26, ఫిబ్రవరి 2026, గురువారం
యోహను 16:16-20
యోహను 16:20-23
యోహను 16:20-23
సువిశేషం: మీరు శోకించి, విలపింతురు. కాని, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు. కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగ చెప్పు చున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనపడును. కాని, బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇపుడు దుఃఖముతో ఉన్నారు. కాని, నేను మిమ్ము మరల చూచెదను. అపుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడు తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు.
మన జీవితంలో వచ్చిన కొన్ని కష్టమైన సందర్భాలలో అనేకం ఉండవచ్చు. అటువంటి ఒక సందర్భాన్ని మనసు నందు వుంచి ఈ సువిశేష భాగాన్ని ధ్యానిస్తే మనకు ఇది ఎక్కువగా అర్ధం అవడానికి అవకాశం ఉంది. అప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. మనం దేవుడి మీద నమ్మకంగా ఉన్నమా? లేక మనకు వచ్చిన కష్టానికి మన మీద మనం కోపంగా , దీనంగా ఉన్నమా? , భయంగా ఉన్నమా? ఎందుకు ఇన్ని బాధలు చనిపోవడం మేలు అనుకుంటున్నమా? కొన్ని సార్లు మనకు వచ్చే బాధల్ని తట్టుకోలేక మనల్ని మనం శపించుకుంటాం. కాని ఈ సువిశేషం ద్వారా యేసు ప్రభువు మనలను ఓర్పు కలిగి ఉంటే మీ దుఃఖం , సంతోషంగా మారుతుంది అని చెపుతున్నారు.
యేసు ప్రభువు తన శిష్యులు తమకు ఎటువంటి రోజులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే వారికి వచ్చే కష్టాలు గురించి ముందుగానే చెబుతున్నారు. వారికి శోకించే, విలపించే ,దుఃఖించే సమయం వస్తుంది అని వారిని సిద్ధ పరుస్తున్నారు. అంతే కాదు వారి శోకం , విలాపం , దుఃఖం మారిపోయి ఆనందించే సమయం వారికి రానున్నది అని ప్రభువు వారికి వెల్లడిచేస్తున్నారు. మరలా వారు యేసు ప్రభువును చూసే రోజు వస్తుంది. వారికి ఆనందించే రోజు వస్తుంది అనే భరోసా వారికి ప్రభువు ఇస్తున్నారు. మనం ఆయన సాన్నిధ్యం మరియు ఆయన బహుమానం మనం పొందాలి అంటే మనం ఓర్పుతో వేచి ఉండాలి.
యేసు ప్రభువు ఇక్కడ ఒక ప్రసవ వేదనలో ఉన్న స్త్రీని ఉదాహరణగా చెబుతున్నారు. ఆమె ప్రసవించిన తరువాత తాను పొందిన బాధను, వేదనను మొత్తం మరచిపోతుంది. తాను ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన ఆనందం ఆమెకు ఉంటుంది. ఆ ఆనందం ఆమె పొందిన వేదన కన్నా చాలా గొప్పది. తన జీవితానికి ఒక నూతన అర్ధాన్ని ఇచ్చేది అవుతుంది.
ప్రతి తల్లికి తెలుసు, తన యొక్క వేదన కొద్ది సమయమే కావచ్చు, అది భరించలేనిదిగా ఉండవచ్చు ఆ స్త్రీకి. కాని తరువాత వచ్చే ఆనందము కోసం ఆమె ఆ బాధను భరించడానికి సిద్దంగానే ఉంటుంది.
మన జీవితంలో కూడా ఎటువంటి కష్టం లేకుండా మనకు అన్నీ సమకూరినా , దానిని మనం అనుభవించిన కాని, దాని మాధుర్యం మనం పొందలేము. కాని మన కష్టంతో కూడిన దాని ఫలితముగా మనకు వచ్చే మంచికి మనం ఎక్కువ విలువనిస్తాము. దాని మాధుర్యం గొప్పగా ఉంటుంది.
మనం చేయవలసినది, ఆయన మీద నమ్మకం ఉంచి వేచి ఉండాలి. కాని మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది అంత సులువు కాదు. మనకు మంచి జరుగుతుంది అని మనం నమ్మక పోవచ్చు. మనకు మంచి జరిగే రోజు చాలా దూరం ఉండవచ్చు. ఆయన మీద నమ్మకం ఉంటే మనం ఎంత కాలమైన ఆయన కోసం ఎదురుచూస్తాం. ఆయన మీద మన విశ్వాసం ఎంత గొప్పది అనేది తెలిసేది, మనం ఆయన్ను చూడకుండానే, ఆయన సాన్నిధ్యం పొందకుండానే ఆయన మీద నమ్మకంతో ఎదురు చూడటంలో.
"నేను మిమ్ము మరల చూచెదను అప్పడు మీరు సంతోషింతురు". ఇక్కడ యేసు ప్రభువు నేను మిమ్ము మరలా చూచెదను అని చెబుతున్నారు. ఇది రెండు సందర్భాల గురించి కావచ్చు. తాను మరణాన్ని జయించిన తరువాత ఆయన పునరుత్థాన క్రీస్తు వారిని చూసే సమయం. మరల ఆయన తుది తీర్పు సమయంలో ఆయన మరలా చూడటం గురించి చెబుతున్నారు. యేసు ప్రభువుని చూడటం అంటే మనం ఆనందించే సమయం. ఆయన వారికి ఇంకొక విషయం కూడా చెప్పారు. నేను ఎల్లప్పుడు మీతో వుంటాను అని చెప్పారు. అంటే మనం ఎల్లప్పుడు ఆనందంగా ఉండవచ్చు. ఆయన సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడు అనుభవించడం మనం నేర్చుకున్నప్పుడ. కనుక క్రీస్తు అనుచరులమైన మనం ఏళ్ళప్పుడు ఆయన సాన్నిధ్యం పొందడం నేర్చుకోవాలి.
ఆయన మనకు ఇస్తాను అని చెప్తున్న సంతోషం శాశ్వతమైనది. దానిని ఎవరు మీ నుండి తీసివేయలేరు అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి ఈ శాశ్వతమైన సంతోషం, ఎందుకు ఎవరు దీనిని మన నుండి తీసివేయలేరు అంటే అది అంతరంగీకమైనది. మన ఈ లోక కష్టాలు, బాధలకు అది అతీతమైనది. నేను రక్షింపబడ్డాను అనే సత్యం తెలుసుకోవడం ద్వారా వచ్చే సంతొషం అది. దాని అర్ధం నేను ఈ లోకంలో ఉండే సమస్యలకు అతీతుడును కాను, కాని ఇది తెలుసుకున్న తరువాత నేను పొందే బాధ, కష్టం నన్ను ఏమి చేయలేదు. ఆ సంతోషం మనకు చాలా ముఖ్యం. పునీతులు ఇటువంటి జీవితంను వారు అనుభవించారు. అందుకే వారు ఎటువంటి కష్టాలు అనుభవించిన, వారి జీవితాలలో ఎప్పుడు సంతోషాన్ని అనుభవించారు. వారి సంతోషాన్ని ఈ కష్టాలు తీసి వేయలేకపోయాయి.
ప్రార్దన : ప్రభువా! నేను నా జీవితంలో వచ్చే కష్టాలకు, బాధలకు క్రుంగి పోతున్నాను. కొన్ని సార్లు నాకు ఎందుకు ఇన్ని కష్టలు అని నన్ను నేను అసహ్యంగా చూస్తున్నాను. మీరు చెప్పిన విధంగా ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాను. అటువంటి సమయాలలో నాకు తోడుగా ఉండి మీకు కోసం ఎదురుచూసే మనసు ఇవ్వండి. నా జీవితంలో వచ్చే కష్టలలో మీ సాన్నిధ్యం పొందే భాగ్యం ఇవ్వండి దాని ద్వార మీరు ఇచ్చే సంతోషాన్ని సదా కాలము నేను పొందగలగుతాను. ఆమెన్
యోహను 16: 23-28
యోహను 16: 23-28
సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడుగలేదు. అడుగుడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. "నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని. కాని , తండ్రిని గురించి దృష్టాంతములతొగాక , తేట తెల్లముగచెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును . నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను" అని పలికెను.
"మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును". యేసు ప్రభువు మీరు నా పేరిట ఏమి అడిగినను మీకు ఇచ్చును అని చెబుతున్నారు. ఎందుకు మనం యేసు ప్రభువు పేరిట ప్రార్ధన చేస్తాము అంటే యేసు ప్రభువు మనకు ఈరోజు సువిశేషంలో చెబుతున్నారు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తాను ఏ అధ్బుతం చేసిన మొదట తండ్రికి ప్రార్దన చేసేవారు. ప్రార్దన అనేది తండ్రి దేవునితో మానవుడు ఒక గొప్ప సంబంధం ఏర్పరుచుకునే సాధనం. యేసు ప్రభువు ఈ లోకమునకు రాక మునుపు తన తండ్రితో తనకు ఉన్న బంధం, అలానే కొనసాగించినది ఈ ప్రార్దన అనే సాధనం ద్వారం. మనం కూడా యేసు ప్రభువు వలె తండ్రి తో బంధం ఏర్పరుచుకోవాలి. అది ఏర్పరుచుకోవాలంటే ప్రార్ధించాలి. తండ్రితో యేసు ప్రభువుకు ఉన్న బంధం వల్ల ఆయన ఏమి అడిగిన అది జరిగింది. మన జీవితంలో యేసు ప్రభువు వలె జీవిస్తే , మనం ఏమి అడిగిన అది జరుగుతుంది. మనం చేసే ప్రార్దన యేసు ప్రభువు పేరిట చేయడం అంటే ఆయనలా చేయడం, జీవించడం .
"ఇంత వరకు నా పేరిట మీరు ఏమి అడుగలేదు" - ఎందుకు యేసు ప్రభువు మీరు ఇంత వరకు నా పేరిట ఏమి అడుగలేదు అని అంటున్నారు ? అంటే యేసు ప్రభువు శిష్యులుకు ఇంత వరకు ఏమి అడిగే అవసరం రాలేదు. శిష్యులకు తండ్రికి , కుమారునికి మధ్య ఉన్న ఐక్యత పూర్తిగా తెలియదు. శిష్యులు ప్రభువుని ప్రార్దన నేర్పమని అడిగినప్పుడు ప్రభువు వారికి పరలోక ప్రార్దన నేర్పుతున్నారు. శిష్యులు ఈ సమయంలో తండ్రికి మరియు కుమారునికి మధ్య గల బంధం గురించి తెలుసుకుంటున్నారు. వారు ఇద్దరు ఎంతో ఐక్యమై ఉన్నారు. ఒక సారి మనకు తండ్రి మరియు కుమారుని మధ్య గల బంధం తెలిసినట్లయితే మనం చేసే ప్రార్ధన ఎల్లప్పుడు ఆయన పేరు మీద చేస్తాము. ఎందుకంటే తండ్రికి కుమారుడు అంటే అంత ప్రేమ. మరియు కుమారునికి తండ్రి అంటే అంతే ప్రేమ. తండ్రి కోసం కుమారుడు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.
"మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును" ఇక్కడ మనం కుమారుడంటే తండ్రికి ఎంత ప్రేమో తెలియ జేస్తున్నారు. మనం ఆయన పేరిట ప్రార్దన చేసినప్పుడు , యేసు ప్రభువు మన కోసం తండ్రిని అడుగుతాను అని చెప్పటం లేదు. కాని కుమారుడంటే తండ్రికి ఇష్టం కనుక , కుమారున్నీ ప్రేమించిన వారిని తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు. మరియు వారికి కావలసినవి మొత్తం తండ్రి సమకురుస్తారు. ఇక్కడ యేసు ప్రభువును నమ్మడం, లేక విశ్వసించడం ముఖ్యం , ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన వారు యేసు ప్రభువును విశ్వసించలేదు.శిష్యులు కొన్ని సార్లు యేసు ప్రభువును విడనాడి ఉండవచ్చు కాని వారు ఆయన్ను ప్రేమించారు. ఆయనను తమ గురువుగా అభిమానించారు. శిష్యులు చేసిన మంచి పని ఏమిటి అంటే ఆయనను విశ్వసించడం,ప్రేమించడం. మనము కూడా ఆయనను విశ్వసించమని, మరియు ప్రేమించమని, ఆయన శిష్యులు అవ్వమని ఇది ఒక ఆహ్వానం.
"నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను" యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఈ చివరి సందేశంలో తాను ఎక్కడ నుండి వచ్చినది, ఎక్కడకు వెళుతున్నది అని తెలియచేస్తున్నారు. తన యొక్క మహిమాన్వత స్థానానికి మరల వెళుతున్నారు. ఈలోకంలో తన యొక్క పనిని పూర్తి చేసుకున్నాడు. తాను వెళ్ళేముందు తన శిష్యులు ఏవిధంగా సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే ఏమి చేయాలో ప్రభువు చెబుతున్నారు. మన సంతోషం సంపూర్ణంగా ఉండాలంటే మనం యేసు ప్రభువు వలె జీవించాలి. యేసు ప్రభువు పేరిట ప్రార్ధించాలి. యేసు ప్రభువు వలె దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. యేసు ప్రభువును ప్రేమించాలి, మరియు ఆయనను విశ్వసించాలి. అప్పుడు మనం తండ్రి చేత ప్రేమించబడుతాం. తండ్రి చేత అన్నీ సమకూర్చబడుతాం. మరియు సంపూర్ణ సంతోషం పొందుతాం.
ప్రార్ధన : ప్రభువా! ఈలోకంలో మిమ్ములను ప్రేమించక , విశ్వసించక నిజమైన సంతోషమునకు, మీ యొక్క ప్రేమకు, మీ అనుగ్రహాలకు దూరంగా ఉన్నాము. అటువంటి సందర్భాలలో మమ్ములను క్షమించమని వేడుకుంటున్నాము. ఈలోకం వలె అనేక సార్లు మేము ప్రవర్తిస్తున్నాము. మీకు దూరంగా వెళుతున్నాము. మీరు ఇస్తాను అంటున్నా సంతోషం మాకు దయ చేయండి. ఆ సంతోషం పరిపూర్ణమగునట్లు చేయండి. అప్పడు మీకును తండ్రికిని గల సంబంధం తెలుసుకొనే విధంగా మాకు మీ ప్రేమను తెలియ చేయండి. ప్రభువా! తండ్రి మిమ్ములను ప్రేమించే వారిని ప్రేమిస్తారు అని తెలుపుచున్నారు. మా జీవితంలో ప్రభువా ! ఈ నిజమైన ప్రేమను తెలుసుకొనే భాగ్యం దయ చేయండి. మేము మిమ్ములను ప్రేమించేలా, విశ్వసించేలా చేసి, తండ్రి ప్రేమను మేము అనుభవించే విధంగా మమ్ము అనుగ్రహించమని వెడుకొనుచున్నాము. ఆమెన్
యోహాను 16:29-33
యోహాను 16:29-33
అందుకు ఆయన శిష్యులు "ఇప్పుడు మీరు దృష్టాంతములతోకాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు, ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇపుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవునినుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము" అనిరి. అపుడు యేసు "ఇపుడు మీరు నన్ను విశ్వసించు చున్నారా? ఇదిగో ! మీరు నన్ను ఒంటరిగ వదలి, చెల్లాచెదరై, ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని, నేను ఒంటరిగా లేను. ఎలయన, తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని, దైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని" అని చెప్పెను.
ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు ఆయన గురించి తెలుసుకున్నట్లుగా మాటలాడుతున్నారు. వారి పూర్తి విశ్వాసాన్ని వెల్లడిచేస్తున్నారు. ఇక్కడ వీరు ఏమి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువుకు మొత్తము తెలుసు అని అంటున్నారు. ఎలా వారు ఇది తెలుసుకోగలిగారు. యేసు ప్రభువుకు శిష్యుల మనసులలో ఏమి ఉన్నదో తెలుసు. అందుకే ఆయన వారు ఏదో ఆయనను అడగదలుచుకున్నారు అని ఆయనే వారితో ఆ మాటలను చెబుతున్నారు. 19 వ వచనంలో. ఇవన్నీ గ్రహించిన శిష్యులు ఆయనే శక్తి ఏమిటి, ఆయనకు ఎలా సమస్తము తెలుసు అని తెలుసుకున్నారు, అంతేకాక వారి మనసులలో ఉన్న భావాలు కూడా ప్రభువుకు తెలుసు అని గ్రహించారు. అందుకే ఆయన సర్వజ్ఞుడు అని వారు అంటున్నారు. మనం ఏమి అడుగకుండానే మన మనసులో ఉన్న భావం ఆయనకు ఏరుకనే.
ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ? అని యేసు ప్రభువు అడుగుతూ ఎలా వారి విశ్వాసం పరీక్షకు గురి అవుతుందో తెలుపుచున్నారు. మనం దేవుని విశ్వసిస్తున్నాము మనం ఎటువంటి కష్టాలలో కూడా వెనుకడుగేయం అని అనుకుంటూ ఉంటాము. మనకు ఇప్పుడు ఆయన ఎవరో తెలుసు అనుకుంటాం. నిజానికి మనం చాలా బలహీనులం, మన విశ్వాసాన్ని చూపించవలసిన సమయం వచ్చినప్పుడు లేక మనం ఏదైనా పరీక్షకు గురి అయినప్పుడు మన విశ్వాసం ఎంత గట్టిదో తెలుస్తుంది. శిష్యులు యేసు ప్రభువు సర్వజ్ఞుడు అని ఆయనకు అంతా తెలుసని, ఆయన అన్నియు చేయగలడని , సర్వశక్తివంతుడని తెలిసి కూడా ఆయనను వదలి పెట్టి వెళ్లిపోయారు. ఎందుకు ఇలా చేశారు అంటే వారికి నమ్మకం లేక కాదు, వారి జీవితాన్ని పూర్తిగా అర్పించడానకి వారు సిద్దపడలేదు, ఇహపరమైన జీవితంమీద మాత్రమే ఆశ కలిగి ఉండటం వలన.
నేను ఒంటరిగా లేను
యేసు ప్రభువు నేను ఒంటరిగా లేను అని అంటున్నారు. కారణం కూడా ఆయనే చెబుతున్నారు. ఎందుకు శిష్యులు అందరు వదలిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ఒంటరిగా ఉండరు అంటే తండ్రి ఆయనతో ఉంటారు. తండ్రి దేవునితో ఆయన ఎప్పుడు కలిసి ఉంటారు. వీరి సంబంధం విడదీయలేనిది. తండ్రి కోసం కుమారుడు ఏమి చేయడానకి కూడా వెనుకాడడు, అదే విధముగా తండ్రి కుమారుడు అడిగిన ప్రతిదీ కూడా ఇస్తాడు. వీరి బంధం శిష్యులు మరియు యేసు ప్రభువుల బంధం లాంటిది కాదు, కాని శిష్యుల యేసు ప్రభువు బంధం కూడా తండ్రికి మరియు యేసు ప్రభువుకు మధ్య ఉన్న బంధంగా దృఢంగా ఉండాలి. యేసు ప్రభువు శిష్యుల గురించి ప్రార్ధించే సమయంలో మరియు ఈ అధ్యాయంలో కూడా యేసు ప్రభువునితో మన బంధం దృఢంగా ఉండాలని , నేను తండ్రి యందును తండ్రి నాయందు ఉన్నట్లు మీరు నాయందు ఉండాలి అని ప్రభువు అడుగుచున్నారు. అప్పుడు మనం కూడా మిగుల ఫలవంతం అవుతాము.
"మీరు కష్టలపాలగుదురు కాని ధైర్యం వహింపుడు. నేను లోకమును జయించితిని." యేసు ప్రభువు తన శిష్యులకు తమ జీవితములో ఎటువంటి కష్టం రాదు అని కాని వారి జీవితం ఈలోకమమున సంతోషకారముగానే ఉంటుంది అని కాని చెప్పలేదు. వీటి అన్ని పొంది కూడా ఆయన ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకాన్ని జయించుటకు మనం వీటితోటి పోరాడాలి, అలా కాకుండా ఈ లోకంతో మనం లాలూచీ పడినట్లయితే మనం మనల్ని కోల్పోతాము, మరియు ఈలోకానికి బానిసలుగా మిగిలిపోతాము. అలా కాకుండా యేసు ప్రభువు వలె జీవించినచో మనం ఈ లోకాన్ని జయించవచ్చు. తన శిష్యులు ఎప్పుడుకూడా అధైర్యంగా ఉండకూడదని , అన్ని కష్టాలు ఉన్న కూడా వారు శాంతిని పొందుటకు యేసు ప్రభువు వారికి భరోసా ఇస్తున్నాడు. ఎప్పుడ అయితే శిష్యులు కూడా యేసు ప్రభువు వలె జీవిస్తారో వారి జీవితాలలో కూడా అందరు వదలి వెళ్ళిన వారు క్రుంగిపోరు, దేవుడు వారికి తోడుగా ఉంటారు.
ప్రార్దన : ప్రభువా మీరు సర్వజ్ఞులు అని తెలుసుకున్న శిష్యులు మిమ్ములను ఏమి అడుగకుండానే, మీరు వారి మనసులలో భావాలు తెలుసుకున్నరాని గ్రహించి మీ గొప్పతనం గురించి వెల్లడి చేస్తున్నారు. మేము మీ గురించి పూర్తిగా తెలిసికూడా అనేక సమయాలలో శిష్యుల వలె మాకు వచ్చే భాద్యలు, కష్టాలు చూచి మిమ్ములను వదలి వెళ్ళి పోతున్నాము, అటువంటి పరిస్తితులలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను వదలిపెట్టకుండా , ఎల్లప్పుడు మిమ్ము అంతిపెట్టుకొని జీవించేలా చేయమని వేడుకుంటున్నాము. మిమ్ములను అందరు వదలి పెట్టిన తండ్రి మీకు ఎలా తోడుగా ఉన్నారో మీరు మాకు ఆవిధముగానే తోడుగా ఉండండి. మా జీవితాలలో కూడా అందరు మమ్ములను విడిచిపెట్టె సమయాలలో మీ సాన్నిధ్యం మేము పొందుతూ నిజమైన మీ ఆధారణకు మమ్ములను అర్హులను చేయండి. మీ శాంతి మాకు ఎల్లవేళలా ఉండేలా మమ్ము దీవించి, ఈ మీ వలె మాకు ఈ లోకం మీద విజయాన్ని దయచేయండి. ఆమెన్
యోహాను 17:1-11
యోహాను 17:1-11
యోహాను 17:11-19
యోహాను 17:11-19
పవిత్రుడవైన తండ్రి! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు. కాని, నేను ఇపుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఎలయన, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్ధించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్టించుకొనుచున్నాను.
ధ్యానము:
"పవిత్రుడవైన తండ్రి! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము." తండ్రి దేవునకి కుమారునికి మధ్య ఉన్న అన్యోన్యత, ఐక్యతను గురించి ఈ సువిశేష భాగం చెబుతుంది. తండ్రి, కుమారుడు ఒకరియందు ఒకరు ఉన్నారు. కుమారుడు అడిగినది తండ్రి చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు. తండ్రి చిత్తమును కుమారుడు సంపూర్తిగా చేయడానికి ప్రాణమును కూడా అర్పిస్తాడు. ఇద్దరు ఎప్పుడు ఐక్యంగా ఉంటారు. ఒకరి యందు ఒకరు ఉంటారు.
వీరి అన్యోన్యత, వీరి బంధం, శిష్యులకు ఆదర్శం, యేసు ప్రభువు శిష్యులు, అనుచరులు కూడా ఇదే విధంగా వారిలో వారు ఐక్యంగా ఉండాలని యేసు ప్రభువుని ఆకాంక్ష. శిష్యులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది, వీరు ఐక్యంగా ఉండకపోతే వారు సాతాను యొక్క ప్రణాళికలకు గురి అవుతారు. కనుక యేసు ప్రభువు వారిని ఎల్లప్పుడు ఐక్యంగా ఉంచమని ప్రార్ధిస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను ఐక్యముగ మాత్రమే ఉంచమని చెప్పడం లేదు. వారిని సురక్షితంగా ఉంచమని తండ్రిని అడుగుతున్నారు. వీరిని సురక్షితముగా తండ్రి మాత్రమే ఉంచాలి, యేసు ప్రభువు తాను వారితో ఉన్నప్పుడు వారిని అందరినీ నుండి కాపాడుకున్నాడు. యేసు ప్రభువు శిష్యులను పరిసయ్యుల, ధర్మ శాస్త్ర భోదకుల, భోదనల నుండి, శోదనల నుండి పాపము నుండి అన్ని విధాలుగా వారిని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత తండ్రే వారిని కాపాడాలి. శత్రువుల నుండి, లోకము నుండి, సాతాను నుండి దేవుడు వారిని కాపాడాలి. అందుకే వారిని సురక్షితముగా ఉంచమని ప్రార్ధిస్తున్నాడు.
"నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఎలయన, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు." యేసు ప్రభువు శిష్యులు దేవుని వాక్కును విశ్వసించారు, వారు ఆ వాక్కును అనుసరించడానికిని, మరియు ఆ వాక్కును పొందుటకు వారు సిద్ధముగా ఉన్నారు. దేవుని వాక్కు కేవలం శిష్యులకు మాత్రమే అందచేయబడలేదు. దేవుని వాక్కు అందరికీ అందచేయబడింది. కాని, శిష్యులు మాత్రమే దానిని అంగీకరించారు. ఇక్కడ శిష్యులు దేవుని వాక్కును అంగీకరించినవారు. వారు ఆ వాక్కును పాటించుటకు సిద్ధమైనవారు. వారిని ఈ లోకము ద్వేషించినది. వారు దేవునికి , దేవుని వాక్కుకు ఎంత దగ్గర అవుతున్నారో లోకము వారిని అంతగా ద్వేషిస్తుంది. శిష్యులు ఈ లోకములో ద్వేషించబడతారు, ఎందుకంటే వారు లోకము అనుసరించి జీవించుటలేదు. లోకములో ఉన్న కాని లోకమునకు వ్యతిరేకముగా, లోక ఆశలకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు. యేసు ప్రభువు ఈ లోకమునకు చెందిన వాడు కాదు. అందుకే ఈ లోకము ఆయనను ద్వేషించింది. ద్వేషించి, హింసించి, మరణానికి కారణమయ్యింది. యేసు ప్రభువుని చూచిన విధముగానే ఈ లోకము తన శిష్యులను చూస్తుంది.
"వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్ధించుచున్నాను." యేసు ప్రభువు తండ్రిని వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని చెప్పడం లేదు. ఎందుకు వారిని తీసుకొని వెళ్ళమని చెప్పడం లేదు అని అంటే, వారు ఈ లోకములో ఉండి, యేసు ప్రభువును ఎలా ఈ లోకమునకు తండ్రిని తెలియచేశారో అలానే యేసు ప్రభువు వెళ్ళిన తరువాత శిష్యులు తండ్రిని లోకమునకు తెలియజేయాలి. అందుకే యేసు ప్రభువు వారిని ఈ లోకము నుండి తీసుకొని వెళ్ళమని చెప్పుట లేదు కాని వారిని ఈ లోకములో కాపాడమని ప్రార్ధిస్తున్నాడు.
"సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్టించుకొనుచున్నాను" ఇక్కడ ప్రతిష్టించుట గురించి చెబుతున్నారు. ప్రతిష్టించుట అంటే ఒక ప్రత్యేక కార్యానికి ఉద్దేశించబడి వేరు చేయబడిన వారు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు దేవుని వాక్కు కోసం, సత్యము కోసం వారిని వేరు చేయమని అడుగుతున్నారు. తండ్రి , యేసు ప్రభువును ఎలా ఈ లోకమునకు పంపడం జరిగినదో అలానే యేసు ప్రభువు కూడా శిష్యులను పంపుచున్నారు. యేసు ప్రభువు వలె వారు ఈ లోకంలో జీవించాలి, వారు దేవుడు కారు , కాని వారి జీవితం ద్వారా దేవున్ని తెలియజేయవలసిన భాధ్యత వారి మీద ఉంది. అందుకే వారు యేసు ప్రభువు తండ్రి చిత్తమును చేయడానికి ఎలా ఉన్నారో , శిష్యులు కూడా యేసు ప్రభువును తెలియజేస్తూ ఉండాలి.
ప్రార్ధన : ప్రభువా మీరు ఈ లోకములో ఉన్నప్పుడు, మీ శిష్యులను ప్రతి ఆపద నుండి కాపాడారు, అన్ని రకాల శోదనల నుండి, సమస్యల నుండి , అవిశ్వాసం నుండి సాతాను నుండి , ఈ లోక ఆశల నుండి, చెడు గుణాల నుండి వారిని కాపాడారు. మేము ఇప్పుడు ఈ లోకములో జీవిస్తున్నాము, మిమ్ములను నమ్మి, మీ వాక్కు తెలుసుకొని పాటించే వారు మీ శిష్యులు, అనుచరులు అవుతారు అని తెలుసుకుంటున్నాము. మీ శిష్యులను మీరు అన్ని విధాలైన సమస్యల నుండి కాపాడిన విధముగా మమ్ములను కాపాడండి. మిమ్ములను అనుసరించినట్లయితే మిమ్ములను లోకము ద్వేషించినట్లే మమ్ములను కూడా ఈ లోకము ద్వేషిస్తుంది, అది మమ్ములను ద్వేషించిన మిమ్ములను విడనాడకుండా జీవించేలా మమ్ము దీవించండి. ప్రభువా మేము ఈ లోకములో జీవిస్తూ ఎలా అయితే మీరు తండ్రిని లోకమునకు తెలియ పరిచారో , మీ శిష్యులు ఎలా తండ్రిని లోకమునకు తెలియ పరచాలి అని మీరు కోరుకున్నారో మేము అలా చేసే విధముగా మమ్ము ఆశీర్వాదించండి. ఓ ప్రభువా మేము ఈ లోకములో మిమ్ములను, సత్యమును, నిత్య జీవమును తెలియజేయుటకు మమ్ములను ప్రతిష్టించండి. ఆమెన్
యోహాను 21:15-19
యోహాను 21:15-19
యాకోబు జీవిత చరిత్ర
యాకోబు జీవిత చరిత్ర
పరిచయం
ఈసాకు,రెబ్కాల రెండవ కుమారుడు యాకోబు, ఏసావుని కవల సోదరుడు. యాకోబు రక్షణ చరిత్రలో చాల ప్రముఖమైన వ్యక్తి. తాను సాధించాలి అనుకున్నదానిని, ఎంత కష్టించి అయిన సాధించుకోవుటలో, పట్టు విడువకుండ ఉండుటలో , నిరాశ దరిచేరనివ్వని ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.
యాకోబు స్వభావం
యాకోబులో రెండు రకాల స్వభావాలు మనం చూస్తాము. ఇతనిలో మంచి మరియు చెడు రెండు స్వభావాలు మనకు కనబడుతాయి. ఆయన తన జీవితంలో మంచి, చెడు చేసే విషయాలలో పడిపోతూ, లేస్తూ ఉంటాడు. తను పడిపోయిన కాని దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. మరియు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు, తన బలహీనతలు మరియు శక్తి సామర్ధ్యాలు ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇతని జీవితం బాహుముఖాలు కలిగిఉంది. ఈనాటి మానవ స్వాభావానికి సరిగ్గా సరిపోతాడు. యాకోబులో లోపాలు ఉన్నాయి కాని ప్రార్ధన పరుడు. నిలకడలేనితనం ఉంది కాని చివరిలో చాలా మార్పు చెందనివాడు అయ్యాడు. తన జీవిత మొదటి భాగంలో మంచి చెడులు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం చాలా ఆసక్తిగలది.
యాకోబు తన తల్లి పక్షపాత ప్రేమకు పాత్రుడు అయ్యాడు. తన తల్లి ఆయనను ప్రేమించింది. యాకోబు స్వార్ధపరునిగా జీవించాడు. తన అన్న ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు, తన అన్న ఆకలిని ఆసరాగా తీసుకొని తన జేష్ట పుత్రుని హక్కును అపహరించాడు. స్వభావ పరంగా యాకోబు మోసగాడు. తన మనసాక్షిని చంపుకొని, తన తల్లి కోరిక మేరకు తన అన్నను మోసం చేశాడు. తను పొందవలసిన దీవెనలు పొందాడు. అబద్ధం చెప్పి తండ్రిని మోసం చేశాడు. కంటి చూపు సరిగా లేని తన తండ్రి ఆసరాగా చేసుకొని తన తండ్రిని మోసం చేశాడు. అంతేకాదు తానే ఏసావును అని అబద్దం చెప్పాడు. ఇటువంటి అన్ని పనులు ఉన్న ఇతని జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దైవ అనుభవాలు ఉన్నాయి. ఒకటి బేతేలు దగ్గర మరియు పెనియెలు దగ్గర. తన క్రమశిక్షణ ద్వారా దేవుడు ఆయనను తన వైపు మరల్చుకున్నాడు. యాకోబు దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. తనకు దేవుడు ఇచ్చిన కుమారులు ఒక దేశానికి మూలం అయ్యారు. వారు హిబ్రూ దేశం అంటే యాకోబు కుమారులు, యిస్రాయెలు సంతానం అని అర్ధము.
అన్నను మోసగించి జేష్ట అధికారం పొందుట
ఈసాకు రిబ్కాలకు అనేక సంవత్సరాలు సంతానం లేదు, దేవుడు వారి విన్నపాన్ని వినగా ఆమె గర్భం దాల్చింది. రిబ్కాకు ఇద్దరు కుమారులు పుట్టారు, మొదటిగా ఏసావు , వెంటనే యాకోబు పుట్టాడు. వీరు ఇద్దరు కవలలు. యాకోబు ఏసావు పుట్టిన వెంటనే అతని మడమపట్టుకొని తల్లి గర్భం నుండి బయటకు వచ్చాడు. యాకోబు అంటే మడమ లేక మోసగాడు అని అర్ధం. యాకోబు చిన్నప్పుడు సౌమ్యునిగా, తన ఇంటిని అంటిపెట్టుకొని జీవించేవాడు. చిన్నప్పటి నుండి పని చేయకుండానే తనకు కావలసినవి పొందుటకు ఇష్టపడేవాడు. ఒక రోజు ఏసావు పొలము నుండి అలసిపోయి వచ్చాడు. యాకోబు ఎర్రని పులుసు చేసాడు, అప్పుడు ఏసావు ఆకలితో ఉండి ఆ పులుసును త్రాగుటకు తనకు ఇవ్వమని అడుగగా, అందుకు యాకోబు జేష్టునిగా ఉన్న తన అన్న ఏసావు హక్కులను తనకు ఆ పులుసుకోసం అమ్మివేయుమని అడిగాడు. అందుకు ఏసావు, ఆ హక్కు నేనేమీ చేసుకుంటాను, నీవే దానిని తీసుకొని నాకు పులుసు ఇవ్వమని చెప్పగా, అందుకు యాకోబు మాట మాత్రమే చాలదని అన్న చేత దానిని వదులుకుంటున్నట్లు ప్రమాణం చేయించుకున్నాడు. ఏసావు ప్రమాణం చేసి తన జేష్ట అధికారమును యాకోబుకు కట్టబెట్టాడు. యాకోబు తన అన్నకు ఉండవలసిన జేష్ట అధికారము ఆ విధంగా, ఆకలిని ఆయుధంగా చేసుకొని తీసుకున్నాడు.
ఈసాకును మోసగించి దీవెనలు పొందుట
ఈసాకు ముసలివాడై, చనిపోయే ముందు తన పెద్ద కుమారుడుని ఆశీర్వాదించాలని, ఏసావును పిలిచి, తనకు దుప్పి మాంసంను తెచ్చి, భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ మాటలను వినిన రిబ్కా , ఆ దీవెనలు తన చిన్న కుమారుడు యాకోబుకు దక్కాలనే ఆశతో, ఆమె ఒక పన్నాగం పన్ని, యాకోబుతో మంద నుండి ఒక మేక పిల్లను తీసుకొచ్చి, దానితో రుచికరమైన భోజనం చేసి, ఆ దీవెనలు నీవే పొందమని చెప్పింది. దానికి యాకోబు, ఒక వేళ ఆ ప్రణాళికా ఈసాకుకు తెలిసినచో తన తండ్రి కోపానికి గురవుతానేమొ, అని భయపడి అది తల్లికి చెప్పగా, ఆ శాపమేదో నాకే తగులనిమ్ము, కాని నీవు నేను చెప్పినట్లు చేయమనగా, అతడు ఆమె చెప్పినట్లు చేసాడు. అప్పడు రిబ్కా యాకోబు తెచ్చిన, మేక పిల్ల మాంసమును వండి, యాకోబు ఏసావు వలె ఉండుటకు ఏసావు కట్టుకునే మేలి ఉడుపులు ఇచ్చి,మేక పిల్లల తోళ్ళతో యాకోబు మెడను కప్పింది. ఆమె వండిన భోజనాన్ని యాకోబుకు ఇచ్చి తండ్రి దగ్గరకు పంపింది.
యాకోబు ఈసాకు దగ్గరకు ఆ భోజనము తీసుకొని వెళ్ళాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిన తానే పెద్ద కుమారుడు అయిన ఏసావును అని చెప్పి, నీవు చెప్పినట్లే అడవికి వెళ్ళి జింక మాంసం తెచ్చాను, దానిని తినమని చెప్పాడు. ఈసాకు ఇంత తొందరగా ఎలా జింక మాంసం ఎలా దొరికింది అని అడుగగా యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపెను అని దేవుని పేరు చెప్పి మోసం చేసాడు. ఈసాకు, యాకోబును తన దగ్గరకు పిలిచి తడిమి చూసి గొంతు యాకోబులా ఉన్న చేతులు మాత్రము ఏసావువే అనుకున్నాడు. ఈసాకు అతనిని దివించాలని నీవు నిజముగా ఏసావువేనా అని అడిగాడు, అందుకు యాకోబు అవును అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఈసాకు నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా, నేను తిని నిన్ను దివిస్తాను అని చెప్పగా , యాకోబు అలానే చేశాడు. దానిని తినిన తరువాత ఈసాకు తన కుమారుడుని, దీవించుటకై నాయన వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పగా ,యాకోబు వెళ్లి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యాకోబు ధరించిన దుస్తుల వాసన చూచి అతనిని దీవించాడు. యాకోబుకు ధాన్యమును , పంటలను, చేలను ద్రాక్షసారాయము సమృద్దిగా సమకూరునని, ఎల్ల జనులు తన సేవకులవుతారు అని , తన సోదరులను పాలించును అని, తనని శపించువారు శపించబడుతారని, యాకోబును దీవించిన వారు దీవించబడతారని దీవించగానే, ఏసావు వేటనుండి వచ్చి తండ్రికి భోజనము తీసుకొని వచ్చి తండ్రిని దీవించమని అడుగాడు. అందుకు ఈసాకు నాయన నీవు ఎవరవు? అని అడిగాడు. అప్పుడు నేను నీ పెద్దకుమారుడను ఏసావును అని అతడు చెప్పగా, ఈసాకు జరిగినది మొత్తం పెద్ద కుమారునికి తెలియజేశాడు. అందుకు ఏసావు అతనికి సార్ధకమైన పేరే పెట్టారని, ఇప్పటికి యాకోబు రెండు సార్లు నన్ను మోసాగించాడు అని చెప్పాడు. యాకోబు తనకు బదులుగా దీవెనలు పొందినందుకు ఏసావు యాకోబు మీద పగ పట్టాడు, తండ్రి చనిపోయిన తరువాత యాకోబు ప్రాణము తీయాలనుకొన్నాడు. ఏశావు ఆలోచనలు తెలిసిన రిబ్కా, యాకోబును పిలిచి హారనులో ఉన్న తన సోదరుడు లాబాను ఇంటికి పొమ్మని చెప్పి, ఏసావు కోపం తగ్గినంత వరకు అక్కడ ఉండమని చెప్పింది. తన అన్న కోపం తగ్గిన తరువాత తనను పిలిపిస్తాను అని చెప్పింది.
ఆమె ఈసాకుతో ఏసావు పెళ్లి చేసుకున్న హిత్తియుల పిల్లలు తనను ఇబ్బంది పెడుతున్నారని యాకోబు కూడా ఇక్కడి హిత్తియుల పిల్లలను చేసుకోవడం తనకు ఇష్టం లేదని వారితో తను పడలేనని చెప్పింది. అప్పుడు ఈసాకు, యాకోబును పిలిచి కనానీయుల పిల్లలను ఎవరను పెళ్లి చేసుకోవద్దని చెప్పి పద్దనారములోని లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ లాబాను కూతురులలో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పి, దీవించి లాబాను వద్దకు పంపించాడు.
యాకోబు కల
ఏసావు కోపం నుండి తప్పించుకోవాలని యాకోబు బయలుదేరాడు. బేర్షేబా దాటి, హారను వైపు వెళ్ళే దారిలో వెళుతూ, చీకటి పడుచుండగా అక్కడే ఆగి పోయాడు. అక్కడ ఉన్న ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెనను చూసాడు, దాని మొదలు నేలను, దాని చివర ఆకాశమును అంటుచున్నవి. దేవ దూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచు దిగుచు ఉన్నారు. అపుడు యావే దేవుడు నిచ్చెన పైగ నిలుచొని యాకోబుతో నేను ప్రభుడను, నీ పితామహులగు అబ్రహామునకు, ఈసాకునకు నేనే దేవుడను, నీవు పడుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును, నీ సంతతిని అసంఖ్యాకముగా పెరిగిపోయి, నేల నాలుగు అంచుల వరకు వ్యాపింతురు. నీద్వారా, నీ సంతానము ద్వారా, భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చేదను. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను.
యాకోబు నిద్ర నుండి మేల్కొని ఇక్కడ దేవుడు ఉండుట నిజము, ఇది నాకు తెలిసెనని భయపడ్డాడు. ఈ ప్రదేశము దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అని, యాకోబు ఉదయమునే లేచి తలగడగా చేసుకున్న రాతిని స్తంభముగా నాటి దాని మీద తైలము దేవునికి అంకితం చేశాడు. ఆ ప్రదేశమునకు బేతేలు (దైవ నిలయం) అని పేరు పెట్టాడు. దానికి ముందు దాని పేరు లూజు. తరువాత యాకోబు దేవుడు నాకు తోడుగా ఉండి నా ప్రయాణములో నన్ను కాపాడినచో, నాకు తిండి, గుడ్డ సమకూర్చి, నేను నా తండ్రి ఇంటికి తిరిగి సమాధానంతో వెళ్ళిన యెడల ప్రభువే నాకు దేవుడగును అనుకొన్నాడు.తానూ స్తంభంగా నాటిన రాయి దైవ మందిరమగునని దేవుడు ట్యాంకు ఇచ్చిన దానిలో పదియవ వంతు దేవునికే చెల్లింతునని మ్రొక్కుకొన్నాడు.
యాకోబు లాబాను ఇంటికి చేరుట
యాకోబు తూర్పు జాతుల దేశం చేరి, అక్కడ పొలములో ఒక బావిని చూసెను, ఆ బావి దగ్గర గొర్రెల మందలు నీరు త్రాగును, ఆ బావి మీద పెద్ద రాయి ఉన్నది, అక్కడి మందలు ఆ నీరు తాగుటకు ఆ రాతిని తీయవలసిఉంటుంది. యాకోబు అక్కడ ఉన్నవారితో అన్నలారా మీది ఏ ఊరు అని వారిని అడుగగా వారు మాది హారను అని చెప్పగ వారితో మీకు లాబాను గురించి అతని యోగా క్షేమాలు గురించి అడుగగా అతను బాగానే ఉన్నాడు, అతని కూతురు రాహెలు మంద వెంట వస్తున్నది, చూచి వారు ఆ విషయం చెప్పారు. రాహెలు అక్కడకు రాగ , ఆమెను చూచి యాకోబు బావి దగ్గరకుపోయి దాని మీద రాతిని తీసివేసి, లాబాను మందకు నీళ్ళు పెట్టి, రాహెలును ముద్దు పెట్టుకొని నీ తండ్రికి అయినవాడను అని చెప్పాడు . అప్పుడు ఆమె పరుగెత్తుకొని పోయి జరిగిందంత తన తండ్రికి చెప్పగా అతను తన మేనల్లుడు వచ్చేనని వచ్చి యాకోబును కౌగలించుకొని ముద్దు పెట్టుకొనగా, జరిగిన విషయములను మొత్తం యాకోబు అతనికి వివరించాడు. తరువాత అక్కడే నెల రోజుల పాటు ఉన్నాడు.
యాకోబు వివాహములు
లాబాను యాకోబుతో నీవు నాకు బందువే కాని, ఊరకనే ఊడిగము చేయడం ఎందుకు? నీకు ఎంత జీవితము కావాలో చెప్పమని అడిగాడు. లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు లేయా మరియు రాహేలు, లేయా బలహీనమైన కళ్ళు కలది , రాహేలు సౌందర్యవతి. రాహేలును యాకోబు ప్రేమించాడు, కనుక యాకోబు లాబానుతో నేను ఏడు సంవత్సరాలు రాహేలు కోసం ఊడిగం చేస్తాను అని చెప్పాడు. దానికి లాబాను ఒప్పుకున్నాడు. యాకోబు రాహేలు కొరకు ఏడు సంవత్సరాలు పని చేశాడు అవి ఏడు గడియలు వలె గడిచి పోయాయి, అంతగా ఆమెను అతడు ప్రేమించాడు. ఏడు సంవత్సరాల తరువాత యాకోబు తనకు రాహేలును అప్పగించమని లాబానును అడుగగా, లాబాను అక్కడి వారిని అందరిని, పిలచి, విందు ఏర్పాటు చేసి, చీకటి పడిన తరువాత తన పెద్ద కూతురు లేయాను యాకోబు వద్దకు తీసుకొనిపొగా అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాడు. అపుడే లేయాకు లాబాను జిల్ఫా అనే ఒక బానిస పిల్లను దాసిగా ఇచ్చాడు. తెల్లవారిన తరువాత తాను రాత్రి గడిపినది లేయాతో అని యాకోబు తెలుసుకున్నాడు. అతను లాబానుతో ఇదేమి, నేను పని చేసినది రాహేలు కొరకు కదా! నన్ను ఎందుకు మోసగించితివి అని అడిగాడు. అందుకు లాబాను పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా చిన్న పిల్లకు పెళ్లి చేయుట మా ఆచారము కాదు. ఈ ఏడు రోజుల ఉత్సవము జరుగనిమ్ము, తరువాత రాహేలును కూడా నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను, కాని దానికి మరల నాకు ఏడు సంవత్సరాలు ఊడిగము చేయాలి అని చెప్పాడు. అందుకు యాకోబు ఒప్పుకున్నాడు. తరువాత యాకోబుకు రాహేలును ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెతో పాటు బిల్హా అనే దాసిని కూడా ఇచ్చాడు. యాకోబు ఏడు సంవత్సరములు ఊడిగం చేశాడు.
యాకోబు కుమారులు
లేయా భర్త ప్రేమకు నోచుకోలేక పోయింది. అది చూచిన దేవుడు ఆమెను సంతానవతిగా చేశాడు. రాహేలు గొడ్రలుగా ఉంది. లేయా బిడ్డను కాని దేవుడు నా బాధను చూచెను. ఇప్పుడైన నా భర్త నన్ను ప్రేమించునా అనుకొన్నది. అందుకే తన బిడ్డకు రూబేను అని పేరు పెట్టింది, దాని అర్ధం బాధను చూచుట. ఆమె మరల బిడ్డను కని అతనికి షిమ్యోను అను పేరు పెట్టింది. దాని అర్ధం వినుట. నేను నా భర్త అనురాగానికి దూరం అయ్యానని విని దేవుడు నాకు ఈ బడ్డను ఇచ్చాడు అని లేయా అనుకున్నది. మరల ఆమె గర్భం దాల్చి ఒక కుమారున్నీ కని ఆ బిడ్డకు లేవి అని పేరు పట్టింది. ఆ మాటకు అర్ధం అంటుకొనియుండుట, ఈ బిడ్డ ద్వారా తన భర్త తనకు అంటుకొని ఉంటాడు అనుకున్నది. నాలుగవ సారి కూడా ఆమె ఒక కుమారుని కని అతనికి యూదా అని పేరు పెట్టి, నేను ఇక దేవుని స్తుతించుకుంటాను అని అనుకున్నది, యూదా అనగా స్తుతించు అని అర్ధం.
రాహేలుకు బిడ్డలు లేక పోవుటచే లేయాను చూచి అసూయ పడింది. ఆమె యాకోబుతో, నాతో బిడ్డలను కంటవా లేక నేను చావనా అని వాపోయింది. దానికి యాకోబు నీకు బిడ్డలను ఇవ్వవలసింది దేవుడు , నేనేమైన ఆయన స్థానమున ఉన్ననా అని చెప్పగా దానికి ఆమె తన దాసి అయిన బిల్హాను తీసుకొచ్చి ఆమెతో శయనించి, తన బదులుగా ఆమెతో బిడ్డలను కనమని చెప్పింది. అలా ఆమె తన దాసిని యాకోబుకు భార్యగా చేసింది. అప్పుడు ఆమె గర్భవతి అయి బిడ్డను కన్నది, ఆ బిడ్డకు దాను అని పేరు పెట్టారు. దాను అంటే తీర్పు అని అర్ధం. మరల బిల్హా గర్భవతి అయి ఒక బిడ్డను కనగా రాహేలు నేను మా అక్కతో బాగా పోరాడితిని అని ఆ బిడ్డకు నప్తాలి అని పేరు పెట్టింది. అప్పుడు లేయా తను కూడా తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా చేసింది. ఆమె ఒక కుమారుని కనగా, ఆ బిడ్డకు గాదు అని పేరు పెట్టిరి, గాదు అనగా అదృష్టము, ఆమె మరియొక కుమారుని కనగా అతనికి ఆషేరు అని పేరు పెట్టెను, ఆ పేరు అర్ధం భాగ్యము.
లేయా పెద్ద కుమారుడు రూబెను పొలము వెళ్ళి కొన్ని పండ్లను కోసికొనిరాగ, రాహేలు వాటిలో కొన్నింటిని తనకు ఇవ్వమని అడిగింది దానికి లేయా ఒప్పుకోకపోవడంతో, రాహేలు లేయా తో నీ కుమారుడు తీసుకొచ్చిన పండ్లను ఇస్తే ఆ రోజు నీవు యాకోబుతో శయనించవచ్చు అని చెప్పింది, అందుకు లేయా ఒప్పుకోని యాకోబు పొలము నుండి ఇంటికి వచ్చే సమయంలో ఎదురెల్లి జరిగినది చెప్పి, యాకోబును తీసుకు వెళ్ళి, అతనితో శయనించగ ఆమె గర్భం దాల్చి ఐదవ కుమారుని కని అతనికి యిస్సాఖారు అని పేరు పెట్టింది. మరల యాకోబు ఆమెను కూడగా ఆమె గర్భం దాల్చి ఆరవ కుమారుని కని ఆ బిడ్డకు సెబులూను అని పేరు పెట్టెను, అనగా కానుక అని అర్ధం. దేవుడు రాహేలును మరచిపోక ఆమెకు ఒక కుమారుని ఇచ్చెను అతనికి యోసేపు అని పేరు పెట్టెను, యోసేపు అంటే అధికము చేయుట లేక తొలగించుట.
యాకోబు సంపన్నుడగుట
యేసేపు పుట్టిన తరువాత యాకోబు లాబానుతో నన్ను మా దేశం పంపివేయమని, తన భార్యాలను పిల్లలను తనకు అప్పగించమని అడిగాడు. దానికి లాబాను నీ వలన దేవుడు నాకు మేలు చేశాడు కనుక నీకు ఏమి కావాలో అడుగు అని చెప్పగా దానికి యాకోబు నీ నుండి నాకు ఏమి వద్దు, నీ మందలనుండి నల్లని గొర్రె పిల్లను, పొడలు మచ్చలు ఉన్న మేకపిల్లలను వేతనముగా తీసుకొందును అని చెప్పాడు. అందుకు లాబాను ఒప్పుకున్నాడు. కాని లాబాను తెల్ల చారలు మచ్చలు గల మేకపోతులను, తెల్ల పొడలుగల అడుమేకలను , నల్ల గొర్రె పిల్లలను వేరు చేసి తన కుమారులకు ఇచ్చి వారిని దూరముగా యాకోబు మందల నుండి మూడు రోజుల ప్రయాణం పట్టే దూరంలో ఉంచాడు.
యాకోబు రావి, బాదము, బూరుగు చెట్ల పచ్చి పుల్లలను తీసుకొచ్చి వానిలో తెల్ల చారలు కనపడునట్లు పై బెరడు తీసివేసి వాటిని మందలు నీళ్ళు త్రాగే తోట్లలో పాతి పెట్టను. ఎదకు వచ్చిన ఆడ మేకలు నీళ్ళు త్రాగుటకు వచ్చినప్పుడు, ఆ పుల్లలు వాటకి ఎదురుగా ఉండెను కనుక వానికి తెల్ల చారలు పొడలు మచ్చలుగల పిల్లలు పుట్టెను. గొర్రెలను వేరు చేసి లాబాను మందలో నల్లరంగు, నల్ల మచ్చలు గల వాని వైపు తోలేను. ఆ గొర్రెలకు నల్ల పిల్లలు పుట్టెను. అలా ఆయన సొంత మందను పెంచి విడిగా మెపెను. బలమైన పశువులు ఎదకు వచ్చినప్పుడు మాత్రమే అతడు నీళ్ళ తొట్లలో పుల్లలుంచేను. ఆ విధంగా యాకోబు బలమైన వాటిని పొంది సంపన్నుడు అయ్యాడు. చాలామంది దాసి దాసులను, ఒంటెలను గాడిదలను సంపాదించుకున్నాడు.
యాకోబు పారిపోవుట
లాబాను కుమారులు మాట్లాడుకుంటూ, యాకోబు మన తండ్రి ఆస్తిని కాజేసినందుకే, ఇంత సంపన్నుడు అయ్యాడు అనుకొనుటను యాకోబు విన్నాడు. లాబాను కూడా మునుపటి ప్రేమను యాకోబు మీద చూపించుట లేదు. దేవుడు యాకోబుతో నీ పితరుల దేశములో ఉన్న, నీ బంధువుల యొద్దకు వెళ్ళుము. నేను నీ వెన్నంటి ఉంటాను అని అభయమియగా యాకోబు పొలములో ఉన్న లేయాను , రాహేలును పిలిపించి, లాబాను ఎలా అతనిని మోసం చేసినది, ఎన్ని సార్లు తన జీతం మార్చినది, మరియు దేవుడు లాబాను వలన అతనికి ఎటువంటి అపాయం కలుగకుండా కాపాడింది, మరియు ఎలా దేవుడు తన పశు సంపదను పెంచినది అనే విషయాలను మరియు కలలో దేవుని దూత తనకు కనిపించి వెంటనే ఈ దేశము విడిచి, నీవు పుట్టినచోటికి తిరిగి పొమ్మని చెప్పిన విషయమును చెప్పాడు. లేయా , రాహేలు యాకోబుతో మాకు తండ్రి ఇంటిలో పాలుపంపకములు ఏమి లేవు, మమ్ములను కూడా కానివారినిగానే చూస్తున్నాడు. మమ్ము విక్రయించిన సొమ్మును కూడా తానే తీసుకొన్నాడు. దేవుడు మా తండ్రికి చెందకుండా చేసినదంత మాది, మా పిల్లలది. కనుక దేవుడు చెప్పినట్లే చేయమని అతనితో అన్నారు. యాకోబు తనకు చెందినదంత తీసుకొని తన భార్యలు పిల్లలను ఒంటెలమీద ఎక్కించి, మందలను పశుసమూహములను, వస్తువులను తొలుకొని పద్దనారములో సంపాదించినది మొత్తం తీసుకొని, కనానులో ఉన్న తన తండ్రి ఈసాకు వద్దకు బయలు దేరాడు. యాకోబు లాబానుకు చెప్పకుండా తన ప్రయాణం ప్రారంభించాడు.
లాబాను యాకోబును వెంటాడుట
యాకోబు పారియాడు అనే మాట లాబానుకు మూడు రోజుల తరువాత తెలుసినది. అప్పుడు తన మనుషులను తీసుకొని ఏడు రోజుల పాటు వెంటాడి గిలాదు కొండ వద్ద యాకోబును పట్టుకున్నాడు, ఆ రాత్రి దేవుడు లాబానుకు కలలో కనబడి యాకోబుకు ఎటువంటి హాని చెయవద్దు అని చెప్పాడు. లాబాను యాకోబుతో ఇదేమి? నాకు చెప్పకుండ వచ్చితివి. నాకు చెప్పిన యెడల నిన్ను మేళతాళాలతో పంపనా అని చెప్పి, నీవు వచ్చినప్పుడ నా కుమార్తెలను కడసారి చూడలేదని మరియు నా దేవతలను ఎలా దొంగిలించితివి అని అడుగగా దానికి యాకోబు నీ కుమార్తెలను తీసికొని పోవుదవేమో అని భయపడ్డాను కాని నీ దేవతావిగ్రహములను దగ్గర పెట్టుకొన్నవారికీ చావు మూడింది అని చెప్పాడు. రాహేలు ఆ విగ్రహాలు దొంగిలించిన సంగతి ఆయనకు తెలియదు. అంతేకాక, నీది నా దగ్గర ఎమున్న తీసుకోమని చెప్పాడు. లాబాను అక్కడి వారి గుడారములు వెతికాడు. లేయా, రాహేలు యాకోబు, దాస దాసి గూడారములు వెతికారు. రాహేలు దేవతావిగ్రహాలు తీసుకెళ్ళి, ఒంటె జీను క్రింద పెట్టి దానిమీద కూర్చున్నది. లాబానుకు ఏమి దొరకలేదు. అందుకు యాకోబు కోపంతో నేను చేసిన తప్పేమి, నన్ను ఎందుకు వెంటాడితవి, నీకు సంభందించినది ఏమైనా దొరికినదా అని అడిగి , దొరికినట్లయితే వీరి ముందు పెట్టు, వీరే తీర్పు చెప్పుదురు అని అన్నాడు. అంతేకాక తాను ఎంత కష్ట పడి ఇరవై సంవత్సరాలు లాబాను నుండి ఏమి ఆశించకుండా ఉన్నది తెలియజేశాడు.
లాబాను యాకోబుల ఒడంబడిక
లాబాను యాకోబుతో వీరు అందరు నా వారే. ఈ పిల్లలు నా పిల్లలే. నీవు చూచుచున్నదంతయు నాదే. నా కుమార్తెలకు నేనేమీ చేయగలను. నీవు, నేను ఒక ఒడంబడిక చేసుకుందము అని చెప్పగా యాకోబు ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి దానిని స్తంభంగా నిలబెట్టి రాళ్ళు ప్రోగుచేయమని చెప్పగా వారు రాళ్ళు తెచ్చి కుప్ప చేశారు. దాని దగ్గరే వారు భోజనం చేశారు. యాకోబు దానికి గలెదు అని పేరు పెట్టాడు. దాని అర్ధం సాక్షియగు కుప్ప . అప్పుడు లాబాను యాకోబుతో, నీకు నాకు ఈ కుప్ప సాక్షిగా ఉండును అని చెప్పెను. లాబాను మనము ఒకరి కోకరు కనపడకుండా విడిపోయినప్పుడు, దేవుడు మన ఇద్దరను ఒక కనిపెట్టునుగాక అని చెప్పి, ఆ తావుకు మిస్పా అని పేరు పెట్టాడు . లాబాను యాకోబుతో నీవు నా కుమార్తెలను హింసించిన, వేరే పెళ్లి చేసుకున్న నీకు నాకు మధ్య దేవుడు సాక్షిగా ఉన్నాడు. ఈ కుప్ప , ఈ స్తంభం సాక్షిగా ఉన్నాయి మరియు నీవు నాకు కీడు చేయుటకు ఈ కుప్పను , స్తంభంను దాటి ఇటు రావద్దు , నీ వైపు నేను రాను అని చెప్పుకొనిరి. అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు మనకు తీర్పరిగా ఉండును అని లాబాను చెప్పగా యాకోబు మా తండ్రి ఈసాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణము చేశాడు. మరునాడు లాబాను తన కుమార్తెలను వారి పిల్లలను ముద్దాడి, దీవించి తిరిగివెళ్ళెను. యాకోబు ప్రయాణించుచుండగా అతనికి దేవుని దూతలు ఎదురవ్వగా యాకోబు ఇది దేవుని సైన్యం అని పలికి, ఆప్రదేశమునకు మహనయీము అని పేరు పెట్టెను.
యాకోబు ఏసావును కలుసుకొనుటకు సిద్దమవుట
యాకోబు తన అన్న ఏసావును కలిసే ముందుగ తన దూతలను అతని వద్దకు పంపి తన అనుగ్రహం కొరకు వర్తమానం పంపాడు. ఏసావు ఏదోము దేశమందు సెయీరు మండలములో ఉన్నాడు. యాకోబు పంపిన దూతలు తిరిగి వచ్చి మేము మి అన్నను చూచితిమి, ఆయన నిన్ను త్రోవలోనే కలుసుకొనుటకు నాలుగు వందల మందితో వస్తున్నాడు అని చెప్పారు. ఏసావు తనను తన వారిని, మందలను నాశనం చేస్తాడు ఏమో అని భయపడి , దేవునికి కాపాడమని మొరపెట్టుకున్నాడు. ఆ రాత్రి అక్కడే బస చేసి , తన అన్నకు బహుమానముగా పంపుటకు తన కంటే ముందుగా రెండు వందల అడుమేకలను, ఇరువై మేకపోతులను , రెండు వందల గొర్రెలను ఇరువై పోటెల్లను పాడి ఒంటెలను , ఇరువై అడుగాడిదలను , పది మగ గాడిదలను విడి విడిగా ఒక్కో మందను, ఒక్కో దాసునకు ఇచ్చి పంపుతూ , వారికి ఎదురు వచ్చి అడిగిన వారితో , ఇవి మీ దాసుడగు యాకోబు మంద, ఏసావునకు వీనిని కానుకగా పంపెను, ఆయన వెనుక వస్తున్నాడు అని చెప్పమని చెప్పాడు. దాని ద్వారా ఏసావు కోపం తగ్గుతుంది అని యాకోబు తలంచాడు. కానుకలు పంపి యాకోబు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.
యాకోబు దేవునితో కుస్తీపట్టుట
యాకోబు రాత్రి వేళ లేచి తన భార్యలను , దాసి దాసులను, కొడుకులను యబ్బో కు రేవు దాటించి అతను మాత్రం అక్కడే మిగిలిపోయాడు. అపుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టాడు. అతడు యాకోబును ఓడింపకపోవుటచే అతని తుంటి మీద కొట్టాడు. అపుడు యాకోబునకు తుంటి తొలగింది. ఆ మనుష్యుడు యాకోబుతో తెల్లవారుచున్నది, నన్ను పోనిమ్ము అని చెప్పగా, అందుకు యాకోబు నన్ను దీవించువరకు నిన్ను వెళ్లనియను అని చెప్పాడు అప్పుడు ఆ మనుష్యుడు యాకోబును నీ పేరు ఏమిటి అని అడుగగా యాకోబు నా పేరు యాకోబు అని చెప్పాడు దానికి ఆ వ్యక్తి నీకు ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక, యిస్రాయేలు అని పేరుండును. నీవు దేవునితో, మానవునితో పోరాడి గెలిచితివి అని చెప్పాడు. అపుడు యాకోబు అతన్ని పేరు అడుగగా దానికి నా పేరు అడుగనేలా అని యాకోబుని దీవించెను. యాకోబు నేను దేవుడను ముఖాముకిగా చూచియు బ్రతికితిని అని ఆ ప్రదేశమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. యాకోబు కుంటుకొనుచు అక్కడ నుండి వెళ్ళెను.
యాకోబు ఏసావును కలుసుకొనుట
యాకోబు కన్నులేత్తి చూడగా ఏసావు నాలుగువందల మందితో వస్తున్నాడు. అది చూసి యాకోబు తన పిల్లలను వేరు చేసి లేయాకు రాహేలుకు ఇచ్చి దాసి స్త్రీలను వారి పిల్లలను వారి ముందుంచి అందరి చివర రాహేలు యేసేపు ఉన్నారు. యాకోబు అందరి కంటే ముందుగా వెళ్ళి తన అన్నను సమీపిస్తూ ఏడుసార్లు సాగిల పడ్డాడు ఏసావు పరుగెత్తుకొచ్చి యాకోబును కౌగలించుకొని మెడపై ముద్దు పెట్టుకొన్నాడు. ఇద్దరు కన్నీరు పెట్టుకొన్నారు. ఏసావు వారి అందరినీ చూచి, వీరందరు ఎవరు అని అడుగగా, దానికి యాకోబు వీరు దేవుడు నీ దాసునికి అనుగ్రహించిన పిల్లలు అని చెప్పగా వారు అందరు ఏసావు ముందుకు వచ్చి సాగిలపడ్డారు. అప్పుడు వారు తీసుకొచ్చిన కానుకలను చూచి ఇది నా ముందుకు వచ్చినది ఎందుకు అని ఏసావు అడుగుగా, యాకోబు నీ అనుగ్రహము సంపాదించుటకే అని చెప్పెను. అందుకు ఏసావు తమ్ముడా! నాకు కావలసినంత నాకు ఉన్నది అని చెప్పిన కాని, యాకోబు బలవంతము చేయగా ఆ బహుమానములను తీసుకున్నాడు.
ఏసావు వెళ్లిపోవుట
ఏసావు యాకోబుతో నేను ముందు నడుచుచు దారి చూపుదును, అని చెప్పగా దానికి యాకోబు తనకు మందలు, పిల్లలు, మేకలు పశువులు ఇవి అన్ని ఉండుటవలన నిదానముగా వచ్చి, సేయీరు లో ఏసావును కలుసుకుంటాను అని చెప్పెను, అందుకు ఏసావు , తన మనుష్యులను కొంతమందిని వారిని అనుసరించుటకు ఉంచుటకు సిద్దపడగా, యాకోబు నా మీద నీకు దయగలిగింది, అదియే చాలు. ఇక ఈ బలగంతో పని ఏముంది అని చెప్పెను. ఇక ఆ రోజే ఏసావు అక్కడనుండి వెళ్ళి పోయాడు. యాకోబు సుక్కోతునకు వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టి , పశువులకు పాకలు వేయించెను. సుక్కోతు అనగా పాక అని అర్ధం. అక్కడ నుండి షేకెము చేరి అక్కడ గూడారములు వేసిన చోటును షెకెము తండ్రి అయిన హొమొరు కుమారుల నుండి నూరు వెండి నాణెములుతో కొన్నాడు. అక్కడ ఒక బలి పీఠము కట్టి దానికి ఎల్ ఏలోహి యిస్రాయేలు పేరు పెట్టాడు అంటే యిస్రాయేలు దేవుడయిన దేవునికి అని అర్ధం.
దీనా మానభంగము
యాకోబు లేయాల కూతురు దీనా. దీనా ఒక రోజు ఆ దేశ స్త్రీలను చూచుటకు వెళ్ళగా ఆ దేశ యువరాజు హమోరు కుమారుడు షెకెము చూచి , ఆమెను ప్రేమించి, ఆమెను ఇచ్చి నాకు పెళ్లి చేయమని తన తండ్రి హమోరును అడిగాడు. యాకోబు తన కూతురు దీనాను చెరచెనని విని , తన కొడుకులు పొలములో నుండి వచ్చినంతవరకు ఏమి మాట్లాడలేదు. షెకెము తండ్రి యాకోబుతో మాట్లాడుటకు వచ్చి , దీనాను తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగి, వారికి కావలసినది ఏమి అయిన ఇవ్వుటకు సిద్దం అయ్యాడు. యాకోబు కుమారులు ఈ సంగతి తెలుసుకొని చాలా కోపపడ్డారు. వారు హమోరుతో ఇది చేయలేము, సున్నతి చేయనివారికి మా చెల్లిని యిచ్చుట మాకు అవమానకరం అని చెప్పారు. వారు సున్నతి చేసుకుంటే ఒప్పుకుంటాము అని చెప్పారు. ఆ మాటలు హమోరు షెకెముకు నచ్చినవి. నగర ద్వారమునకు వెళ్ళి వారి ప్రజలందరకు చెప్పి, సున్నతి చేసుకోటకు ఒప్పించిరి. వారందరు సున్నతి చేసుకున్నారు.
ప్రతి కారము
సున్నతి చేసుకోవడం వలన కొంతమంది నొప్పితో బాధపడుతుండగా యాకోబు కుమారులు దీనా సోదరులు షీమ్యోను, లెవీ కత్తులు చేపట్టి నగరములోకి వెళ్ళి ప్రతి పురుషున్ని చంపారు, హమొరును, షెకెమును ఘోరముగా చంపారు. దీనాను విడిపించుకొని వెళ్లారు. యాకోబు ఇతర కుమారులు నగరమునకు వెళ్ళి నగరమును దోచుకున్నారు. పొలములో ఉన్న పశు సంపదను, వారి వశము చేసుకున్నారు. స్త్రీలను చెరపట్టారు. అపుడు యాకోబు షిమ్యోను, లెవీలను కోపపడ్డాడు. అందుకు వారు మా సోదరిని అలా చేయడం తగునా అని సమాధానం ఇచ్చారు.
యాకోబు బేతేలు చేరుట
దేవుడు, యాకోబుతో నీవు లేచి, బేతేలుకు వెళ్ళి అచట స్థిరపడమని, తన సోదరుని నుండి తప్పించుకొని పోయే సమయంలో కాపాడిన దేవునికి అక్కడ బలి పీఠం నిర్మించమని చెప్పాడు. యాకోబు తన వారితో, వారి దగ్గర ఉన్న అన్య దేవత విగ్రహాలు పారవేసి, వారిని వారు శుద్ది చేసుకోమని చెప్పాడు. బేతేలు వెళ్ళి తనని కాపాడిన దేవునికి బలి పీఠం నిర్మించాలని వారికి చెప్పాడు. వారు వారి వద్ద ఉన్న విగ్రహాలను, చెవి పొగులను యాకోబుకు ఇచ్చారు. అప్పడు అతను వాటిని షెకెము వద్ద సింధూర చెట్టు కింద పాతిపెట్టాడు. అక్కడ నుండి కనాను దేశంలో గల లూజుకు వెళ్లారు, అదే బెతేలు. అక్కడ దేవునికి బలి పీఠము నిర్మించారు. అపుడు రిబ్కా దాసి దెబోర మరణించగా, యాకోబు ఆమెను బెతేలుకు క్రింద ఉన్న సిందూర వృక్షం దగ్గర సమాధి చేశాడు. దేవుడు తనతో మాట్లాడి, ఇక నీకు యాకోబు అని పేరు ఉండక యిస్రాయేలు అని ఉంటుంది అని చెప్పి అతనిని దీవించాడు. ఆ ప్రదేశమున యాకోబు ఒక స్తంభం నాటి, దానిపై పానీయము పోసి తైలాభిషేకము చేశాడు, ఆ ప్రదేశమునకి బెతేలు అని పేరు పెట్టాడు. వారు బెతేలు నుండి ఏఫ్రాతాకు దగ్గరలో ఉండగా రాహేలు ప్రసవవేదన అనుభవించి కుమారుని కని మరణించినది, అతనికి ఆమె బెనోని అని పేరు పెట్టగా, యాకోబు బెన్యామీను అని పిలిచాడు. రాహేలు మరణించగా ఏఫ్రాతాకు వెళ్ళు బాట ప్రక్కన సమాధిచేశారు. యాకోబు ముందుకు వెళ్ళి ఏదెరులో గోపురము అవతల గుడారము వేసుకున్నాడు. ఈ సమయంలో రూబెను బిల్హతో శయనించాడు. యాకోబు మమ్రెలో ఉన్న తండ్రికి వద్దకు వచ్చాడు, ఈసాకు చనిపోగ ఏసావు , యాకోబులు అతనిని పాతిపెట్టారు.
