపలను తీసుకొని " ఆకాశమువైపు  చూచి , వానిని ఆశీర్వదించి , త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను." ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు ఒక సంజ్ఞ. సంజ్ఞ అంటేనే అది మరి ఏదో చూపిస్తుంది అని. అది ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం. దివ్య బలి పూజలో రొట్టె , ద్రాక్ష రసం  క్రీస్తు శరీర రక్తలుగా మారటాన్ని సూచిస్తున్నాయి. 

 శిష్యులు దైవ వాక్కు ప్రకటిస్తూ ప్రపంచ నలుమూలల వెళ్ళినప్పుడు అనేక చోట్ల క్రొత్త సంఘాలను ఏర్పాటు చేశారు. వారు ఒంటరిగా వెళ్ళక వారితోపాటు  యేసు ప్రభువును తీసుకొనివేళ్లారు, వారు ఏ విధంగా ప్రభువుని తీసుకు వెళ్లారు అంటే వాక్యం ద్వారా మరియు రొట్టె విరవడం ద్వార. ఇది అనేక మందికి ఆదర్శం అయ్యింది. ఇది  యేసు ప్రభువు వారికి నేర్పింది. నా జ్ఞాపకార్ధం చేయమని చెప్పినది. అంతె కాదు దీనికి ఎవరిని దూరం పెట్టేది కాదు. అందుకే పునీత పౌలు గారు ప్రభువు భోజనాన్ని మీరు అందరు కలసి తీసుకోవాలి అని కొంత మంది ధనికులు వేరుగా పేదవారు వీరుగా కూర్చున్న సందర్భం లో పౌలు గారు కోరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు. 

 శ్రీ సభ ఎదిగేకొద్ది  దివ్యసత్ప్రసాధమునకు  ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. దివ్య సత్ప్రసాదం తరచూ స్వీకరించడం అంటే క్రీస్తు ప్రభువుతో మనం సాన్నిహిత్యం పెంచుకోవడం. ఆయనతో వ్యక్తిగత సంభందం కలిగి ఉండటం. క్రీస్తుతో వ్యక్తిగత సంభందం కలిగి ఉండటం అంటే ఆయనతో స్నేహం కలిగి ఉండటం. దానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. పునీత  చిలి దేశ తెరెసా గారు తాను మొదటి సారి యేసు ప్రభువు స్వీకరించే సమయంలో (మొదటి దివ్య సత్ప్రసాద స్వీకరణ) పవిత్రంగా యేసు ప్రభువును తన హృదయంలోనికి స్వీకరించాలి అని తన కుటుంబం మొత్తం దగ్గరికి వెళ్ళి వారి పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినట్లు అయితే క్షమించమని ప్రతి కుటుంబ సభ్యుని ముందు మోకరించి  అడిగారు , అంతె కాదు తన ఇంటిలో పని చేసే సేవకుల ముందు కూడా మోకరించి వారి పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినట్లయితే క్షమించమని అడిగారు.  యేసు ప్రభువుతో సాన్నిహిత్యం పెంచుకోవాలి అంటే, లేక వ్యక్తిగత సంబంధం పెంచుకోవాలి అంటే మనం పవిత్రంగా జీవించాలి. 

 దివ్య సత్ప్రసాద స్వీకరణ - అర్హత 

యేసు ప్రభువును స్వీకరించడానికి మనం అర్హులమా అని మనం అనుకోవచ్చు. కాని యేసు ప్రభువే మనతో ఉండాలని, ఈ అప్ప ద్రాక్షరూపంలో మన దగ్గరకు వస్తున్నారు. మనలను ఆయన కేవలం ఆహ్వానించటంలేదు. ఆయనను స్వీకరించడానికి అర్హులను చేస్తున్నారు. అనేక అవకాశాలు ఇవ్వడం వలన ఆయన మనలను ఆయను స్వీకరించడానికి అర్హులను చేస్తున్నారు. జ్ఞాన స్నానం ద్వారా ఆయన మనలను శ్రీ సభ బిడ్డలుగా చేస్తున్నారు. భద్రమైన అభ్యంగనం ద్వార పవిత్రాత్మను ఇస్తున్నారు. పాప సంకీర్తనం ద్వార మన పాపములను క్షమిస్తున్నారు. దివ్య సత్ప్రసాదం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి శక్తిని ఇస్తున్నారు మనలోనికి రావడం ద్వారం మరియు మనతో వాసం చేయడం ద్వారా మనలను ఆయన మాతృకలుగా చేయడానికి , ఆయన వలె జీవించేలా చేయడానికి అన్నీ అవకాశాలు ఇస్తున్నారు. కనుక తరచూ ఆయనను స్వీకరిస్తూ ఆయన వలె మారుదాం. ఆమెన్ 
 

త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం

 త్రిత్వయిక  సర్వేశ్వరుని మహోత్సవం

 సువిశేషము : యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియాలోని  పర్వతమునకు వెళ్లిరి. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు  వచ్చి వారితో "ఇహపరములందు నాకు సర్వాధికారమీయబడినది. కనుక మీరు వెళ్ళి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మోసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు అజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు.  ఇదిగో లోకాంతము  వరకు  సర్వదా నేను  మీతో నుందును" అని అభయ మొసగెను. 

మానవ జీవితములోని   ప్రతి విషయం మనకు తెలియకుండానే  దేవునితో ముడి పడి ఉంది.  మానవ రక్షణ చరిత్ర చూసినప్పుడు ఇది మనకు  తెలుస్తుంది. ప్రతి మానవుడు తన ఉనికి గురించి ఆలోచించినప్పుడు ఖచ్ఛితముగా దేవుని గురించి ఆలోచిస్తాడు, అతను దేవున్ని నమ్మిన లేక నమ్మకపోయిన దేవుని ఉనికి  గురించి  ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దేవుని యొక్క ఉనికి, స్వభావం, మరియు ఆయనతో మన సంబంధం గురించి ఆలోచించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. 

మానవుడు ఈ సమాజంలో ఉంటున్నాడు కనుక దేవుని గురించి మానవునికి మొదటగా తెలిసేది ఈ సమాజం నుంచే తెలుస్తుంది. మనకు క్రైస్తవులుగా దేవుని గురించి  దేవుని వాక్కు ద్వారా తెలుస్తుంది. దేవుడు తనను తాను పవిత్ర గ్రంధంలో తెలియపరచడం ద్వారా తెలుస్తుంది. మన సొంత ఆలోచన ద్వారా కూడా దేవుని గురించి మనకు తెలుస్తుంది, కాని అది సంపూర్ణం  కాదు. కాని ఎప్పుడైతే అది దేవుడే తెలియయ పరుస్తాడో అది సంపూర్ణంగా  ఉంటుంది. పవిత్ర గ్రంధం  ఇది మనకు ఇది తెలియజేస్తుంది.  

ఇది కేవలం పవిత్ర గ్రంధం తెలియ పరిచే  విషయం మాత్రమే కాదు, మానవుని యొక్క అనుభవం కూడా. ఏమిటి  ఈ మానవుని అనుభవం దైవం గురించి, మరియు పవిత్ర గ్రంధం తెలియజేసేది అంటే  దేవుడు ఒక్కడే కాని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. పవిత్ర గ్రంధం ఈ సత్యాన్ని మనకు  తెలియ జేస్తుంది. మరియు మానవ అనుభవం ఇది తెలియ పరుస్తుంది. 

దీనిని మనం ఎలా అర్ధం చేసుకుంటున్నాము అని అంటే మొదటిగా ఇది ఒక అనుభవం. యేసు ప్రభువు తో  శిష్యుల కలసి జీవించారు. వారికి యేసు ప్రభువు ప్రార్ధించడం, దేవునితో మాటలడటం అన్నీ తెలుసు. ఆయన వారికి బోధించాడు. ఆయన ఎలా ప్రజలతో మెలిగింది వారు చూసారు. వారు ఆయనను నమ్మిన వారి జీవితాలలో ఏమి జరిగినదో వారు చూసారు. ఇంకా ముఖ్యముగా  పవిత్రాత్మ వారి మీదకు వచ్చిన తరువాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారు ఆనందంతో పిత, పుత్ర, పవిత్రాత్మను గురించి మాటలాడటం ప్రారంభించారు. యేసు ప్రభువు వారిని తండ్రి గురించి బోధించారు. పవిత్రాత్మను పంపుతాను అని చెప్పారు.  యేసు ప్రభువు ఎవరితోనో మాటలాడిన విషయం, ఆ వ్యక్తి  తండ్రి అని, మరలా యేసు ప్రభువు వారికి వాగ్దానం చేసిన వ్యక్తి పవిత్రాత్మ అని విషయం వీరు తెలుసుకుంటున్నారు. 

వారు దేవున్ని ఒకే వ్యక్తిగా చూస్తూ, వారికి వచ్చిన అనుభవాన్ని వారి మత సంప్రదాయ ప్రకారం చూసారు. వారు అనుభవించిన ముగ్గురు వ్యక్తుల ప్రేమను వారు విభిన్నంగా ఉండాటాన్ని  గమనించారు. ప్రతి అనుభవాన్ని దైవ అనుభవంగానే వారు చూసారు. వీరికి వచ్చిన ప్రతి అనుభవాన్ని వీరు  పరిశీలించినప్పుడు అది దైవం అని వారు గ్రహించారు. దీనిని అనేక విధాలుగా వారు చెప్పడానికి ప్రయత్నించారు . 

క్రైస్తవ ప్రధాన నమ్మకం దేవుడు ఒక్కడే, కాని పిత పుత్ర పవిత్రాత్మగా ఉన్నారు అని తెలియజేస్తుంది. దేవుని వాక్కులో  ఈ పదాలు మనకు ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు కాని అనేక విధాలుగా ఇది మనం పవిత్ర గ్రంధంలో చూస్తాము. 

