27, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సుకాల రెండవ ఆదివారము

తపస్సుకాల రెండవ  ఆదివారము 

ఆది 22:1–2, 9–13, 15–18

రోమా 8:31–34

మార్కు 9:2–10

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము తపస్సుకాల రెండవ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనము ధ్యానించినట్లయితే, త్యాగపూరిత జీవితము మరియు దేవుని సాన్నిధ్యము అను అంశముల గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి, త్యాగపూరితమైన జీవితము జీవిస్తారో వారు దేవుని సాన్నిధ్యాన్ని కనుగొంటారు, మరియు వారు నిత్యము దేవుని సన్నిధిలో నివశిస్తారు. అప్పుడు దేవుడు వారి వారి కుటుంబాలను దీవిస్తాడు.

ఈనాటి సమాజమును గమనించినట్లయితే ఎంతోమంది దేవుని యందు విశ్వాసములేకుండా, ఎన్నో వ్యసనములకు గురి అవుతున్నారు. తల్లితండ్రులు అంటే గౌరవం లేకుండా పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భార్యభర్తల మధ్య అనేకానేక సమస్యలు, ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా వివాహ భాంధవ్యాన్ని అపార్ధాల ముసుగులో నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భములో అబ్రాహాము జీవితము, ఈనాటి మొదటి పఠనము ద్వారా ఓ మంచి ఉదాహరణమును మన ముందుంచుతుంది.

అబ్రాహాము విశ్వాసులందరిలో చాల గొప్పవాడు. ఎందుకనగా అబ్రాహాము దేవుని పిలుపును ఆలకించి , దేవుణ్ణి అనుసరించి దేవుని చిత్తానుసారముగా జీవించాడు. అబ్రాహాము ఎల్లపుడు దేవుని కనుసన్నలలో జీవిస్తూ ఉండేవుడు. ఓనాడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అబ్రాహాము యొక్క ముద్దుల తనయుని, తన ఒక్కగానొక్క కుమారుడైన ఈసాకుని బలిగా సమర్పించమన్నాడు. అబ్రాహామునకు చాల కాలము వరకు సంతానము కలగలేదు. దేవుడు అబ్రాహామునకు ముసలి ప్రాయములో కుమారుణ్ణి ప్రసాదించాడు. దేవుడు ఈసాకుని బలిగా అర్పించమన్నపుడు అబ్రాహాము  చిత్తం ప్రభు! అని దేవుని ఆజ్ఞను శిరసావహించి దేవుని చిత్తానుసారముగా ఈసాకుని దేవునికి సమర్పించుటకు సిద్ధపడుతున్నాడు. దేవుడు ఈసాకుని బలిగా సమర్పించమన్నపుడు అయన విశ్వాసం తొట్రిల్లలేదు. అబ్రాహాము చెదరలేదు, బెదరలేదు, వెనకడుగు వేయలేదు.

దేవుని యందు విశ్వాసము ఉంచి సకలము దేవుడే కలుగజేసాడు, నాకు ఈ బిడ్డను ఆయనే దయచేసాడు, ఆయనే సమకూరుస్తాడు అని ఈసాకును బలిగా సమర్పించడానికి మోరియా కొండ మీదకు తీసుకు వెళుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసమునకు మెచ్చి, అబ్రాహాము చేసిన త్యాగమునకు గుర్తుగా ఆయన కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. అదేవిధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మం జీవితములో కూడా ఎన్నోసార్లు, అనేక పరీక్షలకు గురవుతుంటాము. అనేక శోధనలు, సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలను చూసి మనము భయపడకుండ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని దేవుని దూషించకుండ, దేవుని యందు విశ్వాసముంచి, అబ్రాహాము ఏ విధముగా త్యాగపూరిత జీవితము జీవించాడో అదే విధముగా మనము కూడా జీవించాలి అని మొదటి పఠనము తెలియజేస్తుంది.

అదే విధముగా ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దివ్యరూపము దాల్చడము మనము చూస్తున్నాము. యేసు ప్రభువు దివ్యరూపము దాల్చినపుడు , తాను పొందబోవు శ్రమలు, మరణ పునరుత్తానముల గురించి మోషే, ఏలీయాతో సంభాషిస్తున్నారు. అప్పుడు అక్కడ పేతురు, యాకోబు, మరియు యోహాను మాత్రమే ఉన్నారు. వారు ఆ దృశ్యాన్ని చూసి, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనుగొన్నారు, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించారు. అందుకనే వారు సమస్తాన్ని మరిచిపోయారు. పేతురు గారు 4 వ వచనంలో బోధకుడా! మనము ఇక్కడే ఉందాము. మీకు, మోషేకు, ఏలీయాకు మూడు పర్ణశాలలు నిర్మిస్తాము అని అంటున్నారు.

మనము కూడా ఎప్పుడైతే దేవుని సాన్నిధ్యములో ఉంటామో, ఎన్నడైతే మనము దేవునిని కనుగొంటామో, దేవుడు మనతో మాట్లాడతాడు, తన రహస్యాలను మనకు బయలు పరుస్తాడు. ఆనాడు కొండమీద దేవుడు, ;ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు; అని శిష్యులతో పలికారో ఈనాడు అదే దేవుడు మనతో కూడా పలుకుతారు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు ఎలాంటి సైతాను శోధనలనైనా ఎదుర్కొన శక్తిమంతులమవుతాము. ఎలాంటి సమస్యలైనా మన మనస్సును కలత పెట్టలేవు. అందుకనే ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలు గారు ఈవిధముగా అంటున్నారు,దేవుడు మన పక్షమున ఉన్నచో, ఇక మనకు విరోధి ఎవడు ఎప్పుడైతే మనము దేవుని యందు ఉంటామో అప్పుడు దేవుడు మనయందు ఉంటాడు. దేవుడు మనయందు ఉండాలి అంటే మనము పవిత్రముగా జీవించాలి, దేవునికి అనుగుణముగా, విశ్వాస జీవితములో, త్యాగపూరితముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనయందు జీవిస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలము ఎంతో చక్కని కాలము. ఎందుకనగా, మనమందరము ఉపవాసముతోను, ప్రార్ధనతోను గడుపుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఒక చక్కటి కాలము. ఈ తపస్సు కాలములో మనము దానధర్మాలతో, ప్రార్థన జీవితముతో, దేవుని యందు విశ్వాసముంచి, మన పాపాలను, చెడు ఆలోచనలను, కుళ్లూకుతంత్రాలను విడనాడి, మంచి జీవితాలను జీవించ కావలసిన అనుగ్రహములను దయచేయమని దేవుని ఆర్థిద్దాము. ఆమెన్.

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...