అ.పో 10: 25-26, 34-35, 44-48,
1 యోహాను 4:7-10
యోహాను 15: 9-17
ప్రియ స్నేహితులారా, ఈనాటి మూడు
దివ్య గ్రంథ పఠనాలు మనకు చాల ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాయి. ఆ అంశము
ఏమిటంటే, ప్రేమ. ప్రేమ అనే
అంశాన్ని నేను చాల ధ్యానించాను. ఎంతో మంది నా స్నేహితులను అడిగి చూసాను. చాల మంది
చాల రకాలైన జవాబులు ఇచ్చారు. కానీ, నేను
తెలుసుకున్నది ఏమిటంటే "ప్రేమ" అంటే ఇది లేదా అది ఎన్ని కచ్చితంగా ఎవరు
చెప్పలేరు. ప్రేమ అనేది దైవ రహస్యము. ఈ ప్రేమ పూర్తిగా రహస్యము కాదు, అదే విధముగా పూర్తిగా వివరించలేము, వర్ణించలేము. ఈ ప్రేమ మన మాటలకు అందనిది. ప్రేమ అనేది
అనంతము. కానీ చాలామంది ఈ ప్రేమ అంటే ఏమిటో వివరించడానికి చాల రకాలుగా
ప్రయత్నిస్తారు. ప్రేమ రెండు రకాలు అని మనము చెప్పుకోవచ్చు.
1. దైవ ప్రేమ,
2. సహోదర ప్రేమ
ప్రేమించేది ఎందుకు? మనము కలిసి
జీవించడానికి. మానవులైన మనము ఒకరికొకరు తోడు నీడగా ఉండటానికి. దేవుడు కూడా మనలను
ప్రేమించేది మనము ఆయనతో కలిసి జీవిస్తూ అయన ఆజ్ఞానుసారం జీవించడానికి. కానీ ఆ
దేవుని ప్రేమ మనము తెలుసుకోలేకపోతున్నాము. మనము ఎవరినైనా ప్రేమిస్తే వారి యొక్క
బాహ్య శారీరక అందాన్ని చూసి లేదా వారు చేసే మంచి పనులు చూసి ప్రేమిస్తాము. లేదా
వారి డబ్బును చూసి ప్రేమిస్తాము. కానీ దేవుని ప్రేమ మానవులైన మన ప్రేమ వంటిది
కాదు. దేవుని ప్రేమ ఏ షరతులు లేనటువంటిది.
ఈనాడు మొదటి పఠనములో దేవుడు అందరిని సమదృష్టితో చూస్తాడు, అందరిని ఒకేలా ప్రేమిస్తాడు అనే విషయము మనకు అర్థమవుతుంది.
క్రీస్తు సేవకులమైన మనము ఎట్టి పక్షపాతము లేకుండా అందరిని సమదృష్టితో చూడాలని
అందరిని మనము ఒకేలా ప్రేమించాలని గుర్తుంచుకోవాలి. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు
పంపినది పాపులమైన మనపై ప్రేమ తెలియజేయడానికి. మనలను ప్రేమించి మన పాపములనుండి
రక్షించి అందరిని ఒకే ప్రజగా ఒకే కుటుంబముగా మార్చి అందరము ఒకరినొకరు ప్రేమిస్తూ
జీవించాలని తెలియజేసాడు. ఈ నాటి మొదటి పఠనములో పునీత పేతురు గారు ప్రసంగించుచుండగా
దేవుని యొక్క ఆత్మ అందరిపై దిగివచ్చెను అని చదువుతున్నాము. అంటే దేవుడు అందరిని
సమదృష్టితో చూస్తాడు అని అర్ధము(అ.పో 10: 14). క్రీస్తు ప్రభువు తన శ్రమల, మరణ, పునరుత్తానాల
ద్వారా తండ్రి ప్రేమను తన ప్రేమను మనకు తెలియజేసి కుల, మత, వర్గ, ప్రాంతీయ, భాషల వారీగా
విడిపోయిన మనలను ఒకే కుటుంబముగా మార్చి, మనలను ప్రేమ కలిగి జీవించాలని ఆజ్ఞాపించారు.
