18, ఏప్రిల్ 2021, ఆదివారం

పాస్కాకాల మూడవ ఆదివారము

 పాస్కాకాల మూడవ ఆదివారము

అ.కా. 3: 13-15, 17-19

1 యోహాను 2: 1-5

లూకా 24: 35-48 

మీకు శాంతి కలుగును గాక

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి మూడు పఠనములు హృదయపరివర్తన, పాపక్షమాపణ కలిగి పునరుత్తాన క్రీస్తు అనుగ్రహించే శాంతిని  స్వీకరించి, ఈ లోకములో మన జీవిత విధానము ద్వారా శాంతిని స్థాపించి దేవునికి సాక్షులుగా నిలువ ఆహ్వానిస్తున్నాయి. వీటిని మనము మూడు వంశముల రూపేణా ధ్యానిస్తూ అర్ధము చేసుకుందాము.

 1. హృదయపరివర్తన, పాపక్షమాపణ

2. అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట

3. పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట

 1. హృదయపరివర్తన, పాపక్షమాపణ:

ఈనాటి పఠనాలలో హృదయపరివర్తన, పాపక్షమాపణను ప్రస్తావించుట చూస్తున్నాము. యేసుప్రభువు తన ప్రసంగాన్ని ప్రారంభించింది హృదయపరివర్తన అను అంశము మీదనే (మత్త 4:17) మరియు తన చివరి ప్రసంగము ముగించినది కూడా హృదయపరివర్తన అను అంశము మీదనే (లూకా 24:47). ప్రభువు ఈ లోకానికి రావడానికి కూడా కారణము హృదయపరివర్తనను కలిగించుటకేనని లూకా 5:32 మనము చూస్తున్నాము. పునీత బాప్తిస్మ యోహాను గారు కూడా హృదయ పరివర్తన యొక్క అవసరతను గురించి పలికారు(మత్త 3:2). పునీత పేతురు గారు యూదులకు చెప్పిన తన మొదటి ప్రసంగము, అన్యులతో పలికిన తన చివరి ప్రసంగము కూడా, ఆఖరికి తన చివరి ప్రసంగము కూడా హృదయపరివర్తన అను అంశము మీదనే. పునీత పౌలు గారు కూడా హృదయపరివర్తన అను అంశము మీద ప్రసంగించారు. ఎందుకు హృదయపరివర్తన ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలనే ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన మొట్టమొదటి పని: హృదయపరివర్తన (లూకా 15: 11-24). అసలు ఈ హృదయపరివర్తన అంటే ఏమిటి? హృదయపరివర్తన అంటే ఒక ప్రయాణము. ఎక్కడి నుండి ఎక్కడకు ఈ ప్రయాణము అంటే పాపపు జీవితము నుండి దేవుని యొద్దకు ప్రయాణము. క్రీస్తు పునరుత్తాన మహోత్సవము ముగిసిన తరువాత కూడా తల్లి తిరుసభ ఎందుకు ఈ పఠనాల ద్వారా మనలను హృదయపరివర్తన, పాపక్షమాపణ గురించి ధ్యానింపజేస్తుంది అంటే హృదయపరివర్తన కలిగి మన పాప జీవితానికి క్రీస్తుతో పాటు మరణించి మరల క్రీస్తుతో పాటు పునరుత్తానమైనప్పుడు మాత్రమే మనము ఒక నూతన వ్యక్తిగా జన్మింపగలుగుతాము, పునరుత్తానుడైన క్రీస్తు శక్తిని అనుభవింపగలుగుతాము.

2 . అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట:

శిష్యులందరు అవిశ్వాసముతో నిండియున్నారు. క్రీస్తు ప్రభువు మనుష్యకుమారుడు శ్రమలననుభవించి, మరణించి మూడవనాడు పునరుత్తానమవుతాడు అని పలు మార్లు వారితో చెప్పినను వారు దానిని గ్రహించలేకపోయారు. అందుకే  క్రీస్తు ప్రభువు పునరుత్తానాన్ని గ్రహించలేకపోయారు. చివరికి స్వయానా పునరుత్తానుడైన క్రీస్తే వారి ముందు నిలువబడినను గుర్తించలేకపోయారు. ఇదే సంఘటనను ఈనాడు మనము సువిశేష పఠనములో చూస్తున్నాము. తన శిష్యులకు ప్రభువు దర్శనమిస్తున్నారు. ఇది పునరుత్తాన క్రీస్తు మూడవ దర్శనము.

ఈ మూడవ దర్శనములో శిష్యులు భయభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును ఒక భూతమును చూచుచున్నట్లు భావించారు (లూకా 24:37). అవిశ్వాసముతో నిండిన వారి హృదయాలు కలవరపడుచున్నవి. వారి మనస్సులు సందేహముతో నిండియున్నవి (లూకా 24:38). అప్పుడు క్రీస్తు తన చేతులను కాళ్ళను చూపుతూ వారిలో అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని నింపారు. వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును విశ్వసించిరి (లూకా 24: 39-41). అవిశ్వాసము అనే మహమ్మారి మనలను కూడా పరిపాలిస్తూ దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తుంది. విశ్వాసము క్రైస్తవ జీవితానికి పునాది. ఈరోజు మనము విశ్వాసముతో నింపబడివుండాలి. విశ్వాసము అనేది వినుట వలన కలుగుతుంది. క్రీస్తును గూర్చిన వాక్కు వినుట వలన కలుగుతుంది (రోమా 10:17). దేవుని వాక్కు విందాం, క్రీస్తును గూర్చిన సత్యాన్ని తెలుసుకుందాము. అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా ఉంటూ మన జీవితాల్లో పునరుత్తానాన్ని విశ్వసించుదాం. పునరుత్తాన క్రీస్తును గుర్తించుదాం. 

3 పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట:

