25, ఫిబ్రవరి 2026, బుధవారం

ఫిలిప్పు మరియు నతనయేలుల మనస్తత్వం

 ఫిలిప్పు మరియు  నతనయేలుల మనస్తత్వం

యోహాను 1: 43-51 

మరునాడు యేసు గలిలీయా వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో "నన్ను అనుసరింపుము" అని పలికెను. ఫిలిప్పు కూడఆంద్రెయ పేతురుల నివాసమగు బేత్సయిదా పుర నివాసియే. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు గలిలీయాకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభువు అనేక అద్భుతకార్యాలు ఈ ప్రదేశములోనే చేసినది. అంతేకాక ఈ ప్రదేశమున యూదులు మాత్రమే కాక అనేక మంది ఇతరులు అన్యులు కూడా ఉండేవారు. యేసు ప్రభువు పిలిప్పును చూసి నన్ను అనుసరింపమని అడిగాడు. పిలిప్పు యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. అంతేకాక పిలిప్పు జీవితంలో ఎంతో మందిని ప్రభువు దగ్గరకు తీసుకువచ్చిన ఉదంతమును సువిశేషంలో మనం చూస్తాము. ప్రభువుకు ప్రజలకు అనుసంధానం చేయడంలో పిలిప్పు చాలా నేర్పరిగా ఉండేవాడు. రెండు చేపలను ఐదు రొట్టెలను ఐదువేల మందికి పంచి పెట్టినప్పుడు ఒక పిల్లవాని దగ్గర ఉన్న చేపలను రొట్టెలను తీసుకొని వచ్చినది ఇతనే. మరియు కొంతమంది గలిలీయులు యేసు ప్రభువును కలుసుకొనుటకు వచ్చినప్పుడు కూడా ఈ పిలిప్పు వారిని ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నతానియేలును ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. 

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. పిలిప్పు కూడ ఆంద్రెయ వలె యేసు ప్రభువు గురించి అనుభవపూర్వకముగా తెలుసుకొని ఆయన మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నాడు. అందుకే ధర్మశాస్త్రమునందు, ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వానిని కనుగొన్నాము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుతో ఉండటం, ఆయనను కలవడం, ఆయనతో మాట్లాడటం ఒక వ్యక్తిని పూర్తిగా దైవ అనుభవంలోనికి తీసుకువెళ్తాయి. మిగిలిన ఎంత గొప్ప విషయంకూడ ఇటువంటి దైవ అనుభవాన్ని ఇవ్వలేవు. పిలిప్పు ఈ విషయము గురించి నమ్మకంతో ఉన్నాడు. ఫిలిప్పు సహాజముగానే దేవుని అన్వేషించే వ్యక్తి అందుకే ఆయనను యేసు ప్రభువే కనుగొంటున్నాడు. దేవున్ని మనం అన్వేషించినట్లయితే దేవుడే మనకు ఆవిష్కారం అవుతారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫిలిప్పు ఇప్పుడు ఈ విషయములను నతనయేలుకు చెబుతున్నారు. 

"నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలుకు మెస్సీయ్యా నజరేతు నివాసి అని చెప్పడం వలన ఆయన దానిని నమ్మలేకున్నాడు. ఎందుకంటే యిస్రాయేలులో నజరేతు ఒక తృణీకరింపబడిన పట్టణం. అక్కడ నుండి రక్షకుడు వస్తాడు అంటే నమ్మలేకపోయాడు. నజరేతు నుండి ఏదైన మంచి రాగలదా అని నతనయేలు అడిగిన కాని ఫిలిప్పు ఆయనతో వచ్చి చూడమని చెబుతున్నాడు. యేసు ప్రభువును  చూడడం వలన మనం ఆయనకు పూర్తిగా చెందినవారిగా మారిపోతాము. అందుకే ఫిలిప్పు వచ్చి చూడమని నతనయేలుతో అంటున్నాడు. "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. ఫిలిప్పు చెప్పినట్లుగానే యేసు ప్రభువు దగ్గరకు రాగానే నతనయేలు ఆశ్చర్యపోతున్నాడు. నతనయేలు గురించి యేసు ప్రభువు అతనిలో ఎటువంటి కల్మషం లేదు అని అంటున్నాడు. యిస్రాయేలు అంటేనే కల్మషం లేని వాడు అని అర్ధం. యాకోబు అంటే మోసగాడు కాని దేవునికి ఆ పేరు ఇష్టం లేదు. కనుక యాకోబు పేరు మారుస్తున్నాడు. అతనికి యిస్రాయేలు అని పేరుపెడుతున్నాడు. కానాను అంటే నైతిక విలువలు లేనిది కాని, ఆ భూమిని ప్రభువు తన సొంత ప్రజలకు ఇస్తున్నప్పుడు  ఆ భూమికి యిస్రాయేలు అని పేరు పెడుతున్నాడు. నతనయేలును చూసి ఆయనను నిజమైన యిస్రాయేలియుడు అని చెబుతున్నాడు. అతని గురించి పూర్తిగా తెలిసినట్లుగా ప్రభువు మాటలాడుతున్నాడు. అంజూరపు చెట్టుక్రింద ఉండటం నేను చూశాను అని తెలియజేస్తున్నాడు. అంటే జ్ఞానం కోసం ఎదుకుచున్నప్పుడు చూశాను అని అర్ధం. 

