సంపదను దైవ రాజ్యప్రవేశానికి మార్గంగా చేసుకోవచ్చు
లూకా 16: 19-31
ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపు చుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహామంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకు చుండెను. ఆ నిరుపేద మరణింపగా. దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధ పడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు 'తండ్రి అబ్రహామా!నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడి పోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము ' అనెను. అందుకు అబ్రహాము , కుమారా ! మరువకుము. నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించు చుండ, లాజరు అష్ట కష్టములను అనుభవించేను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖ పడుచున్నాడు. అంతేకాక, మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన ఆచాటివారు ఇచ్చటకు రాలేరు. ఇచ్చటివారు అచటకు పోలేరు' అని పలికెను. అందుకు ధనవంతుడు 'అట్లయిన నాదొక మనవి. నాకు ఐదుగురు సహోదరులున్నారు. వారు కూడ ఈ ఘోరనరకమునకు రాకుండ హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి యింటికి పంపుము' అనెను. అందుకు అబ్రహాము 'వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును' అని సమాధానమిచ్ఛెను. 'అది చాలదు తండ్రీ ! అబ్రహామా!మృతులలో నుండి ఎవరైన వారి వద్దకు వెళ్ళిన యెడల వారికి హృదయ పరివర్తనము కలుగును' అని అతడు మరల పలికెను . అందులకు అబ్రహాము 'మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు, మృతులలో నుండి ఒకడు సజీవుడై, వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు' అని ప్రత్యుత్తరమిచ్ఛెను".
ఈ సువిశేష భాగంలో ధనవంతుడు పేదవాని పట్ల తన నిర్లక్ష్యపు ప్రవర్తనకు కారణంగా శిక్షించబడ్డాడు. లాజరు ధనవంతుని వాకిలి వద్ద కూర్చొని ఉంటున్నాడు. ధనవంతుడు శిక్షించబడటానికి లేక నరకానికి పోవడానికి గల చేసిన తప్పు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్ధం అవుతాయి. మనం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఆడగవలసి ఉంది. అవి ఏమిటి అంటే ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళవలసి వచ్చినది? ఎందుకు ఆయన అంత అగ్నిలో కాలుతుండాలి? ఒక నీటి బొట్టు కోసం అడుగుకునే పరిస్థితి ఎందుకు వచ్చినది? ఎందుకు ఆయనను అబ్రహాము, లాజరుల నుండి దూరం చేస్తూ అంత పెద్ద అగాధం ఉండాలి? అంత దూరం పెట్టె అంతటి తప్పు ఇతను ఏమి చేశాడు?
ధనవంతుడు- నీతిమంతునిగా జీవించాడా?
ధనవంతుడు నీతి మంతుడు కాదు, ఈ ఉపమానం లోభితనంతో ఇతరుల సంపదను ,మిగుల సంపదను తమకు సంభందించినది, దానిలో ఎవరికి భాగం లేదు అని ఆలోచించే పరిసయ్యుల గురించి, మరియు శిష్యులు అలా ఉండకూడదు అని చెప్పిన ఒక ఉపమానం ఇది. ధనవంతుడు యొబు వలె నీతిమంతుడు అయినట్లయితే ప్రభువా నేను ఏ తప్పు చేసాను అని, నాకు ఈ శిక్ష వేస్తున్నారని, నేను వీటిని పొందవలసిన వాడిని కాదు అని చెప్పటం లేదు, లేక కీర్తన కారుని వలె మంచి వారు ఎందుకు శ్రమలు అనుభవించాలి అని ప్రశ్నించడం లేదు. అంటే తాను నీతి మంతుడు కాదు అని ఆయనకు కూడా తెలుసు.
ధనవంతుని యదార్ధ స్థితి
ఈ లోకంలో ఉండగా ధనవంతుడు సకల ఐశ్వర్యాలను అనుభవించాడు. అంతే కాదు తాన బాధ్యతలను మరచిపోయాడు. తాను చాలా సంపన్నమైన జీవితమును జీవిస్తున్నాను, అని తన పరిసరాలను, తన చుట్టూ ఉన్నవారిని మరిచిపోయి జీవిస్తున్నాడు. అతను రోజు నూతన పట్టు వస్త్రాలను, విందులను చేసుకుంటున్నప్పటికి అతని యదార్ధ స్థితి ఏమిటి అంటే తన భోజనపు బల్ల దగ్గర పడే రొట్టె ముక్కల కోసం ఎదురుచూసే లాజరు శరీరాన్ని , దాని మీద ఉన్న వ్రణాలను కుక్కలు నాకుతున్న పరిస్థితి ఉన్న, వాటిని తన ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడు. అంటే అతను ఎంతో పరిశుభ్రమైన పరిస్థితులలోఉన్నాను అనుకున్నప్పటికీ అది నిజం కాదు అతను చాలా దుర్భరమైన స్థితిలోనే ఉన్నాడు. ఇది కేవలం ఈ ధనవంతుని పరిస్థితి మాత్రమే కాదు. ఎవరైన సంపదలు వచ్చిన తరువాత దేవుని మరచి పోయే వారి పరిస్థితి ఇలానే ఉంటుంది. వారు దేవున్ని మరచిపోతారు, దేవుని పట్ల వారి బాధ్యతలు మరచిపోతారు, తమ పరిసరాలను మరచిపోతారు, తమతో ఉన్న వారిని మరచిపోయి జీవిస్తారు.
లూకా సువిశేషంలో యేసు ప్రభువు అనేక పర్యాయలు ధనవంతులుకు వ్యతిరేకముగా మాటలాడారు. లూకా 6:24, “అయ్యో !ధనికులారా ! మీకనర్ధము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు.” లూకా 12 : 21,తన కొరకు ధనము కూడబెట్టుకొనువారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు” అని చెప్పెను. ఇక్కడ సంపదతో కూడిన చెడు గురించి కూడా యేసు ప్రభువు చెప్పటం మనం చూస్తాం. అదే విధంగా పేదవారికి దేవునిమీద నమ్మకం ఉండే విధంగా చేయడం మనం ఇక్కడ చూస్తున్నాము.
ఎందుకు ధనవంతుడు శిక్షించబడ్డాడు ?
ధనవంతుడు తన సంపదలను అనుభవించాడని శిక్షించలేదు. కేవలం ఇతనికి ధనం ఉంది అని శిక్షించబడలేదు. ధనవంతుడు పేదవారిని నిర్లక్ష్యం చేసినందుకు , తనకు ఉన్న సంపదతో పేదవారిని స్నేహితులుగా మార్చుకోలేదని శిక్షకు గురవుతున్నాడు. ధనవంతునికి లాజరు పరిస్థితి మొత్తము తెలుసు అయిన కాని తనకు సహాయ పడుటకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు. తాను నిర్లక్ష్యం చేసినది ఒక నీతి కార్యమును. ధనవంతులైన అబ్రహాము నీతి మంతుడు కనుక ఇతరులకు సహాయం చేస్తూ, తన నీతిని నిరూపించుకున్నాడు. హృదయ పరివర్తన గురించి వారికి బాప్తిస్మ యోహను అంతకు ముందుగానే తెలియ చేశారు. హృదయ పరివర్తన ఫలితం మనకు ఉన్న దానిని లేని వానితో పంచుకోవాలి అని తెలియజేస్తున్నాడు. లూకా 3:11. “రెండు అంగీలున్న వ్యక్తి ఏమియు లేనివానికి ఒక దానిని ఈయవలయును. భోజనపదార్ధములు ఉన్న వారు కూడ అట్లే చేయవలయును” అని యోహను సమాధానము ఇచ్చెను. యేసు ప్రభువు ధనవంతులకు పేదవారిని, కుంటి వారిని గ్రుడ్డి వారిని వారి పండుగలకు పిలవమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది పునరుత్థాన సమయంలో వారికి ఉపయోగ పడుతుంది. (లూకా 14:12-14) . ధనవంతుడు ఇది కూడా చేయలేదు కనుక ఇతను ఎటువంటి బహుమానం