క్రీస్తు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ మీకు శాంతి కలుగునుగాక అనెను.(లూకా 24:36) ఎందుకు శాంతి? వారు అనుసరించిన గురువు మరణించాడు. కావున వారి జీవితాలలో వారు ఆశను కోల్పోయారు. వారి జీవితాలు ఒక గమ్యము లేని, లక్ష్యము లేని జీవితాలుగా మారిపోయాయి. వారి జీవితాలలో శాంతి అనేది ఒక పదముగానే మిగిలిపోతుంది, ఒక అనుభవము కాలేదనుకున్నారు. క్రీస్తు అనే ఒక గురువు కోసము అన్నిటిని విడిచిపెట్టాము కానీ, క్రీస్తు, తన మరణము తర్వాత మమ్ములను విడిపెట్టాడు అని వాపోయారు. కానీ క్రీస్తు మాత్రము మనలను అనాధలుగా విడిచిపెట్టేటటువంటి ఒక వ్యక్తి కాదు. మన నమ్మకాలను వమ్ము చేసేటటువంటి ఒక గురువు కాదు. మన ఆశలను నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు. కానీ తన వాగ్దానాలను నిలబెట్టుకున్నటువంటి సత్యస్వరూపుడు. తాను చెప్పిన విధముగా మరణాన్ని గెలిచి మూడవనాడు పునరుత్తానమై తాను క్రీస్తునని నిరూపించుకున్నారు. చిన్నాభిన్నమైన తన శిష్యులకు కనిపించి మీకు శాంతి కలుగునుగాక అంటూ ఆశను నింపుతూ అభయమిస్తున్నారు. ఈ శాంతి మనము ఒకనాడు అవిధేయతతో పోగొట్టుకున్న శాంతి(ఆది 3) కానీ క్రీస్తు ప్రభువు తన మరణ, పునరుత్తానముల ద్వారా ఈ శాంతిని నెలకొల్పారు. ఇదే శాంతిని తన శిష్యులకు ఒసగుతున్నారు. ఈరోజు నీవు నేను ఈ శాంతిని మన జీవిత విధానము ద్వారా స్థాపించాలి. మనము ధ్యానించిన విధముగా పునరుత్తానమునకు రెండు మార్గములు ఉన్నవి. (i)హృదయపరివర్తన, (ii)పాపక్షమాపణ. కాబట్టి హృదయపరివర్తన చెందుదాము. పాప ప్రక్షాళన గావించబడుదాం. మన అవిశ్వాసాన్ని విశ్వాసముగా మలచుకుందాము. అనేక కారణాలతో చిన్నాభిన్నమైన మన జీవితాలలో శాంతి ఒసగమని పునరుత్తాన క్రీస్తును ప్రార్ధిద్దాము. పునరుత్తాన క్రీస్తు ఒసగే శాంతిని స్వీకరించుదాము. ఆ శాంతిని స్థాపిద్దాము.  ఆమెన్

Br. sunil inturi

10, ఏప్రిల్ 2021, శనివారం

పాస్కాకాల రెండవ ఆదివారము

 పాస్కాకాల రెండవ ఆదివారము

(1) అపో. కా 4: 32-35, (2) 1 యోహాను 5: 1-6,  యోహాను 20: 19-31

క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము పాస్కాకాల రెండవ ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా తల్లి శ్రీసభ మనకు ఉత్తాన క్రీస్తు యొక్క ప్రతక్ష్యరూపము గురించి తెలియజేస్తుంది. చనిపోయిన వారిలో నుండి ఉత్తానము అయిన యేసు, తన శిష్యులకు కనిపించారు. యేసు చనిపోయిన నాటి నుండి 40 రోజుల పాటు తాను స్వయముగా వారికి కనిపించారు. తాను సజీవుడనని వారికి చాలా విధములుగా తెలియజేసారు. యేసు శిష్యులకు కనిపించినది తాను ఎప్పుడూ జీవిస్తున్నాడని శిష్యులకు నిరూపించడానికే మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, అనాధలుగా మనలను విడిచిపెట్టడని తెలియజేయుటకును, శక్తిని ఇచ్చుటకు కూడాను. ఆ రోజులలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అనే విశ్వాసము ఉండేదని యెషయా ప్రవక్త గ్రంథములో ఇమ్మానుయేలు (యెషయా 7:14) అను వాక్యంలో చూస్తున్నాము. మనుష్య జాతితో చేసిన వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రజలతో యుగాంతము వరకు వశించునని వారి నమ్మిక. ఆ నమ్మకము యేసు ప్రభువు ఉత్తానములో పూర్తవుతుంది. ప్రభువు ఇప్పుడు తన ప్రజలతో జీవిస్తున్నాడు. దర్శన గ్రంథములో మనము చూస్తున్నాము; సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతో నివసించును. వారే ఆయనకు ఆలయము. వారే అయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును (దర్శన 21:3).

ఈ నాటి సువిశేషములో మనము గమనించినట్లయితే పునరుత్తానము తర్వాత తండ్రి మహిమలో చేరిన క్రీస్తు తన శిష్యులను మర్చిపోలేదు. ఆ రోజు ఆదివారము తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు(యోహాను). క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా వాగ్దానము నెరవేర్చే దేవుడు తన శిష్యుల వద్దకు వచ్చారు. అయన ఎప్పుడు వారిని వదిలిపెట్టలేదు అని ఈ దర్శనాలు సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభువు యొక్క దర్శనాల ప్రత్యేకత ఏమిటంటే వాటిన్నంటిలో ఆయనే ముందుటారు. శిష్యుల యొక్క లోతైన విశ్వాస ఫలముగాని, వారి దృఢ నమ్మకము గాని, నిరీక్షణాల ద్వారా గాని కాదు క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చేది. ఆయన తనకు తానుగా వారి యొద్దకు వస్తున్నారు.

 

ఆయన బలపరిచితే తప్ప మనకు ఏమి అర్ధం కాదు. ఆయన క్షమియించిన మాగ్దలా మరియమ్మ మరియు ఎమ్మావు గ్రామమునకు ప్రయాణము చేసిన ఇద్దరు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన వారితో చెప్పినప్పుడే ఆయనను గుర్తించగలిగారు. శిష్యుల ఎన్నిక సమయములో ప్రభువు పలుకుతున్నారు మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను(యోహాను 15:16). ఈరోజు కూడా ఆయన మన మధ్యకు వస్తున్నారు. తన దర్శనాల ద్వారా తన స్నేహ సంబంధమును మరల మనయందు కలిగిస్తున్నారు. ఆయన దర్శనాలకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఎవరు ముందుగా ఊహింపశక్యము కానిది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవరు ఊహించలేదు. ఆయన రాకడ గురించి తెలుసుకుంటే ఒక విషయము అర్థమగుచున్నది. తన శిష్యుల అవసరతలలో పరుగెత్తుకు వచ్చారు క్రీస్తు ప్రభువు. కన్నీరు కార్చిన మాగ్దలా మరియమ్మను ఓదార్చుటకు వచ్చారు. ఎమ్మావు మార్గములో శిష్యుల హృదయాలను ప్రజ్వలింపచేయుటకు వచ్చారు. రాత్రంతయు శ్రమపడి చిన్న చేప కూడా దొరకని శిష్యులకు సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వారి యొద్దకు వచ్చారు. అందుకే ఉత్తాన ప్రభువు దర్శనాలు మనకు ఇచ్చే సందేశమేమిటంటే, మన అవసరతలలో కూడా ఆయన మన సమీపముననే ఉంటారు.