 "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. వెంటనే నతనయేలు యేసు ప్రభువును దేవుని కుమారుడవు , యిస్రాయెలు రాజువు  అని సంబోధిస్తున్నాడు. ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వారు, ఇలానే ప్రభువు గురించి తెలుసుకుంటారు.ప్రభువుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేలా మనకు ఉండేలా మనం ప్రయత్నించాలి అప్పుడు మనకు ప్రభువుతో ఉన్న అనుభవం మారిపోతుంది. ప్రభువు ఇక్కడ నతనయేలుతో ఇంతకంటే గొప్ప విషయాలు చూచెదవు అని చెబుతున్నారు. దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరని చెబుతున్నాడు. యేసు ప్రభువు భూలోకమునుండి  పరలోకానికి  పోవుటకు నిచ్చెన ఆయన ద్వారానే మానవుడు పరలోకం పోవడం జరుగుతుంది ఇవి అన్ని కూడ చూడగలం అని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన:  ప్రభువా! మీరు మిమ్ము అన్వేషించే పిలిప్పును కనుగొని అతనికి రక్షకుడిని తెలుసుకునే అనుగ్రహమును ఇస్తున్నారు. ఫిలిప్పు ఏవిధముగా అయితే అనేక మందిని మీ వద్దకు తీసుకొని వస్తున్నాడో, మేము కూడా అలానే మీ  వద్దకు ఇతరులను తీసుకొని వచ్చేందుకు కావలసిన అనుగ్రహములను పొంది, ఇతరులను మీ వద్దకు తెచ్చేలా మమ్ములను మార్చండి. ప్రభువా ! మిమ్ములను అనుభవపూర్వకంగా తెలుసుకొనుటకు మేము చేయవలసినదంతయు ఎటువంటి లేమి లేకుండా చేసేలా మమ్ము దీవించండి. ప్రభువా! నతనయేలు మీరు నజరేతువాసి అంటే నమ్ముటకు సిద్దంగా లేడు, కాని మిమ్ము చూసిన తరువాత ఆయన అభిప్రాయం మొత్తం మారిపోయింది. మీరు నతనయేలును నిజమైన యిస్రాయేలు అని చెబుతున్నారు. ఆయనలో ఎలా కల్మషం లేకుండా ఉన్నారో మేముకూడా మేము కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఉండేలా మమ్ము దీవించండి. ఆమెన్.   

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 మత్తయి 2:1-12

హెరోదు రాజు పరిపాలనాకాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు  తూర్పు దిక్కు నుండ యెరుషలెమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున  చూచి మేము ఆరాధింపవచ్చితిమి" అని అనిరి. ఇది విని హెరోదు రాజును, యెరుషలెము నగరవాసులందరను కలతచెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్రభోదకులను సమావేశపరచి "క్రీస్తు ఎచట జన్మించును?" అని ప్రశ్నించెను. "యూదయ సీమయందలి బెత్లెహేమునందు" అని వారు సమాధానమిచ్చిరి. "యూదయ సీమయందలి బెత్లెహేమా! నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఎలయన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలోనుండి వచ్చును" అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును  వారి నుండి తెలిసికొనేను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును" అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్లిపోయిరి. అదిగో! తూర్పుదిక్కున వారిముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి.  
 
 హెరోదు రాజు  యూదయా ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం  37 వ సంవత్సరం నుండి  4 వ సంవత్సరం వరకు పాలించాడు. మీకా గ్రంధం 5:1-3 ప్రకారం బెత్లేహేము రక్షకుని యొక్క  జన్మ స్థలం. మరియు అది దావీదు  రాజు యొక్క జన్మ స్థలం కూడా.  లోక రక్షకుడు జన్మించిన విషయం తెలుసుకున్న ముగ్గురు రాజులు యేసు ప్రభువును చూసి ఆరాధించుటకు అక్కడకు వస్తున్నారు. ఈ ముగ్గురు రాజులు హేరేడేటాస్ అనే చారిత్రకారుని  ప్రకారం మెదియ అనే  తెగకు  చెందినవారు. మెదియా అనేది  పర్షియా రాజ్యంలో ఒక భాగం. మెదియా ప్రజలు  పర్షియన్ల పాలన నుండి స్వాతంత్ర దేశంగా ఎదగాలని అనుకునేవారు. అనేక సార్లు యుద్దాలు చేసి ఓడిపోయారు.   వారికి ఉన్న ఈ కోరిక సాధ్యంకాక వారు వేరే విధంగా స్థిరపడ్డారు.  ఏవిధంగా వీరు స్థిరపడ్డారు అంటే వీరికి అంతరిక్ష శాస్త్రంలో ఉన్న నైపుణ్య కారణంగా అంతరిక్షంలో ఏర్పడే మార్పుల ఆదరముగా భవిష్యత్తును చెప్పడం. జ్ఞానమునకు వీరు ఇచ్చే ప్రాముఖ్యతకు అనుకూలంగా దైవ జ్ఞాన విషయాల గురించి తెలుసుకుంటూ యాజకులుగా స్థిరపడ్డారు. భవిష్యవాణి చెప్పేవారిగా , జ్ఞానులుగా మరియు యాజకులుగా స్థిరపడిన వీరు పాలన చేయాలనే రాజ్యాధికార వ్యామోహం వదలిపెట్టారు.  పర్షియా దేశంలో వీరిని జ్ఞానులుగా  మరియు పవిత్రులుగా చూసేవారు. వీరు ప్రవచనాలు చెప్పడంలో , వైద్య శాస్త్రంలో  మరియు అంతరిక్ష శాస్త్రాలలో ప్రసిద్దులు. అంతరిక్షం లో జరిగే మార్పులను బట్టి వీరు ఏమి జరుగుతున్నదో చెప్పేవారు. వీరు యూద ప్రజలు కాదు. వీరు కూడా అన్య ప్రజలే కానీ పరిస్థితులను అవగాహన చేసుకోగలిగిన వారు. మంచి చెడులు తెలిసినవారు. 

ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే, ఎందుకు అంటే ఆదికాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులే, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవునికి  అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తిస్తున్నారు, తెలుసుకుంటున్నారు మరియు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. కనుక వీరి రాకతో మరియు వీరు అర్పించిన బహుమానములతో యేసు ప్రభువు దేవుడు అనే విషయం తెలుస్తుంది. 

ఈ ముగ్గురు రాజులు, ఆకాశంలో ఒక నక్షత్రం చూసి, ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో  జన్మించారు, అని తెలుసుకున్నారు. వారు ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. అది ఏమిటి అంటే ఇన్నాళ్ళూ వారు ఆకాశంలో చూసిన అన్ని మార్పులు వారి జీవితంలో మార్పు తీసుకురాలేదు. కాని ఈ నక్షత్రం ఖచ్చితంగా మార్పు తీసుకువస్తుంది అని వారు నమ్ముతున్నారు. వారు జ్ఞానులుగా ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారు తెలుసుకున్న విషయం వారిజీవితంలో తెలుసుకున్న అన్ని విషయాల కంటే గొప్పది అది ఏమిటి అంటే లోక రక్షకుడు ఎవరు అనెది. బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభువు రక్షకుడు అని మరియు దేవుడు అని వారు తెలుసుకుంటున్నారు. అంతే కాదు ఈయన మాత్రమే వారి జీవితాలలో ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయగలరు అని తెలుసుకుంటున్నారు.   ఉన్న   వారి అన్ని ఆశలకు సమాధానం ఈ నక్షత్రం తెలియచేస్తుంది అని నమ్మారు, లేకపోతే   వారు అంత దూరంనుండి  వచ్చే వారు కాదు. ఇంత దూరం వచ్చి ఏమి చూసారు అక్కడ? కేవలం చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను,  అటువంటి ప్రదేశంలో మరియు అటువంటి పరిస్థితిలో ఉన్న యేసు ప్రభువును ఎందుకు వారు ఆరాధించారు? ఈ ప్రశ్న మనం అడిగినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వారికి  అక్కడ  దేవుని మహిమను కనబడింది.   వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. దేవుని చూడటానికి వెళుతున్నారు. నిజమైన జ్ఞానాన్ని పొందడానికి వెళుతున్నారు. దేవున్ని కలవడానికి వెళుతున్నారు. ఇవి అన్ని యేసు ప్రభువులో చూస్తున్నారు.  అందుకే ఆయనను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉండి యేసు ప్రభువు రాజరికాన్ని ఆమోదిస్తున్నారు.   దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి  వెళుతున్నారు. 