ఆశించడానికి వీలు లేదు. అలా అని ఇతను ఎవరికైనా ధన ధర్మాలు చేసిన వ్యక్తి కూడా కాదు. ధనవంతునికి లాజరుకు సహయం చేసే అవకాశం ఉంది , తాను నరకానికి పోకుండా ఉండే అవకాశం పొందాడు, కాని అతను వాటిని వినియోగించుకోలేదు. లాజరును యేసు ప్రభువు చెప్పినటువంటి అవినీతి సంపదతో మీరు మిమ్ములను పరలోకానికి ఆహ్వానించే మిత్రులను ఏర్పాటు చేసుకోండి అని చెప్పిన మాటను మనం చూస్తున్నాము. ఇతను చివరకు అదికూడా చేయలేదు. అంటే అంత నాకు కావాలి , నేనే పొందాలి అనే కోరికతోనే జీవించాడు. ఇక్కడ ధనవంతుడు తన సంపన్నుడు అయినందుకు శిక్షించబడలేదు. తన సంపదను కొద్దిగా కూడా అవసరాలలోఉన్న వారితో పంచుకోలేక పోవడం తో ఆయన శిక్షించబడ్డాడు
మరణించిన తరువాత ధనవంతుని పరిస్థితి
ధనవంతుడు , అబ్రహామును తండ్రి! నా మీద కరుణ చూపించమని అడుగుతున్నప్పుడు ఇతను తన వాకిలి దగ్గర ఉన్న లాజరుకు ఎటువంటి కరుణ చూపించలేదు అని అర్ధం అవుతుంది. కనుక కరుణ పొందే అవకాశం కోల్పోతున్నాడు. యేసు ప్రభువు అనేక సార్లు మీరు ఏ కొలతతో కొలిచెదరో అదే కొలతతో మీకును కొలవబడును అని చెప్పారు, ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మరణించిన తరువాత ధనవంతుడు ఇంకా చేయడానికి ఏమిలేదు. ఎందుకంటే అతను బ్రతికి ఉన్నప్పుడే ఇతరులకు సహాయం చేసినట్లయితే, తాను ఇప్పుడు సహాయం పొందడానికి అవకాశం ఉండేది. కాని అతను అన్ని అవకాశలు కోల్పోయాడు.
మనం ఎలా జీవిస్తే దేవుని రాజ్యం పొందుతాము ?
పునీత లూకా గారు సువిశేషంలో అనేక మంది సంపన్నులును , వారు పొందిన బాధలను చూపుతూ వారు ఎందుకు పరలోకానికి దూరంగా ఉండిపోతున్నారో తెలియజేస్తూ, ఎలా ఉంటే , లేక జీవిస్తే వారు పరలోకంలో ఉంటారో తాను రాసిన అపోస్తులుల కార్యాలలో తెలియజేస్తున్నాడు. అపోస్తులుల కార్యాలలో మొదటి క్రైస్తవ సంఘంలోని ప్రజలు, వారికి ఉన్న దానిని ఇతరులతో, లేని వారితో పంచుకొని కలిసి జీవించడం. అపో కా 2-44 , “విశ్వసించిన వారందరు కలసి , సమిష్టిగా
జీవించుచు తమకు కలిగినదానిలో అందరు పాలుపంచుకొనుచుండిరి,” వారు చేసిన పనుల ద్వారా వారి మధ్య అవసరాలలో కొట్టుమిట్టాడేవారు తరిగిపోయారు. అపో. కా 4:34. “వారిలో ఏ ఒక్కనికి కొరతలేదు.” ధనవంతుడు, తినడానికి ఏమి లేక తన భోజన బల్ల కింద పడే ముక్కల కోసం కాచుకొని కూర్చొన్న వాని ఆకలి తీర్చడంలో విఫలం చెందాడు. కాని అపోస్తుల కార్యాలలో మనం అంతియోకియాలో ఉన్న సంఘం రాబోవు కరువును పసిగట్టి దాని కోసం వారు దయగుణంతో స్పందించారు. తరువాత ధనవంతుడు పేదలను, కుంటి వారిని తన నిత్యం చేసుకునే విందులకు పిలవడంలో విఫలం చెందాడు. కాని అపోస్తుల కార్యాలలో క్రీస్తు సంఘం ఎలా వారు అభాగ్యులకు ఎలా అతిధ్యయం ఇచ్చారో మనం తెలుసుకోవచ్చు. ఇంకా ధనవంతుడు తన వాకిలి వద్ద యాచిస్తున్న లాజరుకు కరుణ చూపించడంలో విఫలం అయ్యాడు. కాని అపోస్తుల కార్యాలలో మనకు అపోస్తులు కొంతమందిని కేవలం ఇతరులకు సహాయం చేయడం కోసమే నియమించడం జరిగింది. కొర్నెలియసు మొదలగువారు.