తండ్రి పుత్ర , పవిత్రాత్మలను తెలియ పరుచుట : యేసు ప్రభువు తనను తాను దేవుని కుమారుడను అని తెలియ పరుచుకున్నారు. ఆయన మాటల ద్వారా, ప్రార్దన ద్వారా, విమోచక క్రియల ద్వారా, మరణ పునరుత్థానం ద్వారా , పవిత్రాత్మ శక్తి ద్వారా. తండ్రి యొక్క శక్తిని తెలియ పరిచాడు. ఈవిధంగా ఆయన త్రీత్వాన్ని తెలియ పరిచాడు. పవిత్రాత్మ కూడా త్రీత్వాన్ని తెలియ పరిచారు. పవిత్రాత్మ ప్రభావం వలన  మరియమాత గర్భం దరించుట వలన యేసు ప్రభువు మానవ రూపం తీసుకోవడంతో కుమారుని గురించి ఆత్మ  తెలుపుతుంది. యేసు ప్రభువు జ్ఞాన స్నానం తీసుకునే సమయంలో పవిత్రాత్మ వస్తుంది. తరువాత అపోస్తులుల యొక్క హృదయాలను నింపినప్పుడు మనం చూస్తున్నాం. మత్తయి 28:19. 

యేసు ప్రభువు తన తండ్రిని తెలియ పరుచుట : దేవుడు ఎవరు అనే ప్రశ్నకు  యేసు ప్రభువు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియజేస్తున్నారు అంటే దేవుడు ఇలా ఉంటారు అని తెలియ పరుస్తున్నారు. దేవుడు  పరలోక  రాజ్య దేవుడు తండ్రి అని తెలుపుతున్నాడు. దేవుని రాజ్యంలో ఎలా ఉంటుంది తెలియజేస్తున్నారు. అది మానవున్ని పూర్తిగా విమోచించెటువంటి రాజ్యం. ఎటువంటి అసమానతలకు తావు లేనిది అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ రాజ్యం గురించి ప్రకటిస్తూ దీనిని ఈ లోకంలో స్థాపించాలని చెబుతున్నారు. ఏ విధంగా తండ్రి అయిన దేవుడు మానవున్ని కాపాడుతూ వచ్చాడు పూర్తిగా వివరిస్తున్నారు. పాపిగా ఉన్న మానవునితో దేవుడు ఎలా సఖ్యత పొందుతున్నారో తెలియ పరుస్తున్నారు. అనేక ఉపమానలతో. 

దేవున్ని యేసు ప్రభువు అత్యంత కనికరం కలిగిన తండ్రిగా తెలియ పరుస్తున్నారు. సువిశేషాలు యేసు ప్రభువుకు తండ్రికి మధ్య గల బంధం తెలియ పరుస్తున్నాయి. యేసు ప్రభువు దేవున్ని ఒక కుటుంబ సంబంధమైన బంధానికి తీసుకొస్తున్నారు. దేవున్ని తండ్రి అని బోధిస్తున్నారు. తన ప్రార్ధనలు అన్నీ తండ్రికి విన్నవిస్తున్నారు. మార్కు 1:35, 4:46,  లూకా 3:21, 5:16.  తండ్రిని అత్యంత మంచి తనం కలిగిన వాడుగా యేసు ప్రభువు తెలియ పరుస్తున్నారు. దేవుడు తన ప్రజలు తనను వేతకాలి,  అని అనుకోక తప్పిపోయిన తన బిడ్డల కొరకు పోతుంటారు. ముఖ్యంగా ఆయన నుండి దూరంగా వెళ్ళిన వారి వద్దకు వారిని వెదుకుతూ వెళుతుంటారు. యేసు ప్రభువు ఉపమానలలో అయోగ్యులు, చెడ్డవారినికూడా, పాపులకోసం వెదికే వ్యక్తిగా తండ్రిని యేసు ప్రభువు చూపిస్తున్నారు. లూకా 6:35. ఆయన తనను విధేయించే వారిమీద కూడా కనికరం కలిగిన ఉంటాడు. లూకా 15:30. 

 యేసు ప్రభువు  తాను దైవ కుమారునిగా  తెలియ పరుచుకొనుట : యేసు ప్రభువు తాను దేవుని కుమారునిగా తన మాటలు, బోధనలు, పనుల ద్వారా తాను దేవుని కుమారినిగా తెలియచేసుకున్నారు. యేసు ప్రభువు  ఈలోకంలో దేవుని ప్రతినిధిగా కాక  దేవున్ని ఈ లోకంలో తన ప్రవర్తన ద్వారా, పనుల ద్వారా, బోధనల ద్వారా  చూపించారు అంతే కాదు దేవున్ని స్పర్శించేలా చేశారు. దేవుని గురించి మానవ ఆలోచనలు మారె విధంగా చేశారు. మార్కు 2:28. 

యేసు ప్రభువు తనలో విశ్వాసం వుంచమని చెబుతున్నారు. ఆ విధంగా ఆయన దేవుని కుమారుడు అంటే ఏమిటో తెలియచేసారు. ఆయన విమోచన క్రియల ద్వారా విమోచనం పొందిన వారు దేవుని విమోచన శక్తిని అనుభవించి ఈయన దేవుడు అని గ్రహిస్తున్నారు. మనల్ని స్వస్థ పరిచేది, రక్షించేది, ప్రాణమిచ్చేది,దేవుడే. ఈ పనులు అనుభవించినవారు ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నారు. ఎందుకంటే ఆయన దేవుని శక్తితో, పనిచేశాడు. దేవుని శక్తి కోసం ఆయన అడగలేదు. అది ఉన్న వాని వలె ప్రవర్తించాడు. మానవులకు అసాధ్యం అయ్యి దేవునికి మాత్రమే సాధ్యమయ్యే పనులను ఆయన చేసి తాను దేవుడను , దేవుని కుమారుడను అని తెలియజేశారు. మార్కు 10:27. తనలో విశ్వాసం ఉంచమని యేసు ప్రభువు చెప్పిన సందర్బాలు ఏమి అంటే ఆయన తనను తాను తెలియ పరుచుకున్న సందర్భాలలో. 

ముగ్గురు వ్యక్తుల యొక్క ధ్యేయం ఏమిటి అంటే దైవ రాజ్య స్థాపన, మానవ రక్షణ, పిత పుత్ర పవిత్రాత్మ ముగ్గురు కూడా ఒకె ధ్యేయం కలిగి ఉన్నారు. యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన చివరి బోధనలో కూడా మనం ఇది చూస్తున్నాం. తండ్రికి ఉన్నది అంతయు నాది . అంతయు అంటే తండ్రి యొక్క కర్తవ్యం. ప్రేషీత కార్యం. మానవ రక్షణ కార్యం. మరియు దైవ రాజ్య స్థాపన. కుమారుని  గురించి తండ్రికి మాత్రమే పూర్తిగా తెలుసు అధె విధంగా తండ్రి గురించి కుమారునికి మాత్రమే పూర్తిగా తెలుసు. ఇది వారి ఇద్దరి మధ్య ఉన్న బంధం మనకు తెలియజేస్తుంది. ఇది వారి మద్య ఉన్న పరస్పర  ప్రేమను  , మరియు గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు , ఈయన యందు నేను ఆనందించున్నాను. మత్తయి 3: 17. యేసు ప్రభువు కూడా అదే విధంగా అంటున్నారు " నా తండ్రి, మరియు మీ తండ్రి " అని యోహను 20:17. కేవలం కుమారుడు మాత్రమే తండ్రిని మనకు తెలియ పరచగలడు. తండ్రిని మనం తెలుసుకోగలిగేది కుమారుని ద్వారానే. ఎందుకంటే ఆయనకే పూర్తిగా తండ్రికి తెలుసు.  అంతె కాదు యోహను సువార్త 10:30 లో మనం చూస్తున్నాము. యేసు ప్రభువు నేను తండ్రి ఒకటే అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు పవిత్రాత్మను తెలియ పరుచుట : యేసు ప్రభువు మాటల కంటేకూడా  తన పనులలో ప్రభువు పవిత్రాత్మను తెలియ పరిచారు. యేసు ప్రభువు యోహను 14:16 లో మార్కు 3: 28-30 లో  తెలియ పరుస్తారు. అంటే అంతకు ముందు పవిత్రాత్మను   గురించి తెలియ లేదని కాదు. మొదటి నుండి యేసు ప్రభువు పవిత్రాత్మతో ఉన్నారు తాను మానవ రూపాన్ని పవిత్రాత్మ ప్రభావం వలన పొందారు.లూకా 1: 35, మత్తయి 1:20.  అయన జ్ఞాన స్నానం  పొందినప్పుడు పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది. మార్కు 1:9-11. ఆయన పవిత్రాత్మచేత ఏడారికి తీసుకుపోబడ్డారు. లూకా 4:1-14. ఆయన పవిత్రాత్మ శక్తితో అద్భుతాలు చేస్తున్నారు. మార్కు 3:20-30. మత్తయి 12:28. పవిత్రాత్మ యొక్క సాన్నిధ్యం యేసు ప్రభుని పునరుత్థానం సమయంలో మనం చూస్తున్నాము. శిష్యులు ఈ పవిత్రాత్మ ద్వారా ఎంతో ధైర్యాన్ని పొందుతున్నారు.  త్రీత్వాన్ని యేసు ప్రభువు రక్షణ కార్యాన్ని తెలుసుకోకుండా అర్ధం చేసుకోవడం కష్టం. ఎందుకంటే యేసు ప్రభువు తాను రక్షణ కార్యానికి పూనుకున్నప్పుడు పిత పుత్ర యొక్క తోడ్పాటు, వారి ధ్యేయం తెలియచేస్తున్నారు. అది తన ఒక్కడిదే కాక పిత , పుత్ర మరియు పవిత్రాత్మది అని తెలియ జేస్తున్నాడు. త్రీత్వం లో మానవ రక్షణ రహస్యం ప్రకటించబడింది. 

యేసు ప్రభువు వలె పవిత్రాత్మ కూడా త్రీత్వాని తెలియ పరుస్తుంది. మొదటి నుండి పవిత్రాత్మను దేవునిగా మనం ధర్మ శాస్త్రంలో చూస్తాము. పవిత్రాత్మ ముఖ్యముగా కుమారున్నీ లోకానికి తెలియ జేస్తారు. మనం పవిత్రాత్మ ద్వారా కుమారియి వద్దకువస్తాము. అందుకే పవిత్రాత్మను క్రీస్తుని ఆత్మగా పిలుస్తాము. రోమి 8:9. ప్రభుని ఆత్మ అని పిలుస్తాము. 2 కోరింథీ 3:17. యోహను గారు ఆత్మ తండ్రి నుండి వస్తుంది అని చెబుతున్నారు. యోహను 15:26. మరల కుమారుడు ఆత్మను పంపుతాను అని వాగ్ధానం చేస్తున్నాడు యోహను 16:8. 

క్రీస్తు మోక్షరోహణ మహోత్సవం

  క్రీస్తు మోక్షరోహణ మహోత్సవం 

మత్తయి  28:16-20 

సువిశేషము: యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియలోని పర్వతమునకు వెళ్ళిరి. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు  వచ్చి వారితో "ఇహపరములందు నాకు సర్వాధికారమీయబడినది. కనుక మీరు వెళ్ళి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు అజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును" అని అభయ మొసగెను. 

 క్రీస్తు ప్రభువుని పరలోకానికి మోక్ష రోహణ  అవ్వడం చాల ముఖ్యమైన ఒక మహోత్సవం. మత్తయి సువిశేషంలో యేసు ప్రభువు మోక్ష రోహణం అయిన పర్వతం మీద అంతిమ సందేశం ఇచ్చి మోక్ష రోహణం అవుతారు, ఆ భాగం మత్తయి రాయరు కాని అంతిమ సందేశం రాశారు. లూకాగారు దీనిని తన సువిశేషంలో మరియు అపోస్తుల కార్యాలలోకూడా ఈ సంఘటన గురించి రాస్తున్నారు. మార్కు గారు మోక్ష రోహణం గ్రంధస్తం చేశారు. యోహాను సువిశేషంలో చివరి దర్శనంలో ఆయన మరలా రావడం గురించి ప్రస్తావిస్తారు.  యేసు ప్రభువు పునరుత్థానం అయిన 40 రోజులు తన శిష్యులకు అనేక సార్లు  దర్శనం ఇచ్చారు. దీని తరువాత ఆయన దర్శనాలు ఆగిపోతున్నాయి. ఆయన తండ్రి దగ్గరకు వెల్లుతున్నారు. ఇప్పడు ఈ సందర్భంలో దేవదూతలు శిష్యులతో మాటలాడుతున్నారు. గలీలియ వాసులారా ! మీరు ఎందుకు ఇక్కడ నిలుచొని ఆకాశం వైపు చూస్తున్నారు, మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ  యేసుమరలా తిరిగి వచ్చును అని చెబుతున్నారు. అపో 1:11. అంటే యేసు ప్రభువు మరల తన శిష్యుల దగ్గరకు వస్తారు. వారిని విడిచి పెట్టుట లేదు. వారిని ఎన్నడూ ప్రభువు విడిచి పెట్టరు. ఇంకనూ మీరు ఇక్కడ ఉండవద్దు అని దేవదూత చెబుతుంది. అంటే యేసు ప్రభువుని పని ఏ విధంగా ముగుస్తుందో ఇప్పుడు శిష్యులు తమ గురువును గురించి, ఆయన చెప్పిన దైవ రాజ్యం గురించి బోధించడం ప్రారంభిస్తారు.  

మానవ రక్షణకు  తాను చేయవలసిన పని సంపూర్ణం అయ్యింది అని తెలియచేస్తుంది 

మోక్ష రోహణం యేసు ప్రభువు ఈ లోకంలో తన పరిచర్య ముగించుకొని తన తండ్రి దగ్గరకు  తన మహిమాలోనికి మరలా వెళ్ళడం. హెబ్రీయుల లేఖలో యేసు ప్రభువు మన ప్రధాన అర్చకుడు అని ఆయన తన తండ్రి కుడి ప్రక్కన  కూర్చొని వున్నాడు అని మనం చూస్తున్నాం. "క్రీస్తు సర్వ కాలమునకు సరియగు పాప పరిహారార్ధమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన  కూర్చుండెను" హెబ్రీ 10:12.   అంటే మన తరుపున  తండ్రిని వెడుకొనడానికి  మన ప్రధాన అర్చకుడు సిద్ధంగా ఉన్నాడు. తాను పరలోకం వెళ్ళడం అంటే తన పని పూర్తి అయ్యింది అని అర్ధం. మనలను పాప రహితులుగా చేయుటకు అన్నీ సమకూర్చాడు అని అర్ధం .  తన మానవునిగా ఈలోకానికి వచ్చిన  చేపట్టిన రక్షణ కార్యం పరిపూర్ణం అయ్యింది అని అర్ధం.  

ఈ మోక్షరోహణం చాలా ముఖ్య మైన విషయాలు తెలియచేస్తుంది. యేసు ప్రభువు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శరీరంతో స్వర్గంలోనికి వెళుతున్నారు. అయన మరణాన్ని గెలిచిన మొదటి వ్యక్తి. ఎందుకు యేసు ప్రభువు మోక్ష రోహణం అవుతున్నారు. దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అని అంటే గతం వారం నుండి మనం సువిశేషంలో వింటున్నాము. యేసు ప్రభువు తన తండ్రి దగ్గరకు వెళుతున్నాను అని  చెబుతూ దానికి ఆయన అనేక కారణాలు కూడా చెబుతున్నారు. 

యేసు ప్రభువు తన నిజ మహిమాలోనికి వెళుతున్నారు 

యేసు ప్రభువు తన ఈ లోక పనిని అంటే మానవ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి తన పూర్వ స్థితికి , అంటే తన మహిమాన్విత రూపంలోనికి వెళుతున్నారు. యేసు ప్రభువు శిష్యులైన పేతురు , యోహను యకొబులు ఈ మహిమాన్విత క్రీస్తును ఆయన రూపాంతరికరణ చెందినప్పుడు చూసారు. మరల ఆయన మహిమాన్విత రూపాన్ని ఆయన తీసుకోబోతున్నారు ఈ మోక్ష రోహణం ద్వారా. "ఆయన చని పోయి జీవముతో లేవనెత్తబడి , దేవుని కుడి ప్రక్కన ఉంది మన మధ్య వర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయు వాడు."  రోమి 8:34. ఆయన ఎల్లప్పుడు తండ్రి తోనే ఉన్నాడు అని యోహను గారు తన సువిశేషంలో మొదటి అధ్యాయంలో చెప్పారు. ఆయన మహిమాన్విత రూపంలో ఉన్నప్పుడు ఆయన మన కోసం తన తండ్రికి విజ్ఞాపనలు చేస్తూ మనం కోసం పరితపిస్తున్నరు. 

ఆయన పవిత్రాత్మను పంపుటకు వెళుతున్నారు 

"నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు." యోహను 16:7.  యేసు ప్రభువు శిష్యులకు నేను వెళ్ళేది మీ మంచి కోసమే అని చెప్పారు. నేను వెళ్ళినచో మీకు పవిత్రాత్మను పంపుతాను అని చెప్పారు. యేసు ప్రభువు వెళ్ళి పవిత్రాత్మను పంపడం ద్వారా  పవిత్రాత్మ వారి మీదకు వస్తుంది. భౌతిక శరీరంతో ఉన్న యేసు ప్రభువుకు  తన శిష్యుల అందరితో ఉండటానికి సాధ్యం కాదు. పవిత్రాత్మను తన శిష్యులకు ఇవ్వడానికి, యేసు ప్రభువును పంపుతున్నారు. అందుకు యేసు ప్రభువు ఈ లోకంనుండి వెళ్ళి తను పరలోకం వెల్లుతున్నారు. 

 యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నప్పుడు వారు ఎల్లప్పుడు ఆయన నుండి అన్నింటిని స్వీకరించేవారు. తన శిష్యులు యేసు ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత వారు యేసు ప్రభువును అందరికి అందిస్తున్నారు. ఆయన చేసిన పనులు వీరు చేస్తున్నారు. ఆయన మాతృకలుగా వీరు మారుతున్నారు. "అప్పుడు పేతురు నా దగ్గర వెండి , బంగారమేమియు లేదు. నాకు ఉన్నాడానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసు క్రీస్తు పేరిట నీవు నడువుము" అపో 3:6. అని పేతురు అంటున్నారు. అంటే శిష్యులును తన మాతృకలుగా చేసి వారు , ప్రభువును లోకామునకు అందించేవారినిగా చేస్తున్నారు. ఆ విధంగా శిష్యుల ఔన్నత్యాన్ని చాటుతున్నారు. 

మనకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేయడానికి వెళుతున్నారు 

"నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటులచెప్పను. నేను మీకోక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను." యేసు ప్రభువు తన శిష్యులకు నేను తండ్రి వద్దకు వెళ్ళి మీకు ఒక నివాసం స్థలం ఏర్పాటు చేస్తాను అని చెబుతున్నారు. నా తండ్రి దగ్గరఅక్కడ  లేకపోతే నేను ఆ మీకు చెప్పను అని చెబుతున్నారు. అంటే మనకు నివాస స్థలం ఏర్పాటు చేయడానికి ప్రభువు  అక్కడకు వెళుతున్నారు. ఇది శాశ్వత  నివాస స్థానము. ఎందుకంటే ఈలోకం శాశ్వతమైనది కాదు. ఇది తాత్కాలిక మైనది. పుట్టిన ప్రతి ఒక్కరు మరణిస్తారు. కాని యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరికీ ఆయన శాశ్వత స్థానము ఏర్పరచడానకి ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నారు. అక్కడ లేక పోతే నేను అలా చెప్పను అని ప్రభువు అంటున్నారు. అంటే మనలో కొంతమంది పరలోకం గురించి నమ్మడానికి సిద్దంగా లేము. యేసు  క్రీస్తు మోక్ష రోహణం కూడా మనం పరలోకం మీద అటువంటి అపనమ్మకం లేకుండా ఉండమని చెబుతుంది. 

ఆయన మరల వస్తాడు 

యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం,    ఆయన మరలా వస్తాడు అని తెలియ జేస్తుంది. యేసు ప్రభువు మోక్ష రోహణం మనకు ఆయన మరలా వస్తాడు అనే భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పినవన్ని చేస్తున్నారు.  ఆయన  చనిపోయిన మూడవ రోజు మరణాన్ని జయించి లేస్తాను అని చెప్పిన విధంగా లేచాడు. నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. ఆయన అదే విధంగా తండ్రి దగ్గరకు వెళుతున్నారు.  నేను మరలా వస్తాను అని అంటున్నారు. నేను మరలా వచ్చినప్పుడు మిమ్ములను సంతోషంగా ఉండటాన్ని చూస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. అంటే ఆయన వెళ్ళినట్లయితే మరల ఆయన మన దగ్గరకు వస్తారు. మనం ఆనందంతో , నమ్మకంతో, విశ్వాసంతో ఆయన కోసం ఎదురుచూడాలి. 

మానవుడయిన యేసు పరలోక ప్రవేశం 

 యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం మనకు మరియొక ముఖ్యమైన విషయం తెలియజేస్తుంది. అది ఏమిటి అంటే ఈ రోజు మోక్ష రోహణం అవుతున్నది, మానవ రూపంలో ఉన్న యేసు ప్రభువు మన మానవ రూపం పరలోకానికి అర్హత సాదించడం ఇది. యేసు ప్రభువు తన తండ్రితో ఉండటం, పరలోకంలో ఉండటం క్రొత్త కాదు కాని మానవునిగా ఈలోకంలో ఉన్న ప్రభువు , మానవ స్వభావంతో, పాపం అనెది లేని ప్రభువు పరలోకం వెళ్ళడం ఒక ముఖ్యమైన విషయం. అంతే కాక ఇది మానవుని పొందగలిగే స్థితి తెలియజేస్తుంది. కనుక మనం అటువంటి జీవితం పొందడానికి అర్హులం అని తెలుసుకొని అందుకు యోగ్యులుగా  జీవించూదాం. 

తండ్రి ప్రేమ -హృదయ పరివర్తనకు పిలుపు

  తండ్రి ప్రేమ -హృదయ పరివర్తనకు పిలుపు 

దేవుని దృష్టిలో  పశ్చాత్తాప కన్నీరు  ఎంతో అమూల్యమైనవానిగా ఉంటాయి. దేవుడు మన కష్టంను, కన్నీరును చూసి తట్టుకోలేరు. పశ్చాత్తాపం అనేది దేవుడు చూపించిన ప్రేమకు మనం సరిగా బదులు ఇవ్వకుండా ఆయనను బాధకు గురి చేసినందుకు వచ్చేటువంటి అపరాధ భావం, దీనిని  గమనించి దేవుని  వైపు మరలి, ఆయన మార్గమును అనుసరించుటయే హృదయ పరివర్తన. మనం ఎప్పుడైతే ఇది కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. సహాజంగా మనం ఎప్పుడు దేవుని నుండి దూరంగా వెళ్ళుతాము అనేది  తప్పిపోయిన కుమారుని కథ ద్వార  తెలుసుకోవచ్చు. 

 ఈ కథను మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటిగా, చిన్న కుమారునికి  ఏమి జరిగింది. రెండవదిగా, పెద్ద కుమారునికి, తన తమ్ముని పట్లగల కోపం, మరియు తన తండ్రి విందు ఇస్తున్నందుకు అతని మీద వున్న వ్యతిరేకత. మూడవదిగా తండ్రికి కుమారుల మీద గల  ప్రేమ. 

 ఈ కథ చెప్పడానికి గల కారణాలను  మనం ఈ అధ్యాయం మొదటి మూడు వచనాలలో చూస్తాము. పాపులు, సుంకరులు యేసు ప్రభువు దగ్గరకు, ఆయన మాటలు వినాలని  వస్తున్నారు. ఆయన తో కలిసి భుజిస్తున్నారు.  అది నచ్చని పరిసయ్యులు మరియు ధర్మ శాస్త్ర భోధకులు, సణుగుకొనుచుండగా చెప్పిన కథ ఇది. వారి దృష్టిలో ఒక దైవ జనుడు పాపులతో కలిసి ఉండటం, మాటలాడటం మంచిది కాదు అని భావించారు. యేసు ప్రభువు  వారిని,వారి ఆలోచనలు,వారి భావాలు మార్చుకోవాలని , తాను ఈ లోకానికి వచ్చినది, దేవునికి దూరంగా వెళ్ళి పోయిన వారిని, వెదకి రక్షించడానికి అని, తెలియజేయడానికి అని చెప్పిన  కధ ఇది. 

ఈ కథలో చిన్న కుమారుడు,  తనకు ఉన్న అన్నీంటిని, అంటే  తన ఆస్తిని, సంపదను  వృధ చేసిన వాడు. అతనిని పిలిచే పదం కూడా అదే, ప్రోడిగల్ అని,  తప్పిపోయిన అయిన  దీని అర్ధం,దీని వేరు మాత్రం  కన్ను మిన్ను తెలియక  మొత్తం వృధా చేసిన వాడిగా పేరు పొందిన వాడు అని అర్దం. 

యూద సమాజంలో పిత్రార్జితంను ఎలా పంచుకోవాలి అని శాసనాలు ఉన్నాయి. పెద్దవానికి రెండు భాగాలు  ఆస్తి వస్తుంది. మిగిలినవారికి ఒక్కో భాగం వస్తుంది. ద్వితీ 21:17. అంటే చిన్న కుమారుడుకి  తనతండ్రి చనిపోయిన , తరువాత వారు భాగించుకునే మూడు భాగాలలో తనకుఒక భాగం వస్తుంది.   తనకు తండ్రి చనిపోయిన తరువాత, వచ్చే భాగాన్ని ఇప్పుడే  ఇవ్వమని, తండ్రి బ్రతికి ఉండగానే అడుగుతున్నాడు.ఇది తండ్రికి అవమానం. తండ్రి మరణాన్ని కోరుకోవడం లాంటిది. నీవు మరణించే వరకు నేను వేచి ఉండలేను అని  అంటున్నాడు అని అర్ధం వస్తుంది. 

చిన్న కుమారుడు తన ఇష్ట ప్రకారముగా తాను జీవించాలి అని అనుకుంటున్నాడు. మనం కూడా అనేక పర్యాయాలు తప్పు చేసేది ఇక్కడే, మన ఇష్ట ప్రకారం మనం జీవించాలి అని అనుకుంటాం. దేవుని ఇష్ట ప్రకారముగా మనం జీవించాలి అని అనుకొము. మన ఇష్ట పూర్తిగా జీవించాలి అని అనుకున్న, అప్పుడు కూడా  దేవుడు మనకు ఇచ్చిన వాటినే అనేక చెడు పనులకు వాడుతాము. చిన్న కుమారుడు కూడా తన తండ్రి ఇచ్చిన మంచి వాటిని, తన స్వార్ధ, లోకాశలకు వాడుతున్నాడు. అంతటినీ పాడు చేసుకుంటున్నాడు. నా ఇష్ట ప్రకారం జీవించాలి అనే ఆశ, లేక కోరిక మనలను దేవుని నుండి, మనల్ని ప్రేమించే వారి నుండి దూరం చేస్తుంది. 

ఎప్పుడైతే మనం మన ఇష్ట ప్రకారంగా జీవించాలనుకుంటామో అప్పడు మనం మన కర్తవ్యాన్ని మరచిపోతం. ఎలా అంటే దేవుని ఆజ్ఞలలో తల్లి దండ్రులను గౌరవించడం అనేది చాల ముఖ్యమైనది, కాని చిన్న కుమారుడు అది మరచిపోతున్నాడు. ఈరోజు ఎవరైనాకూడా నా ఇష్ట ప్రకారం, నేను జీవిస్తాను అంటే, దాని అర్ధం, నేను చేయవలసిన నా కర్తవ్యాలను, నేను పాటించను అని అర్ధం. ఇక్కడ చిన్న కుమారుడు, తన తండ్రిని ఆదరించడం,గౌరవించడం  అనే తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.

15:13-16 వచనాలలో ఆస్తిని  సొమ్ముచేసుకొని, దూరదేశము వెళ్ళి, అక్కడ దానిని దుర్వినియోగం చేసి, అక్కడ కరువు రావడంతో, ఇబ్బందులకు గురి అయ్యాడు. ఆ దేశములో ఒకనికి పందులు మేపు, పనికి వెళ్ళాడు.పందులు తిను పొట్టుతో,  కడుపు నింపుకొనుటకు ఆశ పడేను. ఇది మనకు,  మనం దేవుని నుండి దూరం అవుతున్న కొద్ది, ఎంత దిగజారిపోతామో తెలియ జేస్తుంది. తండ్రితో కలిసి జీవించిన వ్యక్తి, అనేక మందితో సఫర్యాలు చేయించుకున్న వ్యక్తి , మొదట, తన ఇష్ట ప్రకారం జీవిస్తా అన్నాడు, ఆస్తిని మొత్తం సొమ్ము చేసుకున్నాడు,దూరంగా వెళ్ళాడు, అంతా పాడు చేశాడు, నైతికంగా దిగజారాడు, బానిసగా బ్రతకాడానికి సిద్ద పడ్డాడు, అంతటితో ఆగలేదు, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. అంటే వాటిలో ఒకనిగా ఉండ సిద్దపడ్డాడు, దేవునికి దూరమయ్యే కొద్ది, మనం ఇంతటి దీన స్థితికి చేరుతాము. ఇష్టమైన కుమారుని నుండి దూరమై, బానిసగా బ్రతికి జంతువు స్థాయికి చేరుకుంటున్నాం.  

తరువాత  చిన్నవాడు కనువిప్పు కలిగి,  నా తండ్రి దగ్గర, ఎంత మంది పనివారికీ పుష్టిగా భోజనం దొరకడంలేదు? నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను, అని తలంచాడు. తనకు కనువిప్పు కలగడం,  పరివర్తన ఏమి  కాదు.  కాని తన నిజ స్థితిని తెలుసుకుంటున్నాడు. తాను అధ్వాన్న స్థితికి చేరుకున్నాను, అని తెలుసుకుంటున్నారు. తన ఇంటిలో ఉన్న సేవకుల కంటే,తక్కువ స్థితి కలిగిన వాడిని  అని తెలుసుకుంటున్నాడు. యూదాయ కుటుంబాలలో మూడు రకాల సేవకులు ఉండేవారు. మొదటిగా కుటుంబసేవకులు 2. కుటుంబ సేవకులకు   సహాయం చేసే సేవకులు 3. దినసరి సేవకులు. చిన్న కుమారుడు అనుకున్నది దినసరి సేవకులలో, తనని కూడా ఒకనిగా ఒప్పుకోమని, తండ్రిని అడగాలని నిశ్చయించుకొని, తండ్రి దగ్గరకు బయలు దేరుతున్నాడు. 

మనం ఎప్పుడైతే, దేవుని నుండి దూరంగా వెళ్ళి, తప్పు చేశామని తెలుసుకుంటామో, ఆయనతో ఉండటం, మనకు ఇష్టమే అని అనుకుంటామో, అప్పుడే మనలను దేవుడు మాన్నిస్తాడు. ఎందుకంటే దేవునికి కావలసినది తన బిడ్డలు తనతో ఉండటం. మనం అందుకు అర్హులము కాకపోయినా, మన పాపములను క్షమించి, మనలను పవిత్రులను చేసి, అర్హులను చేసి, అక్కున చేర్చుకుంటాడు, మన పరలోక తండ్రి. 

తండ్రి ప్రేమ 

లూకా 15:20 అక్కడ నుండి లేచి తన తండ్రి దగ్గరకు వెళుతున్నాడు. కుమారుడుని దూరంగానే చూసి,  జాలితో ఎదురెల్లి కౌగలించుకుంటున్నారు. తండ్రికి తెలుసు, ఆ కుమారుడు చేసిన పనికి, అందరు ఆయనను పరిహాసమాడుతారని, తన ఆస్తిని మొత్తం పాడుచేసుకొని వచ్చాడని  గేలి చేస్తారు, అని తెలుసు, అందుకే ఆయనే వెళ్ళి రక్షించుకుంటున్నారు. ఇతను వచ్చాడని ఎవరు గెలిచేయకుండా రక్షిస్తున్నాడు. ఎదురెళ్ళి కాపాడుతున్నారు. పునీత ఆవిలపూరీ తెరేసమ్మ గారు "దేవుడు మన పాపాలు బయట పడకుండా, మనలను కాపాడుతారు, ఎందుకంటే అవి బయటపడితే మనలను ఇతరులు  గౌరవించరేమోఅని" అంటూ వుంటారు. ఇందుకేనేమో. 

తండ్రి తన ప్రేమ, జాలి చూపించడంలో, తాను పెద్దవాడిని అని కూడా మర్చిపోతున్నారు. అంతే కాదు తనకుమారుడు చేసిన,  తప్పును కూడా పట్టించుకోవడం లేదు. కేవలం తన కుమారున్నీ చూడటం కోసం మాత్రమే కాదు, కుమారుని, దీన స్థితిని ఎవరికి కనిపించకుండా చేస్తున్నారు. అందరు చూస్తుండగానే, తన కుమారున్నీ కౌగలించుకుంటున్నాడు.తన కుమారున్నీ అంగీకరిస్తున్నాడు. తండ్రితో కుమారుడు  తండ్రి నేను నీకును దేవునికిని వ్యతిరేకముగా పాపము చేసితిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకోజాలను అని చెబుతున్నారు. ఆయన  ఏమి అయితే చెప్పాలని అనుకున్నాడో, అవి అన్నీ చెప్పకుండానే, అంటే తనను, అక్కడ  ఉన్నటువంటి దినసరి  కూలీలా, చూడ మని చెప్పకుండానే, తండ్రి తనను కౌగిలించుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఇది మొత్తం చిన్న కుమారుడు చేసింది, తాను తండ్రి గొప్పతనం తెలుసుకొని కాదు, కేవలం తనకు కడుపు నిండ తిండి దొరుకుతుంది అని మాత్రమే. అందుకు తాను వచ్చే ముందుగా తండ్రికి ఏమి చెప్పాలో ముందే ప్రణాళిక వేసుకొని  వచ్చాడు. కాని  తండ్రికి కావలసినది తన కుమారుడు తన దగ్గర ఉండటం, అందుకే కుమారుడు తాను చెప్పాలి అనుకున్నది కూడా , మొత్తం చెప్పనివ్వడం లేదు. తన కుమారుడు తన దగ్గరకు, మారు మనస్సు పొంది వచ్చాడా? లేదా ? అని కూడా చూడటం లేదు. వచ్చిన వెంటనే కౌగలించుకుంటున్నారు.  అంతే కాదు కోల్పోయిన స్వేచ్ఛను మరల ఇస్తున్నాడు. ఉంగరం తొడగడం వలన, క్రొత్త బట్టల ద్వార, చెప్పులు ద్వార తాను బానిస కాదు అని చెబుతున్నాడు. 

పెద్ద కుమారుడు 

లూకా  15: 25  ఇప్పుడు  పెద్ద కుమారుడు పొలం నుండి వస్తున్నాడు. ఇంటికి రాగానే  సంగీతం వినపడుతుంది, నృత్యం చేస్తున్నారు. ఒక సేవకుడను పిలిచి ఏమి జరుగుతూంది, అని అడుగగా  తన తమ్ముడు వచ్చిన విషయం, అతనికి చెప్పారు, క్రోవ్విన  గొర్రే తో వారు విందు చేసుకోవడం, చెబుతున్నారు. కోప పడిన  పెద్ద కుమారుడు ఇంటిలోనికి రావడానికి సిద్ధపడటం లేదు. తండ్రి బయటకు వచ్చి, అతనిని  బ్రతిమలాడుతున్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుని కంటే తక్కువ ఏమికాదు. తమ్ముడు తన వాట అడుగుతున్నప్పుడు, అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆస్తి మొత్తం సొమ్ము చేసుకొని వెళ్తున్నప్పుడు ఆపలేదు. తండ్రిని అగౌరపరిచినప్పుడు, తప్పు పట్టలేదు. తాను కూడా  స్వార్ధంగానే ఆలోచించాడు. తమ్ముడు పోతే నాకేమీలే అనుకున్నాడు. తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు తట్టుకోలేక పోతున్నాడు. పరిసయ్యులు ధర్మ శాస్త్ర భోదకులు కూడా ఇలానే ఉన్నారు. పాపులు , సుంకరులు యేసు ప్రభువు దగ్గరికి వస్తే తట్టుకోలేక పోతున్నారు. 

మనం కూడా కొన్ని సందర్బాలలో ఇలానే ఉంటున్నాము. ఒకసారి ఆలోచించండి. మీ అన్నదమ్ములు, అక్క, చెల్లెలు లేక మీ బిడ్డలు తమ తప్పు తెలుసుకొని వస్తే, ఆదరిస్తున్నమా? లేక మేము క్షమించలేము అంటున్నమా? మనం తండ్రి మనస్సు కలిగి ఉండాలి. 

యూదయా  కుటుంబలలో, పెద్ద కుమారుడు అతిధులను ఆహ్వానిస్తాడు, వారి యోగా క్షేమాలు కనుగొంటాడు. అంతే కాదు ప్రధాన ఆహ్వానితుడును, గౌరవించాలసినది కూడా పెద్ద కుమారుడే.  అంటే చిన్న కుమారుడను ఆహ్వానించాలసినది, పెద్ద కుమారుడే.  చిన్న కుమారుని వలె, పెద్ద కుమారుడు కూడా, తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. తనకు తనతమ్ముడి మీదఉన్న అభిప్రాయం, అందరు వెళ్ళిన తరువాత చెప్పవచ్చు, కాని తన తండ్రిని అందరి ముందు, పెద్దకుమారుడు అగౌరపరుస్తున్నాడు. తన కోపాన్ని తండ్రి మీద చూపిస్తున్నాడుతండ్రి పక్షపాతి అని అంటున్నాడు.    కొన్నిసార్లు  మనంకూడా , దేవుడు ఇతరులకు చూపించే దయ, కనికరం గురించి, ఆయనకు ఫిర్యాదు చేస్తుంటాం. దేవున్ని పక్షపాతి అని నిందిస్తుంటం. 

అంత మంది సేవకుల  ముందు, తండ్రిని కించ పరిచినా, తండ్రి  తన కుమారున్నీ బ్రతిమాలు తున్నాడు. కుమారున్నీ తిట్టడంలేదు. తండ్రి , తన పెద్ద కుమారుడు ,తమ్ముడిని అంగీకరించడం లేదు అని, ఆయనను శిక్షించి ఉండవచ్చు. కాని  తండ్రి అవి ఏమి చేయకుండా తన కుమారున్నీ వెదకుకొంటూ, కుమారుని దగ్గరకు,  బయటకు వచ్చి,  లోనికి రమ్మని, మంచి మాటలతో అడుగుతున్నాడు. తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాడు. మనము విందు చేసుకొనుట సముచితం  అని చెబుతున్నాడు. 

లూకా 15:29  లో  తన తండ్రికి, పెద్ద కుమారుడు తగని  జవాబు ఇస్తున్నాడు. ఇదగో ! ఇన్ని సంవత్సరాలు నేను నీకు ఊడిగం చేశాను, ఎప్పుడు నీ మాట జవాదాట లేదు. అయినప్పటికీ నీవు నాకు చిన్న గొర్రె పిల్లను కూడా, నా స్నేహితులతో విందు చేసుకోవడానికి ఇవ్వలేదు.కానీ నీ సంపదను వేశ్యలతో, వినోదలతో పాడు చేసిన, ఈ నీ కుమారుడు రాగానే,నీవు వాడి కోసం క్రోవ్విన  గొర్రెను  వధించావు అంటున్నాడు. తండ్రిని, నీవు అని అంటున్నాడు.  తమ్ముడుని, నీ కుమారుడు అంటున్నాడు. కానీ తండ్రి మాత్రం కుమారా! అని అంటున్నారు.  చిన్న కుమారున్నీ నీ తమ్ముడు అని అంటున్నాడు. తండ్రి తన మాటల ద్వార, తెగిపోయిన తండ్రి కుమారుల బందాన్ని, చిగురించే విధంగా ప్రయత్నిస్తున్నాడు. పెద్ద కుమారుడు, తన మాట, ప్రవర్తన ద్వార, తాను బానిస అనుకుంటున్నాడు. కాని  కుమారునిగా మాటలాడటంలేదు. తన ప్రవర్తన ద్వార  తండ్రికి తగిన వాడను కాదు అనిపించుకుంటున్నాడు. మనం కూడా, ఈ విధంగా ప్రవర్తిస్తే తండ్రికి తగిన బిడ్డలము కాము. ఒక సారి మనం దేవునికి తగిన బిడ్డలమా ? కాదా? అని పరిశీలించుకుందాం.  

నీవు నీ  సోదరుని అంగీకరించినంత మాత్రాన, నీకు ఏమి నష్టం రాదు, నీకు వచ్చేది ఏమి పోదు. తండ్రి  పెద్ద కుమారునికి,  నాకు ఉన్నదంతయు నీదే అని అంటున్నాడు. పెద్ద కుమారుడు తాను ఎప్పుడు,  తండ్రి మాట జవాదాటలేదు అని చెబుతున్నాడు. నిజానికి తండ్రిని  అగౌరపరచాడు. తన తమ్ముని మీద అసూయ ఉంది, అని స్పష్టముగా తెలుస్తున్నది. పెద్ద కుమారుని  ప్రకారం ఆనందం అనేది వేరె వారితో పంచుకోవడం.  కాని  తండ్రీకి  తప్పిపోయిన దానిని తీరిగి చేర్చి, దానితో కలిసి ఆనందించడం.   

పెద్ద కుమారుడు ,  తన తమ్మున్ని  చెడ్డవానిగా చెబుతున్న, తన నిజమైన స్థితి ఒక బానిసదే. తండ్రి మాత్రం తనకు వ్యతిరేకంగా ఉన్నా,కుమారున్నీ  శిక్షించక, నాకు ఉన్నదంతయు నీదే అని తనని  కుమారునిగానే చూస్తున్నాడు.  ఈ విందు లేక తమ్ముని రాక వలన అతనికి ఏమి పోవడం లేదు. పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు, యేసు ప్రభువు దగ్గరకు  పాపులు, సుంకరులు రావడం వలన, వారి ప్రాముఖ్యత తగ్గుతుంది అని అనుకుంటున్నారు. నీవు జీవించే జీవితం బట్టి , నీ ప్రాముఖ్యత ఉంటుంది. ఇతరులు రావడం లేక పోవడం వలన కాదు. 

 మనం విందు జరుపుకొనుట యుక్తము, ఎందుకంటే చనిపోయిన నీసోదరుడు మరల బ్రతికెను, తప్పిపోయిన వాడు మరల దొరికెను అని చెబుతున్నారు. మనం ఏమి చేశాము, తండ్రిని ఎంత బాధ పెట్టము, అని తండ్రి లెక్కించాడు, తనకు తన కుమారుడు వచ్చాడు. అది ఆనందించే సమయం.  

ఇక్కడ ముఖ్యమైనది తండ్రి యొక్క ప్రవర్తన. తన ప్రేమ జాలి దయ, కృప మనం అడగకనే  చూపిస్తూ ఉన్నాడు. కుమారుడు వచ్చినందుకు చేసిన  విందు కూడా మన పట్ల  దేవుని ప్రేమ, ఎటువంటిది అని తెలియచేస్తుంది. ఏప్పుడైతే ఒక వ్యక్తి మారి, దేవుని సన్నిదికి రావడానికి సిద్దపడుతాడో, అప్పుడు  దేవుడు ఎంత  ఆనంద పడుతాడో ఇది తెలియచేస్తుంది. 

తప్పిపోయిన కుమారుని జీవితం,  దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను మనం  సరిగా వాడుకోక పోతే మనం ఎటువంటి, ధుర్భర పరిస్థితిలోనికి నెట్టబడతామో తెలియచేస్తుంది.  ఆ పరిస్తితిలోనే ఉండక, పశ్చత్తాపం ద్వారం తండ్రి దగ్గరకు రావాలని తెలియజేస్తుంది. మనలను అంగీకరించడంలో, క్షమించడం లో దేవుడు ఎప్పుడు అలసట చెందరు, ప్రతినిత్యం సిద్దంగానే ఉంటారు. దేవుని ప్రేమ ఎటువంటి షరతులు లేనిది, ఎల్లప్పుడు నీకోసం పరితపిస్తుంది, నీకోసం ఎదురుచూస్తుంది. కనుక ఎప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళుటకు వెనుకడుగువేయక ముందుకు పోదాం. ఆమెన్ 

పాస్క కాల 6 వ ఆదివారం

 పాస్క కాల 6 వ ఆదివారం 

యోహను 14:23-29 

 అపో 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 లేక దర్శన 22:12-14,16-17,20 యోహను 14:23-29 
సువిశేషం:అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చేను: "నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు. నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడుఅనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించినేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని  మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను యిచ్చుట లేదు. మీ హృదయములు కలవర పడవలదు. భయపడవలదు. నేను వెళ్ళి మరల మీ వద్దకు మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు  వినియున్నారుగదా!తండ్రి నా కంటే గొప్ప వాడు. కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నందుకు మీరు సంతోషించేదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంబవింపక పూర్వమే ఇపుడు మీతో చెప్పుచున్నాను. 

యేసు ప్రభువు మూడు బహుమతులు గురించి వింటున్నాం. 1. ఆయన మనతో కలిసి జీవించడం. 2. ఆయన తన శిష్యులకు ఇచ్చే శాంతి 3. పవిత్రాత్మను పంపుట ఈ మూడు బహుమతులు యేసు ప్రభువు తన శిష్యులకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. 
 ఆదాము పాపము చేయక ముందు దేవుడు మానవునితో కలిసి జీవించాడు. కానిపాప కారణముగా  దేవునితో ఉన్న సామీప్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు.  మరల అది సాధ్యం కావాలి అంటే మనం ఆయన  ఆజ్ఞను పాటించాలి. 

యెషయా ప్రవక్త , మీ పాపములు దేవుని నుండి మిమ్ములను  వేరు చేస్తున్నాయి  అని చెబుతున్నారు. యేసు ప్రభువు,  ఈ మాటలను చివరి తీర్పు సమయంలో చెప్తున్నారు? గొర్రెలను, మేకలను వేరు చేస్తాను అని చెబుతున్నారు.  యేసు ప్రభువు తనను ప్రేమించె వారి వద్దకు తండ్రితో  వచ్చి వారితో ఉంటానని చెపుతున్నారు.
యేసు ప్రభువును ప్రేమించడం అంటే ఏమిటి ? వారి వద్దకు ఎందుకు యేసు ప్రభువు వస్తాను అని అంటున్నారు. మనం ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞను తిరస్కరించి నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే, మనం అబద్ధం ఆడిన వారము అవుతాము. ఒక వ్యక్తి యొక్క వ్యవహారం శైలి , వారి క్రియలు వారు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా, లేదా   తెలుపుతాయి. 

ఆయన్ను ప్రేమించే కుటుంబంలో ఆయన సభ్యుడని అవుతానని అని ప్రభువే చెబుతున్నారు. ఆయనను ప్రేమించడం అంటే  ఆయన ఆజ్ఞలను పాటించడమే అని యేసు ప్రభువు చెబుతున్నారు.

