6, నవంబర్ 2021, శనివారం

32 వ సామాన్య ఆదివారం ( పేద వాని అర్పణ గొప్పతనం )

1 రాజులు17:10- 16          హెబ్రీ 9:  24-28       మార్కు 12:38-44 

ఈనాటి పఠనాలు దివ్య పఠనాలు  దేవునికి ఉదారంగా సమర్పించే అర్పణ గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన  పొందిన ప్రతిది దేవునికి,  పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయం ఉండాలి అని ఈ దివ్య పఠనాలు మనకు తెలుపుచున్నాయి. దేవుని మీద ఆధారపడుతు  మనకు ఉన్నదంతా సమర్పించుకొని  జీవిస్తే  దేవుడు ఇంకా మనలను ఆశీర్వదిస్తారు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారెఫతు వితంతువు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలు  అయినప్పటికి  కూడా దేవుని యొక్క  కృపకు నొచుకుంది. 

ఈనాటి మొదటి పఠనం యొక్క సన్నివేశం మనం గమనించాలి. ఏలియా ప్రవక్త , "ఆహాబు రాజు , ఎసెబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవములను ఆరాధించే సమయములో మూడున్నర సంవత్సరాలు ఆ దేశమున కరువు వస్తుందని" ఏలియా ప్రవక్త హెచ్చరించారు. యాకోబు 5:17 . ఈ కరువు కాల సమయములో దేవుడు ఎలియాను సారెఫతు  పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయములో  దేవుడు ధనమున్న వారిని వదలి వేసి కేవలం అద్భుతం చేయుటకు ఒక పేద వితంతువును ఎన్నుకొంటున్నారు. 

ఈమెలో వున్న కొన్ని ముఖ్య లక్షణాలు మనం ధ్యానించుకోవాలి. 

ఆమె యొక్క గొప్ప విశ్వాసం :- ఏలియా ప్రవక్త ఈమెతో తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్బంలో, వెంటనే దేవుని యందు వున్న విశ్వాసంతో  ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. తన యొక్క విశ్వాసం వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. విశ్వాసం ఉంటేనే దేవుడు అద్భుతాలు చేస్తారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టి  జాతులకు  జ్యోతిగా దీవింపబడ్డారు. 

మోషే, దేవుడను విశ్వసించారు కాబట్టి యిస్రాయేలును నడిపించారు. ఉత్తమ నాయకునిగా పిలువబడ్డారు. కననీయ స్త్రీ  విశ్వసించినది కాబట్టి దేవుడిని అడిగింది, వరం పొందింది. యాయిరు విశ్వసించారు కాబట్టి యే  క్రీస్తుని మేలు చేయమని అడిగారు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసేది విశ్వాసంవలెనే . ఎందుకంటే - క్రైస్తవ జీవితానికి ,దేవున్ని వెంబడించేవారికి ఉండవలసిన ప్రధాన లక్షణం విశ్వాసం. 

-విశ్వాసం ఉంటేనే ప్రార్థిస్తాం 

-విశ్వాసం ఉంటేనే గుడికి వెళ్తాం

 -విశ్వాసం ఉంటేనే దేవుని ఆజ్ఞలు పాటిస్తాం 

-విశ్వాసం ఉంటేనే దేవున్ని వెంబడిస్తాం 

ఈమె యొక్క జీవితంలో దేవుని మీద సంపూర్ణ  విశ్వాసం ఉన్నది కాబట్టియే, ప్రవక్త మాటలను విశ్వసించింది. ఇది మాత్రమే కాదు. ఏలియా దేవుని ప్రవక్త అని విశ్వసించింది. దేవుడిని అతడు అడిగితే మేలు జరుగుతుందని విశ్వసించినది. 

2. ఉదారంగా ఇచ్చే  మనస్సు :- ఈ వితంతువు తన జీవితములో తనకు సహాయం చేసేవారు లేక పోయిన కానీ, తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనస్సు ఉంది. 

ఆమె ఎలియతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు, కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటంలోనే నిజమైన సంతోషం , ప్రేమ దాగి ఉన్నాయి అని ఆమె భావించింది. 

-ఉదారంగా ఇస్తే దేవుడు దీవిస్తారని భావించింది. లూకా 6:38 

-ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారు 2 కోరింథీ 9:6-7 

- మనకు ఉన్న దానిలో సహాయం చేయకపోతే మనం దేవుని ప్రేమలో ఎదగలేము 1 యోహాను 3:17 

ఈ వితంతువు ఉదారంగా  ఇచ్చారు కాబట్టియే ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేదు. 

3. త్యాగం చేసే గుణం :- ఈ వితంతువు  పేదరికంలో ఉన్నప్పటికీ, ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియదు. అయినప్పటికీ ఆమె తమ యొక్క ఆహారం త్యాగం చేసుకున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే, అది తిని వారు కూడా చనిపోదాం అనుకున్నారు. ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే వస్తుంది.  అయిన ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో  ఉన్న ఆమె తాగ్యం చేసి జీవించింది, అందుకే దేవుడు ఆమెను దీవించారు. ఆమె తన జీవితం మొత్తము దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు త్యాగం చేసుకొని జీవించింది. 

మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకొని, దేవునికి  సమర్పించి జీవిస్తే, తప్పని సరిగా అది పెద్ద సమర్పణయే. చాలా సందర్బంలో దేవుడు మెచ్చుకునే సమర్పణ  ఏమిటంటే, దేవునికి ఉదారంగా యిచ్చుట - ఉదాహరణ- పేద విధవరాలి కానుక , తొలి క్రైస్తవ సంఘం , సారెఫతు వితంతువు. 

4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత:-ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల , దేవుని పట్ల ఉన్న విధేయత చూస్తున్నాం. చెప్పిన మాటను వెంటనే చేసింది. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, విధేయత కలిగి జీవిస్తే, మన జీవితంలో ఎప్పుడు కూడా మేలు కలుగుతుంది. దేవునికి కావలసినది సంపూర్ణ విధేయత, నా చేతిలో ఏమీలేదు. అంతా   నీవే అని తెలిపే విధేయత. విధేయించిన చాలా మందిని  దేవుడు  దీవించారు. ఉదా-అబ్రహాము , మోషే, యోహోషువా, పేతురు మరియమ్మ, మొదలగువారు.

 ఈ వితంతువు కూడ దేవునికి విధేయత చూపుతూ జీవించింది. కరువు రోజులు గడిచి పోయే వరకు, తరగని ఆహారం అద్భుత వరంగా పొందింది. 

రెండవ పఠనంలో  యేసు క్రీస్తు  ప్రభువు  యొక్క యాజకత్వం  గురించి  బోధించబడింది. తండ్రి  దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్న యేసు క్రీస్తు ప్రభువు యాజకత్వం ఒక ప్రత్యేకత  కలిగి  ఉందని  రచయిత తెలుపుతున్నారు .  ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు,    పూర్వ నిబంధన కాలపు యాజకులకు మధ్య గల వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నాడు. పూర్వ కాలపు ప్రధాన యాజకుడు, కేవలం మానవులు నిర్మించిన  గర్భ గుడిలో  ప్రవేశించగలిగారు. వారు ప్రతి నిత్యం,  పదే పదే బలులను అర్పించవలసి వచ్చేది. వారు తమను తాము  సమర్పించుకోలేదు. కానీ క్రీస్తు ప్రభువు  తనను తాను  సమర్పించుకున్నారు. తన జీవితం ఉదారంగా మనకు ఇచ్చారు, తన జీవితంను త్యాగం చేశారు. క్రీస్తు ప్రభువు తనను తాను సమర్పించుకొని నేరుగా పర లోకంలో , దేవుని సన్నిధిలో ప్రవేశించారు. తనను విశ్వసించి, తన చెంత చేరిన వారందరి, పాపాల పరిహారం కోసం, దేవునికి మొరపెడుతున్నారు. తన ప్రజల పాప పరిహారం కోసం యేసు ప్రభువు, ఒకే ఒక బలిని సమర్పించారు. దేవునికి విధేయత చూపుతూ, క్రీస్తు ప్రభువు జీవించారు. 

ఈనాటి  సువిశేషంలో  రెండు భాగాలు  ఉన్నాయి. మొదటి భాగంలో యేసు ప్రభువువారు  పరిసయ్యులు , ధర్మ  శాస్త్ర  భోధకుల  విశ్వాస జీవితాన్ని సరి చేస్తున్నారు. తమ స్వార్ధ ప్రయోజనాలకోసం , ధనార్జన  కోసం తమ అధికారాన్ని  దుర్వినియోగం చేయుటను,  యేసు ప్రభువు తీవ్రంగా ఖండిస్తున్నారు. మత పెద్దలు , పేదలను ,నిస్సహాయులైన  ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని, వితంతువుల ఆస్తి- పాస్తులను,  కబళిస్తున్నారు అని యేసు ప్రభువు పరిసయ్యులను, మత పెద్దలను హెచ్చరిస్తున్నారు. 

ఈ ధర్మ శాస్త్ర  బోధకులు , పరిసయ్యులు చాలా గర్విష్టులు, అందరిని అసహ్యించుకునే వారు. స్వర్గానికి  వారు మాత్రమే వెళతామని నమ్ముతారు. ప్రజలు స్వర్గంలో ప్రవేశించాలంటే ముందుగా,  వారికి సేవలు చేయాలని కోరుకుంటారు. యూదులు సత్య ఉపదేశం ప్రకారం, దైవ జ్ఞానం తక్కువ ఉన్న ప్రజలు, ముందుగా ఎవరైనా  ధర్మ శాస్త్ర బోధకులు, వారి వద్దకు వస్తే నమస్కరించాలని కోరుకుంటారు. ఈ మత పెద్దలు వారికి దైవ జ్ఞానం  ఎక్కువగా ఉందని భావించేవారు. దేవుడు వారు  చెప్పినట్లు వింటారు అనుకుంటారు. ప్రజా నాయకులు మతం పేరుతో, పేద ప్రజల నుండి ధనం లాగుకునేవారు. ధన దాహం వారికి ఎక్కువగా ఉండేది. అవసరంలో ఉన్న వారి పట్ల వారికి ఏ మాత్రం జాలి , ప్రేమ , కరుణ ఉండవు. 

ప్రజలు దైవ రాజ్యంలో  ప్రవేశించడానికి ఈ మత పెద్దలే   ఆటంకముగా ఉంటున్నారు. 13 వ వచనం (మత్తయి   23:13-14). వారి యొక్క  అసత్య బోధనల వలన , వారి యొక్క వివిధ రకాల ఆజ్ఞల వలన , వారు మోపించే  భారాల వలన, ప్రజలను పర లోకంలో ప్రవేశించకుండా ఒక ఆటంకంగా ఉంటున్నారు. 

మత పెద్దలు విందుల యందు, ఆసనములను కోరుకునేవారు. ఎందుకంటే మోషే  ధర్మ  శాస్త్రమును, బాగా చదివినవారు అనే ఆహం తో వున్నారు కాబట్టి, ఇవన్నీ కూడా వారి కపట జీవితానికి సూచనలు. వారిలో నిజమైన దైవ భక్తి లేదు. 

సువిశేష రెండవ భాగంలో  పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం  చదువుచున్నాము. కానుకల పెట్టె దగ్గర  ప్రతి ఒక్కరి యొక్క కానుకను ప్రభువు పరిశీలించారు. చాలా మంది ధనవంతులు,  వారు కానుక వేసేటప్పుడు, అది అందరికి కనబడాలని, విసిరి వేస్తూ ఉంటారు. ఆనాటి ధర్మ శాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికి కనబడేలా విసిరి వేసేవారు,  ఎవరెవరు ఎంత వేసేది బాగా కనపడుతుంది. 

ధనవంతులు, అలా ధర్మ పెట్టెలో వేసే కానుకలు అందరూ బాగా చూడవచ్చు. ఎందుకంటే వారే చూపించుకోవాలి అనుకుంటున్నారు. వారి యొక్క సమర్పణ దేవునికి నచ్చలేదు. వారు కేవలం వారి యొక్క విధులు, బాధ్యతలు మాత్రమే నెరవేర్చారు. వారు ఇచ్చింది కూడా చూపించుకోటానికే, నిజంగా దేవునికి ఇవ్వటానికి కాదు. ఇతరులు తమ   గురించి  తెలుసుకోవాలని అలా చేశారు. 

ప్రభువు పేదరాలి యొక్క కానుకను మెచ్చుకున్నారు. వితంతువులకు సమాజంలో  ఆదరణ లేదు, ఆదాయం ఎక్కువగా లేదు, బయటకు వస్తే హేళన చేసేవారు. అయినప్పటికీ తనకు ఉన్నదంతా దేవునికి సమర్పించారు. 

మిగతవారు వారికి ఇవ్వబడిన సమృద్దిలో సమర్పిస్తే ఈమె మాత్రం తన దగ్గర ఉన్న మొత్తం సమర్పించారు. ఆమె మొదట్లో కానుక  ఇచ్చేటప్పుడు, ఈ కానుక చిన్నది అని ఆలోచించి ఉండవచ్చు, అయినప్పటికీ, నాకు ఉన్నదంతా నీదేనయ్యా , అని దేవునికి సమర్పించింది. ఈ రోజు  మనం కూడా దేవునికి మనకున్న దానిలోనే కొద్దిగా దేవునికి ఇస్తున్నాము, కానీ దేవునికి మొత్తం సమర్పించుట లేదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిభలను ఆయన సేవకు సమర్పిస్తున్నవా? దేవుడిచ్చిన మంచితనం ,ప్రేమ సమర్పిస్తున్నవా? ధనమును దేవునికి సమర్పిస్తున్నవా ? మనకు ఉన్నదంతా ఇవ్వాలంటే, సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుడిస్తారనే నమ్మకం ఉండాలి. 

దేవున్ని సంపూర్ణంగా నమ్మిన వారే ఇలాగా ఉండగలరు. మన జీవితంలో కూడా, క్రీస్తు ప్రభువు కోసం, మనకు ఉన్నదంతా, త్యాగం చేసి జీవించాలి. తొలి క్రైస్తవ సంఘం,  అన్నీ కూడా అమ్మి వేసుకొని, అందరు పంచుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని సంతోషంగా జీవించారు. మనం కూడా దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలి. ఇస్తే దేవుడే ఇస్తారు.  

Rev.Fr. Bala Yesu OCD

సామాన్య 32 వ ఆదివారం (2)

 1రాజులు 17 :10 - 16, హెబ్రీ 9: 24 - 28, మార్కు 12: 38 -44

క్రిస్తునాధుని యందు ప్రియమైన బిడ్డలారా సహోదరి సహ్ోదరులారా నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే ఉదార స్వభావం గురించి బోధిస్తున్నాయి

మనం ఒక మంచి గుర్తింపు కోసం తాపత్రయ పడే సమాజంలో జీవిస్తాం. నేటి సమాజంలో హోదా, గౌరవం, ఆకర్షణీయ రూపం చాల ముఖ్యం. వాస్తవానికి మనం ఎలాంటి వారమైన అందరూ మనల్ని ఎలా చుస్తున్నారన్నదే ప్రదానం. నాటి సువార్తలో ధర్మశాస్ర బోధకులను, పదుగురి గుర్తింపు కోసం తాపత్రయ పడే వారీగా చూపిస్తూ, అందుకు భిన్నంగా అసలు గుర్తింపు గురించి ఆలోచన ,ధ్యాసే లేని ఒక పేద విధవరాలితో పోల్చి ఆమెను అణకువకు, సంపూర్ణ ఆత్మ సమర్పణకు ఆదర్శంగా చూపించటం జరిగింది.

గుర్తింపుకై ఆరాటం : ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించే వారీగా, వారి గొప్ప జ్ఞానాన్ని బట్టి ప్రజల గౌరవాన్ని పొందేవారు. చట్టం పట్ల వారి భక్తిని వ్యక్తపరుస్తూ వారు పొడుగాటి తెల్లని వస్త్రాలను ధరించే వారు. వారు ఎదురొస్తే ప్రజలు లేచి నిలబడి వారిని బోధకుడా అని గౌరవంగా నమస్కరించాల్సి ఉంటుంది. అసలు సమస్య ఏటంటే ఇలా గౌరవాన్ని పొందడాన్ని వారు తమ హక్కుగా భావించటం మొదలై చివరకు అది వారి అహంభావానికి, హోదాకు, ప్రతిష్టకు గుర్తుగా మారిపోయింది. దేవుని చుట్టం పట్ల చూపాల్సిన గౌరవాన్ని వారు తమ పట్ల చూపాలని కోరుకొసాగారు. ఈనాటి మన సమాజంలో కూడా పదవిలో ఉండే కొందరు ఇలాగే ప్రవర్తిస్తుంటారు అందుకే ప్రభువు, ధర్మశాస్త్ర బోధకులను, విధవరాండ్ర ఆస్తులను దిగమింగే స్వార్థపరులైన దోపిడీ దారులుగా బహిరంగంగా తమ భక్తిని ప్రదర్శించే డాంబికులుగా దుయ్యబట్టారు. అధికారం, పదవి అనేవి చాలా సందర్భాల్లో స్వార్థంతో, అవినీతితో ముడిపడి ఉంటాయి.

ఈనాటి సువార్త మొదటి భాగంలో చెప్పుకున్న ధర్మశాస్త్ర బోధకునికి, రెండవ భాగంలో వివరించిన పేద విధవరాలికి మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

సమాజంలో ఎటువంటి గుర్తింపు లేని విధవరాలి అతి సాధారణమైన భక్తిని, తల బిరుసు తనముతో సమాజములో పేరు ప్రతిష్టలు కోసం ఆరాటపడే కొందరు మత పెద్దల భక్తితో పోల్చటం జరిగింది. అదేవిధంగా ఎంతో ఆర్భాటంగా విరాళాలు ప్రకటించే స్తోమత గల్గిన డాంభికులైన దాతలతో కూడా ఆమె పోల్చబడింది. వారు తమకున్న అధిక సంపద నుండి యేవో కొంత ఇచ్చి ఉండవచ్చు. అర్పణలు ఇవ్వటంలో సాధారణంగా మూడు రకాల దాతలు ఉంటారు. ఒకటి సణుగుడు దాతలు వాస్తవానికి వీరికి ఇవ్వటమే ఇష్టం ఉండదు. రెండు నియమ దాతలు ఇవ్వటం తప్పని వ్యక్తిగత బాధ్యత గనుక తప్పనిసరై ఇస్తారు. వారు  గొణగక పోవచ్చు కానీ మనస్ఫూర్తిగా మాత్రం ఇవ్వరు. మూడు కారుణ్య దాతలు వీరు ఎస్టీ పూర్తిగా ఇస్తారు. ఇక అలాగే కొందరు తాము దోచుకున్న దాంట్లోది అన్యాయంగా ఇతరుల నుండి కొల్లగొట్టిన సొమ్ములోంచి ఇస్తారు. ఉదాహరణకు జక్కయ్య (లూకా 19:8 ) అయితే పేద విధవరాలు మాత్రం తన వద్ద ఉన్నదంతా తన కష్టార్జితమంతా ప్రేమతో అర్పించింది. ఈనాటి సువార్త ఆనాడు నివసించినవారివైపు కాదు ఈనాడు నివసిస్తున్న మనవైపు వేలేత్తిచూపుతుంది. మరి మనం కూడా పేరు కోసం డాంబికులుగా ప్రవర్తిసున్నామా  లేక మనస్ఫూర్తిగా ఇస్తున్నామా?

ఉదారతకు దేవుని దీవెనలు :

దేవుని కృపానుగ్రహం పట్ల పేద విధవరాలు తన అపార నమ్మకాన్ని ప్రదర్శించినట్లుగానే ఈనాటి ప్రధమ పఠనం సారఫెతులోని మరొక అన్యురాలైన విధవరాలు దుర్భర కరువు సమయంలో తన కోసం దాచుకున్న తన చివరి ఆహార వనరుల్ని ఏలీయా ప్రవక్తతో ఎలా పంచుకుంటుందో వివరిస్తుంది. ఆమె త్యాగపూరిత ఉదారతకు బహుమానంగా మిగిలిన కరువు కాలమంతా వారి జీవనానికి అవసరమయ్యే అనుదిన ఆహార వనరులతో దేవుడు వారిని సంహృద్దిగా దీవించాడు. కనుక ఉదారత్వం అనేది హృదయం నుండి రావాలి. ఉదారత్వం మన హృదయాల నుండే వస్తుందా? అని మనలను సూటిగా నిరాఘాటంగా ప్రశ్నిస్తున్నారు. విధవరాలి ఉదారత్వాన్ని మన ప్రభువు యేసు మెచ్చుకున్నా విధంగా ఈనాటి రెండవ పఠనం మనలను దేవునికి మన సాటి సహోదరి సహోదరులకు సంపూర్ణముగా ఉదారంగా సమర్పించుకోవాలని పిలుపునిస్తుంది. ఈనాటి సువార్త పఠనం శ్రీసభ పట్ల, పేదల పట్ల మరింత ఉదారత చూపాలని, ధనికులను కలవరపరచి, ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం లేదు కానీ మనం పేదలమైన, ధనికులమైన అవసరాల్లో ఉన్న వారిపట్ల ఉదార గుణం కలిగి ఉండాలని పిలుపునిస్తుంది.

మదర్ తెరెసాగారు తన జీవితములో జరిగిన ఒక సంఘటను గురించి చెప్పారు. ఒక రోజు ఆమె ఒక వీధిలో వెళుతున్నప్పుడు ఒక భిక్షగాడు ఆమెవద్దకు వచ్చి అమ్మ అందరు మీకు సహాయం చేస్తుంటారు.  నేను కూడా మీకు ఇస్తానమ్మా రోజంతా ఆడుకుంటే నాకు రెండు రూపాయలు మాత్రమే వచ్చాయి దాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు మదర్ తెరెసాగారు సందిగ్ధంలో పడ్డారటఒకవేళ అమ్మ అతని దగ్గరనుండి రెండు రూపాయిలు తీసుకుంటే ఆ రాత్రికి అతని తినేందుకు ఏమి ఉండదు. ఒకవేళ తీసుకోకుంటే అతన్ని నిరాశపరిచినట్లు అవుతుంది. కాబట్టి అమ్మ అతని ముందు చేతులు చాచి అతను ఇచ్చిన డబ్బును తీసుకుందట.

తర్వాత ఒకసారి ఆమె మాట్లాడుతూ భిక్షగాడు ఇచ్చిన కానుక నాకు నోబెల్ బహుమతికన్నా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అతను తన వద్ద ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని నేను అతని ముఖంలో చూశాను రోజంతా ఎండలో తిరుగుతూ  అడుక్కోని పొందిన రెండు రూపాయలను ఇవ్వటం అనేది తన విషయంలో ఎంతో గోపా త్యాగం. రెండు రూపాయలు అంటే చాల తక్కువ డబ్బు  దాంతో పెద్దగా నేనేమి కొనలేను కొనలేక పోవచ్చు. అయితే అతను దాన్ని త్యాగం చేసాడు. త్యాగాన్ని  నేను స్వీకరించాను. అది నా దృష్టిలో ఎన్నో వేలరూపాయల కన్నా ఎక్కువే.  ఎందుకంటె దాన్ని అతను ఎంతో ప్రేమతో ఇచ్చాడు దేవుడు మనం చేసే పని ఎంత గొప్పదా అని చూడరు కానీ దానిని ఎంత ప్రేమతో చేశామా అనే దాన్ని చూస్తారు.

కనుక మనం కూడా మనకు ఉన్నదాంట్లోంచి నిర్భాగ్యులు, పీడితులతో పంచుకోవాలి దానిని గోనుకుంటానో లేక విధిలేక చేస్తున్న పని గానో భావించక మన స్వీయ దృక్పథంతో, మానవీయ సౌబ్రాత్రుత్వంతో, ఇష్టపూర్తిగా చేయాలన్నదే ఈనాటి సందేశం.

బ్రదర్. రత్న రాజ్ .సి.డి.

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...