లూకా సువిశేషంలో మనం పేదవారికి దేవుని రాజ్యంలో ప్రవేశం త్వరగా దొరుకుతుంది అన్నట్లుగా చూస్తాం , అదే విధంగా ధనికులు పేదవారికి సహాయం చేస్తే వారికి కూడా అలానే దొరుకుతుంది ,జక్కయ్య దానికి ఉదాహరణ.ధనికుడు లాజరు ఉపమానం మనం మరణించిన తరువాత ఏమి పొందుతాము అనేది మనకు దేవుడు ఇచ్చిన అవకాశలు మరియు అనుగ్రహాల ద్వార ఇక్కడే మనం నిర్ణయించాలి అని తెలియజేస్తుంది.
సంపద విలువ
లూకా సువిశేషంలో సంపదను పేదవారికి ఉపయోగించక పోయినప్పడు అది చెడ్డది అన్నట్లుగా మనం చూస్తాము. ఈ సంపదను ఇతరులకు ఉన్నతికి వాడక పోయిన, ఇతరుల నిత్య అవసరాన్ని తీర్చడానికి వాడి నట్లయితే అది ధన వంతునికి గొప్ప వనరుగా మారి తనను దేవుని రాజ్యానికి ఆహ్వానిస్తుంది. పేదవారిని ఆదుకోవడం అనేది నీకు పరలోకంలో స్థానాన్ని పదిలం చేస్తుంది. ధర్మ శాస్త్రంలో , ప్రవక్తల ప్రభోదలలో ధనికులకు పేదవారిని ఆదుకునే బాధ్యత ఉంది. సంపదను దేవుని దీవెన వలె చూస్తుంది పాత నిబంధన. అబ్రహాము, సోలోమోను ,యొబు వీరు ధనవంతులు మరియు భక్తిపరులు , వీరి భక్తి మరియు విశ్వాసం వీరిని సంపన్నులను చేస్తుంది. కనుక సంపద అనేది చెడ్డది ఏమి కాదు. వారు భక్తి పరులు మరియు విశ్వాస పరులు కనుక వారు దాతృత్వం కలిగిన వారు కాగలిగారు. పేదరికం అనేది తీసివేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచించవలసినది , ఎవరు నాకు సంబంధం లేదు అని చెప్పలేం. దీనిని తీసివేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలి. కనుక పేదవారిని అదుకొనకపోవడం మనలను పరలోకంలో స్థానం లేకుండా చేస్తుంది. అంటే దీనిని తీసి వేయవలసిన బాధ్యత ఎంత ఉందో తెలుస్తుంది.
క్రైస్తవులకు ఈ ఉపమానం ఒక మేలుకొలుపు లాంటిది. ఈ ఉపమానంలో యేసు ప్రభువు, లోభితనముతో , అత్యాశతో ఉన్న పరిసయ్యులతో, సంపదలను సరిగా వాడుకోకపోతే వచ్చే అనర్ధలు గురించి, శిష్యులు ఎలా ఉండకూడదో చెప్పిన ఒక ఉపమానం. ఈ ఉపమానంలో మనం చూసేటువంటివి ప్రధానంగా సంపద , పేదరికం , జీవితాలు తారుమారవడం మరియు మోషే ధర్మ శాస్త్రం మరియు ప్రవక్తల ప్రభోదల విలువ. పేదలకు , ఆకలితో ఉన్నవారికి , శోకంలో ఉన్నవారికి యేసు ప్రభువు ఓదార్పు ఇవ్వడం మరియు వారికి దేవుని రాజ్యంలో స్థానం కల్పించడం గురించి మనం వింటువుంటాము. యేసు ప్రభువు లూకా 12:1 వ వచనం మరియు 13:21 వ వచనాలలో మానవ జీవితం సిరి సంపదల సమృద్దిలో లేదు అని చెబుతున్నారు. జక్కయ్య ధనవంతుడే తన ఆస్తిలో సగ భాగంను పేదలకు పంచుతున్నాడు. యేసు ప్రభువు ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటున్నారు.కనుక అలా జీవించడానికి ప్రయత్నిద్దాం.