26, ఫిబ్రవరి 2026, గురువారం

యోహను 16: 23-28

 యోహను 16: 23-28 

 సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడుగలేదు. అడుగుడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. "నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని. కాని , తండ్రిని గురించి దృష్టాంతములతొగాక , తేట తెల్లముగచెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును . నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను" అని పలికెను. 

"మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును".  యేసు ప్రభువు మీరు నా పేరిట ఏమి అడిగినను మీకు ఇచ్చును అని చెబుతున్నారు. ఎందుకు  మనం యేసు ప్రభువు పేరిట ప్రార్ధన చేస్తాము అంటే యేసు ప్రభువు మనకు ఈరోజు సువిశేషంలో చెబుతున్నారు. మీరు  తండ్రిని నా పేరిట ఏమి  అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తారు అని చెబుతున్నారు.  యేసు ప్రభువు తాను ఏ  అధ్బుతం చేసిన మొదట తండ్రికి ప్రార్దన చేసేవారు. ప్రార్దన అనేది తండ్రి దేవునితో మానవుడు ఒక గొప్ప  సంబంధం ఏర్పరుచుకునే సాధనం.  యేసు ప్రభువు ఈ లోకమునకు రాక మునుపు తన తండ్రితో తనకు ఉన్న బంధం, అలానే కొనసాగించినది ఈ ప్రార్దన అనే సాధనం ద్వారం. మనం కూడా యేసు ప్రభువు వలె తండ్రి తో బంధం ఏర్పరుచుకోవాలి. అది ఏర్పరుచుకోవాలంటే ప్రార్ధించాలి.  తండ్రితో యేసు ప్రభువుకు ఉన్న బంధం వల్ల ఆయన  ఏమి అడిగిన అది జరిగింది. మన జీవితంలో యేసు ప్రభువు వలె జీవిస్తే , మనం ఏమి అడిగిన అది జరుగుతుంది. మనం చేసే ప్రార్దన యేసు ప్రభువు పేరిట చేయడం అంటే ఆయనలా చేయడం, జీవించడం . 

"ఇంత వరకు నా పేరిట మీరు ఏమి అడుగలేదు" - ఎందుకు యేసు ప్రభువు మీరు ఇంత వరకు నా పేరిట ఏమి అడుగలేదు అని అంటున్నారు ? అంటే యేసు ప్రభువు శిష్యులుకు  ఇంత వరకు ఏమి అడిగే  అవసరం రాలేదు. శిష్యులకు తండ్రికి , కుమారునికి మధ్య ఉన్న ఐక్యత పూర్తిగా  తెలియదు. శిష్యులు ప్రభువుని ప్రార్దన నేర్పమని అడిగినప్పుడు ప్రభువు వారికి పరలోక ప్రార్దన నేర్పుతున్నారు. శిష్యులు ఈ సమయంలో తండ్రికి మరియు కుమారునికి మధ్య గల బంధం గురించి తెలుసుకుంటున్నారు. వారు ఇద్దరు ఎంతో  ఐక్యమై ఉన్నారు.   ఒక సారి మనకు తండ్రి మరియు కుమారుని మధ్య గల బంధం తెలిసినట్లయితే మనం  చేసే ప్రార్ధన ఎల్లప్పుడు ఆయన పేరు మీద చేస్తాము. ఎందుకంటే తండ్రికి కుమారుడు అంటే అంత ప్రేమ. మరియు కుమారునికి తండ్రి అంటే అంతే ప్రేమ. తండ్రి కోసం కుమారుడు  ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. 

 "మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును" ఇక్కడ మనం కుమారుడంటే తండ్రికి ఎంత ప్రేమో తెలియ జేస్తున్నారు. మనం ఆయన పేరిట ప్రార్దన చేసినప్పుడు , యేసు ప్రభువు మన కోసం తండ్రిని అడుగుతాను అని చెప్పటం లేదు. కాని కుమారుడంటే తండ్రికి ఇష్టం కనుక , కుమారున్నీ ప్రేమించిన వారిని తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు. మరియు వారికి కావలసినవి మొత్తం తండ్రి సమకురుస్తారు. ఇక్కడ యేసు ప్రభువును నమ్మడం, లేక విశ్వసించడం ముఖ్యం , ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన వారు యేసు ప్రభువును విశ్వసించలేదు.శిష్యులు కొన్ని సార్లు యేసు ప్రభువును విడనాడి ఉండవచ్చు కాని వారు ఆయన్ను ప్రేమించారు. ఆయనను తమ గురువుగా అభిమానించారు.  శిష్యులు చేసిన మంచి పని ఏమిటి అంటే ఆయనను విశ్వసించడం,ప్రేమించడం. మనము కూడా ఆయనను విశ్వసించమని, మరియు ప్రేమించమని, ఆయన శిష్యులు అవ్వమని   ఇది  ఒక ఆహ్వానం. 

"నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను"  యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఈ చివరి సందేశంలో తాను ఎక్కడ నుండి వచ్చినది, ఎక్కడకు వెళుతున్నది  అని తెలియచేస్తున్నారు. తన యొక్క మహిమాన్వత స్థానానికి మరల వెళుతున్నారు.  ఈలోకంలో తన యొక్క పనిని పూర్తి చేసుకున్నాడు. తాను వెళ్ళేముందు తన శిష్యులు ఏవిధంగా సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే ఏమి చేయాలో ప్రభువు చెబుతున్నారు. మన సంతోషం సంపూర్ణంగా ఉండాలంటే మనం యేసు ప్రభువు వలె జీవించాలి. యేసు ప్రభువు పేరిట ప్రార్ధించాలి. యేసు ప్రభువు వలె దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. యేసు ప్రభువును ప్రేమించాలి, మరియు ఆయనను విశ్వసించాలి. అప్పుడు మనం తండ్రి చేత ప్రేమించబడుతాం. తండ్రి చేత అన్నీ సమకూర్చబడుతాం. మరియు సంపూర్ణ సంతోషం పొందుతాం. 

ప్రార్ధన :  ప్రభువా! ఈలోకంలో మిమ్ములను  ప్రేమించక , విశ్వసించక నిజమైన సంతోషమునకు, మీ యొక్క ప్రేమకు, మీ అనుగ్రహాలకు  దూరంగా ఉన్నాము. అటువంటి సందర్భాలలో మమ్ములను క్షమించమని వేడుకుంటున్నాము. ఈలోకం వలె అనేక సార్లు మేము ప్రవర్తిస్తున్నాము. మీకు దూరంగా వెళుతున్నాము. మీరు ఇస్తాను అంటున్నా సంతోషం మాకు దయ చేయండి. ఆ సంతోషం పరిపూర్ణమగునట్లు చేయండి. అప్పడు మీకును తండ్రికిని గల సంబంధం తెలుసుకొనే విధంగా మాకు మీ ప్రేమను తెలియ చేయండి. ప్రభువా! తండ్రి మిమ్ములను ప్రేమించే వారిని ప్రేమిస్తారు అని తెలుపుచున్నారు. మా జీవితంలో ప్రభువా ! ఈ నిజమైన ప్రేమను తెలుసుకొనే భాగ్యం దయ చేయండి.  మేము మిమ్ములను ప్రేమించేలా, విశ్వసించేలా చేసి, తండ్రి ప్రేమను మేము అనుభవించే విధంగా మమ్ము అనుగ్రహించమని వెడుకొనుచున్నాము. ఆమెన్ 

యోహాను 16:29-33

 యోహాను 16:29-33 

అందుకు ఆయన శిష్యులు "ఇప్పుడు మీరు దృష్టాంతములతోకాక  స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు, ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇపుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవునినుండి బయలుదేరి  వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము" అనిరి. అపుడు యేసు "ఇపుడు మీరు నన్ను విశ్వసించు చున్నారా? ఇదిగో ! మీరు  నన్ను ఒంటరిగ వదలి, చెల్లాచెదరై, ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని, నేను ఒంటరిగా లేను. ఎలయన, తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని, దైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని" అని చెప్పెను. 

ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు ఆయన గురించి తెలుసుకున్నట్లుగా మాటలాడుతున్నారు. వారి పూర్తి విశ్వాసాన్ని వెల్లడిచేస్తున్నారు. ఇక్కడ వీరు ఏమి మాట్లాడుతున్నారు?  యేసు ప్రభువుకు మొత్తము తెలుసు అని అంటున్నారు. ఎలా వారు ఇది తెలుసుకోగలిగారు.  యేసు ప్రభువుకు  శిష్యుల  మనసులలో ఏమి ఉన్నదో  తెలుసు. అందుకే ఆయన వారు ఏదో ఆయనను అడగదలుచుకున్నారు అని ఆయనే వారితో ఆ మాటలను చెబుతున్నారు. 19 వ వచనంలో. ఇవన్నీ గ్రహించిన శిష్యులు ఆయనే శక్తి ఏమిటి, ఆయనకు ఎలా సమస్తము తెలుసు అని తెలుసుకున్నారు, అంతేకాక వారి మనసులలో ఉన్న భావాలు కూడా ప్రభువుకు తెలుసు అని గ్రహించారు. అందుకే ఆయన సర్వజ్ఞుడు అని వారు అంటున్నారు. మనం ఏమి అడుగకుండానే మన మనసులో ఉన్న భావం ఆయనకు ఏరుకనే. 

ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ? అని యేసు ప్రభువు అడుగుతూ ఎలా వారి విశ్వాసం పరీక్షకు గురి అవుతుందో తెలుపుచున్నారు. మనం దేవుని విశ్వసిస్తున్నాము మనం ఎటువంటి కష్టాలలో కూడా వెనుకడుగేయం అని అనుకుంటూ ఉంటాము. మనకు ఇప్పుడు ఆయన ఎవరో తెలుసు అనుకుంటాం. నిజానికి మనం చాలా బలహీనులం,  మన విశ్వాసాన్ని చూపించవలసిన సమయం వచ్చినప్పుడు లేక మనం ఏదైనా పరీక్షకు గురి అయినప్పుడు మన విశ్వాసం ఎంత గట్టిదో తెలుస్తుంది. శిష్యులు యేసు ప్రభువు సర్వజ్ఞుడు అని ఆయనకు అంతా తెలుసని, ఆయన అన్నియు చేయగలడని , సర్వశక్తివంతుడని తెలిసి కూడా ఆయనను వదలి పెట్టి వెళ్లిపోయారు. ఎందుకు ఇలా చేశారు అంటే వారికి నమ్మకం లేక కాదు, వారి జీవితాన్ని పూర్తిగా అర్పించడానకి వారు సిద్దపడలేదు, ఇహపరమైన జీవితంమీద మాత్రమే ఆశ కలిగి ఉండటం వలన. 

నేను ఒంటరిగా లేను 

యేసు ప్రభువు నేను ఒంటరిగా లేను అని అంటున్నారు. కారణం కూడా ఆయనే చెబుతున్నారు. ఎందుకు శిష్యులు అందరు వదలిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ఒంటరిగా ఉండరు అంటే తండ్రి ఆయనతో ఉంటారు. తండ్రి దేవునితో ఆయన ఎప్పుడు కలిసి ఉంటారు. వీరి సంబంధం విడదీయలేనిది. తండ్రి కోసం కుమారుడు ఏమి చేయడానకి కూడా వెనుకాడడు, అదే విధముగా తండ్రి కుమారుడు అడిగిన ప్రతిదీ కూడా ఇస్తాడు. వీరి బంధం శిష్యులు మరియు యేసు ప్రభువుల బంధం లాంటిది కాదు, కాని శిష్యుల యేసు ప్రభువు బంధం కూడా తండ్రికి మరియు యేసు ప్రభువుకు మధ్య ఉన్న బంధంగా దృఢంగా ఉండాలి. యేసు ప్రభువు శిష్యుల గురించి ప్రార్ధించే సమయంలో మరియు ఈ అధ్యాయంలో కూడా యేసు ప్రభువునితో మన బంధం దృఢంగా ఉండాలని , నేను తండ్రి యందును తండ్రి నాయందు ఉన్నట్లు మీరు నాయందు ఉండాలి అని ప్రభువు అడుగుచున్నారు. అప్పుడు మనం కూడా మిగుల ఫలవంతం అవుతాము. 

"మీరు కష్టలపాలగుదురు కాని ధైర్యం వహింపుడు. నేను లోకమును జయించితిని." యేసు ప్రభువు తన శిష్యులకు తమ జీవితములో ఎటువంటి కష్టం రాదు అని కాని వారి జీవితం ఈలోకమమున సంతోషకారముగానే ఉంటుంది అని కాని చెప్పలేదు. వీటి అన్ని పొంది కూడా ఆయన ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకాన్ని జయించుటకు మనం వీటితోటి పోరాడాలి, అలా కాకుండా ఈ లోకంతో మనం లాలూచీ పడినట్లయితే మనం మనల్ని కోల్పోతాము, మరియు ఈలోకానికి బానిసలుగా మిగిలిపోతాము. అలా కాకుండా యేసు ప్రభువు వలె జీవించినచో మనం ఈ లోకాన్ని జయించవచ్చు. తన శిష్యులు ఎప్పుడుకూడా అధైర్యంగా ఉండకూడదని , అన్ని కష్టాలు ఉన్న కూడా వారు శాంతిని పొందుటకు యేసు ప్రభువు వారికి భరోసా ఇస్తున్నాడు. ఎప్పుడ అయితే శిష్యులు కూడా యేసు ప్రభువు వలె జీవిస్తారో వారి జీవితాలలో కూడా అందరు వదలి వెళ్ళిన వారు క్రుంగిపోరు, దేవుడు వారికి తోడుగా ఉంటారు. 

ప్రార్దన : ప్రభువా మీరు సర్వజ్ఞులు అని తెలుసుకున్న శిష్యులు మిమ్ములను ఏమి అడుగకుండానే, మీరు వారి మనసులలో భావాలు తెలుసుకున్నరాని గ్రహించి మీ గొప్పతనం గురించి వెల్లడి చేస్తున్నారు. మేము మీ గురించి పూర్తిగా తెలిసికూడా అనేక సమయాలలో శిష్యుల వలె మాకు వచ్చే భాద్యలు, కష్టాలు చూచి మిమ్ములను వదలి వెళ్ళి పోతున్నాము, అటువంటి పరిస్తితులలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను వదలిపెట్టకుండా , ఎల్లప్పుడు మిమ్ము అంతిపెట్టుకొని జీవించేలా చేయమని వేడుకుంటున్నాము. మిమ్ములను అందరు వదలి పెట్టిన తండ్రి మీకు ఎలా తోడుగా ఉన్నారో మీరు మాకు  ఆవిధముగానే తోడుగా ఉండండి. మా జీవితాలలో కూడా అందరు మమ్ములను విడిచిపెట్టె సమయాలలో మీ సాన్నిధ్యం మేము పొందుతూ నిజమైన మీ ఆధారణకు మమ్ములను అర్హులను చేయండి. మీ శాంతి మాకు ఎల్లవేళలా ఉండేలా మమ్ము దీవించి, ఈ మీ వలె మాకు  ఈ లోకం మీద విజయాన్ని దయచేయండి. ఆమెన్  

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

 తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని...