పాస్కాకాల మూడవ ఆదివారము
అ.కా. 3: 13-15, 17-19
1 యోహాను 2: 1-5
లూకా 24: 35-48
“మీకు శాంతి కలుగును గాక”
క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి మూడు పఠనములు హృదయపరివర్తన, పాపక్షమాపణ కలిగి పునరుత్తాన క్రీస్తు అనుగ్రహించే
శాంతిని స్వీకరించి, ఈ లోకములో మన జీవిత విధానము ద్వారా శాంతిని స్థాపించి
దేవునికి సాక్షులుగా నిలువ ఆహ్వానిస్తున్నాయి. వీటిని మనము మూడు వంశముల రూపేణా
ధ్యానిస్తూ అర్ధము చేసుకుందాము.
2. అవిశ్వాసాన్ని విశ్వాసముగా
మార్చుకొనుట
3. పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట
ఈనాటి పఠనాలలో హృదయపరివర్తన, పాపక్షమాపణను
ప్రస్తావించుట చూస్తున్నాము. యేసుప్రభువు తన ప్రసంగాన్ని ప్రారంభించింది
హృదయపరివర్తన అను అంశము మీదనే (మత్త 4:17) మరియు తన చివరి ప్రసంగము ముగించినది కూడా హృదయపరివర్తన
అను అంశము మీదనే (లూకా 24:47). ప్రభువు ఈ లోకానికి రావడానికి కూడా కారణము హృదయపరివర్తనను
కలిగించుటకేనని లూకా 5:32 మనము చూస్తున్నాము. పునీత బాప్తిస్మ యోహాను గారు కూడా హృదయ పరివర్తన యొక్క
అవసరతను గురించి పలికారు(మత్త 3:2). పునీత పేతురు గారు యూదులకు చెప్పిన తన మొదటి ప్రసంగము, అన్యులతో పలికిన తన చివరి ప్రసంగము కూడా, ఆఖరికి తన చివరి ప్రసంగము కూడా హృదయపరివర్తన అను అంశము
మీదనే. పునీత పౌలు గారు కూడా హృదయపరివర్తన అను అంశము మీద ప్రసంగించారు. ఎందుకు
హృదయపరివర్తన ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలనే
ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన మొట్టమొదటి పని: హృదయపరివర్తన (లూకా 15: 11-24). అసలు ఈ
హృదయపరివర్తన అంటే ఏమిటి? హృదయపరివర్తన
అంటే ఒక ప్రయాణము. ఎక్కడి నుండి ఎక్కడకు ఈ ప్రయాణము అంటే పాపపు జీవితము నుండి
దేవుని యొద్దకు ప్రయాణము. క్రీస్తు పునరుత్తాన మహోత్సవము ముగిసిన తరువాత కూడా
తల్లి తిరుసభ ఎందుకు ఈ పఠనాల ద్వారా మనలను హృదయపరివర్తన, పాపక్షమాపణ గురించి ధ్యానింపజేస్తుంది అంటే హృదయపరివర్తన
కలిగి మన పాప జీవితానికి క్రీస్తుతో పాటు మరణించి మరల క్రీస్తుతో పాటు పునరుత్తానమైనప్పుడు
మాత్రమే మనము ఒక నూతన వ్యక్తిగా జన్మింపగలుగుతాము, పునరుత్తానుడైన క్రీస్తు శక్తిని అనుభవింపగలుగుతాము.
2 . అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట:
శిష్యులందరు అవిశ్వాసముతో నిండియున్నారు. క్రీస్తు ప్రభువు మనుష్యకుమారుడు
శ్రమలననుభవించి, మరణించి మూడవనాడు
పునరుత్తానమవుతాడు అని పలు మార్లు వారితో చెప్పినను వారు దానిని గ్రహించలేకపోయారు.
అందుకే క్రీస్తు ప్రభువు పునరుత్తానాన్ని
గ్రహించలేకపోయారు. చివరికి స్వయానా పునరుత్తానుడైన క్రీస్తే వారి ముందు
నిలువబడినను గుర్తించలేకపోయారు. ఇదే సంఘటనను ఈనాడు మనము సువిశేష పఠనములో
చూస్తున్నాము. తన శిష్యులకు ప్రభువు దర్శనమిస్తున్నారు. ఇది పునరుత్తాన క్రీస్తు
మూడవ దర్శనము.
ఈ మూడవ దర్శనములో శిష్యులు భయభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును ఒక భూతమును
చూచుచున్నట్లు భావించారు (లూకా 24:37). అవిశ్వాసముతో నిండిన వారి హృదయాలు కలవరపడుచున్నవి. వారి
మనస్సులు సందేహముతో నిండియున్నవి (లూకా 24:38). అప్పుడు క్రీస్తు తన చేతులను కాళ్ళను చూపుతూ వారిలో
అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని నింపారు. వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై
పునరుత్తాన క్రీస్తును విశ్వసించిరి (లూకా 24: 39-41). అవిశ్వాసము అనే మహమ్మారి మనలను
కూడా పరిపాలిస్తూ దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తుంది. విశ్వాసము క్రైస్తవ
జీవితానికి పునాది. ఈరోజు మనము విశ్వాసముతో నింపబడివుండాలి. విశ్వాసము అనేది వినుట
వలన కలుగుతుంది. క్రీస్తును గూర్చిన వాక్కు వినుట వలన కలుగుతుంది (రోమా 10:17). దేవుని వాక్కు
విందాం, క్రీస్తును గూర్చిన
సత్యాన్ని తెలుసుకుందాము. అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా ఉంటూ మన జీవితాల్లో
పునరుత్తానాన్ని విశ్వసించుదాం. పునరుత్తాన క్రీస్తును గుర్తించుదాం.
3 పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట:
క్రీస్తు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ మీకు శాంతి కలుగునుగాక అనెను.(లూకా 24:36) ఎందుకు శాంతి? వారు అనుసరించిన గురువు మరణించాడు. కావున వారి జీవితాలలో వారు ఆశను కోల్పోయారు. వారి జీవితాలు ఒక గమ్యము లేని, లక్ష్యము లేని జీవితాలుగా మారిపోయాయి. వారి జీవితాలలో శాంతి అనేది ఒక పదముగానే మిగిలిపోతుంది, ఒక అనుభవము కాలేదనుకున్నారు. క్రీస్తు అనే ఒక గురువు కోసము అన్నిటిని విడిచిపెట్టాము కానీ, క్రీస్తు, తన మరణము తర్వాత మమ్ములను విడిపెట్టాడు అని వాపోయారు. కానీ క్రీస్తు మాత్రము మనలను అనాధలుగా విడిచిపెట్టేటటువంటి ఒక వ్యక్తి కాదు. మన నమ్మకాలను వమ్ము చేసేటటువంటి ఒక గురువు కాదు. మన ఆశలను నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు. కానీ తన వాగ్దానాలను నిలబెట్టుకున్నటువంటి సత్యస్వరూపుడు. తాను చెప్పిన విధముగా మరణాన్ని గెలిచి మూడవనాడు పునరుత్తానమై తాను క్రీస్తునని నిరూపించుకున్నారు. చిన్నాభిన్నమైన తన శిష్యులకు కనిపించి మీకు శాంతి కలుగునుగాక అంటూ ఆశను నింపుతూ అభయమిస్తున్నారు. ఈ శాంతి మనము ఒకనాడు అవిధేయతతో పోగొట్టుకున్న శాంతి(ఆది 3) కానీ క్రీస్తు ప్రభువు తన మరణ, పునరుత్తానముల ద్వారా ఈ శాంతిని నెలకొల్పారు. ఇదే శాంతిని తన శిష్యులకు ఒసగుతున్నారు. ఈరోజు నీవు నేను ఈ శాంతిని మన జీవిత విధానము ద్వారా స్థాపించాలి. మనము ధ్యానించిన విధముగా పునరుత్తానమునకు రెండు మార్గములు ఉన్నవి. (i)హృదయపరివర్తన, (ii)పాపక్షమాపణ. కాబట్టి హృదయపరివర్తన చెందుదాము. పాప ప్రక్షాళన గావించబడుదాం. మన అవిశ్వాసాన్ని విశ్వాసముగా మలచుకుందాము. అనేక కారణాలతో చిన్నాభిన్నమైన మన జీవితాలలో శాంతి ఒసగమని పునరుత్తాన క్రీస్తును ప్రార్ధిద్దాము. పునరుత్తాన క్రీస్తు ఒసగే శాంతిని స్వీకరించుదాము. ఆ శాంతిని స్థాపిద్దాము. ఆమెన్…
Br. sunil inturi