పునరుత్తానము అయిన ప్రభువు అందరికి దర్శనము ఇవ్వలేదు. ఈ భాగ్యము తన స్నేహితులకు, శిష్యులకు మాత్రమే దొరికింది. క్రీస్తు నాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు ఈ విషయాన్ని చాల స్పష్టముగా వివరిస్తున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలోనుండి లేపి మూడవ నాడు మరల మాకు కనబడునట్లు చేసెను, దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు(అపో కా 10: 40-41) పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఉత్తానమైన ప్రభువు మొదట సారిగా దర్శనమిచ్చింది తనను ఎక్కువగా ప్రేమించినవారికి, వెదకినవారికి మాత్రమే. ప్రభువు యొక్క దర్శన భాగ్యము పొందాలంటే సహృదయ సంభందం కలిగిఉండాలని ప్రభువును నేర్పిస్తున్నారు. తనను వెదికే వారికి ఈరోజుకు కూడా ప్రభువు తన దర్శనాలను ఇస్తున్నారని మనము వింటున్నాము. ఆయన యొక్క దర్శనాలు, ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని స్ఫూరింపచేస్తున్నాయి. ఉత్తాన ప్రభువు మనతో ఉన్నారని మనము గుర్తించలేకపోతున్నాము. ఈనాటి సువిశేషములో మనము గమనించినట్లయితే యూదుల వలన భయము నిమిత్తము గదిలో చేరి తలుపులు వేసుకున్న శిష్యులకు దర్శనమిచ్చినట్లు మనము చూస్తున్నాము. అయితే ఆ శిష్యులు మనలో కొందరి వలె బయటి నుండి అద్భుతముగా దేవుడు లోపలికి వచ్చాడని ఆలోచించారు. కానీ అది కాదు అక్కడ జరిగినది. వారితో పాటు ఆ గదిలో ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత కూడా ఆయన వారితోనే ఉన్నారు. ఆయన తనకు తానుగ బయలుపరచకముందు కూడా ఆయన వారితో ఉన్నారని వారికి తెలియజేయుటకు ఆయన 40 రోజులు వారి ఎదుటకు వచ్చి ప్రత్యక్షమవడము, నిష్క్రమించడము జరిగింది. ఈ 40 రోజుల అనుభవాలను బట్టి ఆయన ఎల్లపుడు మనతోనే ఉంటున్నాడని మనకు బోధపడుతుంది.

 

క్రీస్తు ప్రభువు ఉత్తానమైనప్పుడు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుచేతనంటే, బహుశా వారి వారి నిరాశ నిస్పృహలకు మరియు భయాందోళనలకు బందీలై క్రీస్తు ఉత్తాన పరామరహస్యమును, సత్యమును మర్చిపోయారు. ఆ స్థితిలో ఉన్న శిష్యులకు ప్రభువు శాంతి సందేశాన్ని ఇస్తున్నారు. ఉత్తాన క్రీస్తు ఒసగుచున్న శాంతి సమాధానాలు ఈ లోకము ఇచ్చే శాంతి సమాధానాలు కావు. ఆయన మనలో ఉండి మనకు ఒసగేవి ఆంతరంగిక శాంతి సమాధానాలు. క్రీస్తు ప్రభవు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న సమయములో వారి ఆలోచనలను తప్పు పట్టలేదు. తనను ఎరుగనని బొంకిన పేతురును, విశ్వసించని తోమాసును విడిచిపెట్టలేదు. కానీ వారికి తన ప్రేమను తెలియజేస్తున్నారు. వారు అయన ప్రియమైన శిష్యులు, స్నేహితులని వారికి ప్రత్యేక భాద్యత ఉందని తెలియజేస్తున్నారు. మనము కూడా ఆ శిష్యుల వలె భయానికి బందీలమై మన యొక్క కర్తవ్యాన్ని మరిచి పోయే అవకాశము ఉంది. భయాందోళనల సమయములో మనము వాటినే తలచుకుంటుంటాము. వాటిలోనే లీనమై మన గమ్యాన్ని మరచిపోతాము. అంతేకాక అశాంతికి, నిరాశ నిస్పృహలకు గురి అవుతాము. కాబట్టి, ఈ సమయములో ఉత్తానుడైన క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే సందేశము మీకు శాంతి కలుగునుగాక. ఇది విరిగిన మనసులకు ఒసగే కానుక. వీటితో పాటు ప్రభువు మనకు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని మాట ఇస్తున్నారు. ఆ ప్రభువు ఒసగే శాంతి సమాధానాలను స్వీకరించి ఆ ప్రభువుతో కలసి మన జీవితాప్రయాణాన్ని కొనసాగిద్దాము.

ఆమెన్.

Bro. Manoj OCD


3, ఏప్రిల్ 2021, శనివారం

యేసు పునరుత్తాన మహోత్సవము

 నేడు యేసువు పునరుత్తానుడైనాడు  

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని సోదరులారా ఈనాడు మనము యేసు క్రీస్తుని యొక్క పునరుత్తాన పండుగను కొనియాడుచున్నాము. సిలువ శ్రమలను అనుభవించి, సిలువ మీద మరణించి, సమాధి చేయబడి ఈనాడు సజీవుడై లేచాడు.  నేనె జీవమును అని పలికిన ప్రభువు, మరణాన్ని సైతం జయించి జీవముతో లేచాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసం అంత ప్రభుని యొక్క పునరుత్తానం మీదనే ఆధారపడి ఉంది. ప్రభుని పునరుత్తానం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన మూలరాయి. పునరుత్తానం లేనిదే క్రైస్తవత్వం లేదు, పునరుత్తానమును నమ్మని వాడు క్రైస్తవుడే కాడు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు ; క్రీస్తు ప్రభువు సజీవులు కాకపోయి ఉంటె నేను బోధించే బోధన అంత వ్యర్థమే.  ప్రభువు మరణించారు అనేది ఎంత సత్యమో మూడవనాడు సజీవులుగా లేచారు అనేది కూడా అంతే సత్యము. క్రైస్తవులకు, క్రైస్తవత్వానికి, క్రైస్తవ విశ్వాసానికి మూలం ఈ పునరుత్తానం. ప్రభువు పునరుత్తానం కాకపోయి ఉంటె ఈనాడు క్రైస్తవత్వం ఉండేదికాదు.

 ఈనాడు క్రైస్తవ మతం మరియు మనము ఇలా ఉన్నాము అంటే మూలం పునరుత్తానమే, పునరుత్తాన విశ్వాసమే. ఇంకా ఎంతో మంది ప్రభువు పునరుత్తానములో సందిగ్ధంగా ఉన్నారు ఎన్నో ప్రశ్నలు, సందేహాలతో, అవిశ్వాసముతో ఉన్నారు. మనము చరిత్రను పరిశిలించినట్లైతే మొదటిగా సమాధి ఎదుట ఏర్పరిచిన పెద్దరాయి అనగా సమాధిని మూయుటకు ఉపయోగించిన పెద్దరాయి పెద్ద గొలుసులతో కట్టబడి ఉంది. సమాధిని కాపలా కాయుటకు సైనికులు ఉన్నారు. కానీ ప్రభుని శరీరము దొంగలించబడినది అని సైనికులు మరియు యూదా పెద్దలు అంటున్నారు. రోమా సైనికుల ఆచార ప్రకారం సైనికులు విధులలో ఉన్నపుడు మెలకువతో, జాగ్రత్తతో కాపలా కాయవలయును. ఏ చిన్న తప్పు జరిగిన విధులలో ఉన్న సైనికుడు దానికి సమాధానం చెప్పాలి. కాపలా కాయుచున్నపుడు కునుకు తీసిన, విధిలో ఉండక పోయిన, ఆజాగ్రత్తతో ఉన్న వారికీ శిక్ష విధిస్తారు. ఆ శిక్ష మరణ దండన. గొలుసు తీసినప్పుడు, రాయి తొలిగించినపుడు శబ్దానికి ఎంత నిదురలో ఉన్న మెళుకువలోకి వస్తారు. మాగ్దలా మరియమ్మ తెల్లవారు జామున సమాధి యొద్దకు వెళ్ళినపుడు అక్కడ ఎవ్వరు కనిపించలేదు సైనికులతో సహా. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతిక దేహాన్ని శిష్యులు వచ్చి తీసికొని వెళ్లారు అని కాపలా ఉన్న సైనికులు సాక్ష్యం ఇచ్చారు. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతికదేహాన్ని తీసుకొని వెళ్ళినది శిష్యులేనని సైనికులకు ఎలా తెలుసు, బండరాయిని తొలిగించినపుడు గొలుసులను తీసినప్పుడు మేలుకొని సైనికులు ప్రభువు భౌతికదేహమును శిష్యులు తీసుకొని వెళ్లారని ఎలా తెలుసు. ఆయన ఇక్కడ లేదు తాను చెప్పినట్లుగానే పునరుతానుడైనాడు అని దేవదూత సాక్ష్యం ఇస్తున్నారు.మరీ ముఖ్యముగా ఆయన పలుమారులు శిష్యులకు దర్శనమిస్తున్నారు. ఇవన్నీ చూసి, విని కూడా మనము ఇంకా వెలిగించి కుంచం క్రింద ఉంచిన దీపము వలె ఉన్నాము. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైనే ఉంచెదము గాని గంప క్రింద ఉంచారు గదా! 

పునీత పౌలు గారు అన్నవిధముగా ఉష్ణ కాలమున వేగుచుక్క మీ హృదయములను నింపువరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. పాపము అనే అంధకారమున ఉన్న మనము ఉష్ణకాల వేగుచుక్క హృదయములను వెలుతురుతో నింపునట్లు మనము ప్రభువు యొక్క పునరుత్తాన వెలుతురుతో నింపబడి గంప క్రింద ఉంచిన దీపము వలే కాక దీప స్తంభము పైన ఉంచిన దీపము వలె అందరికి వెలుగునిద్దాం. పౌలు గారి వలె అందరికి ప్రభువు వెలుగును పంచుదాం ఆయన పునరుత్తానములో పాలుపంచుకుందాం. ఈ పునరుత్తానము మనలను పాపములను నుంచే కాక అన్నింటినుంచి కూడా విముక్తులను, స్వతంత్రులను చేస్తుంది. ఈ పునరుత్తానము ద్వారా ప్రభువు మనకు నూతన జీవితాన్ని ఇస్తున్నారు. పొందిన జీవితము ద్వారా ప్రభుని పునరుత్తాన వెలుగులో జీవించుటకు ప్రయత్నిద్దాం.

Br. Lukas

20, మార్చి 2021, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారము

తపస్సుకాల 5 వ ఆదివారము

యిర్మియా 31: 31-34

హెబ్రీ 5: 7-9

యోహాను 12: 20-33

క్రీస్తు నాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పఠనములు మనకు అంతరంగిక యాత్ర, ఆత్మ పరిశీలన, ఆత్మ పరిత్యాగము అను అంశములను గూర్చి బోధిస్తున్నాయి. క్రైస్తవత్వము, క్రైస్తవ జీవితము ద్వంద్వ ప్రయాణమనే చెప్పాలి; ఒకటి అంతరంగికమైనదైతే, మరొకటి తండ్రి అయిన దేవుని వైపునకు నిర్దేశింపబడినది. ముఖ్యముగా ప్రతి తపస్సుకాలము కూడా ఈ యాత్రలకు గల ప్రాముఖ్యతను గూర్చియు, దీని అవసరతను గూర్చియు మనకు భోధిస్తుంది. ఈనాటి మొదటి పఠనము ఇశ్రాయేలీయులతో దేవుడు ఏర్పరచుకొను నూతన నిబంధనను మనకు గుర్తు చేస్తుంది. యావే దేవుడు ఐగుప్తు దాస్య విముక్తి అనంతరము, సీనాయి పర్వతముపై ఇశ్రాయేలీయులతో ఓ నిబంధనను చేసుకున్నారు. ఆనాడు పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానమనుసరించి, ఆ వాగ్దానమును నవీకరించి, ఇశ్రాయేలీయులతో నిత్యమూ నివశిస్తాననియు, వారు నిర్మల హృదయముతో ప్రభువైన దేవుని మాత్రమే ఆరాధింపవలయుననియు, వారు దేవుని ప్రజలు కావున వారిని ఎన్నటికీ విడనాడననియు పలికారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాటను, నిబంధనను తిరస్కరించి దేవునికి వ్యతిరేకముగా పాపము మూటగట్టుకుని, దేవునిని విడనాడారు. వారి తలబిరుసుతనమునకు చిహ్నముగా దేవుడు వారిని విడనాడారు. అస్సీరియులుబబులోనీయులు వారి దేశమును, దేవళమును తూలనాడి, నాశనమునకు గురి చేసి వారిని బందీలుగా కొనిపోయారు. అలా క్రీస్తు పూర్వము 587 వ సంవత్సరములో చెర పట్టబడి బబులోనియా దేశములో బందీలుగా వశిస్తున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధలను గాంచిన దేవుడు వారితో పూర్వము తాను సీనాయి కొండపై చేసుకొనిన నిబంధనకు అతీతమును, నూతనమును ఐన మరియొక నిభందనను వారితో చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు. పూర్వ నిబంధన వారి ద్వారబంధములకు పరిమితము కాగా, ఈ నూతన నిభందనమును దేవుడే స్వయముగా వారి హృదయములపై లిఖిస్తానని పలుకుట మనము ఈనాటి మొదటి పఠనము 33వ వచనము లో చూస్తున్నాము. ఇదిగో! మనము చేయవలసిన అంతర్గత ప్రయాణము, దేవుడు మన హృదయములపై వ్రాసిన దైవ మానవ ప్రేమ అను ఈ నూతన నిబంధనము వైపునకే. మన అంతరంగిక జీవితమును దేవుడు ఏర్పరిచిన ఈ ప్రేమ అను తక్కెడలో తూచి, పరిశీలించి, దైవ రాజ్యమునకు మనలను దూరము చేసే ప్రతి అంశమును తొలగింప ఈ తపస్సు కాలము మనలను ఆహ్వానిస్తుంది.

ఇక ఈ నాటి సువిశేష పఠనము దేవుడు ఏర్పరచిన ఆ నిత్య జీవితము క్రీస్తునందు ఏ విధముగా సాధ్యమగునో మనకు నేర్పిస్తుంది. యేసు క్రీస్తు నందు ఏర్పరచిన ఆ నిత్య జీవితమును పొంద మనలను మనము ఏవిధముగా ధ్వంసమొనర్చుకొనవలెనో, ఏవిధముగా ఆత్మార్పణ గావించుకొనవలెనో భోదిస్తుంది. నిక్కముగా ఆత్మ పరిత్యాగము, మరియు ఆత్మార్పణము అంతర్వేదనకు దారితీస్తుంది. అనేక అద్భుత కార్యములను చేస్తున్న యేసుని గూర్చి విని గ్రీకులు కొంతమంది ఆయనను చూచుటకు వస్తే, క్రీస్తేమో గోధుమ గింజ అను చక్కని ఉపమానము ద్వారా తన శ్రమల, మరణ, పునరుత్తాన పరమ రహస్యములను గురించియు, వాటి ఫలమైన నూతన జీవితమును గురించియు బోధించుట మనము చూస్తున్నాము. జీవము, మరణము అను రెండును విభిన్న సత్యములుగాను, తధ్యములుగాను

భావించిన తరమునకు క్రీస్తుని భోద ఒక క్రొత్త మలుపునకు, నిజమైన సత్యమునకు దారితీస్తుంది. క్రీస్తు ఈ నాటి సువిశేష పఠనములో నూతన జీవితమును గూర్చి నేర్పుతూ, గోధుమ గింజ ఉపమానమును బోధిస్తున్నారు. మనము పాతి పెట్టబడిన గింజ యొక్క బాహ్యమును మాత్రమే గ్రహించగలము. కానీ, అది నశించు సమయములో మనము గుర్తించజాలని వేదనకు, భాదకు గురవుతుంది. కానీ, గోధుమ గింజకు అలా భూమిలో పడి నశించడము వెనుకనున్న ఆంతర్యము తెలుసు. దాని గమ్యము విస్తారముగా ఫలించడమేనన్న సత్యమును ఎఱుకయే. కాబట్టియే అది నశించుటను ఎన్నుకున్నది. తనను అద్భుతముగా మార్చగల భూమిలో పడుటకును, తనను తాను సంపూర్ణముగా అర్పించుకొనుటకు సిద్ధమైంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవి మరణించక తప్పదు. కానీ మరణము అంతము కాదు. అది ఒక మార్పు మాత్రమే. ఒక స్థితి నుండి వేరొక స్థితికి గల ప్రయాణమే. మనలను ఆ దేవుడు ఫలించే గింజలుగా సృజించాడు. ఫలించు విధమును, క్రీస్తు తన జీవిత ఉదాహరణమునందు మనకు నేర్పించాడు. ఫలించుచు, వెలుగు పుత్రులుగా జీవింప మనలను ఎన్నుకొన్నారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19, 20 వచనములలో చీకటియందు వశించు వారికి, వెలుగునందు వశించు వారికి గల వ్యత్యాసము మనము చూస్తున్నాము. ఈ చీకటి యందు వశించు ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమతో వెలుగునకు ఆహ్వానిస్తున్నారు. గోధుమ గింజ భూమిలో పడి నశిస్తూ ఏవిధముగా ఆత్మార్పణమునకు గురవుతుందో అదే విధముగా మన చీకటి కార్యములను విడనాడుటలో మనము కూడా నశించాలి. ఆత్మ పరిత్యాగము ఈ ప్రక్రియలో ఓ ముఖ్యమైన ఘట్టము. ఈ స్థితిలో దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే మన ఇష్టాలను వదిలివేయ మనము సిద్ధపడాలి. మన గమ్యస్థానమైన దైవారాజ్యమును పొంద అడ్డగించే, ఆటంకపరిచే బంధబాంధవ్యాలను, బంధకాలను, మనస్తత్వాలను, ఇష్టాయిష్టాలను అధిగమించవలెను. అంతేకాక, మనలను మనము ధ్వంసమొనర్చుకొనిన ప్రతిసారి మనము ఓ క్రొత్త మనుషులుగా మారగలుగుతాము. కాబట్టి, పునీత సిలువ యోహాను గారు నేర్పిన విధమున సులభతరమైన దానిని కాక కష్టతరమైన దానిని ఎన్నుకుందాం. మన జీవితాలలో ఉన్న చెడుగును తొలగింప కష్టతరమైన, ఇరుకైన మార్గమున పయనిద్దాం.

 

యేసు ప్రభువు ఈ నాటి సువిశేషములో తనను తాను గోధుమ గింజ వలె అభివర్ణిస్తున్నారు. గోధుమ గింజ ఏవిధముగానైతే నశించి విస్తారముగా ఫలించునో క్రీస్తు కూడా తన శ్రమల, మరణము ద్వారా, పునరుత్తానమను మిక్కుటమగు ఫలమును సంపాదించి, మనలను తండ్రికి బిడ్డలుగా చేసాడు. తండ్రి రాజ్యవారసులవ అవకాశము దయచేసాడు. ఈనాటి రెండవ పఠనము, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలో మనము చదువుతున్నాము; క్రీస్తు ఏడ్పులతో, కన్నీటితో తనను రక్షింపగల దేవునికి మొరపెట్టాడు అని. క్రీస్తువలె ఎందరో పునీతులు, వారు సామాన్య మానవులే అయినను, అయన పిలుపును అందుకుని, తమను తాము పరిత్యజించుకుని, తమ సిలువను ఎత్తుకుని, తమ జీవితములయందు నశించి, ఫలించారు, ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ఇక క్రీస్తు శిష్యులుగా, క్రైస్తవులుగా మన కర్తవ్యము; క్రీస్తు ఉదాహరణమును సముఖతతో స్వీకరించి గోధుమ గింజ వలె మనకై మనము క్రీస్తు అను భూమిలో విత్తబడి, అయన వలె నిత్యమూ ప్రార్థన అను నీటితో తడపబడవలెను. ఏలయన ఏ విత్తనము తడవనిదే నశించదు, మొలకెత్తదు. పరిశుద్ధ గ్రంధము ఆయన నిత్యము ప్రార్ధించెను అని వక్కాణిస్తుంది. కాబట్టి ఆ విధమున మనలను మనము ఆత్మార్పణము గావించుకుని, తండ్రి యందు ఫలింప మనలను మనము తయారుచేసుకుందాము. ఈరోజు మనలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్న క్రీస్తుని అక్కున చేరి ఆతను నేర్పిన శ్రమల విలువను గుర్తిద్దాం, వాటిలో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకుని, వాటిని వృధాకానీయక ఫలవంతమొనర్చుకుందాం. దేవుని నిబంధన యందు జీవిద్దాం. ఆమెన్.

By Br. Kiran Putti OCD

 


13, మార్చి 2021, శనివారం

తపస్సుకాల 4 వ ఆదివారము

తపస్సుకాల 4 వ  ఆదివారము

2 రాజు దిన 36: 14 – 16, 19-20
ఎఫెసీ 2: 4 - 10

యోహాను 3: 14 - 21  


ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనమందరము తపస్సుకాల నాలుగవ ఆదివారవములోనికి ప్రవేశించియున్నాము. మరి ఈనాటి దివ్య పఠనాలు మనకు ఒక విషయాన్ని  సూచిస్తున్నాయి. అదే దేవుని పైన మానవులకు గల నిర్లక్ష్యం. మరి ఈ నిర్లక్ష్యం ఎంత వినాశనానికి దారితీస్తుంది అని మనందరికీ తెలుసు.  ఇది ఒక చిన్న పదమే కానీ, దీని ఫలితం మాత్రం చాల పెద్దది. దీనిని అలవాటు చేసుకున్నవారికి నాశనము తప్పదు. వారు ఎంత గొప్పవారైనా సర్వనాశనానికి గురిచేస్తుంది. వారు మాత్రమే కాక వారి సన్నిహితులను, పొరుగువారిని సహితము ఇది నాశనము చేస్తుంది.

నిర్లక్ష్యము:

‘నిర్’ మరియు ‘లక్ష్యము’. “నిర్” అనగా వదిలివేయడము, దూరముగా ఉండటం. అనగా లక్ష్యమును వదిలివేయడటము లేదా దూరముగా ఉండటం. ఇదే మాటకు సాధారణ పరిభాషలో లెక్క చేయకపోవటం, మాటవినకపోవడటము, పెడచెవినిపెట్టడము అను అర్ధాలు ఉన్నాయి. ఇంకా వివరముగా చెప్పాలంటే మనకు ఎవరన్నా ఏదైనా చెబుతుంటే, మాటలు వినబడుతున్నా వినబడనట్లు ప్రవర్తించడం. మనుషులు కనబడుతున్నా కనబడనట్లు ప్రవర్తించడం, మరియు మన ప్రక్కన ఉన్న ఒక మనిషిని మనిషిగా గుర్తించకపోవడటము.

ప్రియమైన క్రైస్తవులారా, ఈ నాటి మొదటి పఠనములో మనము గమనించినట్లయితే నిర్లక్ష్యము వలన ఇశ్రాయేలీయులు పొందిన ఫలితము మనము చూస్తున్నాము.  ఇశ్రాయేలు రాజులు, యాజకులు మరియు ప్రజలు దేవుని ప్రవక్తల మాటలను పెడచెవిన పెట్టి దేవుని బాటను నిర్లక్ష్యము చేసారు. దేవుడు వారికి ఏర్పరచిన ప్రణాళికను; అనగా ఇతరేతర జనుల మధ్య నిజదేవుడైన యావేకు ప్రతీకలుగా, నీతిన్యాయము చొప్పున  నడుచుకుంటూ ఉండాలని. వారు ఈ దేవుని ప్రణాలికను నిర్లక్ష్యము చేసారు. దేవాలయమును అమంగళము చేశారు. దేవుని యొక్క ప్రవక్తలను ఎగతాళి చేసారు. దేవుని స్వరమును, వాక్కును అయిన ప్రవక్తలను తృణీకరించారు.

ఎప్పుడు అయితే వారు దేవుని తృణీకరించారో  అప్పడి నుండే వారి పతనము ఆరంభమయింది. ఏ అధికారమును, ప్రతిభను, సంపదలను, భూమిని, మందిరమును చూసి వారు మురిసిపోయారో, గర్వపడ్డారో, వాటన్నిటిని ప్రభువు వారి నుండి దూరం చేసారు. సింహాసనము నుండి రాజులు త్రోయబడ్డారు, దేవాలయము నుండి యాజకులు వెలివేయబడ్డారు, మరియు చంపబడ్డారు. ప్రజల సంపద అంతా దోచుకొనబడినది. నాది, మాది అనుకున్న ప్రతి దాని నుండి వారు దూరం చేయబడ్డారు, వేరు చేయబడ్డారు. మరి అన్ని కోల్పోయి మిగిలి ఉన్నవారిని బబులోనియా రాజు తనకు, తన ప్రజలకు దాసులుగా, దాసీలుగా ఊడిగము చేయుటకు తీసుకొని వెళ్ళాడు. 

ఈనాడు మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతములో పనే లోకముగా జీవించినా, పదవే లక్ష్యముగా, డబ్బే ముఖ్యమని, ఆ తర్వాతే అన్నీ అని, నా ప్రతిభ ద్వారా అన్నీ చేయగలమని అనుకున్నామా! ఆ దేవుడు చూపిన వెలుగులోనికి, మార్గములోనికి ప్రవేశించకుండా నిర్లక్ష్యము చేస్తూ ప్రతి రోజు చేసే ప్రార్ధనే కదా, ప్రతి ఆదివారము పాల్గొనే పూజా కదా, ఎప్పుడు చదివే బైబిలే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా, అని నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించామా!. ఒకవేళ మనము ఈవిధమైన ఆలోచనలతో జీవించి ఉంటే మారు మనస్సు పొంది, ప్రభవునే లక్ష్యముగా చేసుకొని, ఆయనే మన మార్గము, సత్యము, జీవమని విశ్వసించి ఆయన చూపిన మార్గములో నడువ కావలసిన అనుగ్రహాలకై ఆ దేవతిదేవుణ్ణి వేడుకుందాము. ఆమెన్ .

By . Br. Avinash

6, మార్చి 2021, శనివారం

తపస్సు కాల 3వ ఆదివారం

తపస్సు కాల 3వ ఆదివారం  

నిర్గమ 20:1-17, 1కొరింతి 1:22-25 ,యోహాను 2:13-22                                                

క్రీస్తు నాధునియందు ప్రియమైన సహోదరి సహోదరులరా! ఈనాటి గ్రంథ పఠనాలు మన జీవితాలలో  దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగియుండాలని తెలియజేస్తున్నాయి. తపస్సు కాలంలో ముఖ్యంగా మనం క్రీస్తు పునరుత్తానా మహోత్సవాన్ని కొనియాడుటకు సిద్ధపడుతున్నాం. మహోత్సవంలో నిండు మనస్సుతో పాల్గొనుటకు దైవ ప్రేమ సోదర ప్రేమ అను రెండు సుగుణాలు మనకు ఎంతగానో దోహదపడతాయిఏలయన, నిత్య జీవితం పొందడానికి దైవ ప్రేమ సోదర ప్రేమ అనునవి చాలా ముఖ్యం అని  ప్రభువే చెప్పియున్నారు (లూకా 10:25-27).

            ఈనాటి గ్రంథ పఠనాలను ధ్యానించినట్లయితే రెండు ఆజ్ఞలను మనం చూస్తున్నాం. మొదటి పఠనంలో  యిస్రాయేలు ప్రజలకు ప్రభువు సీనాయి కొండ దగ్గర పది ఆజ్ఞలు ఇస్తున్నారు. దేవుని ఆజ్ఞలను తెలుసుకొని, పాటించుట ధ్వారా ప్రభుని ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ మనపై ఉంటాయని తెలుస్తుంది. పది ఆజ్ఞలలో మొదటి మూడు ఆజ్ఞలు దేవుని ప్రేమని, చివరి ఏడు ఆజ్ఞలు పొరుగువారి యందు ప్రేమను వెల్లడిచేస్తున్నాయి (నిర్గమ 20:1-17, మత్తయి 22: 37-40). 

అసలు దైవ ప్రేమ, సోదర ప్రేమ అంటే ఏమిటి? ఎందుకు మనం దేవుని, మన తోటి సోదరుని ప్రేమించాలి? దానివలన మన జీవితాలలో కలుగు మేలు ఏమిటి

దైవ ప్రేమ  

"దైవ ప్రేమయన ఆయన ఆజ్ఞలకు లోబడుటయే" (1 యోహాను 5: 3, యోహాను 14:15 ). దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే దేవుని ప్రేమించడం అని అర్ధం. ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన ప్రేమ మనపై కలకాలం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా పరిశుద్ధ గ్రంధంలో మనం చాలామందిని చూస్తున్నాం.

ఉదాహరణకు ఆదికాండంలో అబ్రహమును చూస్తున్నాం. దేవుడు అబ్రాహామును "నీ దేశము, నీ ప్రజలను వదిలి నేను చూపు దేశమునకు వెళ్లుము" (ఆది 12: 1-4) అని  ఆజ్ఞాపించగానే అబ్రాహాము తిరుగు ప్రశ్న వేయకుండా వెళ్తూ ఉన్నారు. అల్లాగే "నీవు గాఢముగా ప్రేమించిన నీ ఏకైక కుమారుని నాకు బలిగా సమర్పించుము" (ఆది 22:2-19) అని ఆజ్ఞాపించినప్పుడు కూడా అబ్రాహాము మారుమాట పలాకాకుండా మరుసటి రోజు తెల్లవారకు ముందే కుమారుని తీసుకుని దహనబలి సమర్పించడానికి సిద్ధపడ్డారు అని పరిశుద్ధ గ్రంధంలో చూస్తున్నాంఅబ్రాహామునకు ప్రభువుమీద ఎనలేని ప్రేమ గౌరవం ఉన్నదీ కాబట్టే ప్రభువు ఆజ్ఞాపించినదాన్ని వెంటనే చేస్తున్నారు, అందుకుగాను ప్రభువు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచెను (ఆది 15:6). ఈనాడు తల్లి తిరుసభచేత కూడా విశ్వసమునకు తండ్రిగా పిలవబడుచున్నాడు

ఈనాటి సువిశేషంలో యూదులు, దేవాలయ అధికారులు యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చడాన్ని చూస్తున్నాం. దేవునియందు క్రీస్తుకు  గల ప్రేమ ఆయనను దహించివేస్తుంది. సంఘటనను చూడగానే క్రీస్తు కోపోద్రిక్తుడవుతున్నారు. అధికారులు దేవుని ఆజ్ఞలు మర్చిపోయి, ఆయనాయందు ప్రేమ విశ్వసాన్ని కోల్పోయి దేవాలయాన్ని వ్యాపారస్థలంగా మారుస్తున్నారు.

ఎందుకన, " ప్రజలు నన్ను కేవలం వారి పెదవులతో మాత్రమే స్తుతించుచున్నారు, కానీ వీరి హృదయాలు నాకు కాదు దూరం"  (మత్తయి 15:8) అని ప్రభువునకు తెలుసు. అధికారులు కేవలం జనులు చూచుటకై ప్రార్ధన చేస్తారు తప్ప దేవుని యందు ప్రేమతో కాదు (మత్తయి 6:5). ప్రభువు ఇచ్చిన మొదటి మూడు ఆజ్ఞలు (ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, ఆయన నామమును, పండుగా దినములను పవిత్రముగా ఉంచాలి ) పవిత్రత గురించి చెప్తున్నాయి. కానీ దేవాలయ అధికారులు మాత్రం ప్రభువు వసించు ఆలయాన్ని, ఆయన నామమును, పండుగ దినములను అపవిత్రం చేస్తున్నారు. కనుక క్రీస్తుని ఆగ్రహానికి గురియగుచున్నారు. మన జీవితాలలో కూడా ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

దేవుని మనం ఎందుకు ప్రేమించాలి, ఆజ్ఞలు పాటించాలి?

1). ఆయన కరుణ కొరకు

దేవుడు నిర్గమ కాండం 20:6 లో పలుకుతున్నారు, ఎవరైతే దేవుని ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో దీవుడు వారిని వేయి తరములదాకా కరుణిస్తాను అని. నీనెవె ప్రజలు పాపంలో కూరుకుపోయినప్పుడు ప్రభువు పట్టణాన్ని నాశనం చేస్థానాన్ని యోనా ప్రవక్త ధ్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు పలుకులు విన్నారో వెంటనే పశ్చాతాపం చెంది ప్రభుని మొరపెట్టుకోగానే ప్రభువు వారిని కరుణించారు (యోనా 3:10). కనుక ప్రభువు ఆజ్ఞానుసారం జీవిస్తే ఆయన కరుణ ఎల్లప్పుడూ మనపై ఉండును.

2). ప్రభువు  రక్షణ కొరకు

దేవుడు కీర్తనాకారుడు ధ్వారా  (91:14)  "నన్ను ప్రేమించువారిని నేను రక్షించెదను", " నా నిబంధనమును పాటించి, నా కట్టడాలను పాటించువారికి నా రక్షణ తరతరములవరకు లభించును' (కీర్తన 103:18) అని అంటున్నారు. మనం ప్రభువు పట్ల, ప్రభుని ఆజ్ఞల పట్ల ప్రేమకలిగి జీవిస్తే ఎన్ని అపాయములు ఆటంకాలు మన దారికి వచ్చినా ఆయన ఎల్లప్పుడూ మనలను రక్షిస్తారు. ఇందుకు నిదర్శనం మనం దానియేలు గ్రంధంలో చూడవచ్చు. హిల్కియా కుమార్తె సూసన్నా చిన్నప్రాయం నుండి ధర్మశాస్త్ర నియమముల ప్రకారం జీవించెను (దానియేలు 13:3). ఎప్పుడైతే నాయమూర్తులు అన్యాయంగా సూసన్నపై నిందారోపణగావించి మరణశిక్ష విధించారో, ప్రభువు వెంటనే దానియేలు ధ్వారా తనను నమ్మిన బిడ్డను రక్షిస్తున్నారు (దానియేలు 13:62). కనుక ప్రభువుని ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే తన రక్షణ మనతో కాలాంతకాలం ఉండును.

పొరుగువారిని ప్రేమించుట:

క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరు కశ్చితంగా సోదరప్రేమ కలిగియుండాలి. ఏలయన, తన తోటివారిని ప్రేమించువారే  చట్టములను నెరవేర్చినట్టు' (రోమా 13:8) అని పునీత పౌలు గారు పలుకుచున్నారు. క్రీస్తు ప్రభువే స్వయానా చెప్పియున్నారు  ధైవుని ప్రేమించుట, పొరుగువారిని ప్రేమించుట అత్యంత ముఖ్యమైన ఆజ్ఞలు అని (మార్కు 12:31, యోహాను 15:12). పరిశుద్ధ గ్రంధంలో పొరుగువారిని ప్రేమించుట అను ఆజ్ఞకు చాలా ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. పది ఆజ్ఞలలో చివరి ఏడు ఆజ్ఞలు (నిర్గమ 20:12-17) 'మనలను మనం ప్రేమించుకొనినట్లే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి' అను ఒకే ఒక్క ఆజ్ఞయందు ఇమిడియున్నదని పునీత పౌలుగారు (రోమా 13:9) పలుకుచున్నారు. అంతే కాదు గలతి 5:14 లోధర్మశాస్తమంతయు సోదరప్రేమ అను ఒక్క ఆజ్ఞలో నెరవేరియున్నదని’ కూడా పౌలుగారు స్పష్టం చేస్తున్నారు

మన జీవితాలలో అనేకమార్లు మనం దేవాలయాన్ని వెళ్తూ, ప్రార్ధనా ఉపవాసాలు చేస్తూ దేవునిపై మన ప్రేమను అనేకవిధాలుగా వెల్లడిచేస్తుంటాము. కానీ మన పొరుగువారితో మాత్రం ఎల్లప్పుడూ గొడవలు, మనస్పర్థలు, కోపం, పగ, ద్వేషాలతో జీవిస్తుంటాం. కానీ దేవుని ప్రేమించడం అంటే మన పొరుగువారిని ప్రేమించడమే అని (1 యోహాను 4:21) పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తున్నది. మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ మన సోహోదరులను ద్వేషిస్తే మనం అసత్యవాదులం అవుతాం. ఎందుకంటే మన కంటికి కనిపించే తోటి సోహోదరుని ప్రేమింపనిచో, మనం చూడని దేవుని ఎలా ప్రేమింపగలం? (1 యోహాను 4 :20). కనుక దైవ ప్రేమ, సోదర ప్రేమ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి

ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు త్రాళ్లతో కొరడా పేని దహనబలికి అమ్ముటకు తెచ్చిన జంతువులను, పావురాలను, డబ్బులు మార్చువారిని దేవాలయం నుండి వెళ్లగొడుతున్న సంఘటన మనకు కనిపిస్తుంది. ఎందుకు ప్రభువు ఇంత కఠినంగా ప్రవరిస్తున్నారు? దేవాలయ ఆచారం ప్రకారం దహనబలి వాడే జంతువులు, పావురాలు అసుచికరంగా మరియు ఎటువంటి లోపం కలిగి ఉండరాదు. ఎందుకంటే బలికి మంచి జంతువులను అమ్ముతున్నారు. ఎందుకు క్రీస్తు ప్రభువు కోపోద్రిక్తుడయ్యారు? ప్రభువు ఆలయాన్ని అపవిత్రం చేయడంతో పాటు, వారు పొరుగువారికి అన్యాయం చేస్తున్నారు. వారు వ్యాపారానికి వాడుతున్న దేవాలయప్రాంగణం పరదేశీయులకు, అన్యులకు ప్రార్థనచేసుకొనుటకు కేటాయించిన స్థలం. స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా వారికి ఇష్టం వచ్చిన ధరకు అన్యాయంగా బలి వస్తువులను అమ్ముతున్నారుఅనేకమంది పేదప్రజలు అంతటి వెలనిచ్చి బలివస్తువు కొనలేక ప్రభువుకు బలి అర్పించకుండా నిరాశతో ఇంటికి తిరిగివెళ్తున్నారు. తమ తోటి సహోదరులపైనా ప్రేమపూర్వకంగా ప్రవర్తించకుండా వారికి ఇష్టంవచ్చినట్లు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నారు. పేదవారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక క్రీస్తుప్రభువు ఆగ్రహించుకుంటున్నారు

మన జీవితంలో కూడా ప్రభువునకు, ఆయన ఆలయానికి, ఆయన ప్రజలకి ఎంత గౌరవం ఇస్తున్నాం అని ధ్యానం చేసుకుందాం. ఎందుకన, ప్రతిఒక్కరు దేవుని ఆలయమనియు, పవిత్రాత్మకు నిలయమనియు పౌలుగారు 1 కొరింతి 3 :16లో పలుకుచున్నారు. అటువంటి దేవుని ఆలయమైన మన తోటి సహోదరి సహోదరులను మనం ఏవిధంగా గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. మనం ఎప్పుడైతే మన పొరుగువారితో ప్రేమభావం కలిగి ఉంటామో దేవుని ఆలయమును మనలో దేవుడు నివాసం ఏర్పరచుకుంటారు (1 యోహాను 4:12). తన సహోదరుని ప్రేమింపనివాడు దేవుని బిడ్డడు కాదు, సైతాను బిడ్డ (1 యోహాను 3 :10), అట్టివాడు ఇంకను మృత్యువునందే ఉన్నాడు (1 యోహాను 3:14) అని యోహానుగారు తెలియజేస్తున్నారుఎందుకు మనం తోటివారిని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకంటే మనం కూడా యూదులవలె అద్భుతాలను, గ్రీకులవలే వివేకమును (1 కొరింతి 1 :22) కోరుచున్నాము. కానీ వీటి అన్నింటికంటే గొప్పవాడు లోకరక్షకుడైన యేసు క్రీస్తును మన పొరుగువారిలో గుర్తించలేకపోతున్నాం. మనం లోకసంబంధమైన వాటికోసం కాకుండా క్రీస్తుప్రభువు కోసం వెదకితే కశ్చితంగా ఆయన అనుగ్రహం, కరుణ, రక్షణ పొందగలుగుతాం.

కనుక క్రిస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులారా. క్రీస్తు పునరుత్తాన పండుగకు సిద్ధపడుతున్న మనమందరం ఈనాడు గుర్తుంచుకోవాల్సింది, దేవునియందు ప్రేమ, సహోదర ప్రేమ లేకుండా పండుగలో మనం సంపూర్ణ హృదయంతో దేవునికి ఇష్టపూర్వకంగా పాల్గొనలేము. అది కేవలం నామమాత్రంగానే ఉంటుంది తప్ప నిజమైన పునరుత్తానాన్ని మన జీవితంలో అనుభవించలేం. కాబట్టి, సహోదరి సహోదరులారా పది ఆజ్ఞలను మనస్సునందు ముద్రించుకొని దైవ ప్రేమ, సోదర ప్రేమ అను గొప్ప సుగుణాలతో పునరుత్తాన పండుగకు నిండు మనస్సుతో సిద్ధపడదాం. ఆమెన్.

By Br. Joseph Kampally

 


నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...