రెండవ పఠనములో మనము తెలుసుకున్నది ఏమిటంటే ప్రేమించువాడు దేవుని బిడ్డ.
ఎందుకంటే మన తండ్రి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు. ఆ ప్రేమ కలిగిన తండ్రి దేవుడు మనలను ఎంతో
ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించారు. ఎందుకంటే మనలను మన పాపముల నుండి
రక్షించడానికి( యోహాను 3: 16). మనము మన జీవితాంతము
గుర్తుంచుకోవలసిన విషయము ఏమిటంటే 1 యోహాను 3: 17-18 వ వచనంలో ప్రభువు
పలికినట్లుగా ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములలో ఉన్న తన సోదరుని
చూసియు తన హృదయ ద్వారములను మూసివేసినచో దైవ ప్రేమ తనలో ఉండి అని ఎట్లు చెప్పగలడు? కాబట్టి మనము ఆయనను విశ్వసించి ఆయన నేర్పించిన ప్రేమ
మార్గములో నడవాలి. ప్రేమ కలిగి జీవించాలి.
సువిశేష పఠనములో మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు జీవితము ప్రేమకు
ప్రతిబింబము. క్రీస్తు ప్రభువు మనలను ఎన్నుకున్నది అయన ప్రేమకు సాక్షులుగా
ఉండడానికి అయన ప్రేమలో జీవించడానికి. క్రైస్తవత్వము మొత్తము రెండు ప్రధాన ఆజ్ఞలపై
ఆధారపడియుంది. అవి ఏమిటంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ.
ఈ ప్రేమ మనకు దైవాజ్ఞ మాత్రమే కాదు. మన యొక్క భాద్యత. క్రీస్తు ప్రభువు మనలను అయన
ప్రేమలో నెలకొని ఉండవలెనని ఆహ్వానిస్తున్నారు. మనము అయన ప్రేమలో నెలకొని ఉండాలంటే
అయన ఏ విధముగా తండ్రి ఆజ్ఞలను పాటించి తండ్రి ప్రేమలో నెలకొని ఉన్నాడో మనము కూడా
క్రీస్తు ప్రభుని ఆజ్ఞలను పాటిస్తూ ఆ క్రీస్తుని ప్రేమలో నెలకొని ఉండగలము. యోహాను 15:17 వ వచనంలో క్రీస్తు
ప్రభువు తెలియజేస్తున్నాడు, "మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను.” అదే విధముగా యోహాను శుభవార్త 15: 12 వ వచనంలో “నేను మిమ్ము ప్రేమించునట్లు
మీరును ఒకరినొకరు ప్రేమిచుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ” అని క్రీస్తు ప్రభువు పలుకుచున్నాడు. ఎప్పుడైతే
మనము ఇతరులను ఏ భేదాలు, తారతమ్యాలు
లేకుండా ప్రేమిస్తామో అప్పుడు మన జీవితములో దేవుడు ఇచ్చే ప్రేమను ఆనందాన్ని
సంపూర్ణముగా అనుభవించగలము. అయన ఇచ్చు జీవముతో సంతోషముగా జీవించగలము. (యోహాను 10: 10)
కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుని ప్రేమ పొందిన మనము మానవత్వముతో, ప్రేమ్మతో జీవిస్తున్నాము లేదా! నేడు మనము చూస్తే మానవులు అయిన మనము సృష్టి వస్తువులను ప్రేమిస్తున్నాము. మనుషులను మన యొక్క స్వార్దాలకు ఉపయోగించుకుంటున్నాము. అలా కాకుండా దేవుని ప్రేమిద్దాము, దేవుని పోలికలో ఉన్న తోటి వారిని ప్రేమిద్దాము. ఈ సృష్టిని అందులో ఉన్న వస్తువులను ప్రేమతో కాపాడుకుంటూ మన స్వార్ధము కోసము కాకుండా ప్రేమతో జీవిద్దాము. ఆమెన్