యాకోబు, తన తండ్రి నివసించిన కనాను దేశమందు నివాసం ఏర్పారుచుకొని అక్కడ జీవించాడు. అతని కుమారులు మందలను మేపెవారు. చిన్న వాడు అయిన యేసేపు అంటే అతనికి చాలా ఇష్టం. తన అన్నలు చేసే చెడు పనులను యోసేపు తండ్రికి చెప్పేవాడు, యాకోబు అతనికి నిలువుటంగిని కుట్టించాడు. యేసేపును తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించుట వలన యోసేపు అంటే వారికి అసూయ పుట్టింది. యాకోబు యేసేపును తన అన్నల మేపు మందల దగ్గరకు పంపగా, వారు యేసేపు వచ్చుటను చూసి అతనిని చంపుటకు కుట్రచేశారు. అది విన్న రూబెను యేసేపును కాపాడదలచి, ఈ రక్తపాతమేలా, ఇతనిని అడవిలో గోతిలో తోయమని చెప్పాడు. వారు అతని అంగీని తీసుకొని అలానే చేశారు. దానిలో నీళ్ళు లేవు. అపుడు గిలాదు నుండి ఐగుప్తుకు వెళ్ళే వర్తకులకు యోసేపును అమ్ముటకు యూదా తన సోదరులతో మాట్లాడాడు. ఇరవై వెండి నాణెములకు యోసేపును అమ్మారు. ఆ వర్తకులు యోసేపును ఐగుప్తు తీసుకువెళ్లారు. రూబెను ఆ గోతి దగ్గరకు వెళ్ళి యోసేపు అక్కడ లేకపోవుట చూసి, తన బట్టలు చించుకొని తన సోదరులతో చెప్పి ఇపుడు ఏమి చేయాలని ఏడ్చాడు. యోసేపు అంగీని తీసుకున్న సోదరులు నెత్తుటిలో ముంచి దానిని తండ్రి దగ్గరకు తెచ్చి, ఇది మా కంట బడింది. ఇది నీ కొడుకు అంగీ ఏమో గుర్తుపట్టమని చెప్పారు, దానిని చూసిన యాకోబు ఏ మృగమో తన కుమారుడిని మింగివేసినదని, ఎన్నో రోజులు కొడుకును తలచుకొని ఏడ్చాడు, యాకోబును కుమారులు, కుమార్తెలు ఓదార్చిన ఆయనకు ఓదార్పు కలుగలేదు.
కరువు - ఐగుప్తు పోవుట
ఆ కాలంలో ప్రతి దేశమున కరువు వచ్చినది, అప్పుడు యాకోబు ఐగుప్తు నందు ధాన్యము ఉందని విని, తన కుమారులను పిలిచి, అక్కడకు వెళ్ళి ధాన్యమును కొని రమ్మని చెప్పి పంపించేను. యోసేపు ఐగుప్తులో సర్వాధికారి. దేశ ప్రజలకు ధాన్యం అమ్మేవాడు. ఆయన తన అన్నలను గుర్తు పట్టేను, కాని వారు అతనిని గుర్తు పట్టలేదు. యోసేపు వారితో, మీరు గూఢచారులు, మా దుర్గముల లోటు తెలుసుకొనుటకు వచ్చారు అని చెప్పగా, వారు ఎలా అక్కడకు వచ్చినది, మరియు వారు ఎంతమంది అన్నదమ్ములు అని చెప్పగా, తమ చిన్న తమ్ముడిని తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే వారిని విడిచిపెడుతాము అని చెప్పాడు. అలా చెప్పి వారిలో ఒకరిని ఇంటికి పంపించి తమ్ముడిని తీసుకొనిరమ్మని చెప్పాడు. అప్పుడు యోసేపు వారు తెచ్చిన డబ్బును వారి సంచులలోనే పెట్టించాడు, వారికి ధాన్యమును ఇచ్చాడు. తరువాత యూదా ఐగుప్తు నుండి కనాను వెళ్ళి జరిగినది మొత్తం చెప్పి బేన్యమీనును తమతో ఐగుప్తు పంపమని అడిగారు. కాని యాకోబు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు యూదా తన తమ్మునికి ఎటువంటి అపాయం రాకుండా చూచుకుంటానని చెప్పాడు. యాకోబు ఒప్పుకున్న వారు బెన్యామీనును తీసుకొని ఐగుప్తు వెళ్లారు. వారు వెళ్ళి అంతకు ముందు తమ సంచులలో పెట్టించిన సొమ్మును కూడా ఇచ్చి, జరిగినది చెప్పారు. తరువాత యోసేపు తనతమ్ముని చూసి, తన తండ్రి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకా వారి మనసులను తెలుసుకోగోరి, వారు తీసుకొని వెళ్లగలిగినంత, అహర పదార్ధములను వారి సంచులలో పెట్టి, తన తమ్ముని సంచిలో తన వెండి గిన్నెను పెట్టించాడు. వారు వెళుతుండగా తన వారిని పంపించి, మీరు ఈ ఎలా వెండి గిన్నెను దొంగిలించారు అని అడిగించాడు. మేము అటువంటి పని చేయలేదు అని వారు చెప్పి , వెండి కాని, బంగారం కాని, ఎవరి వద్ద అయిన ఉన్నట్లయితే అతడు మీకు బానిస అవుతాడు అని చెప్పాడు. ఆ సంచులను విప్పగా, వారు బేన్యమీను సంచిలో వాటిని చూశారు. అప్పుడు యోసేపు వద్దకు యూదా వెళ్ళి, తన తమ్ముని వదలి వేయమని, తన తమ్ముని బదులు, తాను బానిస అవుతాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు సేవకులను బయటకు పంపి, తనను వారికి తెలియ పరుచుకున్నాడు. తరువాత వారు ఫరో రాజును కలుసుకొని, కనాను వెళ్ళి యోసేపు బ్రతికి ఉన్నాడు అని ఐగుప్తును ఏలుతున్నాడు అని యాకోబుతో చెప్పారు. యోసేపు తనను తీసుకుపోవడానికి బండ్లను పంపాడని, విని యాకోబు సంతోషించాడు.
యాకోబు తనకు ఉన్నదంత తీసుకొని బేర్షేబాకు వచ్చి, అక్కడ దేవుని కొలచి అక్కడ నుండి తన పిల్లలతో ఐగుప్తు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళిన వారు మొత్తం అరవై ఆరుగురు. వారిలో అతని కుమారుల భార్యలు చేరలేదు. ఐగుప్తులో చెరినప్పుడు వారు మొత్తం డెబ్బై మంది. గోషెనులో యోసేపును కలవడానికి వచ్చి, తన తండ్రిని కలసి ఆయన మెడ మీద వాలి ఏడ్చాడు. యాకోబు యోసేపుతో నిన్ను కన్నులారా చూచాను ఇక చనిపోయేదను అని అన్నాడు. యోసేపు తన సోదరులను ఫరో రాజు దగ్గరకు తీసుకొనిపొగ, ఆయన వారిని ఆ దేశములో ఉండమని చెప్పాడు. యాకోబును యోసేపు ఫరో రాజు దగ్గరకు తీసుకురాగ యాకోబు ఫరో రాజును దీవించాడు. ఫరో రాజు యాకోబు వయస్సు అడుగగా తనకు నూట ముప్ఫై ఐదు సంవత్సరములు అని చెప్పాడు.
యాకోబు తుది కోర్కెలు
యిస్రాయేలు ప్రజలు గోషేనులో నివశించి అక్కడ భూములు సంపాదించారు. అక్కడ యాకోబు పదిహేడు సంవత్సరాలు జీవించి, నూట నలభై ఏడు సంవత్సరాల బ్రతికాడు. మరణ సమయం వచ్చినప్పడు యోసేపును పిలిచి, తనను అక్కడ పాతి పెట్టవద్దని, తన తాత ముత్తాతల సరసన పాతిపెట్టమని చెప్పాడు. అలానే చేసేదనని యోసేపు ప్రమాణం చేశాడు. అటు తరువాత యాకోబు తల వాలిపోయేను. తండ్రికి జబ్బుచేసినదని తెలిసిన వెంటనే యోసేపు మనష్హే మరియు ఎఫ్రాయీమును తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళగా, యాకోబు తన బలాన్ని మొత్తం కూడగట్టుకొని లేచి, యోసేపుతో నీకు ఐగుప్తులో నేను రాక ముందు పుట్టిన బిడ్డలు నా కుమారులే అని చెప్పాడు. తరువాత పుట్టిన వారే నీ బిడ్డలు అని చెప్పాడు. యోసేపు కుమారులను చూచి, వారు ఎవరు అని యోసేపును అడుగగా వారు నా కుమారులని, ఐగుప్తు దేశంలో నాకు దేవుడు ఇచ్చాడని చెప్పాడు. అప్పుడు యాకోబు వారిని తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పి వారిని ముద్దాడి, దీవించి దేవుని దయతో నిన్నే కాదు నీ కుమారులను సైతము చూడగలిగాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు కుమారులను తండ్రి ఒడి నుండి తీసుకొని సాష్టాంగనమస్కారం చేశాడు. యాకోబు తన కుడి చేతిని చాచి చిన్న వాడయిన ఏఫ్రాయీమును, ఎడమ చేయి చాచి పెద్ద వాడైన మనస్సేను దీవించాడు. పెద్ద వాడైన వాని మీద ఎడమ చేతిని, చిన్న వాడైన వాని మీద కుడి చేయి పెట్టి దీవించడాన్ని యోసేపు చూసి, అది చెప్పగా దానికి యాకోబు నాకు అది తెలిసే చేశాను, మనస్సే గొప్ప వాడగును, కాని అంతకంటే ఏఫ్రాయీము ఎక్కువ గొప్పవాడగును అని చెప్పాడు.
యాకోబు దీవెనలు పలుకి మరణించుట
యాకోబు తన కుమారులను పిలిచి వారిని దీవించి చివరిగా, తనను ఏఫ్రోను భూమిలో ఉన్న గుహలో పాతి పెట్టమని చెప్పి ప్రాణము విడిచిపెట్టెను. యోసేపు, తన తండ్రి ముఖము మీద వాలి ముద్దుపెట్టుకొని రోధించాడు. యాకోబు దేహాన్ని నలబై రోజులు సుగంధ ద్రవ్యములతో భద్రపరిచారు. ఐగుప్తు దేశీయులు డెబ్బై రోజులు అంగలార్చారు. యాకోబు చెప్పినట్లే అతని కుమారులు యాకోబును కనాను దేశములో ఉన్న మక్ఫెళా పొలములో ఉన్న గుహలో పాతిపెట్టారు.
పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ )
పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ )
క్రీస్తు రాజు మహోత్సవం
క్రీస్తు రాజు మహోత్సవం
మత్తయి 25:31-46
"మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అపుడు సకలజాతులవారు అయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెలకాపరి మేకలను, గొర్రెలను వేరు పరుచునట్లు అయన వారిని వేరుపరచును. అయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అపుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిప్రక్కన ఉన్న వారితో 'నా తండ్రిచే దీవింప బడిన వారలారా! రండు. ప్రపంచ ప్రారంభమునుండి మీకై సిద్దపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినపుడు దాహము తీర్చితిరి, పరదేశినై యున్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనైయున్నపుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నపుడు నన్ను దర్శింపవచ్చితిరి' అని పలుకును. అపుడు ఆ నీతిమంతులు 'ప్రభూ!నీవు ఎపుడు ఆకలిగొనియుండుట చూచి, భోజనము పెట్టితిమి? దప్పికగొని యుండుట చూచి దాహము తీర్చితిమి?ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి ?వస్త్ర హీనుడవై యుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి?ఎప్పుడు రోగివైయుండుట చూచి, పరామర్శించితిమి? చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి?' అని అడుగుదురు. అందుకు రాజు 'ఈ నా సోదరులలో అత్యఅల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి. అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను' అని వారితో చెప్పును. అపుడు అయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా!నా నుండి తొలగి, పిశాచమునకు, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యనరకాగ్నిలోనికి పొండు. ఏలయన నేను ఆకలిగొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పికగొని యుంటిని, దాహము తీర్చలేదు. పరదేశినై యుంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రహీనుడనై యుంటిని, నాకు వస్త్రములను ఈయలేదు. రోగినై యుంటిని నన్ను పరామశింపలేదు. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింప రాలేదు' అనును. అపుడు వారు కూడ'ప్రభూ! నీవు ఆకలి గొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశివై యుండుట, వస్త్రహీనుడవై యుండుట, రోగివై యుండుట, చెరసాలలో నుండుట,, మేము ఏనాడు చూచి పరిచర్యచేయకపోతిమి ?'అని ప్రశ్నింతురు. అందుకు అయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే' అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకులు వెడలిపోవుదురు. నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు" అని పలుకెను.
ఈ రోజు మనం యేసు క్రీస్తు రాజు పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగను 1925 సంవత్సరంలో 11 వ భక్తినాధ పాపు గారు స్థాపించారు. ఇది నిజమైన శాంతిని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును అన్వేశించాలి మరియు ఆయన మాత్రమే శాంతి సమాధానం ఇవ్వగలరు అని తెలియజేసే ఒక పండుగ ఇది. 1918 వ సంవత్సరంలో లో మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత 1920 లో ఎవరు నిజమైన శాంతిని ఇవ్వగలరు అని ఆలోచిస్తూ నిజముగా క్రీస్తు మాత్రమే నిజమైన శాంతి ఇస్తాడు అని చెపుతూ స్థాపించిన పండుగ ఇది.
ఇదే సమయంలో ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో ప్రజలు లౌకిక వాదం వైపు మొగ్గుచూపుతూ దేవుని యొక్క అవసరం మాకు లేదు అనే ఆలోచన విధానం పెరిగిపోతున్న సమయం. దేవుని యొక్క అవసరం మాకు లేదు కాని మాకు మేము జీవించగలం, ఆనందంగా ఉండగలం అని మనం అనుకోవచ్చు కాని అది సాధ్యపడదు. యిస్రాయేలు ప్రజలు మనకన్నా ముందుగా ఇలా ఆలోచించి ఇది సాధ్య పడదు అని తెలుసుకున్నారు.
యిస్రాయేలీయుల రాజు
మొదటిగా యిస్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవుడు వారికి ఒక రాజు ఉండాలి అనిఅనుకోలేదు. ఎందుకు అంటే యిస్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండేవాడు. రాజు చేసేటువంటి పనులు మొత్తం దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. వారిని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన అన్నీ జాతులకు రాజు. యిర్మియా 10,7. యిస్రాయేలును పవిత్ర ప్రజగా ఆయన ఎన్నుకున్నారు. వారి మధ్యలో నివసించారు. కీర్తన 134,3. యోషయా 52:7. నీ ప్రభువు నీ మధ్య నున్నాడు. నీవు సంతసింపుము అని జేపన్యా గ్రంధంలో మనం వింటాం. జఫన్యా 3:14-15.
ఇతర దేశాల రాజులు మరియు రాచరికం
పూర్వ కాలంలో రాచరికం, రాజ్యాధికారం దేవునికి సంభందించినవి అని అనుకునేవారు. ఈ ఆలోచన అప్పటి ప్రజల సంస్కృతి , సంప్రదాయాలలో కూడా కనిపించేది. ఐగుప్తు దేశంలో ఫరో రాజును హ్ోరోస్ అవతారంలా భావించేవారు. ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా అనుకునేవారు. బాబిలోనియా ప్రజలు తమ రాజును మదురుక్ ప్రతినిధిగా భావించేవారు. రాజును దేవుడు భూమి, ప్రజలు, సైన్యం, దైవబలి మొదలగు వాటికి అధిపతిగా చేశాడు అని భావించేవారు. బాబిలోనియా, ఐగుప్తు దేశాల రాజులు, వారి రాచరికం గురించి మనం తెలుసుకున్నప్పుడు, రాజు దేవుని ప్రతినిధి అనే భావన కలుగుతుంది. ఇదే ఆలోచనను తరువాత గ్రీకు మరియు రోమా రాజ్యాలలోనూ ఉంది. ఇది ఇంకా కొంచెం పరిధి దాటి రాజును దేవునిగా చూడటం వారు మొదలు పెట్టారు.
యిస్రాయేలు ప్రజలు రాచరికం
యిస్రాయేలు ప్రజలకు మానవ రాజు అనే ఆలోచన అసలు లేదు. కాని వారు ఎప్పుడైతే ఐగుప్తు , బాబిలోనియా దేశాలలో బానిసలుగా ఉన్నారో అప్పుడు వారికి ఈ ఆలోచన కలిగింది. మనకు ఒక రాజు కావాలి అనుకున్నారు. వారు అక్కడ నుండి వచ్చిన తరువాత మిధ్యానియుల నుండి కాపాడిన తరువాత వారు గిద్యొనును తమ మీద రాజుగా వుండమని కోరారు. కాని ఆయన ఒక విషయం స్పష్టం చేశాడు. నేను కాని నా కుమారుడు కాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్ము పాలించును. దేవుడే మిమ్ములను పాలించును అని వారికి తెలియజేశాడు. న్యాయాధిపతులు 8:23. దేవుడు ఒడంబడిక ద్వారా వారిని ఎన్నుకొని వారిని పాలించాడు. కాని తరువాత అబిమలేకు రాజును కావాలనే ఆశతో షెకెము వద్ద కానా తరహా రాచరికాన్ని స్థాపించాలని చుసాడు. కాని అది నాశనం అయ్యింది. తరువాత సమూవేలు ప్రవక్త కూడా మానవ రాచరికానికి వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రజలు పదే పదే అడుగుట వలన సమూవేలు ప్రవక్త వారికి దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలును రాజుగా అభిషేకించారు. సౌలును దేవుడు తన ఆత్మతో నడిపించాడు. కాని సౌలు తరువాత తనకు ఇష్టమైన విధముగా జీవించడం వలన దేవుడు అతన్ని తిరస్కరిస్తున్నాడు. దాని తరువాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు నీ కుటుంబము, రాజ్యము కలకాలము నా కనుసన్నులలో మన్నును , నీ సింహాసనం నిత్యం, నెలకొని యుండును, అని వాగ్ధానం చేసాడు. కాని యిస్రాయేలులో చెడు రాజులు ఎక్కువయ్యారు. వారు పొరుగు దేశాలను చూసి వారి వలె విగ్రహారాధన చేశారు. ప్రవక్తలను వ్యతిరేకించారు. హొషేయా ప్రవక్త రాజరికాన్ని ఖండించాడు. కాని యేషయా ప్రవక్త భవిష్యరాజు పుట్టుక గురించి చెప్పాడు. దేవుడు వారికి రాజుగా ఉండటం మరియు దావీదు వంశం నుండి రాజు రావడం సాధ్య అవుతుంది యేసు ప్రభువుతోటి.
దేవుడు ఎందుకు వారికి రాజును ఇవ్వాలనుకోలేదు.
దేవుడు యిస్రాయేలు ప్రజలకు ఒక రాజును ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకు అంటే సమూవేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ లోక రాజులు ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు, దేవుడు వారిని స్వతంత్రులుగా ఉంచాలి అని అనుకున్నారు, రాజుగా ప్రజల బాగోగులను దేవుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాడు. వారిని ఇతర రాజ్యాలనుండి కాపాడాడు, వారికి కావలసిన అన్నీ వారికి సమకుర్చాడు. అన్నీ విధాలుగా వారి మధ్యనే దేవుడు ఉన్నాడు. అందుకే వారిలో ఒక ఆలోచన ఉండేది. మెలెక్ యాహ్వె అని . మెలెక్ అంటే రాజు అని, యాహ్వె అంటే ఉన్నవాడు అని అర్ధం. మెలెక్ యాహ్వె అంటే నిత్యం ఉండువాడు మనకు రాజు అని, లేక దేవుడు మనకు రాజు అని అర్ధం. అప్పటి నుండి ప్రజలలో దేవుడు మాకు రాజు అనే భావన ఉండేది.
యిస్రాయేలు ప్రజలలో దేవుడు వారి రాజు అనె భావనలో పూర్తిగా వ్యక్తం కాకపోయినా ప్రవక్తలు దీని గురించి చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. వారు దేవున్ని తమ రాజు అని ప్రకటించుకున్నారు. దేవుడు తమ రాజు అని గర్వంగా చెప్పుకునేవారు. మిగిలిన రాజులు కేవలం మానవ మాత్రులు అని ఎగతాళి కూడా చేసేవారు.
తరువాత కాలంలో యిస్రాయేలు ప్రజలు మెస్సీయా వారి రాజుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. యేసు ప్రభువు యెరుషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఈ కోరికను వ్యక్త పరిచారు. ఇక్కడ యేసు ప్రభువు విజయోత్సవ రాజు వలె యెరుషలేముకు వస్తున్నాడు. వారు ఆయనను తమ మెస్సీయాగా వారు ఒప్పుకుంటున్నారు. యోహను 6 వ అధ్యాయంలో మనం ప్రజలు ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారు అని తెలిసి అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం యేసు ప్రభువు సిలువ వేయబడిన సిలువ మీద ఈసూస్ నజారెనుస్ రెక్స్ ఇదయరేయుమ్. నజరతు నివాసి అయిన యేసు యూదుల రాజు అని చదువుతాం.ఇది పూర్తిగా వారి కావాలని కోరుకున్న లేకున్నా దేవుడు వారి రాజుగా ఆయననను అంగీకరిస్తున్నారు.
యేసు ప్రభువు ఎటువంటి రాజు ? యేసు ప్రభువును వారు ఏమి కోరుకుంటున్నారు, యేసు ప్రభువునుగురించి సువిశేషంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము? అంటే వారు యేసు ప్రభువు నందు వారి అవసరాలను తీర్చే రాజును, వారిని పీడించే వారి నుండి విడిపించేలా చేసే రాజును వారు చూస్తున్నారు. వారి అనారోగ్యాలను తొలగించే వైద్యుడిని వారు చూస్తున్నారు. వారికి స్వేచ్ఛను ఇచ్చే రాజును వారు చూస్తున్నారు. విటన్నింటికంటే వారు స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు.
ఇవి అన్నీ కూడా కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి అంతే కాదు మనకు నిజమైన శాంతిని ఇచ్చేది కూడా ప్రభువు మాత్రమే. జీవాన్ని మరియు స్వాతంత్రంను ఇచ్చి మనలను బానిసత్వం నుండి నడిపించే రాజు కనుక ఎల్లప్పుడు ఆ ప్రభువు పాలనలో ఉండాలి అని కోరుకుందాం.
లూకా 5: 33-39
లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...