యేసు ప్రభువు నేను వారి వద్దకు వస్తాను అంటున్నారు అంటే ఏమిటి? మనలను ఆయనతో పాటు జీవించడానికి, యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నారు. అంటే మనలను ఆయన వలె జీవించడానికి ఆహ్వానం, మరియు ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలని చెబుతున్నారు.  ఒక వ్యక్తి ఆయనను అనుసరించక పోతే వారు తండ్రిను అనుసరించడం లేదు, అని యేసు ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు మాటలు తండ్రి మాటలు అని మనకు ఇక్కడ తేటతెల్లం అవుతుంది.
ఇక్కడ మనకు ఒక విషయం అర్ధం కావాలి అది ఏమిటి అంటే ఆయన మనతో ఎలా ఉంటారు. ఇవి  కేవలం మాటలు మాత్రమేనా? లేక ఏమైనా ఇతర అర్ధం ఉన్నదా? నిజానికి యేసు ప్రభువును ప్రేమించిన కొంత మంది పునీతులు ఈ మాటలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి వారి జీవితాలలో ఆయనను అనుభవించారు, వారు ఈలోకంలో ఉండగానే. 

వారిలో కొంతమంది పునీత ఆవిల పురి తెరేసమ్మ, ఎలిజబెత్ ఆఫ్ థ ట్రినిటీ వంటి వారు. అందుకే ఆమె నా పరలోకాన్ని భూమి మీద కనుగొన్నాను అని చెబుతుంది. ఎందుకంటే ఆమె హృదయం లో ఉన్న దేవున్ని ఆమె ప్రతి నిత్యం అనుభవించింది. అదే విధంగా తెరేసమ్మ గారు, దేవున్ని చూడాలంటే మనకు పరలోకం పోవడానికి రెక్కలు అవసరం లేదు, నీ హృదయంలోనికి వెళితే సరిపోతుంది అని చెబుతుంది.
 వీరు ప్రార్ధనలో మన హృదయంలో ఉన్న దేవున్ని కనుగొన వచ్చో చెబుతున్నారు. పునీత ఫ్రాన్సిస్ గారు ఏ విధంగా జీవిస్తే ఆయన మనతో ఉంటారో తన జీవితం ద్వారా చెబుతున్నారు. వారందరూ యేసు ప్రభువును అనుభవించిన వారే.

ఇక్కడ యేసు ప్రభువు నేను మీకు శాంతిని ఇస్తాను అని చెప్పారు. లోకం ఇచ్చేలా కాదు. మీరు భయ పడవలదు  అని చెపుతున్నారు. ఇది ఆయన తన శిష్యులకు ఇచ్చే ఒక బహుమతిశాంతి కోసం మనం ఎక్కడకు ఎల్లాలి? ఈలోకం  ఈ శాంతి ఇవ్వలేదు అది కేవలం యేసు ప్రభువులో మాత్రమే దొరుకుతుంది.

నేను మీకు శాంతిని ఇస్తాను నా శాంతి మీకు ఇస్తాను అని చెపుతున్నారు ఆయన శాంతి అంటే ఏమిటి?  ఆయనను ప్రేమించే వారు భయ పడరు, ఎందుకంటే ఆయనను ప్రేమించే వారికి ఆ శాంతి ఉంటుంది. ఈరోజు అందరు శాంతి కోసం అందరు  వెదుకుతున్నారు కాని వెదకవలసిన చోట వెదుకట లేదు. 

ఆయన ప్రేమ మరియు క్షమ మనలను సమాధానంతో ఉండేలా చేస్తుంది.  యేసు ప్రభువు, నేను నన్ను ప్రేమిచ్చే వారి వద్దకు వచ్చి వారితో నివాస ముందును అంటున్నారు. దాని ద్వారా మనకు శాంతి వస్తుంది. 

లోకం నిజమైన శాంతిని ఎరుగదు. ఎందుకంటే లోకానికి శాంతి అంటే ఎటువంటి అలజడి లేకుండా ఉండటం, గొడవలు, యుద్దాలు  లేక పోవడం మాత్రమే. కానీ యేసు ప్రభువు ఇచ్చే శాంతి ఇటువంటిది కాదు ఆయన ఇచ్చే శాంతి ,అంతరంగీకమైనది.
 
ఆయన మన  వద్ద ఉండటం. ఎందుకు అంటే ఆయన  శిష్యుల వద్ద ఉంటే వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ సమాధానంతో వెళుతుంది, ఎందుకంటే ఆమెను ఆయన క్షమిస్తున్నారు.  యేసు ప్రభువు మన వద్దకు వచ్చి మనతోనే ఉంటాను అంటున్నారు. 

ఎలా ఆయన మనతో ఉండేలా చేయాలి. యేసు ప్రభువే మనకు ఒక జవాబు ఇస్తున్నాడు, ఎలాగా అంటే ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ఆయన మనతో ఉంటారు. ఎందుకు ఆయన మనతో ఉండాలి ? ఆ అవసరం ఏమి ఉంది అంటే, ఆయన మనతో ఉంటే మనం ఎక్కువ ఫలవంతం అవుతాము. సమృద్దిగా ఫలమిస్తాము.

యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను లేక ఆదరణ కర్తను పంపు తాను అని వాగ్ధానం చేస్తున్నారు. ఇక్కడ పవిత్రాత్మ ఏమి చేస్తుందో కూడా యేసు ప్రభువు చెపుతున్నారు. పవిత్రాత్మ వారికి యేసు ప్రభువు చెప్పిన అన్నీం టిని గుర్తు చేస్తుంది. పవిత్రాత్మ శక్తి శిష్యులకు ఉత్సాహం ఇచ్చి సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతుంది.

 మీకు ఆధరణ కర్తను పంపుతాను అని యేసు ప్రభువు చెపుతున్నారు. పరక్లీత అని అరమయిక్ బాషలో అంటారు పరక్  అంటే రక్షించు , లేక కాపాడు, లేత అంటే శపించబడిన వారిని , లేక దేవుని మార్గమునకు దూరముగా ఉన్నవారిని  కాపాడువారు అని అర్ధం. 

అంటే పవిత్రాత్మ ఈ శిష్యులను ప్రోత్సహించి వారు సువార్తను ప్రకటించే విధంగా చేస్తుంది. పవిత్రాత్మ శిష్యులకు యేసు ప్రభువును అనుసరించడం అంటే ఏమిటో తెలుపుతుంది. మరియు సువార్తను ఏ విధంగా ప్రకటించాలో తెలుపుతుంది. పవిత్రాత్మ వారికి ఏ విధంగా ఉండాలో నేర్పుతుంది.వారికి శాంతిని తీసుకువస్తుంది. వారికి నిజమైన శాంతి ఇస్తుంది.

 యేసు ప్రభువు తన శిష్యులను వదలి తండ్రి వద్దకు వెల్లుచు,  తన శిష్యులను ఆయన  వదలి పెట్టుటకు ఆయన ఇష్ట పడుటలేదు. యేసు ప్రభువు లేని సమయంలో శిష్యులు ఎలా ఉండాలో యేసు ప్రభువు ముందుగానే నిశ్చయించారు. వారికి అంతకు ముందుగానే అనేక సార్లు దాని గురించి  వివరించారు. ఆయన వారి నుండి వెళ్ళే సమయంలో వారికి ఆయన  నామమున తండ్రి పవిత్రాత్మను పంపుతున్నారు. 

ఈ పవిత్రాత్మ  వారికి అవసరం ఎందుకంటే  యేసు ప్రభువు ప్రేమించిన విధంగా వారికి  ప్రేమను నేర్పాలి.మీ హృదయములను కలవర పడనియకుము , భయ పడవలదు. 

యేసు ప్రభువు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటి? ఈ సమయంలో శిష్యులు శ్రమలుకు గురి కావడం లేదు. పరిసయ్యులు , సద్దుకయ్యులు యేసు ప్రభువును అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాని యేసు ప్రభువు వారి వద్ద నుండి వెడలి పోయిన తరువాత వీరు అనేక కష్టాలకు గురి అవుతారు, దానికోసం వారిని సిద్ధం చేస్తున్నారు. 

మరల వారికి దేవుని ప్రేమను తెలియచేస్తున్నాడు.  దేవుడు మనలను ప్రేమిస్తున్నారు, మనతో ఉంటాను అన్నారు. కాని దానికి మనం సిద్ధంగా ఉన్నమా? ఆయన అజ్ఞాలను పాటిస్తున్నమా?

 దేవునికి మనకు ఏమి కావాలో తెలుసు కానీ అంత కన్నా మనకు ఏమి అవసరమో ప్రభువుకు తెలుసు.  ఆయనను ప్రేమించి , ఆయన ఆజ్ఞలకు పాటించి, ఆయనతో కలసి జీవించి, ఆయన పంపే ఆదరణ కర్తను ఆహ్వానించి, పవిత్రాత్మ ఫలాలను పొంది మన జీవితాలను ఫలవంతం చేసుకొని నిజమైన క్రీస్తు అనుచరులగా జీవించడానికి సిద్ధ పడుదాం. ఆమెన్
 

గుడ్ ఫ్రైడే ( పవిత్ర శుక్రవారం)

 గుడ్ ఫ్రైడే  ( పవిత్ర శుక్రవారం)

ప్రియ మిత్రులారా! ఈ రోజు యేసు ప్రభువు శిలువ మీద శ్రమలు పొంది మరణించారు. యేసు ప్రభువు ఎందుకు మరణించాలి? అని మనం అడిగినట్లయితే మన పాపములను క్షమించడానికి అని మనం నేర్చుకున్నాం.  ఆయన మన పాపములను తన  మీద వేసుకొని మనలను పాప విముక్తులను చేశాడు. ఒక సాధారణ మనిషికి ఇది చేయడం అసంభవం. యేసు ప్రభువు కేవలం మానవుడు మాత్రమే కాదు ఆయన దేవుడు కూడా కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఆయన బలి వస్తువుగా తనను తాను శిలువ పీఠం మీద అర్పించారు. ఆ విధంగా ఆయన బలి వస్తువు అయ్యాడు. మరియు ఈ శుక్రవారం మన రక్షణ కార్యన్ని    సాధ్యం చేశారు. 

పునీత మార్కు గారు యేసు ప్రభువు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య శిలువ వేయబడ్డాడు అని అంటున్నాడు. బందిపోటు దొంగలు అంటే వారు  రోమా సామ్రాజ్య అధికారంను అంగీకరించలేదు. వారి మధ్య యేసు ప్రభువును సిలువ వేయడమంటే ఆయను కూడా ఒక విప్లవ కారునిగా వారు చూసారు. ఇది మనం ఆయనకు తీర్పు ఇచ్చినప్పుడు చూస్తాము. కానీ  రోమా సైన్యాధిపతి ఇతను నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మార్కు 15:30. ఇతను దేవుని కుమారుడు అని మొట్ట మొదటిగా ఒక  అన్యుడు తెలుపుచున్నాడు. యేసు ప్రభువుని యొక్క శిష్యులుకూడా  ఈ విధంగా ఆయన గురించి చెప్పలేదు. వీరు రోమా చక్రవర్తి దేవుని కుమారుడు అని అనుకునేవారు. కానీ యేసు ప్రభువుని దేవుని కుమారునిగా తెలియ చేస్తున్నాడు. వారికి తెలియకుండానే ఆయన తమ అధిపతి అని చెబుతున్నారు. 

పునీత మార్కుగారు యేసు ప్రభువు మరణాన్ని అధికార వ్యవస్థ మీద తీరుగుబాటుకు కారణంగా  జరుగుతుంది అని తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు మీద దేవాలయ అధికారులు చాలా ద్వేషంతో ఉన్నారు. ఆయన వారి అధికారాన్ని  ప్రశ్నించాడు. వారి తప్పులను ఎత్తి చూపాడు. అందుకే ఆయన మీద కక్షకట్టారు. 

యేసు ప్రభువు మీద జరిగిన విచారణను ఒకసారి మనం పరిశీలిస్తే యేసు ప్రభువు ఎవరు అని మనం తెలుసుకోవచ్చు. విచారణ మొత్తంలో కూడా అక్కడ ఎటువంటి కలవరపాటు లేకుండా ప్రశాంతంగా ఉంది యేసు ప్రభువు మాత్రమే. పిలాతు లోపలకు బయటకు తీరుగుతున్నాడు, హెరోదు నాకు సంభందం లేదు అంటున్నాడు, పిలాతు బయపడుతూ చేతులు కడిగారు. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు గొడవ చేస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ యేసు ప్రభువు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎందుకు వచ్చినది, ఏమి చేస్తున్నది, ఏమి జరుగబోతున్నది. అందుకే అంత ప్రశాంతత కలిగి ఉన్నాడు. 

మొదటి పేతురు 3: 18వ వచనం మనకు యేసు ప్రభువు మరణానికి ఒక కారణం చెబుతుంది. "ఆయన ఒకే సారి పాపములకై మరణించేను. దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను." ఇది దేవుడు చేసిన ప్రణాళికా అని మనకు తెలుస్తుంది. కాని  ఇక్కడ యేసు ప్రభువుని పట్టిస్తున్న యూద తప్పు చేస్తున్నాడు. తన గురువును అమ్ముకుంటున్నాడు, తన స్వార్ధ బుద్ది చూపిస్తున్నాడు. చాలా సార్లు మనం పేతురు , యుదాలను పోల్చుతాం.  కానీ వారు ఇద్దరు రెండు వేర్వేరు స్వభావాలు కలవారు. పేతురు గురువును అమ్ముకోలేదు, ఆయన భయంతో అబద్ధం ఆడుతున్నారు. కానీ యూద వేరు. తన మనస్సు మొత్తం ధనం మీదనే ఉంది. మనం ధనం  దేవుని కంటే ఏమి గొప్పది కాదు అని తెలుసుకోవాలి. 

యూద ఇస్కారియోతు యేసు ప్రభువును పట్టిస్తే నాకు ఏమి ఇస్తారు అని ప్రధాన అర్చకుడును  అడుగుతున్నాడు. వారు ఆయనకు 30 వెండి నాణెములను ఇస్తున్నారు. యేసు ప్రభువును పట్టించడం వలన  ఒక స్త్రీ  యేసు ప్రభువు సిమియోను అనే వ్య్తకి ఇంటిలో విందుకు వెళ్ళినప్పుడు ప్రభువు  కాళ్ళకు అభ్యంగనం చేస్తుంది.  యేసు ప్రభువుని కాళ్ళకు అభ్యంగనం  చేసిన తైలం విలువ తనకు తిరిగి వచ్చిందని  యూదా ఆనందపడి ఉండవచ్చు. యేసు ప్రభువుని శిష్యుడై ఉండికూడా ఆయన ధననికి బానిస, అందుకే ఆయన తన గురువును పట్టిస్తున్నాడు. అంతకు ముందు తన గురువును వీడను అని ఇప్పుడు ఆయనను ఇతరులకు ఇస్తున్నాడు. 

అంత సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచెను. యోహను 19:30 

అది మధ్యాహ్నం 3గంటల సమయం, యేసు ప్రభువు నీటి కోసం అడిగారు వారు చేదు ద్రాక్ష రసాన్ని ఆయనకు ఇచ్చారు. అప్పడు అంతా సమాప్తమైనది అని యేసు ప్రభువు తల వంచి ప్రాణం విడిచాడు. 

యేసు ప్రభువు ఏమి సమాప్తం చేశాడు? ఏమి సమాప్తమైనది? యేసు ప్రభువు అంత సమాప్తమైనది అని అన్నప్పుడు ఆయన తన ప్రాణం గురించి కాదు మాటలాడింది. ఆయన అంటున్నది తనకు తన తండ్రి ఇచ్చిన మానవ రక్షణ కార్యం అంత సంపూర్తి చేశాను అని అంటున్నారు. 

దేవునితో మానవుని సఖ్యత అనేది పూర్తి అయ్యింది. దేవునితో మానవునికి వున్న అగాధం పూడ్చ బడింది. మన పాపం వలన,  ప్రేమ గల దేవునికి దూరంగా ఉన్నాము, ఆ దూరం తీసివేయబడింది. 

యేసు ప్రభువు చెప్పిన  అంత సమాప్తమైనది అనే  ఈ మాట, ఒక విజయ నినాదం. ఎందుకంటే యేసు ప్రభువు చివరి వరకు కూడా తన తండ్రి ఇచ్చిన ఈ కార్యాన్ని నిర్వర్తించాడు. యేసు ప్రభువుని కర్తవ్యం కేవలం రక్షించడం మాత్రమే కాదు, ప్రజల మీద తండ్రికి ఉన్న  ప్రేమను  చూపించడం కూడా. ఈ పనిని కూడా పరిపూర్ణంగా యేసు ప్రభువు చేశాడు. 

వీటన్నింటిని చేయడానికి యేసు ప్రభువు మరణిస్తున్నారు. దానిని మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం, నిజముగా అది గుడ్ ఫైడేనే. 

సిలువ మీద యేసు ప్రభువు దాహం అంటున్నారు, ఆయన దాహం నీటి కొరకు కాదు. నీటి కోసం కానప్పుడు మరి ఎందుకు దాహం కలిగి ఉన్నారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నా ఆహారం అని యేసు ప్రభువు  అంటున్నారు. ఆయన దాహం కూడా నీటి కోసం కాదు, భౌతికమైనది కాదు,  ఆయన ఆహారం లాంటిది. ఆయన దాహం కూడా  తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన దాహం తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడం. 

ఆయన ఈ లోకానికి వచ్చినది తండ్రి దేవునకు  మన మీద అపారమైన ప్రేమ కలిగిన తండ్రి అని తెలియజేయడానికి. ఈ పనిని తన మరణంతో పూర్తి జేస్తున్నాడు. యేసు ప్రభువు  అంత సమాప్తం అయినది అని అనడం విజయ నినాదం. ఏందుకంటే తండ్రి తనకు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసిన విజయ నినాదం. తన జీవితం మొత్తం ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. తాను పూర్తిగా అంటే తన చివరి శ్వాస వరకు ఈ పని చేస్తున్నాడు. చివరిగా అంత పూర్తి అయ్యింది అని చెపుతున్నాడు. 

యేసు ప్రభువు తన ఆత్మను వదలివేశాడు. అంటే ఆయన చనిపొతు తన ఆత్మను మన మీదకు వదిలాడు. ఇక్కడ మనం  హిస్సోపు  గురించి వింటున్నాము.   ఐగుప్తు లో  గొర్రె పిల్ల రక్తాన్ని  హిస్సపో కొలనుతో చిమ్మేవారు. యేసు ప్రభువు పాస్క గొర్రె పిల్ల వలె చనిపోతున్నారు. ఇదే సమయంలో పాస్క గొర్రె పిల్లలను వధించేవారు. యేసు ప్రభువు లోక పాపములను మోసేటువంటి గొర్రె పిల్ల వలె చనిపోతున్నారు. 

ఇంకా ఆయన ఏమి సంపూర్తి చేశారు? దైవ ప్రేమను పూర్తిగా చూపించారు,  తెగిపోయిన దైవ - మానవ సంభందంను సరి  చేశారు. ఆయన్ను నమ్మి, ఆయన్ను అనుసరించి దేవునితో కలసి  జీవించుదాం. 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...