 ఈ కారణాల వలన ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం.  ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఈ జ్ఞానులకు తనని తాను  తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక  నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. మనం కూడా ఆయన గురించి విని ఉన్నాము. ఆయన చేసిన పనులు తెలుసుకొని వున్నాము. ఆయనను మనం కూడా గుర్తించి, అంగీకరించి, ఆరాధించి ఆయన దైవత్వాన్ని అంగీకరించి ఆయన రాజరికాన్ని అంగీకరించి ఆయన దీవెనలు పొందవచ్చు. 

ఈ జ్ఞానులు ఏమి అర్పిస్తున్నారు?  యేసు ప్రభువుకి ఆయనను ఆరాధించిన తరువాత వారు బంగారం వారు అర్పిస్తున్నారు. బంగారం ఎందుకు అర్పిస్తున్నారు  అంటే బంగారాన్ని రాజులకు అర్పిస్తూ ఉంటారు, అంటే వారు  ఆయనను రాజుగా వారి అధిపతిగా అంగీకరిస్తున్నారు. మరల పరిమళ ద్రవ్యాలను ఇస్తున్నారు. అవి ఆయన శ్రమలు మరియు మరణాన్ని గుర్తు చేస్తున్నాయి.  ఆయన ఏ విధంగా ప్రజలను రక్షించబోతున్నారు అని తెలియ చేస్తున్నాయి. తరువాత వారు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. ఇది దేవుని ఆరాధనకు  అర్పించేది ఎందుకంటే ఆయన తమ యాజకునిగా, దేవునిగా వారు  గుర్తించారు. వారు కూడా యాజకులుగా స్థిరపడినవారే అయినా కాని  నిత్య యాజకునిగా ఆయనను వారు గుర్తిస్తున్నారు. 

వీరు యేసు ప్రభువుని తెలుసుకొని రాజుగా, యాజకునిగా మరి ముఖ్యముగా దేవునిగా తెలుసుకుంటున్నారు. అయన దగ్గరకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు ఆయన యూదుల రాజు పుట్టాడు మేము ఆయన్ను చూడటానికి వచ్చాము అని చెప్పగానే ఆయన ఆందోళన చెందుతున్నాడు. యేసు ప్రభువును తన ఆధికారముకి అడ్డంగా ఉంటాడు అని ఆయనను చంపాలని అనుకుంటున్నాడు. యేసు ప్రభువు అధికారం మనం చూపించే అధికారం లాంటిది కాదు. అది ప్రేమించే అధికారం, రక్షించే అధికారం. క్షమించే అధికారం. అది తెలియని హెరోదు అనేక మంది చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. హేరోదు రాజు  యూదయ పెద్దలను అందరిని పిలుస్తున్నాడు.  యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడో తెలుసుకుంటున్నాడు.  మతపెద్దలకు  ఆయన ఎక్కడ పుడతాడో  తెలుసు.  కాని వారు జ్ఞానుల వలె   ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి అని అనుకోలేదు. మనం వీరిలా ఉండకూడదు.  ఈ  ముగ్గురు జ్ఞానులే ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి.  మనము వీరిని ఆదర్శముగా తీసుకోవాలి, ఆ విధంగా జీవించాలి. అందుకు కావలసిన అనుగ్రహాలు ఇవ్వమని ఆ ప్రభువును అడుగుదాం. 



యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16 "పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః...