26, ఫిబ్రవరి 2026, గురువారం

యోహాను 3:7-15

 యోహాను 3:7-15 

నీవు మరల జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అట్లే ఉండును అనెను. ఇది ఎట్లు సాధ్యమగును? అని నికోదేము అడిగెను. అందుకు యేసు నీవు యిస్రాయేలు బోధకుడవై యుండి దీనినేరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యము మీరంగీకరింపరని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు  చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్త బడవలెను. 

చింతన  : యేసు ప్రభువు నికోదెముతో మరల జన్మించాలి అని చెప్పినందుకు ఆశ్చర్య పడవద్దు అని చెబుతున్నాడు.  ఎందుకంటే నికోదెము తాను ఎలా తల్లి గర్భంలోనికి వెళ్లగలనా అని ఆలోచిస్తున్నాడు. కాని యేసు ప్రభువు చెప్పినది ఎలా ఆత్మ వలన ఎలా జన్మించాలి అని చెబుతున్నారు. ఆత్మ వలన జన్మించడం అంటే జ్ఞానస్నానం వలన జన్మించడం. ఒక వ్యక్తి మారుమనసు పొంది, తన పాప జీవితము వదలినప్పుడు తాను పవిత్రంగా ఉండుటకు సిద్దపడుతున్నాడు.  అప్పుడు వారికి ఆత్మ ఇవ్వబడుతుంది. జ్ఞాన స్నానం మనలను పాపములనుండి శుద్ది చేస్తుంది. పవిత్రాత్మను మనకు ఇస్తుంది. పాపముల నుండి మనం శుద్ది పొందుట వలన, మనం నూతన సృష్టి అవుతున్నాము. మరియు పవిత్రాత్మను పొంది దేవుని బిడ్డలము అవుతున్నాము.  వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి మార్పు ఇతరులకు తెలుస్తుంది కాని ఎందుకు, ఎలా అని తెలియదు. ఆత్మ వలన జన్మించిన వారు అందరూ అలానే ఉంటారు అని ప్రభువు చెబుతున్నారు. 

యేసు ప్రభువు నికోదెమును అవిశ్వాసం వదలి వేయమని చెబుతున్నాడు. యేసు ప్రభువును విశ్వసించుట వలన మాత్రమే మనం రక్షించ బడతాము మరియు ఇవన్నియు సాధ్యం అవుతాయి, కాని యూదులు యేసు ప్రభువును విశ్వసించుట లేదు, యేసు ప్రభువును విశ్వసించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనలో మాత్రమే మనం రక్షించ బడుతాము ఆయన లేకపోతే మనకు రక్షణ ఉండదు. ఆయన మన అందరికోసం శిలువ మరణం అనుభవిస్తున్నారు. ఆయన శిలువ మీద ఎత్తబడుతున్నారు. ఆయనను చూసి ఎలా అయితే పాపం ద్వారా శిక్షను అనుభవిస్తున్న యిస్రాయేలు ప్రజలు మోషే ఎత్తిన కంచు సర్పమును చూసి విష సర్ప కాటు నుండి అంటే మరణము నుండి తప్పించు కుంటున్నారో అలానే కేవలము భౌతిక జీవితమునే కాక నిత్య జీవితమును యేసు ప్రభువును విశ్వసించుట వలన పొందుతారు అని చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువును విశ్వసించడం అంత ముఖ్యం, యోహాను సువిశేషంలో అనేక సార్లు ఆయనను విశ్వసించే వారికి ఆయన నిత్యజీవం ఇస్తారు అని మనం వింటాము. 

ఎందుకు యూదులు ఆయనను విశ్వసించడం లేదు? యేసు ప్రభువు  నా సాక్ష్యం మీరు అంగీకరింపరు అని  చెబుతున్నారు, వీటికి కారణం మనం చూసినట్లయితే ప్రజలు చీకటినే ప్రేమించారు, యేసు ప్రభువు వెలుగు వలె ఈ లోకమునకు వచ్చిన ఆయన వెలుగులో వారు ఉండటానికి భయపడ్డారు ఎందుకంటే వెలుగులోనికి వచ్చినట్లయితే వారి పాప జీవితాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడ్డారు, వారు చీకటినే ప్రేమించారు, వెలుగును ద్వేషించారు, నికోదెము కూడా చీకటిలోనే యేసు ప్రభువును కలవడానికి వచ్చారు, కాని యేసు ప్రభువు వద్దకు రావడం వలన చీకటి నుండి వెలుగు వద్దకు వచ్చినట్లు అయ్యింది. రక్షణకు మార్గం సిద్దపరుచుకున్నాడు. యేసు ప్రభువు వద్దకు వచ్చే ప్రతివారు అలానే వెలుగు దగ్గరకు వస్తున్నారు. దీని ద్వారా మనకు వారికి యేసు ప్రభువు చెప్పే మాటలు లేక చేసే పనుల మీద అంత ఇష్టం లేదు కారణం ఆయన వెలుగై ఉన్నాడు వారు చీకటిలో ఉన్నారు, ఆయన సాన్నిధ్యం వారికి ఒక రకమైన భయం కలిగిస్తుంది. వారి జీవితాలు మార్చుకోవడానికి వారు సిద్దంగా లేరు అనే విషయము అర్ధం అవుతుంది. పాపములోనే ఆనందం పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారు,  కాని ఇది వారికి వారిని నాశనం చేస్తుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు.  పాపంలోనే మనం ఉన్నప్పుడు మనం ఒక రకమైన ఆజ్ఞానానికి లోనవుతాము, అందుకే పాపములోనే వారు ఆనందం వెదుకుతున్నారు. కాని యేసు ప్రభువు మనకు కనపడే విధంగా మనం ఆయనను చూడటానికి ఇష్టపడక పోయిన శిలువ మీద ఎత్తబడ్డాడు. మనము ఆయనను చూసేలా చేస్తున్నాడు. 

ప్రార్దన : ప్రభువా , మీరు నికోదెముతో ఆయన మరల జన్మించాలి అని చెప్పి, తన జీవితంలో రక్షణ పొందుటకు తాను మారు మనసు పొందాలని, జ్ఞానస్నానం పొందాలని, తాను పవిత్రాత్మను పొందాలని తెలియపరుస్తున్నారు. నేను కూడా ప్రభువా! రక్షణ పొందుటకు, మారు మనసు పొంది, పవిత్రంగా ఉండే విధంగా ఆశీర్వదించండి. నేను జ్ఞానస్నానం పొందిన సమయంలో మీ పవిత్ర ఆత్మతో , పవిత్రంగా ఉన్నానో అదేవిధంగా పవిత్రంగా ఉండేలా నన్ను దీవించండి. మిమ్ములను నా జీవితంలోనికి ఆహ్వానించి, మిమ్ములను అంగీకరించి మీ వెలుగులో నడిచేలా నన్ను దీవించండి. నా పాపములో నేను ఆనందిచే స్థితి నుండి మీ అజ్ఞలను పాటించుటలో ఆనందం పొందేలా దీవించండి. ఎప్పుడు మీ యందు విశ్వాసం వుంచి మీరు వాగ్దానం చేసే ఆ నిత్య జీవం పొందేలా నన్ను ఆశీర్వదించండి. మిమ్ములను చూస్తూ, మీకు సాక్షం ఇచ్చేలా చేయండి. ఆమెన్ 


యోహాను 3: 31-36

 యోహాను 3: 31-36 

పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు.  భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు అందరి కంటే  అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు  అందరి కంటే అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి సాక్ష్యము నిచ్చును. కాని , ఆయన సాక్ష్యమును ఎవరును అంగీకరింపరు. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును. ఎలన, దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్దిగ ఒసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించు వాడు నిత్య జీవము పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలచి ఉండును. 

ధ్యానము: ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువు గురించి అనేక గొప్ప విషయాలు మనం చూస్తున్నాము. ఆయన పై నుండి వచ్చిన వాడు అని, అందరికంటే అధికుడు అని , ఆయన తన తండ్రి వద్ద చూచిన , వినిన విషయములను మాత్రమే మాటలాడుతాడు అని , ఆయన తాను చూసిన, వినిన విషయాలకు సాక్ష్యం ఇస్తున్నాడు అని, ఆయన సాక్ష్యం అంగీకరించిన వారు దేవుడు సత్య సంధుడు అని నిరూపిస్తారు అని, ఆయనకు ఆత్మ సమృద్దిగా ఇవ్వబడింది అని, తండ్రి ఆయనను ప్రేమిస్తున్నారు అని, సమస్తము మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది అని , ఆయనను విశ్వసించు వారికి నిత్య జీవితం ఇవ్వబడుతుంది అని ఆయనను విశ్వాసించని వాని మీద దేవుని కోపం వుంటుంది అని ఈ సువిశేష భాగం తెలియచేస్తుంది. 

 "పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు. భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును." ఇక్కడ యేసు ప్రభువు తను ఎక్కడ నుండి వచ్చినది మాటలాడుతున్నారు. అందరు ఆయన ఈలోక పుట్టు పూర్వోత్తరాల గురించి మాటలాడుతున్నారు. కాని ఆయన నిజముగా తండ్రి దేవుని నుండి వస్తున్న విషయాన్ని మరచిపోతున్నారు. ఆయన పరలోకము నుండి వస్తున్నారు. ఆయన తండ్రి నుండి వచ్చాడు కనుక ఆయన తన తండ్రి వద్ద ఉన్న విషయములను గురించి మాటలాడుతున్నారు. తన తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నవి అని చెబుతున్నారు, మనము ఆ లోకానికి చెందిన వారిమి అని అక్కడ మనకు నివాసం ఏర్పాటు చేస్తాను అని చెబుతున్నాడు.  ఆయన పై నుండి వచ్చాడు, ఆయన అందరికంటే అధికుడు. ఆయన మన వలే కేవలం ఈలోకంలో పుట్టుట ద్వారా తన జీవితం మొదలు కావడం లేదు. ఆయన ఆది నుండి తన తండ్రితో ఉన్నాడు. కాని మనం ఈ లోకానికి చెందిన వారము. యేసు ప్రభువు అలా కాదు. ఆయన ఆది నుండి పరలోకానికి చెందినవాడు. 

యేసు ప్రభువు ఇచ్చే సాక్ష్యం చాలా ముఖ్యం. ఆయన చూసిన వానికి, వినిన వానికి  ఆయన సాక్షం ఇస్తున్నాడు. తాను తన ఇష్ట ప్రకారం లేక సొంతగా ఏమి చెప్పడం లేదు ప్రతిది తండ్రి నుండి చూసింది లేక వినినది మాత్రమే.  ఆయన చెప్పే ప్రతి దానిని మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే తండ్రి నుండి వచ్చినది. ఆయన తండ్రి చేత పంపబడిన వాడు కనుక ఆయన తండ్రి యొక్క మాటలను చెబుతున్నాడు. ఆయన మాటలు కూడా జీవం కలిగి ఉన్నాయి.  ఆయన ఈ లోకానికి వచ్చినది,  ఆయన ద్వారా ఈ లోకం రక్షించబడాలి అని. ఆయన మాటల ద్వారా తన పనుల ద్వారా ఆ పనిని చేస్తున్నాడు. ఆయన పవిత్రాత్మ కలిగి వున్నాడు. తండ్రి తన కుమారునికి పవిత్రాత్మను సమృద్దిగా ఇచ్చారు.  ఆయనను విశ్వసించిన వారికి ఆయన ఆ పవిత్రాత్మను ఇస్తాడు, పవిత్రాత్మ వారిని నడిపిస్తుంది.  యేసు ప్రభువును తండ్రి ప్రేమిస్తున్నారు. యేసు ప్రభువుని తండ్రి ఎంతలా ప్రేమిస్తున్నారు అంటే ఈ లోకం మీద, సర్వ అధికారం ఆయనకు ఇచ్చారు. యేసు ప్రభువుని సాక్ష్యంను అంగీకరించిన వారు దేవుడు సత్యసంధుడు అని నిరూపిస్తారు. 

ప్రార్ధన : ప్రభువా!  మీరు ఎవరు అని ఎంత గొప్ప వారు అని ఈ సువిశేష భాగం ద్వారా తెలుసుకుంటున్నాము. మీరు ఆది నుండి తండ్రితో ఉన్నారు. తండ్రి గురించి ఆయన ప్రేమ గురించి మీ ద్వారా మాత్రమే మేము తెలుసుకుంటున్నాము. కాని కొన్ని సార్లు మీరు మాకు చూపించిన తండ్రి ప్రేమను తెలుసుకోలేక పోతున్నాము. ఎంతగా తండ్రి మిమ్ములను ప్రేమిస్తున్నారో మేము వింటున్నాము అంతే కాదు తండ్రి మమ్ములను కూడా అలానే ప్రేమిస్తున్నారు అని మరచిపోతున్నాము, అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. ప్రభువా ! మీకు సమస్తము మీద అధికారము ఇవ్వబడినది, నా మీద, జీవితం మీద కూడా మీకు పూర్తిగా అధికారం ఇవ్వబడింది, మీ మాటలను విశ్వసించే మంచి విశ్వసిగా నన్ను మార్చండి. నేను మీరు సత్య వాంతులు అని నిరూపించే మీ శిష్యునిగా నన్ను మార్చండి. మీరు ఎలా తండ్రిని ప్రేమిస్తున్నారో, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎంత కష్టపడ్డారో, నేను కూడా మీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన అనుగ్రహాలు ఇవ్వండి, తద్వార , మీరు నాకు చూపించిన ప్రేమకు నాకు మీ మీద ఉన్న ప్రేమను వ్యక్త పరిచేలా నాకు సహాయం చేయండి. ప్రభువా ! తండ్రి మీకు సమృద్దిగా పవిత్రాత్మను ఇచ్చిన విధంగా నాకు కూడా ఆత్మను ఇవ్వండి ,  ఆత్మ నన్ను నడిపేలా దీవించండి.  ప్రభువా నేను ఎల్లప్పుడూ  మిమ్ములను విశ్వసిస్తూ, మీరు వాగ్ధానం చేసే నిత్య జీవం నేను పొందేలా నన్ను ఆశీర్వాదించండి. ఆమెన్ 


లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...